విత్ యువర్ పర్మిషన్

(Marriage is not an excuse to Rape!)

చాప్టర్ -1

వెన్నెల చల్లగానూ లేదు, వేడిగానూ లేదు. వెన్నెల జలదరింపుగా ఉంది. నొప్పిగా ఉంది. గాయంగా ఉంది.. దుఃఖం దుఃఖంగా ఉంది. కన్నీళ్లు కూడా నొప్పిగా ఉన్నాయి. మెదడంతా పచ్చి పుండై నొప్పిని నర నరంలో పాకిస్తుంటే కన్నీరు హృదయంలోకి, చర్మం మీదా ఇంకిపోతూ దేహం నొప్పితో ముడుచుకు పోతున్నది..

కన్నీరెందుకు.. ఈ నొప్పి ఎందుకు మరి? నీ కోసమా బిపిన్.. తెలీదు. ఈ అవమానం జరిగినందుకా.. ఆడదాన్నైనందుకు.. లేదా ఆడదాని దేహం నాకున్నందుకా ఇలాంటి గాయం ? నాకేనా.. ఒక్క నాకేనా. అందరికీనా.. ఆడవాళ్ళందరకీనా లేదా కొందరు ఆడవాళ్లకేనా? నువ్వెందుకో బాగా గుర్తుకు వస్తున్నావు నదికి సముద్రం జ్ఞాపకం వచ్చినట్లు, పూలకు తనని పట్టించుకోకుండా తన పక్కనించే వెళ్లిపోయిన చిరుగాలి జ్ఞాపకం వచ్చినట్లు, మండే ఎడారికి వెన్నెల జ్ఞాపకం వచ్చినట్లు, ఆకలేసిన పాపాయికి తల్లి పాల పరిమళం జ్ఞాపకానికి వచ్చినట్లు, నాకు.. నా బిపిన్ చంద్రా నువ్వే జ్ఞాపకం వస్తున్నావెందుకు? నా గాయం మాన్పే మందువనా నువ్వు. ఎందుకు మరి? నిన్ను కోల్పోయినందుకా.. లేక నా జీవితం ఇలా అగాధంలో పడిపోతున్నందుకా.. ఎందుకు..? నేను తీసుకున్న నిర్ణయం సరైంది కానందుకా? ఎంత నమ్మకమో కదా నీకు నా మీద. అది పూర్తిగా ధ్వంసం అయినందుకా మరి? ఎందుకు బిపిన్.. నువ్వనే వాడివి గుర్తుందా.. “మహీ నీతో ఉంటే చాలు నేను కళ్ళు మూసుకొని లేదా గుడ్డివాడిగానైనా సరే నీ చేయి పట్టుకుని నడిచేస్తాను” అని అంత నమ్మకం నీ మీద నాకని?” అదంతా వొట్టిదే.. ఎంత నమ్మక ద్రోహం చేశాను నీకు? నేను ఓడిపోయాను.. నిన్నూ ఓడించాను.. కాదు.. కాదు మోసం చేశాను. ఒక్క సారి కాదు చాలా సార్లు ఓడిపోయాను నీ దగ్గర.. అమ్మ నాన్న దగ్గర.. ఇప్పుడు నాతో నేను! అలసిపోయా బిపిన్ పూర్తిగా అలసిపోయాను సేద తీరాలని ఉంది. నా వునికి నాకే తెలీనంతగా గాఢంగా నిద్రపోవాలని ఉంది. అసలు మెలకువ రాని.. నొప్పే తెలియని సుషుప్తిలోకి వెళ్లిపోవాలని ఉంది. నాకు ఏదీ గుర్తు ఉండకూడదు.. ఏమైనా చెయ్యి బిపిన్ అమ్నీషియాలోకి పంపేయ్ నన్ను. నిన్నే కాదు నన్ను నేను కూడా గుర్తు పట్టని స్థితిలోకి తీసికెళ్ళిపో. ఏం చెయ్యను చెప్పు బిపిన్? ఇక జీవితంలో నిన్ను కలవనని.. నువ్వూ నన్ను కలవద్దని ఖచ్చితంగా అనుకుని విడి పోయామా.. లేదా నిన్ను నిర్దాక్షిణ్యంగా నా నుంచి విడగొట్టుకున్నానా.. కానీ చూడు మళ్లీ నీ దగ్గరికే పరిగెత్తుకుంటూ రావాలని ఉంది. నీ వొళ్ళో తల్లి వొళ్ళో ముడుచుకు పడుకునే పాపాయిలా పడుకోవాలని ఉంది. నా తలని నీ హృదయానికి సున్నితంగా అదుముకుంటావు చూడూ.. మళ్లీ నువ్వలా చేస్తే నీ గుండె లోపలికి దూరిపోయి శాశ్వతంగా బయటకు రాకుండా అక్కడే ప్రశాంతంగా నిద్రపోవాలని ఉంది. నువ్వంటే మోహం కాదు… నీ ప్రేమ కావాలి.. నీ లాలన కావాలి.. నాకు గౌరవం కావాలి.. నాకూ నా దేహానికి విలువ, మర్యాద కావాలి, అది నీ స్నేహంలో, ప్రేమలో, స్పర్శలో దొరుకుతుంది. నీ చేతులలో మాత్రమే దొరుకుతుంది. అందుకే నా హృదయం వేల మైళ్ళ దూరాన ఉన్న నీ మీద వాలిపోయి ఘుర్నిల్లుతోంది. నన్ను లేపి నీ హృదయానికి హత్తుకోవూ.. బిపిన్.. నా బిపిన్ చంద్రా ఎక్కడున్నావు? నా మీద అలిగి వెళ్ళిపోయావు.. ఎక్కడికో ఆచూకీ కూడా ఇవ్వకుండా. నీ మహిని చూడాలని లేదా.. ఎలా ఉన్నానో తెలుసుకోవాలని లేదా? ఒక్కసారి కనిపించు పోనీ నీ జాడన్నా చెప్పు..

మహిమ వణుకుతున్న వేళ్ళ మధ్యలోంచి కలం జారిపోయింది.. వెక్కి వెక్కి ఏడుస్తూ పుస్తకం మీద వొరిగి పోయింది. తన కథ రాసుకుంటున్న మహిమ ఇక రాయలేక పుస్తకం మూసేసింది. కన్నీళ్ళతో దిండు మీద వాలిపోయింది. ఆపలేని దుఖంతో కదిలి, కదిలి ఏడవసాగింది. ఇంతలో తలుపు తట్టిన చప్పుడు మెల్లిగా మొదలయింది. ఉలిక్కి పడింది మహిమ. చరణ్ తలుపు తడుతున్నాడు. మహిమ దుఃఖం కాస్తా క్రోధంగా మారింది. “మహీ ప్లీజ్ వోపెన్ ద డోర్.. ఐ కాంట్ స్లీప్ అలోన్ ప్లీజ్” అంటూ మునివేళ్లతో తడుతూనే ఉన్నాడు చరణ్. తాగినట్లు మాట తూలుతున్నది. “జస్ట్ గెట్ లాస్ట్.. తెరవను వెళ్లిక్కడ్నించి” మహిమ కోపంగా అరిచింది. అప్పటిదాకా ముని వేళ్ళతో తడుతున్న వాడల్లా అరచేత్తో చరిచి, చరిచి ఒక్కసారిగా బహుశా కాళ్ళతో ఒక్క తాపు తన్ని ఏదో బూతు మాట కూడా అన్నట్లున్నాడు మెల్లిగా ఆగిపోయింది చప్పుడు. తన గదికి కూడా వెళ్లిపోయినట్లున్నాడు తలుపు దడాలున వేసిన చప్పుడు. చెవులు గట్టిగా మూసుకున్న మహిమ అలా కాదని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినసాగింది. మహిమకి ఇది అలవాటే. అతను వెళ్లిపోయాడని రూఢీ చేసుకున్న మహిమ ఇయర్ ఫోన్స్ తీసేసి తల పట్టుకుని కూర్చుంది. రోజూ ఇదొక పీడ అయిపోయింది ఉదయం పూట ఒక రకమైన వేట.. రాత్రిపూట ఈ రకమైన వేట.. ఎంత తప్పించుకోవాలన్నా వీలు కాదే.. రోజూ యుద్ధం చేయాలి. మ్యారేజ్ ఈస్ ఎ హెల్ పెళ్లి, సెక్స్, సంస్కృతి, భర్త, దాంపత్య బంధం, ఇల్లు, పిల్లలు, సంసారం అంతా బులిట్. చెప్పెయ్యాలి ఇంట్లో ఇంక ఈ నరకం వద్దు. ఎనిమిది నెలలైంది తానిక భరించలేదు. చాలు మెదడులో వొత్తిడి మత్తడి తెగుతున్నది. ఈ క్షణం వెళ్లిపోవాలి.. వెళ్లిపోవాలి కానీ… కానీ.. కుటుంబ పంచాయితీలో అనుకున్న పన్నెండు నెలల ఒప్పందం పూర్తవ్వాలి. ఈ లోపల ఈ చెత్తను భరించాల్సిందేనా?

మహిమ నిద్ర రాక చాలా సేపు తన్లాడింది. మధ్య మధ్యలో చరణ్ అడుగుల సవ్వడి వినిపిస్తోంది. తలుపు అడుగు భాగం నుంచి అతను వచ్చి నిలబడ్డం, సన్నగా వేలి చివర్లతో తలుపు టకటక లాడించడం, చిరాగ్గా కాలిని నేలకు తన్ని వెళ్లిపోవడం గమనిస్తూ.. నిద్రపట్టని మహిమకు తెల్లవారుజామున ఏ ఐదు గంటలకో నిద్ర పట్టడం అలవాటైపోయింది. రోజుల తరబడి నిద్ర లేకపోవడం ములాన్న ఉదయం పూట చిరాకు, తలనొప్పులతో గడవడం, నిద్ర కోసం అమ్మ ఇంటికి వెళ్ళిపోవడమో.. లేక తప్పనిసరై డాక్టర్ ఇచ్చిన యాంటిడిప్రెసెంట్ మందు వేసుకుని పడుకోవడం మామూలైపోయింది. కానీ ఎన్నాళ్లిలా.. ఈ అభద్రత, భయం, అవమానం, ఏవగింపు కలిగించే పరిస్థితుల మధ్య బతకడం… ఎన్నాళ్ళు?

“ఎనిమిది నెలలు అయిపోయింది కదా అమ్మా.. అర్థం చేసుకో రాత్రంతా తలుపు కొడుతూనే ఉంటాడు. ఎందుకు వేరే రూం అంటే.. నీకు తెలీదూ? నిద్రలో మీద పడి ముద్దులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. చేతులు పొరపాటున వేస్తున్నట్లు నా బ్రెస్ట్ మీద వేస్తాడు. అసహ్యంగా కాళ్ళు నా తొడల మధ్య వేస్తుంటాడు.. ఇదంతా నిద్ర నటిస్తూ చేస్తున్నట్లు నాకర్థం కాదనుకుంటాడు. మంచం మీద కూర్చుని ల్యాప్
టాప్లో పోర్న్ వీడియోస్ నాకు కనపడేలా చూస్తాడు. ఎంతసేపని ఒక వైపే తిరిగి పడుకోవాలి.. ఎంత సేపూ ఎప్పుడు ఏం చేస్తాడో అని భయంతో మెలకువగా ఉండాలి? అమ్మా.. అమ్మా.. ఒక విషయం చెప్పు ముందు.. పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే ఒక రేపిస్టు పక్కన పడుకుని ఉన్నానన్న వాస్తవం ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు ఊహకైనా అందుతుందా అమ్మా… నాన్న నిన్ను అంత ప్రేమగా చూసుకుంటాడు కదా చెప్పు” మహిమ బాధలో గొంతు గీర బోతుంటే కోపంగా అరిచినట్లే అడిగినా.. ఆమె గొంతులో వ్యంగ్యం. ఒక శ్లేష కాత్యాయనికి చేరనే చేరాయి.. మహిమ వాళ్ళమ్మ కాత్యాయని ఉలిక్కి పడింది ఒక్కక్షణం ఆమె చేతిలో ఉల్లిపాయలు కోస్తున్న కత్తి ఆగిపోయింది. కారే కన్నీళ్లు కొంగుతో తుడుచుకుంది “అబ్బా ఏం మంట.. ఏం మంట ఈ ఉల్లిపాయలు” అంటూ… ‘ఉల్లిపాయల మంటేనా.. గుండె మంటనా అమ్మా.. అన్నీ దాచుకుంటావెందుకే అమ్మా.. నాకు తెలీదా… నీ బిడ్డనమ్మా నేను ఎన్ని సార్లు నాన్న నీతో గొడవపడలేదు.. నువ్వెన్ని సార్లు ఇట్టా కన్నీళ్లు తుడుచుకొలేదు చూస్తూనే పెరిగాగా నేను.. అమ్మమ్మ కూడా ఎంత అడిగినా చెప్పేదానివి కాదు. అంతా బాగానే ఉందే అమ్మా.. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు బెంగపడకు అనే కదా చెప్పి పంపేసేదానివి. అయినా సరే “నా కూతుర్ని బాధ పెడితే ఊరుకునేది లేదు అల్లుడూ.. ఏవనుకుంటున్నావో” అని నాన్నని బెదిరించి మరీ వెళ్ళేది కదా అమ్మమ్మ? ఇప్పటికీ నువ్వు అలానే ఉన్నావు అన్నీ మౌనంగా భరిస్తూ.. దేనికీ సమాధానం చెప్పవు.. సరే ఇక నా సంగతి విను. పంచాయితీలో ఏం మాట్లాడుకున్నాం చెప్పు? నాకు ఇష్టం లేకుండా నా వొంటి మీద చెయ్యి వేయకుడదనే కదా.. నేను నో అంటే నో అనే తీసుకోవాలి కదా.. కానీ ఈ చరణ్ వున్నాడు చూడూ.. ప్రతిరోజూ దాన్ని మర్చిపోతాడు లేదా మర్చిపోయినట్లు నటిస్తాడు. సిగ్గు లేకుండా నాకు దగ్గరయ్యే ప్రయత్నమట ఇదంతా. ఈ వెకిలి చేష్టలతో నన్ను గెలవాలని చూస్తున్నాడు. నేనేంటో తెలిసి కూడా. నా తోటి కాకనే వేరే బెడ్రూంకి మారిపోయానా..? అయినా వదలటం లేదు రాత్రంతా నా గది బయటే తచ్చాడుతూ నన్ను పిలుస్తూ.. తలుపు తడుతూ.. తాగి అరుస్తూ ఉంటాడు. పక్క ఫ్లాట్ వాళ్ళు ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చారు తాగి అర్థరాత్రిళ్ళు ఈ అరవడాలు ఏవిటని? ఎలాగమ్మా ఇలా ఉంటే..?” మహిమ ఆవేశంగా.. బాధగా చెబుతోంది. కాత్యాయని ఉల్లిపాయల్లో నుంచి బెండకాయలు కోయటంలోకి దిగింది. డైనింగ్ టేబుల్ మీద కూరగాయలు పరిచి ఉన్నాయి. మహిమ కాటన్ కిచెన్ టవల్ తో కడిగిన బెండకాయలను తుడిచి తల్లికి అందిస్తున్నది. కాత్యాయని ముఖంలో ఏ భావం ఉందో చెప్పడం కష్టంగా ఉంది. కాఠిన్యమో.. లాలిత్యమో.. వేదనో ఏ భావమూ వ్యక్తీకరించ వీలులేని శిలాశదృశ్య భావం ఆమె ముఖాన్ని ఆవరించి ఉన్నది. “నువ్వే అతగాడ్ని మార్చుకోవాలేమో కదా”? శిల్పి ఉలితో చెక్కినప్పుడు రాలిన రాతి ముక్క నొప్పి తెలియనివ్వని శబ్దం చేసినట్లు ఉన్నది ఆమె గొంతు.. కొంచెం కరుకుగానూ.. మరికొద్ది లలితంగానూ. మహిమ తల్లి మొఖంలోకి.. తన చూపుల్ని తప్పించుకుంటున్న తల్లి చూపుల తీగల్ని వొడుపుగా పట్టుకుంటున్నట్లు చూస్తూ.. “ఎలాగమ్మా నీలా మౌనంగా అన్నీ భరిస్తూనా..?” మహిమ తల్లి ముంచేయి గట్టిగా పట్టి ఆపుతూ నిలదీస్తున్నట్లుగా అడిగింది. “ఎలాగమ్మా చెప్పు అతనెలా మారతాడు? కొద్దిగా కూడా వోపికా, సహనమూ నా పట్ల.. పోనీ తన పట్ల గౌరవం ఏమీ లేవు. అతను ఎప్పుడూ మారతాడు అంటే.. నేను అతనికి సెక్స్ లో సహకరించినప్పుడు అప్పుడే నన్ను అతను ప్రేమిస్తాడు లేదా గౌరవిస్తాడు. అంతే కానీ తనంతట తాను తన తప్పు తెలుసుకుని… పశ్చాతాపం చెంది పని చేయడం లేదు, తను సరైన పనే చేసినట్లు అనుకుంటున్నాడు. అతని ప్రతి చేష్ట, మాట అట్లానే ఉంటున్నాయి. నా వల్ల కాదు అతనితో సెక్స్ అంటేనే నాకు అసహ్యం. అసలు ఇది చెప్పు రేపిస్టు భర్తతో రోజూ రేప్ చేయించుకోమంటావా చెప్పు నావల్ల కాదు అతని పట్ల నా అసహ్యం తగ్గేదాకా.. అతను పశ్చాత్తాపం చెందే దాకా అతను అతని లిమిట్ లో ఉండాలి అంతే.. నువ్వు చెప్పు అతనికి” అంది మహిమ ఆవేశంగా. ‘నేనెలా చెవుతానే ఈ సిగ్గులేని విషయాలు.. అల్లుడికి’..? ఈ సారి కాత్యాయని కాస్త కోపంగానే అన్నది. ఎక్కడో కూతురు తనని.. తన జీవితాన్ని నిలేస్తుంటే అహం దెబ్బతిన్నట్లుగా ఉంది ఆమెకు.

“ఏం నాకు చెబుతున్నావుగా మరి ఒక రేపిస్టుతో కాపురం చేయమనీ.. అంటే రేప్ చేయించుకోమని అసలెలా చెప్పగలుగుతున్నారు మీరంతా అలా? మరి అతనికి చెప్పలేవూ.. మా అమ్మాయితో పశువులా కాకుండా మనిషిలా ప్రవర్తించు లేకపోతే ఊరుకోను ఆ తరువాత నీ ఇష్టం.. మహిమ ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండాలి నువ్వు అని.. చెప్పలేవూ? నాకిష్టం లేక పోయినా చెల్లి పెళ్ళి కోసమనో.. నాన్న అనారోగ్యమనో.. నీ మనశ్శాంతి కోసమనో మీ అందరికోసం ఉండే ప్రయత్నం చేస్తున్నాగా ఎనిమిది నెల్ల నుంచీ ఈ యాతన భరిస్తున్నాగా”? రెట్టించి.. రెట్టించి అడుగుతున్న మహిమ ప్రశ్నలకు కాత్యాయని దగ్గర సమాధానం లేనేలేదు. ఆమె కూడా కూతురి వేదనని అనుభవిస్తూనే ఉంది. ఆమె సమాధానం చెప్పకుండా కూరల గిన్నెలని తీసుకుని నిశబ్దంగా వంటింట్లోకి నడిచింది. మహిమ రెండు మోచేతులు డైనింగ్ టేబుల్ మీద ఆనించి అరచేతుల మధ్య తన నుదుటికి రెండు వైపులా గట్టిగా అదిమి.. అలానే తల పట్టుకుని కూర్చుంది. పెదాలు నుదురు అదిరిపోతుంటే.. కారుతున్న కన్నీళ్లు దాచి పెట్టుకుని లేచి, హాల్లోనే ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి, నల్ల తిప్పి మొఖం మీద ఎండి కాలిన ఎడారి నేల మీద ఆకాశం చల్లని వర్షపు ధారలు కుమ్మరించినట్లు వేడికి అదిరిపోతున్న నుదురు, కళ్ళు, మాడు మీద అర చేతులతో వేగంగా టక టకా నీళ్లు కొట్టుకుంది. ఒక రెండు నిమిషాల పాటు ఆగకుండా. ఆ తరువాత చల్లబడ్డట్లు అద్దం వైపు తన ప్రతిబింబాన్ని దీక్షగా చూసుకుంది నల్ల నీళ్ళల్లో.. తన కన్నీళ్ళ ధారలను గుర్తు పట్టి మళ్లీ నీళ్ళు చిమ్ముకుంది మొఖం మీద. నుదుటి మీది తల వెంట్రుకలను సవరించుకుంది. తరువాత మెల్లిగా వంటింటి వైపుకి నడుస్తూ తన ముఖంలో భావాలు తల్లికి కనపడకుండా టవల్ లో మొఖం తుడుచుకుంటూ “నాన్నకి కార్డియాలజిస్ట్ దగ్గర ఎల్లుండి సాయంత్రానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను వస్తాను వెళదాం నాన్నకి చెప్పు ఇక నేను వెళతాను కోచింగ్ క్లాస్ కి టైం అయింది ఏదో బయట తింటాలే బై” అంటూ మహిమ వేగంగా ఇంటి బయటకు నడిచి.. తన ఆక్టివా స్కూటర్ ఎక్కి ముందుకు పోనిచ్చింది.

**

“ప్లీజ్ ఒక్కసారి రా ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం నాకో అవకాశం ఇవ్వు” చరణ్ నుంచి మెసెజీల మీద మేసేజీలు దాదాపు ఒక ఇరవై దాకా ఉన్నాయి. తాజ్ హోటల్లో నైట్ డిన్నర్ కి టేబుల్ రిజర్వ్ చేశాడట. “ప్లీజ్… ఆక్సెప్ట్ ఓన్స్.. ఒక్కసారి… నేను మారిన మనిషిని..’ ఇట్లా రక రకాలుగా పెడుతూనే ఉన్నాడు. “చరణ్ మేసేజీలు చూట్టంలేదట నువ్వే ? డిన్నర్ కి వెళితే ఏమవుతుంది.. దగ్గరెలా అవుతావు అతగాడికి నువ్వు చెప్పు మరి? ఇది ఎప్పటిలాంటి మోటు పద్ధతి కాదు కదా సున్నితంగానే ఉంటాడు కామోసు.. వెళ్లి చూడు నా తల్లివి కాదూ..” కాత్యాయని బ్రతిమిలాడుతున్నట్లే అంటున్నది. మధ్యలో నానమ్మ గొంతు ఏదో చెప్పమని చెబుతున్నది అమ్మకి “వూ.. ఇక ఆపు నేను ఆలోచించుకుంటా” అంటూ మహిమ చిరాగ్గా ఫోన్ పెట్టేసింది. ఇతగాడితో డిన్నర్ చేయాలా తనిప్పుడు? ఎంతో ప్రేమతో తనకి డిన్నర్ ఇస్తున్నాట్ట అంత ఖరీదైన హెూటల్లో అమ్మ మాట్లాడుతుంటే మధ్యలో అందుకుని నానమ్మ అనటం.. ఇలా నాటకాలు ఆడేస్తే అన్నీ మరిచిపోయి అతగాడి తో సెక్స్ కి ఒప్పుకుంటుంది అనుకుంటున్నాడేమో.. చీఫ్ ట్రిక్స్ కాకపోతే? అమ్మకి, నానమ్మకి ఫోన్ చేసి తన మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడతాడు. తనకి దగ్గర కావడానికి తానెంతో నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతుంటాడు. ‘మీ మహిమే కోపరేట్ చేయట్లేదు అంటాడు. అంతేనా.. చరణ్ వాళ్ళమ్మ కూడా అమ్మకి ఫోన్ చేసి విసిగిస్తుంటుంది. “మా చరణ్ కి ఏవి తక్కువయిందని.. ఈ ఖర్మేవిటీ మా వాడికి పెళ్ళై నాక కూడా ఒక తిండి సుఖం లేదు.. వొంటి సుఖం లేదు.. మీ అమ్మాయి వంట కూడా చెయ్యదు తెలుసా.. ఏ పోద్దెక్కాకో లేస్తుందా.. ఏ కార్ను ఫేకులో.. ఓట్సో ఇన్ని పాలల్లో తినేసి రోడ్డెక్కి పోతుందా.. ఇక ఏ రాత్రికో ఇంటికి రావటం.. ఎక్కడికెలుతుందో.. ఎవర్ని కలుస్తుందో తెలియదు. వాడి గురించి ఒక్క క్షణమైనా ఆలోచించదు. ఇట్టా అయితే ఎట్టా కుదురుతుంది చెప్పండి? బలవంతం చేస్తే చేశాడు మా వాడు వయసులో ఉన్నవాడు.. ఒకటా.. రెండా.. ఎకాఏకీ నాలుగు రోజులు శోభనాన్ని ఆపుకున్నాడు మరి.. మీ అమ్మాయి మాటకి విలువ ఇచ్చి ఎవరైనా ఆగుతారా అట్టా? అసలు మగాళ్లు పెళ్లెందుకు చేసుకుంటారనీ.. సెక్సు కోసవు కాదూ? శోభనం గదిలో సినిమా కథలూ.. టీవీ సీరియళ్ళూ చెప్పుకోవటానికి చేసుకుంటారా చోద్యవు కాకపోతే? మీ అమ్మాయి మరీ నాజూకులు పోతున్నది. మన కాలంలో ఇట్టాంటి వేషాలు వేసామా మనం? రక్తాలు కారుతున్నా ఉగ్గబట్టుకుని ఏడుస్తూనో.. మూల్గుతూనో మొగుళ్ళతో కాపరాలు చెయ్యలా? మీరు మరీ ఇట్టా పెంచారేంటి వదినా.. మావాడి జీవితం నాశనవు అయిపోయింది. నాకర్థం కాక అడుగుతా.. ఏవిటసలు.. ఏవిటనుకుంటున్నది మీ మహిమ? కాపురం చేసుద్దా లేదా? ఈ మధ్య వేరే గదిలో పడుకుంటుందిటగా.. ఏం అంత దుర్మార్గుడైపోయినాడా నా కొడుకు? పెళ్లికి ముందు లేదు.. ఇంతలా తాగటం పెళ్లి అయినాకే మొదలెట్టాడు. మహిమ పెట్టే బాధలు పడలేకే… మీ అమ్మాయే మా వాడిని తాగుబోతుని చేసింది. ఏవిటీ మా వాడు రాత్రిపూట అరుస్తున్నాడా.. అలాగేం..? మరి తాగినవాడు మెత్తగా.. మెల్లిగా.. శాంతంగా.. సరసంగా ఎట్టా ఉంటాడూ అంట” చరణ్ తల్లి మాట్లాడుతూనే ఉంటుంది.

ఒక రోజు కాదు దాదాపు రోజూ.. అమ్మ ఫోన్ లేపకపోతే వేరే నంబర్లతో చేసి పట్టుకుంటుంది. అత్తమ్మేనా.. చరణ్ అక్కయ్య సురేఖ.. అమ్మో ఎంత దాష్టీకమో? “ఏవనుకుంటున్నావు నా తమ్ముడిని? వాజ్ఞలా కుక్కని చీదరించుకున్నట్లు చేస్తావేంటి? అంత పెద్ద ఇంజనీరు వాడు వంద మందిని కాదని నిన్ను చేసుకున్నాడని వొళ్ళు బలుపేం నీకు.. నేను నీకంటే ఏడేళ్ళే పెద్ద నేను. ఏం నేను కాపురం చేయటంలా.. అన్నీ వేషాలు కాకపోతే ఎంటిటా? “అక్కా నువ్వన్న చెప్పవే మహికి” అని వాడు అడుగుతుంటే గుండె చెరువై పోతున్నది.. నీవి అన్నీ ముండా వేషాలు కాకపోతే..? ఊర్కోను యావనుకున్నావో.. రేప్ చేస్తే చేయించుకోవే నీ మొగుడేగా వాడు.. దారిన పోయే దానయ్య కాదు కదా అంతగా చచ్చిపోతున్నావు ఇంక ఈ కథలు ఆపు” చూపుడు వేలు ఆడిస్తూ కళ్ళు మిడిగుడ్లు చేస్తూ ఉరిమురిమి చూస్తూ అరిచినట్లే చెప్తుంది సురేఖ. “ఎందుకు చేయించుకోవాలి నా మొగుడైతే చేయించుకోవాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు… దారిన పోయే దానయ్య రేప్ చేసి ఉంటే, ఈ పాటికి కటకటాల వెనుక ఉండేవాడు.. అసలు నీ తమ్ముడి మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది.. సిగ్గులేదూ నీ తమ్ముడు నీతో చెబుతున్నాడా.. మహిని నాతో సెక్స్ లో పాల్గొనమని చెప్పవే అక్కా అని.. నువ్వు రికమెండ్ చేస్తున్నావా.. వేలు పెట్టి మరీ బెదిరిస్తున్నావు ఏం చేస్తావేం వదినా? నేను రేప్ చేయించుకోవాలా.. ఏదో చరణ్ తల దువ్వించుకో అన్నంత తేలిగ్గా? అసలు నీకు రేప్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా వదినా.. నిన్నేవరైనా రేప్ చేశారా.. అన్నయ్య ఎప్పుడైనా రేప్ చేశాడా నువ్వు ఒప్పుకోకపోతే? ముందు వేలు దించు వదినా” అంతే సీరియస్ గా రెట్టించి అన్నది తను. “మీ తమ్ముడు వంద మందిని కాదని నన్ను చేసుకుని ఉండచ్చు అదేం గొప్ప కాదు. నేను వొప్పుకుంటేనే నాతో అతని పెళ్లి అయింది. అదీ గొప్ప కాదు. నాతో మనిషిలా ఉన్నాడా లేడా అన్నదే అసలు విషయం.. ఇష్టపడి పెళ్ళి చేసుకున్నంత మాత్రాన నేను ఒప్పుకోకపోయినా రేప్ చేసెయ్యాలా? పెళ్లి ఏమన్నా భార్యలను రేప్ చేయడానికి దొరికిన పర్మిషనా.. లైసెన్సా? ఎంత మంది అమ్మాయిలు నీ తమ్ముడిని తిరస్కరించారు నీకు తెలుసా అసలు? పోనీ నేను ఎందుకు వద్దనుకుని వెళ్ళిపోయానో అర్థం అయిందా నీకు? నీ తమ్ముడి ఆరడుగుల పొడుగు ఆకారం ఇల్లు, కారు, బ్యాంకు ఉద్యోగం, మీకున్న ముఫ్పై ఎకరాల మాగాణి, చూసి మురిసి నన్నంత అవమానించినా కానీ పడి ఉంటానని మీ ఆశ. నాక్కావాల్సింది అది కాదు… నన్ను.. నా దేహాన్ని ఎలా గౌరవించాడు అన్నదే ముఖ్యం నాకు. అయినా నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దని చాలా సార్లు చెప్పాను వదినా నీకు”? తన ఖచ్చితమైన.. కఠినమైన మాటలకు ఖంగుతిన్న సురేఖ కొయ్యబారిపోయింది.. తన వైపు ఎక్కు పెట్టిన వేలు దించేసింది. అంతే.. ‘చూసావే అమ్మా.. నన్నేవరైనా రేప్ చేశారా అని అడుగుతుంది. దీనికెంత కావరం కాకపోతే.. మా ఆయన నన్నెందుకు రేప్ చేస్తాడే..” గావు కేకలు పెడుతూనే భోరుమని ఏడుస్తూ అంటుంటే.. ‘తనని నా కూతుర్ని అంత మాటంటావా..’ అంటూ తనని కొట్ట రాబోయిన అత్తయ్యను చరణ్ బలవంతాన చేతులు పట్టుకుని ఆపాడు. “అమ్మా వొద్దు.. నేను చూసుకుంటాగా.. మహిమా నువ్వు లోపలికి వెళ్ళు ప్లీజ్” అంటూ సురేఖని, అత్తమ్మని బలవంతాన లోపలి తీసుకెళ్ళాడు. ‘నా భర్త నన్నెప్పుడూ రేప్ చేయలేదే యూ.. బిచ్ హౌ డేర్ యూ.. ఐ కిల్ యూ’ సురేఖ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అత్తమ్మ ఇలా మాట్లాడుతుందా.. కానీ గతంలో కూతురు దగ్గర లేనప్పుడే మాట్లాడింది… “నా అల్లుడు కూడా నా కూతురితో ఎన్నో సార్లు అలా చేశాడు మరి. నా కుతురేవన్నా కాపురం వదులుకుని నా ఇంట్లో తిష్ట వేసిందా.. నేనేవన్నా అల్లుడి దగ్గరికి పంపకండా ఉన్నానా.. నా కడుపున పుట్టిన కూతురే కదా.. ఎంతో సున్నితంగానే పెంచుకున్నాను మరి. ఆడదన్నాక అన్నీ భరించుకోవాలి మరి.. పుట్టింటి సుతారాలు నడుస్తాయా అత్తింట్లో.. మహిమా చెప్పు నువ్వూ సర్దుకుపోవాలి.. ఎట్టాగైనా.” అత్తయ్య వకుళ మాటలు తనెట్లో మరచిపోతుంది? కూతురి విషయంలో అల్లుడు చేస్తున్న హింసను సంసారంలో పదనిసల్లాగా, సరస సల్లాపాల్లాగా కలిపేసి కన్న బిడ్డ విలువని, హింసని నీళ్ళు పోసెసిన మజ్జిగలా పలుచన చేసేసిన మనిషివిడ. ఇక కన్న కొడుకు హింసను అత్యాచారాన్ని అసలు ఒక హింసగా కూడా గుర్తిస్తుందా హక్కుగా తప్పిస్తే?

మెసెజి రింగ్ టోన్ మోగింది.. మహిమ ఉలిక్కి పడి చూసింది. సురేఖ నుంచి.. “ఎక్కువ నాటకాలు వేయకుండా తమ్ముడితో డిన్నర్ కి వెళ్ళు” ఏమిటీ పెత్తనం.. ఎవరీవిడ? ఆదేశంలా ఉంది. మహిమకి కోపం తన్నుకొచ్చింది. అసలు తమ మధ్య జరిగిన పర్సనల్ విషయాలు క్షణాల్లో తల్లికి, అక్కకి వాళ్ళ నాన్నకి.. తన అమ్మా నాన్నలకు వెళ్లిపోతాయి. అన్నీ బహిరంగం చేసేస్తాడు చరణ్. భార్య మనసు గెలుస్తానని తన మీద తనకే నమ్మకం లేదు. అందరికీ చెప్పేస్తాడు తనకు బలం కోసం. అంతా రచ్చ రచ్చ చేసేసి అరుపులూ.. కేకల మధ్య వాళ్ళతో మాటలనిపించేసి.. అమ్మ నాన్నలతో నాయనమ్మతో బుద్ధులు చెప్పించేసి, తన మనసు గాయపరిచేసి.. ఆగ్రహం తెప్పించేసి తనని తాను ముడిచేసుకుని వేలమైళ్ళ దూరాలకు విసిరేసుకుంటాడు. “ముందు నాటకాలు మాను లాంటి అమర్యాదకరమైన మాటలు అనటం మాను వదినా… ఇంకోసారి వాడావంటే ఊరుకునేది లేదు నీ హద్దుల్లో నువ్వు ఉంటే నీకు.. నాకు ఇద్దరికీ మంచిది. నా మీద పెత్తనం చేసే ప్రయత్నం చేయకు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు.” సురేఖకు మేసేజి పెట్టింది.

చాప్టర్ -2

‘వెళ్లు’ – అమ్మ, నాన్న.. నానమ్మ.

‘వెళ్ళెళ్లు.. వెళ్ళంతే వెళతావా లేదా వెళ్లు వెళ్ళాలంతే’ – అత్తయ్య.. సురేఖ.. మామయ్య.. సురేఖ మొగుడు.

రా.. రా.. వచ్చేయ్.. వచ్చే సేయ్… రమ్మన్నానా.. వచ్చేయ్యాలంతే’ – చరణ్

‘నీకు ఇష్టం లేకపోతే వెళ్లకే మహీ.. ఏం బలవంతమా ఏంటి’ – యామిని అమ్మమ్మ.

ఊహూ అస్సలంటే… అస్సలు ఇష్టం లేదు ఏం ఎందుకు వెళ్ళాలి.. వెళ్లి వార్నింగ్ ఇవ్వనా.. ఈ వేషాలేంటి అని నిలేయ్యాలి అంతే పద.. పద మహీ పద.. పదా.. మహిమ స్కూటరెక్కింది విసుగ్గా.

“ప్లీజ్.. నా కోసం ఈ ఒక్క పీస్..” బలవంతంగా వేళ్ళు గుచ్చుకునేలా తన గడ్డం పట్టుకుని స్పూను తన నోట్లోకి గుచ్చేస్తున్నాడు చరణ్. మహిమ ఆగ్రహంతో వణికిపోతూ అతని వేళ్ళని తన గడ్డం మీద నుంచి పెకిలించినంత పని చేసి, స్పూన్ విసిరి కొట్టింది. ఇదంతా తాజ్ హోటల్లో నలుగురి ముందు జరిగింది. అందరూ వింతగా చూస్తున్నారు. “ఇంత మందితో చెప్పిస్తావేంటి.. ఏదీ కూడా నీ అంతట నువ్వు మాట్లాడి సాధించలేవా? ” రాగానే తనని చూసి ఏదో సాధించానన్నీ తృప్తితో నవ్వుతున్న చరణ్ణి చూస్తూ కోపంగా అడిగింది మహిమ.

‘అదీ’ అంటూ నీళ్ళు నములుతూ “ఇటు.. ఇటు” అంటూ డిన్నర్ డేట్ టేబుల్ వైపుకి తీసుకెళ్ళాడు. టేబుల్ అంతా వాలంటైన్స్ డే అలంకరణతో నిండిపోయి వుంది. చుట్టూ పలుచటి గులాబీ రంగు వెదజల్లే బల్బులు, హృదయాకారంలో బెలూన్లు, పూల సుగంధం పలుచగా గాల్లో.. వింతగా చూసింది మహిమ.. ఒహ్ ఈ రోజు ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే.. ప్రేమికుల రోజు తను మరిచే పోయింది పొద్దున్న వాట్సాప్, ఫేస్బుక్ మెసేజెస్లో చూసింది.. కానీ పూర్తిగా మరిచిపోయింది. రాత్రి చరణ్ చేసిన చిల్లర పనికి.. తరువాత అమ్మ దగ్గర ఘర్షణ పడడం.. దుఃఖం.. వెంటనే బ్యాంక్ ఎగ్జాం కోచింగ్ క్లాస్ కి వెళ్ళడం.. మతికి లేదు. చరణ్ ఇదంతా కావాలనే చేశాడు రాత్రంతా చీదర చీదరగా చేశాక.. పొద్దున్నే ఇదంతా చేయడం.. ఛా.. ఛా. చుట్టూ ఉన్న టేబుల్స్ అన్నీ లవర్స్ తో నిండి ఉన్నాయి. అంటే ఇప్పుడు తాము ఇద్దరం కూడ ఇక్కడ లవర్స్ అన్నమాట.. మరుక్షణం మహిమకి వెగటుగా అనిపించి కోపం బుస బుస పొంగింది. “అసలు నన్ను అడక్కుండా ఈ డిన్నర్ డేట్ ఎందుకు పెట్టావు.. నా ఇష్టంతో ప్రమేయం లేదా.. నాకు నీ పట్ల ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదా నీకు? ఏంటిదంతా.. మనం ఏమైనా ప్రేమికులమా? కనీసం మన మధ్య గౌరవం, స్నేహం అయినా లేదే.. పైగా మీ అమ్మా.. అక్కా, మా అమ్మ వీళ్ళంతా నాకు నీ దగ్గరికి వెళ్ళమని రికమెండ్ చేయాలా.. ఏంటిది..?” చుట్టూ ఉన్న వాళ్లకు వినిపించకుండా గొంతుని అదిమిపడుతూ కోపంగా అడుగుతున్న మహిమను చూస్తూ “ఈ ఒక్క రోజు ఏం మాట్లాడకు.. ప్లీజ్ హావ్ ఇట్” అంటూ ఊహించే లోపల జేబులోంచి సిద్ధంగా ఉంచుకున్న ఉంగరం తీసి మహిమ చెయ్యి లాక్కుని, మహిమ వదులు అని వెనక్కి గుంజుకుంటున్న కొద్దీ గట్టిగా అదిమి పట్టి ఉంగరం తోడిగేసి, మోకాళ్ళ మీద కుర్చుని ఒక గులాబీ తనకి ఇస్తూ.. నాటకీయంగా “ఐ లవ్యూ” చెప్తూ చెప్తూనే చటుక్కున లేచి టేబుల్ మీదున్న స్వీట్ తీసి మహిమ నోట్లో కుక్కుతుంటే ఉపిరాడలేదు… పిచ్చెక్కిందా.. ఏం చేస్తున్నాడు? మహిమ ఆపుకోలేని కోపంతో చరణ్ వైపు చూసింది.. లేని ప్రేమ నటిస్తున్న ముఖం ఆ ఎర్రటి బల్బుల వెలుగులో వికారంగా కనపడింది.

రాత్రి తలుపు తీయమని కాళ్ళతో తన్నిన మొఖమేనా ఇది? తనని ‘యూ బిచ్’ అని బూతులు తిట్టిన ఈ నోటితోనే నా ఇప్పుడు ‘ఐ లవ్ యూ’ చెబుతున్నది? కోపంతో చిగురుటాకులా వణికి పోతూ “స్టాప్ దిస్ డ్రామా” అంటూ వేలికున్న ఉంగరాన్ని వేగంగా తీసేసి, టేబుల్ మీద పెట్టేసి పరిగెత్తినట్లే నడిచి హోటల్ బయటపడింది. ఆ వింటర్ డేట్ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఎట్టెర్రని కాంతి… అతని ముఖం మీద పడుతుంటే.. తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న చరణ్ మొఖంలోని మెత్తని నవ్వు.. నవ్వుతూ గొంతు కోసి పడేసే నవ్వు. ఎనిమిది నెలల క్రితం ఇదే మొఖంలో ఎంత క్రూరత్వం? అప్పుడు తను మోకాళ్ళ మీద కూర్చుని వదిలి పెట్టమని రెండు చేతులూ జోడించి ఎంతగా వేడుకుంది? క్రూరుడు.. ఈ రోజు మంచితనం నటిస్తూ కపట ప్రేమని నటిస్తున్నాడు. ఇదంతా అతగాడిలో మార్పు అనుకుందామని ఎంత ప్రయత్నించినా కాదు.. కాదు అతగాడి అవసరం.. కామం.. కోరిక.. తనని వంకర దారుల్లో లొంగ దీసుకోవాలన్న కుట్ర.. మొండితనం అని తెలుస్తూనే ఉంది. మహిమ స్కూటర్ నడుపుతూనే ఉంది… ఆలోచనల్లో సతమతమవుతూ.. ఎటు.. ఎటు పోవాలిప్పుడు? వాడిప్పుడు దెబ్బ తిన్న క్రూర మృగం… ఇంటికెళ్ళి తలుపేసుకున్నా బయటనుంచి కాళ్ళతో తంతూ నరకం సృష్టిస్తాడు. ఇప్పటికే వాళ్ళమ్మకి, అక్కయ్యకి కబురు వెళ్ళే ఉంటుంది… వాళ్ళు కూడా ఉంటారేమో ఇంట్లో తన కోసం.. కుందేలు మీద పడిపోయే తోడేళ్ళ లాగా.. పోనీ అమ్మ దగ్గరికి వెళదాం అంటే..

అమ్మ.. అమ్మకి తన తప్పు లేదని.. ఉండదనీ తెలుసు. అయినా అడ్జస్ట్ అవమని చెప్తుంది అచ్చు తను నాన్నతో ఎట్లా అడ్జస్ట్ అయ్యిందో అట్లా….. అలా రాజీ పడడం చాలా ఈజీ అని చెప్తుంది… పావ్లావ్ కండిషన్ థియరీలా… ఆ పావ్లావ్ కుక్కకి, మాంసం ముక్కకి.. గంట శబ్దానికి రెస్పాండ్ అయ్యేలా ఎలా కండిషన్ చేశాడో .. అలా ఈ మ్యారేజి సిస్టమ్ మీలని పెళ్లి.. పవిత్రత.. తాళి.. పాతివ్రత్యం.. ఇల్లు.. పిల్లలు.. మాతృత్వం లాంటి భావజాలానికి కండిషన్ చేసి పడేస్తుంది.. బంధం ఎంత బలహీనంగా ఉన్నా విడిపోయే.. పారిపోయే అవకాశాలు చాలా ఉన్నా.. వంద టన్నుల ఏనుగు పుటుక్కున తెగిపోయే సన్న దారంతో కట్టి పడేసినా.. మానసిక బలహీనత వల్ల ఎలా తన శక్తినంతా మరిచిపోయి నిస్సహాయంగా కూర్చుండి పోతుందో అలా ఆడవాళ్ళంతా తాళి అనే సన్న దారానికి కట్టుబడి ఉండిపోతారు.. అలా అడ్జస్ట్ అవడానికి కండిషన్ అయిపోతారు. కొన్నేళ్లకి ఈ అడ్జస్ట్మెంటె సులువుగా… సుఖంగా.. భద్రతగా మారిపోతుంది వాళ్ళకి. ఇదిగో ఇప్పుడు తన మీద అలాంటి పావ్లావ్ థియరీ ప్రయోగాలే జరుగుతున్నాయి అటు పుట్టింటి వాళ్ళు.. ఇటు అత్తింటి వాళ్ళు అంతా కలిసి తనమీద ప్రయోగాలు చేస్తూ తనని చరణ్ ఇంటి గడపకి కట్టేయాలని చూస్తున్నారు. అమ్మ అలాగే అడ్జస్ట్ అయిపో అంటుంది, కన్నీరు కారుస్తుంటుంది. నాన్నగారి గుండె జబ్బు.. చెల్లి యామినికి కావలసిన పెళ్లి ఇవన్నీ చెబుతూ.. పద నేను దిగబెట్టి వస్తా అంటుంది… సెంటిమెంట్స్ తనని మార్చాలని చూస్తుంది.. ఎందుకొచ్చింది.. అటుపోతే ఇక అంతే. పిచ్చి అమ్మా.. రేపో మాపో తాను మారిపోయి, వెళ్లి అతగాడితో కాపురం చేసేస్తాను అనుకుంటుంది. ఒక్కోసారి గొప్ప నమ్మకంతో.. చాలా సార్లు అపనమ్మకంతో కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకొచ్చింది..? మరెటు.. ఎటు మరి? దారేది తనకి.. తనకంటూ ఒక ఇల్లు లేదు.. తోడు లేదు. ఉన్న ఒక్క తోడూ బిపిన్ లేడు.. ప్రాణ స్నేహితురాలు వర్ష ఊరెళ్ళింది. మహిమకి దుఖం తెరలు తెరలుగా తెర్లుకొచ్చింది. చెంపల మీదకి కన్నీటి మత్తడి తెగింది. అయినా స్కూటర్ ఆపకుండా నడిపేస్తున్నది. మరోపక్క చీకటి కమ్మేస్తున్నది. నగరం అంతా దీపాలతో వెలిగిపోతూ ఉంటే తన మనసంతా చీకటి మబ్బులు ముసురుకున్నాయి. తనకి తెలీకుండానే ట్యాంక్ బండ్ మీదకు వచ్చేయడం .. స్కూటర్ పార్క్ చేయడం.. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ పోయి తనకి బాగా అలవాటున్న బెంచీ మీద కూర్చోవడం జరిగిపోయాయి. అక్కడి కొచ్చి కూర్చోవడం.. టాంక్ బండ్ నీటి అలల మీద వెలిగే చీకటి, వెలుగుల నీడల్ని ఆ అలలు చేసే మంద్రమైన శబ్దాన్ని వింటూ.. నీళ్ళ మధ్య మౌనంగా నిలుచున్న బుద్ధుడ్ని చూస్తూ గంటలు, గంటలు ఒక గాయపడ్డ చీకట్లానో.. వేదనతో శీతలమైపోయిన వెన్నెల లాగానో అక్కడే గంటలు.. గంటలు శిల.. ఒర్థి శిల లాగా కూర్చోవడం అలవాటై పోయింది మహిమకి. మనసులో అలజడి తగ్గినా తగ్గకపోయినా.. మెల్లిగా ఏ రాత్రికో ఇల్లు చేరడం మామూలే. తను నిశబ్దంగా కార్చిన కన్నీళ్లు ఎన్ని ఆ అలల్లో కలిసిపోయాయో లెక్కేలేదు. కన్నీరు కారిపోతూ ఉంటే మెల్లిగా అరచేత్తో తుడుచుకున్నది మహిమ. ఛ ఏంటీ ఈ జీవితం.. ఈ టాంక్ బండ్లో దూకి చచ్చిపోతే అన్ని సమస్యలూ తీరిపోతాయి… ఈ ఆలోచనతో మహిమ గుండె దడ.. దడమన్నది. చుట్టూ చూసింది పిట్ట పురుగు లేదు వాహనాలు వస్తూ.. పోతున్నాయి.. దూకినా రేపటికి గానీ ఎవరికీ తెలీదు. రేపటితో లేదా దూకిన ఒక పది నిమిషాల్లో తన చరిత్ర ముగిసి తానొక గతంగా మారిపోతుంది చరణ్ తను చచ్చిన మరుసటి రోజే ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఏ అడ్డంకి లేకుండా యామిని పెళ్లి అయిపోతుంది.. బిపిన్ కూడా బహుశా కొన్నేళ్లకి మరచిపోలేక పోయినా తనలా ఆత్మహత్య మాత్రం చేసుకోడు. అమ్మా, నాన్న, అమ్మమ్మ ఏడుస్తారు. వర్షా దుంకెయ్.. దుంకెయ్.. కమాన్.. లే.. దుంకు.. లే.. లే లే… కమాన్.. మహిమ వెన్నులో వొణుకు వచ్చేసింది.. ఒక్క క్షణం ధైర్యం చేసి దుంకేస్తే ఇక తనకి ఏమీ తెలియదు.. తనిక ఉండదు అంతకంటే ఏం కావాలి.. నొప్పి.. నొప్పితో బతకడం ఉండదు అంతా మాయం అయిపోతుంది. కమాన్ లే.. లే…. మహిమకి వొళ్ళంతా చమటలు పట్టింది.

“హెల్లో మిస్.. ఏం అయింది ఎందుకు ఏడుస్తున్నావు.. ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు నీతో ఎవరూ రాలేదా?” ఎవరో అడుగుతుంటే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది మహిమ. ఎదురుగా ఒక ఆడమనిషి నిలబడి మహిమనే సందేహంగా అడుగుతూ నిలబడి ఉన్నది. “మే ఐ సిట్ హియర్”.. అంటూ చొరవగా మహిమ పక్కనే కూర్చుంటూ.. భుజం మీద చెయ్యి వేసి, “ఏమైంది మీకు.. ఎవరు మీరు.. ఎందుకీ దుఃఖం.. ఏమిటీ చమట మొఖమంతా.. ఎందుకు ఏడుస్తున్నారు”? అని లాలనగా అడిగింది. మహిమ ఖంగారుగా కళ్ళు.. మొఖమూ తుడుచుకుంది. “అబ్బే ఏమీ లేదు.. ఐ యామ్ ఆలైట్”.. ‘మీరు’.. అంటూ ఆమె వైపు సందేహంగా చూసింది మహిమ. “ఐ యాం వరద.. అడ్వకేట్ నీ పేరేంటమ్మా” అని అడిగింది. వరదకి ఒక నలభై ఏళ్ళు ఉంటాయి, మొఖంలో మంచి పరిపక్వత ఉంది.. చూసిన వెంటనే మంచి స్నేహశీలి అనిపిస్తుంది ఆమె నవ్వు.. కళ్ళు మనసుకు అంత సన్నిహితంగా అనిపిస్తాయి. “నా పేరు మహిమ.. నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నా” తడబడుతూ చెబుతున్న మహిమను చూస్తూ నమ్మీ నమ్మనట్లే నవ్వుతూ “మహిమా.. వాట్ ఎ గుడ్ నేమ్.. ఆఫ్కోర్స్ నేను కూడా నా ఫ్రెండ్ కోసమే చూస్తున్నా..” అంటూ చిరునవ్వు నవ్వింది వరద. “మరి వచ్చిందా నీ ఫ్రెండ్..” అడిగింది అంతే మెత్తగా.. “లేదండి ఇందాకే మెసేజ్ పెట్టింది వీలు కాదని.. నన్ను వెళ్లి పొమ్మంది” అంది మహిమ తడబడుతూ. “ఇంకేం మరి బయలుదేరుతున్నావా” అంది వరద మెల్లిగా లేచి నిలబడుతూన్న మహిమను చూస్తూ. ఈ లోపల అక్కడికో అమ్మాయి వచ్చింది ఆమెకో ముఫై ఐదేళ్లు ఉంటాయి “అదిగో నా ఫ్రెండ్ కూడా వచ్చింది. మరి నువ్విక ఇంటికి వెళ్ళిపో ఇదిగో నా కార్డ్.. నీకేమైనా అవసరం అనిపిస్తే కాల్ చేసి మాట్లాడొచ్చు.. కలవచ్చు కూడా.. నాకు కొంచెం పని ఉంది. మేం మాట్లాడుకోవాలి ఇక్కడే.. నువ్వు ఇంటికెళ్లి మహిమా” అంది వరద. లోతుగా మహిమ కళ్ళలోకి చూస్తూ.. “పోనీ నేను డ్రాప్ చేయనా నిన్ను?” అడిగింది వరద. కార్డ్ అందుకుని “నా స్కూటర్ ఉంది. బై వరద గారూ” అంటూ మహిమ స్కూటర్ వైపు నడిచింది. మహిమ స్కూటర్ ఎక్కి ముందుకు పోయేదాకా అలానే చూస్తూ నిలబడిపోయింది వరద. తను వెళ్లేప్పుడు మహిమను అదే ప్లేసులో చూసింది.. తిరిగి వెళ్లేప్పుడు కూడా ఇంకా అక్కడే చూసి ఏదో అనుమానం వచ్చి కార్ ఆపింది. ఒక లాయర్గా ఎంతమంది వొంటరి స్త్రీలను ఇలా టాంక్సండ్ వొడ్డున ఏడుస్తూ కూర్చోవడం చూసిందో.. ఇందులో దుంకి ఆత్మహత్యలు చేసుకోగా చూసిందో.. అప్పటికే రాత్రి పదవుతున్నది. తనకే ఒక కేసులో ఆలస్యం అయ్యింది.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

17 thoughts on “విత్ యువర్ పర్మిషన్

 1. మీ అద్భుతమైన
  శైలితో చాలా బాగుంది
  ఇంకా పూర్తిగా చదవలేదు

  1. థాంక్స్ రామలక్ష్మి గారు

 2. చాలా బాగా రాసారు గీతాంజలి గారు

 3. చాలా బాగా రాసారు మా

 4. ఎంతమంది ఈ నరకాలను భరిస్తూ కాపరాలు చేస్తున్నారో? మహిమ లాగా “నాకిది వద్దు” అని చెప్పే ధైర్యం, అవకాశం కూడా అన్ని ఇళ్ళలో ఉండవు. పరువు హత్యల్లాగా, ఇవన్నీ పరువు కాపరాలు

 5. అద్భుతం.. ఎంతో గొప్పగా వాస్తవాలను దృశ్యమానం చేశారు..కవితను..కథ ఆరంభంలోనే అధరగొట్టేశారు… సూపర్బ్ సూపర్బ్

 6. క‌థ‌ క‌థ‌నం బాగున్నాయి.
  కానీ నాకు అర్థం కాని విష‌యం లిబర‌ల్స్ ప్రోగ్రెసివ్స్ సెలెక్టివ్ గా ఎందుకు వుంటారు అని.
  ఉరి లో రేప్ జ‌రిగింది అంటే ఉరిమి ప‌డ‌తాము.
  అమ్నేసియా ప‌బ్ ఘ‌ట‌న‌ లో అమ్నేసియా అభిన‌యిస్తాము.
  విక్టిమ్ ఎవ‌రైన‌ రేప్ చేసింది ఎవ‌రైనా స్పంద‌న‌ ఒక‌ లా ఎందుకు వుండ‌దు?

 7. ఇలాంటి కథలు రాసుకునే రోజులు ఎప్పటికి పోతాయో!
  చాలా సున్నితమైన సమస్య ను బాగా రాస్తున్నారు భారతీ.

  1. ఎప్పటికీ ఆ మంచి రోజులు రావేమో కాత్యాయని పితృస్వామ్యానికి ఉన్న ఆధునిక రూపాలు మరింత వికృతమైనవి బలమైనవి…

Leave a Reply