విప్లవ సింహం రామనర్సయ్య

పల్లవి : సిలుకల గుట్టా సిలుకల గుట్టా
సెప్పవే జాడా – విప్లవ సింహము జాడా
వాలిన పొద్దు చీకటి నీడ
వెల్గులైన కాడ రామనర్సయ్య జాడా
ఎమర్జెన్సి నెత్తుటి క్రీడ
కగారంటూ సాగిన కాడ
పువ్వులన్ని రాల్చినగానీ
వసంతాన్ని ఆపలేరని

  1. తిర్మలగిరి ఎర్రజెండను
    ఎత్తిందా ములుగు – కదనంలో నీ అడుగు
    ఓట్లతొ రాజ్యం రానేరాదని
    పదవే గడ్డిపోస – ప్రజాయుద్ధమే నీ ధ్యాస
    వ్యూహరచనల్లోన రామనర్సయ్యా
    నీకు బందుకిచ్చిందా గోదారిలోయా
    మోడువారిన ఆ పోడుభూముల్లో
    జనరాజ్యం ఆశలు మొలకెత్తంగా || సిలుకల గుట్టా ||
  2. పగిడేరుకు ఘన్ పూర్ కు
    పొత్తే కుదిరిందా – తూర్పు కనుమలనంటిందా
    గ్రామాలకు పట్నాలకు
    సోపితి కల్సిందా – ఉస్మానియ కదిలిందా
    బత్తులన్న రాలె తొలిసందె పొద్దై
    మంథని పెద్దన్న మహా సంగ్రామమై
    జార్జిరెడ్డి ఒరిగె ధ్రువతారయ్యీ
    నీలం జంపాల గోదారి గోగులై || సిలుకల గుట్టా ||
  3. విప్లవ పార్టీ కార్యదర్శిగా
    వీరుడివే కాదు నువు అక్షర యోధుడివి
    హైద్రాబాదులొ అచ్చుయంత్రము
    నడిపిన జ్ఞానివి – రాజకీయ సేనానివి
    నీతొటి శ్రీపాద శ్రీహరి త్యాగం
    జానకిరాంరెడ్డి ఏపూరు సైన్యం
    కుమార్ నారాయణ నీ పోరు దళమూ
    నలుగురి చిరునామ పాకాల వనమూ || సిలుకల గుట్టా ||
  4. నాటి తెలంగాణ సాయుధ పోరులో
    సైరనే ఊదావా – ఓరుగల్లుకు చేరావా
    ఎర్రని జెండా నూరేళ్ళ గుర్తుగా
    వసంతమేఘమాలా – నక్సల్బరియే నీ జ్వాలా
    కానూరి కలములో బుర్రకథ నీవై
    రామారావు గళము వీరుల గాథవై
    అన్న అమరుడన్న పాటకే ప్రాణమై
    ఎన్నేళ్ళయినా బతికే ఉంటావు

రామనర్సయ్యా రామనర్సయ్యా
జోహార్లు నీకయ్యా – విప్లవ జోహార్లు నీకయ్యా
గోదారిలోయ విప్లవ పాయలో
మాయని గుర్తువయ్యా – పోరు ప్రవాహమయ్యా
పోరు ప్రవాహమయ్యా

  • 28. 10. 2026

(కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య 50వ వర్ధంతి సందర్భంగా….)

**

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply