శాంతి సందేశ గీతం

కొండల నుండి గుండెలు పిండే
విషాద రాగం వినిపిస్తుంటే
మండే ఎండలు ఆశలు పండే
వసంత రుతువై కనిపిస్తుంటే
గుండె గొంతులో శాంతి సమతలు
పాడుతు ఉంటాను
ఆకుపచ్చని అడవుల కొరకే
తపిస్తు ఉంటాను
ఓ… గాలి నీవే సంగీతం అనుకుంటా
ఏ… ఎదలైనా కరగాలని కోరుకుంటా

యుద్ధం చేసిన గాయాలన్నీ
శాంతికి మాన్పే శక్తే ఉంటే
నిద్దుర లేని రాత్రులు ఎన్నో
ఉదయం సాక్ష్యం చెబుతుంటే
కడలిలొ రేగిన కల్లోలాన్నే
పాడుతు ఉంటాను
తుఫాను తీరం దాటాలని
కలలే గంటాను
ఓ… గాలి నీవే సంగీతం అనుకుంటా
శిలలైనా కరిగే సందేశం పాడుతుంటా

  • 08 ఏప్రిల్, 2025

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply