మల్లు స్వరాజ్యం

గుండె సొమ్మసిల్లీ, నరాలు అలసిపోయి
తన కాలం మీద కన్రెప్పలు దించి సెలవు తీసుకున్న
తొంభై రెండేళ్ల ఆ ముసలి వగ్గు మరణంలో
విషాదం ఉండకపోవచ్చు
కానీ ఆమెకి ఇచ్చే వీడ్కోలుతో
హృదయం అశ్రుసిక్తం అవుతున్నది
కొందరు ఇచ్చే స్ఫూర్తికి
కన్నీళ్లతో తప్ప మరో విధంగా ఋణం తీర్చుకోలేం
యోధుల జ్ఞాపకాలతో రాలిపడే కన్నీరు
చేతకాని దుఃఖం కాదు

భూమి మీద మొక్కలా మొలిచి
వృక్షంలా ఎదిగిన వాళ్లకే తెలుసు
భూమి తనకు జన్మనివ్వడానికి
ఆకాశంతో ఎండలు మండినప్పుడు పోరాటం చేస్తుందని
వర్ష ధారల సమయంలో స్నేహమూ చేస్తుందని!
ఆమె భూమి బిడ్డ
ఆమె సమాజంతో పోరాటమూ చేసింది
గొప్ప స్నేహమూ చేసింది
ఆమెని చూస్తే అర్ధమవుతుంది
నినాదాలు సమాజం మీద ఆగ్రహం నుండే కాదు
మనుషుల మీద ప్రేమ నుండీ పుడతాయని
గుండెలో ఒక కవాటంలో ప్రేమని
మరో కవాటంలో పోరాటాన్ని
రక్తంలా పరుగులు పెట్టించిన
భూమి పుత్రిక ఆమె
పాలు తాగే బిడ్డని మరో తల్లికిచ్చి
మొత్తం సమాజానికి రొమ్మునిచ్చి
ఒక బిడ్డ తల్లి మొత్తం సమాజానికే తల్లి
ఎలా కాగలదో ఆమె చూపించారు

కొంతమందే ఉంటారు
కాల శాసనాల్నికనుగొని చదివి
అందరికీ వినిపించేవారు
వారు కాలానికనుగుణంగా
బందూకునైనా అందుకుంటారు
కలాన్నైనా పట్టుకుంటారు
హలాన్నైనా మోస్తారు
నీటిలో చేపలా అందరి గుండెల్లో ఈదుతుంటారు
జనం మస్తిష్కాల్లో వనాలై విరబూస్తారు
అందుకుగాను ఆమె తన జీవితం మీద
దట్టమైన అడవుల్ని పెంచుకున్నారు
నదుల్ని పారించారు
సముద్రాల్ని ఒడిసిపట్టారు
యోధత్వాలకి మీసాలు అవసరం లేదని
వంటింట్లో గరిటెలు వదిలేసిన వాళ్లు
పొలం గట్ల మీద రైఫిళ్లు పాతి
ఎర్రజెండాలతో పహారా కాయొచ్చని
ఆమె ప్రపంచం మొత్తం వినబడేలా
అరిచి మరీ నిరూపించారు

స్త్రీలు భూమి ఎప్పుడూ ఒక్కటే
ఎప్పుడూ ఎవో పదఘట్టనలే
దేహం నిండా బతుకు నిండా!
జీవితం, భూమి ఆమెకి కొన్ని ప్రశ్నలు నేర్పాయి
అడవుల్లోనూ మైదానపు పల్లెల్లోనూ నగరాల్లోనూ
జైళ్లలోనూ చట్ట సభల్లోనూ బానిసత్వం లేనిదెక్కడ?
ఆమె చెప్పింది
ప్రశ్నల్లేకపోవడమే మానసిక మరణం
అది స్వీయ శ్రద్ధాంజలికి సరైన సమయం

ప్రశ్నలకి సమాధానం దొరికేవరకు
ఆమె జీవించే వుంటుంది
లక్షల ఎర్రజెండాలుగా!

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

One thought on “మల్లు స్వరాజ్యం

Leave a Reply