వికసిత సుందర కవిత్వ కమలం

కవికీ కవిత్వానికి మధ్య సంబంధం ఏమిటి ? కొత్తవాళ్ళు రాసేవి చదివితే ఇలాంటి ప్రశ్నలు అనేకం మనసులో సరికొత్తగా మెదుల్తాయి. ఇంద్రాణి దాన్ని తల్లీ బిడ్డల సంబంధం అంటుంది. ‘నేను రాస్తే పుట్టిన నువ్వు నాకు బిడ్డవో, నిన్ను రాస్తే కొత్తగా అనిపిస్తున్న నేను నీకు బిడ్డనో’ అని అమాయకంగా సందేహపడుతుంది. ఈ తన లేలేత నిరాడంబరత మనల్ని భలే చిత్రంగా తాకుతుంది. చిన్న వయస్సున సాహిత్యం, అందునా కవిత్వం నిన్ను తన వెచ్చటి కౌగిట్లోకి తీసుకుంటున్నప్పుడు ముందైతే ఒక అలౌకిక (?) స్థితికి గురవుతాం. ఆ తర్వాత మనలో ఉండే ప్రాపంచిక దృక్పథం వలన అనేక రసాయనిక చర్యలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇంద్రాణి కవిత్వంలో అలాంటి చైతన్యవంతమైన ఉత్ప్రేరకం (catalyst) ఒకటి దాగి ఉంది. అది ఈ కవిత్వం చదువుతున్నప్పుడు మనల్ని అనేక ఉద్వేగాలకు గురి చేస్తుంది.


తన అన్న గురించి, అక్క గురించి, అమ్మా నాన్నల గురించి, కట్టుకున్న సొంతిల్లు, అమ్మేస్తున్న మూడు గుంటల పొలం ఇవన్నీ కొత్త కవిత్వ వస్తువులు అనను  గానీ ఇంద్రాణి వాటిని ఒక ప్రాతినిథ్య ధోరణిలో కొత్తగా చెప్పింది. కొత్త కవుల ప్రత్యేకత అదే. తమ వెంట ఒక సూక్ష్మమైన తాజాదనాన్ని తీసుకొస్తారు. అన్నని గురించి చెబుతూ ‘నాన్నెనుక నాన్నైన నా అన్నకు మా చెల్లెళ్లమే తొలుసూరు బిడ్డలం’ అంటుంది. అక్కని ‘అక్కమ్మ’ అంటుంది. మా బాపుకు మా అమ్మంటే ఎంత నమ్మికనో అనే కవితలో కూడా అమ్మానాన్నల అన్యోన్యత చెబుతుంది. బతుకమ్మను మా ఇంటి మూడో ఆడపడుచు అంటుంది. జీవితపు అనుబంధాలతో కవయిత్రికున్న అపేక్ష వ్యక్తిగతంగా అనిపించదు. పెద్దల అమాసా అన్న కవితలో చనిపోయిన తర్వాత ఫోటో ముందు ఎన్నో రకాల పిండి వంటలు పెడతారు కానీ బ్రతికున్నప్పుడు పెట్టరు కదా అని ప్రశ్నిస్తుంది. ఇది సామూహిక అవగాహన. అమ్మ గురించి ప్రోగ్రెస్ కార్డ్ అన్న కవితలో ‘మేము ఎన్ని మాటలన్నా ఓర్చుకునే మా అమ్మ మనసు నల్లరేగడి కడుపుల పండిన పత్తి పింజ’ అంటుంది. అమ్మ గురించి ఎన్ని గొప్ప వాక్యాలు మనం గతంలో చదివి ఉన్నా కూడా ఈ వాక్యాలు మన హృదయాల్ని తడి చేస్తాయి. తన నిజ జీవితం పరిమళించిన తీరులోనే ఈ కవిత్వ సౌందర్యం దాగి ఉంది. అందులోనే మనిషి ఉనికి ఉంది. స్నేహితుల ప్రభావంలో ఉండే వాస్తవికత-భ్రమలు ఎలా ఉంటాయో స్నేహితం, వినీలాకాశం, ఇంద్ర కమలం, వంటి కవితలు తెలియజేస్తాయి. సెల్ఫోన్ గురించి చీకటి వెలుగు కవిత ఆలోచనాత్మక నిరసనలా ఉంటుంది.


ఇంద్రాణి కవిత్వ భావనలు కొన్ని మరీ ప్రత్యేకంగా అనిపించాయి. అపురూపంగా కూడా. సొంతిల్లు అన్న కవితలో- ‘మా బంగ్లా మెట్లు కట్టడానికి మా బాపు ఎన్ని సార్లు ఎక్కి దిగిండో, అల్లారు ముద్దుగా చిన్న పిల్ల లెక్క సాది కట్టిండు మా ఇంటిని’ అంటుంది. ఎక్కిదిగింది కష్టసుఖాలను. బాల్యం గురించిన ‘గుర్తుకొస్తున్నాయి’ కవితలో ‘మోకాలి చిప్పలు దెబ్బలు తాకిచ్చుకుని దిష్టి చుక్కలు పెట్టుకునేవి’ అంటుంది. సమాజంలో స్త్రీల దు:ఖం గురించిన ఎరుపు రంగు చరిత్రలు అన్న కవితలో ‘ఎందరు మహిళలు ఆకాశాన్ని కప్పుకుని మానాల్ని కాపాడుకున్నరు’ అని ప్రశ్నిస్తుంది. వాళ్ళ తాతగారిని గురించిన తెల్ల సుట్ట బట్ట అన్న కవితలో – ‘నీ తలకు కట్టుకున్న తెల్ల సుట్ట బట్ట మాకు రిజర్వ్ బ్యాంకు, మా చాక్లెట్లకు ఎన్ని పైసలిచ్చిందో’ అని రాస్తుంది. అలాగే మా భూమి అమ్మేస్తారట లో ‘భూమి లక్షల్లల్ల వెలగట్టినం, మరి ఆ జ్ఞాపకాల్ని ఎంత వెలగట్టి అమ్మాల్నో మేము’ ? అన్నప్పుడు కవిలోని నిష్కల్మషత్వంతో కూడిన సాంఘిక చైతన్యం పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. అలాగే మారిటల్ రేప్, కరోనా, పర్యావరణ విధ్వంసం వంటి లోతైన గంభీరమైన విషయాలపై రాసిన కవితల్లో కూడా ఆ చైతన్యం ఆచరణాత్మక రూపం ధరిస్తుంది. స్త్రీల సమస్యల్ని లేవనెత్తినప్పుడు ఇంద్రాణి మరింత సున్నితంగా, పట్టింపుగా కనిపించింది. ఈ రెంటి అవగాహనల మధ్య ఇంద్రాణి నడుస్తున్న కాలమే ఈ కవిత్వం. అంతే కాక ఇంద్రాణికి ఎరుకల వారి మౌఖిక భాషకి లిపి తయారుచేయాలన్న ఉత్సాహం చాలా ఉంది. అదేం చిన్న పని కాదు. కానీ ధైర్యం చేస్తుంది. ఇంద్రాణికి మనుషుల ఉనికికి భాష ఎంత ముఖ్యమైనదో తెలుసు కనుకే ఇంత ఆరాటపడుతుంది. కనుకనే ఇవన్నీ చదువుతున్నప్పుడు కవిత్వంలో వస్తువూ శిల్పం అన్నవి ఎప్పుడు ఎలా ప్రకాశిస్తాయా అన్న ఆలోచనలో పడతాము.


సరైన అర్థాల వల్ల ఏర్పడే ఔచిత్యం, ఇంద్రాణి వాడిన లేక ప్రయోగించలేకపోయిన ఈస్తటిక్స్ ని (అలంకారాల్ని) జయిస్తుంది. అదే ఆమె కవిత్వానికి ఒక కొత్త నిసర్గ సౌందర్యాన్ని కల్పిస్తుంది. ఇది నిరలంకారత కాదు. వస్తువు నిర్ణయాత్మకం కావడం. తన ముందు మాటలో ఇప్పటివరకూ ఎవరెవర్ని చదివిందో ఫలానా కవిని ఎందుకు ఇష్టపడుతుందో లేదా ఎవర్ని విమర్శనాత్మకంగా చూస్తుందో మనకు ఏమీ తెలియనివ్వలేదు. రాయడం రావాలి అంటే ముందు రాయడం మొదలు పెట్టాలి అంటుంది. ఆచరణలోకి దిగాలి అనేది తన అభిప్రాయం కావచ్చు. అంతకు మించి చదవడం మొదలు పెట్టాలి అన్న విషయం కూడా తెలియాలి.
గమనిస్తే ఇంద్రాణిలో పదాల్ని ఆచి తూచి వాడే లక్షణం లేదు. విరివిగా, యదేచ్చగా పద ప్రయోగం చేయడం వల్ల తన భావ గాంభీర్యతలో హెచ్చు తగ్గులేర్పడినా ఇది ఒక రకమైన సరళ వాక్య నిర్మాణానికి దారి తీస్తుంది. సరళం కన్నా సాదాసీదాతనం అంటే సబబేమో. సాధారణమైన శ్రమైక జీవిత నేపథ్యంలోంచి, అసలు సిసలు పల్లెదనంలోంచి తీసుకున్న కవిత్వ లక్షణాలివి. ఇదే పాఠకులకి కవిత్వాన్ని సులువుగా అర్థమయ్యే వీలు కల్పిస్తుంది.


కవి పాఠకుడి స్థాయికి రావాలా ? పాఠకుడే కవి స్థాయికెదగాలా ? అంటుంటారు. ఇటువంటి శైలీ మార్గం ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆయువు పట్టు వంటిది. ఈ శైలిని అర్థం చేసుకోకపోతే ఈ తరం అభివ్యక్తి అర్థం కాదు. కవిత్వ విమర్శా పరంగా నేనిక్కడ సాపేక్షమైన ‘మంచి-చెడులను’ ఒక చోట నిర్ణయించాలనుకోవడం లేదు. కానీ కుందుర్తి, కాళోజీ వంటి మహానుభావులు కోరుకున్న వచన కవిత్వ ప్రయాణం ఇదేనేమో అన్న నిర్థారణ కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వర్తమాన కవిత్వం చదువుతూ దాని ప్రయాణాన్ని దగ్గరగా చూడగలిగిన వాళ్ళందరికీ వస్తువు, భాష, వినూత్న వాక్య ప్రయోగం వంటి అనేక విన్యాసాలు కనిపిస్తాయి. ఇంతటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో విడదీయలేనంతగా కవిత్వం మనుషుల్ని చుట్టుకుంటున్న ఆనందం తెలుస్తుంది. ఈ అల్లికలోంచే భావజాలం పరిమళించకపోదు. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు వారు ఇటువంటి పుస్తకాలకి ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలు చెప్పడం మనకు గౌరవాన్నిస్తుంది. ఈ ప్రయత్నం ఎందరో కొత్త కవయిత్రులను తప్పక వెలుగులోకి తెస్తుంది.


ఇంద్ర-కమలం (కవిత్వం) – మామిడిపెల్లి ఇంద్రాణి, 130 పేజీలు, ధర 100/-, ప్రతులకు : ఫోన్ – 7287919385

పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో 'కవితా ఓ కవితా' శీర్షిక నిర్వహిస్తున్నారు. 'అద్వంద్వం' తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

Leave a Reply