మనుషులకు గల స్వేచ్ఛ

కథలో పనమ్మాయి లచ్చుకి జబ్బు చేస్తుంది. ఆమె బదులు ఆమె స్నేహితురాలు నరుసు చేత పని చేయించుకుని డబ్బులిస్తారు తారకం తల్లిదండ్రులు. తారకానికీ, అతని తండ్రికీ – మధ్య పనమ్మాయి గురించిన చర్చలో రెండు దృక్పధాలు భేటీ పడడం చూస్తాం. ఆమె జబ్బు పడ్డప్పుడు, పని చేయలేనపుడు – ఆమె ఎలా సంపాదించుకుని తింటుందన్నది మొదటి ప్రశ్న. ఆమె పని చేస్తే డబ్బులియ్యడమే తప్ప మిగిలిన సంగతులు తమకు అనవసరం అంటాడు తండ్రి. ఒక ఇంటిలో పనిచేసి బతికే మనిషి కేవలం అక్కడ దొరికే జీతంతో బతకగలదా లేదా అన్నది మరో ప్రశ్న. అది విని “అధిక ప్రసంగం అది మనకెందుకు” అని కోపం తెచ్చుకుంటాడు తండ్రి.

అయితే, ఒక రకంగా చూస్తే తండ్రి వాదన తప్పు కాదు. ఒకవేళ మనింటిలో పని చేసే మనిషికి మనం ఇచ్చే జీతం సరిపోవడం లేదు అంటే, సరిపోయినంతా మనం పెంచెయ్యగలమా, మన ఆదాయాన్ని బట్టి మాత్రమే, మనం ఇవ్వగలం. లేదంటే పని మానిపించి మనమే చేసుకోడమే మనం చెయ్యగలిగేది.

కానీ – ఇక్కడ ప్రశ్న మనం ఎంత ఇవ్వగలం, అనేది కాదు. మన జీవితాలలో మనం ఆశించినట్టే, వారి జీవితాలకు కూడా భద్రత ఉండాలని మనం మనస్ఫూర్తిగా నమ్ముతున్నామా లేదా అనేది. వారి ఆదాయం వాళ్ల తలనొప్పి, మనకు సంబంధించినది కాదని అనుకుంటున్నామా? అదే తారకం చెప్తాడు – “మనింట్లో నెల పొడుగునా, ఏడాది పొడుగునా పనిచేసే మనిషి సమస్యలను గురించి మనకు ఏదో అవగాహన ఉండాలిగదా! బొత్తిగా నూతిలో కప్పలల్లే, మనకు సంబంధం ఉన్న మనుషుల మంచిచెడ్డలు పట్టించుకోకుండా ఎలా ఉంటాం?” ఉండగలం అనుకోడం ఒక భ్రమ. ‘మనం – వాళ్లూ’ అనే విభజన మన మనసుల్లో పాతుకుపోయింది. కానీ, మనం అనుభవిస్తున్న ఈ అనూహ్య విపత్తు ఆ విభజనరేఖను, తాత్కాలికంగానైనా చెరిపి చూపించగలదని నేననుకుంటున్నాను. అందుకే సాధారణ సమయంలో చెయ్యలేని చర్చలను – ఇప్పుడు చెయ్యగలమేమో అనిపిస్తోంది.

కథలోకి వస్తే – తారకాన్ని ఇంటికి రప్పించిందే, పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కాబట్టి, చర్చ అటు మళ్లుతుంది. తనకు కావలసింది అందమూ, చదువూ, కట్నమూ కాదనీ – తనతో సమంగా పరిగెత్తగల పెళ్లాం కావాలనీ అంటాడు తారకం. తన విశ్వాసాలనీ, ప్రాపంచిక దృక్పధాన్ని అర్ధం చేసుకునే అమ్మాయని అతని ఉద్దేశం. పనిమనిషి విషయంలోనే తమ మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు – ఎవరో అమ్మాయి తననెలా అర్ధం చేసుకుంటుందని తండ్రిని ప్రశ్నిస్తాడు తారకం. తాను స్వార్ధంగా, వెనకబాటుతనంగా ఆలోచించడం లేదని నిరూపించడం కోసం తండ్రి మళ్లీ పనిమనిషి గురించిన చర్చ కొనసాగిస్తాడు.

లచ్చు – జబ్బు సమయంలో ఆమె కుటుంబసభ్యుల సంపాదన మీద బతకొచ్చని తండ్రి సూచిస్తే – తారకం జవాబు చెప్తాడు. నాకు తెలిసీ, శ్రమకి తగ్గ విలువని నిర్ణయించడానికి అదే మౌలిక సూత్రం.

మనం ఆమె కుటుంబ వ్యవహారాలు చర్చించేటందుకు అర్హులం కాదు. ఆమె డబ్బుతోనే మనకు సంబంధం లేదు. ఆమె తల్లిదండ్రుల సంపాదనతో మనకేం సంబంధం. కాకపోయినా మన కోసం శ్రమ చేస్తూ తండ్రి సంపాదన మీద బతుకుతున్న దంటే మనకెంత అవమానం!” నిజమే కదా, పనివాళ్లు దేశంలో ఎక్కడెక్కడి నుండో వచ్చి ఒక చోట పని చేస్తున్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారు ఎక్కడున్నారో అక్కడి పౌర సమాజం వారిని తమవారిగా భావించవద్దా? అలా జరగకపోతే – అది మనకి అవమానమే కదా?

తారకం వాదనే గెలిచి ఉంటే ఈనాటి పరిస్థితులు ఎలా ఉండి ఉండేవో అని నా మనసు ఊహాగానాలు చేస్తోంది. ఎక్కడెక్కడ ఎవరెవరు పని చేస్తున్నారో – వారందరికీ ఆయా సంస్థలూ/ కన్స్‌ట్రక్షన్‌ సైట్‌లూ/ హోటళ్లూ/ వ్యాపారాలూ/ షాపింగ్ మాల్సూ – పూచీ పడాలనేదే – సాధారణ నియమం అయ్యుండేదేమో. అలా బాధ్యత వహించని వారు శిక్షార్హులని కూడా చట్టం చేసేదేమో. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యక్తులకు కాక – సంస్థలకే సహాయం అందిస్తూ ఉండేదేమో. అప్పుడు – తమకు ఎవరూ లేరని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుటుంబాల దగ్గరకి పోవడం బదులు, తాము శ్రమ చేసే చోటునీ, అక్కడి మనుషులనే నమ్ముకుని ఉండేవారేమో. ఏమో – ఎలా ఉండేదో కానీ ఖచ్చితంగా ఇప్పటి కంటే మాత్రం మెరుగ్గా ఉండేది.

***

తారకం పనమ్మాయికి డబ్బులు ఇచ్చాడు. అలా ఇచ్చే స్వేచ్ఛ తనకూ, పుచ్చుకునే స్వేచ్ఛ ఆమెకూ లేవని తెలిసే ఇచ్చేనంటాడు. కథ పేరే మనుషులకు గల స్వేచ్ఛ. అలాటి స్వేచ్ఛ మనుషులకి లేదని చెప్పడం కథలో ప్రధానాంశం.

ఆ విషయాన్ని ప్రతీకాత్మకంగా చూపిస్తారు కొకు. తారకం ఒక కథ రాసేనని చెప్తాడు. అందులో పాచి పని చేసుకునే మనిషి ఏ జబ్బూ రాకుండా, ఏ మందూ అవసరం లేకుండా ఉండేలా వరం ఇమ్మని అడిగితే, బ్రహ్మదేవుడు ఇవ్వడు.

“నీవు చావు లేకుండా వరం అడుగుతున్నావు. వెనక రాక్షసులయితే అలాటి వరాలిచ్చాను గాని, నీలాంటి బక్క ప్రాణులకు జరామరణాలు లేకుండా వరం ఇయ్యటానికి చట్టం ఒప్పదు అనేశాడ”ట. అయితే ముందు రాక్షసినయి మళ్లీ వస్తానంటుంది ఆమె.

అంటే మానవుల లావాదేవీలలో – తమకు చేతనైన శ్రమచేసి, దానికి ప్రతిఫలం న్యాయంగా తమకు లభిస్తుందని నమ్మే సాదా సీదా వ్యక్తులను, సర్వసాధారణంగా ఉపేక్షించడమే కనిపిస్తోంది. ఇప్పుడే చదివాను వార్త- హైదరాబాద్‌లోని ఐఐటి దగ్గర వందలాది కన్స్‌ట్రక్షన్ వర్కర్లు ఏజిటేషన్ చేస్తున్నారట: 3 నెలలుగా తమకు జీతాలివ్వలేదనీ, ఇక పని చెయ్యమనీ ఇళ్లకు పంపించమనీ నినాదాలు చేస్తున్నారట. పోలీసులు కల్పించుకుని సయోధ్య కుదిర్చారనీ, కంట్రాక్టర్లు 2 రోజుల్లో జీతాలిచ్చేందుకు ఒప్పుకున్నారనీ పత్రికలో రాశారు.

ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి తమకు రావలసింది, కావలసింది పొందాలి తప్ప – అడగందే అమ్మైనా అన్నం పెట్టదని మనమందరం ఒక నిశ్చయానికి వచ్చేసాం. రోడ్లు తుడిచేవారి దగ్గర నుంచి, చిన్న పిల్లలను, ముసలివారిని కనిపెట్టుకుని ఉండడం వృత్తిగా పనిచేసేవారి వరకూ – ప్రతి ఒక్కరిదీ అవసరమైన పనే అయినప్పుడు – అది గుర్తించి ఎందుకు ప్రవర్తించం మనం? మనలో నిండిపోయిన ఆ ప్రవృత్తి వల్ల శ్రమ చేసే వారికి – తామొక ఆవశ్యకమైన పనిని చేస్తున్నామనీ, తమ వల్ల సమాజానికి ఉపయోగం ఉందనీ, తమ జీవితాలు కూడా విలువైనవేననీ – నమ్మకం చిక్కదు.

శ్రామికుల జీవితాల్లో వచ్చే కష్టాలకి కారణాలు ఏమిటనే ప్రశ్న – నా పరిచయస్తులనూ, చుట్టుపక్కల వారినీ వేస్తూ ఉంటాను. ఒక్కొక్కళ్లూ ఒక్కొక్క కారణాన్ని నమ్ముతున్నారని నాకనిపించింది. అజ్ఞానం, సోమరితనం, వ్యసనాలు, ఐకమత్యం లేకపోవడం, స్వార్ధం, దురాశ, ఉన్నత లక్ష్యాలు లేకపోవడం, ఇంకా కొంత మంది అయితే పూర్వజన్మ కర్మలు – ఇలా ఆ సమస్యలకి స్వయంగా వారే కారణమనే అభిప్రాయం చాలా మంది దగ్గర విన్నాను. వారిలో చాలా మంది జాలి, దయలు ఉన్నవాళ్లే, కష్టంలో ఉన్నవారికి అంతో ఇంతో సహాయపడేవాళ్లే. కానీ పై కారణాల్లో ఏదో ఒకదానిని చిత్తశుద్ధితో నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకాలని ప్రశ్నించడం కాని, జవాబులియ్యడం కాని ఇక్కడ చెయ్యబోవడం లేదు. కానీ నేను పైన చెప్పినట్టు, పని వాళ్లు కూడా సమాజంలో భాగమని మనం నమ్మి, వారి జీవితాలకు మనందరం బాధ్యత పడడం కనీస కర్తవ్యంగా భావించడం మాత్రం ఆ దిశలో పడవలసిన మొదటి అడుగు అని నేననుకుంటాను.

చాలా మందికి – పనివారి జీవితభృతికీ, భద్రతకీ – ప్రభుత్వం పూచీ పడాలన్న ప్రతిపాదన ఉటోపియాలా కనపడుతుంది. దానికి తగ్గట్టే – నిన్నో మొన్నో తీర్మానం కూడా జరిగింది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ఇది : పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక సంఘాల చట్టం, పరిశ్రమ (నిర్ధిష్ట ఆదేశాలు) ఉద్యోగ చట్టం మూడు కలిసి పారిశ్రామిక సంబంధాల కోడ్‌-2019గా రూపొందింది. ఈ లాక్‌డౌన్ సందర్భంగా “ప్రకృతి విపత్తుల సందర్భంలో పరిశ్రమ తిరిగి పుంజుకునే వరకూ కార్మికులకు వేతనాలు చెల్లించడం న్యాయసమ్మతం కాదు” అని కమిటీ నివేదికలో చెప్పింది. చిత్రమైన విషయం ఏమిటంటే – ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిశ్రమలకు అవసరమైన సహాయాన్ని అందించాలి అని ఆ కమిటీ ఛైర్మన్ భర్తృహరి మహతబ్ అన్నారు. ఈ విచిత్రాన్ని నా మాటల్లో కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాను.

మనం కూడబెట్టుకున్న డబ్బు బేంకులో వేస్తే, అక్కడ వడ్డీలకు ఎవరూ బాధ్యత వహించకపోతే? మనం పని చేసే సంస్థలు/ వ్యాపారాలు మనకి జీతాలివ్వలేమని అన్నీ ఒక్క సారిగా చేతులెత్తేస్తే? ఏ రకమైన వ్యవస్థా మనకు పూచీ పడకపోతే – ఏ భద్రతా దొరక్కపోతే – మన భవిష్యత్తులు మనకి ఎంత బరువుగా తోస్తాయో ఒక్కసారి ఆలోచించి చూడండి. అలా జరిగినప్పుడల్లా – ప్రభుత్వాలు మధ్యన పడి ఆ సంస్థలకి, బేంకులకి, వ్యాపారాలకి అప్పులిచ్చి నిలబెట్టి ఆదుకుంటూ వచ్చాయి. అది మన ఆర్ధికవ్యవస్థని నిలబెట్టే ప్రయత్నం. సరే, మరి – ఈ శ్రామికుల జీవితాలు, వారి ఆదాయాలు – ఆర్ధిక వ్యవస్థలో భాగం కాదా? వాటికి పూచీ పడాలన్న ఆలోచన ఎందుకు అసంభవమైన ఆదర్శంలా తోస్తుంది మనకి? వారి జీవితాలకి భద్రత కల్పించడం అన్నది – వారికి లభించవలసిన హక్కులా కాకుండా, ఎవరైనా ధర్మాత్ములు అందించాల్సిన సాయంలా ఎందుకు చూడాలి మనం?

ఆ ధోరణి ఎంత దారుణమైన పరిణామాలకు దారితీయగలదో – రెండు నెలలుగా మనం చూస్తున్నాం. లక్షలాది మంది పని చేసుకు బతికే వారు దిక్కులు చూస్తూ రోడ్ల మీద నిలబడ్డారు. ఆ రోడ్ల మీదే, పసిపిల్లలూ, గర్భిణీస్త్రీలూ – నడుస్తూ పోయారు, కొందరు ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఇన్ని కోట్ల మందిమి ఉన్నాం – కనీసం నడిరోడ్ల మీద మరణాలను ఆపలేమా అని ప్రశ్నించుకుంటే – మనం ఆలోచించాల్సింది ఆకస్మిక ప్రమాదాలూ, తరుణోపాయాలూ, సహాయాలూ వీటి గురించి కాదు. వీటన్నిటికీ మించి, వారి జీవితాలకూ, మన జీవితాలకూ సంబంధం ఉందని గుర్తించకపోవడం. మన దైనందిన జీవనంలో, చర్చలలో వారికి భాగం లేకపోవడం అన్నది ప్రధాన సమస్య అని నాకు తోస్తోంది.

***

నడిబజారులోన ఇస్తున్నాను. ఇది నేనిచ్చానని నీ జీతమనీ మీ అమ్మకు చెప్పు. ఇందులో దాపరికం ఏమీ లేదు అని చెప్పి మరీ డబ్బు లచ్చు చేతిలో పెట్టి వెనుతిరుగుతాడు తారకం. మంచి బేరం తగిలిందే పిల్లా అంటూ ఒక నడి వయసువాడు ఇకిలించి తల ఎగరేశాడు. ఏ పరిచయం లేని వాడు అలా మాట్లాడడం – కొంచెం కథ కోసం అతికించినట్టున్న మాట నిజమే. అయితే పూర్వాపరాలేవీ తెలియని వాళ్లకైనా – ఒకరి శ్రమకి సరైన మూల్యం చెల్లించడం కోసం, మామూలుగా ఉన్న రేటు కంటే ఎక్కువిచ్చామని తెలిస్తే- అలాగే స్పందిస్తారనుకుంటా.

నువ్వు చెప్పే స్వాతంత్ర్యం మనకూ లేదు, ఆమెకీ లేదు.” అని కథలో తారకం అనడం నిజమే అనిపిస్తుంది. ఆ విషయం మనకు రకరకాల మానసిక స్థాయిలలో ఉన్న పాత్రలు ఒకే భావాన్ని చెప్పిన ఈ మాటల్లో లీలగా కనిపిస్తుంది. చిన్నపిల్ల చేతిలో నూర్రూపాయలు పెట్టడంలో మీ అబ్బాయిగారి ఉద్దేశం ఏమిటో ఎవర్నన్నా అడగండి – (లచ్చు తల్లి).

కథలో శ్రమచేసి బతికే మనుషుల గురించీ, శ్రమకి మన సమాజం ఇచ్చే విలువ గురించీ చర్చ ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ – కష్టపడి తన కాళ్ల మీద తాను నిలబడి జీవించడంలో ఉన్న గౌరవం, ఇవి మనం ఉన్నత విలువలని ప్రతిపాదిస్తాం, పిల్లలకి నీతిపాఠాల రూపంలో నేర్పిస్తాం. కానీ దైనందిన జీవితాల్లో శారీరక శ్రమ పట్ల మన ధోరణి ప్రశ్నించి వెలికితీస్తుంది ఈ కథ.

శ్రమని అమ్ముకోడం కంటే ఒళ్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బు వస్తుందనేది – కథలో దాదాపు అన్ని పాత్రలూ విశ్వసించే విషయం, తారకం దాన్నే ఎత్తి చూపుతాడు : “నాన్నా శ్రమ అమ్ముకునే మనిషి కన్నా ఒళ్లు అమ్ముకునే మనిషికి ఎక్కువ ఇయ్యొచ్చుననే నీ నమ్మకం కూడా. నీ నమ్మకమేమిటి, రాజమ్మ నమ్మకమేమిటి అందరి నమ్మకమూ అదేగా కనిపిస్తుంది.” తారకం తన ఇంటిలో పని చేసినందుకు న్యాయంగా ఆమె శ్రమకు ప్రతిఫలమని భావించి ఇచ్చినా -తారకం తల్లిగానీ, లచ్చు తల్లిగానీ, చుట్టం కాముడు గానీ, చివరికి రోడ్డు మీది అపరిచితుడితో సహా – ఎవ్వరూ నమ్మరు.

అందులోనూ కాముడు అన్న మాట మరీ ప్రమాదకరమైనది (నువ్వు దానికి డబ్బిచ్చింది చేసిన పనికా, చెయ్యబోయే పనికా). అంటే అప్పటికింకా అలా జరగకపోయినా, డబ్బు లావాదేవీ జరిగిందంటే – దాని అర్ధం – ముందు ముందుకైనా అది జరిగే తీరుతుందని చెప్పడం.

అది ఆనాడే కాదు, ఇప్పటికీ అంతే చర్చనీయమైన వాస్తవం. ఇందులో రెండు అంశాల మీద చర్చ జరగాల్సి ఉంది. శారీరక శ్రమను ఒక ఆవశ్యకమైన విలువగా గుర్తించకపోడం ఒకటైతే, ఇద్దరు వ్యక్తులు అతి సహజంగా పాల్గొని, ఆనందాన్ని పొందేలా ప్రకృతి రూపొందించిన శారీరక సమాగమానికి -మూల్యాన్ని నిర్ణయించి, ఒకరు కొనుక్కోడం, ఒకరు అమ్ముకోడం అనే సమీకరణంలోకి దిగజారడం రెండో అంశం. కథకి సంబంధించినంత వరకూ – శ్రమని అంత వెల తక్కువ సరుకుగా పరిగణించడమన్నదే – ముఖ్యాంశం.

ఇక్కడ మరో విషయం – ఇచ్చే స్వేచ్ఛ తారకానికి లేదని నిరూపించారు కథలో – మరి పుచ్చుకునే స్వేచ్ఛ లేదని ఎలా చెప్పగలం? దాని కోసం నర్మగర్భంగా తారకం అన్న ఈ మాటను గమనించండి: “మనకన్నా తమకు చాలా ఎక్కువ నీతి ఉన్నదని చెప్పుకునేటందుకు అవకాశం దొరికింది” అంటాడు లచ్చు తల్లి రాజమ్మ గురించి. న్యాయంగా రావలసింది కాక, ఎవరైనా ఎక్కువ ఇస్తే అనుమానించాల్సిన పరిస్థితే పుచ్చుకునే వారిది కూడా. కనక సహజంగా – శ్రమ చేసే వారు కూడా సమాజంలో మిగిలిన అందరితో సమాన సభ్యత్వపు హోదాను పొందేదాకా- ఏ కొందరి ఉపకారాలూ వారి పరిస్థితిని మెరుగుపరచలేవు.

***

అన్ని చర్చలూ అయ్యాక, మర్నాడు తారకం వెళ్లిపోతున్నప్పటికి – తండ్రి ఆలోచనల్లో అణుమాత్రం మార్పు ఉండదు. చర్చల వల్ల ‘మారడానికి సిద్ధంగా ఉండేవారు, మారవలసిన అవసరం వచ్చిన వారూ’ మారతారేమో తప్ప – ఎవరిని ఎవరూ మాటలతో మార్చలేరని స్పష్టమౌతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఉంది. కథతో సంబంధం లేదేమో కానీ, ఆ కథ నాకిచ్చిన తెలివిడి కనక, తప్పకుండా మీతో పంచుకోవాలనిపిస్తోంది.

ఒక రోజు పొద్దున్న:

ఆమె: అపార్ట్‌మెంట్‌లో ఒకతను పూలు తెచ్చి ఇస్తాడు, 7,8 ఏళ్లుగా వస్తున్నాట్ట. నువ్వూ చూసే ఉంటావు కదా. నిన్న శ్రీరామనవమి అని 2 దండలు ఎక్స్‌ట్రా కొన్నాను. పక్కింటావిడ దిక్కులు చూస్తోంది, ఏం కొనకుండా.

అతను: ఏం జరిగింది

ఆమె: పూలబ్బాయి వెళిపోయాక చెప్పింది, అతను ముస్లిం అట. ఆవిడకి ముందు రోజే తెలిసిందట.

అతను: అయితే … వేరే మతం వాళ్లిచ్చిన పూలు దేవుడికి పెట్టకూడదనా?

ఆమె: అబ్బెబ్బె, పువ్వులకి ఏ మైలా అంటదు, శాస్త్రంలో ఉంది. కానీ, ఆ పువ్వుల మీద ఏదన్నా జల్లి ఇస్తేనో అని ఆవిడ భయం.

అతను: అంత మూర్ఖంగా, అన్యాయంగా ఎలా ఆలోచించగలదు ఆవిడ? అతనలా దేనికి చేస్తాడు? ఆవిడ మీద అతనికి ఏం వైరం? అసలేమన్నా అర్ధముందా?

ఆమె: ఆ వీడియోల్లో చూపించారు కదా, కావాలని పళ్లని ఉమ్ముతో తుడుస్తున్నారని.

అతను: అవి కావాలని ప్రచారం చేస్తున్న వీడియోలు. కరోనా టైంలో జరిగినవి కావు. అతను పళ్ల మీద ఉన్న దుమ్ము తుడుస్తున్నాడు. ఆవిడకి కూడా చెప్పు కాస్త అర్ధమయ్యేలా. పాపం ఆ పూలబ్బాయి పొట్ట మీద కొట్టకండి మీరంతా కలిసి.

ఆమె: (కాస్త అనుమానంగా) సరేలే.

అదేరోజు రాత్రి:

ఆమె: అక్క సాయంత్రం ఫోన్ చేసింది.

అతను: ఏంటి ఢిల్లీ విశేషాలు?

ఆమె: ఇంక మనం బ్రెడ్ తినకూడదట.

అతను: ఏం అయ్యింది?

ఆమె: వాళ్ల అపార్ట్‌మెంట్ వాట్సాప్ గ్రూప్‌లో న్యూస్ వచ్చిందట. బ్రెడ్ తయారుచేసే చోట మనుషుల్ని పెట్టి మరీ, ఉమ్మిస్తున్నారట.

అతను: ఛీ ఛీ. నేనింక ఏమీ చెప్పను.

కొకు ఈ కథలో రాసిన మాటలు గుర్తొచ్చాయి నాకు:

“ఎవరి నమ్మకాలు వారే మార్చుకోవాలి. నిజం తెలుసుకుంటూ పోతే మనం చాలా దూరం పోతాం. అశాంతి తిరుగుబాటు విప్లవాలు ప్రత్యక్షమవుతాయి. అందుచేత శాంతంగా ఉండదలచిన వాళ్లు కొన్ని అబద్ధాలను నమ్మి లోకంలో సాగే అన్యాయంలో భాగం పంచుకోవటం మంచిది” అంటాడు తారకం.

తారకం తండ్రి క్షణం పాటు ఆలోచించేవాడి మొహం పెట్టి మరుక్షణం ఆలోచనను దులిపేసుకున్నాడు.

అప్పుడు పై రెండు సంభాషణలు నాకు ఇలా అర్ధమయ్యాయి. అతనేం చెప్పినా ఉపయోగం లేదు. అతని మాటలు నమ్మడం మొదలుపెడితే, ఈ వీడియోలూ, వాట్సాప్ వార్తలూ నిజం కాదని తెలుసుకోడం దగ్గర ఆగదు. ఆ ప్రచారాల వెనక ఒక ధోరణి, ఒక భావజాలం ఉన్నట్టు నమ్మవలసి వస్తుంది, ఆ ప్రచారాల వల్ల కొన్ని సమూహాలు బలం పుంజుకోడాన్ని గుర్తించవలసి వస్తుంది. ఆ ప్రచారాలను నమ్మకపోవడం, వాటిలో లొసుగుల గురించి ఆలోచించడం, వ్యతిరేకంగా మాట్లాడడం – తప్పనిసరి అవుతుంది. వాటిని నమ్మేవారందరికీ జవాబు చెప్పవలసి వస్తుంది. అంత కష్టం పడడం ఎందుకని… మనకు తలకాయలకు పెద్దగా పని కల్పించని మెయిన్‌స్ట్రీం భావజాలాన్నే మళ్లీ ఆశ్రయిస్తాం.

భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని వారి కళ్లకి కనిపించేది, చర్చి అదే సత్యం అని చెప్పింది – అది ఎంత కాలమో నమ్మేరు. దాని వల్ల తమ తలలు వాడి, సత్యం కనిపెట్టిన కోపర్నికస్‌ల వంటి వారి నోళ్లు మూయించారు. అలాంటి ఏయే సత్యాలను ఈనాడు మనం చూడడంలేదో – రాబోయే కాలం నిర్ణయిస్తుంది. ఈలోగా నేను నమ్మేవాటిలో ఏవి సత్యమో, ఏవి కావో నేనెలా తేల్చుకోడం? దానికొక చిట్కా కనిపెట్టేను – ‘ప్రయత్నం’. ఏదైనా ప్రతిపాదన – కొత్తగా తోచి, నా విశ్వాసాలకు ప్రతికూలంగా ఉన్నట్టు అనిపిస్తే – నా స్వంత బుర్ర వాడడానికి ప్రయత్నం చేస్తున్నానా లేక నేను నమ్మే నలుగురూ అంటున్న మాటను పట్టుకు వేలాడుతున్నానా – అని ఆత్మ విమర్శ చేసుకుంటాను. ‘ప్రయత్నం’ చేస్తున్నంత సేపూ – సత్యాన్ని గుర్తించే మార్గంలోనే ఉన్నానని నమ్ముతాను. కొకు కథలు చదువుతున్నప్పుడు ఆ నమ్మకం మరింత ధృఢతరం అవుతూ ఉంటుంది.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

8 thoughts on “మనుషులకు గల స్వేచ్ఛ

 1. కళ్యాణి గారూ..
  చాలా మంచి విశ్లేషణ..గుండె లోతుల్లోంచి చేశారు.
  ఒక నిర్ణీత బిందువు దగ్గర మన ‘సొంత ప్రయోజనం’ కీ, మన ‘సామాజిక బాధ్యత’ కీ నడుమ వైరుధ్యం వచ్చినప్పుడు మనం నిలబడాల్సిన వైపు ఎంతవరకూ నిలబడతాం?
  ఆ బిందువు నిబద్ధత ఎక్కువ ఉన్నవారికి ఆలస్యంగా, తక్కువ ఉన్న వారికి తొందరగా వచ్చేస్తుందేమో.
  మనం నమ్మిన, మనల్ని ప్రభావితం చేసిన రాజకీయ తాత్విక ధార కూడా ఆ బిందువు ఉనికినీ వ్యవధినీ నిర్ణయిస్తుందేమో..

 2. మౌనంగా మానసిక సామాజిక వ్యవసాయం చేస్తున్న సీతమ్మకు అభినందనాలు. ఇప్పుడే విన్నాను, చదివాను. డబ్బు చుట్టూ, దాని పై ఆధారంగా పెరిగిన సమాజ మనుగడ తీరును దానికి ఉండే అధికారం (పాత్ర నాన్న), అమాయకత్వం (పాత్ర అమ్మ), మూర్ఖత్వం (పని మనిషి అమ్మ), లేకితనం ( భలే బేరం కుదిరింది పిల్లా అనే పాత్ర) పాత్రల ద్వారా విపులంగా వివరించారు. “వ్యవహారం జోక్ కాకుండా మరో వైపు వెళ్తుంది”, “ఆకలి మన స్వేచ్ఛను నిర్ణయిస్తుంది”. అక్కడ మీరు కనిపించారు… ప్రకృతి మీకు సహకరించాలి అని, మీరు బాగుండాలి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా.

 3. తారకం లాంటి వారు ప్రతీ ఇంటిలో ప్రతీ తరంలో ఉంటారు, కానీ తారకాలు ఎందుకో వేరు అవుతారు, వేరు చేయబడతారు? ఎందుకో?

 4. chalaa bagundi . prathee kottha sandarbhamlonoo kotthagaa ardhamayye saahityam entha aasaraa manaku!?

 5. అద్భుతమైన విశ్లేషణ మేడమ్

 6. నాకు బాగా నచ్చిన వాక్యాలు :

  “మనం కూడబెట్టుకున్న డబ్బు బేంకులో వేస్తే, అక్కడ వడ్డీలకు ఎవరూ బాధ్యత వహించకపోతే? మనం పని చేసే సంస్థలు/ వ్యాపారాలు మనకి జీతాలివ్వలేమని అన్నీ ఒక్క సారిగా చేతులెత్తేస్తే? ఏ రకమైన వ్యవస్థా మనకు పూచీ పడకపోతే – ఏ భద్రతా దొరక్కపోతే – మన భవిష్యత్తులు మనకి ఎంత బరువుగా తోస్తాయో ఒక్కసారి ఆలోచించి చూడండి. అలా జరిగినప్పుడల్లా – ప్రభుత్వాలు మధ్యన పడి ఆ సంస్థలకి, బేంకులకి, వ్యాపారాలకి అప్పులిచ్చి నిలబెట్టి ఆదుకుంటూ వచ్చాయి. అది మన ఆర్ధికవ్యవస్థని నిలబెట్టే ప్రయత్నం. సరే, మరి – ఈ శ్రామికుల జీవితాలు, వారి ఆదాయాలు – ఆర్ధిక వ్యవస్థలో భాగం కాదా? వాటికి పూచీ పడాలన్న ఆలోచన ఎందుకు అసంభవమైన ఆదర్శంలా తోస్తుంది మనకి? వారి జీవితాలకి భద్రత కల్పించడం అన్నది – వారికి లభించవలసిన హక్కులా కాకుండా, ఎవరైనా ధర్మాత్ములు అందించాల్సిన సాయంలా ఎందుకు చూడాలి మనం?”
  బాగా రాసారండీ.

 7. తాము పనిచేసే చోట హ్యూమన్ పేస్ వుండే అప్రోచ్ ని ఆశిస్తుంది మధ్యతరగతి. తమకు ఒంట్లో బాగా లేకపోతే, ఇంట్లో వాళ్లకి కష్టం వస్తే ప్రత్యేక మద్దతు కోరుతుంది. కానీ, తమ మీద ఆధారపడ్డ చిన్నచిన్న జీవితాల మీద నెలవారీ జీతం తప్ప ఇంకేమీ బాధ్యత లేదనుకుంటుంది. పైగా అది నైతికంగా కూడా సరైనదే అని సద్దిచెప్పుకుంటుంది. ఇది ఇంట్లో పనిచేసే పనిమనుషుల గురించే కాదు, నగరాన్ని నిర్మించి నడిపించడానికి ఒళ్ళుగుల్లై పనిచేసే కోట్లాదిమంది వలసపట్ల కూడా చూపిస్తారు. 
  మంచి విశ్లేషణ, కళ్యాణి గారూ. 

Leave a Reply