సరైన ప్రశ్న

స్టేషన్ కు అప్పుడే వచ్చి కూర్చున్నాడు ఎస్. ఐ. భాస్కర్. ప్రతి రోజూ పెరిగే నేరాల సంఖ్య అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ ఏరియాలో గంజాయి బాచ్ ఎక్కువ. పదిహేను సంవత్సరాలు కూడా నిండని పిల్లలు గంజాయి మత్తుకు బానిసలయి, దాని కోసం సప్లయర్ లుగా కూడా మారిపోవడం చూస్తూ ఏమీ చేయలేక తన అశక్తతకు బాధపడుతూ ఉంటాడు భాస్కర్. నిన్నే ఓ పదహారేళ్ళ కాలేజి పిల్లాడిని పట్టుకున్నారు. వాడు పూర్తిగా మత్తులో ఉన్నాడు. తాను రోజూ తాగే గంజాయి కోసం డబ్బులు తేలేక, చిన్న దొంగతనాలు మొదలెట్టి చివరకు సప్లయర్ గా మారి పట్టుబడ్డాడు. ఆలోచిస్తే ఆ పిల్లాడి పతనం వెనుక అందరమూ భాద్యులమేమో అనిపిస్తోంది భాస్కర్ కు. ఆ తల్లి తండ్రుల రోదన ఇప్పటికీ అతని చెవిలో వినిపిస్తూనే ఉంది.

ఫోన్ మోగింది. కాన్స్టేబుల్ పద్మ దాన్ని రిసీవ్ చేసుకుంది. నవ్వుతున్న ఆమె మొహం సీరియస్ గా మారడం గమనిస్తున్నాడు భాస్కర్. పద్మ అతన్ని చూసి, సార్ ఇది మీరు అటెండ్ అవ్వండి అంటూ ఫొన్ అందించింది. అవతల ఎవరో ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. సూర్య హోమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నారని భాస్కర్ కు అర్ధం అయింది.

“సార్ సార్ తొందరగా రండి” అంటున్నాడు అతను…

భాస్కర్ అతన్ని విషయం వివరంగా చెప్పమన్నాడు.

“బీ బ్లాక్ 104 లో రాజారావు సార్ తలుపు తీయట్లేదు సార్. వారం రోజులయింది ఆయన ఇంటి బైటకు వచ్చి మాకు ఏదో జరిగిందని అనుమానంగా ఉంది. మీరు త్వరగా రండి సార్” అన్నాడు అతను.

సూర్య్ హోమ్స్ తమ జ్యూరిస్డిక్షన్ లోనే వస్తుంది. అది చాలా డబ్బున్న వాళ్లు ఉండే ఏరియా. అందులోకి ప్రవేశమే చాలా కష్టం. అత్యంత పటిష్టమైన సెక్యూరిటితో ఉండే కమ్యూనిటి అది. అందులోకి అగంతకులు ప్రవేశించడం అంత సులువు కాదు. ఇది క్రైం తో ముడిపడిన సంఘటన కాకపోవచ్చని భాస్కర్ కి అనిపించింది. వివరాలు తీసుకుని ఇద్దరు కాన్స్టేబుల్స్ తో సూర్య హోమ్స్ కి బయలుదేరాడు.

ఇరవై నిముషాలు పట్టింది అక్కడకు చేరడానికి. గేట్ బైటే ఇద్దరు గార్డ్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఒకరు జీప్ లోకి ఎక్కి దారి చూపిస్తూ ఉంటే ఒక అర కిలోమీటరు లోపలికి వెళ్లారు. బీ బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లాట్ దగ్గర ఒక పది మంది గుమికూడి ఉన్నారు. అందరూ డెబ్బై పై బడిన వాళ్లే. వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. పోలీస్ జీప్ చూసాక అందరూ మాటలాపేశారు. భాస్కర్ వారందరిని చూస్తూ జీప్ దిగాడు. అతని దగ్గరకు సన్నగా నుదిటిపై వీభూతితో ఓ పెద్దాయన వచ్చారు. “సార్ నా పేరు శ్రీనివాసన్”. నేనే మీకు ఫోన్ చేసాను. అంటూ భాస్కర్ ని 104 ప్లాట్ దగ్గరకు తీసుకొచ్చాడు.

అందరినీ చూస్తూ “ఏం జరిగింది?” అడిగాడు భాస్కర్.

“ఇది రిటైర్డ్ ఏర్ చీఫ్ మార్షల్ రాజారావు గారి ప్లాట్ సర్. ఆయన ఒక్కరే ఇందులో ఉంటున్నారు. వారం రోజులయింది ఆయన మాకు కనిపించి. మూడు రోజుల క్రితం నేను చెన్నై వెళ్ళబోయే ముందు ఫోన్ చేసి మాట్లాడాను. ఇవాళ ప్రొద్దున వచ్చాను. ఆయన నేను రెగ్యులర్ గా మార్నింగ్ వాక్ చెస్తాం. ఇవాళ అందుకని అయనకు ఆరింటికి ఫోన్ చేసాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆయనెప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు. అందుకని ప్లాట్ కి వచ్చాను. నాలుగు రోజుల పేపర్లు బైటే ఉన్నాయి. అనుమానం వచ్చి ఎంత గట్టిగా తలుపు కొట్టినా ఆయన తీయలేదు. పని మనిషి కూడా ఆయన తలుపు తీయకపోతే ఏ ఊరన్నా వెళ్లారేమో అని రోజూ వచ్చి చూసి వెళ్లిపోతుందట. నాకు ఓ గంట క్రితమే చెప్పింది. నాకు ఏదో డౌట్ గా ఉండి మీకు ఫోన్ చేసాను,” అన్నాడు ఆ పెద్దాయన.

ఆ బ్లాక్ సెక్రటరి తనే అంటూ జాన్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. “సార్ ఇది అయన సొంతిల్లు. పిల్లలిద్దరూ అబ్రాడ్ లో ఉంటారు. ఆయన ఒక్కరే ఇక్కడ ఉంటారు. వెరీ హెల్తీ మాన్. ఏ ఇష్యూస్ లేవు అని మాకు తెలుసు. కాని ఏజ్ కదా ఏదయినా జరిగి ఉండవచ్చు. తప్పదు తలుపు పడగొట్టాలి అందుకే మిమ్మల్ని పిలిచాం” అన్నాడు.

ఇంటి చుట్టు రకరకాల క్రోటన్స్ ఉన్నాయి. చుట్టు చాలా ఖాళీ స్థలం కూడా ఉంది. భాస్కర్ కాన్స్టేబుల్ ని ఇంటి చుట్టు కిటికీలు చూడమని పంపించాడు.

“ముందే చూసాం సర్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. అందుకే అనుమానం వచ్చింది. రాజారావ్ సాబ్ క్రింది రెండు కిటికీలు ఎప్పుడూ ఓపెన్ ఉంచుతారు. ఇవాళే అన్నీ లాక్ చేసి ఉన్నాయి” అన్నాడు ఓ యువకుడు. అతను ఆ ప్లాట్స్ లో సీనియర్ సిటిజన్స్ కు చిన్న చిన్న బైటి పనులు చేసి పెడుతూ ఉంటాడని తెలిసింది. కాన్సటేబుల్ కూడా కిటికీలన్నీలోపలి నుండి లాక్ చేసి ఉన్నయనే చెప్పాడు.

భాస్కర్ కు ఈ పెద్ద వాళ్లు అనవసరంగా గాభరా పడుతున్నరేమో అనిపించింది. ఆయన ఏదైనా ఊరికి వెళ్లారేమో. ఎవరో బలవంతంగా ఇంట్లోకి దూరినట్లు ఆనవాలు ఏమీ అక్కడ లేవు. వీళ్ళ మాటలు విని తలుపు పగలగొట్టడం తప్పేమో అనిపించింది భాస్కర్ కు.

“ఈయన కుటుంబీకులు, బంధువులు ఎవరూ ఇక్కడ లేరా?” అడిగాడు భాస్కర్. “ఒక వేళ అయన ఊరు వెళ్లారేమో!”

“మేమూ అదే అనుకున్నాం సార్. కాని శ్రీనివాసన్ సర్ కంగారు పడుతున్నారు. ఈయన రాజారావు గారి క్లోజ్ ఫ్రెండ్. పోలీసులను పిలవాల్సిందే అని మీకు ఫోన్ చేసారు” కాస్త విసుగ్గా అన్నాడు మరో పెద్దాయన.

శ్రీనివాసన్ ఇదేమీ పట్టించుకోకుండా. “ట్రస్ట్ మీ సర్ రాజారావ్ రిటైర్ అయి ఈ కమ్యూనిటికి వచ్చినప్పటి నుండి నాకు అయనతో రోజూ సమయం గడపడం అలవాటు. ఆయన చాలా సిస్టమాటిక్ మనిషి ఈ ఇరవై ఏళ్ళల్లో ఇలా ఎప్పుడు జరగలేదు. సంథింగ్ హాపెండ్. మీరు ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళాలి” అన్నాడు.

“కాని ఇష్యూ మరోలా మారితే ఎలా. కనీసం ఫోన్ ట్రాక్ చేద్దామన్నా అది స్విఛ్చాప్ అంటున్నారు,” అంటు ఆలోచిస్తున్న భాస్కర్ తో కాన్స్టేబుల్ రాహుల్ వచ్చి “సర్ ఓ పని చేద్దాం అటుపక్క బాల్కని లా ఉంది. ఆ డోర్ పక్కన ఓ కిటికీ కూడా ఉంది దాన్ని ఓపెన్ చేయడం తేలిక. అది బెడ్ రూం కి కనెక్ట్ అయి ఉంటుందని వాచ్మెన్ అంటున్నాడు. ఆ విండో తెరుస్తే ఏమన్నా తెలియ వచ్చు కదా. ఎక్కువ డామేజ్ కూడా కాదు అన్నాడు.”

భాస్కరన్ కు ఇది నచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఆ పక్క రెయిలింగ్ తో ఓ బాల్కని లా ఉంది. అందులోకి ఇద్దరు కాన్స్టేబుల్స్ దిగారు. ఓ పది నిముషాలు కష్టపడితే కిటికీ రెక్క కాస్త ఊడి వచ్చింది. అందులో నుండి అవతలి పక్క రూం కనిపిస్తుంది. లైట్ ఫాన్ వేసే ఉన్నాయి. పక్కపై నిద్రపోతున్నట్లు రాజా రావు గారు. ఎక్కడా దాడి జరిగిన ఛాయలు లేవు. ఆయన మంచంపై వెల్లకిలా నిద్రపోతున్నట్లే ఉన్నారు.

భాస్కర్ ఇంక ఆలస్యం చేయలేదు. ఆంబులెన్స్ కు ఫోన్ చేసి ఇంట్లోకి ప్రవేశించాడు. అతని వెనుక రాబోతున్న వారినందరినీ ఆపి ఒక్క శ్రీనివాసన్ గారినే లోపలికి రమ్మని పిలిచాడు. ఇద్దరూ బెడ్ రూం లోకి ప్రవేశించారు. రాజారావు గారి నోరు కాస్త తెరిచి ఉంది. ఆయనను చూడగానే ప్రాణం పోయిందని అర్ధం అయింది. దగ్గరగా వెళ్లి చూస్తె బాడి నుండి కొద్దిగా వాసన వస్తుంది. రూం లో ఫాన్ తిరుగుతున్నా, ఏ. సీ కూడ ఆన్ చేసే ఉంది.

శ్రీనివాసన్ రాజారావుని అలా చూసి తట్టుకోలేకపోయారు. ఆయన్ని కదుపుతూ రావ్ రావ్ అంటూ ఏడవడం మొదలెట్టారు. వారిద్దరి మధ్య మంచి స్నేహమే ఉన్నట్లు తెలుస్తుంది. పక్కనే చిన్న టేబుల్ పైన “గేమ్స్ పీపుల్ ప్లే” అన్న పుస్తకం, దాని పైన ఆయన కళ్ల జోడు ఉన్నాయి. పుస్తకం క్రింద భాస్కర్ కు ఓ కాగితం కనిపించింది. అతనికి చప్పున ఏదో అనుమానం వచ్చింది. ఏడుస్తున్న శ్రీనివాసన్ గారిని పట్టుకున్నాడు. బాడీని ఎక్కువగా కదిలించవద్దని చెప్తూ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా పక్కకు జరిపాడు. . డైరీ నుండి చింపిన ఓ కాగితంపై “కాన్ట్ స్టాండ్ ఎనీ మోర్. ఆల్ థింగ్స్ సార్టెడ్ ఔట్. థాంక్స్ శ్రీనివాసన్ బట్ హాంగింగ్ ఆన్ ఈజ్ పెయిన్ఫుల్” అంటూ రెండు లైన్లు రాసి ఉన్నాయి. వాటి క్రింద సంతకం ఉంది. భాస్కర్ దాన్ని శ్రీనివాసన్ కు చూపించాడు. ఆయన భోరుమన్నాడు. ఒక్క పది నిముషాలు ఆయనను పట్టుకోవడమే కష్టం అయింది.

ఆంబులెన్స్ వచ్చింది. భాస్కర్ రాజారావ్ బాడిని ఆసుపత్రికి తరలించాడు. సూసైడ్ అని తెలిసాక ఫార్మాలిటీస్ తప్పని సరి. ఆ ఉత్తరంలోని రాజారావ్ దస్తూరిని శ్రీనివాసన్ గుర్తు పట్టారు. అందులో ఆయన పెట్టిన సంతకంలో ఎక్కడా ఏ తడబాటు లేదు. ఆ సంతకం కూడా చాలా రాయల్ గా ఉంది. ఈ మరణం వెనుక మూడో వ్యక్తి ప్రమేయం లేదని భాస్కర్ అనుభవం చెప్తుంది.

ఆ గదిలోనుండి బైటికి వచ్చిన భాస్కర్ బైట హాల్ లో గోడపై ఉన్న మెడల్స్, సర్టిఫికేట్లను చూస్తూ ఉండిపోయాడు. రాజారావు ఏర్ ఫోర్స్ లో చీఫ్ ఏర్ మార్షల్ గా చేసి రిటైర్ అయ్యారని తెలిసింది. ఒక గోడపై అప్పటి ప్రెసిడెంట్ వెంకట్రామన్ తో మెడల్ తీసుకుంటున్నరాజారావు ఫోటో ఉంది. ఆయన గంభీరమైన విగ్రహం ఆయన అచీవ్మెంట్శ్ చూస్తూ ఆయన ఇలా మరణించడం వెనుక కారణం ఆలోచిస్తున్నాడు భాస్కర్. ఆ ఇల్లు ఆ పరిసరాలు, ఆ ఇంటి గోడలపై కనిపిస్తున్న రాజారావు పూర్వ చరిత్ర ఆ ఇంట్లోని పుస్తకాలు, ఇంటీరియర్స్ భాస్కర్ లాంటి మధ్య తరగతి వాళ్లు ఊహించలేని స్థాయిలో ఉన్నాయి. గోడపై తగిలించి ఉన్న డిజైనర్ కార్పెట్ లక్షలు చేస్తుంది. అద్దాల బీరువాలో విదేశాల నుండి సేకరించిన మెమెంటోలు ఉన్నాయి. ఇల్లు చాలా అందంగానూ, శుభ్రంగానూ ఉంది. చనిపోయే రోజు దాకా రాజారావు ఇంట్లో ఎంతటి పద్దతి పాటించేవారో ఆ ఇల్లు చూస్తే తెలుస్తుంది. టీపాయ్ పై ఉన్న ఆష్ ట్రే శుభ్రంగా ఉంది. దాని పక్కన వెండి సిగరెట్ కేస్. ఇలాంటి కేస్ లను సినిమాలలోనే చూసాడు భాస్కర్. మరో పక్కన లిక్కర్ కేబినెట్ పై ఉన్న బాటిల్స్ ఈ దేశంవి కావు. దాని క్రింద ఉన్న వైన్ గ్లాస్ కలెక్షణ్ చూస్తే అక్కడే ఓ పెగ్ వేయాలనిపించింది భాస్కర్ కి.

రాజా రావు బాడి ఆంబులెన్స్ లోకి వెళ్లిపోయింది. కాన్స్టేబుల్స్ తమ పని చేస్తున్నారు. తయారు చేసిన రిపోర్ట్ పై శ్రీనివాసన్ గారితో సంతకం తీసుకొమ్మని రాహుల్ కి చెప్పాడు భాస్కర్. రాజారావు మరణం గురించి ఎవరికి చెప్పాలో నంబర్లు ఇమ్మని అడిగాడు భాస్కర్. శ్రీనివాసన్ గారు పిల్లల ఫోన్ నెంబర్లు రాజరావ్ గారి సెల్ లోనే ఉంటాయని చెప్పారు. సెల్ సూసైడ్ నోట్ పక్కనే ఉంది చార్జ్ అయిపోవడంతో ఆఫ్ అయినట్లుంది. దాన్ని తమ కస్టడిలోకి తీసుకున్నాడు భాస్కర్. రాజా రావ్ గారి పిల్లల పేర్లను ఓ కాగితంపై నోట్ చేసుకుని డుండిగల్ లోని ఏర్ ఫోర్స్ ఆఫీసుకు సమాచారం అందిస్తానని చెప్పి శ్రీనివాసన్ గారి భుజం పై స్నేహపూర్వకంగా చేయి వేసి జీప్ ఎక్కాడు భాస్కర్.

*

పోస్ట్ మార్టం రిపోర్ట్ రాజారావు చనిపోయి రెండు రోజులయిందని వచ్చింది. లిక్కర్ లో నిద్రమాత్రలు కలుపుకుని తాగారాయన. బెడ్ రూం లో గ్లాస్ ఏదీ లేదని భాస్కర్ కి గుర్తుకొచ్చింది. కాని రిపోర్టు తప్పు కాదు కదా. ఆయన మరణం గురించి విన్న వెంటనే అకాడమి నుండి ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళే అన్ని పనులు తమ భుజాలపై వేసుకుని చేసారు. ఏర్ చీఫ్ మార్షల్ రాజా రావు అంతక్రియలు అత్యంత గౌరవ శ్రద్దలతో జరిగాయి. ఆయన కూతురు ఢిల్లీ సుప్రీం కోర్టులో లాయర్ గా పని చేస్తుంది. కొడుకు ఫ్రాన్స్ లో ఓ పెద్ద హోటల్ కు మేనేజర్. ఇద్దరూ అంతక్రియలకు వచ్చారు. ఆయనతో పని చేసిన వాళ్లంతా ఎనభై దాటిన వారే. ఒకొక్కరూ మౌనంగా వచ్చి నివాళులు అర్పించి వెళ్లారు. కేస్ క్లోజ్ చేయడానికి పదిహేను రోజులు పట్టింది భాస్కర్ కు.

పది రోజుల తరువాత కేసు క్లోజ్ చేసే ప్రొసీజర్ లో భాగంగా భాస్కర్ రాజారావ్ ఇంటికి మళ్ళీ వెళ్లవల్సి వచ్చింది. రాజారావు కూతురుతో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇంట్లోకి వెళ్ళిన భాస్కర్ కి చిరునవ్వుతో స్వాగతం పలికింది రాజారావు కూతురు రోహిణి.

హాల్ లోకి వెళ్లిన భాస్కర్ కు సగం సామాన్లు సర్దేసి ఉండడం కనిపించింది. తాను ఎక్కువ రోజులు అక్కడ ఉండలేనని, ఆ ఇల్లు ఖాళీ చేసి సామాను డిస్పోజ్ చేస్తున్నానని చెప్పింది రోహిణి. ఆ మెడల్స్, ఫ్రేం చేసిన సర్టిఫికేట్లు అన్నీ ఓ అట్టపెట్టలో కుప్పగా పడి ఉన్నాయి. ఏర్ ఫోర్స్ ఆఫీసు వారు వచ్చి వాటిని పరీక్షించి అవసరం అనుకున్నవి తీసుకెళతారని మిగతావి తాను డిస్పోస్ చేయబోతున్నాని ఆమె చెప్పింది. భాస్కర్ కు ఒక్క క్షణం బాధ అనిపించింది. ఒక గొప్ప పదవిలో ఓ వ్యక్తి జీవితకాలం పాటు సాధించిన విజయాలకు చిహ్నాలు అవి. సొంత పిలల్లకే అవి పనికిరానివిగా అనిపించడం చూస్తే మనసంతా విషాదం కమ్మింది. రాజారావుని శవంగా చూసినప్పుడు అతనికి ఏమీ అనిపించలేదు. ఇలాంటి మరణాలు అతను చాలా చూసి ఉన్నాడు కాని ఆ అందమైన ఇంటి గోడల నుండి ఒకొక్క ఫోటో చెత్తలోకి చేరడం అతన్ని బాధించింది. ముసలితనంలో డిప్రెషన్ కు లోనయి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కేస్ క్లోజ్ చేస్తున్నారు. అదే విషయం రోహిణీకి చెప్పి ఆమె నుండి స్టేట్మెంట్ పై సంతకం తీసుకున్నాడు భాస్కర్.

రోహిణీకి రాజారావు గారి ఫోన్ ను అప్పగించి సోఫాలో కూర్చుండిపోయిన భాస్కర్ క్ దాహం అనిపించింది. మంచి నీళ్ళు కావాలని అడిగాడు. రోహిణీ ఇబ్బందిగా మొహం పెట్టింది. క్రాకరీ అంతా పాక్ అయిపోయిందని చెప్తూ లోనికి వెళ్లి సింక్ పక్కన ఉన్న ఒక వైన్ గ్లాస్ లో నీళ్ళు తీసుకొచ్చింది. “సారి ఇది ఒక్కటే సింక్ పక్కన ఉండిపోయింది. డాడ్ వైన్ గ్లాస్ ఇది. డోంట్ మైండ్” అంటూ అందులో నీళ్లు అందించింది. భాస్కర్ కు రాజారావు డ్రింక్ లో నిద్రమాత్రలు కలుపుకుని తాగారని వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ గుర్తుకు వచ్చింది. బెడ్ పక్కన తానే గ్లాసు చూడలేదన్నది మరో సారి తట్టింది. ఈ గ్లాస్ సింక్ పక్కన ఉందంటే అర్ధం ఆయన మందులో మాత్రలు కలుపుకుని తాగి దాన్ని శుభ్రంగా కడిగి ఆరడానికి సింక్ పక్కన పెట్టారనమాట. ఆ తరువాత మంచంపైకి చేరి ఫాన్, ఏ సీ రెండు ఆన్ లో ఉంచి తన బాడి త్వరగా పాడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారని భాస్కర్ అర్ధం చేసుకున్నాడు. చనిపోతూ కూడా అంత పద్ధతి పాటించగల అ ఏర్ మార్షల్ ఆత్మహత్యతో మరణించడం భాస్కర్ జీర్ణించుకోలేకపోతున్నాడు.

రోహిణీ తో “మీ ఫాదర్ డిప్రెషన్ గురించి మీకు తెలీదా?” అని అడిగాడు.

రోహిణీ తల పెకెత్తి ఓ సెగరెట్ ముట్టించింది. భాస్కర్ కు ఆఫర్ చేయబోతే అతను తీసుకోలేదు. సిగరెట్ దమ్ము లాగుతూ “డాడ్ ఓ పెక్యూలియర్ మనిషి. ఆయనతో ఉండడం చాలా కష్టం. మామ్ మేం ఉద్యోగంలోకి వచ్చిన కొన్ని రోజులకే డివోర్స్ తీసుకుని డాడ్ ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకుని వెళ్లిపోయింది. నేనూ రోహన్ ఇద్దరం సెటిల్ అయ్యాక డాడ్ రిటైర్ అయ్యారు. హీ ఈజ్ ఏ టఫ్ గై యూ నో. ఇక్కడే ఇల్లు కొనుక్కుని ఉండిపోయారు. హీ హాజ్ ఏ బిగ్ సర్కిల్ అండ్ ఎంజాయిడ్ లైఫ్ టూ ద కోర్. హీ వాజ్ ఏ గుడ్ ఫాదర్ ఆల్సో. బట్ మేం ఆయనతో ఎప్పటికీ ఉండలేం కదా. స్లోలీ ఏజ్ రిలేటేడ్ ఇష్యూస్ తో డిప్రెషన్ లోకి వెళ్లారేమో. లాస్ట్ మంత్ విల్ కూడా రాసారు. తన సేవింగ్స్ మమ్మీకి, ఈ ఇల్లు నాకు కొన్ని బాండ్స్ రోహన్ కు ఇచ్చేసారు. ఈ మెమెంటోస్ అకాడమీకి ఇచ్చేయమన్నారు. హీ వాజ్ ఆల్వేస్ టఫ్ టు అండస్టాండ్ బట్ సూసైడ్ వాజ్ అనెక్స్పెక్టెడ్” అంది. ఆమె ముఖంలో ఏ కోశానా బాధ లేదు. చాలా నిర్వికారంగా ఉంది.

భాస్కర్ తన కండోలెన్సెస్ చెప్పి బైటికి వచ్చాడు . కేస్ క్లోజ్డ్ కాని అతనికేదో వెలితిగా ఉంది. బైటికి వచ్చాక శ్రీనివాసన్ గుర్తుకు వచ్చారు. అతన్ని కలవాలనిపించింది భాస్కర్ కి. ఆ రోజు తరువాత ఆయన్ని మళ్ళీ భాస్కర్ చూడలేదు. అక్కడ కనిపించిన గార్డ్ తో శ్రీనివాసన్ గురించి వాకబు చేసారు. అతను ఏ బ్లాక్ లో థర్డ్ ఫ్లోర్ లో తన కొడుకు ఫామిలీతో ఉంటాడని చెప్పాడు అతను. తానే వెళ్లి ఆయన్ని కలుస్తానని చెప్పి భాస్కర్ ఏ బ్లాక్ వైపుకు నడిచాడు. .

*

తలుపు తీసిన యువతి యూనిఫాంలో ఉన్న భాస్కర్ ను ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఇబ్బంది గమనించి తాను శ్రీనివాసన్ గారి కోసం వచ్చానని చెప్పాడు భాస్కర్. ఆమె లోపలికి చూసే లోపలే ఆయన చప్పుడు విని హాల్ లోకి వచ్చారు. భాస్కర్ ను అయన గుర్తు పట్టి ఆ అమ్మాయికి తమిళంలో ఏదో చెప్పారు. ఆమె భాస్కర్ ని లోపలికి రమ్మని దారి ఇచ్చింది. భాస్కర్ హాలులోకి వెళ్లాడు. శ్రీనివాసన్ గారు ఫుల్ హాండ్శ్ బనీనుతో తెల్ల లుంగీతో ఉన్నారు. తలపై విభూతి, చేతిలో ఏదో పుస్తకం బహుశా చదువుతూ అలాగే లేచి వచ్చి ఉంటారు. భాస్కర్ ను కూర్చోమని సోఫా చూపించారు.

ఆ ప్లాట్ కూడా పెద్దదే. సాంప్రదాయంగా ఉంది. తమిళ సంస్కృతి ఇంటి అణువణువులోనూ కనిపిస్తుంది. ఆ యువతి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. “మై డాటర్ ఇన్ లా” అంటూ పరిచయం చేసారు శ్రీనివాసన్ గారు. ఆమెకి భాస్కర్ ని చూపిస్తూ ఏదో చెప్పారు. అందులో రావంకుల్ అన్నదొక్కటే శ్రీనివాసన్ కు అర్ధం అయింది. తాను కేస్ డీల్ చేసిన్ ఎస్. ఐ అని ఆమెకు శ్రీనివాసన్ చెప్పారని భాస్కర్ కు అర్ధం అయింది.

శ్రీనివాసన్ గారు నలిగినట్లు కనిపించారు. రాజారావ్ గారి మరణం ఆయన్ని బాగా కదిలించిందని అర్ధం అయింది భాస్కర్ కి. “కేస్ ఈజ్ క్లోజ్డ్ సర్” చెప్పాడు భాస్కర్. ఆయన పేలవంగా నవ్వారు. “సం థింగ్స్ హావ్ టూ ఎండ్” అన్నారు.

కొద్ది సేపు మౌనం తరువాత “రాజారావ్ గారి డిప్రెషన్ గురించి మీకు అంతకు ముందు తెలీదా” అడిగాడు భాస్కర్.

“ప్లాట్ లో ఏమన్నా మెడిసిన్స్ కనిపించాయా” ప్రశ్నించారు శ్రీనివాసన్.

“లేదు ఆయన ఏ మందులూ వాడట్లేదు. బీ.పీ షుగర్ టాబ్లెట్లు కూడా మాకు కనిపించలేదు” చెప్పాడు భాస్కర్.

“ఎస్. ఐ నో. రాజారావ్ ది ఉక్కు శరీరం. ఎప్పుడూ జలుబుతో బాధపడిన వాడు కూడా కాదు” అన్నాడు శ్రీనివాసన్.

“మరి ఈ ఆత్మహత్య కు కారణం. వారిది ఆత్మహత్య అన్నది మాత్రం నిజం” అన్నాడు భాస్కర్.

“రాజారావ్ గొప్ప ఎనర్జీ ఉన్న మనిషి. జీవితంలో ఎప్పుడూ దేనికి చలించని వాడు. రాబర్ట్ మరణించేదాకా ఆయనలో భయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు” చెప్పాడు శ్రీనివాసన్.

భాస్కర్ కి ఏదో కొత్త క్లూ దొరికినట్లనిపించింది. రాబర్ట్ గురించి ఎవరూ చెప్పలేదే…

“రాబర్ట్ తోనే రాజారావుకు రోజు మొదలయ్యేది. వాడితో కలిసే వాకింగ్ కి వచ్చేవాడు. వాడు కూడా రాజారావుని ఒక్క క్షణం వదిలేవాడు కాదు. అయన్ని నిద్రలేపేది వాడే. స్లిప్పర్లు అందించి బాత్ రూం కి తోసేది వాడే. ఆయన షెఢ్యూల్ మొత్తం వాడికి తెలుసు. రాత్రి పది దాటాక ఆయన తన కుర్చీలో కూర్చునే ఉంటే వాడే గోల చేసి ఆయనను బెడ్ ఎక్కించేవాడు. ఆయన పక్కనే పడుకునేవాడు. రాజారావు ఏ కాస్త డల్ గా ఉన్నా వాడు ఆయన్ని ఆటల్లోకి దించి గోల గోల చేసేవాడు. రాత్రి ఆయన రెండు పెగ్గులు వేయందే నిద్రపోయేవాడు కాదు. ఆ సమయంలో రాబర్ట్ తన కిష్టమైన చికెన్ ఫ్రై తింటూంటే ఈయన వాడి పక్కన మందు తాగుతూ పాకిస్థాని గజల్స్ ను వింటూ కూర్చుని ఉంటే నాకు వాళ్ల అనుబంధం అసూయ పుట్టించేది. రాబర్ట్ రెండు నెలల క్రితం మరణించాడు. వాడు ఆఖరి శ్వాస తీస్తూ ఉంటే ఈయన వాడి తల మీద రాస్తూ రాత్రంతా గడిపాడు. ఆ తరువాత మామూలు మనిషి కాలేకపోయాడు. రాబర్ట్ మరణించకపోతే రావ్ కొన్నాళ్ళు మన మధ్య ఉండేవాడు” ఆయాసంతో ఒక్క క్షణం ఆగాడు శ్రీనివాసన్.

“మరి రాబర్ట్ సంగతి ఎవరూ మాతో చెప్పలేదు. ఆ ఇంట్లో ఆయనొక్కరే ఉండేవారని అందరూ చెప్పారు. ఆయన పిల్లలు కూడా రాబర్ట్ గురించి మాతో అనలేదు కదా సర్” అడిగాడు భాస్కర్.

“పిల్లలు… పదిహేను సంవత్సరాలు అయింది వాళ్లు తండ్రి దగ్గరకొచ్చి. ఆయన భార్య సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఆమె తన దారి తాను చూసుకుంది. ఈయన వృత్తి ధర్మంగా ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉంటూ పిలల్లను భార్యను హైదరాబాద్ లో ఉంచారు. భార్య ఈయన స్నేహితుడితోనే ప్రేమలో పడింది. అది తెలిసి ఈయన ఎంత బాధపడ్డాడో కాని ఎప్పుడూ ఎవరి దగ్గరా బైట పడలేదు. భార్య గురించి ఒక్క తప్పు మాట మాకు చెప్పలేదు. ఆమె అప్పుడప్పుడూ ఫోన్ చేసేదని మాత్రం నాకు తెలుసు. ఈయనే పూనుకుని ఆ స్నేహితునితో ఈమె పెళ్లి జరిపించాడు. పిల్లలు అత్యంత స్వతంత్ర భావాలున్న వార్లు. ఉద్యోగం కారణంగా దూరం ఉన్న తండ్రి డబ్బు హోదా, పరపతి వారికి ఉపయోగపడ్డాయి. వాళ్ళవి ప్రేమ వివాహాలే. ఈయన వారికి సలహా ఇవ్వబోయినా వాళ్లు తీసుకునే వాళ్ళు కారు. అందుకే వారికి కావల్సిన అండ ఆయన ఇచ్చేవరు. రోహిణి తనకో కూతురు పుట్టాక డైవర్స్ తీసుకుంది. తండ్రి మాట ఆమె ఎప్పుడు లక్ష్యపెట్టలేదు. ఆమె తల్లి పక్షమే. కొడుకు ఓ నార్వే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అంతకు ముందు పదేళ్లుగా వాళ్ళు డేటింగ్ లో ఉన్నారు. ఈయన దేనికీ అడ్డు చెప్పలేదు. కాని కొడుకు పెళ్ళి చేసుకున్నాక ఆయన మొహంలో రిలీఫ్ నేను చూసాను. రిటైర్ అయిన తరువాతే ఇక్కడ ఇల్లు కొనుకున్నారు. చాలా పద్దతి అయిన మనిషి. ఎందరికో సహాయం చేసేవాడు. ఎందరికో ధైర్యం చెప్పేవాడు. రాబర్ట్ తో చాలా సంతోషంగా ఉండేవాడు. వీడొక్కడు చాలు లేరా అనేవాడు నాతో. రాబర్ట్ చనిపోయక పూర్తిగా మౌనంలోకి వెళ్లారు.”

“నేను అప్పటికీ ఆయనకు ధైర్యం చెబుతూనే ఉన్నా కనిపెట్టుకునే ఉన్నా. కాని ఆయన రోజువారి రొటీన్ మునుపటిలా జరిగేది కాదు. ఆయన ఇలా అత్మహత్య చేసుకుంటాడని మాత్రం నేను అనుకోలేదు. మీకు తెలీదు ఆయన చాలా ధైర్యవంతుడు. ఇలా ఎవరు చనిపోయారని విన్నా వారిపై జాలి పడేవాడు. ఆత్మహత్య తప్పని ఆయన నోటే ఎన్నో సార్లు విన్నా. ఆయనది ఉక్కు లాంటి శరీరం ఏ శారీరిక ప్రాబ్లం లేదు. రాబర్ట్ లేకుండ బతకలేనని అనుకుని ఉంటాడు” అన్నాడు శ్రీనివాసన్.

భాస్కర్ కి ఈ సమాచారం చాలా అసహనానికి గురి చేసింది. అంతా క్లోజ్ అయిపోనప్పుడు ఈ రాబర్ట్ ప్రసక్తి ఇప్పుడు రావడం, దీన్ని తాను మిస్ చేయడం అతనికి ఇబ్బందిగా అనిపించింది.

“రాబర్ట్ ఆయన పెంపుడు కొడుకా?” అడిగాడు.

“అంతకన్నా ఎక్కువే,” చెప్పాడు శ్రీనివాసన్.

“బట్ హౌ డిడ్ వీ మిస్ దిస్” అసహనానికి లోనయ్యడు భాస్కర్.

శ్రీనివాసన్ భాస్కర్ వైపు చూసారు. నా దగ్గర వాళ్ల ఫోటో ఉంది చుస్తావా అంటూ గదిలోకెళ్ళి ఓ అరచేయి వెడల్పున్న ఫోటోని పట్టుకు వచ్చారు.

ఆయన చేతులో ఫోటోని లాక్కున్నట్లు తీసుకున్నాడు భాస్కర్. అందులో శ్రీనివాసన్, రాజారావు లు గుబురుగా పూసిన బోగెన్ విల్లా చెట్టు క్రింద బెంచి పై కూర్చుని దేనికో గట్టిగా నవ్వుతున్నారు.”

”రాబర్ట్ లేడే” అడిగాడు భాస్కర్.

“ఇక్కడున్నది రాబర్ట్ కదా” వేలుతో బెంచి పక్కన చూపించారు శ్రీనివాసన్.

చూస్తున్న భాస్కర్ మొహంలో రంగులు మారాయి… నవ్వు ఆపుకోలేక బిగ్గరగా నవ్వేసాడు.

శ్రీనివాసన్ వేలు పెట్టిన చోటు ఓ జర్మన్ షెపర్డ్ నాలుక బైటకు పెట్తి రాజారావు వైపు చూస్తోంది.

ఒక్క క్షణం శ్రీనివాసన్ భాస్కర్ నవ్వును చూస్తూ నుంచున్నారు. ఆయన ముఖంపై ఏదో అర్ధం అయిన ఫీలింగ్.

“ఐ నో ఇదే రెస్పాన్స్ వస్తుంది మీ జెనరేషన్ నుండి. బట్ వీడే రాబర్ట్. రాజారావును పద్దెనిమిది సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్న పెంపుడు కొడుకు. ఏ కూతురు, ఏ కొడుకూ, ఏ భార్యా ఇవ్వలేని తోడును ఇచ్చిన ప్రాణి. ఈ పద్దెనిమిది సంవత్సరాలు రాజా రావ్ మాతో కలిసి ఆనందంగా కాలం గడపడానికి కారణం అయిన జీవి.”

భాస్కర్ తేరుకున్నాడు. ఈ వయసులో ఈ ముసలివాళ్లిలాగే ఉంటారేమో అనిపించింది అతనికి. “యూ మీన్ ఈ కుక్క చనిపోతే ఆయన డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారా? ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న ఏర్ మార్షల్ ఓ కుక్క మరణాన్ని తట్టుకోలేక చనిపోయారంటారా” భాస్కర్ ముఖంలో తెలియకుండానే ఓ హేళన ద్వనించింది.

మౌనంగా ఉన్నారు శ్రీనివాసన్. భాస్కర్ ముఖాన్ని పరీక్షగా చూసారు.

“యంగ్ మాన్ నువ్వు అదే ప్రశ్నని మరోలా అడిగితే నీకు రాజారావ్ మరణం వెనుక కారణం అర్ధం అయేది” అన్నారు.

“అంటే ఎలా అడగాలి” భాస్కర్ ముఖంలో అదే వ్యంగ్యం.

“తన పెంపుడు కుక్క చనిపోతే ఓ ఏయిర్ మార్షల్ గా రిటైర్ అయిన రాజారావ్ తట్టుకోలేక పోయాడంటే, అంత పెద్ద ఉద్యోగం, అన్ని భాద్యతలు మోసిన ఆయన చివరి రోజుల్లో దానిపై ఎంత ఆధారపడి ఉంటాడు? ఈ స్థితి ఆ వృద్ధునికి ఎందుకు వచ్చింది?. దీనికి కారణం ఎవరు? ఆయన స్నేహితులు, కుటుంబం ఈ రాబర్ట్ స్థానాన్ని ఎందుకు తీసుకోలేకపోయాయి. రాబర్ట్ మరణిస్తే ఆయన అంతగా కృంగిపోయాడంటే ఆయన పక్కన మరో ప్రాణి లేక ఆ ఒంటరితనాన్ని తాను భరించలేననే స్థితికి ఆయన వెళ్లిపోయాడంటే మరి దానికి కుటుంబం, సమాజం కారణం కాదా. ఒక పెంపుడు కుక్కే ఓ వృద్ధునికి చివరి ఆసరా ఎందుకయ్యంది? చుట్టు ఉన్న కుటుంబం, స్నేహితులు ఏం చేస్తున్నారు?” ఇవి కదా మీరు వేసుకోవలసిన ప్రశ్నలు.

భాస్కర్ ఆలోచనలో పడ్డాడు… “అంటే?”

“రాజారావ్ చాలా కలుపుగోలు మనిషి. అతని ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు. ఆయన అందరికీ ఎంతో సహాయం చేసేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తొణకని మనిషి, కాని అతనికీ ఓ ఎమోషనల్ డిపెన్డెన్సీ అవసరం కదా. రాబర్ట్ పై ఆయన ఎంత ఆధారపడ్డాడో నాకు రాబర్ట్ చనిపోయిన రోజున రాజారావ్ ని చూసినప్పుడు తెల్సింది. సో యంగ్ మాన్ నువ్వు ఆ ప్రశ్నను సరిగ్గా వేసుకో… లోపం ఎక్కడుందో నీకు తెలుస్తుంది. ఈ ఒంటరితనం కాన్సర్ కన్నా భయంకరమైనది. ఇది ఎంత క్రూరంగా మానవ సమాజాన్ని కబళించి వేస్తుందో అర్ధం అవ్వాలంటే ప్లీజ్ ఆస్క్ రైట్ క్వస్టెన్స్”. అన్నారు ఆయన గంభీరంగా.

ఆ ఇంటి నుండి బైటకు వచ్చిన భాస్కర్ తన జీప్ దగ్గరకు వెళ్తూ సెల్ తీసాడు. తెనాలి పక్కన పిదపర్తిపాలెం అనే చిన్న ఊర్లో ఒంటరిగా ఉంటున్న తల్లి అతనికి గుర్తుకు వచ్చింది.

ఫోన్ రింగయింది అవతలి పక్కన ఓ స్త్రీ “ఏంటి భాస్కర్ ఈ సమయంలో? బాగున్నావా నాన్నా?” అని పలకరించింది.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply