వాళ్ళను మాట్లాడనీయండి

వాళ్ళను మాట్లాడనీయండి
ఇన్ని తరాలుగా
నోరుకు పని చెప్పనివాళ్ళు
ఇప్పుడు నోరు తెరుస్తున్నారు
వాళ్ళను మాట్లాడనీయండి
పూటకో మాట మాట్లాడి
పొద్దుపుచ్చే మాటలు
వాళ్ళకు పునాది కాదు
గాయాల నదులను ఈదిన
క్షతగాత్రుల వారసులు వాళ్ళు
తరతరాల మానవ చరిత్రను తవ్వి తీసి
కాచి వడపోసి
నికార్సయిన నిజాన్ని
నిప్పుల కొలిమిలో నుండి తీసి
పుటం పెట్టిన పుట్టమన్నుకు
భుజాన్ని అందించిన
భూమిక వాళ్ళది

అయ్యగార్ల
అరుగు మీది ముచ్చట్లను
బజారు కీడుస్తున్న
భావుకతకు జీవికనిస్తున్న
జిజ్ఞాసువులు వాళ్ళు
వాళ్ళను మాట్లాడనీయండి
ఆచరణ అయిటి కప్పల అరుపులకు
ఉసుల్ల పుట్టలై బెదిరిన ఉనికి వారిది

సిద్ధాంత వేత్తలారా !
తరతరాలుగా జ్ఞాన సంచయాన్ని
గంపలకెత్తుకొని కూడగట్టుకున్న
కూటనీతుల కోటలారా !
వాళ్ళను మాట్లాడనీయండి.

నోటికి అడ్డం పడే సైంధవులు కాకండి
వాళ్ళను సరాయించుకోనీయండి
సూటిగా మాట్లాడనీయండి
కూసున్న కాడ
ఈ గుట్టకు ఆ గుట్టకు తాకులాట పెట్టించే
తకరారులారా !
మీ ఊపిరి పురిని పట్టుకున్నందుకు
ఉలికి పాటెందుకు ?

చెమట పువ్వుల పరిమళంలో
చిందులాడిన ఆలోచనలు
శీర్షాసనాలను సక్కగా నిలబెట్ట
నడుము కట్టినయి

వాళ్ళకు దేశదేశాల
దిక్పాలకులు తెల్వది
వాళ్ళు ఈ మట్టి పడుతున్న
మనాదినే మాల కడుతున్నరు
పోరాడే వానిదే జెండా అన్న నినాదాన్ని
వినోదంగా తీసుకోలేదు
పక్కబొక్కలు పటపట ఇరిగినా
పోరుదారి పరువును పదిలంగా నిలిపిన వారు
మిమ్ములను జోకి, జోహుకుం అనలేరు
జిద్దునే జీవితానికి సరిహద్దుగా ఎంచుకున్న వాళ్ళు
హద్దులన్ని చెరిపే
ఉద్యమంలో ఉన్న వాళ్ళు
జీతగాళ్ళు కాదు
బాతగాళ్ళు
తరతరాల తండ్లాటలో
వన్నె తగ్గని వెన్నెల జలపాతాలు.
వాళ్ళను మాట్లాడనీయండి.

కరీంనగర్ పట్టణంలో నివాసం. చేనేత జౌళి శాఖ లో ఉప సంచాలకులు గా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్ విశ్వ విద్యాలయం నుండి MA; MPhil. చెరబండరాజు నవల మీద MPhil, కట్టెపలక కవిత సంపుటి వెలువడింది. సాహిత్యం అధ్యయనం, కవిత్వం, వ్యాస రచనా, సాహిత్యంలో సమాజం అభిమాన విషయాలు.

One thought on “వాళ్ళను మాట్లాడనీయండి

Leave a Reply