మెర్సీ పెద్దమ్మ

బడిలో బండిని పార్క్ చేసి, హెల్మెట్ తీసి, బండికి తగిలించి బ్యాగు అందుకొని ఆఫీస్ వైపు నడుస్తున్నాను. 

 పిల్లలు, సహోద్యోగులు చెప్పే గుడ్ మార్నింగ్, నమస్తేలకు ప్రతి నమస్కారం చేస్తుండగానే ఇద్దరు నా క్లాసు పిల్లలు వచ్చి, చేతిలో బ్యాగు అందుకుని నాకు ముందు నడుస్తున్నారు.

ఈ ఉద్యోగంలో చేరిన ఇరువై ఐదేళ్ల నుంచి ఇదే దినచర్య. పిల్లలతో కలిసి ఉండడంలోని ఆనందం నాకు వయసు పెరుగుతున్నా ఆలోచన, అలసటే తెలియడంలేదు.

పిల్లలతో పిల్లవాడిలా కలిసిపోవడం అలవాటయ్యింది.

అదేం భాగ్యమో గానీ, నేను పని చేసిన  ఎక్కువ చోట్ల, కనీసం ఒక్క ఉపాధ్యాయుడైన నా భావజాలంతో ఏకీభవించేవారు దొరికేవారు. వారి సహాకారంతో మిగతా ఉపాధ్యాయులతో చర్చించి, ఒప్పించి, విద్యా ప్రమాణాలు పెరగడంలో, పదో తరగతి ఉత్తీర్ణత తోపాటు ర్యాంకులు సాధించడానికి కృషి చేయడంలో నా ఉద్యోగ ధర్మంగా మలుచుకున్నాను.

నేను బదిలీ అవుతున్న ప్రతిసారీ నాకు దుఃఖభరితం అయ్యేది. పిల్లలతో, స్టాఫ్ తో, గ్రామస్తులతో అంత అనుభందం ఏర్పడేది.

రెండు నెలల క్రితమే ఇక్కడికి వచ్చాను. పచ్చిమ ప్రాంతంలో ఎనిమిదేళ్ళ సుదీర్ఘంగా పనిచేసినందుకు, ప్రమోషనిచ్చి, జిల్లా కేంద్రానికి దగ్గరగావున్న ఈ ఊరికి బదిలీ చేశారు. 

నా సొంత ఊరు కాకపోయినా, మా ఊరి పరిసరి ప్రాంతం కావడంతో ఈ ఊరి మీద కాస్త మకారం పెంచుకున్నాను. నగర జీవితానికి పిల్లలు అలవాటు కావడం కూడా బహుశా నా ఆనందానికి కారణం కావచ్చు . ప్రతి రోజూ ఆ నగరం నుండి టూ వీలర్ మీద స్కూలుకు పోవడం ఇరువై నిమిషాల పడుతుంది. 

జాతీయ రహదారి ప్రక్కనే వుండే  గ్రామంలోని హైస్కూలు కావడంతో, ఎక్కువ మంది పిల్లలు, స్టాఫ్ ఉండడంతో ఇన్నాళ్లుగా ఏదో పోగొట్టుకున్న దిగులు కాస్త పోయింది. 

స్కూల్లో పిల్లలు ప్రైవేటు స్కూళ్ల వైపు చూడకుండా, ప్రభుత్వ బడిలోనే చదివేందుకు ఉపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దల కూడా కృషి వుంది. ఇక్కడ పనిచేస్తున్న పంతుళ్ళందరు తమ రెండో ఆదాయం వైపు దృష్టి పెట్టకుండా, కాస్త బద్దకం వదిలి చదువు చెప్పాల్సిన తప్పని పరిస్థితి ఈ స్కూల్లో వుంది.

అంతే కాదు, స్కూలుకు అవసరమైన స్కూల్ బిల్డింగ్, ఫర్నీచర్, ఆట స్థలం, చుట్టూ ప్రహరీ గోడ, గవర్నమెంట్ నిధులతో పాటు గ్రామ ఎన్నారైలు ఫండ్స్ వచ్చే అవకాశాలు ఉండడంతో,  జిల్లాలోనే ఈ స్కూలు మోడల్ స్కూలుగా మంచి పేరు గాంచింది.

పిల్లలకు విద్యతో పాటు మానసిక వికాసం, సామాజిక భాద్యతలు నేర్పించాలనే ఉద్దేశంతో, ఏటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగేది. స్కూలు పిల్లలతో చిన్న చిన్న స్క్రిప్ట్ లు వేయించడం, సామాజిక అంశాలతో కూడిన పాటలను నేర్పించి పాడించడం, పాటలకు అనుకూలంగా వాళ్ళే వాయిద్యాలు వాయించేలా నేర్పించడం ఇలా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇప్పించడంతో, పిల్లలలో కుల, మత, వర్గ, జెండర్ అనే భేదాలు పోయి వ్యక్తిత్వ వికాసం పెరిగేందుకు కృషి చేసేవాళ్ళం.

ఉపాధ్యాయులంటే విపరీతమైన భయం లేకుండా, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉండడం వలన సబ్జెక్టుల పరంగా వాళ్ళకు బోధించడం మాకు సులువైంది.

సాయంత్రం స్కూలు వదిలి పిల్లలందరూ వెళ్ళాక స్కూలు నుంచి బయలుదేరాను. ఊరి సెంటర్లో ఆడ, మగ రైతులంతా గుమిగూడి ఉన్నారు.  ఏమై ఉంటుందాని బండిని అటువైపు మలిపాను. దగ్గరకు పోయి విషయం ఏమిటని ఆరా తీశాను.

దీనెమ్మ…. ఏందిరా…. ఈ విడ్డూరం

మన చేలల్లో దొంగతనం చేసి 

మన మీదే కేసులు పెట్టడం ఏందిరా! 

ఎన్ని గుండెలురా వాళ్ళకి! 

ఎహె… కానీయండిరా… ఏదైతే అదయ్యిద్ది!

వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నార్రా!  

వాళ్ళను వదిలేది లేదు. అనే మాటలతో అక్కడ చేరిన అగ్రకుల రైతులు ఆవేశంతో ఊగిపోతున్నారు.

ఒక్క సారి ఉలిక్కి పడ్డాను. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకుంటున్నా ఈ ఊళ్ళో, కుల, మతాలకు భిన్నంగా  చైతన్యం చెందిందని భావిస్తున్న ఈ ఆదర్శ,మోడెల్ గ్రామములో, ఇలాంటి ఆవేశంతో అహంకారంతో నిండిన మాటలు వినడం ఆశ్చర్యంగా వుంది. 

ఇంతకీ విషయం ఏమిటీ? అని ఆ గుంపుకు దూరంగా నుంచున్న ఓ బక్క రైతును అడిగాను.

‘‘అదే పొంతులా! ఈ ఊర్లో పల్లెల్లోని ఆడ దొంగలు. మా తూర్పుపొలంలో చేల మీద పడి వాళ్ళ సొమ్ము ఏదో దాచిపెట్టినట్టు పొగాకు మూటలు, మూటలు తెచ్చుకొంటున్నారు. దీనెమ్మ…ఏందయ్య ఇదీ! మేము లచ్చలకు లచ్చలు ఖర్చు పెట్టి పండిచ్చుకుంటుంటే, ఈ దొంగలు గుల్లాకు చేలల్లో తిరిగి అంతా దొంగించేస్తున్నారు. పొద్దున ఆ దొంగతనం చేస్తున్నోళ్ళను  పట్టుకొని నాలుగేట్లు తగిలిస్తే, వాళ్ళ మొగోళ్ళకు చెప్పి, మా మీద పోలీసుస్టేషన్లో  కేసులు పెట్టారంటా!’’ అంటూ ఆవేశంగా చెప్పుకొచ్చాడు.

విషయం విన్నాక  నోరెళ్ళబెట్టడం నా వంతుయింది. 

కడుపులో వికారం పుట్టి దేవినట్టయ్యింది. నా మనసు నాలో లేకుండా పోయింది. నా హావభావాలేమి అతనికి కనిపించకుండా కళ్ళజోడు సర్దుకున్నట్లు జాగ్రత్త పడ్డాను.

బండి స్టార్ట్ జేసి అక్కడ నుండి బయలుదేరాను కానీ, ధ్యాసంతా ఆయన చెప్పిన సంఘటన మీదే వుంది. 

ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్లు, భారత రాజ్యాంగం మొదలయ్యి డెబ్బై నాలుగు ఏళ్ళు అయ్యింది.

భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంకా వెలిగిపోతుందని పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు.

ఇంకా ఆకలి కోసం ఆరాటం, కూలి కోసం పోరాటం, బ్రతకడం కోసం దొంగతనం, కుల పరంగా వివక్షతో పెత్తందారీ తీర్పులు దాడి చేయడం. పేదరికంలో వున్న స్త్రీలు ఎవరైనా లైంగికంగా లొంగకపోతే ఆధిపత్య కులపోళ్ళు వేసే మొదటి నింద దొంగతనం.

 * *  

రోజూ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రక్కన వున్న హైస్కూలు నుండి ఇంటికి చేరే సరికి సాయంత్రం ఐదున్నర గంటలు అయ్యింది. నా ఏడవ తరగతి పుస్తకాలు సంచి భుజానికి తగిలించుకుని ఇంటికి వచ్చాను.  వస్తూనే మా మెర్సీ పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు పల్లెల్లోని జనమంతా గుమిగూడి ఉండండం గమనించాను. 

పల్లెల్లో గొడవలు సహజం. ఎక్కువగా భార్యాభర్తలు గొడవో, ప్రక్కంటి ఇండ్ల స్థలాల గొడవో, త్రాగుబోతులు కొట్లాడుకోవడమో ఇలా పల్లెల్లో జనమంతా గుమిగూడడం సర్వసాధారణం. 

నా పుస్తకాల సంచి, అన్నం బాక్సు ఇంట్లో పెట్టి, గాబు దగ్గర (నీళ్ళ తొట్టి) కాళ్ళు చేతులు కడుక్కుని కండువాతో తుడుచుకుంటూ పెద్దమ్మ వాళ్ళ ఇంటి వైపు నడిచాను. 

ఆ గుంపులో నుండి ఒక మగ గొంతు గంభీరంగా వినబడుతుంది. బండ బూతులు తిడుతూ అరుస్తున్నాడు. 

గుంపులో ఎవరన్నా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళను కూడా కారు కూతలు కూస్తున్నాడు.

అంత మందిలో సందుచేసుకొని దూరి పోయి మా మెర్సీ పెద్దమ్మ ఎక్కడుందో అని వెతికాను. 

ఆమె కొయ్య బారి పోయి ఆయన ఎదురు నుంచొని వుంది. 

‘‘తప్పు అయ్యిపోయిందయ్యా! ఇంకెప్పుడూ చేయనయ్యా!’’ అంటూ చేతులు జోడించి బ్రతిమాలుతుంది. 

ప్రక్కన మా పెదనాన్న వున్నాడు, మా ఇద్దరు అన్నాయిలు వున్నారు! వాళ్ళంతా ఆయనకు ఎదురు చెప్పలేకపోతున్నారు. 

పల్లెల్లో వాళ్ళయితే ఒకరి మీదకి ఒకరు అమ్మనాబూతులు కూసుకుని దెబ్బలాడతారు, కర్రలతో, గడ్డ పొలుగులతో దాడి చేసుకుంటారు గానీ, అదేం చిత్రమో ఊర్లో భూస్వామితో మాట్లాడాలంటే ఒణికిచస్తారు. ఎక్కడలేని మార్యాదలు, వినయ విధేయతలు చూపిస్తున్నారు. అట్టాఎందుకు అని నా బుర్రకు అర్థమయ్యి చచ్చేదికాదు.

దబీ.. దబీ మని శబ్ధం రావడంతో అటు చూశాను.‌ పెద్దమ్మ ఎదురు మాట్లాడుతుందని మా అందరి ముందు కర్ర తీసుకుని నాలుగు బాదులు బాదాడు ఆ పెద్దమనిషి. అందరు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.

ఆ దెబ్బలకు పెద్దమ్మ పెద్దగా ఏడుస్తూ నేల మీద కూలిపోయింది.

నా కళ్ళెదురుగా జరిగిన ఈ దృశ్యం నాకూ కోపం తెప్పించింది. కానీ, ఏం చేయలేక పెద్దమ్మ వైపే చూస్తూ ఏడుస్తూన్నాను.

అలా కొడుతున్నందుకు ఆయన్ని వారించినవాళ్ళులేరు గానీ, అందరూ ఆయన కాళ్ళా, వేళ్ళాపడి బతిమాలుతున్నవారే!

 కొట్టిన పెద్దమనిషి మా ఊరి భూస్వామి. అతనొక్కడే వచ్చి, ఇంత దైర్యంగా దాడి చేస్తున్నాడు. అయినా మేము ఇంత మంది వుండి కూడా ఆయన్ని ఏం చేయలేక‌ చూస్తూ ఉండిపోయాము.  అసలేం జరిగిందో, ఏమో నాకేం అర్థం కావడంలేదు.

మెర్సీ పెద్దమ్మ మరో ముగ్గురు మహిళలతో కలిసి పొయ్యిలోకి పుల్లల కోసం తోపులోకి వెళ్ళారు. ఆ ముగ్గురు పడుచోళ్ళు కావడంతో చకా చకా ఎండిన మండల్ని పెళ పెళ  విరుచుకుంటూ కర్ర పుల్లతో సాపు చేసుకుంటున్నారు. వాళ్ళంత ఒడుపుగా మెర్సీ పెద్దమ్మ పుల్లల ఏరలేకపోయింది. తోపు ప్రక్కనే ఈ భూస్వామి పశువుల కట్టేసే కొష్టం (సావిడి)  గడ్డివామి వుంది,‌ చుట్టూ జపాను చిల్లచెట్లును కంచగా వేసుకున్నాడు. ఆ చిల్లచెట్లలో ఎండిపోయినవి వుంటే,   నాలుగు కట్టెలు విరిచి తను ఏరుకున్న చిదుగులలో కలిపింది. 

మోపులు ఎత్తుకొని వడి వడిగా వస్తున్న నలుగురిని భూస్వామి దూరం నుండి చూశాడు. కేకలు వేస్తూ బూతులు తిడుతూ వెంటపడ్డాడు. అయనకు దొరికితే  మోపు గుంజుకొని, ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమోనని భయపడి పుల్లల మోపులతో పరిగెత్తి పల్లెల్లో పడ్డారు. భూస్వామి పెద్దమ్మను గుర్తుపట్టి నేరుగా ఇంటికే వచ్చాడు.

నిజానికి మా మెర్సీ పెద్దమ్మ చాలా మంచిది. రోజూ చర్చికి పోయి ప్రార్ధనలు చేస్తూ పాటలు పాడేది. నాట్లేసే కూలీలకు ముఠా మేస్త్రిమ్మగా ఉండేది. పది రోజులకొకసారి నాతో కూలీల లెక్కలు చూయించుకునేది. అట్లాంటామెను ఆడ మనిషనే కనికరం కూడ లేకుండ పశువుని బాదినట్టు బాదాడా పొగరుబోతు భూస్వామి. అంతా చేసి, పోతూ, పోతూ ఆ కట్టెల మోపును కూడా ఎత్తుకు పోయాడు.

ఇవన్ని మా పల్లెకి  ఊళ్ళోని భూస్వాములు ఇచ్చే ఏక పక్ష తీర్పులు. రోడ్డు మీద ఎదురు పడిన వాళ్ళ అమ్మాయిలను చూసినా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ మగ పిల్లలతో గొడవలు పడినా, అది నీళ్ళు బాయి కాడైన, పొలం గట్ల దగ్గరైనా, కారణం తెలుసుకోకుండా ఇంటి కొచ్చి తన్నేవాళ్ళు. పొలంలో పల్లెల్లోని కూలీలు తాము చెప్పిన పని సరిగా చేయనందుకు అక్కడే తన్నేవాళ్ళు. తమ చేలో పందులు, బర్రెగొడ్లు పడ్డాయని ఎరుకలోళ్ళను పల్లెల్లోవాళ్ళను ఇంటికి పిలిపించుకుని కొట్టేవాళ్ళు. 

బర్రెగొడ్ల మేత కోసం, పూరిళ్ళకు పైకప్పుల‌‌ కోసం ఎండిన పొగ కట్టెలు, కింది‌ కంప కావాలంటే, ఊళ్ళోని భూస్వాముల దయాదాక్షణ్యాల మీద ఆధారపడాల. వాళ్ళ పొలాల్లోనూ, ఇంటి పనుల్లోనూ వెట్టిచాకిరీ చేస్తేగాని ఒక మోపుకు అనుమతిచ్చేవారు.‌ 

ఇక పల్లెల్లోని స్త్రీలతో వాళ్ళు నడిపే అక్రమ లైంగిక దోపిడికి అడ్డాపుండేది కాదు. వాళ్ళ పశుబలంతో దౌర్జన్యంగా, తమకు ఎదురులేనంతగా భావించేవారు. 

 ఏదేదో ఊర్లో ఒకరోజు దారుణ మారణ హోమం జరిగింది. ఆ‌‌ పల్లెల్లోని మగవాళ్ళను, ఊళ్ళోని భూస్వాములు ఒక పథకం ప్రకారం ఊళ్ళో వాళ్ళంతా కూడబలుక్కుని అదును చూసి మూక్కుమ్మడిగా హత్యలు చేసారు, ఇళ్ళ దహనాలు చేసి, స్త్రీలను బట్టలూడదీసి అవమానించారు. పల్లె జనం ఊరు విడిచి పారిపోయేలా వెంటబడి, వేటాడి చంపేశారు. 

ఊళ్ళల్లో పాలేర్లుగా, పాసంట్లుతోమే పని‌‌ మనుషులుగా వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న పల్లెవాడలనే కాదు, మొత్తం సమాజాన్ని కలవరపరిచింది. ఈ సంఘటనతో మా ప్రాంతంలోని భూస్వాముల ఆగడాలు, దౌర్జన్యాలు బయట ప్రపంచానికి తెలిపింది. 

ఇంత ఘోరమైన సంఘటన తదనంతర పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు చల్లా చెదురుగా వున్న పల్లెలు చైతన్యం అయ్యేలా చేసింది. అది పట్టణంలో కాలేజీలలో  విద్యార్థి ఉద్యమంగా మొదలై గ్రామాలలోకి ఎగబాకింది. ఎంతో మంది యువతను ఉద్యమబాట పట్టించింది.

అలాంటి రోజుల్లో ఊరికి, పల్లెకు వచ్చే ప్రతి గొడవల్లో తరుచుగా ఊళ్ళోవాళ్ళు మమ్మల్ని  బెదిరించే వాళ్ళు.

 “ఏం రోయ్! కుడి, ఎడమ తేడా లేకుండా,  నాయాళ్ళారా నడి‌ మంచాల మీద నిగడదన్ని కూర్చుంటున్నారు. ప్రతిదానికీ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.  

“ఆ ఊర్లో  పల్లెల్లోవాళ్ళకి పట్టిన గతి పెట్టాల్రా” అని హెచ్చరించే వాళ్ళు.

కొన్నాళ్ళకు అదే ఊళ్ళో ఆ కేసుకు సంబంధించిన ఒక భూస్వామి హత్య జరిగింది. 

అప్పుడు మమ్మల్ని బెదిరించే ఊరు భూస్వాములకు హెచ్చరిక చేస్తూ 

‘‘ఆ ఊళ్ళో ఆ భూస్వామి‌కి పట్టిన గతే మీకు పడుతుంది జాగ్రత్త!’’ అంటూ బదులిచ్చేవాళ్ళం. 

అంతటి చైతన్యం పల్లె యువకుల్లోకి వచ్చింది. 

అది ఎలాంటి సందర్భంలోనైనా ప్రశ్నించడం నేర్చుకుంది. 

ఒకవైపు గ్రామంలోని ఆధిపత్య అహంకారాన్ని ఎదుర్కొంటూనే, రోజూ పట్టణంలో ఉపాధి పనులు చేసుకుంటున్నారు. అందరూ ఎంతో కొంత చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం పొందారు. సొంత భూమి కలిగి ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకున్నారు.  ఊళ్ళో ఎవరైనా అమర్యాదగా అరె… ఒరె అంటుంటే,  గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని హితవు నేర్పారు.

ఒక సారి ఎలక్షన్ సమయంలో మా ఊరి భూస్వాములు వేసే దొంగ ఓట్లను నిలువరించినందుకు, పల్లె మీదకు దాడులకు వచ్చారు. అప్పుడు పల్లె మొత్తం ఎదురు దాడికి సిద్దమైంది. మగాళ్ళు చేతికందిన ఆయుధాలతో నిలబడితే, ఆడోళ్ళు ఒళ్ళో కారం నింపుకొని సిద్ధమయ్యారు. ఎందుకోగానీ, చివరి నిమిషంలో పల్లె మీదకు వాళ్ళొచ్చే సాహసం చేయలేకపోయారు. 

ఆ. రోజు రాత్రి నుండి పదిహేను రోజులు పల్లె చుట్టూ కొంత మంది యువకులం షిఫ్ట్ లు వారిగా రాత్రి పూట ఆయుధాలతో  కాపలా కాసాము. మాకు బయట నుండి ప్రజాసంఘాల మద్దతు ఉంది. 

ఊళ్ళో వాళ్ళ రాజకీయ అండతో చేసే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొన్ని సంఘటనల్లో పల్లెల్లో యువకులం చట్టపరంగా పోలీసు స్టేషన్ కి  వెళ్ళి అట్రాసిటీ కేసులు పెట్టించి న్యాయపోరాటాలు చేశాం.  

ఆనాటి మా తెంగింపులతో  మా ఊర్లో భూస్వాముల బలుపు దిగివచ్చింది.

* * 

పొద్దు పడమటి దిక్కున వాలిపోయింది. ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది. నగరంలోని వీధి లైట్లు వెలిగాయి.

ముసురుకున్న ఆలోచన విడిపోవడం లేదు.

ఎప్పుడో నలబై సంవత్సరాల క్రితం జరిగిన ఇలాంటి దొంగతనాలు, భూస్వాముల దౌర్జన్యాలు ఇంకా ఎందుకు పల్లెల్లో పునరావృతం అవుతున్నాయి. 

పల్లెలు ఆర్ధికంగా అభివృద్ధి చెందలేదా! ఊర్లో భూస్వామ్య అహంకారం పోకపోవడానికి  కారణం ఏమిటి? ఎక్కడో ఏ మారుమూల ప్రాంతాల్లో ఇలాంటివి జరగడం అంటే అక్కడి పల్లెల వెనుకబాటు తనం వల్ల కావచ్చు. కానీ, విద్యా, ఉపాధి, ఆర్థికంగా ఎదిగిన మా ప్రాంతంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం చూస్తుంటే ఫ్యూడల్ వ్యవస్థ అవలక్షణాలు పోలేదనిపిస్తుంది. 

డెబ్భై ఏళ్ళు నిండిన దేశ స్వాతంత్ర్యంలో బ్రతకడం కోసం ఇంకా దొంగతనం చేయాల్సిన పరిస్థితి పల్లె జీవితాల్లో ఇంకా ఉన్నాయనిపించింది. ఆర్థికంగా, సాంఘికంగా లైంగికంగా వేధింపులకు పల్లెలు ఇంకా గురవుతున్నాయనిపించింది.

ఇంట్లోకి వచ్చాను, చీకటిగా వుంటే లైటు వేశాను. హాలంతా వెలుతురయ్యింది. 

నాడు మెర్సీ పెద్దమ్మ. ఇవ్వాళ వీళ్ళు. ఈ నేల మీద కుల నిర్మూలన కోసం, ఆర్థిక సమానత్వం కోసం పోరాటాలు చేసి, తమ నిండు జీవితాలు పీడితులకు అంకితం చేసిన వాళ్ళున్నారు. ఇప్పుడు స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం అడుగులు వేసేవాళ్ళున్నారు.  

ఇలా ఎంత కాలం. తరాలు మారుతున్నా ఈ బ్రతుకులకు విలువ లేదు. 

ఆలోచిస్తూనే ఇంటి నుండి హాస్పిటల్ వైపు బయలుదేరాను.

Leave a Reply