నాలాగే ఇంకొకడు

1.

కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేం కదా
మొదట నేనూ నమ్మలేదు
నాలాగే ఇంకొకడు ఉన్నాడంటే

చేతిలో పొడవాటి కర్రతో
తీగమీద పట్టు తప్పిపోకుండా నడుస్తూ
తన ప్రావీణ్యాన్ని తలుచుకుని పొంగిపోతూ
ఒకడు కనబడే వరకూ

కింద జనం
గేలి చేయడానికి గోల చేయడానికి
ఒకే జత చేతులు
నాలాంటి ఇంకొకడు తీగ దిగి దగ్గరకెళ్ళే లోపు
వాడెవడో చిల్లర ఏరుకుని తుర్రుమన్నాడు
నేనెన్ని సార్లిలా ఓడిపోయానో
నాలాగే ఇప్పుడు ఇంకొకడు
నేనిప్పుడు ఒంటరి కాదన్న మాట

2.

గదిలో
తెల్లబట్టలేసుకుని బ్యాలెట్ పెట్టె కూర్చుంది
లోపలికి ఎలా వెళ్ళడం?
క్యూ లైను నిండిపోయింది
తొక్కిసలాట
ఎలా? ఎలా ?
సైడ్ … సైడ్.. నాలాగా ఉండే వాడు అరుస్తున్నాడు
కానీ వీడు మరొకడు
ఒక కండువా వచ్చి వెళ్ళింది
ఐదేళ్లకు ఈ చేలన్నీ కౌలుకిచ్చేసాం వెళ్ళండి వెళ్ళండి
నాలాంటివాడే మరొకడు టీవీలో స్వీట్లు పంచుతున్నాడు

3.

సోషల్ మీడియాలో చర్చ
మనిషికో ప్రొఫైల్ పిక్ ఎందుకు
దేశం ఒకటే కదా?
మార్చండి మార్చండి ముఖాలు మార్చండి
క్షణాల్లో అందరూ
జెండా బొమ్మలుగా మారిపోయారు
నాలాంటి వాడు ఇంకొకడు
ఆ ఇంకొకడు లాంటి మరొకడు
ఎవరెవరో తెలీడం లేదు

వరద ముంచెత్తింది
పొలమేదో గట్టేదో ఎవరు తెల్చేది?

4.

బజారులో ఆత్మహత్య చేసుకున్నది నువ్వేనా
ఎవరో నన్ను కేకేసి అడుగుతున్నారు
లేదు లేదు నేను బతికేవున్నాను
పిచ్చోడా! బతికే ఉన్నావా…
గుంపులు గుంపులుగా జనం నవ్వుతున్నారు
ఏ ఒక్కరిలోనూ పశ్చాత్తాపం లేదు
నాలాగే ఉండే వాడా లేక నాలాగే ఉండే ఇంకొకడా
ఎవరు ఉరేసుకున్నది?

5.

బహుశా అది నేనే కావచ్చు

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply