ఎమే సెజైర్ (1913-2008) ఫ్రెంచ్ మార్టినీక్ దీవిలో బాస్-పాయింట్ లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. తను పారిస్ లో చదువుకుంటున్నపుడు సెంగార్, డమాస్ లతో కలిసి నెగ్రిటూడ్ ఉద్యమం ఆరంభించాడు.తన భార్య సుజానే తో కలిసి తిరిగి మార్టినీక్ వచ్చి మరో భావి ప్రఖ్యాత రచయిత ఫ్రాంజ్ ఫానన్ కు గురువుగా ఉన్నాడు. ‘ట్రోపీక్’ అనే సాహితీ పత్రిక నడిపి మార్టినీక్ సాంస్కృతిక అస్తిత్వాన్ని సమర్థించాడు. వలసవాద వ్యతిరేకంగా ‘నోట్బుక్ ఆఫ్ ఈ రిటర్న్ తో ది నేటివ్ లాండ్’, ‘డిస్కోర్స్ ఆన్ కలోనియలిసం’ అనే ప్రఖ్యాత రచనలు చేశాడు. 1945 లో ఫోర్ట్ డి ఫ్రాన్స్ మేయర్ గా , ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ ప్రతినిధి గాఎన్నికయ్యాడు.
ఎమే సెజైర్ తన ‘‘డిస్కోర్స్ ఆన్ కలోనియలిసం’ పుస్తకంలో వలసవాద నాగరికత పాశవికత, హిపోక్రసీ , దాని అనివార్య క్షీణతను చెప్పారు.దీనిలో ఈనాటికి వర్తించే పలు భావాలు ఉన్నాయి. సెజైర్ దృష్టిలో పాశ్చాత్య నాగరికత క్షీణిస్తూ, రోగ గ్రస్తమై, మరణిస్తోంది. అది తానే సృష్టించిన పెద్ద సమస్యలు అయిన శ్రామిక వర్గాన్ని, వలసవాద సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.
వలసవాదులు ఇండోచైనా,అల్జీరియా, మడగాస్కర్, ఆఫ్రికా, వెస్టిండీస్ లలో హత్యలు, చిత్రహింసలు, జైళ్ళు అణచివేత సాగించారు. వలసవాద బాధితులు ఇండియన్స్ ,పసుపు జాతి వారు, నల్లజాతీయులు. వలసవాదం నాగరికతలను కలిపే సాధనం కాలేదు. అది నాజీజాన్ని పుట్టించి , దానికి కనులు మూసుకుని బాగా పెంచింది. గతంలో నాజీజాన్నీ వలసవాదులు ఐరోపాయేతర ప్రజలపై ప్రయోగించారు. వారికి అసలు కోపం నాజీజాన్ని హిట్లర్ ఐరోపాకు వర్తింప చేసినందుకు. అప్పటిదాకా దాన్ని అల్జీరియా అరబ్బులకు , ఇండియా కూలీలకు, ఆఫ్రికా నల్లజాతీయులకు మాత్రమే రిజర్వ్ చేశారు.
ఫ్రెంచ్ తత్వవేత్త రెనాన్ అసమానతలు పెరిగి ఆధిపత్యం ఒక చట్టం కావాలని, ఆధిపత్య జాతులు తక్కువజాతులను ఉద్ధరించాలని, ఇది విధి ఫలితమే అనటాన్ని సెజైర్ విమర్శించాడు. అల్జీరియాలో డి మాంటెగ్నాక్ , కౌంట్ డి హారిసన్ లు ప్రజల తలలు , ఖైదీల చెవులు నరికించారు. గృహాలను తగులబెట్టి దురాక్రమించారు. జనరల్ గెరాల్డ్ మడగాస్కర్ లోని అంబీకీ నగరంలో పసికందులు, స్త్రీలతో సహా ఐదు వేలమందిని చంపించాడు. వలస ప్రజలను జంతువుగా చూసే వలసవాదీ తాను కూడా జంతువుగా మారతాడు.
రెవరెండ్ మిల్లర్ అనాగరిక ప్రజలు చేతకాక, సోమరితనంతో వారికి దేవుడు ఇచ్చిన సంపదను వాడకుండా నిరవధికంగా ఉంచడానికి మానవాళి తప్పకుండా సహించకూడదు అని రాస్తే ఖండించిన వారు లేరు అని సెజైర్ విచారం, ఆగ్రహం వ్యక్తం చేశాడు. వలసవాదం అద్భుతమైన అజ్టెక్, ఇంకా నాగరికతలను, దక్షిణ సముద్ర దీవులు, నైజీరియా, న్యాసాలాండ్ లను నాశనం చేసింది. ఆ క్రమంలో అణచివేత , పన్నులు, లైంగిక అత్యాచారాలు, తనకు అవసరమైన గుమాస్తాలను, దుబాశీలను తయారు చేయడం , స్థానికులను ఉత్పత్తి సాధనంగా మార్చడం చేసింది. అభివృద్ధి పేరుతో వలస దేశాల సంస్కృతులు, వ్యవస్థలు ,మతాలు, కళాఖండాలు అవకాశాలు,ఆహార పంటలు, వాటి ప్రజాస్వామ్య, సహకార సమాజాలను నాశనం చేసింది. వలస సమాజాలలో పాత, కొత్త నియంతలు దోపిడీలో భాగస్వాములు అయ్యారు.
ఎమ్. కైయ్వా అనే మేధావి పాశ్చాత్య సైన్స్ , నీతి, మానవ డిగ్నిటీ గురించి చెప్పిన ‘గొప్ప’ మాటలను సెజైర్ విమర్శిస్తాడు. వలసవాదులు ఈజిప్ట్ అంకగణితం, జామెట్రీ కనిపెట్టడాన్ని, అసిరియన్ ఖగోళ శాస్త్రం , అరబ్ రసాయన శాస్త్రం, ఇస్లామిక్ హేతువాదం మరిచిపోయారు అని అంటాడు. వలసవాదులు వలస జాతులను ఉద్ధరించే “తెల్లవాడి భారం” నెత్తిన ఎత్తుకున్నారు.
సెజైర్ ఐరోపా వారు ఉద్బోధించే మనిషి, జాతి అనే భావనల బోలుతనాన్ని ఖండించారు .ప్రాచీన ప్రపంచానికి రోమన్ సామ్రాజ్యం ఎటువంటిదో ఆధునిక ప్రపంచానికి వలసవాదం అలాంటిది అని చెప్పారు. రోమన్ సామ్రాజ్యం కార్తేజ్,ఈజిప్ట్, గ్రీస్ తదితర రాజ్యాలను నాశనం చేసి మానవ సముద్రానికి కట్టలను తీసేసి స్వయంగా అంతరించింది.ఇక ఐరోపా నుంచి అమెరికా సామ్రాజ్యవాదం వైపు తిరగటం వ్యర్థం.
నేడు అమెరికా సామ్రాజ్యం ఎలా ఇరాక్ సిరియా ఆఫ్గన్ నాశనం చేసి మరో మానవ సాగరానికి అడ్డు తీసి మునిగే పరిస్థితుల్లో ఉండటం చూస్తున్నాం.దీనికి ప్రతిగా సామ్రాజ్య వాద దేశాల నేతలు వలస ప్రజలను అనుమానంతో చూడటం, అవమానించడం, నేరస్తులుగా నిందించడం , వెళ్ళిపొమ్మని చెప్పటం , సంకెళ్లు వేసి బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. ఆ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, వాటి సమగ్రత విచ్చిన్నం చేసి , కాందిశీకులుగా మార్చి అమానుషంగా వర్తిస్తున్నారు. తమ తీరాల వద్ద సాగరంపై పడవ జనాలను నిరాక్షిణ్యంగా ముంచివేస్తున్నారు.
ఈ పుస్తకంలో మహా యాంత్రికరణ ప్రకృతిని , మానవ ఆత్మీయతను నాశనం చేస్తుంది. సాగుతోంది మానవులను వస్తువులుగా చూడబడటం. దీనికి ఫలితమే నేడు అలవి కాని గ్లోబల్ వార్మింగ్, హీట్ వేవ్ చావులు. అభివృద్ధి పేరిట బడుగు దేశాలను వారి పారిశ్రామిక చెత్తకు డంపింగ్ యార్డ్ గా మారుస్తున్నారు. కృత్రిమ మేధ పేరుతో శ్రామికులు అవసరం లేని వ్యవస్థ సృష్టిస్తున్నారు. కొత్త లేబర్ కోడ్ తో శ్రామిక సంక్షేమంపై దెబ్బ పడింది.పేదరికం నిర్మూలన కాక పేదలే అదృశ్యమవ్వాలని కోరుతున్నారు. అటవీ సంపద కార్పోరేట్ దత్తం చేస్తున్నారు. ఈ అభివృద్ధి నమూనా కాదంటే రాజ్య హింస.అంతర్జాతీయ స్థాయిలో వెనిజులా , ఇరాన్ పై ప్రజాస్వామ్య విలువల , అణ్వస్తాలు తయారీ నిరోధం పేరుతో ఆయిల్ కోసం అమెరికా దురాక్రమణ కూడా నయా వలసవాదమే.
రచయిత దృష్టిలో ఐరోపా విముక్తికి కార్మిక వర్గ విప్లవమే శరణ్యం. అయితే లెఫ్ట్ వింగ్ కు “నల్ల జాతీయులు రెండు విధాలుగా శ్రామికేకరణ పరాయికరణ చెందారు మొదట శ్రామికులుగా, నల్లవారీగా కూడా అని తెలియాలని వాదించాడు.మన దేశంలో కూడా దళితులు, బహుజనులు కుల, వర్గ దోపిడీ కి గురవుతున్నారనేది సత్యం. పుస్తకానికి ముందుమాటలో రాబిన్ డి జి కెల్లీ రాసినట్లు సెజైర్ ఫాసిజాన్ని తనలో దాచుకున్న యూరోప్ మానవతా వాదాన్ని ఖండించాడు. తన తోటి ఆఫ్రికన్ దేశాలతో సజీవ సంబంధాన్ని బలపరిచాడు. తన సర్రియలిస్టిక్, కవితాత్మక శైలిలో కొత్త ఆంతరిక చూపు నిచ్చాడు.