తెలుగు: పద్మ కొండిపర్తి
ప్రస్తావన: మూడు వాస్తవ దృశ్యాలు
మొదటిది
ఇండోర్‌లోని ప్రభుత్వ న్యూ లా కాలేజీ (జిఎన్‌ఎల్‌సి) ప్రిన్సిపాల్ అయిన ప్రొఫెసర్ ఇనాముల్ రెహ్మాన్పైన, కాలేజీ లైబ్రరీలో “హిందూ వ్యతిరేక- దేశ వ్యతిరేక పుస్తకాన్ని” ఉంచారనే ఆరోపణలపైన మధ్యప్రదేశ్ పోలీసులు 2022 డిసెంబరులో కేసు నమోదు చేశారు. ఆ పుస్తకం పేరు ‘కలెక్టివ్ వయలెన్స్ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్'(సామూహిక హింస-నేరన్యాయవ్యవస్థ). డాక్టర్ షీతల్ కన్వాల్, డాక్టర్ ఫర్హత్ ఖాన్ సహ రచయితలు. ఈ పుస్తకం జిఎన్‌ఎల్‌సి లైబ్రరీలో 2014 నుండి ఉంది. డాక్టర్ రెహ్మాన్ ఐదేళ్ల తర్వాత 2019లో జిఎన్‌ఎల్‌సి లో చేరారు. ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగమైన ఎబివిపి ప్రకారం, “హిందూ మతతత్వం విధ్వంసక సిద్ధాంతంగా ఆవిర్భవించడం” గురించి ఈ పుస్తకం మాట్లాడుతుంది. విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందుత్వ సంస్థలు హిందూ-మెజారిటీ రాష్ట్రాన్ని స్థాపించాలని చూస్తున్నాయని, “ఇతర వర్గాలను బానిసలుగా మార్చాలని” కోరుకుంటున్నాయని కూడా ఈ పుస్తకంలో ఉన్నదని అంటున్నారు. ఇందులో అభ్యంతరకరమైన భాగాలు ఉన్నాయని ‘చెప్పబడిన’ వాటిని తొలగించడానికి 2021లో దీనిని సవరించారు.
మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ (ప్రస్తుత ముఖ్యమంత్రి), ఈ పుస్తకాన్ని కాలేజీలో రిఫరెన్స్‌గా ఉపయోగించడానికి ఎలా అనుమతి ఇచ్చారనే దానిపైన విచారణకు ఆదేశించారు. ఎబివిపి సభ్యుడు, సెకండ్ ఇయర్ ఎల్‌ఎల్‌ఎమ్ విద్యార్థి అయిన లక్కీ ఐద్వాల్ చేసిన ఫిర్యాదుపైన చర్య తీసుకుంటూ, ఐపీసీలోని అనేక నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అప్పటి గృహమంత్రి నరోత్తం మిశ్రా ఆదేశించారు.
ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్లు: ఐపీసీ సెక్షన్లు: 153A (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 295A (ఏదైనా వర్గానికి చెందిన మత భావాలను కించపరిచే ఉద్దేశంతో దురుద్దేశపూర్వక చర్యలు) సెక్షన్ 500 (పరువు నష్టం), సెక్షన్ 504 శాంతిని ఉల్లంఘించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వక అవమానం) 505 (ప్రజా అల్లర్లకు దారితీసే ప్రకటనలు).
ఎఫ్‌ఐఆర్‌లో ప్రొఫెసర్ రెహ్మాన్‌తో పాటు, పుస్తక రచయిత డాక్టర్ ఫర్హత్ ఖాన్, ప్రచురణకర్త అమర్ లా పబ్లికేషన్, ప్రొఫెసర్ మీర్జా మోజిజ్ బేగ్‌ల పేర్లను కూడా చేర్చారు. ప్రొఫెసర్ రెహ్మాన్, డాక్టర్ బేగ్‌ల అరెస్టుపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రొఫెసర్ రెహ్మాన్ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. మిగిలిన ఇద్దరు (డాక్టర్ ఫర్హత్ ఖాన్, ప్రొఫెసర్ మీర్జా మొజిజ్ బైగ్) ఇండోర్‌కు తిరిగి రాలేదు. 2024 మేలో సుప్రీం కోర్ట్ ఈ ఎఫ్‌ఐఆర్‌ను “అసంబద్ధం”గా పేర్కొంటూ కొట్టివేసింది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ముగ్గురిలో ఎవరూ జిఎన్‌ఎల్‌సిలో మళ్లీ బోధించలేకపోయారు.
రెండవది
2023 ఆగస్టు చివరి వారంలో సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఉన్న నేహా పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా ఉన్న తృప్తి త్యాగి, తన తరగతిలోని విద్యార్థులు ఒక్కొక్కరిని పిలిచి, 7 ఏళ్ల ముస్లిం క్లాస్‌మేట్‌ను కొట్టమని చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. ప్రతి దెబ్బకు ఆ బాలుడు భయంతో ఏడుస్తూ నిలబడి ఉంటే, టీచర్ ఇతర విద్యార్థులకు “సరిగ్గా” కొట్టమని చెప్పడం వినిపించింది. ఆ బాలుడు “ఎక్కాలు అప్పచెప్పనందుకు” కొట్టమన్నానని; అంతేకాకుండా “మహమ్మదీయ విద్యార్థుల తల్లులు తమ పిల్లల చదువులపై శ్రద్ధ చూపకపోతే, వారి పనితీరు దెబ్బతింటుంది” అని తన చర్యను టీచర్ సమర్థించుకున్నదని ఆ జిల్లా ఎస్పీ విలేకరులతో చెప్పాడు.
మూడవది
2023 ఆగస్టు 9నాడు తమిళనాడు, తిరునల్వేలి జిల్లాలోని నాంగునేరి పట్టణంలో ఉన్న పాక్షికంగా ప్రభుత్వ ఆర్థిక సాయం పొందే ఒక పాఠశాలలో, 17 ఏళ్ల దళిత విద్యార్థిపైన అతని ముగ్గురు క్లాస్‌మేట్స్ (వీరు మరవార్ సామాజిక వర్గానికి చెందినవారు; ముక్కులథోర్స్ అని పిలవబడే మధ్యస్థ ఆధిపత్య కులంలో భాగం) కొడవళ్లతో క్రూరంగా దాడి చేసారు. ఆ విద్యార్థి చిన్న చెల్లెలు అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తే, ఆమెపైన కూడా దాడి చేసారు.
ఈ క్రూరమైన దాడికి కారణం ఏమిటి?దళిత విద్యార్థి తమ కంటే తరగతిలో చాలా బాగా చదువుతుండటంతో ఆ ఆధిపత్య కుల విద్యార్థులకు కోపం వచ్చింది. వారు అతన్ని కుల దూషణలతో నిరంతరం వేధించడం, అవమానించడం, ఎగతాళి చేయడమే కాకుండా, తమ కోసం తక్కువ స్థాయి పనులను చేయమని అడిగేవారు. ఈ వేధింపుల నుండి తప్పించుకోవడానికి, ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లడం మానేసాడు. ప్రిన్సిపాల్ ఆరా తీస్తే, ఆ దళిత బాలుడు అసలు కారణాన్ని చెప్పడం ఈ ఘటనకు దారితీసింది. ఆ బాలుడు, అతని చిన్న చెల్లెలు ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు; వారికి శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ తర్వాత వారిని వేరే పాఠశాలకు మార్చారు.
ఈ దిగ్భ్రాంతి కలిగించే ఘటన జరిగిన మూడు రోజుల్లోనే, తమిళనాడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ, రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో కుల/మత భేదాలు లేని వాతావరణాన్ని సృష్టించడానికి చేపట్టాల్సిన చర్యలను సూచించడానికి జస్టిస్ కె. చంద్రు (మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి)తో ఏకసభ్య కమిటీని నియమించింది.
ఇది ఎందుకు అవసరమైంది? ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తా పత్రిక 2015 నవంబర్‌లో రిపోర్టు ప్రకారం, తిరునల్వేలిలోని కొన్ని ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులు వేర్వేరు రంగుల రిస్ట్ బ్యాండ్‌లను ధరిస్తున్నారు; ఇవి వారి నిర్దిష్ట కులాన్ని సూచిస్తాయి. తేవర్‌లు – ఎరుపు-పసుపు; నాడార్‌లు – నీలం-పసుపు; యాదవులు – కాషాయం రంగు (ఈ మూడు సామాజికంగా, రాజకీయంగా శక్తివంతమైన హిందూ వర్గాలు, ఇవి అత్యంత వెనుకబడిన తరగతుల కేటగిరీ కిందకు వస్తాయి.) పల్లార్ (దళిత) విద్యార్థులు – ఆకుపచ్చ-ఎరుపు; అరుంధతియార్ల (ఇది కూడా దళిత) విద్యార్థులు – ఆకుపచ్చ, నలుపు, తెలుపు మణికట్టుపట్టీలను (రిస్ట్ బ్యాండ్)ధరిస్తారు. దీనికి నాలుగు సంవత్సరాల తరువాత 2019 ఆగస్టులో, తమిళనాడు రాష్ట్ర విద్యా శాఖ పాఠశాలల్లో ఈ పద్ధతిని నిరుత్సాహపరుస్తూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ చర్యను బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా అత్యంత తీవ్రంగా వ్యతిరేకించాడు. చేతులకు దారాలు కట్టుకోవడం, నుదిటిపై తిలకాలు పెట్టుకోవడం హిందూ మతానికి సంబంధించినవి, పాఠశాలల్లో వీటిని నిషేధించడం ప్రస్ఫుటమైన హిందూ వ్యతిరేక చర్య అని ట్వీట్ చేసాడు.. “ఇతర మతాల చిహ్నాలను నిషేధించే ధైర్యం పాఠశాల విద్యా డైరెక్టర్‌కు ఉందా?” అని ప్రశ్నించాడు కూడా. (వివాదాస్పదమూ, రాజకీయ దుమారం చెలరేగడంతో ఈ సర్క్యులర్‌ను త్వరలోనే ఉపసంహరించుకున్నారు కూడా- అను)
II
విద్యారంగ స్వేచ్ఛపైన పర్యవేక్షణ నివేదిక :
పైన పేర్కొన్న సంఘటనలు మన దేశంలో నేడు విద్యా స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉందనే దానిపై స్పష్టమైన అవగాహనను ఇస్తున్నాయి. ‘విద్యా స్వేచ్ఛ’ అనే పదంపైన ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది గతంలో కంటే ఇప్పుడు మరింత విశ్వవ్యాప్తంగా బెదిరింపులను ఎదుర్కొంటోంది. ఫ్రెడరిక్-అలెగ్జాండర్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ (ఫ్రెడరిక్-అలెగ్జాండర్-యూనివర్సిటాట్ ఎర్లాంజెన్-నూర్న్‌బర్గ్ (1743 లో స్థాపించిన జర్మనీలోని బవేరియాలో ఒక పెద్ద ప్రజా పరిశోధనా విశ్వవిద్యాలయం), V-డెమ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా తయారుచేసిన ఎకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ నవీకరణ చేసిన నివేదిక 2025లో విడుదలైంది. ఇది 179 దేశాలలో విద్యా స్వేచ్ఛ స్థితి గురించి ఒక స్థూల దృష్టిని ఇస్తుంది.
ప్రభుత్వంలో బహుళత్వ వ్యతిరేక పార్టీలు ఉన్న దేశాలు బహుళత్వ వ్యతిరేక పార్టీలకు తక్కువ రాజకీయ ప్రభావం ఉన్న దేశాల కంటే తక్కువ స్థాయిలో విద్యా స్వేచ్ఛను కలిగి ఉన్నాయని దాని విశ్లేషణ చూపించింది. చట్టబద్ధమైన మార్గాల ద్వారా అధికారాన్ని పొందడానికి లేదా కోల్పోవడానికి ప్రజాస్వామిక ప్రక్రియపైన బహుళత్వ వ్యతిరేక పార్టీలకు నిబద్ధత లేదని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత, బహుళత్వ వ్యతిరేక పార్టీలు రాజకీయ శిబిరాల మధ్య భేదాలను మరింత పెంచడానికి, బహిరంగ పోటీకి ఉన్న అవకాశాన్ని తగ్గించడానికి, పరస్పర సహనాన్ని బలహీనపర్చడానికి మొగ్గు చూపుతాయి.
అకడమిక్ ఫ్రీడం ఆఫ్ ఇండియా-2025 నివేదికలో, భారతదేశం విద్యా స్వేచ్ఛస్థాయిలో “పూర్తిగా పరిమితంగా ఉన్న” దేశాలలో క్రింది 10 నుండి 20 శాతం దేశాలలో ఉంది. 2013లో భారతదేశం ‘పూర్తిగా స్వేచ్ఛాయుతమైన’ విభాగంలో ఉండేది. 2022 నాటికి అది ‘ఎక్కువగా పరిమితం చేయబడిన’ విభాగానికి పడిపోయింది. ఈ సూచికలో, భారతదేశం సిరియా, ఇరాన్, లావోస్, పాలస్తీనాల కంటే కొద్దిగా మాత్రమే మెరుగ్గా ఉంది. హంగేరీ, హాంకాంగ్, సూడాన్, యెమెన్, బంగ్లాదేశ్, రష్యా కంటే కూడా భారతదేశం వెనుకబడి ఉంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రస్తుతం విద్యా స్వేచ్ఛ “పూర్తిగా పరిమితం చేయబడిన” లేదా “తీవ్రంగా పరిమితం చేయబడిన” స్థాయిలలో జీవిస్తున్నారని నివేదిక వెల్లడించింది. 2006లో, సుమారు 4 బిలియన్ల మంది (400 కోట్లు) ప్రజలు విద్యా స్వేచ్ఛకు బలమైన వాతావరణం ఉన్న ప్రదేశాలలో నివసించారు. నేడు, ఆ సంఖ్య 2.8 బిలియన్లకు (280 కోట్లు)తగ్గింది; ఇది పావు వంతు కంటే ఎక్కువ క్షీణత.
‘స్కాలర్స్ ఎట్ రిస్క్’ (ప్రమాదంలో విద్యావేత్తలు) అనే అంతర్జాతీయ విద్యావేత్తలు, నిపుణుల సమాఖ్య కాలానుగుణంగా విడుదల చేసే ‘ఫ్రీ టు థింక్’ (స్వేచ్ఛగా ఆలోచిద్దాం) అనే నివేదిక, ప్రపంచవ్యాప్తంగా విద్యా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను అంచనా వేస్తుంది. తాజా నివేదిక 2023 జూలై 1 నుండి 2024 జూన్ 30 వరకు సేకరించిన డేటాను విశ్లేషించింది; ఇందులో 51 దేశాలు, ప్రాంతాలలో జరిగిన 313 ఘటనల నుండి జరిగిన 391 దాడులు ఉన్నాయి. ఈ నివేదిక గత దశాబ్దంలో భారతదేశంతో సహా పద్దెనిమిది దేశాలలో నెలకొన్న “ఆందోళనకరమైన” పోకడల గురించి మాట్లాడుతుంది. ఆందోళనకరమైన పోకడలు ఉన్న దేశాలలో ఒకటిగా భారతదేశం ఉంది. ఇక్కడ విశ్వవిద్యాలయాలు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న హింసకు సంబంధించిన ఉపన్యాసాలు, కవితా పఠనాలు, చలనచిత్ర ప్రదర్శనలను రద్దు చేశాయి. తరచుగా అస్పష్టమైన భద్రతా సమస్యలను చూపిస్తూ విశ్వవిద్యాలయ నేతృత్వం ఈ రద్దులను సమర్థించుకున్నది. నిరసనకారులను చెదరగొట్టడానికి రాజ్య, ఉన్నత విద్యాధికారులు పోలీసు లేదా భద్రతా బలగాలను పిలిపించిన దేశాలలో భారతదేశం కూడా ఉంది.
ఈ అనుభవాత్మక అధ్యయనాలు ప్రస్తావించిన విద్యా స్వేచ్ఛను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, అంతర్జాతీయ నిపుణులతో కూడిన వర్కింగ్ గ్రూప్ ఆన్ ఎకడమిక్ ఫ్రీడమ్ 2024 మే 31 న విడుదల చేసిన నివేదిక ద్వారా మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. వారు విద్యా స్వేచ్ఛ హక్కును అమలు చేయడానికి తొమ్మిది సూత్రాలను సిద్ధం చేశారు. అన్నింటికంటే మొదటి సూత్రం విద్యా స్వేచ్ఛను పరిశోధన, బోధన, అభ్యాసం, చర్చ ద్వారా వివిధ రకాల జ్ఞానాన్ని, ఆలోచనలను సంపాదించడం, అభివృద్ధి చేయడం, పంపడం, అన్వయించడం, నిమగ్నం చేయడం అనే మానవ హక్కుగా గుర్తిస్తుంది. ఇటువంటి నిమగ్నత విద్యా సముదాయం లోపల (అంతర్గత వ్యక్తీకరణ) లేదా ప్రజలతో సహా విశ్వవిద్యాలయేతర సముదాయం వెలుపల (బహిర్గత వ్యక్తీకరణ) జరగవచ్చు. బాల్యం నుండీ అన్ని స్థాయిలలో విద్యార్థికి విద్యా స్వేచ్ఛ హక్కును మరొక సూత్రం గుర్తించింది.
ఐక్యరాజ్యసమితి విద్యా హక్కుకు సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి, ఫరీదా షహీద్, 2024 జూన్ 18 నుండి జూలై 12 వరకు జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 56వ సమావేశంలో “విద్యా స్వేచ్ఛ”పైన తన నివేదికను సమర్పించారు. విద్యార్థులు నిర్దిష్ట విషయాలపై ప్రతీకారం జరుగుతుందనే భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును కలిగి ఉండాలని ఆమె ముఖ్యంగా గుర్తించారు.
సాంస్కృతిక వైవిధ్యానికి గౌరవం, చరిత్ర వంటి విషయాలలో సహా బహుళ-దృక్పథ విధానాన్ని (అనేక కోణాల నుండి చూడటం) నిర్ధారించాల్సిన అవసరాన్ని పరిగణించాలి. విద్యావేత్తలను విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడానికి, విభిన్న దృక్పథాలను అందించడానికి ప్రోత్సహించాలి. అయితే, వారు ఈ పనిని బహుళత్వాన్ని, ఇతరుల పట్ల గౌరవాన్ని, జ్ఞాన సముపార్జన సూత్రాలను సమర్థించే విధంగా చేయాలి. విద్యార్థులు విమర్శనాత్మకంగా ఆలోచించడానికి, వివిధ అభిప్రాయాలతో నిమగ్నం కావడానికి, సమాచారంతో కూడిన దృక్పథాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించే సహాయక వాతావరణాన్ని సృష్టించాలి అని ఆమె కోరారు. ఈ నివేదికలో అత్యంత ముఖ్యమైన ప్రతిపాదన ఏమిటంటే, విద్యా స్వేచ్ఛను “అంతర్జాతీయ చట్టంలోని అనేక నిబంధనలలో వేళ్ళునుకొని ఉన్న స్వయంప్రతిపత్త మానవ హక్కు” గా పరిగణించాలి.
III
న్యాయ వ్యవస్థ-న్యాయస్థానాలు :
మన దేశంలో విద్యకు, విద్యా స్వేచ్ఛకు సంబంధించిన న్యాయ వ్యవస్థ ఎలా ఉందో ఇప్పుడు సంక్షిప్తంగా పరిశీలిద్దాం. ఆర్టికల్ 39 (f): మన రాజ్యాంగంలోని ఈ నిబంధన, ఒక బిడ్డ ఆరోగ్యకరమైన రీతిలో; స్వేచ్ఛ, గౌరవంతో కూడిన పరిస్థితులలో అభివృద్ధి చెందడానికి అవసరమైన అవకాశాలను, సౌకర్యాలను కల్పించాల్సిన రాజ్య విధి గురించి చెబుతుంది.
ఆర్టికల్ 45 : ఈ ఆదేశిక నియమం అసలు రూపంలో, రాజ్యం 10 సంవత్సరాల వ్యవధిలో పద్నాలుగు సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి ప్రయత్నించాలని నిర్దేశించింది. ఈ అంశంలో ఒక ముఖ్యమైన మలుపు, 1993లో సుప్రీం కోర్ట్ జేపీ ఉన్నికృష్ణన్ v. స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో ఇచ్చిన చారిత్రక తీర్పు. ఈ తీర్పు 14 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న ప్రతి పౌరుడికి విద్య పొందే హక్కును ఒక “ప్రాథమిక హక్కు”గా ప్రకటించింది. (అయితే, ఈ కేసు ప్రధానంగా ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ విద్యా సంస్థలలో క్యాపిటేషన్ ఫీజుల వసూళ్ల సమస్యకు సంబంధించినది. ఆ సమస్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.)
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత, 2002లో, పార్లమెంట్ రాజ్యాంగంలోని పార్ట్ IIIలో ఆర్టికల్ 21-Aను చేర్చింది. ఇది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బిడ్డకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అయితే, దీని అమలు పార్లమెంట్ చేసే చట్టంపైన ఆధారపడి ఉంటుంది. 8 సంవత్సరాల తర్వాత, 2010 ఏప్రిల్ 1, నుండి మాత్రమే ఈ సవరణ అమలులోకి వచ్చింది. అదే రోజు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం కూడా అమలులోకి వచ్చింది. దీనికి అనుగుణంగా, ఆర్టికల్ 45ను సవరించారు; ఆరు సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే వరకు పిల్లలందరికీ ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలని నిర్దేశించింది. ఆర్టికల్ 21-A లో ప్రాథమిక విద్య హక్కును 6-14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా, రాజ్యాంగం చేసే ఈ వాగ్దానం అసంపూర్ణంగా మిగిలిపోయిందని చెప్పవచ్చు. బాల్య విద్య (0-6 సంవత్సరాలు), 14 ఏళ్లు పైబడిన వారికి విద్య ఇంకా ప్రాథమిక హక్కు పరిధిలోకి పూర్తి స్థాయిలో రాలేదు.
విద్యా రంగానికి, విద్యా స్వేచ్ఛకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని మరికొన్ని ముఖ్యమైన నిబంధనలను ఇక్కడ పరిశీలించాలి:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-A కింద రెండు ప్రాథమిక విధులు ముఖ్యమైనవి:
ఆర్టికల్ 51-A (h): ఇది ప్రతి పౌరుడికి “శాస్త్రీయ దృక్పథం, మానవత్వం, విచారణ- సంస్కరణ స్ఫూర్తిని ” పెంపొందించడాన్ని ఒక విధిగా పేర్కొంటుంది. ఇది విమర్శనాత్మక ఆలోచన, పరిశోధనకు రాజ్యాంగపరమైన పునాదిని ఇస్తుంది. ఆర్టికల్ 51-A (k): ప్రతి పౌరుడు, తల్లిదండ్రిగా లేదా సంరక్షకుడిగా, ఆరు-పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల తమ బిడ్డకు లేదా సంరక్షిత పిల్లలకు విద్య అవకాశాలను అందించడం విధి అని తెలుపుతుంది. ఇది ఆర్టికల్ 21-A లోని ప్రాథమిక హక్కుకు అనుబంధంగా ఉంటుంది.
ఆర్టికల్ 25: ఇది పౌరులందరికీ మనస్సాక్షి స్వేచ్ఛను; మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కుకు హామీ ఇస్తుంది. ఆర్టికల్ 30: ఇది మతపరమైన, భాషాపరమైన మైనారిటీలు ఇద్దరికీ వారి ఎంపిక మేరకు విద్యా సంస్థలను స్థాపించే, నిర్వహించే ప్రాథమిక హక్కును గుర్తిస్తుంది.
వృత్తిపరమైన కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు, సీట్ల రిజర్వేషన్లు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు/ప్రిన్సిపాళ్ల నియామకాలు, విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియామకాలు, ర్యాగింగ్ నిరోధక చర్యలు, విద్యా సంస్థలకు గుర్తింపు, అనుబంధం లాంటి విద్య హక్కుకు సంబంధించిన అనేక అంశాలపైన ఉన్నత న్యాయస్థానాలు (హైకోర్టులు, సుప్రీం కోర్ట్) నిరంతరం వ్యవహరిస్తాయి.
మైనారిటీ సంస్థలకు సంబంధించి ఇటీవలి కాలంలో ముఖ్యమైన రెండు తీర్పులు:
మదర్సాలపై సుప్రీంకోర్టు నిర్ణయం (2024 నవంబర్): ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాలు మతపరమైన బోధనను అందిస్తూ; 12వ తరగతి వరకు ఇతర విషయాలలో విద్యను అందించే పాఠశాలలను నడుపుకునే హక్కును సుప్రీం కోర్ట్ గుర్తించింది. అయితే, వారికి డిగ్రీలు లేదా డిప్లొమాలను ప్రదానం చేయడానికి అనుమతి ఇవ్వలేదు.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కేసు: సుప్రీంకోర్ట్ 4:3 అనే స్వల్ప మెజారిటీతో, స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న చట్టం ద్వారా యూనివర్సిటీగా మార్చబడినప్పటికీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ తన మైనారిటీ హోదాను కోల్పోదు అని తీర్పు చెప్పింది.
ఈ అంశాలు, విద్యా స్వేచ్ఛపైన ఆంక్షలకు న్యాయస్థానాల స్పందనను పూర్తిగా పరీక్షించవు. పరీక్షించిన చోట, ఫలితం నిరాశపరిచేదిగా ఉంటుంది. అలాంటి ఒక ఉదాహరణ, 2019 నాటి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), దాని పర్యవసానాలకు నిరసనగా జైలుపాలైన విద్యార్థులు, ఉపాధ్యాయుల కేసుల పట్ల న్యాయవ్యవస్థ నిర్వహించిన తీరు.
ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న భారతీయ ప్రవాసులలో కూడా ఆకస్మిక నిరసనలు వెల్లువెత్తాయని గుర్తుంచుకోవాలి. నిరసన తెలిపిన విద్యార్థులు, విద్యావేత్తలలో వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కొందరికి, జైలు నుండి బెయిల్‌పై బయటికి రావడం అసాధ్యం అయ్యేలా, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అణచివేత చట్టమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం [ఉపా] కింద కేసులు నమోదు చేశారు. ఐదేళ్లు గడిచిపోయాయి; ఈ కేసుల్లో విచారణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేకపోవడం వల్ల, వారికి బెయిల్ నిరాకరించడానికి ఎటువంటి నిజమైన సమర్థన కనిపించడం లేదు.
ప్రొఫెసర్ సాయిబాబా పైన కేసు :
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ బోధించిన ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాకు సంబంధించిన కేసును భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) వ్యవహరించిన తీరుపై అనేక మంది న్యాయ పండితులు ఆశ్చర్యాన్ని, నిరసనను వ్యక్తం చేశారు. అయితే, ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది కాబట్టి, ఈ దశలో దాని గురించి వివరణాత్మక చర్చ అనవసరం.
ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థలో భాగమని, ఉగ్రవాద చర్యల అమలుకు ప్లాన్ తయారుచేసారనేదే ఉపా చట్టపు కఠినమైన నిబంధనలను ఆయనపై ప్రయోగించడానికి ప్రాసిక్యూషన్ తన కేసులో సమర్పించిన వాదన. 2013 సెప్టెంబర్ 12న ఆయన నివాసం నుండి స్వాధీనం చేసుకున్న సీడీలు, పెన్ డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్ రూపంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఆధారాల మీదనే ఈ కేసు పూర్తిగా ఆధారపడింది. ఆయనను 2014 మే 9న అరెస్టు చేశారు. చిన్ననాటి నుంచే పోలియో వ్యాధితో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబా శాశ్వతంగా వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. అయినప్పటికీ, ఆయనకు బెయిల్ ఇవ్వ నిరాకరించారు. ఆయనకు పూర్తిగా స్వేచ్ఛ లభించడానికి పది సంవత్సరాలు పట్టింది.
ప్రొఫెసర్ సాయిబాబా, ఇతర సహ-నిందితులు దోషులని పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన 2017 మార్చి 7 నాటి తీర్పును, బొంబాయి హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ 2022 అక్టోబర్ 14 న రద్దు చేసింది. ఉపా సెక్షన్ 45 (1) ప్రకారం చెల్లుబాటు అయ్యే అనుమతి లేకపోవడం వల్ల క్రిమినల్ కేసులలోని ప్రక్రియలు చెల్లనివి- రద్దైనవి అని అది పేర్కొంది.
అక్షరాలా ఒక్క రాత్రిలోనే, మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ను దాఖలు చేసింది; అది మరుసటి రోజు 2022 అక్టోబర్ 15న సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ (జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ బేలా ఎం. త్రివేది) న్యాయమూర్తులలో ఒకరి నివాసంలో విచారణ జరిగింది; అది శనివారం కావడం గమనార్హం. ఇది బహుశా కోర్టు చరిత్రలో ఒక అరుదైన సంఘటన కావచ్చు. ప్రొఫెసర్ సాయిబాబాను “నిర్దోషిగా విడుదల” చేయడంపై స్టే విధించారు. దీని ఫలితంగా, ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, సుప్రీంకోర్టు చలించకపోవడంతో, ఆయన నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్‌లోనే కొనసాగవలసి వచ్చింది.
అప్పీళ్లను మళ్ళీ తాజాగా వినడానికి 2023 ఏప్రిల్ 19 నాడు సుప్రీంకోర్టు హైకోర్టుకు తిరిగి పంపడానికి మరో ఆరు నెలలు పట్టింది. రెండవసారి, 2024 మార్చి 5న, బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లోని మరొక ధర్మాసనం (జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి మెనెజెస్) తీర్పునిస్తూ, నిందితులలో ఎవరిపైనా విచారణ జరపడానికి సరైన మంజూరు లేదని మాత్రమే కాకుండా, సేకరించిన సాక్ష్యం కూడా ప్రాసిక్యూషన్ కేసును నిరూపించలేదని పేర్కొంటూ నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది . అదృష్టవశాత్తూ, ఈ తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యం దాఖలు చేసిన తదుపరి అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు. దీంతో ప్రొఫెసర్ సాయిబాబా చివరకు స్వేచ్ఛా మనిషిగా, తలెత్తుకుని జైలు నుంచి బయటకు రాగలిగారు. అయితే, పది సంవత్సరాలకు పైగా జైలులో రాజ్యం అందించిన నిర్లక్ష్యపూరిత చికిత్స కారణంగా ఆయన శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ ప్రక్రియే శిక్షగా మారింది.
దురదృష్టవశాత్తూ, ఆయన ఆ తర్వాత ఎక్కువ కాలం జీవించలేదు. పిత్తాశయంలోని రాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తలెత్తిన సమస్యలతో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 57 సంవత్సరాలు. ఆయన ‘ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నేషన్ మేకింగ్’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసిన ఒక మేధావి. ఆయన జైలులో ఉన్నప్పుడు రాసిన రచనలు, కవితల సంపుటాలు రెండు ప్రచురితమయ్యాయి. మన మనస్సాక్షిని ఎక్కువగా కలచివేసే ప్రశ్న ఇదే: జ్ఞాని, సహనశీలుడైన ఒక వ్యక్తికి వ్యవస్థ చేసిన ఈ అకృత్యానికి ఎవరు, ఎప్పుడు జవాబుదారీ వహిస్తారు?
పైన పేర్కొన్న సందర్భాలలో, విద్యావేత్తలు, విద్యార్థులపైన దేశ వ్యతిరేకులనే ఆరోపణలతో, క్రూరమైన నేర చట్టాల కింద అభియోగాలను మోపినప్పుడు వారికి న్యాయం లభించలేదు. అంతేకాకుండా, వారు విజిలెంట్ ముఠాలు (చట్టాన్ని అమలుచేసే స్వయంనియమిత), ఆధిపత్య కులాల వంటి రాజ్యేతర సంస్థల చేతిలో బాధితులు అయినప్పుడు కూడా న్యాయం వారికి అందని ద్రాక్షలాగే మిగిలిపోతున్నట్లు కనిపిస్తుంది.
నా ప్రసంగం ప్రారంభంలో నేను ప్రస్తావించిన మూడు దృశ్యాల పరిణామాలను గురించి చెప్పడం ద్వారా ఈ వ్యాఖ్యను నేను సమర్థిస్తాను.
V
మూడు దృష్టాంతాలు- వాటి పరిణామం
మొదటి దృష్టాంతం: ఇందోర్ కేసు
మొదటి దృశ్యమైన ఇందోర్ జిఎన్‌ఎల్‌సి కేసులో, 2024 మే నెలలో సుప్రీంకోర్టు ప్రొఫెసర్ రెహమాన్, అతని ముగ్గురు సహ-నిందితులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ‘అసంబద్ధమైనది’గా పేర్కొంటూ రద్దు చేసింది. అయినప్పటికీ, రాజీనామా చేయవలసి వచ్చిన ప్రొఫెసర్ రెహమాన్‌కు, ఆయన అనుభవించిన మానసిక వేదన, అవమానానికి ఎటువంటి పరిహారం అందలేదు. మిగతా నిందితులు కూడా జిఎన్‌ఎల్‌సికి తిరిగి రాలేకపోయారు. ఇది విడి సంఘటన కాదు. దేశవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు నడుపుతున్న విద్యాసంస్థలపైన హిందూ మితవాద గ్రూపుల నుండి నిరంతర దాడులు జరుగుతున్నాయి. మతగురువులు, నన్స్‌ను వేధించడం, సామూహిక ప్రార్థనలను అడ్డుకోవడం, వారి భూమిని ఆక్రమించడం లేదా భవనాలను బుల్‌డోజర్‌తో నేలమట్టం చేయడం జరుగుతోంది. వీరిలో కొందరిపై బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారనే తప్పుడు ఆరోపణలు కూడా మోపుతున్నారు. ఈ కేసులు కూడా కోర్టుల పరిశీలనలో ఉన్నాయి.
రెండవ దృష్టాంతం: ముజఫర్‌నగర్‌లో విద్యార్థిని కొట్టిన కేసు
ఉపాధ్యాయురాలి ప్రోద్బలం, ఆదేశం మేరకు తన సహవిద్యార్థులచేత పదేపదే చెంపదెబ్బలు తిన్న యువ ముస్లిం బాలుడి కేసును తుషార్ గాంధీ సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. శారీరక శిక్ష లేదా మానసిక వేధింపులకు గురిచేయడాన్ని నిషేధించే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 17ని ఈ కేసులో ఘోరంగా ఉల్లంఘించారని కోర్టు గుర్తించింది. ఆ బాలుడి పాఠశాల విద్య పూర్తయ్యే వరకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్రం భరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
కేంద్రీయ విద్యాలయాలతో సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న పరిణామాలు లౌకిక విద్యకు ఉన్న అంధకారమైన పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ పాఠశాలలు హిందూ మితవాద ఎజెండాను మరింత ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలను నిర్వహించడంలో కొత్త దృఢత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కేవలం ఈవెంట్ మేనేజర్‌లుగా, ఇంటర్నెట్‌లో అసంపూర్ణ డేటాను అప్‌లోడ్ చేసేవారిగా మారిపోవడం వల్ల, వారి ప్రాథమిక కర్తవ్యం అయిన బోధనపై దృష్టి పెట్టడానికి సమయం లేకుండా పోయిందని, దీంతో వారు నిరాశకు గురవుతున్నారని ప్రొఫెసర్ కృష్ణ కుమార్ విచారం వ్యక్తం చేసారు.
వీటన్నిటికీ తోడు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పరిస్థితి దారుణంగా ఉందని అనేక లిఖిత అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, తరగతి గదులు, కుర్చీలు, బల్లలు, బ్లాక్‌బోర్డులు, శుభ్రమైన తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు మొదలైన అవసరమైన ప్రతిదానికీ తీవ్ర కొరత ఉంది. దీని ఫలితంగా, సహజంగానే ప్రైవేట్ ట్యూషన్ల పరిశ్రమ వర్థిల్లుతోంది. ఖర్చులను భరించలేని వారికి, విద్యాభ్యాసం, విద్యా స్వేచ్ఛ అనేది ఒక దూరపు కలగానే మిగిలిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, యువ దళిత బాలుడు, అతని చెల్లెలికి వైద్య చికిత్స అందించడంతో పాటు, అతనికి మరొక పాఠశాలలో ప్రవేశం కల్పించింది. అక్కడ ఆ విద్యార్థి తన చదువులో రాణించడం కొనసాగిస్తున్నాడు. జస్టిస్ చంద్రు ఆ బాలుడితో మాట్లాడినప్పుడు, తనపై దాడి చేసినవారు కూడా చదువులో సమానంగా రాణించాలని అతను కోరుకున్నాడు. అంత చిన్న వయస్సులో అతనిలో ఉన్న ఈ పరిణతి అద్భుతమైనది. ఇటీవల, అతనిపై మళ్లీ భౌతిక దాడి జరిగింది. అయితే, మీడియా నివేదికల ప్రకారం, ఈసారి దాడికి కుల కోణం లేకపోవచ్చని తెలుస్తోంది.
అయితే, జస్టిస్ చంద్రు నివేదిక ‘నంగునేరి నెవర్ ఎవర్’లోని పరిశీలనలు, అన్వేషణలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గ్రామీణ తమిళనాడులోని పాఠశాల జీవితంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ నివేదికను తప్పక చదవాలి.
దళిత విద్యార్థిపై దాడి చేసిన ముగ్గురు అగ్రకుల నిందిత విద్యార్థులను జస్టిస్ చంద్రు కలిసినప్పుడు, వారు ఎటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదు. జువెనైల్ జస్టిస్ బోర్డు ద్వారా బెయిల్ వచ్చిన తర్వాత, వారికి తమ గ్రామంలో హీరోల తరహా స్వాగతం లభించింది. డీఎంకేతో సహా ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం లేదా రాజకీయ పార్టీ కూడా కమిటీ అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు.
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా, పాఠశాల ప్రాంగణంలో దళిత మహిళలు వండిన ఆహారాన్ని తినడానికి తమిళనాడు అంతటా ఉన్న హిందూ కులస్థులు ఇప్పటికీ తమ పిల్లలను అనుమతించరని జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. అలాగే,దళిత విద్యార్థులను పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేయమని అడగడం మీద కోపం రాదు. కుల గుర్తులుగా రంగుల మణికట్టు పట్టీలు, తిలకాలను ధరించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎదుర్కొంటున్న వేధింపులు, అవమానాలు ఎటువంటి అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతున్నాయి. ఈ విషాదకరమైన సంఘటనలను నిరోధించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోహిత్ వేముల, పాయల్ తడ్వి తల్లులు ఇద్దరూ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పప్పటికీ, ఈ పరిస్థితిలో మార్పు రాలేదు.
VI
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎటువైపు?
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు క్రమంగా పతనమవడం మనం చూస్తున్నాం. అవి చాలా కాలంగా వివిధ రకాల రాజకీయాలకు ఊపిరి పోసిన కేంద్రాలుగా ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని రాజ్యం కఠిన వైఖరి ద్వారా బలవంతంగా తమ నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది.
2016 ఫిబ్రవరిలో, జేఎన్‌యూకు చెందిన ముగ్గురు విద్యార్థి నాయకులు—కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్‌లను—దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేయడంతో ఆ విశ్వవిద్యాలయం జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆ క్యాంపస్‌లో గుర్తు తెలియని, ముసుగు ధరించిన గుంపులు 2020 మేలో హింసకు పాల్పడ్డాయి. వామపక్ష రాజకీయాలకు కంచుకోటగా పరిగణించే ఆ ప్రాంగణం, ఇప్పుడు వ్యవస్థను ప్రశ్నించే, ఎదిరించే తన ప్రత్యేకమైన సామర్థ్యాన్ని కోల్పోయింది. ఉపాధ్యాయులను గానీ, విద్యార్థులను గానీ ఎవరినీ వదలిపెట్టలేదు. వాళ్లందరికీ తగిన పాఠం చెబుతున్నారు.
ఈ సంవత్సరం జేఎన్‌యూలో జరిగిన ఎన్నికల్లో, ఎబివిపి దాదాపు దశాబ్దం తర్వాత ఒక సెంట్రల్ ప్యానెల్ పదవిని గెలుచుకుంది. మరో రెండు పదవులను స్వల్ప తేడాతో కోల్పోయింది. 42 కౌన్సిలర్ సీట్లలో 23 గెలుచుకుంది; వీటీలో సుదీర్ఘకాలంగా మార్క్సిస్ట్ ప్రొఫెసర్లు, విద్యార్థులకు కేంద్రంగా ఉన్న స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్లోని రెండు సీట్లు కూడా ఉన్నాయి.
‘ది ప్రింట్’ అనే ఆన్‌లైన్ జర్నల్ కోసం రిపోర్టర్ సాన్య ధింగ్రా రాస్తూ, డజన్ల కొద్దీ ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు డోలు, బాకాలు, మంజీరాల చప్పుళ్లతో జేఎన్‌యూ క్యాంపస్‌లో విజయోత్సవంగా ఊరేగుతున్న ఇటీవలి దృగ్విషయం గురించి ప్రస్తావించారు. చాలా మంది సంప్రదాయ శాఖా లాఠీలను చేతబూనారు. పన్నెండు సంవత్సరాల క్రితం ఇది ఊహించలేనిది.
ఆమెతో మాట్లాడిన ప్రొఫెసర్‌లలో ఒకరు ఇలా వ్యాఖ్యానించారు: “గతంలో, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని అనుసరించే విద్యార్థులపట్ల ఉపాధ్యాయులు పక్షపాతం చూపినప్పటికీ, విద్యావేత్తలపై పూర్తి స్థాయి దాడులు జరగలేదు. ….. సమస్య ఏమిటంటే, ఈ సంవత్సరాలన్నీ అధికారిక వామపక్షానికి ఉండే ఎక్కువ మాట్లాడే ధోరణి కారణంగా, తమపై అన్యాయం జరిగిందని, తమను విస్మరించారనే మితవాద పక్షంలోని తీవ్ర భావాలను జేఎన్‌యూ ప్రతిబింబించడం మొదలుపెట్టింది.
ఆయన ఇంకా ఇలా అన్నారు: “సమస్య ఏమిటంటే, ఇన్నేళ్లుగా లాంఛనప్రాయ వామపక్షం వాదనల ఫలితంగా, మితవాద వర్గం తమలో దాచుకున్న బాధిత భావనలకు; పరాయీకరణకు చెందిన లోతైన భావాలకు జేఎన్‌యూ ప్రాతినిధ్యం వహించింది. అందుకే, ఒక రాష్ట్ర ఎన్నికలను గెలవడం కంటే వారికి జేఎన్‌యూను గెలవడమే మరింత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. దశాబ్దాలుగా తమ మేధో పరమైన అణచివేత, అవమానాలకి ప్రాతినిధ్యం వహించిన సంస్థను చివరకు జయించినట్లుగా ఉన్నది.”
ప్రధానమంత్రి, గృహ మంత్రి, రక్షణ మంత్రి, కేంద్ర మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాంటి నేటి నాయకులలో చాలామంది ఎదుగుదలకు ఎబివిపియే దోహదపడింది.
దివంగత అరుణ్ జైట్లీ, ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి పూర్వ మంత్రులందరూ ఒకప్పుడు ఎబివిపితో తమ ప్రస్థానాన్ని ప్రారంభించిన విద్యార్థి నాయకులే. వారు ఆయా కాలాల్లో అధికారంలో ఉన్న వ్యవస్థను సవాలు చేయడం పైన దృష్టి సారించారు. శ్రీమతి గాంధీ, ఆమె అనుచరులు దేశంపై విధించిన అపఖ్యాతి పాలైన ఎమర్జెన్సీ సమయంలో వీరు కూడా హింసకు, జైలు శిక్షకు కూడా గురయ్యారు. అయితే, ఆ రోజుల్లో వారిని ‘తుక్డే తుక్డే’ లేదా దేశ వ్యతిరేకులుగా పిలిచినట్లు ఎవరికీ గుర్తులేదు.
మనం ఈ రోజు దేశంగా అనుభవిస్తున్నది మరో అప్రకటిత ఎమర్జెన్సీ అనే విస్తృతంగా పంచుకొంటున్న వ్యాధి నిర్ధారణతో ప్రొఫెసర్ జ్ఞాన్ ప్రకాష్ విభేదిస్తున్నారు. ఆయన ప్రకారం, ఈ రోజు మనకు ఉన్నది నిరంకుశత్వంలో మరింత ప్రమాదకరమైన రూపం. ఇక్కడ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా రెండింటిలోనూ ప్రధాన స్రవంతి మీడియాపైన సంపూర్ణ నియంత్రణ ఉండడం వల్ల ప్రజావేదికల నుండి భిన్నాభిప్రాయం పూర్తిగా నిర్మూలనకు గురవుతోంది. అంతేకాకుండా, ప్రస్తుత విద్యావేత్తలు, విద్యార్థులపై ప్రయోగిస్తున్న అనేక అణచివేత క్రిమినల్ చట్టాల ఉక్కుపాదం అలుపెరగకుండా కొనసాగుతోంది.
మీడియాలో ఎక్కువగా చర్చించిన ఘటనలు ఎబివిపి అనుసరించే పద్ధతుల్లోని ఒక ధోరణిని వెల్లడిస్తున్నాయి. హిందూ మతాన్ని అవమానించేలా లేదా మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏదైనా చెప్పారని వారు భావిస్తే, ఆ డిపార్ట్‌మెంట్లను ధ్వంసం చేయగలరు. ఎవరినైతే వామపక్ష ఉదారవాదులు, ‘సెక్యులర్’ లేదా అర్బన్ నక్సల్స్ అని భావిస్తారో, అలాంటివారికి విద్యా సంబంధ పదవుల్లో నియామకాలు జరిగితే, అందుకు వ్యతిరేకంగా అనేకసార్లు హింసాత్మకంగా నిరసనలు తెలుపుతారు. 2018 నవంబర్‌లో, అలాంటి నిరసనల కారణంగా, చరిత్రకారుడు రామచంద్ర గుహ అహ్మదాబాద్ యూనివర్శిటీలో తనకు ఇస్తామన్న ఉపాధ్యాయ పదవి నుండి తప్పుకున్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీలో సంస్కృత సాహిత్యాన్ని బోధించడానికి వచ్చిన తన మొదటి ఉద్యోగంలో డాక్టర్ ఫిరోజ్ ఖాన్ ఒక్క తరగతి కూడా తీసుకోలేకపోయారు. ఒక ముస్లిం ప్రొఫెసర్ తమకు సంస్కృతం బోధించడం “సరైనది కాదు” అని చెబుతూ, ఎబివిపికి చెందిన సుమారు 30 మంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్ ఆఫీసు ముందర ధర్నా చేసారు.
“ఉర్దూ ఒక భారతీయ భాష అని, ‘భాష మతానికి కట్టుబడి ఉండదు, బహుళ భాషావాదం భారతదేశ వాస్తవికతకు అద్దం పడుతుంది'” అని గుర్తు చేసిన ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును వారు స్పష్టంగా అంగీకరించడం లేదు. ఛత్రపతి శివాజీని అవమానించేలా ఉందన్న తమ అభిప్రాయంపై క్షమాపణ చెప్పాలని కోరుతూ కోపోద్రిక్తులైన ఎబివిపి కార్యకర్తలు మహారాష్ట్రలో మహిళా ఉపాధ్యాయుల తరగతులను అడ్డుకున్నారు. వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, శాంతిభద్రతలకు భంగం కలిగించినందుకు సతారా పోలీసులు ఆ టీచర్‌పైననే కేసు నమోదు చేశారు. ఈ కేసును ముంబై హైకోర్టు రద్దు చేసి పోలీసులను తీవ్రంగా విమర్శించాల్సి వచ్చింది.
ప్రభుత్వ సంస్థల ఒత్తిళ్లకు మాత్రమే కాకుండా, మితవాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ‘సంరక్షక’ బృందాల ఒత్తిళ్లకు కూడా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తలొగ్గుతున్నాయి. తమ విద్యా స్వేచ్ఛ హక్కును నిలబెట్టుకున్న తమ సొంత అధ్యాపకులకు మద్దతు ఇవ్వకపోవడం ద్వారా, ఈ సంస్థలు వారిని రాజీనామా చేయమని బలవంతం చేశాయి. అశోకా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సవ్యసాచి దాస్ రాజీనామా అలాంటి ఒక ఉదాహరణ. వారు కూడా చివరి నిమిషంలో కారణాలు చెప్పకుండానే అతిథి వక్తల ఉపన్యాసాలను రద్దు చేశారు.
ఇది ఎస్.ఆర్. పరిశీలనను నిరూపిస్తోంది, “ప్రభుత్వ వనరులను లేదా ఆదరణ కోరే విశ్వవిద్యాలయాలు అధికారంలో ఉన్న వ్యక్తులతో రాజీపడే సంబంధాలను ఏర్పరచుకున్నప్పుడు విద్యా స్వేచ్ఛ తగ్గిపోతుంది. దీని ఫలితంగా విద్యా సంస్థల స్పష్టమైన మద్దతుతోనే విద్యా స్వేచ్ఛను అణచివేసే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. నికర ఫలితం ఏమిటంటే, ఈ వ్యవస్థ ఎక్కువగా దాగి ఉన్న స్వీయ-నియంత్రణ ద్వారా పనిచేస్తుంది.”
ఇటీవల, ఆపరేషన్ సిందూర్పైన సాయుధ బలగాలు నిర్వహించిన పత్రికా సమావేశం తరువాత సోషల్ మీడియాలో వ్యాఖ్య చేసినందుకు గాను ప్రొఫెసర్ మహమూదాబాద్‌పైన కేసు నమోదు చేసారు. సుప్రీంకోర్టు ఆయన్ని అరెస్టు చేయకుండా రక్షించింది; కానీ ఆశ్చర్యకరంగా, ఆయన ఉపయోగించిన పదాలలో ‘దాగి ఉన్న అర్థాన్ని’ విశ్లేషించాలని తాను ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను (ఎస్‌ఐటి) ఆదేశించింది.
అంతేకాకుండా, ప్రభుత్వంతో ఏకీభవించని, ఉదాహరణకు సెంటర్ ఫర్ పాలసీ అండ్ రీసెర్చ్ వంటి ప్రైవేట్ థింక్ ట్యాంకులను కూడా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, రెవెన్యూ ఏజెన్సీలు కూడా లక్ష్యంగా చేసుకొన్నాయి.
VII
విద్యా స్వేచ్ఛ ఎదుర్కొంటున్న ఇతర సవాళ్ళు
సంస్థాగత స్వయంప్రతిపత్తి, విద్యా స్వేచ్ఛ – ఈ రెండింటికీ ఉన్న తీవ్రమైన సవాళ్లలో ఒకటి విద్య కార్పొరేటీకరణ. పెద్ద వ్యాపార సంస్థలు విద్యారంగంలోకి ప్రవేశించి, విద్యను ఒక వస్తువుగా మార్చడంలో, బ్రాండింగ్ చేయడంలో, మార్కెటింగ్ చేయడంలో విజయవంతమయ్యాయి. విద్య కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండి, చాలా మందికి అందని ద్రాక్షలా మారింది.
దీనితో, ఉపాధ్యాయులు సేవా ప్రదాతలుగా, విద్యార్థులు వినియోగదారులుగా మారిపోతున్నారు. ఇప్పుడు పరిశోధనపైన దృష్టి తగ్గించి, పనితీరు, ఫలితాలపైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని ఈ ఆందోళనకరమైన ధోరణి గురించి వ్యాఖ్యాతలు చెబుతున్నారు.
ప్రైవేట్ ఉన్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రం వంటి వృత్తి విద్యా కోర్సులను అభ్యసించడానికి అయ్యే అధిక ఖర్చుల కారణంగా, చాలా మంది విద్యార్థులు ప్రాథమిక స్థాయి విద్యను పూర్తి చేయడానికి భారీగా అప్పులు చేయవలసి వస్తోంది. ఆ తర్వాత, అత్యధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకోవాలనే ప్రలోభానికి వారు లొంగిపోతున్నారు. ఇది తమ వృత్తి మార్గాన్ని ఎంచుకోవడానికి ఉన్న విద్యా స్వేచ్ఛపైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది.
డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం విద్యా స్వేచ్ఛకు ఏ మాత్రం సులభతరం కాలేదు. దీనికి విరుద్ధంగా, నిజమైన వార్త నుండి నకిలీ వార్తలను వేరు చేయడం, నిజంగా పరిశోధించిన వాటి నుండి తయారు చేసినవాటినుండి ఏఐ-ఉత్పత్తి చేసిన పనిని గుర్తించడం, నెట్‌లో నిండి ఉన్న పనికిరాని సమాచారాన్ని నిలిపివేయడం ఈనాటి సవాలుగా ఉంది. తప్పుడు సమాచారం ఆధారంగా అపరిపక్వ వ్యాఖ్యలు కూడా నిపుణుల అభిప్రాయంగా చెలామణి అయ్యే వాట్సాప్ ఫార్వార్డ్‌ల దాడి నుండి సున్నితమైన మనస్సులను ఎలా రక్షించగలం? ఈ దృష్టాంతంలో, విద్యా స్వేచ్ఛకు ఇంటర్నెట్ మరో ప్రమాదాన్ని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
దీనికి తోడు, ఈ రోజుల్లో నేడు చాలా క్యాంపస్‌లు నిరంతర నిఘా కోసం సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన కోటలుగా మారిపోయాయి; బయోమెట్రిక్ హాజరు ఒక సాధారణ నియమంగా ఉంది. క్యాంపస్‌లలో హింస పెరుగుతోంది; అలాగే మాదక ద్రవ్యాల దుర్వినియోగం కూడా పెరుగుతోంది. పోలీసులు అన్ని చోట్లా విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడుతున్నారు. అధ్యాపకులు కూడా వారి నిఘాలోనే ఉన్నారు. ప్రభుత్వ నిరంకుశ చర్యలకు లేదా మితవాద సమూహాలు, వారి ఆదర్శప్రాయ వ్యక్తుల చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రాసే లేఖ పిటిషన్లపై సంతకం చేయడం వల్ల ‘గీత దాటినందుకు’ గాను అధ్యాపకులకు షో కాజ్ నోటీసులు జారీ అవుతున్నాయి.
VIII
నిగూఢ పాలకవర్గం – విద్యా స్వేచ్ఛ
సిలబస్‌లో ఏమి ఉండాలి? ఏ పఠన సామగ్రిని ఉపయోగించవచ్చు అనే దానిపైన నియంత్రణను అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, సంస్థాగత స్వయంప్రతిపత్తి లోపం అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. ఇది పాఠశాలలు, కాలేజీలు రెండింటికీ సంబంధించిన విషయం.
ఆర్‌ఎస్‌ఎస్‌కు విద్యా భారతి అనే విద్యా విభాగం ఉంది. ఇది భారతదేశం అంతటా 12,754 అధికారిక, 12,654 అనధికారిక పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో 77 లక్షల (7.7 మిలియన్) విద్యార్థులు, సుమారు 1.5 లక్షల ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో ఎక్కువ భాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ), వివిధ రాష్ట్ర బోర్డులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఒఎస్)లకు అనుబంధంగా ఉన్నాయి.
విద్యా భారతి పుస్తకాలను హిందీతో పాటు బెంగాలీ, తమిళం, ఒడియా సహా మరో 12 ప్రాంతీయ భాషలలో ప్రచురించారు. ప్రభుత్వ-ఆమోదిత పాఠ్యప్రణాళికకు అదనంగా బోధన జరుగుతోంది.
న్యూస్‌లాండ్రీ అనే ఆన్‌లైన్ మీడియా సంస్థ ఒక పరిశోధనాత్మక నివేదికలో, 4వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన సాంస్కృతిక జ్ఞానం పాఠ్యపుస్తకం ‘బోధమాల 4’ లోని 5వ పేజీలో కనిపించిన ఈ క్రింది ప్రశ్నను, సమాధానాన్ని గుర్తించింది:
ప్రశ్న: “మన ప్రస్తుత సరిహద్దులలో ఉన్న, ఒకప్పుడు మన దేశంలో భాగమైన దేశాలు ఏవి?”
జవాబు: “తూర్పున బ్రహ్మదేశ్ (మయన్మార్), బంగ్లాదేశ్, పశ్చిమాన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన టిబెట్, నేపాల్, భూటాన్, దక్షిణాన శ్రీలంక.”
అదే సిరీస్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుల మార్గదర్శిని ఈ వింతైన వాదనను చేస్తుందని పేర్కొన్నారు: “పూర్వం, జంబుద్వీపం అంతటా హిందూ సంస్కృతి ప్రబలి ఉండేది… మనం ఈ రోజు ఆసియా అని పిలిచే ప్రాంతమే ప్రాచీన జంబుద్వీపం. ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కజకిస్తాన్, ఇజ్రాయెల్, రష్యా, మంగోలియా, చైనా, మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, జావా, సుమత్రా, భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఈ జంబుద్వీపంలో భాగమే.”
ఈ వాదనలు భారతీయ జ్ఞాన వ్యవస్థలు (ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్) అని పిలవబడే వాటిని పునరుద్ధరించడానికి జరుగుతున్న సాధారణ ప్రయత్నంలో భాగం కాకపోతే, ఆందోళన కలిగించకపోవచ్చు. ఈ ఆలోచనలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఒఎస్) వంటి లాంఛనప్రాయ సంస్థల పాఠ్యప్రణాళికలోకి కూడా చొచ్చుకుపోయాయి. ఎన్‌ఐఒఎస్ ఇప్పటికే తన పఠనాలలో కణాదుని అణు సిద్ధాంతం, సుశ్రుతుని ప్లాస్టిక్ సర్జరీ, వేద గణితం వంటి వాదనలను చేర్చింది.
వైమానిక శాస్త్రం అనే పుస్తకాన్ని, మన నాగరికతకు విమానాల (ఎగిరే వాహనాలు) గురించిన జ్ఞానం ఉందని చెప్పడానికి, చంద్రయాన్ మిషన్పైన ఎన్‌సిఇఆర్‌టి కొత్త మాడ్యూల్‌లో ఉదహరించారు. 2023లో ఇస్రో చీఫ్ సోమనాథ్ చేసిన వాదనను కూడా ఇది వివరిస్తుంది: లోహశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఖగోళశాస్త్రం, ఏరోనాటికల్ సైన్సెస్, ఫిజిక్స్ వంటి శాఖలలో ప్రధాన శాస్త్రీయ అభివృద్ధి ప్రాచీన భారతదేశంలో జరిగిందని, తరువాత అరబ్బుల ద్వారా యూరప్‌కు వెళ్ళిందని ఆయన పేర్కొన్నారు. చరిత్ర పాఠ్యపుస్తకాలు, అలాగే 11, 12 తరగతుల రాజకీయశాస్త్ర పాఠ్యపుస్తకాలు, తిరిగి చెప్పటానికి, తిరిగి రాయటానికి ప్రత్యేక లక్ష్యాలుగా మారాయి.
గత నెలలో పత్రికలలో వచ్చిన నివేదికల ప్రకారం, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు త్వరలో “రాష్ట్రీయ నీతి” అనే కొత్త విద్యా కార్యక్రమం కింద స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ గురించి కూడా చదువుకుంటారు. మరో వార్తా కథనం ప్రకారం, సాయుధ దళాల కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఆర్‌ఎస్‌ఎస్ సైనిక్ పాఠశాలలను తెరవబోతోంది.
హిందూ మితవాద సమూహాలను చాలా కాలంగా గమనిస్తున్న నీలాంజన్ ముఖోపాధ్యాయ చెప్పిన దాని ప్రకారం, దేశవ్యాప్తంగా ఇంత పెద్ద పాఠశాలల నెట్‌వర్క్‌ను ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించడం వెనుక ఉన్న ఆలోచన -“చిన్న వయస్సులోనే హిందువుల మనస్సులను ఆకర్షించి, ప్రాచీన హిందూ అజేయత శక్తి భావనను వారిలో నింపడం; గతంలో హిందూ భారతదేశం ప్రపంచం నలుమూలలా ఆధిపత్య జాతిగా ఉండేదని, కానీ వేల సంవత్సరాల బానిసత్వం వల్ల (మొదట ముస్లింల చేతుల్లో, ఆ తర్వాత [క్రైస్తవ] వలస శక్తుల చేతుల్లో) భారతీయ నాగరికత ‘బంగారు పక్షి’ నాశనమైందనే భావనను కలిగించడం.
ఆ తర్వాత యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) నుండి విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు అనేక ఆదేశాలు జారీ అవుతున్నాయి. శ్రీ శ్రీ రవిశంకర్ సంస్థ, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అభివృద్ధి చేసిన ధ్యాన శిబిరాలను నిర్వహించడం మొదలుకొని, క్యాంపస్‌లలో ఉత్సవాలను, పండుగలను జరుపుకోవడం వరకు ఇవి ఉంటాయి. మితవాద సమూహాలకు ఆమోదం కాని సిలబస్‌లు, పఠన జాబితాలలో మార్పులు లేదా మొత్తంగా తొలగించడం కూడా జరుగుతోంది. ఉదాహరణకు, ఢిల్లీ యూనివర్శిటీలోని బిఎ ఆనర్స్ కోర్సు పఠన సామగ్రి జాబితా నుండి, ప్రముఖ రచయిత ఎ.కె. రామానుజన్ రాసిన ‘త్రీ హండ్రెడ్ రామాయణాస్: ఫైవ్ ఎగ్జాంపుల్స్ అండ్ త్రీ థాట్స్ ఆన్ ట్రాన్స్‌లేషన్’ (మూడు వందల రామాయణాలు: అనువాదాల గురించి అయిదు ఉదాహరణలు-మూడు ఆలోచనలు) అనే వ్యాసాన్ని బలవంతంగా తొలగించడం జరిగింది.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ అధిపతి, వివిధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ల నియామకాలు, అలాగే నలంద, విశ్వభారతితో సహా వివిధ చట్టబద్ధమైన ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్స్‌లర్‌ల, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అధిపతుల నియామకాలపైన భారత ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంది. ఇందుకు బహుశా మితవాద సంస్థల నుండి ఉపయోగకరమైన అనధికారిక సూచనలు కూడా అందుతున్నాయి.
గత దశాబ్దంలో విద్యా రంగంలో వచ్చిన మార్పులను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, కేవలం ప్రజలు మాత్రమే కాకుండా, సున్నితమైన యువ మనస్సుల సామన్య ఊహలను ఆకర్షించడానికి జరుగుతున్న ప్రయత్నం ఎంత పట్టుదలగా, లోతుగా, విస్తృతంగా ఉందో స్పష్టమవుతుంది. పాలక వ్యవస్థ విధానాలను, చర్యలను ప్రశ్నించే విధంగా కనిపించే దేనినైనా తొలగించడానికి ఒక సునిశిత ప్రయత్నం జరుగుతోంది.
విజ్ఞాన శాస్త్రాన్ని తక్కువ చేసి, గత జ్ఞానాన్ని గొప్పగా చూపడంలో ఒక రకమైన స్వయంతృప్తి కనిపిస్తోంది. మీరు ‘ఉదారవాద’అనే పదానికి ముందు ‘వామపక్ష’ (లెఫ్ట్) చేర్చి, ‘సెక్యులర్’ (లౌకిక)అనే పదాన్ని ‘సిక్కులర్’ (వ్యాధిగ్రస్థ) అని తప్పుగా పలికితే, మేధోపరమైన చర్చను అవహేళన చేయడం సాపేక్షికంగా సులభమవుతుంది. ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎవరు బోధించవచ్చు, ఎవరు నేర్చుకోవచ్చు, దేని గురించి వ్రాయవచ్చు లేదా వ్యాఖ్యానించవచ్చు అనే నిర్ణయాలను ఇకపై విద్యా సంస్థలు తీసుకోవడం లేదు. చట్టాతీత యంత్రాంగాలు, సంస్థల ద్వారా ముందస్తు అనుమతి పొందాలి, పరిశీలించాలి.
మీరు కలలు కనవచ్చు, ఊహించుకోవచ్చు, కానీ వాటిని నిజం చేసుకోవాలంటే మీకు అనుమతి కావాలి. భిన్నాభిప్రాయాన్ని ప్రోత్సహించడానికి వీలు లేదు, సహించకూడదు. 2025 నాటి భారతదేశంలో, ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘బోల్’ కవితను చదవచ్చు, కానీ నియమ నిబంధనలు వర్తిస్తాయి:
మాట్లాడండి, మీ పెదవులు ఇంకా స్వతంత్రంగా ఉన్నాయి
మాట్లాడండి, ఈ నాలుక ఇప్పటికీ మీదే
మీ నాజూకైన శరీరం మీ స్వంతం
మాట్లాడండి, ఈ జీవితం/ఆత్మ ఇప్పటికీ మీదే
ఒక విద్యా సంస్థ క్యాంపస్‌లో “హమ్ దేఖేంగే” అని కవిత చదవడం లేదా “ఆజాది” అని అరవడం వలన అర్బన్ నక్సల్ , తుక్డే తుక్డే గ్యాంగ్ (దేశాన్ని ముక్కలు చేయాలని’ ప్రయత్నిస్తున్నారని విమర్శించే గుంపు), ఖాన్ మార్కెట్ టైప్ (ఢిల్లీలోని ఉన్నత వర్గాల మేధావులు లేదా సంపన్న శక్తులను సూచించడానికి వాడే పదం) లేదా జేఎన్‌యూ టైప్ (ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు లేదా మేధావులను విమర్శనాత్మకంగా సూచించడానికి వాడే పదం) వంటి ముద్ర వేయించుకోవాల్సి రావచ్చు.
IX
మన ముందున్న సవాళ్లు: రాబోయే రోజు కోసం మనం ఎలా సిద్ధం కావాలి?
భారతదేశ సందర్భంలో విద్యా స్వేచ్ఛ అనేది అనేక పోటీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండవలసిన సవాళ్లను విసురుతోంది. దీనికి తోడు, కులం, వర్గం, మతపరమైన పక్షపాతాల వల్ల మరింత పెరిగిన సామాజిక అసమానతలు కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో క్రైస్తవులకు పరిమిత కోటాను అంగీకరించే సందర్భంలో సుప్రీంకోర్టు ఇలా గుర్తు చేసింది: “ప్రతి విద్యా సంస్థ, అది ఏ సమాజానికి చెందినదైనా, మన జాతీయ జీవితంలో ఒక ‘కలగలిసే పాత్ర’ వంటిది. విద్యార్థులు, ఉపాధ్యాయులు దీనికి కీలకమైన అంశాలు. అక్కడనే వారు ఇతరుల సంస్కృతులు, విశ్వాసాల పట్ల గౌరవాన్ని, సహనాన్ని పెంపొందించుకుంటారు. అందువల్ల, అన్ని విద్యా సంస్థలలో వివిధ వర్గాల విద్యార్థుల సరైన సమ్మేళనం ఉండటం అవసరం.”
అయితే, ఆశ ఉందా? ఇక్కడ మనలో చాలా మంది తెలుసుకోవాలనుకునేది ఇదే. చరిత్ర మనకు చెబుతున్న విషయం ఏమిటంటే, ఈ కాలాలు కూడా గడిచిపోతాయి. దేశంలోని ఏదో ఒక మూలలో చాలా మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక అణచివేత పాలన ఒత్తిళ్లకు, ఆకర్షణలకు లొంగిపోకుండా లేదా దాని స్వాధీనంలోకి వెళ్ళకుండా ప్రతిఘటిస్తున్నారు. వారు కష్టాలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడే మానవ స్ఫూర్తిని, తట్టుకోగల సామర్థ్యాన్ని సూచిస్తున్నారు. మనది బహుళత్వ సమాజం; దీనికి కలిసికట్టుగా ఉండటం, పంచుకోవడం, కరుణల చరిత్ర ఉంది. మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ ఆకాంక్షను చల్లారనివ్వకుండా చూసుకుంటే, తప్పకుండా ఆశ ఉంటుంది.
అన్నింటికంటే ముఖ్యంగా, మనం ఏ రాజ్యాంగ విలువలతో జీవించాలని కోరుకుంటున్నామో, ఆ స్ఫూర్తిని, విలువలను మనం పోషించడం చాలా అవసరం. అప్పుడే భవిష్యత్ తరాలు మన అనుభవం నుండి నేర్చుకుని, దేనికి విలువ ఇవ్వాలో, దేనిని పరిరక్షించాలో తెలుసుకుంటాయి.
గత దశాబ్దంలో మనం చూసిన మార్పులు, మనం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం నిలిచే స్వభావం కలిగి ఉండవచ్చు. ఇది సమ్మిళితత్వం, బహుళత్వాలు అనే మన రాజ్యాంగ విలువల్లోని విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టే పనిని మరింత సవాలుగా మారుస్తుంది.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలలో విద్యా స్వేచ్ఛ కోసం లౌకిక స్థలాలను మనం ఎలా తిరిగి పొందగలం? ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తమ సంస్థాగత స్వయంప్రతిపత్తిని తిరిగి పొందడాన్ని ఎలా సులభతరం చేయాలి? యువ మనస్సుల్లో ‘శాస్త్రీయ దృక్పథాన్ని’ అన్వేషణా స్ఫూర్తిని ఎలా పెంపొందించాలి? బాల్యం నుండి వయోజనత్వం వరకు విద్యా స్వేచ్ఛకు ఆశ కల్పించడానికి మన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను మనం ఎలా మెరుగుపరచగలం? ఇంటర్నెట్‌లో మనకు ఉన్న అవకాశాలను మనం పూర్తి సామర్థ్యంతో ఎలా ఉపయోగించుకోవాలి? మన విలువలు, ఆందోళనలను పంచుకునే, ప్రభావితం చేసే వ్యక్తుల స్వరాలను ఎలా బలోపేతం చేయాలి?
ఈ ప్రత్యామ్నాయ స్థలాన్ని, ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని అందించిన అనేక నమూనాలు మనకు గతంలో ఉండేవి. గురుదేవ్ ఠాగూర్ రూపొందించిన శాంతినికేతన్ నమూనాను లేదా కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పాఠశాల నమూనాను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇటువంటివి మరెన్నో ఉండవచ్చు. నేటి అవసరాల కోసం మనం వాటిని నకలు చేయగలమా లేదా అనుగుణంగా మార్చుకోగలమా? ఈ ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానాలే రాబోయే తరాలకు విద్యా స్వేచ్ఛ గమనాన్ని నిర్ణయిస్తాయి.
ఉపసంహారం :
ఈ రోజు చర్చను ముగిస్తూ, నేను 1986 ఆగస్టు 11న భారత సుప్రీంకోర్టు (చిన్నప్ప రెడ్డి మరియు ఎం.ఎం. దత్ జె.జె.) బిజోయ్ ఎమ్మాన్యుయేల్ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో ఇచ్చిన ఒక అద్భుతమైన తీర్పును జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను.
ఆ కేసులో కోర్టు ముందు అప్పీల్ చేసిన వారు ముగ్గురు పిల్లలు – బిజోయ్, బినో మోల్, బిందు ఎమ్మాన్యుయెల్. వీరు క్రైస్తవ మత శాఖకు చెందిన జెహోవా సాక్షులు సమూహానికి చెందినవారు. ప్రతిరోజూ ఉదయం అసెంబ్లీ సమయంలో, జాతీయ గీతం ఆలపించినప్పుడు, ఆ ముగ్గురు పిల్లలు గౌరవంగా నిలబడేవారు కానీ పాడేవారు కాదు. ఎందుకంటే, వారి ప్రకారం, అది వారి మత విశ్వాసాలకు విరుద్ధం – జాతీయ గీతం పదాలు లేదా ఆలోచనలు కాదు, దానిని పాడటం మాత్రమే.
దీంతో వారిని పాఠశాల నుండి బహిష్కరించారు . ఈ చర్యను వారు కేరళ హైకోర్టులో సవాలు చేస్తే, విజయం దక్కలేదు. అయితే, సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని తారుమారు చేసింది; ఆ ముగ్గురు పిల్లలను పాఠశాల నుండి బహిష్కరించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (1) ప్రకారం వారి మనస్సాక్షి స్వేచ్ఛకు మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే, ఆచరించే, ప్రచారం చేసుకునే వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అని తీర్పు చెప్పింది.
కోర్టు ఈ తీర్పును ఒక అద్భుతమైన వాక్యంతో ముగించింది; మనకు ఇలా గుర్తుచేసింది: “మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తుంది; మన తత్వశాస్త్రం సహనాన్ని బోధిస్తుంది; మన రాజ్యాంగం సహనాన్ని ఆచరిస్తుంది.” “దానిని పలచనచేయవద్దని” అని అఇది మనల్ని కోరింది. ఆ పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని ఆదేశించింది.
ధన్యవాదాలు
తెలుగు: పద్మ కొండిపర్తి