మొద్దులు కూడా మొలకెత్తుతాయ్!

ఎండలో ఒరిగిన మొద్దుకూడా,
వర్షం పడితే మొలకెత్తుతుంది.
ఆశ లేని జీవితం కూడా
ప్రజల చేతిలో వెలిగిపోతుంది.

కష్టాల భారం భుజాలపై ఉన్నా
కళ్ళలో కలలు ఎప్పుడూ ఆరిపోవు.
కులం పేరుతో కట్టిన గోడలు,
సమానత్వ సూర్యుడికి కరిగిపోతాయి.

పేదరిపపు మట్టిలో నాటిన మనిషి
తన చెమటతోనే పంటగా పెరుగుతాడు.
శ్రమ అనే విత్తనం వేసిన చోట,
న్యాయమే గింజలై పండుతుంది.

ఇళ్ళు లేనివారి కలల్లో,
కొండవాలు పై కప్పు పెరుగుతుంది.

ఏ అడవిలోనో మూసేసిన మాటలు,
ఏ గోడల్లోనో దాచేసిన నిజాలు,
ప్రజల గొంతు లేచిన రోజు,
అన్నీబద్ధలై వెలుగులోకి వస్తాయి.

మౌనం కాదు, ఇది మొలకెత్తే సమయం.
భయం కాదు, ఇది బలమైన ప్రతిజ్ఞ
ఒక్కరి కన్నీరు కాదు మరి,
కోట్ల చేతుల గెలుపు దారి!

పెద్దల చేతులు వెళ్లుగా పాటుకున్న
యువత కొమ్మలుగా పైకిలేస్తారు!
విద్యార్థి ప్రశ్నలు వర్ష బిందువులై,
ఎండిన నేలను తడుపుతాయి.

రైతు చేతిలో విత్తనం ఉంది.
కార్మికుడి చేతిలో నిర్మాణం
వారు కలిసిన చేతుల్లోనే
కొత్త సమాజం ఏర్పడుతుంది.

ఎన్ని రాత్రులు పొడిగించినా,
తప్పదు తెల్లవారు జాము!
వస్తుంది మార్పు తోడు వచ్చేరోజు
మొద్దులు కూడా మొలకెత్తుతాయ్!!

**

  1. కవి, రచయిత, స్వతంత్ర జర్నలిస్ట్. 'మన కాలం' మాసపత్రిక ఎడిటర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత్ స్టూడెంట్స్ యూనియన్ (DSU) వ్యవస్థాపకుడు. ప్రస్తుతం DRDA లో ప్రాజెక్ట్ మేనేజర్ (ప్రకాశం జిల్లా)గా పనిచేస్తున్నారు.

Leave a Reply