స్టేట్ వెర్సెస్ స్టూడెంట్స్!

ఒప్పులు!
“మా చేతుల్లో లాఠీలు వున్నాయా?”
“లేవు, మీరేం పోలీసులు కాదుగా!?”
“పోనీ మా చేతుల్లో తుపాకులు వున్నాయా?”
“ఉగ్రవాదులని మిమ్మల్ని అన్నా, మీదగ్గర అవేం లేవుగా!?”
“పోనీ వాటర్ కెనాన్స్?”
“మీరు స్టూడెంట్స్ కదా?!”
“లేదు, చెప్పండి వున్నాయా లేవా? టియర్ గ్యాస్?”
“అవి మీ దగ్గర యెందుకు వుంటాయి?!”
“పోనీ, పిల్లెట్ గన్స్…?”
“అవి ప్రభుత్వం దగ్గర కదా వుంటాయి కదా?!”
“సరే, మా దగ్గర యేమున్నాయి?”
“ఏమీ లేవు… కాయడానికి వొళ్ళు తప్ప!”
“దెబ్బలూ కేసులూ వదిలేయండి, మా దగ్గర యేముంది?”
“ఏమీ లేవు… నోరు తప్ప!”
“మరి తిడితే తప్పా?”
“………………….!?!”

తప్పులు!
“మిమ్మల్ని క్షమిస్తున్నాను…”
‘అంత పెద్ద పోస్టులో వుండి అదేం మాట?’
“నన్ను మీరు యెలాగూ క్షమించరు కాబట్టి నేనే మిమ్మల్ని క్షమిస్తున్నాను!”

గొప్పలు!
“మిత్రోం…”
‘కట్, సారీ సర్, ఎప్పుడూ రొటీన్ సంబోధన వద్దు… వీళ్ళు స్టూడెంట్స్’
“మిత్రులారా?”
‘అంబానీ ఆదానీలను సంబోధిస్తున్నారని అనుకోగలరు సార్’
“మిత్రులారా?”
‘నమ్మసక్యంగా లేదు, కాని కానివ్వండి సార్’
“నన్నే కాకుండా నా దివంగత తల్లిని దూషించారు”
‘ఒక్కసారి తిడితేనే అంత బాధ పడుతున్నారు, తెల్లవారి లేస్తే చాలు మీ ట్రోలర్స్ మా అమ్మల్నీ అక్కల్నీ చెల్లెళ్ళనీ అమ్మనా బూతులు తిడుతూనే వున్నారు, బండ బూతులకు ఆద్యులే మీ భక్తులు’
“అయినప్పటికీ బాధ్యులైన వారికి శిక్ష విధించాలని కోరుకోవడం కంటే, వారిని క్షమించడానికే యిష్టపడుతున్నాను”
‘ఎవ్విర్ ఇయర్ మిస్సవకుండా పేపర్ లీక్ చేస్తున్నది మీరు, ప్రతి యేటా మా విద్యార్థుల చావులకు కారణం మీరు, మమ్మల్ని రోడ్డు మీదకు లాగింది మీరు, శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడకుండా హింసని ప్రయోగించింది మీరు…’
“దూషణల వల్ల యే సమస్యకూ పరిష్కారం దొరకదు”
‘హింసించి కేసులతో భయపెట్టి అదుపుచెయ్యాలని అనుకోవడంవల్ల పరిష్కారమేమైనా దొరుకుతుందా?’
“ప్రజలు ద్వేషానికి బదులుగా కరుణతో స్పందించాలని పిలుపునిస్తున్నాను!”
‘విద్యార్ధులని ద్వేషించింది, ద్వేషిస్తున్నదీ ద్వేషించమని చెపుతున్నదీ యెవరు?’
“నిరసనకారులు తప్పుదోవ పట్టారు…”
‘మేం నష్టపోయిన విద్యార్థులం కాదా? నిరసనకారులమా? ‘తప్పుదోవ పట్టారు’ అనడంలోనే యిప్పటికీ మా సమస్యపట్ల మీకు ఖాతరు లేదనిపిస్తోంది’
“సుదీర్ఘమైన న్యాయపోరాటాల్లోకి లేదా సామాజిక ఐసోలేషన్ (ఒంటరితనం) లోకి నెట్టేయడానికి బదులుగా, సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత సమాజంపైనే వుంది”
‘మీరూ మీ మంత్రివర్గం పడాల్సిన బాధ్యతని సమాజంపై మోపితే యెలా సార్? అయినా సమాజం విద్యార్థులకే మద్దతు యిస్తోంది, తెలీదా? వైద్యం, ఆహారం అన్నీ సమకూర్చి యివ్వడం యేమి చెపుతున్నాయి?’
“కోపంతో ప్రతిస్పందించడం కంటే, అవగాహన మరియు చర్చల ద్వారా తప్పులను సరిదిద్దడం మరింత అర్థవంతమైంది”
‘మీరుగాని మీ మంత్రులుగాని అధికారులుగాని వొక్కరైనా వొక్కసారైనా చర్చలకి వచ్చారా? నూటాయాభైరెండు లీకులు జరిగాయంటే, జరుగుతూనే వున్నాయంటే- మీకు అవగాహన వుందా? కోపంతో ప్రతిస్పందించింది యెవరు? విద్యార్థులా లేక మీరా? పోలీసు వ్యవస్థ పనితీరు సాక్ష్యం చాలదా? ప్రవేటు వ్యక్తులు చొరబాటుకు మీ అనుమతి లేదా?’
“మిత్రులారా… అంటే యెవరూ నమ్మడం లేదు…”
‘మిత్రులయితే ప్రాణం యిస్తారు, లక్షల ప్రాణాల్ని అదీ పిల్లల్ని యెవరూ కష్టపెట్టరు’
“ఓకే, ఏం కెమెరా… యేమీ మాట్లాడవు?”
“మీరు వరల్డ్ బెస్ట్ టూరిస్టే కాదు, యూ ట్యూబర్ కూడా, రెడీనా సార్?”

తిప్పలు!
“విద్యార్థులు మిమ్మల్ని తిడుతుంటే, యేడుపొచ్చింది…” అని దుఃఖం పట్టలేనట్టు యేడ్చేశాడో బిస్కెట్‌గాడు.
“ఎద్దులా వున్నావ్, యేడిస్తే బాగోదు… వూకో…” చెప్పాల్సిన కంపెనీ పెద్దే చెప్పాడు.
అయినా బిస్కెట్‌గాడు యేడుస్తూనే “ఆయన్ని అనకూడని మాటలు అంటూ వుంటే, నా గుండె కదిలించేసింది. నాకు కన్నీళ్ళు వచ్చినాయ్… బాదొచ్చింది. దేశం కోసం కష్టపడేవారికి చివరికి మనం యిచ్చేది యిదా అని?…” అన్నాడు.
“నీయబ్బ చాలు ఆపరారోయ్…” లోపలే అనుకొని వుగ్గబట్టుకున్నాడు కంపెనీపెద్ద.
“ఒకరోజు సెలవు తీసుకోడు…” బిస్కెట్‌గాడు ఆపడం లేదు యేడుపు.
“ఒరేయ్, నేను సమావేశాలకి కూడా రావడం లేదని చెపుతున్నట్టుంది, ఆపరా” గొణుక్కొని గింజుకున్నాడు కంపెనీపెద్ద.
అయినా బిస్కెట్‌గాడు దొర్లిదొర్లి యేడుస్తూనే వున్నాడు.
“ఏడవక… నువ్వు నోర్ముయ్…” చెప్పాల్సిన కంపెనీపెద్ద చెప్పకుండా వుండలేదు. తనకోసమే కదా యేడుస్తున్నది అని కనికరించలేదు.
“ఎందుకు యేడవొద్దు?” బిస్కెట్‌గాడు వుక్రోషంగా అడిగాడు.
“విద్యార్థులు నన్ను తిట్టారని లోకానికి నువ్వు యేడ్చి మరీ చెప్పాలా? ఆ…?” కంపెనీపెద్ద కస్సుమన్నాడు.

ముప్పులు!
“ప్రశ్నలకు జవాబులు చెప్పడం కష్టం. మనవల్ల కాదు…”
“మరేం చేద్దాం?”
“నాలుగు కాదు, ఆరు కాదు, యెనిమిది అడుగుల యెత్తైన బారికేడ్లు కడదాం! వాటికి వెల్డింగ్ కూడా చేయిద్దాం!”
“అప్పుడు వాటిని బారికేడ్లు అనరు…”
“ఏమంటారు?”
“ఇనుప చువ్వలు పెట్టి లోపల మనం వుంటే, జైళ్ళో వున్నట్టుంటుంది…”
“సేఫ్టీకి తప్పదు…”
“ఏమిటి సేఫ్టీ? అప్పుడు కూడా ప్రశ్నలు వినిపిస్తాయి!”
“చువ్వలు తీసేసి గోడలు… రాతి గోడలు కట్టేస్తే?”
“మనం సింహాసనంమీద వుండగానే సమాధి కట్టుకున్నట్టుగా వుంటుంది…”
“ఉంటే, వుండనీ… ప్రశ్నలు వినపడకపోవడమే కదా- మనక్కావలసిందీ?!”

మెప్పులు!
“నాన్ బైలాజికల్ మహా మానవ్… కదా?”
“ఔను, ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు కదా?”
“అయితే, ఆయనకో గుడి కట్టాలంటావ్?”
“ఆల్రెడీ కడుతున్నారుగా? బిహార్ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్ కమిటీ వుంది కదా?”
“ఆ…? బీజేపీ అప్పాయింట్ చేసింది…”
“యస్… వాళ్ళు వొక గుడిని కట్టి, మన ప్రధానిగారికి అంకితం చెయ్యాలని…”
“ఆగాగు, ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్‌కే వాళ్ళ దగ్గరే డబ్బులు లేవు…”
“అందుకే అది గవర్నమెంటు ఫండెడ్ టెంపుల్…”
“రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? దేవుడే కోరితే ఆపేదెవరు? మన టాక్సులతో కానీ…”
“యస్… మనకీ పుణ్యంలో షేర్ వస్తుంది!”
“అడక్కుండానే…!”
“అంతటి దేవుడు పంపిన దేవుణ్ణి పట్టుకొని తిట్టడం అన్యాయం కదా?”
“నిజమే కాని ఆ దేవుణ్ణి కూడా నిందాస్తుతి అని తిడతారు కదా?”
“తిడతారు, భక్తులు తిట్టకపోతే యెవరు తిడతారు?”
“మరి నాయకుణ్ణి ప్రజలు తిట్టకపోతే యెవరు తిడతారు?”

జఫ్ఫాలు!
“మనమేం చేశాం? గవర్నమెంటు ఆర్డర్స్ ఫాలో అయ్యాం… అంతే”
“నిజమే గాని పెల్లెట్ గన్స్ నడుం కింది భాగంలో కాల్చాలట కదా?”
“లాఠీలతో కూడా మోకాలి కింది భాగంలోనే కొట్టాలి, కొట్టారా?”
“లేదు…”
“మనకేం తెలుసు?, అయినా మనకెవరికీ నేమ్ బేడ్జీ లేదుగా, యెందుకు టెన్షన్?”
“మనం కిందికే కాల్చాల్సిందేమో? పైకి కాల్చడంవల్ల కళ్ళు కూడా పోయి…”
“అబ్బా… పిల్లెట్ గన్స్ వాడకూడదు, వాడాం కదా?”
“వాడాక యింక కిందేంటి? పైనేంటి?”
“నిజమే అనుకో…”
“అలా అయితే టియర్ గ్యాస్ కూడా డేట్ అయిపోయినవి వాడారు, వాడితే?, స్టన్ బటాన్స్ కూడా వాడారు”
“విద్యుత్ దండాలు… ఎలక్ట్రిక్ షాక్ వల్ల పక్షవాతం కూడా వస్తుందని…”
“రానీ, మనకేం?”
“ఢిల్లీ హైకోర్ట్ దానిమీద వివరణ అడిగిందని… సీసీ టీవీ ఫుటేజ్ జాగ్రత్త చెయ్యమని…”
“అది ఆఫీసర్స్ చూసుకుంటారు… అన్నీ అరైజ్ అయిపోతాయ్… అయినా వుగ్రవాదులతో… వుగ్రవాదులని ప్రభుత్వమే చెప్తోంది కదా?, చర్చలు జరపడానికా మనల్ని పంపించింది?”
“……………………….”
“ఈ యేడాది మన ఢిల్లీ పోలీసుకు ‘వుత్తమ పోలీసు’ వస్తుంది చూస్తూవుండు!”

కప్పలు!
“సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు తప్పేమీ కాదు” అన్నాడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్. “ఆ వయసులో మేమూ అలానే వున్నాం” అని అక్కడితో ఆగలేదు. “జెన్ జీలో నిజాయితీ కనిపిస్తోంది” అని కూడా అన్నాడు, దువ్వినట్టు తెలీకుండా దువ్వుతూ.
“మీరు అన్నీ మాట్లాడుతున్నారు, పేపర్ లీక్స్ తప్ప…” అందో విద్యార్థిని.
“జెన్ జీ ప్రశ్నలు తార్కికంగా వుంటాయి. వారికి ప్రేమతో సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది” అని చీఫ్ సోప్ రాస్తున్నట్టు చెప్పుకు పోతున్నాడు.
“విద్యార్థులమీద దాడిని ఖండించండి, మా మీద మీకు యెంత ప్రేమ వుందో తెలిసిపోతుంది” అన్నాడో విద్యార్థి.
“దేశభక్తి సేవాగుణం వారిలో మెండుగా వున్నాయి…” చెప్పుకుపోతున్నాడు.
“మీ దేశభక్తి మాకొద్దు, అది దైవభక్తీ కావొద్దు” విద్యార్థులు అంతకన్నా క్లారిటీగా చెప్పారు. “కొట్టేది మీరే, బుజ్జగించేదీ మీరే” అన్నారు.
“మీకేం కావాలి?” బ్రేక్‌లో అసహనంగా అడిగారు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్.
“మీరు మాకు సిలబస్ తయారుచేయకుండా వుంటే అంతే చాలు!” ముక్త కంఠంతో అన్నారు విద్యార్థులు.

మచ్చ!
ద్వేషంతో నల్లని యింకు చిమ్మారు…
విద్యార్థుల ముఖాలమీంచి జారి చిత్రంగా దేశ చిత్రపటమ్మీద మరక పడింది!

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్!
“సార్, ఆ అమ్మాయి మైనరు”
“అయితే, రేపు మేజరు కాకుండా పోతుందా?… హహ్హహ్హా…”
“జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్…”
“క్రిమినల్ కేసు పెట్టండి”
“పెట్టాము సార్…”
“కేసు యెత్తేయండి…”
“ఎత్తేసాము సార్, క్షమాపణలు కూడా చెప్పింది సార్”
“ఎవడికోసం చెప్తుంది?, మనమేమిచ్చాం?”
“పునర్జీవితం సార్, వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెపుతున్నారు, అయితే కేసు క్లోజా సార్?”
“అఫీషియల్‌గా క్లోజ్”
“అర్థమయింది సార్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేయించాం, నెంబర్ కూడా లీక్ చేయించాం”
“ఊ…”
“మనవాళ్ళు చూసుకుంటారు. అంతే కద్సార్?”
“వాళ్ళూ ప్రభుత్వమేనయ్యా…”
“అంటే ఆ అమ్మాయిని రేప్ చేస్తామని అంటున్నారు… చంపేస్తామని అంటున్నారు…”
“మనవాళ్ళకి కూడా రూల్ బుక్కూ రాజ్యాంగమూ వుంటే యెందుకయ్యా? ఎలా పనిచేస్తారయ్యా?”
“సారీ సర్… ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది”
“కదా?, మనవాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకోనిద్దాం!”

పెట్స్!
“జంతర్ మంతర్ దగ్గర కళ్ళు మూసుకున్నాం సార్, జార్ఖండ్ దగ్గర కళ్ళు తెరిచాం సార్”
“బాగా కవర్ చెయ్యాలి”
“చేస్తున్నాం సార్, లైవ్ కూడా యిచ్చాం సార్…”
“గుడ్… లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్… అన్నీ అన్నీ కవర్ చెయ్యండి”
“సార్, యీసారి కూడా పిల్లలే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు”
“మంచిదే, మీరు వాటిని వైరల్ అయ్యేలా చూడండి”
“ష్యూర్ సార్, ప్రభుత్వాలూ పోలీసులూ యెక్కడైనా వొకటే- యే ప్రభుత్వమైనా వొకటే- అని స్టూడెంట్స్…”
“చాలు, డామేజ్ కంట్రోల్ అవుతోందిగా?”
“అవుతోంది సార్… అంటే నాకొకటి అర్థమైంది సార్”
“ఏంటది?”
“ఏ ప్రభుత్వమైనా వొకటే, యెక్కడి పోలీసులైనా వొకటే, అలాగే యెక్కడి విద్యార్థులైనా వొకటే సార్! ఒక్కటే సార్!”

జీ… పవర్!
“బీహార్ దేశమంతా విస్తరించకుండా చూడాలి!”
“వై?”
“చాలా డేంజర్?”
“ఎందుకూ? మన యూపీ భక్తీ… బుల్డోజర్ దేశమంతా విస్తరించింది కదా?”
“అదే నా భయం!”
“ఏమైంది?”
“ఆ స్టూడెంట్స్ చూశావా? వాటర్ కెనాన్లు వాడితే, దానికింద సుబ్బరంగా తలంటి స్నానాలు చేస్తున్నారు”
“ఊ…”
“టియర్ గ్యాస్ లేదా? అని యేకంగా పోలీసుల దగ్గరికొచ్చి అడుగుతున్నారు…”
“ఔను”
“వంట గ్యాసుకు సబ్సిడీ యెత్తేసి టియర్ గ్యాసు ఫ్రీగా యిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు”
“హు… మనోడి వీడియోస్ వేస్ట్”
“అరే బారికేడ్లు యెత్తుకు పోతున్నారు…”
“అందుకే కదా, బార్డర్లలో వేసే యినుప కంచెలు… షార్ప్ బ్లేడ్స్‌తో…”
“ప్చ్… అది కాదు, జెన్ జీ గాళ్ళని చూసి జెన్ ఆల్ఫా గాళ్ళూ వుల్ఫా గాళ్ళూ తయారవుతున్నారు…”
“అదే కదా? వుచ్చకీ దగ్గుకీ కూడా వుద్యమం అంటున్నారు…”
“స్కూల్లో టాయిలెట్స్ బాలేవని, ఫుడ్ బాలేదని… అన్నిటికీ రెడ్డెక్కేస్తున్నారు…”
“అది రోడ్డెక్కడం కాదు…”
“మరి?”
“మనల్ని రోడ్డు మీదికి లాగడం!”

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. అయిదు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి, మనువాచకం. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. పిల్లల కథా సంపుటం: అల్లిబిల్లి కథలు. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- యింకా జాతీయాల మీద వచ్చిన ‘పురాణ పద బంధాలు’, పిల్లల సమస్యల మీద వచ్చిన ‘ఈ పెద్దాళ్ళున్నారే’, మంచిపుస్తకం తానా ప్రచురణ ‘నువ్వేమిస్తావు?’ తో కలిపి మొత్తం యిరవైతొమ్మిది వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్‌లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’, ప్రజాతంత్ర ‘శోభ’లో ‘మెరుపు తీగెలు’ కాలమ్స్‌కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply