పుస్తకాల దొంగలొస్తున్నారు జాగ్రత్త!

తెలుగు నేల మీద పుస్తకాల దొంగలకు పెద్ద చరిత్రే వుంది. ఆ చరిత్రే మళ్ళీ ఇప్పుడు పునారావృతం అవుతోంది. మీరు అక్షర ప్రియులయితే, ప్రపంచ స్థితిగతులను మీ కవిత్వంలో ప్రతిబింబించే నేర్పరులయితే, ప్రశ్నల కొలిమిని రాజేసే సృజనకారులయితే, హక్కుల గొంతుకలయితే, అన్యాయాన్ని అన్యాయమని చెప్పగలిగే నిజాయితీపరులయితే, అన్ని రకాల పీడనల నుండి, హింసల నుండి విముక్తిని కాంక్షించే సాహసులయితే… ఏదో ఒక రోజు బూటు చప్పుల్లతో, తలుపుల మీద పిడి గుద్దులతో మీకు తెల్లవారుతుంది. దాడి చేస్తున్న వాళ్ళు ఎవరో, ఎందుకొచ్చారో మీకు అర్థమయ్యే లోపే మీరు, మీ ఇళ్ళు, ఆ చుట్టుపక్కల అంతా వారి ఆధీనంలోకి పోతాయి.

పూల మొక్కలతో, చిన్న పిల్లలతో, తల్లితండ్రులతో, ప్రపంచం మీద బోలెడంత ప్రేమున్న మనుషులతో ప్రశాంతంగా ఉన్న మీ ఆవరణంతా ఒక్కసారిగా యుద్ధక్షేత్రంగా మారిపోతుంది. మీ వీధి అంతా దురాక్రమణ దుర్గంధంతో నిండుకుంటుంది. ఎవ్వరు కూడా బయటికి వచ్చే సాహసం చెయ్యరు. మీ పక్కింటోళ్ళు, మీ ఇంటి ఓనర్లు దూరం నుండే ముక్కు మీద వేలుతో మీవైపు జాలిగానో, అనుమానంగానో చూస్తుంటారు. ఉన్నపలంగా మీరు మీ సామాజిక పరిసరాల నుండి వేరు కాబడుతారు. మిమ్మల్ని ఒంటరిగా నిలబెడుతారు. మీడియాకు కూడా ప్రవేశం వుండదు. అందుకే దూరం నుండే మీ తలుపు సందుల్లోకో, కిటికీల్లోకో కెమరాలు జూం చేస్తారు. అక్కడున్న రిపోర్టర్లు తెలిసి కొంత తెలియక కొంత ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి తమ సొంత కవిత్వం కొంత కలిపి వార్తను అయోమయంగా ప్రెజెంట్ చేస్తుంటారు. అన్ని టీవీలూ ఎక్స్‌క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ హాడవుడి చేస్తుంటాయి.

ఇంటి బయట పరిస్థితి ఇలా వుంటే ఇక లోపలకి వచ్చిన వాళ్ళు మొదటి పొడి మర్యాద మాటలు దాటి పెత్తనం, దౌర్జన్యం చెయ్యడం మొదలు పెడుతారు. ఫోన్లు లాగేసుకుంటారు. ఒక్క గెంతుతో కంప్యూటర్, లాప్ టాప్ వంటి డిజిటల్ పరికారాల మీద పడుతారు. టీవీలు మూగబోతాయి. మీరు ప్రేమతో పద్ధతిగా సర్దుకున్న పుస్తకాలను నేరం చేయడానికి వాడే ఆయుధాలను చూసినట్లు చూస్తుంటారు. అందులో కొన్నింటిని తడుముతూ పలానా పుస్తకం మీ దగ్గర ఎందుకు వుంది, అసలు ఇవన్నీ నువ్వెందుకు చదువుతున్నావని ప్రశ్నిస్తారు. ఒక్క ఊపుతో అక్షరాలను నేల పాలు చేస్తారు. తగలబెట్టడానికన్నట్లు కుప్ప పోస్తారు. ఊపిరాడనివ్వకుండా ప్రశ్నలు గుప్పిస్తుంటారు.

ప్రశ్నలు వేస్తారే కాని మీ సమాధానం వినరు. ఎందుకంటే మీరు చెప్పే దేనితోనూ వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ ప్రశ్నాపత్రంలో, వాళ్ళే వాళ్ళకు ఇష్టమైన జవాబులు రాస్తారు. లేదా ముందే జవాబులు రాసుకుని వస్తారు. మీ ప్రేమ, స్నేహాలకు జ్ఞాపకాలుగా దాచుకున్న ఉత్తరాలు, డైరీలు ఏమైనా దొరికితే వాటిని బిగ్గరగా బయటికే చదువుతారు. అక్షరం అక్షరానికి మధ్య కుట్రల కొలమానంతో కొలుస్తుంటారు. డీకోడింగ్ అంటూ తలాతోక లేని అర్థాలు తీస్తారు. హేళనగా నవ్వుకుంటారు. ఇల్లంతా చిందరవందర చేసి విజయగర్వంతో మురిసిపోతుంటారు. పసిపిల్లల ఆట వస్తువులు, పోపుగింజల డబ్బాలు, చివరికి చెత్త బుట్టలు… ఒక్కటని కాదు అన్నీ దాడికి గురవుతాయి.

ఇంతకీ వచ్చింది ఎక్కడి దొంగలనే కదూ మీ ప్రశ్న. మీ కోసం స్వయంగా దోపిడీ పాలకవర్గాల కనుసన్నలలో నడిచే జాతీయ నేరారోపణ సంస్థే (National Incriminating Agency) వచ్చింది. దానినే ముద్దుగా ఎన్ ఐ ఏ అంటారు. మీడియా వాళ్ళు ఎన్ ఐ ఏ చేసే దాడిని “సోదాలు” చేస్తున్నారు అని చెబుతుంటారు. కాని వాస్తవానికి వాళ్ళు చేసేది దొంగల్లా దాడి. వాళ్ళు చేసేది దర్యాప్తు కాదు, అక్రమ జప్తు.

ఇంతకీ ఈ జాతీయ నేరారోపణ సంస్థ ఎందుకు దాడులు చేస్తుంది? ఎందుకంటే దాన్ని ఉసిగొల్పుతున్న ఫాసిస్టు శక్తులకు ఒక కుట్రపూరిత పథకం ఉంది. అదేమిటంటే ప్రజల కోసం గొతెత్తే ప్రజాసంఘాల కార్యకర్తల్లో భయం కలిగిస్తే, వాళ్ళను ఉద్యమాలకు దూరం చేస్తే ఇక తమ ఆగడాలకు అడ్డుపడే శక్తులే ఉండవు అనేది వారి పన్నాగం. నిజానికి విప్లవోద్యమాన్ని ఒక సాకుగా చూపించి అన్ని ప్రజా గొంతుకల మీద విరుచుకు పడుతున్నారు. కేవలం విప్లవ సానుభూతిపరుల మీదనే దాడులు జరుగుతున్నాయి కదా మనకెందుకులే అని మనం మౌనం పాటిస్తే (దాడులకు మద్దతు ప్రకటిస్తే) పెద్ద తప్పు చేసినట్లే. దాడులకు గురవుతున్న వాళ్ళు నిరంతరం మాట్లాడుతున్నది దళితుల, ఆదివాసుల, మహిళల, మత మైనారిటీలపై కొనసాగుతున్న హింస గురించి. ఇక రేపు ఈ వర్గాలకు, సమూహాలకు అండగా నిలబడే ఎవ్వరిపైన అయినా దాడులు జరగవచ్చు. కనీసం సోషల్ మీడియాలో హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ఒక వ్యాఖ్య రాసినా దాడికి “అర్హత” పొందినట్లే.

ఈ దాడులు ఏవో అనుమానాలతో, అజ్ఞాత సంబంధాల మూలంగానో జరగడం లేదు. ఇవన్నీ రాజ్యం ప్రజలపై పెద్ద ఎత్తున జరపబోతున్న దాడిలో భాగంగానే జరుగుతున్నాయి. రాజ్యం దీనికి సంబంధించిన భూమికను తయారుచేసుకుంటోంది. దీనిని నవంబర్ 13 న జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ హైద్రాబాద్ లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఉత్తీర్ణులవుతున్న 73వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశాడు. ఆయన పౌరసమాజంపై యుద్ధం చేయడం నేటి అత్యవసరం, దానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆ యువ పోలీసులకు ఉపదేశించాడు.

పౌరసమాజం పై యుద్ధం దేనికి? ఎందుకంటే హిందుత్వ ఫాసిజానికి మింగుడు పడని ప్రశ్నలను వేస్తున్నందుకు, హిందుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాలలో భాగం అవుతున్నందుకు. కులం, మతం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేవని నినదిస్తున్నందుకు. హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేయడం రాజ్యాంగం కల్పించిన మార్గమని గుర్తుచేస్తున్నందుకు. అంతేకాదు పోరాడే ప్రజానీకానికి తమ సానుభూతిని ప్రకటిస్తున్నందుకు.

పౌరసమాజంలోని ఒక పెద్ద భాగాన్ని జాతీయత, సంస్కృతి, దేశభక్తి పేరిట మౌన వ్రతంలోకి రాజ్యం నెట్టివేసింది. మీడియా, విద్య, కళారంగం (సినిమాతో సహా), ఇతర సామాజిక వ్యవస్థలను ఉపయోగించుకుని వాళ్ళ మెదళ్ళను మొద్దుబారేలా చేసింది. దానినే వారి సమ్మతిగా నమోదుచేసుకుంది. వీళ్ళ మీద ఎలాంటి భౌతిక దాడులు చెయ్యాల్సిన పనిలేదు. ఎందుకంటే వీళ్ళకు దేశంలో ఏం జరుగుతుందో కూడా పట్టింపు ఉండదు. కాని అవసరం అయినప్పుడు పెద్ద “దేశభక్తుల” ఫోజుతో రాజ్యానికి మద్దతుగా నిలబడుతారు. ఎన్ ఐ ఏ వంటి సంస్థలు దాడులు చేస్తున్నాయంటే అందులో నిజం ఉంటుందని ఎలాంటి అనుమానం లేకుండా నమ్ముతారు.

ఇక మరో పెద్ద భాగాన్ని కేవలం స్వయంకృషితో, మార్కెట్ పోకడలకు అనుగుణంగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చనే కుంచిత భావనను మధ్యతరగతి మెదళ్ళలోకి చొప్పించి వాళ్ళను నిరంతర శ్రమలోనే కాదు, దోపిడీ వ్యవస్థలో భాగం చేశారు. వీళ్ళతో కూడా ఫాసిస్టులకు వచ్చే ప్రమాదం ఏమి లేదు.

ఇక రాజ్యానికి “ప్రమాదం” పొంచివున్నది చైతన్యవంతమైన పౌరసమాజం నుండే. వాళ్ళు విద్యార్థులు, కవులు, కళాకారులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు, హేతువాదులు, ప్రజాస్వామిక బుద్ధిజీవులు. వీళ్ళను దేశభక్తి వంటి చీప్ టెక్నిక్స్ తో బుట్టలో వేయలేరు. వీళ్ళు ప్రశ్నిస్తారు. నినదిస్తారు. వీళ్ళు దోవల్ దృష్టిలో జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా (వాస్తవంలో దోపిడీ వర్గాల, కులాల హింస, అణిచివేతలకు వ్యతిరేకంగా) ఆలోచిస్తారు, పనిచేస్తారు. కాబట్టి వీళ్ళలో కొందరినైనా మభ్యపెట్టాలి, విడగొట్టాలి, వినకపోతే భయపెట్టాలి అని దోవల్ ఒక రాజ్యాంగవ్యతిరేక ప్రకటన చేశాడు. ఇదంతా ఫాసిస్టులు తమ ప్రధాన శతృవుగా భావిస్తున్న విప్లవోద్యమాన్ని అణిచివేయడానికే. ఎందుకంటే విప్లవం పీడిత వర్గాల, కులాలకు తల్లికోడిలా అండనిస్తుంది కాబట్టి. ఒకవైపు ఆ విప్లవోద్యమం మీద సైనిక దాడులు జరుపుతూ, మరోవైపు పౌరసమాజంలో దాని సామాజిక, రాజకీయ పునాదిని బలహీనపరిచేందుకే రాజ్యం ఎన్ ఐ ఏ వంటి సంస్థలతో దాడులు చేస్తోంది. “ఊపా” వంటి దుర్మార్గ చట్టాలను ప్రయోగిస్తోంది.

ఈ రోజు ఇవన్నీ చాలా సాధారణ విషయాలుగా మారిపోయాయి. ప్రజలే కాదు అవసరం కొద్దీ పాలక వర్గాలు కూడా ఈ విషయాలను మాట్లాడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించాడు “బిజేపీ ఒక దేశద్రోహుల ఫ్యాక్టరీ నడుపుతుంది” అని. దానర్థం వాళ్ళు అవసరం అనుకున్నప్పుడు ఎవ్వరినైనా “దేశద్రోహులు”గా ముద్రలు వేయగలరని. అలా అని కేసీఆర్ కు ఆ “ఫ్యాక్టరీకి” ఏ సంబంధం లేదనుకుంటే మన భ్రమే అవుతుంది. ఆయన కూడా ఆ ఫ్యాక్టరీ వాటాదారుడే. ఎన్ ఐ ఏ పుస్తకాల మీద దాడి చేస్తే ఈయన మూకలు పుస్తకం అచ్చు అవుతున్నప్పుడే దాడి చేసి జప్తు చేస్తాయి. ఇది అక్షరాన్ని పుట్టక ముందే చంపేయడం. అక్షర గర్భస్రావం. అవసరం కోసం నాటకాలు ఆడుతారు కాని ఈ పాలకులంతా అక్షరద్రోహులే!

ఈ అక్షరద్రోహులకు, దాడులు చేసే దొంగల మూఠాలకు మాటల సద్దులు మోసే వ్యవస్థలు, వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు నోరు ఎత్తితే “విప్లవాలకు కాలం చెల్లిపోయింది” అనే మాటతో మొదలు పెడుతారు. టీవీ చర్చల్లో తమ మిడిమిడి జ్ఞాన ప్రదర్శనంతా చేస్తుంటారు. అసలు కాలమంటే ఏమిటి? కాలానుగుణంగా ఉండటం, కాలం చెల్లిపోవడం అంటే ఏమిటో చెప్పకుండానే తీర్పులు ఇచ్చేస్తుంటారు.

టీవీ చర్చలంటేనే “అదొక పాలకవర్గ అల్లరి ఆట”గా మారిపోయిన సందర్భంలో వాటి వైపుకు కన్నెత్తి చూడక చాలా కాలమయ్యింది. కాని ఈ మధ్య ఒక చర్చ ఆసక్తి అనిపించి చూశాను. అది మావోయిస్టు నాయకుడు రామకృష్ణ మరణం, గడ్చిరోలిలో జరిగిన “ఎదురుకాల్పుల్లో” 26 మంది విప్లవకారుల హత్యల సందర్భంగా విప్లవోద్యమాన్ని అంచనా వేసే ఒక చర్చ. అందులో ఒక విరసం సభ్యుడు, ఒక విశ్రాంత పోలీస్ అధికారి, “మధ్యవర్తి” స్థానంలో ఒక లాయర్ ఆ చర్చలో పాల్గొన్నారు. ఆ చర్చను నడుపుతున్న యాంకరమ్మ కొంత అత్యుత్సాహంతోనే చర్చను మొదలుపెట్టింది. మొదటగా హింసతో, శవాల లెక్కలతో, విప్లవోద్యమం కోల్పోతున్న భూభాగ మ్యాపులతో కొంత హడావిడి చేసింది.

ఆ లెక్కలు బాగా నచ్చినట్లున్నాయి సదరు పోలీస్ అధికారికి. అతను వెంటనే “అవును దీనిని మేము ముందే ఊహించాము. నేను 80లలో వరంగల్లో పనిచేసేటప్పుడు వాళ్ళకు చెప్పాను మీరు ముసలి వాళ్ళు అయ్యాక, మోకాళ్ళ బిల్లలు అరిగిపోయాక, అనారోగ్యానికి గురయ్యాకా ఇంటి బాట పట్టడమో, లేక మా చేతుల్లో చావడమో జరుగుతుంది తప్ప విప్లవం రాదని” (ఇవే మాటలు కాకపోయినా ఇదే అర్థానిస్తూ) అంటూ తన ఊహ నిజమవుతోందన్న సంత్తృప్తి వెలిబుచ్చాడు.

ఈ చర్చలో అరుపులు పెడబొబ్బలు లేవుకాని అంతకన్నా ప్రజా ఉద్యమాల మీద దాడి సైలెంట్ గా సాగుతోంది. ఆ విషయాన్ని విరసం సభ్యుడు వెంటనే గమనించినట్లు ఉన్నాడు “ప్రాధమికంగా కేవలం హింసను దృష్టిలో పెట్టుకుని విప్లవాన్ని అంచనావేయడమే పొరపాటు. నిజానికి విప్లవకారుల మీద, ప్రజల మీద హింస జరుగుతుంది. దానిని నివారించడానికే వాళ్ళు ప్రతిహింస చేస్తున్నారు. వాళ్ళు శాంతి కోసం ప్రజా యుద్ధం చేస్తున్నారు” అని స్పష్టం చేశాడు. ఆ మాట అనగానే యాంకరమ్మకే కోపం వచ్చినట్లుంది “వాళ్ళు సాధించింది ఏంటి? వాళ్ళు ఏ ప్రజల కోసం పోరాడుతున్నారు?” అంటూ విప్లవానికి కాలం చెల్లిపోయిందని నిర్ధారణకు వచ్చినట్లు అనిపించింది.

ఇక చర్చలో పాల్గొన్న పోలీస్ అధికారి మరో అడుగు ముందుకేసి “అంబేద్కర్ తన రాజ్యాంగం ద్వారా సాయుధ విప్లవానికి ఎప్పుడో చెక్ పెట్టాడు. దాని కోసమే రాజ్యాంగంలో సోషలిస్టు అనే పదాన్ని వాడాడు” అని చెప్పాడు. వాస్తవానికి రాజ్యాంగ పీఠీకలో ఆ పదం 1976లో 42వ సవరణ ద్వారా చేర్చబడింది. అంబేద్కర్ చేర్చింది కాదు. అయితే అసలు చర్చ చేయాల్సింది రాజ్యాంగం ద్వారా సోషలిజం కాదు కదా కనీస రాజ్యాంగ విలువలైనా అమలులోకి వచ్చాయా అని. రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఏండ్లు దాటినా మెజారిటీ ప్రజలకు ఇంకా ప్రజాస్వామ్యం అనే పదమే ఎందుకు పరిచయం కాలేదు. కాలం చెల్లిపోవడం గురించి చర్చ చేయాల్సి వస్తే ఆ చర్చ దేని మీద చేయాలి: విఫలమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీదనా, ఇంకా సఫలం కాలేని విప్లవం మీదనా?

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అనేక సభలు జరిగాయి. ఆ సభలను హిందుత్వ శక్తుల కంటే ఎక్కువగా “అర్బన్ నక్సల్స్”గా ముద్ర వేయబడే సామాజిక శక్తులే ఎక్కువగా జరుపుకున్నాయి. దళిత బహుజనులు రాజ్యాంగాన్ని మరో “పవిత్ర” గ్రంధంగా నెత్తికెత్తుకున్నారు. ఎందుకంటే దాని రచనలో అంబేద్కర్ ది ప్రముఖ పాత్ర కాబట్టి. చివరికి రాజ్యాంగ అమలుకు సంబంధించి అంబేద్కర్ వ్యక్తపరిచిన అనుమానాలు కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకోవడం లేదు.

ఇటువంటి వాతావరణంలో “సోషల్ డెమక్రాటిక్ ఫోరం” వారు ఒక జూం మీటింగ్ నిర్వహించారు. అందులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రధాన వక్తగా మాట్లాడారు. ఆయన చేసిన ప్రసంగం ప్రకారం దేశంలో రాజ్యాంగ విలువలు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. ఎంత గొప్ప రాజ్యాంగం వున్నది అనేది ముఖ్యం కాదు దానిని సరిగ్గా అమలు చేసే రాజకీయ వ్యవస్థ ఉన్నాదా అనేది ముఖ్యమని స్పష్టం చేశాడు. ఇప్పుడు కావాల్సింది కేవలం రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాలు కాదు ఎందుకంటే కేవలం రాజ్యాంగమే ప్రజాస్వామ్యాన్ని గ్యారంటీ చేయదు. ఇప్పుడు కావాల్సింది ప్రజస్వామిక పోరాటాలు అవి మాత్రమే రాజ్యాంగ విలువలను నిలబెడుతాయి. సమాజాన్ని ప్రజాస్వామీకరిస్తాయి. జస్టిస్ సుదర్షన్ రెడ్డి నాజీలు వాడిన పద్ధతులు, భాషను గుర్తుచేశారు. అవి ఏ రూపంలో మన వర్తమానంలో పనిచేస్తున్నాయో పోల్చుకోమన్నాడు. అంబేద్కర్ ఆందోళన చెందినట్లు మళ్ళీ మనం మన రాజకీయ స్వాతంత్య్రాన్ని కోల్పోబోతున్నామేమో ఆలోచించమన్నాడు. ఈ హెచ్చరికను సీరియస్ గా తీసుకోకపోతే ప్రత్యామ్యాయ రాజకీయాలలో భాగం కాకపోతే పరిస్థితి ప్రమాదస్థాయికి చేరబోతుంది. అందరి స్వేచ్ఛలు హరించబడుతాయి.

సమస్య మనది కాదులే అని మౌనంగా ఉంటున్నామంటే రాజ్యం చేస్తున్న “పౌరసమాజంపై యుద్ధానికి” మనం మద్దతు ప్రకటిస్తున్నట్లే. పాలకవర్గాలకు పీడిత అస్తిత్వాలు ముక్కలుగా చీలిపోవడం, వైరుధ్యాలు పెంచుకోవడం అవసరం. ఆ అవసరం కోసం మనల్ని విడదీసే పని చేస్తూనే వుంటారు. అంతే కాదు అన్ని సమస్యలకు ఇపుడున్న వ్యవస్థలోనే సమాధానం దొరుకుతుంది అనే ఒక భ్రమను కూడా నిరంతరం కల్పిస్తుంటారు. అది కొన్నిసార్లు మనకు నచ్చే విధంగానే చెబుతారు. వాళ్ళు చెప్పేది నమ్ముతూ ఉండాలంటే మనకు జ్ఞానం ఉండొద్దు. మన అనుభవాలను, అమరుల జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలంటే మనకు అక్షరాలు ఉండొద్దు. మన చైతన్యాన్ని రేపటి తరానికి అందించాలంటే మనకో ఆలోచనాధార ఉండొద్దు. వాటిని ధ్వంసం చేయడానికే ఎన్ ఐ ఏ వంటి పుస్తకాల దొంగలు దాడులు చేస్తున్నారు. ఆ దొంగలను ఐక్యంగా బహిర్గత పరుచుదాం. ఎదుర్కొందాం. మనం ఒంటరి కాదు ఒక్కటేనని నిరూపిద్దాం. దొంగల దాడులకు, “పిలుపులకు” భయపడేది లేదని ఆచరణతో తేల్చిచెబుదాం. పుస్తకాలనయితే ఎత్తుకుపోతావు కాని అనునిత్యం పురుడు పోసుకుంటున్న మా ఆలోచనలను ఏం చేయగలుగుతావని సవాల్ విసురుదాం.

One thought on “పుస్తకాల దొంగలొస్తున్నారు జాగ్రత్త!

  1. పోలీసుల మారు పేరు పుస్తకాల దొంగలు అని ఊరికే అన్నారా మన శ్రీ శ్రీ.
    సత్యాన్ని చాటిచెప్పే పుస్తకాల నిషేధించగలరు గాని/సాక్ష్యం గా బతికే ప్రపంచాన్ని ఏం చేయగలరు?–వి వి

Leave a Reply