సయ్యదా వొక్కరు కాదు; పెక్కురు 

మనుషులు పదేపదే స్థానభ్రంశం చెందుతున్నప్పుడు వాళ్లకు సంబంధించి చెప్పుకోవటానికి కొన్ని కథనాలను మాత్రమే ఎన్నుకుంటారు. చాలా విషయాల్లో మౌనం ఆశ్రయిస్తారు. అనేక విషయాల్ని వారి స్మృతిపథం నుంచి తొలగిస్తారు.

 కొన్ని ఘటనల వరుస క్రమాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం అంత సంతోషం కలిగించే విషయమేమీ కాదు. జ్ఞప్తికి తెచ్చుకున్న సంఘటనలు మన బాధను తీవ్రతరం చేసి ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అనే క్రమాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఆ బాధే ఘట్టాలను అసంపూర్ణం చేస్తుంది. కొన్ని కథనాలనే రంగం మీదకు తెస్తుంది. భావాలను మాటల్లో పెట్టలేని స్థితి వస్తుంది. గతానికి సంబంధించిన కొన్ని ఘటనలు ప్రజల స్మృతుల నుండి పునర్నిర్మాణం చెందుతాయి.

– నేహా దీక్షిత్ 

ఇటీవల ప్రముఖ జర్నలిస్టు నేహా దీక్షిత్ The many lives of Syeda X… the story of unknown Indian పుస్తకం ప్రచురిస్తూ చెప్పిన మాటలివి. ఈ పుస్తకాన్ని తెలుగులోకి రమాసుందరి ‘సయ్యదా X’ ఓ అపరిచిత భారతీయురాలు కథ పేరుతో అనువదిస్తే, మలుపు బుక్స్ ప్రచురించింది. 

సయ్యదా అనే వొక ముస్లిం మహిళ కథని నెపం చేసుకొని నేహా దీక్షిత్ దేశంలో లఘు భారీ పారిశ్రామిక రంగాల్లో పనిచేసే అసంఖ్యాక అసంఘటిత కార్మికుల విషాద బీభత్స జీవన దృశ్యాల్ని అతి పెద్ద కాన్వాస్ మీద చిత్రించింది. వర్తమాన భారతదేశ రాజకీయ విద్వేషపు ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది. జర్నలిజం సాధారణంగా పరిశోధనాత్మకంగా వుంటుంది. కానీ నేహా దీక్షిత్ చేసిన యీ పరిశోధన కథనాత్మకంగా కూడా వుంది. ఒక కొత్త నవల చదువుతున్నట్టు అనిపిస్తుంది. పరిశోధనాత్మక కథనానికి మూలం వాస్తవ జీవితమే. రక్తమాంసాలున్న సజీవ వ్యక్తుల జీవిత ఘటనలే. జీవిక కోసం పెనుగులాడే సముదాయాల అస్తిత్వ పోరాటాలే. బనారస్ చేనేత కార్మిక కుటుంబంలో పుట్టి, మరొక చేనేత కార్మిక కుటుంబంలోకి మెట్టిన సయ్యాదా చిన్న వయస్సులోనే పుట్టినింటికీ మెట్టినింటికీ దూరమౌతుంది. మొత్తం కుటుంబం విస్థాపనకి గురై చెదిరిపోతుంది. అలా స్థాన భ్రంశం చెందడానికి కారణం: ఆర్థిక కోణంతో జతపడిన మత రాజకీయాలు. బాబ్రీ విధ్వంసానికి ముందే 1991 లోనే బిజెపి మతం కార్డును వుపయోగించి “జ్ఞానవాపి” మసీదు స్థలం హిందువుల పవిత్ర స్థలమనే ప్రచారాన్ని ముందుకు తీసుకువచ్చి వారణాసి నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత అధికారంలోకి వచ్చేందుకు1992లో బాబ్రీ మసీదుని ధ్వంసం చేసింది. బాబ్రీ ఘటన తర్వాత వేలాది ముస్లిం కుటుంబాలు వుపాధులు కోల్పోయి కొంపా గోడూ వొదులుకొని ప్రాణాలరచేత పట్టుకొని తమ నేల విడిచి బలవతంగా వలసపోవాల్సి వచ్చింది. అలా సయ్యదా సొంత ఇంటికీ వూరికీ దూరమైంది. భర్త గొప్ప కళా నైపుణ్యం వున్న చేనేత కళాకారుడు. కానీ వూరి నుంచి దూరమైన తర్వాత, సరియైనటువంటి స్థిర నివాసం లేక వాళ్లు అనేక చోట్ల తిరిగారు. దిక్కుతోచని స్థితిలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకొని అక్కడ ఢిల్లీ నగర సరిహద్దు ప్రాంతాల్లో ఆ కుటుంబం అనుభవించిన జీవితాన్ని నేహా దీక్షిత్ వొక జర్నలిస్టుగా సామాజిక శాస్త్రవేత్తగా చరిత్ర విద్యార్థిగా వ్యాఖ్యానించింది. విశ్లేషించింది. 

కాశీ అన్నపూర్ణకు వస్త్రాలు నేసే కళాకారులెందరో మతవాదుల దాడుల దరిమిలా దిన కూలీలుగా మారారు. చేనేత వృత్తిలో తన నైపుణ్యాన్ని చూపించుకోవడానికి అవకాశం లేని అక్మల్ బండి లాగే వాడిగా, మూటలు మోసే వాడిగా, రిక్షా పుల్లర్ గా జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ ఢిల్లీ లాంటి నగరంలో అది చాలదు. సయ్యదా కూడా పనిచేయక తప్పదు. తన కుటుంబాన్ని పోషించుకొనటానికి, ఆత్మగౌరవంతో బతకటానికి, వొక ముస్లిం స్త్రీగా ఆమె యెదుర్కొన్నటువంటి కష్టాలన్నింటినీ రచయిత యీ నవలలో వర్ణించింది. సయ్యాదాకు ‘వానాకాలపు కప్పల్లా’ ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు వొక ఆడబిడ్డ. తన కుటుంబాన్ని పోషించుకొనడానికి ఆమె చేయని వృత్తి లేదు. చాందినీ చౌక్, అక్కడి నుంచి పారిశ్రామిక వాడగా మారిన జమ్నా పార్ లోని సభాపూర్, కర్వాల్ నగర్ యిలా బతుకు తెరువు కోసం యెన్నో చోట్లకు మారుతూ వుంటుంది. మారిన ప్రతిసారీ కొత్త ప్రదేశాల్లో కుదురుకోడానికి యెన్నో పనులు.. యెక్కడా యేదీ స్థిరమైన వృత్తి వుండదు. ఇది వొక్క సయ్యదా జీవితమేనా? దేశంలో అసంఘటిత రంగంలో వున్న కోట్లాది కార్మికుల జీవితం అలాగే వుంటుంది. సయ్యదా వొక ప్రతీక మాత్రమే. దేశమంతటా సయ్యదా లాంటి స్త్రీలు అక్మల్ వంటి పురుషులు కొన్ని కోట్ల మంది. ఈ జీవితం మనకు తెలియదు. అందుకే యిది అపరిచిత భారతీయురాలి కథ.

ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు యెటువంటి హక్కులూ వుండవు. చాలా మంది ‘పీస్ వర్క్’ చేస్తూ ఉంటారు. అది తమ యీళ్లల్లోనే చేస్తూ వుంటారు. ఉదాహరణకి సంక్రాంతి పండుగ వస్తుందంటే దేశంలో చాలా భాగాల్లో గాలిపటాలు యెగరేస్తారు. ఆ గాలిపటాలు వాళ్ళు యింట్లోనే తయారు చేస్తారు. రాఖీ పండక్కి చెల్లెళ్ళు అన్నల చేతికి రాఖీలు కట్టి భద్రత కోరుకుంటారు. ఆ రాఖీలు వాళ్లు ఇళ్లల్లో తయారు చేస్తారు. బయట మనం రూపాయల్లో కొనుక్కునే వస్తువుల్ని తయారు చేసినందుకు వాళ్ల చాకిరీకి దొరికేది పైసల్లో. ఇలా యింటి పని చేసుకుంటూ కుటుంబ ఆహార భద్రతని భుజాన వేసుకొన్న మహిళలు చేయని పని వుండదు. ఎన్ని పనులు చేస్తారో లెక్క వుండదు. చిరుతిళ్లు, సౌందర్యసాధనాలు, స్టేషనరీ సామాను, దుస్తులు, వాహనాల విడి భాగాలు, పుస్తకాలు, వాహనాల ఎలక్ట్రానిక్ డివైస్ ల స్పేర్ పార్టులు, బొమ్మలు, గృహోపకరణాలు, హార్డ్ వేర్ పరికరాలు, వైద్య సంబంధిత వస్తువులు, ఎలక్ట్రిక్ సామాగ్రీ ఆ కార్మిక మహిళలు తమ యిళ్ళలో విడివిడిగా తయారు చేస్తారు. అవన్నీ అంచెలంచెల కాంట్రాక్టర్ల ద్వారా కనబడని యజమానులకు చేరుతాయి. కార్పొరేట్ సంపద పెంచుతాయి. ఇలా కారు చౌక శ్రమ ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ సయ్యదాలు వుంటారు. లక్షలాది సయ్యదాలు తమ రక్తాన్నీ చెమటనూ, ఆరోగ్యాన్ని ధారబోసి ఢిల్లీ నగరాన్నే కాదు మొత్తం భారతదేశాన్నే ‘వికసితం’ చేస్తున్నారు.

సయ్యదా చుట్టూ యెందరో స్త్రీలు, రజియా కావచ్చు కమల కావచ్చు రేడియో వాలి కావచ్చు లలిత కావచ్చు.. వీళ్ళందరూ మన దైనందిన జీవితంలో మనకు యెక్కడో వొక చోట తారసపడతారు. కానీ వాళ్ళని మనం గుర్తించం, వాళ్ళు చేసే పనులకి లెక్కలేదు. సయ్యదా X అనడం అందుకే. పది పన్నెండు సంవత్సరాల్లో సయ్యదా దాదాపు నలభైయైదు రకాల పనులు చేసింది. ఎంబ్రాయిడరీ చేసింది. సాఫ్ట్ టాయ్స్ తయారు చేసింది. బొట్టు బిళ్ళలని తయారు చేసింది. ఫొటో ఫ్రేములు కట్టింది. స్కూల్ బ్యాగులు తయారు చేసింది. పెళ్లి పత్రికలూ తయారుచేసింది. ప్రమిదలు తయారు చేసింది, ఇలా ఎన్నో…

పీస్ వర్క్ యిటువంటి చిన్న వస్తువులు తయారుచేయడం వరకే పరిమితం కాదు. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు ద్వారా పనులు చేయించుకుంటాయి. ఆ పీస్ వర్క్ అంతా యెక్కడికి వెళ్తుందో తెలియదు వాళ్ళకి. సయ్యదా జీన్స్ ప్యాంట్ తయారుచేస్తుంది. అలాగే బాదంలు పగులగొడుతుంది. మంచి బాదంపప్పు యేరుతుంది. సుగంధ ద్రవ్యాలు మసాలా ద్రవ్యాలు బాగుచేసి ప్యాకింగ్ కి సిద్ధం చేస్తుంది. కానీ ఆమె జీవితానికి యెక్కడా భద్రత లేదు. ఎక్కడా హక్కుల్లేవు. ఇండ్ల నుండి పనిచేసే యీ కార్మికులు వొక యజమానితో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నియామకం కాకుండా వేతనాల కోసం యజమాని పని స్థలం దగ్గర కాకుండా తమ ఇంటి నుంచో మరో యింటి పంచ నుంచో లేబర్ యినస్పెక్టర్లకు దొరక్కుండా గాలీ వెలుతురూ లేని చీకటి గదుల్లోనో రహస్యంగా అయినా పనిచేసే వాళ్లు. అలాంటి సందర్భంలో కొంతకాలం సయ్యదా బాదం పప్పులు పగలగొట్టే ఫ్యాక్టరీలో చేరుతుంది. అదొక్కటే ఆమె చేసిన స్థిరమైన వుద్యోగం. కానీ ఆమెకు అక్కడ సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతవరకు ఇంటి నుంచి పని చేసిన ఆమె వొక నిర్దిష్ట స్థలంలో కార్ఖానాలో పని చేయడం వల్ల హక్కుల కోసం పోరాడుతుంది. తన హక్కులేమిటో, తనేంటో తన శ్రమ శక్తి యేమిటో ఆమె అక్కడ తెలుసుకోవడం మొదలెట్టింది. బయటి ప్రపంచం తెలీని మహిళలు కార్మికులయ్యారు. సమ్మెను విజయవంతం చేశారో లేదో పక్కనపెడితే వొకరి కష్టాలు మరొకరు తెలుసుకున్నారు. పరస్పరం సహానుభూతి ప్రకటించుకున్నారు. సహోదర భావం పెంచుకున్నారు. గుండె నిండా నవ్వులు పంచుకున్నారు. సాధారణ మహిళలు కామ్రేడ్స్ గా మారిన క్రమాన్నంతటినీ ఆ అధ్యాయంలో చూస్తాం. రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం మిన్న అని నేహా అద్భుతంగా నిరూపించింది. 

ఈ పుస్తకం నేహా తొలి రచన అంటే నమ్మలేం. సయ్యదా జీవితంతో పాటు ఢిల్లీ శివారు పారిశ్రామిక వాడల్లో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల జీవితం పోరాటాన్ని వర్ణించడమే కాకుండా, సమాంతరంగా ఆమె దేశ రాజకీయ సామాజిక చరిత్రను మేళవించి రికార్డు చేయడంలో ఆమె చూపిన నేర్పు అద్వితీయం. 

1988 లో సయ్యదాకు పెళ్లయినప్పుడే దేశంలో యెన్నికల్లో పాల్గొనడానికి ఓటు హక్కు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. పుస్తకం చివరికి వచ్చేసరికి 2020 నాటికి సీఏఏ వచ్చింది, ఎన్ ఆర్ సి వచ్చింది. ఓటరుగా నమోదు చేసుకోవడం దగ్గర నుంచి, doubtful – సందేహాస్పద ఓటరుగా మారి, చివరికి పౌరసత్వమే కోల్పోయే స్థితి వరకు గడిచిన దేశ మైనారిటీల చరిత్రతో సయ్యదా జీవితాన్ని ఆమెలాంటి మరెందరివో జీవితాల్ని ముడిపెట్టి రాసిన రచనా శిల్పం అమోఘం. మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, కనీస వేతనం, సమాచార హక్కు (Right to Information), విద్యా హక్కు (Right to Education), మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన నిర్భయ వంటి చట్టాల అమలు, ఆధార్ కార్డుల పంపిణీ, పోఖ్రాన్ అణుపరీక్షలు జరిపిన భారత్ ని అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకోవడం, తొలి మహిళా రాష్ట్రపతి ఎంపిక, మంగళయాన్ ప్రయోగం… యిలా యెన్నో సామాజిక రాజకీయ ఘటనల్ని యెదుగూ బొదుగూ లేని కోట్లాది సయ్యదాల జీవితాల ముందు పెట్టి పోల్చి చూసినప్పుడు సమ్మిళిత అభివృద్ధి శాస్త్ర సాంకేతిక పురోగతి మహిళా సాధికారత వంటి పదాలు యెంత అర్థ రహితాలో చెప్పకుండానే చెప్పినట్లయింది. 

అదే విధంగా అధ్యాయాల మధ్యలో సందర్భోచితంగా వాడిన మహనీయుల కవిత్వ పంక్తులు పాపులర్ హీరోల సినిమాల ప్రస్తావన వాటిలోని పాటల పంచ్ డైలాగుల వుటంకింపులు పాఠకుల్ని తన కథనంతో మమేకం చేయడానికే కాదు ఆ యా స్థల కాలాల్లోకి తీసుకుపోడానికి బాగా తోడ్పడ్డాయి. అందువల్ల జీవిత చరిత్ర కాల్పనిక సృజనాత్మక రచన లక్షణాలను సంతరించుకుంది.

తనకు పెద్దగా రాజకీయాలు తెలియవు, ఆర్థిక శాస్త్రం తెలియదు, తను చరిత్రకారిణిని కాదు అని నేహా దీక్షిత్ అంటారు కానీ ఆమె రచనలో దేశ రాజకీయాల్ని శాసించే ఆర్థిక కోణం చాలా బలంగా వ్యక్తమైంది. బెనారస్ లో మతవిద్వేషాలు చెలరేగినప్పుడు చేనేత కార్మికుల మగ్గాల్ని ధ్వంసం చేశారు, యేరి యేరి వెతికి వెతికి ముస్లింలకు సంబంధించిన ఆర్ధిక వనరులపైన దాడి చేశారు, వొక్క బెనారస్ లోనే హిందూత్వవాదులు ‘మినీ పాకిస్తాన్’ అని పిలిచే లోహ్తా మదనపుర ప్రాంతంలో వేలాది మగ్గాలు బూడిదయ్యాయి. ‘చేనేత అభివృద్ధి కార్యాలయం వారు ప్రచురించిన ఆధికారిక సర్వేల ప్రకారం1970లలో 124 లక్షల చేనేత కుటుంబాలు ఉంటే 1995 నాటికి ఆ సంఖ్య 64 లక్షలకు పడిపోయింది’. అంటే అన్ని లక్షల మంది యేమయ్యారు? దాడులు యెంపికగా ముస్లిం కమ్యూనిటీ పైనే యెందుకు జరిగాయి? ఈ ప్రశ్న బలంగా ముందుకు వస్తుంది. ఆ సందర్భంలో అక్కడొక హిందూ మిత్రుడు ‘పడుగు- పేకలు విడిపోతున్నాయి’ అంటాడు. అతను ఆ మాట 1991లో అన్నాడు. పడుగూ పేకలను యెవరు యెందుకు విడదీశారు? విచ్చిపోయిన సమాజంలో మళ్లీ పడుగుపేకలని కలిపి కుట్టడానికి మనమేం చేయాలి అన్న ఆలోచనకు పురికొల్పుతుందీ పుస్తకం ముగింపు. వారణాసి పవిత్ర గంగా తీరం నుంచి పొట్ట చేతబట్టుకొని ఢిల్లీ నగరం అంచుల్లో జమ్నా పార్ (యమున వొడ్డు) కి చేరుకున్నా సయ్యదా కుటుంబానికి అవమానాలు ఆగలేదు. వివక్షలు ముగియలేదు. తలాష్ లు తొలగలేదు. అభద్రత అంతం కాలేదు. పైగా మత విద్వేషం పెచ్చయ్యింది. చివరికి దాడులు రాజదండం ధరించాయి. మెజారిటీ మతస్తుల ఆమోదం సాధించాయి. కుల మత ఆధిపత్య రాజకీయాలు ఫాసిస్టు రూపం సంతరించుకున్నాయి. 

ఈ పుస్తకంలో నేహా దీక్షిత్ పూనికతో చేసిన పని యేమిటంటే సయ్యదా జీవితాన్ని చిత్రిస్తూనే ఆమె జీవితాన్ని ప్రభావితం చేసిన 30 సంవత్సరాల భారతదేశ చరిత్రని విమర్శనాత్మకంగా వీక్షించింది. రెండు సీట్లు 80 గా ఆ తర్వాత 120 గా పెరిగి చివరిగా అధికారంలోకి రావడం వరకు జరిగిన మెజారిటీ మతతత్వవాదుల రాజకీయ కుట్రని ఆమె నిశితంగా ఖండించింది. బాబ్రీ విధ్వంసం జరిగిన 1992 నుంచి మధ్యలో 2002లో గుజరాత్ అల్లర్లు, తర్వాత 2020 లో షాహిన్బాగ్ లో ఎన్ ఆర్ సి అమలుకు వ్యతిరేకంగా చేసిన స్త్రీల పోరాటం వరకు జరిగిన అనేక ఘటనల్ని లౌకిక ప్రజాస్వామిక దృక్పథంతో ఆమె విశ్లేషించింది. రాజకీయ అపరిపక్వత కారణంగా చేసిన నోట్ల రద్దు, కరోనా కాలంగా అర్ధాంతరంగా ప్రకటించిన లాక్ డౌన్ కోట్లాదిమంది అసంఘటిత కార్మికుల జీవితాల్ని ఎలా నాశనం చేసిందో సయ్యదా లాంటి స్త్రీలను నిర్దిష్ట నిదర్శనంగా చూపి వివరించింది. మతం కారణంగా పరాయికరణకు గురవుతున్న, మతవిద్వేషం కారణంగా విస్థాపనకు గురవుతున్న యెందరో అభాగ్యుల జీవితాల్ని కళ్ళకు కట్టింది. “భాగో! భగావో!” అనే స్లోగన్ తో, “గోరక్షక సమితి’ పేరున, “కన్యా పరిరక్షణ సమితి” పేరున, “లవ్ జిహాద్” పేరున యిలా అనేక న్యారేటివ్స్ మధ్య ముస్లిం స్త్రీలు పురుషుల జీవితాలు యెంత అభద్రతకు గురవుతున్నాయో తెలియజేస్తూ సమకాలీన చరిత్రకు దర్పణం పట్టింది. సయ్యదా పెద్దకొడుకు షాజిబ్ లవ్ జిహాద్ అనే ముద్రను యెదుర్కొని, చివరికి ప్రాణాలరచేత బట్టుకొని కుటుంబాన్ని వదిలేసి యెక్కడికో పారిపోవాల్సి వస్తుంది. చిన్న కొడుకు సల్మాన్ ముస్లిం అయిన కారణంగా పోలీసుల రికార్డుల్లో హిస్టరీ షీటర్ గా మారి మసీదు గోపురం కింద పడి చనిపోతాడు. 

1996 సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు నాలుగు ఐదు అంశాల ఎన్నికల ఎజెండాతో వాజపేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అది యెక్కువ కాలం మనలేదు. 13 రోజులు మాత్రమే వుంది. అంటే రామశిలాన్యాసం పేరుతో రెండు సీట్లతో మొదలై రామ మందిర నిర్మాణానికి హామీ ఇస్తూ, 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెబుతూ, ఉమ్మడి పౌరసత్వాన్ని అమలుచేస్తామని ప్రకటించి అఖండ హిందూ రాష్ట్రాన్ని యేర్పాటు చేస్తామని రెచ్చగొట్టి గోవధ నిషేధిస్తామని చెప్పి యిలా యెన్నో హామీలతో, హిందువులకు మాత్రమే ఇక్కడ చోటుంది, హిందువుల జీవితాలు ఖత్రాలో/ప్రమాదంలో వున్నాయని భయపెట్టే నరేటీవ్ లు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా ప్రచారం చేస్తూ అందుకు కారణమైన ముస్లింలకు యీ దేశంలో చోటు లేకుండా చేయడానికి సంఘ పరివార శక్తుల ప్రచ్ఛన్న ప్రయత్నాల్ని నేహా యీ పుస్తకంలో బట్టబయలు చేసింది. “ప్రపంచ చరిత్రలో ‘చెదపురుగులు’, ‘కీటకాలు’, ‘పిచ్చికుక్కలు’, ‘బొద్దింకలు’ అనే పదాలను ఏ సమూహాలను ఉద్దేశించి వాడినా వెనువెంటనే మారణహోమాల జరిగేవ”ని సయ్యదా జీవితాన్ని నేపథ్యం చేసుకొని తారీఖులు దస్తావేజులతో రుజువులు సాక్ష్యాలతో సవివరంగా తెలియజేసింది. 

సయ్యదా జీవితాన్ని రికార్డ్ చేయడానికి నేహా దీక్షిత్ దాదాపు 9 సంవత్సరాలు పనిచేసింది. 900 మందితో ఇంటర్వ్యూ చేసి, వాళ్ల జీవితాల్ని ఆమె అధ్యయనం చేసింది. ఈ తొమ్మిది వందల మంది కూడా అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులు. గంటల తరబడి వారితో సంభాషించింది. అధికార అనధికార రికార్డులు పరిశీలించింది. చట్టుబండలైన చట్టాల్ని చదివింది. పత్రికల్లో యెదో వొక మూల అప్రధానంగా అచ్చయిన వార్తాల్ని వడపోసి నిజాల్ని నిర్ధారించింది. ప్రభుత్వాల మోసపూరిత సంక్షేమ పథకాలు అవకతవకగా అమలయ్యే/అమలుకాని వైనాన్ని బహిరంగపరచింది. ఈ కథనాలు రాస్తున్నప్పుడు నేహా హిందూ ఆధిపత్య శక్తుల నుంచి యాసిడ్ దాడులు చేస్తామనీ గ్యాంగ్ రేపులు చేస్తామనీ బెదిరింపులు యెదుర్కొన్నారు. ఆమె యింటిలోకి బలవంతంగా చొచ్చుకుని పోయే ప్రయత్నాలు జరిగాయి. కానీ మతవాద రాజకీయ దుండగులకు యెదురుగా ఆమె ధైర్యంగా నిలబడింది. నిజాయితీ నిబద్ధతలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ‘అభివృద్ధి కథనంగా ప్రపంచానికి ఢంకా మోగించి చెబుతున్న దాని వెనకాల ఉన్న మత ఆధిపత్య రాజకీయాల స్వరూపం, అందులో దాగిన చీకటి కోణాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని పాఠకులకు కలగజేసింది’ (రామచంద్ర గుహా).

అయితే నేహా పరిశోధనాత్మకంగా నమోదు చేసిన యీ చరిత్ర వొక సముదాయానికి మాత్రమే చెందినది కాదు. మొత్తం మనకు తెలియని భారతదేశాన్ని మనకు తెలియని కఠోర వాస్తవిక జీవితాల్ని మనముందు ఆమె ఆవిష్కరించారు. రమాసుందరి తెలుగు అనువాదం చాలా సులభంగా వుంది. హాయిగా సాగింది. మలుపు బుక్స్ ప్రచురించిన యీ పుస్తకం తప్పక చదవండి! దేశ రాజధాని ఢిల్లీ అంచుల్లో వెలసిన మరో ఢిల్లీ కలవరపెడుతుంది. మన దేశపు మరో ముఖం మనకు అర్థమవుతుంది. దేశ పౌరుల అభద్ర జీవితాలు గోచరమవుతాయి. దేశంలో యీ రోజున విద్వేషానికి జవాబుగా ప్రేమను పంచాల్సిన అవసరం తెలిసి వస్తుంది. మనుషుల మధ్య మతాల మధ్య కట్టుకున్న గోడల్ని పగుల గొట్టడానికి మనమేం చేయాల్నో అవగతమవుతుంది. నేహా దీక్షిత్ ఆశించినది కూడా అదే. భారతదేశం యెలా వుండాలి/యెలా వుండకూడదు! అనేది విశదం చేసుకోవాలంటే దేశంలోని ప్రతి పౌరుడూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం సయ్యదా X.

సయ్యదా కూతురు రేష్మ యింటి దగ్గర తల్లికి పీస్ వర్క్ లో సహాయం చేసింది. తల్లిలాగానే యిళ్లల్లో బట్టలుతికింది. బాసండ్లు తోమింది. పాచి పనిచేసుకుంటూనే చదువుకుంది. ముస్లింలు తయారుచేసిన ఆహారం తినకూడదు, వుత్పత్తి చేసే సరుకులు వాడకూడదు వంటి ప్రకటిత అప్రకటిత నిషేధాల మధ్య కొన్ని సముదాయాలకు వుపాధి రంగం తలుపులు మూసుకుపోయినప్పుడు సేవా రంగం కిటికీలు తెరిచింది. రేష్మ లాంటి యువతులకు షాపింగ్ మాల్స్ లో హోటల్స్ లో ఆసుపత్రుల్లో కాల్ సెంటర్స్ లో డిజిటల్ సెంటర్స్ లో మళ్ళీ కొత్త జీవితం మొదలవుతుంది. సయ్యాదా సయ్యాదాలా అనేకులు బతుకు పరుగు పందెంలో అవిశ్రాంతంగా పరుగెడుతూనే వుంటారు. అది రిలే మారథాన్ రేస్. పుస్తకం పూర్తయ్యేటప్పటికి బెటాన్ సయ్యాదా కూతురు రేష్మ అందుకుంది. పందెం యిప్పుడు మరింత జటిలమైంది. ప్రాణాంతకమైంది. కొత్త హర్డిల్స్ తోడయ్యాయి. Across the country నడుస్తోన్న cross country race లో మనందరం భాగస్వాములమే. అనుక్షణం యిన్ని అభద్రతల మధ్య నలుగుతూ కూడా సయ్యదా సంక్షుభిత జీవితాన్ని యెలా ముందుకు నడిపింది అన్న ప్రశ్న రచయితనే కాదు పాఠకుల్ని సైతం వెంటాడుతుంది. భవిష్యత్తు మీద భరోసానే ఆమెకున్న ప్రతిఘటనా ఆయుధమని అనేక ఘటనలు నిరూపిస్తాయి. 

ఈ నగరంలో అతనే ఫిర్యాదీదారుడు, అతనే జడ్జి 
కాబట్టి నేను తప్పక నేరస్తుడిగా నిరూపించబడతాను.

– అమీర్ కాజల్ బాష్

విషాదం యేమంటే యిప్పుడు న్యాయస్థానాల్లో జడ్జీలే ఫిర్యాదుదారులయ్యారు. పాలకవర్గాల ఫాసిస్టు రాజకీయాలకు గుత్తేదారులయ్యారు. వారి సమక్షంలో నేహా దీక్షిత్ లాంటి వారు ప్రవేశపెట్టిన సయ్యదా లాంటి సాక్షి కథనాలు తారుమారవుతాయి. వక్రీకరణ చెందుతాయి. పాలకులు ముందుగా రాసిచ్చిన ఆరోపణల స్క్రిప్టే తీర్పు అవుతుంది. ప్రశ్నిస్తే మనం నేరస్తులమౌతాము. అయినా సత్యాన్వేషణ ఆగదు అనే భరోసానే సయ్యదా జీవితమైనా నేహా రచనా దీక్ష అయినా మనకు అందజేస్తుంది. కలలన్నీ కాటగలిసి ఆశలన్నీ అట్టగట్టిన సంక్షోభకాలంలో చీకటి సొరంగం చివర వెలుగు రేఖను హామీనిచ్చే అపూర్వమైన పుస్తకం అందించినందుకు నేహా దీక్షిత్ కూ అనువాదకురాలు రమాసుందరికీ పబ్లిషర్ మలుపు బుక్స్ కీ కృతజ్ఞతలు.

 [సయ్యదా X ఓ అపరిచిత భారతీయురాలు కథ, రచన: నేహా దీక్షిత్, అనువాదం: రమాసుందరి, ప్రచురణ: మలుపుబుక్స్, డిసెంబర్ 2025, మెయిల్ అడ్రస్ : malupuhyd@gmail.com, వెల: రూ. 390, కాపీలకు: 6305991831 ]

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply