మాఫ్ ‘కరోనా’ ! మాఫ్ ‘కరోనా’ !

పగలైనా రాత్రైనా ఒకటే మనాది
లోపలా బయటా ఒక్కటే వ్యాధి
నిర్మానుష్యత కమ్ముకున్న నిశ్చేష్టం
అగులూ బుగులూ పుట్టి రగులుకుంటున్నది
నిశ్శబ్దావరణంలో ఉన్నా నిప్పేదో
రాజుకొని ఊపిరాడకుండా చేస్తున్నది…

నిన్నటిదాకా అల్పజీవుల ఉసురులు తీస్తూ
బక్క కుక్కలను బలంగా తంతూ
‘నిర్జీవు’లంటూ విరగబడినందుకేమో
నా అసంపూర్ణ మేధస్సును విధి
కెలికి కెలికి గాయం చేస్తున్నది
అసమర్ధతను అనుక్షణం సవాల్ చేస్తున్నది…

దిక్కుతోచనితనంలో దిగబడి ఉన్న
ఈ సమయంలో నా పాపాలన్నీ
కోరలుసాచి నన్నే కాటేస్తున్న భయం
నా నేరాల చిట్టా తిరగబడి నన్ను
శిక్షిస్తున్న కలిసిరాని కాలం
మరుగుజ్జును చేసిన మాయాజాలం…

హఠాత్తుగా నాలో మానవతా మథనం
హృదయాంతర్యాల దహనం
మట్టిలోపడి పొర్లుతూ క్షమాభిక్ష కోసం
పంచభూతాలనూ వేడుకుంటున్నాను
మాఫ్ ‘కరోనా’..! మాఫ్ ‘కరోనా’..!

నన్ను నిలబెట్టే మనిషెవరైనా
ఇటు వస్తారని..!?
ప్రాణదీపం వెలిగిస్తూ
అంధకారంలో బందీనైన నాకు
వెలుగువాకిళ్ళకు తోవ చూపుతారని!?

పుట్టింది వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌. క‌వి, ర‌చ‌యిత‌. విద్యాభ్యాసం వ‌రంగ‌ల్‌లో. బాల్యం నుంచే సాహిత్య‌- ఉద్య‌మాల ఆస‌క్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్య‌మం మొద‌లు, మొన్న‌టి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వివిధ సాహిత్య, ప్ర‌జా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. 12 స్వీయ ర‌చ‌న‌ల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంక‌ల‌నాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

7 thoughts on “మాఫ్ ‘కరోనా’ ! మాఫ్ ‘కరోనా’ !

 1. చాలా బాగుంది రజిత గారు

 2. “దిక్కుతోచనితనంలో… మాయాజాలం… ”
  వాస్తవభావనల్ని శక్తిమంతంగా చెప్పారు.🌿🌺

 3. రజిత గారు, నమస్కారం , మీరు రాసిన కవిత చాలా బాగుంది. హృదయాంతరాలలో ని ఆవేదనను బహిర్గతం చేస్తోంది.

 4. వావ్…రజితగారుా..మిీతొో పరిచయం , చాలా ఆనందం గా ఉంది. కవిత చాలా బాగుంది. మిీ స్నెేహం నాకు పంచి ఇచ్చి నందుకు ధన్యవాదాలు .🙏🙏

 5. నిశ్శబ్ధావరణంలో వున్నా నిప్పేదో రాజుకొని
  ఊపిరాడకుండా చేస్తున్నది.
  నిక్కచ్చిగా వచ్చిన వ్యక్తీకరణ
  చాలా బావుంది రజితగారు కవిత.

 6. ” కెలికి కెలికి గాయం చేస్తున్నది …..”
  మనందరి ప్రక్షాళనకోసమేనేమో …అన్న నీ ఆలోచన బాగుందిరా , తల్లీ …
  అభినంధనలు !
  ఆరోగ్యం బాగుందిగా …..

Leave a Reply