విద్వేషపు కాలంలో మన ఆయుధం కవిత్వమే!

విద్వేషాలు రెచ్చగొట్టి మనుషులను చీలుస్తున్న వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వాల ఆదరణ పొందుతున్న అత్యంత కుట్రపూరిత పన్నాగాలు నడుస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. పాలకులు కుట్రల అమ్ములపొదిని వీపుకు కట్టుకు తిరుగుతున్నారు. ఒకదేశం అనిలేదు. ఒక ప్రాంతమని లేదు. దేశదేశాన ఒక విద్వేషపూరిత విషపువాన మానవ సమాజంపై కురుస్తోందా! అన్న అనుమానం ఆవరిస్తోంది. మనుషుల్ని రంగు బట్టి రూపు బట్టి తినే తిండిని బట్టి.కట్టుకునే బట్టని బట్టి మొక్కే దేవుణ్ణి బట్టి, మాట్లాడే భాషని బట్టి చీలికలు పేలికలిగా చీలుస్తున్న రాజకీయ ఉగ్రవాదం వీరవిహారం చేస్తున్న సందర్భంలో సమూహాలను చైతన్య పరిచే సృజనను మనం ఆయుధంగా చేతబట్టాలి.

విద్వేషం నూరిపోస్తున్న వ్యక్తులు, సంస్థల్ని సమాజానికి ఆదర్శంగా అభివరింస్తున్న వర్తమానంలో మనుషుల మధ్య ద్వేషం తప్ప దయ, ప్రేమ, నమ్మకం, స్నేహం వంటి సుగుణాలు చిగురుస్తాయా? దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ సమాజంలో ఒక భాగమైన మనుషులను శత్రువులుగా, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ, సినిమాలు తీస్తూ ప్రచారం చేస్తూ మనం ఇప్పటికే దేశం నిండా ద్వేషాన్ని నింపేశాము. ఒకవైపు దేశమంటే మనుషులని, కవితలు రాసుకున్నాం, కథలు రాసుకున్నాం. ఆ మనుషుల్లో అందరూ ఉన్నారన్న స్పృహను మనసులో విత్తుకోము. కుల, మత, వర్గ, వర్ణ తారతమ్యాలు లేకుండా కలిసి బతకడమే అసలైన దేశభక్తి అని, అది దేశ సమైక్యతకు మూలమని మాటవరసకైనా మననం చేసుకోము. ఎందుకంటే మనది కుల భారతం. మనిషిని కుల మత తూకంలో తూచే వేదభూమి. అట్టడుగు మనుషుల వేదన పట్టని (అ)ధర్మ భూమి.

ప్రతిరోజూ పాఠశాలల్లో భారతదేశం నా ‘మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు’ అని సగర్వంగా ప్తతిజ్ఞ చేస్తాం. ఆచరణలో సోదరత్వానికే తూట్లు పొడిచి ప్రవర్తిస్తాం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని గొప్పగా చెప్పుకుంటాం. దేశాన్ని ప్రేమించడమంటే దేశంలో మనిషుల్ని ప్రేమించడం కదా.ప్రేమించడమంటే బాధ్యత కదా. వారసత్వ సంపద గర్వకారణం అంటున్నామే ! ఏమిటి అది? మనుషుల్ని చీల్చడమేనా? కొందరు ఉద్దేశపూర్వకంగా, విషపూరిత ఆలోచనలతో తరయారు చేసిన విధానాలు, కొందరు స్వార్థపూరిత కుట్రలనుంచి పుట్టిన విచ్ఛిన్నకర ఎత్తుగడలు సమాజాన్ని అశాంతిలోకి, అభద్రతలోకి నెట్టేస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడమే అసలు సిసలైన దేశభక్తి అన్నది మనం మరిచిపోకూడదు. దేశ సమగ్రతకు సమైక్యతకు ఆవుపట్టులాంటి భిన్నత్వంలో ఏకత్వంలోనే భారతీయత మనుగడ అనే సత్యాన్ని చేతులు కలిపి కాపు గాయాలి. ఇటువంటి సంధర్భంలో నాకు ఎదురుపడిన ఓ కవితను వర్తమాన కాలం గుండె చప్పుడు గా మీతో పంచుకుంటున్నాను. ఈ కవిత ఎన్. వేణుగోపాల్ గారు తెలుగు చేసిన హిందీ కవి నిఖిల్ సచాన్ గారి కవిత ‘ముసాల్మన్ల మొహల్లా’. వేణుగోపాల్ గారు ఇటీవలే వెలువరించిన ‘నా ఆయుధం కవిత్వామే’ అనువాద కవితల సంపుటిలోనిది. వర్తమాన భారతదేపు రాజకీయాల కుటిలనీతిని తెలియజెప్పే కవిత. ప్రజలు మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే రాజకీయ శక్తుల రంగు, ఆరాజకీయాలకు కొమ్ముకాస్తున్న మీడియా రంగును విడమరిచి చెప్పే కవిత.

మూల కవి నిఖిల్ సచాన్ ఉత్తర ప్రదేశ్ కు చెందిన కవి కథకుడు, నవలా రచయిత,పత్రికా రచయిత. కవితలో ప్రతి వాక్యం ముస్లిం సమాజంపై, మైనారిటీ ప్రజలపై కొందరు ఉద్దేశపూర్వకంగా చూపుతున్న వివక్ష, కుట్రలకు అద్దం పడుతుంది.

ముసల్మాన్ల మొహల్లా

నా స్నేహితుడొకడు పదే పదే అంటుండేవాడు
‘మత సామరస్యం సంగతి
మాట్లాడ్డానికి బాగుంటుంది గాని
ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు
ముసల్మాన్ల మొహల్లా లోకి
ఒంటరిగా వెళ్లావా’ అని.

‘ఒక్కసారి వెళ్లి చూడు
భయంతో వణికిపోతావు’ అనేవాడు.
అతను ముసల్మానులంటే చాల భయపడేవాడు
కాని షారుఖ్ ఖాన్ అన్నా
షారుఖ్ బుగ్గల్లో వెలిగే సొట్ట అన్నా
ప్రతి దీపావళికీ విడుదలయ్యే షారుఖ్సినిమా అన్నా
పడి చచ్చేవాడు
దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ అని తెలియదు గాని
దిలీప్ కుమార్ సినిమాలు కూడ తప్పకుండా చూసేవాడు

మా వాడికి షారుఖ్ అన్నా దిలీప్ అన్నా భయం లేదు,
ముసల్మానులంటే మాత్రం భయపడేవాడు.

క్రిస్మస్ నాడు ఆమిర్ ఖాన్ సినిమా
విడుదలవుతుందని ఎదురుచూసేవాడు
బ్లాక్ లోనైనా టికెట్ దొరికించుకుని
ఈలలు వేస్తూ సినిమా చూసేవాడు
ఆమిర్ అంటే ఎప్పుడూ భయపడలేదు
ముసల్మానులంటే మాత్రం భయపడేవాడు

నాతోపాటే ఇంజనీరయ్యాడు
సైన్సంటే ఎంత మోజంటే
అబ్దుల్ కలామ్ లాగ ఒకానొక రోజు
తానూ పేద్ద విజ్ఞానవేత్తనపుతాననేవాడు
దేశం పేరు నిలబడతాననేవాడు
లామ్ అంటే ఎప్పుడూ భయపడలేదు.
ముసల్మానులంటే మాత్రం భయపడేవాడు

మా వాడికి క్రికెటంటే కూడ చాల ఇష్టం
మొహమ్మద్ అజరుద్దీన్ మణికట్టు కనికట్టూ
జహీర్ ఖాన్, ఇర్ఫన్ పఠాన్ల చేతుల్లో ఎగిరే బంతులూ
మూడిటికి మూడూ ఇంద్రజాలాలనేవాడు
వాళ్లు ఆటకు దిగారంటే మనకు ఓటమే లేదనేవాడు
వాళ్లను చూసి ఎప్పుడూ భయపడలేదు
మరి ముసల్మానులంటే మాత్రం భయపడేవాడు.

మావాడు నర్గీస్, మధుబాలల సౌందర్యానికి వీరాభిమాని
వాళ్ల నలుపు తెలుపుల సినిమాలన్నీ చూసేవాడు
వహీదా రహమాన్ చిరునవ్వుకూ
పర్వీన్ బాబీ కళ్లలో కాంక్షకు ప్రాణాలిచ్చేవాడు
వాళ్లను చూసి ఎన్నడూ భయపడలేదు
ముసల్మానులంటే మాత్రం భయపడేవాడు

నిరాశలో మునిగినప్పుడల్లా
ముహమ్మద్ రఫీ పాటలు వినేవాడు
రఫీ సాబ్ గళంలోనే భగవంతుని నివాసం అనేవాడు
చెవుల మీద చేతులు పెట్టుకుని రఫీ అని పవిత్రంగా అనేవాడు
అసలు సాహబ్ అని కలపకుండా రఫీ పేరు ఉచ్చరించేవాడే కాదు
సాహిర్ రాసిన పాటలు వింటుంటే
ఆనందంతో కంట తడి పెట్టేవాడు
వాళ్లను చూసి ఎన్నడూ భయపడలేదు
ముసల్మానులంటే మాత్రం భయపడేవాడు

ప్రతి జనవరి 26 న
అల్లామా ఇక్బాల్ రాసిన
సారే జహాసే అచ్ఛా పాడుతుండేవాడు
ఈ పాట పాడుతున్నప్పుడు
దానికి బిస్మిల్లా షహనాయీ
జాకిర్ హుసేన్ తబ్లా
జతగూడితే ఇంక చెప్పేదేముంది అనేవాడు
వాళ్లను చూసి ఎన్నడూ భయపడేవాడు కాదు
ముసల్మానులంటే మాత్రం భయపడేవాడు

ఒక అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు
గాలిబ్ గజళ్లే వినిపించేవాడు
ఫైజ్ గీతాలు పంపుతుండేవాడు
ఉచితంగా సంగ్రహించిన ఉర్దూ పదాలతో
ప్రేమలో పడిపోయిన అతని ప్రేయసి
ఇవాళ అతని సహచరి
ఆ కవుల గురించి అతనికెప్పుడూ భయం లేదు
ముసల్మానులంటే మాత్రం అమ్మయ్యో భయం

పెద్ద అబద్ధాలకోరు నా స్నేహితుడు
మహా అమాయకుడు కూడ
తెలియకుండానే ప్రతి ముసల్మాన్ నూ
ఎంతగానో ప్రేమించాడు
మరి ఎందుకనేవాడో తెలియదు
ముసల్మానులంటే భయం అనేవాడు

సంతోషంగా, ప్రేమమయంగా
ముసల్మానుల దేశంలోనే ఉండేవాడు
ఏ ముసల్మాన్ల మొహల్లాకు వెళ్లాడో తెలియదు గాని
ఒంటరిగా వెళ్లడానికి అమ్మో భయం అనేవాడు బహుశా అతనికి
పత్రికలు సృష్టించిన,
భగవంతుడు సృష్టించిన
ముసల్మాన్లంటే భయం లేదు

బహుశా అతను
రాజకీయాలు సృష్టించిన,
పత్రికలు సృష్టించిన
ఎన్నికలు సృష్టించిన
కాల్పనిక ముసల్మాన్లంటే భయపడతాడేమో
వాళ్లు కల్పన వల్ల చాల భయం గొల్పుతారు

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply