A Cat In The Kitchen

లోకాన్ని కమ్మిన చీకటి భరించలేక చంద్రుడు మబ్బుల్ని పక్కకి తోసి పూర్తిగా బయటకు వచ్చాడు. కిందికి చూసాడు… బిత్తర పోయాడు… భయపడిపోయాడు. 

కింద ఒక ఇంట్లో సన్నని వెలుతురులో ఒక ఇల్లు… సన్నగా మెరుస్తూన్నది.. కొంచెం ఒణుకుతున్నట్లుగా కూడా ఉంది ఇల్లు… చంద్రుడు ఆసక్తితో కళ్లు రిక్కించి మరీ చూసాడు. పక్కన ఉన్న చుక్కల్ని, నక్షత్రాల్నీ చూడమని అడిగాడు వణుకుతున్న కంఠంతో… చూసిన చుక్కలు మేఘాలూ కూడా వణికాయి చంద్రుడి వెనక దాక్కున్నాయి. ఒక నక్షత్రం మాత్రం… చంద్రుణ్ణి భయపెట్టిన ఆ డాబా ఇంటి మీద తన కాంతిని నిలువుగా వెదజల్లింది ‘‘భయపడకు ఇద్దరం కలిసి చూద్దాం రా..’’ అంటూ పక్కన చేరింది చంద్రుడికి ధైర్యం చెబుతూ… ‘‘సూర్యుడికి కూడా చెప్పాలీ విషయం’’ అంటూ చంద్రుడు తారక చెయ్యి గట్టిగా పట్టుకొని కిందికి చూసాడు. ఎక్కడో గ్రహాలు ఢీకొని భూగోళం ఆకాశం పగిలిన చప్పుడు భీకరంగా వినిపించింది ఆ మెరుపుల వెలుగులో…

ఆ ఇంటి పడక గదిలో.. వెలుతురు సన్నగా ఉంది. చీకటి వెలుతురు కలగలిసిన నీడలు వికృతంగా గది నిండా పారాడుతున్నాయి. గదిలో ఒక మూలుగు… నొప్పి భరించలేక… నొక్కి పడ్తున్న ఆర్తనాదం వినిపిస్తోంది గది బయటకు రాని శబ్దం… గదిలో మాత్రమే వినిపించే శబ్దం! గది మధ్యలో పట్టె మంచం పక్కన నేల మీద ఇద్దరు మనుషుల మధ్య ఒక పెనుగులాట… నేల మీద పడి ఉన్న నక్క లాంటి పురుషుడు… అప్పుడే తన పక్కనే స్పృహ తప్పి పడి ఉన్న స్త్రీతో సంభోగించాడేమో… అతనూ నగ్నంగా ఉన్నాడు… అతని మీద కూర్చున్న స్త్రీ జుట్టు విరబోస్కుని పెద్ద బొట్టుతో ఎర్రబడ్డ కళ్ళతో కోపం ఆగ్రహంతో మూల్గుతూ ఊగిపోతున్నది. ఆమె పూర్తిగా నగ్నంగా ఉంది. ఆమె అతని మీద బొడ్డు కింది భాగంలో అటో కాలు… ఇటో కాలు వేసి బలంగా అతన్ని నేల మీదకి పట్టి ఉంచుతూ ఊగిపోతున్నది.. ఉహ్హ్… ఉహ్హ్.. అని చూపుడు వేలితో బెదిరిస్తున్నది. ఆ పెనుగులాటలో అతను పక్కలకు దొర్లుతున్నాడు. ఆమె బలవంతంగా తన పొడవాటి గోళ్ళతో ఉన్న వేళ్ళతో అతన్ని గుచ్చి మరీ తన వైపుకి తిప్పుక్కుంటుంది. అతని నడుము మీద గాటు, నల్లగా మధ్య మధ్యలో తెల్లగా ఉన్న ఆ మచ్చ చిక్కగా మోటుగా ఉండి చర్మానికి అతుకున్నట్లే సన్నని దీపపు వెలుగులో మెరుస్తున్నది. ఎర్రబడ్డ కళ్లతో ఆ గాటు చూస్తున్న ఆ స్త్రీ మరింత ఆగ్రహంతో రెచ్చిపోయింది. పులిలా గాండ్రించింది…  ఆమె నోట్లో పులి కోరలు పొడుగ్గా మొలిచాయి. కసుక్కున అతని పొట్ట మీద తన చేతిలో ఉన్న కత్తితో పొడిచింది. నిర్దాక్షిణ్యంగా తన రెండు చేతులకున్న కత్తుల్లాంటి గోళ్లతో రెండు వైపులా ఛీల్చింది. తెరుచుకున్న పొట్టని పరమానందంగా ఫెటిల్లున నవ్వుతూ చూసింది… ఆమె కళ్ళు లావాలా రగిలిపోతున్నాయి.

అతగాడి పొట్ట తెరుచుకున్నప్పటి క్షణాల ఆనందం ఆమె ముఖంలో అత్యంత క్రూరమైన అందంతో నాట్యమాడిరది. వెన్నెల, చీకటి, రక్తపు రంగులు ఆమె ముఖంలో గొప్ప వెలుగు నింపాయి. అతని ఆర్తనాదాల మధ్య ఆమె తన కుడి చేతిని అతని పొట్టలో దూర్చి ‘‘నాది నాకిచ్చెయ్‌… నాది నాకిచ్చేయ్‌’’ అంటూ ఊగిపోతూ… పెళ్ళి ఉంగరం కోసం బిందెలో చెయ్యి పెట్టి వెతుకులాడుతున్నట్టే చేతిని అతని పొట్టలో కలేస్తూ… దేవులాడ్తున్నది. ఆత్రంగా… కోపంగా… ఆగ్రహంగా! అతను గిలగిలలాడ్తున్నాడు.. నొప్పితో అరుస్తున్నాడు. ఆమె చేతుల్ని తన పొట్టలోంచి పెకిలించి బయటకు తీసే ప్రయత్నంలో అలిసిపోతున్నాడు. అతనొక రక్తపు మడుగయ్యాడు… ‘ఒద్దు… ఒదులు నేను సచ్చిపోతా… నాకిచ్చినది నాది అవుతుంది కానీ నీది కాదు… తీస్కోకు… సచ్చిపోతా… నువ్వు విధవ్వవుతావు… పతివ్రత కాలేవు… ఒదులు’ అంటూ దీనంగా ఏడుస్తూ… రెండు చేతులూ జోడిరచి ఏడుస్తూ ఆమెను వేడుకుంటున్నాడు. భయంతో వొణికిపోతూన్నాడు. ఆమె హుంకరించింది ఒక్కసారిగా ఆమె ఆగింది… ఆమెకి కావల్సింది దొరికినట్లు ఆమె చెయ్యి కదలిక ఆగింది… పెకిలించి తీసినట్లుగా ఆమె తనక్కావల్సింది తీస్కుని ఆ చేతిని అలాగే పైకి లేపింది… అది ఎర్రగా.. తళాతళా రక్తంతో మెరిసిపోతున్నది… ఆ మాంసపు ముద్ద నుంచి జిగురు… జిగురుగా రక్తం కిందికి ధారలు… ధారలుగా సాగుతూ కారుతున్నది. ఆనందంతో విరగబడి హూంకరిస్తూ నవ్వింది… ఊగిపోతూ నవ్వింది. అతను ఒద్దు… ఒద్దంటూనే ఉన్నాడు. తనది తనకు తిరిగి ఇచ్చెయ్యమంటున్నాడు. మళ్లీ పొట్టలో పెట్టెయ్యమని వేడుకుంటున్నాడు. ఆమె మళ్ళీ విరగబడి నవ్వింది. హుంకరించింది… ఊగిపోయింది. అతనికి చూపిస్తూనే ఆమె తన చేతుల్లో ఉన్న దాన్ని తన పొడవాటి నోట్లోకి చాపి ఉండలా నాలుకలోకి చుట్టుకొని గుటుక్కున మింగింది… ఆమె మళ్ళీ పరమానందంతో నవ్వింది. అతని మీద నుంచి లేచి అతని చుట్టూ తిరుగుతూ నాట్యం చేసింది. అలసిపోయేంతగా ఊగింది… ఊగుతూనే… రెక్కలు మొలిపించుకుంది. రివ్వున కిటికీలోంచి ఆకాశంలోకి ఎగిరిపోయింది.

చెమటలు పట్టిన చంద్రుడు మళ్ళీ భయపడ్డాడు. ‘నా దగ్గరకేనా ఆమె వస్తుంది?’ అన్నాడు… చంద్రుడంటే మహా మోహం ఉన్న ఆ నక్షత్రం నవ్వింది… ‘భయపడకు నేనున్నాగా’ అంది. భయంతో తన ఒళ్ళో దాక్కున్న చంద్రుడి మీద మేఘపు దుప్పటిని కప్పి నక్షత్రం… ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఆ స్థావరాల్ని కనుక్కోడానికి మరింత వెలుతురిని నింపుకొని అన్వేషణకు ఎగిరిపోయింది తూర్పు దిక్కులకు… ఆ నక్షత్రానికి కూడా ఆమె కావాలేమో… కానీ నక్షత్రం ఆమెను… ఆమె ఇంటి డాబా మీదే వెన్నెలను తనలో నింపుకుంటూ కనపడ్డది… పక్కనే ఒక గర్భిణీ పిల్లి… దాని బూరు గోధుమ, జేవురు, తెలుపు రంగులతో… పిల్లి గొప్ప సౌందర్యంతో మెరిసిపోతోంది. నిండు పొట్టతో వజ్ర నీలాల గనుల్లాంటి కళ్ళతో… పిల్లి రాజస దర్పంతో కూర్చుని ఉంది. నక్షత్రం ఆమె ముందు వాలింది… పిల్లి… ఆమె ఇద్దరూ వెన్నలను చుట్టుకొని నిలబడ్డ నక్షత్రపు మహాద్భుత సౌందర్యాన్ని చూసారట్లా…

ఆమె నక్షత్రపు కళ్ళల్లోకి సూటిగా చూసింది ‘ఎందుకొచ్చావు’ అంది ఆమె…

‘నీతోనే ఉందామని’ అంది నక్షత్రం బతిమిలాడుతున్నట్లే. ఆమె పక్కనున్న పిల్లివైపు చూసింది. పిల్లి ఒప్పుకున్నట్లు తల కొద్దిగా పక్కకి విసిరి తిప్పింది. ఆమె నక్షత్రాన్ని చూస్తూ తన నోటిని భూగోళమంత తెరిచింది. నక్షత్రం ఆమె లోపల ఒదిగిపోయింది. ఆమె మరింత వెలిగిపోయింది.

ఆమె అలా చాలా సేపు చల్లని వెన్నెల్లో కూర్చుంది. తరువాత… ఆమెలో వెన్నెల కూర్చుంది… ఆమె మెల్లగా లేచింది. డాబా దిగి ఇంట్లోకి నడిచింది. ఇల్లు చీకటిగా ఉంది. 

ఆమె దీపాల్ని వెలిగించింది. ప్రతీ గదిలో వెలిగించింది. వంటింట్లో కూడా… ఎందుకంటే వంటింట్లోంచే వెలుగు ఇల్లంతా నిండుతోంది ఎందుకంటే… మృణాళిని వంట అద్భుతంగా చేస్తుంది మృణాళిని అత్తమామలకు, ఆడబిడ్డకు, మరీ ముఖ్యం ఆమె భర్త ఆనంద్‌కైతే మరీ ఇష్టం. అతగాడు ఆమె వంట లేకుండా బతకలేడు. బయటస్సలు తినడు. మృణాళిని వంట లేకుండా బతకలేడు. మరి ఆమె లేకుండా ఉంటాడా? ఉంటాడు. సందేహం లేదు. అయితే… ఆనంద్‌ మృణాళిని చెల్లెలు కృష్ణవేణి వంట కూడా తింటాడు. చేతి వంట కాదు ఆమె ఒంటి వంటన్న మాట.

మృణాళినిని వంటింట్లో ఉంచి… కృష్ణవేణిని పడకటింటికి తీస్కెళతాడు. ఇదంతా మృణాళినికి తెలిసే జరుగుతోంది. ఎందుకు జరగనిచ్చింది… జరిగిపోయింది ఆమె చేతుల్లో ఏముంది? అంతా ఆమె ఒంట్లోనే ఉన్నది. ‘నీకు గుండెలుండాల్సిన చోట మైదానాలున్నాయి. నీతో నా కోరిక తీరదు. అందుకే ఎత్తైన గుండెలున్న నీ చెల్లిని ప్రేమిస్తున్నా, కామిస్తున్నా అని అనలేక అన్నాడు’ ఆమె భర్త ఆనంద్‌.

‘నువ్వు గమ్మునుండాలి…’ అని కూడా అన్నాడు. సరిగ్గా సంవత్సరం క్రితం… మృణాళినికి తెలిసిన వెంటనే చెల్లెలుని బ్రతిమిలాడింది. ‘‘నా కాపురం కూల్చబాకు చెల్లాయ్‌.. నీకు పెళ్లి చేద్దామని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే నువ్వు నా భర్తనే నీ మొగుడిగా చేస్కుంటానంటే ఎట్లా చెల్లాయ్‌! యావండీ… నన్ను అన్యాయం చేయకండీ’’ ఆనంద్‌ కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లని కుమ్మరించింది.

‘నాకు ఎత్తైన గుండెలు లేకపోయినా చూసే చేస్కున్నారుగా…’ నిలదీసింది.

‘‘నాకప్పుడు నీవిచ్చే కట్నం… నీ పదెకరాల పొలం, సిటీలో ఫ్లాట్‌, ఇవే నీ గుండెలకంటే కూడా బోల్డంత ఎత్తుగా కనబడ్డాయి. ఏం చెయ్యను? అయినా నీకేం తక్కువని… ఇద్దరు పిల్లల్ని ఇచ్చాగా… పిల్లలు పుట్టాకైనా నీ గుండెలు ఎదుగుతాయనుకున్నా నా పిల్లల నోటికి పాలు కూడా రాలేదు… అవేం గుండెలే నీవీ… నన్ను మోసం చేసారు నీ పాడెడ్‌ బ్రాస్‌ తగలెయ్యా…’’ అన్నాడతగాడు ఈసడిరపుగా. అప్పటికే ఆనంద్‌ కర్కశమైన కోరలతో… క్రూరమైన కళ్ళతో నక్కగా మారిపోయాడు.

‘‘మీ అమ్మ మంచాన బడితే ఏర్గింది ఎత్తిబోసా… ఎంత సేవ చేసా’’ దుఃఖంతో ఒణికిపోయింది మృణాళిని.

‘‘ఆఁ చేసావులే.. చెయ్యక…? పెద్ద మదర్‌ థెరీసా దిగొచ్చిందండీ’’ అన్నాడు ఆనంద్‌ ఎకసెక్కంగా.

మృణాళిని చేసేది లేక చెల్లెలి ముందు సాగిలపడి… ‘‘నీకు ఎత్తైన గుండెలైతే ఉన్నాయి. కానీ ఆ గుండెల కింద ఉండాల్సిన అసలైన గుండెకాయే లేదేం చెల్లాయ్‌… నా ఇంటికి నిప్పెట్టకు చెల్లాయ్‌… నా భర్తను విడిచి పెట్టు నీకు నా నగలంటే ఇష్టంగా అన్నీ నీకిచ్చేస్తాను వెళ్లిపో…’’ అంటూ దుఃఖం దుఃఖమై పోతూ రెండు చేతులూ జోడించి వేడుకుంది.

‘‘ఉహూ అక్కాయ్‌… బావని ప్రేమించా బావ లేకుండా నేనుండలేను. బావకు నీతో సుఖమే లేదట… ఎందుకు చెప్పు నీకు ఈ దుఃఖం… ఎంత మందికి ఇద్దరు భార్యలు లేరు… గమ్మున ఒకే కప్పు కింద సంసారం చేస్కుందాం… కలిసిమెలిసి ఉందాం. అమ్మకీ నాన్నకీ తెలుసే… తెలుసు ఈ విషయం… నన్ను బావ నుంచి దూరం చేస్తే…  విషం మింగుతా అంటే  ఆళ్లు కూడా ఒప్పుకున్నారే అక్కాయ్‌… ఈ చెల్లి గురించి కూడా నువ్వాలోచించాలిగా చెప్పు?’’ చీర కొంగు రెండు చివర్లు పట్టుకుని నాజూకుగా అటూ ఇటూ ఊగిపోతూ అంటున్న కృష్ణవేణిని ‘‘ఇక చాల్లే పద’’ అంటూ కోపంగా ఊళపెడ్తూ నక్కగా మారిపోయిన ఆనంద్‌ చెయ్యి బట్టి తన బెడ్రూంలోకి లాక్కెళ్ళాడు. అప్పటికే మేకగా మారిపోయిన కృష్ణవేణి ఛెంగు`ఛెంగున గెంతుతూ నక్క బావ వెనకాల పడి వెళ్లిపోయింది. ఇక మృణాళిని చివరి ప్రయత్నంగా అత్తమామల కాళ్ల మీద పడింది. ‘‘పెద్ద మనసు చేస్కొని కొడుకుని దార్లోకి తెచ్చుకోండి అత్తయ్యా’’ అంది.

‘‘నీ చెల్లీ అమ్మా నాన్నలే నీకు ద్రోహం చేసారు… వాడి వైపే బలం బాగుంది. రివటలా గిడసబారిన ఒళ్ళూ… నువ్వూ! నా కొడుక్కు నీ వల్ల సుఖమే లేకుండా పోయింది కదా! మొగాడు సుఖపడాలంటే ఆడడానికి ఎత్తైన రొమ్ములు ఉండాల్సిందే… నీకవి లేవు… ఏం చేస్తాడు వాడు మరి? గమ్మున సర్దుకుపో నీ మావ కూడా ఊళ్ళో పొలం కాడ రెండో ఇల్లు పెట్టాడు. నాకు గంపెడు పిల్లల్ని, ఇంటి మీద పెత్తనాన్ని ఇచ్చాడు. ఏం నేను సర్దుకుపోలా… గుట్టుగా సంసారం చెయ్యి. గాజు కళ్ళ అత్తయ్య… అప్పటికే పూర్తిగా గొర్రెలా మారిపోయిన అత్తయ్య సకిలిస్తూ తోడేలు మావ చెయ్యి పట్టుకొని తన గదిలోకెళ్ళి భళ్ళున తలుపేస్కుంది.

ఇట్టా రెండు తలుపులు పడ్డాక మృణాళినికి వంటిల్లే మిగిలింది. వంటింటి కెప్పుడూ తలుపులు పడవు కదా… ఉన్నా వేసుకోరు వేసుకోనివ్వరు ఎవరూ… మృణాళిని గమ్మున వంటింట్లో చాపేసుకుని ముడుచుకు పన్నది… అదే ఆమె పడక గది!

హృదయమే లేని చెల్లి, భర్త… అమ్మా నాన్న, అత్తా మామలను గోజారుతూ బ్రతిమిలాడి ఏం లాభం? వంటింట్లోకి రోజూ పాల కోసం వచ్చే గర్భిణీ పిల్లి మిష్టీతో తన బాధంతా వెళ్ళబోస్కోవడం అలవాటైంది మృణాళినికి. ఆమె మాటెవరూ వినరూ… ఆమెని మాట్లాడనివ్వరు! మిష్టీ మృణాళిని మాట్లాడనిస్తుంది ఊఁకొడుతూ వింటుంది కూడా! ఆమెపైన సానుభూతితో ఊర్కో… ఊర్కో ఇక ఏమైనా చేద్దాం… ఆలోచిద్దాం… అన్నట్లు. మ్యాఁవ్‌… మ్యావ్‌ అంటుంది. ‘మృణాళిని యాడవకింక…’ అంటూ కన్నీళ్ళు తుడుస్తుంది.

ఎంత భరించాలి ఈ బాధని… కడాకు తల్లినీ బతిమలాడింది ‘అమ్మా నువ్వెలా ఊర్కున్నావే… విషం తాగుతా అంటే మాత్రం… అది తాగదే అమ్మా నా జీవితమే విషం విషం చేసేసింది కదే అమ్మా… ఎలా నాన్నా… నాన్నా… నువ్వన్నా ఆపు… దాన్ని తన్ని తీస్కెళ్ళిపోండి. నా దగ్గర్నించి… ఏంటీ నీ చేతుల్లో ఏమీ లేదా… ఎందుకు లేదూ… ఏంటీ నాలో లోపం ఉంది కాబట్టే నీ అల్లుడు చెల్లి వైపుకి వెళ్ళాడంటావా ఇంతసహ్యంగా ఎట్టా మాట్లాడుతున్నావు నాన్నా… సిగ్గెయ్యడం లేదూ… అమ్మా… అమ్మా నాన్నే నీతో ఇట్టా చేస్తే ఊర్కుంటావా… ఏంటీ సర్దుకుపోవాలా నేను సర్దుకు పోనూ… పోనూ… మృణాళిని అరిచేసింది. నిద్రొస్తుందంటూ ఎప్పుడో యుగాల క్రితమే ఆవులాగా మారిపోయిన అమ్మ  అంబా అంటూ ఫోన్‌ పెట్టెసింది. ‘‘నీ కూతురు జీవితం నాశనం అవుతుంటే నీకు నిద్రెట్టా వస్తుందే అమ్మా…’’ దుఃఖంతో మృణాళిని గుండె గడ్డకట్టిపోయింది.

ఇక మృణాళిని పిల్లి మిష్టీతోనే మాట్లాడ్డం కొనసాగించింది. పిల్లలకెలాగూ అర్థం కాదు… పసి మనసుల్ని గాయపెట్టటం ఎందుకని? రోజూ గంటల తరబడి మిష్టీ, మృణాళినిలు కబుర్లు చెప్పుకునే వాళ్లు!

వంటింట్లో ఆ రాత్రి మిష్టీ మృణాళిని దగ్గరే పడుకుంది. ఆమె పొట్టకానుకుని మృణాళిని మిష్టీని చేత్తో దగ్గరగా అదుముకుంది. ప్రేమగా దాని పొట్ట నిమురుతూ నాలుగు పిల్లలు ఉంటాయి దీని పొట్టలో అనుకుంది. అలా నిమురుతుంటే మిష్టీ పాలిండ్ల మీదకు వెళ్ళాయి మృణాళిని చేతి వేళ్ళు. అనుమానంతో మృణాళిని ఒక్కసారిగా లేచి పరీక్షగా చూసింది. దానికేం ఎత్తైన పాలిండ్లు లేవు. పుట్టబోయే పిల్లల కోసం సిద్ధపడ్డట్లు దాని చనుమొనలు కొద్దిగా పొడుచుకుని వచ్చాయి అంతే జంతువులకన్నింటికీ ఇంతేనేమో…

మనుషులకే అదీ ఆడాళ్ళకి ఇలా ఉబ్బెత్తుగా ఉంటాయెందుకు… అందర్కి ఇలా పిల్లులకున్నట్లు ఒట్టి చనుమొనలు మాత్రమే ఉంటే ఎంత బాగుంటుందో. కానీ కొన్ని జంతువులకు ఆవులకు ఉబ్బిపోయిన పాలిండ్లు ఉంటాయి. మృణాళిని ఒక్కసారి ఉలిక్కిపడిరది. తనకు… తనకు కూడా ఇలానే ఉన్నాయిగా పలకల్లాంటి గుండెలు? మిష్టీకి ఉన్నట్లు… అంటే తను మనిషి కాదా… పిల్లా…? పెళ్లికి ముందు… అమ్మ ఎన్ని మందులు వాడిరచినా తనకు ఎద పెరగలేదు.

‘అవును… నువ్వు నేనూ ఒకటే…’ రోజూ మాట్లాడే మిష్టీ తనతో అన్నట్లు అన్పించింది.

మృణాళినికి… ‘‘నువ్వు ఇంతకంటే ఇంకా ఏమైనా చేయచ్చు…’’ మిష్టీ మెల్లిగా… గరగరలాడే గొంతుతో కఠినంగా అంటూ ఆవలించింది. మృణాళిని అదిరిపోయింది. మిష్టీ మాట్లాడుతోంది. ‘‘భయపడకు మృణాళిని నీలాగ ఎవరూ మాట్లాడుకోవడానికి మనుషులే దొరకనపుడు మాలాంటి జంతువులం మాట్లాడతాం… పక్క పోర్షన్‌లో ఉండే లాబ్రడార్‌ ఛోటు కూడా తన యజమానురాలు జానకమ్మతో రోజూ మాట్లాడతాట్ట… కొడుకు కోడలు మనవళ్ళు అస్సలు మాట్లాడరట… ఎంత సేపూ సెల్‌ఫోను లేనట్ట… అయినా వాళ్లింట్లో కూడా అందరూ నక్క, తోడేళ్ళుగా మారిపోయారుట… ఒక్క జానకమ్మ తప్ప ఎవరూ మనుషులుగా మిగల్లేదుట. ఇక ఆమెకు తనకు మాట పడిపోయి మూగదాన్నవుతానేమో అన్న భయంతో నీవు ఎలా మాట్లాడుతున్నానో అలా నాతో ఛోటుగాడితో మెల్లగా మాట్లాడ్డం మొదలెట్టిందిట.. ఇక మెల్లగా ఛోటు కూడా ఆమెతో మాట్లాడ్డం మొదలెట్టాడు. నీ బాధ నేను ఛోటు గాడికి చెపుతే… జానకమ్మ బాధ వాడు నాకు చెబుతాడు. మృణాళినీ మేం ఎన్నో కబుర్లు చెప్పుకుంటాం తెలుసా? మీ మనుషుల్లా అవసర బంధాలు, ద్రోహాలు మాకు లేవు. సంసారం చేయడానికి మాకు ఒంపు సొంపులు అవసరమే లేదు. ప్రేమో, కామమో ఉంటే చాలు’’ మిష్టీ మాట్లాడుతుంది… నిలువెల్లా చమటలు పట్టినా మృణాళిని మెల్లగా తేరుకుంది. ‘‘అసలు నువ్వు ఎక్కడ్నించి వచ్చావు? ఈ దేశం కాదు నీది’’ అంది మృణాళిని మిష్టీని పరీక్షగా చూస్తూ. ‘‘పర్షియన్‌ హిమాలయన్‌ బ్రీడ్‌ నాది. ఇక్కడి దాన్ని కాదు. నన్నెవరో విమానం నుంచి ఈ దేశపు భూమ్మీదకి వదిలారు..’’ అంది గర్వంగా మిష్టీ.

‘‘ఇంకా నేను ఏమో చేయచ్చు అంటున్నావు మిష్టీ ఏంటది’’… మృణాళిని ఆసక్తిగా అడిగింది.. మిష్టీ గిన్నెలో పాలు పోస్తూ… మిష్టీ కళ్లు మూస్కొని క్షణాల్లో పాలు తాగేసింది. ఆయాసపడ్తూ కొంచెం అటు ఇటు తిరిగింది. ఆగింది… మళ్ళీ గిరగిరా తిరిగింది. ‘‘మూడేళ్ళ క్రితం నువ్వు మీ ఆయనకు గుండెకాయకంటే విలువైనదే చాలా పెద్దదే ఇచ్చావు గుర్తు తెచ్చుకో అది తిరిగి తీసేసుకో… అప్పటికి కానీ వాడికి బుద్ధి రాదు!’’ ఒక్కసారి మిష్టీ భీకరంగా పులిలా గాండ్రిరచి ముందరి కాలి పంజాతో నేల మీద చరిచింది గర్భిణి ఏమో.. గస పోస్కుంటూ కూలబడింది. అంటే… మృణాళినికి మొదట అర్థం కాలేదు ఆనంద్‌కి ఏవిచ్చింది… ఇల్లిచ్చింది, ఒళ్లిచ్చింది. ఇంత విలువైన ఏడేళ్ళ జీవితం… పిల్లలు… దివారాత్రుల సేవ… రుచికరమైన భోజనం… అవును వీటన్నింటితో పాటు ఇంకా ఏమిచ్చింది? ‘‘కొంచెం నీ చీర కాస్త బొడ్డు కిందికి జరుపు’’ అంది మిష్టీ చిరాగ్గా… ‘‘ఇదే మరి… మీ ఆడాళ్ళకు ఎవరికి ఏం ఇచ్చారో కూడా సోయి ఉండదు వెర్రి ముఖాలు’’… అంది కోపంగా… చూడక్కడ… మిష్టి తన నోటితో ఏదో మంత్రం వేసి ఉఫ్‌ అని వంటింటి గోడ మీద ఒక తెర సృష్టించింది. మృణాళిని వైపు తిరిగి చూడు అని స్క్రీన్‌ వైపు చూడమన్నట్లుగా సైగ చేసింది. మృణాళిని కళ్ళు పెద్దవిగా చేసి చూడసాగింది మిష్టితో పాటుగా… ఒంటిమీద అణువణువునా నల్లగా మొగుడు అన్న టాటూతో మంచి ఆరోగ్యంగా… ఒక పురుషుడు తన వొళ్ళో ఒక పెద్ద బంగారు గంగాళం పెట్టుకుని రాజసంగా కూర్చుని ఉన్నాడు. ప్రకృతి అంతా మాగురు మాగురుగా ఉంది. నక్షత్రాలు నీరసంగా మెరుస్తున్నాయి.. ఖంగారుగా తిరుగుతున్నాయి. మేఘాలు ప్రసవించే ముందరి గర్భిణీలా నిండుగా కన్నీళ్లు నింపుకొని భారంగా కదులుతున్నాయి. చంద్రుడు మధ్య మధ్యలో జరిగేది చూపించడానికి అన్నట్లు వస్తూ పోతూ ఉన్నాడు.. జరిగేది తనకిష్టమే లేనట్లు మొఖం మాడ్చుకుంటున్నాడు.

ఒక్కో స్త్రీ మెడలో పెద్ద తాళి వేలాడుతున్నది. కాళ్ళకి మెట్టలు, చేతికి గాజులు, తలలో పువ్వులు పెద్ద బొట్టు… ఒంటి నిండా చుట్టుకున్న చీర.. మొఖంలో బోలెడంత శాంతి, ఓపిక, సహనం, ప్రేమలతో గొప్ప కళా కాంతులతో వెలిగిపోతున్నారు ఆ స్త్రీలలో కొందరు.. ఇంకొందరు స్త్రీలు కోపంగా, దుఃఖంగా.. తల కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. మెడలో పతివ్రత అన్న నేమ్‌ ప్లేట్‌ సన్నని సంకెలతో వేలాడుతూ ఉన్నది. నెత్తిమీద త్యాగమూర్తి అని సన్నగా రాసి ఉన్న కిరీటం మెరుస్తున్నది. ఆ స్రీలు మధ్య మధ్యలో ఉన్నాయో లేవో అని వాటిని తడిమి చూసుకుంటూ ఉన్నారు. పక్కకి జారుతున్న వాటిని ఈ మొగుడన్న పురుషుడు సన్నని వెండి ఈటెలాంటి దానితో తాను ఉన్న చోటు నుంచే సరి చేస్తున్నాడు. ఆ స్త్రీలు ఒక్కోరు ఆ గంగాళంలోకి ఒకరు గర్భసంచిని, మరొకరు గుండెకాయని, ఇంకోరు కిడ్నీలను… ఒకామే రొమ్ములను, మరొకామె పెదాలను, కళ్ళను, వెంట్రుకలను, చెవులు నోరు.. నాలుక వీటన్నింటినీ అక్కడ ఉన్న కత్తితో తమ శరీరాలను కోసేసి నొప్పిని పళ్ళ బిగువున కన్నీళ్లతో భరిస్తూ ఆ పురుషుడు ధీమాగా పట్టుకున్న గంగాళంలో వేస్తూ పోతున్నారు. ఒక స్త్రీ అయితే.. నేరుగా తన రక్త నాళాల్లోంచి రక్తాన్ని గంగాళంలో పంపు చేసేస్తోంది. మరోకామే.. తన చర్మం నుంచి లీటర్ల కొద్దీ చెమటను ధారపోసి ఎండిపోయి కట్టేలాగా బిగుసుకు పోయి విరుచుకు పడిపోయింది.

చివరగా నిలుచున్న స్త్రీ తన తల నుంచి మెదడును తీసి అతని గంగాళంలో వేసింది. అప్పటికి కానీ ఆ పురుషుడు సంతృప్తి పొందలేదు. మెదడు ఇచ్చిన స్త్రీని మెచ్చుకోలుగా చూస్తూ ఆదర్శ గృహిణి కిరీటాన్ని ఆమె నెత్తి మీద తన చేతిలో ఉన్న వెండి ఈటెతో పెట్టి అటూ ఇటూ అడ్జస్ట్‌ చేసాడు. అందులో కొందరు జాలి, జాలిగా ఉన్నారు.. ఇంకొందరు కోపంగా.. ఆగ్రహంగా కంపించి పోతున్నారు. మరికొందరు పిచ్చివాళ్ళల్లా నవ్వుతూ.. ఊగిపోతున్నారు. కొందరు అమాయకంగా పాటలేవో పాడుతున్నారు. కొంతమందైతే తమకి తెలీని భాషల్లో ఏవో మాట్లాడేస్తున్నారు. అలా మరికొందరు స్త్రీలు చేతులు, కాళ్లు ఇలా ఒక్కో శరీర భాగాన్ని కన్నీళ్ళతో.. నొప్పితో.. చాలా సార్లు అవమాన భారంతో, గాజు కళ్ళతో ఇస్తూ పోతున్న స్త్రీలు.. తమకి చేయి అందిస్తున్న నక్షత్రాల చేతుల్ని అందుకుని అక్కడి నుంచి అదృశ్యమైపోతున్నారు. కొత్త స్త్రీలు క్యూలో చేరుతూనే ఉన్నారు. ఆ పురుషుడి గంగాళం ఎంతకీ నిండదు.. ‘‘నాకు ఆకలెక్కువ.. అయినా ఏమిచ్చారని ఈ స్త్రీలు పురుషుడికి? ఇంకా ఇంకా ఇవ్వాలి..’’ గంగాళం పగలబడి నవ్వుతోంది… మృణాళిని చూడలేక పోతోంది.. కన్నీటి పర్యంతం అయిపోతూ ‘‘మిష్టి.. తీసేయ్‌.. స్క్రీన్‌ ఆఫ్‌ చెయ్యి. నేను చూడలేను’’ వెక్కి వెక్కి ఏడుస్తూ మృణాళిని నేల మీద కూర్చుండి పోయింది.

‘‘చూసావా.. ఇన్ని ఇస్తారు మీరు మీ భర్తలకు.. మెట్టినింటికి.. నువ్వూ ఇచ్చావు చాలా… నేను వంటింటి పిల్లిని మృణాళినీ.. ఇలా యుగాలుగా చూస్తూ.. వస్తూనే ఉన్నాను. నువ్వు కూడా ఇలా చాలానే ఇచ్చావు.. గుర్తు చేసుకో ఒకసారి… నీ గుండెనీ.. వొంటినీ తడిమి చూసుకో ఒక్కసారి’’ అంది మిష్టి. మృణాళిని ఒక్కసారిగా తన పొట్ట వైపు చూస్కుంది అడ్డంగా నిలువుగా పెద్ద గీతలు… కుట్లున్న ఆపరేషన్‌ గీతలు కనబడ్డాయి. కూతురు పెద్దది.. తర్వాత కొడుకు పుట్టాడు. రెండేళ్ళకే లంగ్స్‌ సమస్య వచ్చి పోయాడు. అప్పటికే పిల్లలు కాకుండా ఆపరేషన్‌ అయిపోయింది. రెండు ట్యూబులు యాభై శాతం మూసుకుపోయాయి. ‘‘ట్యూబులు మళ్ళీ తెరుస్తారు, పిల్లలు పుట్టటానికి. ఏం కాదు చేయించుకో’’ అప్పటికే నక్కగా మారిపోయిన ఆనంద్‌ కోరలు కనిపించాయి ‘‘కొడుకు కావాలి నాకు… ఆడపిల్ల వద్దు ఆడపిల్లను కంటే పుట్టింటికి పోవాలి’’ కర్కసంగా అన్నాడు.

మళ్ళీ ఆపరేషన్లు… మందులు, అదృష్టం బాగుండి కొడుకు పుట్టాడు. తన కాపురం నిలబడిరది. అంటే మిష్టీ ఏమంటుంది. తన కొడుకు, పాపని తీస్కోని వెళ్ళిపొమ్మనా? అంతేనా… మిష్టీ మళ్ళీ అరిచింది. ‘‘కొంచెం చెయ్యి పొట్టనుంచి వెనక్కి తీసుకో నడుము మీదకి’’… అంటూ మృణాళిని చేయి వెనక్కి పోనిచ్చింది. అక్కడో గాటు ఉబ్బెత్తుగా తగిలింది.

‘‘ఆఁ అదీ… అర్థమైందా?’’ మిష్టీ నొక్కి మరీ అంది. మృణాళిని బిత్తరపోయింది. అవును ఈ గాటు… నాలుగేళ్ళ క్రితం… ఆనంద్‌కి ఏక్సిడెంట్‌ అయ్యింది. కాలు ప్రాక్చర్‌ అయింది నొప్పితో విలవిల్లాడాడు. నొప్పి తగ్గే మందులు చాలా వేస్కున్నాడు. చాలా కాలం వేస్కున్నాడు. దాదాపు యాడాది పాటు దాంతో ఉన్నట్లుండి అతని రెండు కిడ్నీలు పాడైపోయాయి. అతని బంధువులలో ఎవరూ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. తల్లిదండ్రులు కూడా ‘‘అమ్మో ఈ వయసులోనా’’ అంటూ తప్పుకున్నారు. బయట దొరకలేదు.

తనది బాగా మేచ్‌ అయ్యింది. తన భర్త తన చేతులు పట్టుకొని ఏడ్చేసాడు. ‘‘నువ్వు కిడ్నీ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు విధవ్వైపోతావ్‌… పిల్లలు అనాధలవుతారు. ఇచ్చావా చరిత్రలో భర్త కోసం త్యాగం చేసిన పతివ్రత అయిపోతావ్‌’’ అంటూ ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చాడు. నక్కనించి దీనమైన జింకలాగా మారిపోతూ… ‘‘ఒక్క కిడ్నీతో బతికేయచ్చు. నీ మొగుడు వాడు ఇస్తే ఏం?’’ కిడ్నీ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పిన ఆడపడుచు… ‘‘మరీ గుండెల్లేని ఆడదానిలా ఉండబాకు కోడలా – నా కొడుకుని బతికించుకునేది ఇక నీ చేతుల్లోనే ఉంది’’ అత్త దొంగేడ్పులు ఏడుస్తోంది. ఏ గుండె కావాలి వీళ్ళకి? ఎత్తైన గుండెలు కావాలి… వాటి కింద ఉండే గుండెకాయా కావాలి.. ఎట్టా? ఇచ్చేసింది ఆవేశంతో… అమాయకత్వంతో గొప్ప త్యాగం చేస్తున్నా అన్న పిచ్చి మమకారంతో… భక్తితో పిల్లలకు తండ్రి ఉండాలన్న భయంతో కిడ్నీ తీసి ఇచ్చేసింది. అప్పటికే పూర్తి పతివ్రతగా మారిపోయిన మృణాళిని.

ఆనంద్‌ మృణాళిని కిడ్నీ తీసేస్కుని తన శరీరంలో పెట్టేసుకున్నాడు. అవునవును తాను భర్త ప్రేమ కోసం కడుపుని రెండు సార్లు కోసి కొడుకుని ఇచ్చేసింది. ఇంకోసారి నడుమును కోసేసి కిడ్నీ ఇచ్చేసింది. మిగిలిన తన ఒక్క కిడ్నీ పాడైతే తన బతుకేంటి అని ఆలోచించలా… ఇచ్చేసింది అంతే. భార్యనించి… ఆమె కడుపు కోసి ఇచ్చిన కొడుకుని తీస్కున్న ఆనంద్‌ తన వంశం కొనసాగుతుందని మురిసిపోయాడు. భార్య నడుము కోసి ఇచ్చిన కిడ్నీ తీసుకున్న ఆనంద్‌ తన జీవితం రోగాల్లేకుండా కొనసాగుతుందని హమ్మయ్య అని నిట్టూర్చాడు.

ఆమె ఒంటి నుంచి కిడ్నీ తీసేసుకున్నాక… ‘‘ఏవీ లేవు నీకు… డొల్లగా మారావు అని’’ ఆమెనే పక్కకు తోసేసి రెండు కిడ్నీలు, ఎత్తైన రొమ్ములూ ఉన్న మరదలిని ట్రాప్‌ చేసి లొంగదీస్కున్నాడు.

అవును! తన కిడ్నీ భర్త దేహంలో ఉంది. తాను అతనికి ప్రాణం పోసింది. ఎంత ప్రేమగా బాధ్యతతో ఇచ్చిందని? ప్రతిగా ఏమిచ్చాడు తనకతను? తన చెల్లిని తీస్కున్నాడు… ఎత్తైన గుండెలు లేవని తన బక్క పల్చటి ఒళ్ళు… అతనిలో సెక్స్‌ కోరిక కలిగించడం లేదని తనను వద్దనుకున్నాడు. తన కళ్ళముందే తన స్వంత చెల్లితో సరసాలాడుతున్నాడు.

‘‘ఊఁ గుర్తొచ్చిందా… నీకు ఆ గాటు అక్కడ ఎందుకు ఉందో… ఇంతకూడా భయపడక… నొప్పికి వెరవక నీ చర్మం కోసి నువ్వు నీ భర్తకి ఏం ఇచ్చావో గుర్తుకు చేస్కో… కిడ్నీ ఇచ్చావు… ఎంత విలువైంది అది… నీకేఁవైనా వెళ్ళిక!’’ కోపంగా పచార్లు చేస్తున్న మిష్టీ ఒక్క ఉదుటున వంటింటి కుకింగ్‌ రేంజ్‌ మీద నుంచి సింకులోకి దూకింది. దూకేటప్పుడు చికెన్‌ కోసే బారాటి కత్తి నేలమీద పడి ఠంగున చప్పుడు చేసింది. మృణాళిని వైపు ఓరగా చూస్తూ మెడ అలవోకగా పక్కకి తిప్పుతూ.. సైగ చేస్తూ చెంగున కిందికి దూకి కత్తిని చేత్తో మృణాళిని వైపుకి తోసింది మిష్టీ! ఇంకేం… కత్తి తీసుకో అన్నట్లు.

మృణాళిని మెల్లగా కత్తిని తీస్కుని మిష్టీని ఎత్తుకుని దాని కళ్ళల్లోకి లోతుగా ప్రేమగా చూస్తూ ముద్దు పెట్టుకుంది. 

‘‘నాకు రోజూ ఒకే కల వస్తుంది. మృణాళినీ ఎవరో స్త్రీ వెన్నల రాత్రి ఒక మగ మనిషిని పొట్టలో పొడిచి అతని మీద కూర్చుని చేతులతో అతని పొట్టలో దేనికోసమో కెలుకుతున్నట్లు’’ మిష్టీ మర్మగర్భంగా చెబుతుంటే మృణాళిని చిన్నగా సడిలేకుండా నవ్వింది.

ఆ రోజు రాత్రి… నట్ట నడిరాత్రి పక్కింట్లో ఛోటుగాడు నిద్రపోని జానకమ్మను నిద్రపొమ్మని, ఎంత సేపు కబుర్లాడాలాని కసురుతున్నాడు.

పడక గదిలో ఆనంద్‌ తన మరదలితో శృంగారం ముగించి పడుకున్నాడు. మరో గదిలో అత్త ఆవు, మామ తోడేలు కూడా పడుకున్నారు.

అంతా నిద్రపోతున్నారు.

మృణాళిని మిష్టీని మెల్లగా జరిపి లేచింది. మిష్టీ తనను తాను పక్కమీద అనువుగా సర్దుకుంది. 

‘‘పాదాలకున్న అందెలు తీసెయ్‌’’ మిష్టీ గుసగుసగా చెప్పింది.

మృణాళిని అందెలు తీసేసి గూట్లో పెట్టింది.

ఆమె ముఖం మీద కిటికీలోంచి వెన్నల సగం పడి భీకరంగా మెరుస్తోంది. మృణాళిని అప్పటికే భీకరమైన పులిగా మారిపోయింది. అది చూసిన మిష్టీ వెంఠనే.. పిల్లి గంతులేసింది. ఆనందంతో చప్పట్లు కొట్టింది. ఆమె మొత్తం వెన్నల్లోకొచ్చి నిలబడి… అల్మారాలో దాచిన చికెన్‌ కోసే బారాటి కత్తి తీస్కొని మిష్టీ వైపు తల తిప్పి… వెళ్లొస్తా అని సైగ చేసి… వంటిల్లు దాటి… భర్త పడక గది వైపు సడి లేకుండా తన మెత్తటి కాళ్ళ పంజాలు నేల మీద పెట్టి… వారగా ఉన్న భర్త పడక గది తలుపు తోసుకుంటూ లోపలికెళ్ళి లోపల్నించి తలుపు వేసేసింది. అప్పుడు మూసిన ఆ తలుపుల్లోంచి గాఢమైన మార్మిక సంగీతం అలల్లా వంటింట్లో ఉన్న మిష్టీని చేరింది. మిష్టీ తన్మయంగా కళ్ళు మూసుకుంది.  మిష్టీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెచ్చని కన్నీళ్లు మిష్టీ చెంపల మీద నుంచి నేల మీదకి ముత్యాల్లా రాలాయి.

కొంచెం సేపయ్యాక మృణాళిని తలుపు తీస్కుని బయటకు వచ్చింది. కొంగులో ఏదో భద్రంగా పట్టుకుంది. రక్త శిక్తమైన కత్తి చక్‌మని మెరుస్తున్నది. గదిలో నేలమీద కుప్పకూలిపోయిన ఆనంద్‌ ‘‘మృణాళినీ… నా కిడ్నీ నాకివ్వు… లేకపోతే నేను సచ్చిపోతాను. ఇక నువ్వు పతివ్రతవు కాలేవు, నీ పిల్లలు అనాథలవుతారు’’ అని పొర్లి పొర్లి రక్తపు మడుగులో పడి ఏడుస్తున్నాడు.

వంటింట్లో కొచ్చిన మృణాళినిని చూసి మిష్టీ ఆవేశంగా గాండ్రించింది…  ‘‘తెచ్చుకున్నావా నీ కిడ్నీ…’’ తలెత్తి నీలాల రంగులో మెరిసిపోతున్న కళ్ళతో మిష్టీ అడిగింది. ‘‘తెచ్చా… ఇదిగో’’ అంటూ మృణాళిని తన చేతుల్లో ఎర్రగా మెరిసిపోతున్న మాంసపు ముద్దని తన వైపు చాపుతూ చూపించింది. మృణాళిని తాను తెచ్చిన దాన్ని ఫ్రిడ్జిలో జాగ్రత్తగా పెట్టింది. కత్తి శుభ్రం చేసి అలమరలో భద్రంగా దాచింది. పెరట్లోని స్నానాల గదిలో చేతులు ఒళ్ళు నిదానంగా కడుక్కుంది. తలారా స్నానం చేసింది. మృణాళిని స్నానం చేస్తుంటే పెరట్లో స్నానాల గది బయట వెన్నల్లో మిష్టీ ఆనందంతో నృత్యం చేసింది. తను చేస్తున్న పనంతా ఆనందంగా చూస్తున్న మిష్టీ దగ్గరకు వచ్చి మిష్టీని ముద్దు పెట్టుకొని చేతుల్లో కెత్తుకుని… తడిసిన పొడవాటి కురుల్లోంచి నీటి ముత్యాలు రాలి పడుతుంటే… మెల్లిగా డాబా పైకి వెళ్లింది మృణాళిని.

ఆమె అలా చాలా సేపు చల్లని వెన్నెల్లో కూర్చుంది.

తర్వాత ఆమె లోపల వెన్నెల కూర్చుంది.

ఆమె వెన్నెలైపోయింది!

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

2 thoughts on “A Cat In The Kitchen

  1. మాటల్లేవ్….సెహభాష్ మృణాళిని.

Leave a Reply