దేశంలో నిరంకుశత్వానికి బాటలు – ప్రజాస్వామ్యానికి ప్రమాదం

దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేసి నిరంకుశత్వాన్ని సాగించడంలో మోడీ ప్రభుత్వానిది అందెవేసిన చేయ్యి అని ఇంటా బయటా ప్రభుత్వాల నేతల నుండి, మేధావుల నుండి, మీడియా నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నా తన వైఖరిని మరింత పటిష్టపర్చుకునే దిశగా అడుగులు మరింత వేగంగా వెళ్తున్నాడు. ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం యొక్క స్ఫూర్తి. కానీ మన రాజ్యాంగం పీఠికలో నిర్దేశించిన భావనకు రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హామీలకు భిన్నంగా పాలన జరుగుతుంది. అంటే, రాజ్యాంగ హామీలకు, పాలకుల ఆచరణకు పొంతన లేదని తెలుస్తోంది. రాజ్యాంగం పట్ల నిరక్షరాస్యులైన ప్రజలకు అవగాహన లేక పోవచ్చు కానీ అవగాహన ఉన్న బుద్ధి జీవులు పట్టించుకోకపోవడం వల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతోంది.

ప్రభుత్వంలో పనిచేసే అధికారులు రాజ్యాంగ స్ఫూర్తితో పాలనను అందించకపోవడంతో ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతోంది. ఈ విషయం ప్రభుత్వంలో ఉన్న నేతలకు ప్రభుత్వ అధికారులకు తెలియదు అనుకోవడం పొరపాటే అవుతుంది. ఈ పరిణామాల వల్లనే ఏడున్నర దశాబ్దాలు కావస్తున్నా ఇంకా ప్రజాస్వామ్యం ముసుగులో ధనస్వామ్యం, ఫ్యూడల్ భావజాలం, వారసత్వ పాలన కొనసాగడం, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చరిల్లడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఏ సమాజంలోనైనా ప్రజలకు మంచి జరగాలంటే, ప్రభుత్వ విధానాలను విశాల ప్రజాహితమనే గీటురాయి మీద పెట్టి చూడడం, పాలకుల వివక్షతను నిర్లిప్తతను నిలదీయడం పౌర సమాజం విధిగా చేపట్టాలి. ఆ పని చేసే వారు మాత్రమే సమాజ క్షేమాన్ని కోరేవారు అవుతారు. దానికి అడ్డుతగిలే వారు ప్రజా ద్రోహులు అవుతారు. ప్రజాహితం, సమాజ సమిష్టి ప్రయోజనం కోరే వారి మీద అక్రమ కేసులు పెట్టడం అంటే ప్రజల గొంతులను నొక్కేసి నిరంకుశ ఫాసిస్ట్ పాలనకు ఎదురు లేకుండా నిర్విఘ్నంగా పాలన సాగించడం నియంతృత్వ పాలనకు పరాకాష్ట అవుతుంది తప్ప ప్రజాస్వామ్య పాలన అనిపించుకోదు.

మన పాలన వ్యవస్థలో అధికార పార్టీ నాయకుల మాటే చెల్లుతుంది. అధికారులు కూడా వాళ్లు చెప్పిందే వింటారు. ప్రజల నిర్ణయాలకు విలువ లేదు. వారి అవసరాలను గుర్తించి తీర్చే వారే లేరు. ఎక్కడ చూసినా అధికారుల ఇష్టారాజ్యమే సాగినప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఏమిటి? ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీరనప్పుడు ప్రజాస్వామ్య పాలన ఎక్కడ పోతున్నట్లు? తండ్రి తర్వాత కొడుకు లేదా బిడ్డ లేదా కోడలు లేదా అల్లుడు ఇలా ఒకరి తర్వాత ఒకరుగా ఆధిపత్య సంపన్న కులాల పాలకులు వారి వారసులు అధికారం చేజిక్కించుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కార్మికులు మహిళలు అధికారం ఎలా చలాయిస్తారు? అన్యాయం, వివక్ష, అణచివేత, పీడన నివారించడం ఎలా కుదురుతుంది. ఇప్పటికీ అత్యధికులు అధికారం లేక అవకాశం రాక అణిచివేతకు గురవడం, అరకొర వసతులతో అష్టకష్టాలు పడుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. దేశంలో పెరుగుతున్న సంపదను పిడికెడు మంది కొల్లగొడుతుంటే, శ్రమతో సంపదను సృష్టిస్తున్న వాళ్లేమో దారిద్య్రం అనుభవిస్తున్నారు. అత్యధికులకు నేటికి తాగునీరు, ఇల్లు, బట్ట, విద్య, వైద్యం అందడం లేదు.

మనదేశంలో ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ముప్పులను పౌర సమాజం గ్రహించలేకపోతే మనమంతా ఒక జాతిగా మనుగడ సాగించడం అసాధ్యమవుతుంది. అధికార బదిలీ జరిగి ఏడున్నర దశాబ్దాలు గడిచినా ఎన్నికలను ప్రజాస్వామీకరించే చర్చ ఏనాడు మన పార్లమెంట్ లో జరగలేదు. ఇక వ్యవస్థను ఎన్నడు ప్రజాస్వామికరిస్తారో సమాధానం దొరకని ప్రశ్న. ఎన్నికల కమిషన్ అధికారాలు చాలా పరిమితమైనందున, ఎన్నికల వైఫల్యాలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దేశంలో ఐదేళ్లకొకసారి జరిగే ఎన్నికల్లో ఎన్నికల సర్కస్ గురించి పరిశీలిద్దాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎన్నికల్లో పాల్గొనేది 60 శాతం జనాభే. అందులో ఓటు హక్కు వినియోగించుకునేది 50 కోట్ల ప్రజలే. ఇక గెలిచే పార్టీకి పడే ఓట్లు 20 నుండి 25 కోట్లే. అంటే మన దేశంలో 30 శాతం ప్రజాభిప్రాయానికి 70 శాతం ప్రజలు తలొంచాల్సిన పరిస్థితిని ప్రజాస్వామ్యం అని అనగలమా? బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్య భావనతో కూడా మన దేశ పాలన సాగడం లేదన్నది అక్షర సత్యం. చట్టసభల్లో శ్రామికులకు, మహిళలకు తగిన దామాషాలో చట్ట సభల్లో అవకాశం లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపూర్ణత సాధించ లేదు.

దేశంలో పాలన, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల కంటే ఎక్కువగా పోలీసు యంత్రాంగమే సాగిస్తుందన్నది యదార్థం. అధికారంలో ఉన్న పార్టీ కనుసన్నల్లో వారి ప్రాపకం కోసం ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక మేధావులను అణచి ఉంచడమే ప్రస్తుత పాలనా విధానంగా కొనసాగుతోంది. ప్రజాభిప్రాయాన్ని ప్రజా అవసరాలను పట్టించుకునే దిక్కే లేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించడం మాని అది నాయకుని ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అవినీతి శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ వంటివి గత ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్న తీరు పలు సంఘటనల ద్వారా రుజువైంది. యు కె కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇ ఐ యూ) పరిశోధనలో ప్రపంచంలోని 167 దేశాల ప్రజాస్వామ్య స్థితిని రూపొందించింది. ఎన్నికల నిర్వహణ, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వ పాలన పారదర్శకత, రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి వంటి 15 విభాగాల కింద 60 ప్రమాణాలను లెక్క కట్టడం జరిగింది. ఇ ఐ యూ పరిశోధించిన 167 దేశాల్లో 23 దేశాల్లో పరిపూర్ణ ప్రజాస్వామ్యమున్నట్లు, 52 దేశాల్లో లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లు, 35 దేశాల్లో సంకర ప్రజాస్వామ్యం ఉన్నట్లు, 57 దేశాల్లో నిరంకుశ పాలన ఉన్నట్లు తెలిపింది. భారతదేశం 2019లో 51 వ స్థానంలో ఉండగా 2020లో 53వ స్థానానికి పడిపోయింది. మన దేశం లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం జాబితాలో ఉంది.

మోడీ పాలనలో పౌర హక్కుల హననం:

పౌర హక్కులనగానే ఏ కొద్ది మందికో పరిమితమైన వ్యవహారంగా చూడడం మన పౌర సమాజానికి పరిపాటయింది. దీనినే పాలక వర్గాలు అవకాశంగా తీసుకొని హక్కుల ఉద్యమకారులను అణిచి వేస్తోంది. నిజానికి పౌర హక్కులనేవీ దేశంలోని ప్రజలందరికీ సంబంధించినవి. రాజ్యాంగం హామీ ఇచ్చినవి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి ఆక్సిజన్, అహారం ఎంత సహజమో మనిషి మనిషిగా బతకడానికి హక్కులు కూడా అంతే సహజం. అందుకే ప్రతి దేశం పరిమితులతోనైనా పౌర హక్కులను, మానవ హక్కులను గుర్తిస్తుంది. రాజ్యాంగంలో పొందుపరుస్తుంది. చట్టాలను చేస్తుంది. అరకొరగానైనా అమలు చేయడం రాజ్యం నైతిక బాధ్యత. రాజ్యం ఫాసిస్ట్ గా మారినప్పుడు అవి తమ ప్రయోజనాలకు విరుద్ధమని భావిస్తే వాటిని తుంగలోకి తొక్కేస్తుంది. ఇప్పుడు భారత్ లో మోడీ పాలనలో జరుగుతున్నది అదే. హక్కుల పరిరక్షణే ప్రజాస్వామ్య మనుగడకు కీలకం. అందువల్ల దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే పౌర హక్కులు రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఉద్యమాలకు హక్కుల ఉద్యమం తల్లి లాంటిది.

మోడీ పాలనలోని అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మతోన్మాదం, మూఢనమ్మకాలు, వివక్ష, మహిళలపై అత్యాచారాలు, మైనారిటీలపై గోరక్షక దళాల దాడులు, హేతువాదులు, మేధావులు, హక్కుల సంఘాల నాయకులను( దబోల్కర్, పన్సారే, గౌరీ లంకేశ్) హత్య చేయడం వంటి అంశాలపై అక్షర శరసంధానం చేసే పాత్రికేయులపై బిజెపి నాయకులు, పరివార శక్తులు దాడులు చేస్తున్నారు. నిజానికి బ్రిటీష్ వలస ప్రభుత్వ వ్యతిరేక స్వతంత్ర ఉద్యమంలో పత్రికలది, పాత్రికేయులది కీలక పాత్ర. ప్రజాస్వామ్య మనుగడకు పత్రిక స్వేచ్ఛ కూడా ముఖ్యమే. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి “రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్” నివేదిక మరింత స్పష్టం చేసింది. 180 దేశాల వివరాలను పరిశీలించి రూపొందించిన నివేదికలో మన దేశానికి 142 వ స్థానం దక్కడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిజాలను ప్రజల ముందు ఉంచే పాత్రికేయులపై దేశద్రోహులన్న ముద్రవేయడం, వారిని వెంటాడి వేధించడం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులను బనాయించడం, అరెస్టులు చేయడం,గోడి మీడియా లో వారిపై అసత్య ప్రచారం చేయడం, వీటన్నిటికీ లొంగకపోతే భౌతికంగా నిర్మూలించడం మోడీ పాలనలో నిత్యం జరుగుతున్న తంతు.

బ్రిటిష్ వలస కాలంనాటి సిపిసి 124 ఎ చట్టప్రకారం ప్రభుత్వంపై నిరసన తెలపడం, అప్రియత్వాన్ని కలిగించే మాట గాని, రాత గాని, ప్రదర్శన గాని చేస్తే జీవితకాలం జైలు లో పెట్టవచ్చు లేదా జరిమానా వేయవచ్చు అని చెబుతోంది. ఇదే రాజ ద్రోహాన్ని నిర్వహించే అత్యంత క్రూరమైన సెక్షన్. దీన్ని థామస్ బాబిగ్టన్ మెకాలే రచించారు. ప్రభుత్వంపై విమర్శ లేకపోతే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? 1871 నుంచి ఈ సెక్షన్ మన దేశంలో అమలవుతోంది. దేశంలో రాచరిక వ్యవస్థ లేదు కనుక రాజద్రోహం మోడీ పాలనలో దేశద్రోహం గా మారింది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిన పాలకులకు ఈ సెక్షన్ అవసరం బాగా పెరిగింది. రాజులు లేనప్పుడు రాజ ద్రోహం ఏమిటి? పాలకుల మీద విమర్శలు చేయవద్దు అంటే మరి ఎన్నికలు ఎందుకు? అటువంటి వారికి ప్రజలు ఎందుకు అధికారం కట్టబెట్టాలి? గెలిచినవారు ప్రజల జీవితాలను మెరుగు పరిచే చట్టాలు చేయనప్పుడు, సమాజంలో నెలకొన్న వివక్ష, అంతరాలను నిర్మూలించినప్పుడు, అస్సలు ప్రజల దైనందిక సమస్యలను తీర్చనప్పుడు వారు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు? అన్నది ఆలోచించాల్సిన సందర్భం ఇది.

భారత రాజ్యాంగం ప్రజలను వాక్ స్వాతంత్రం, భావప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కును కలిగించింది. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పాలకులు హక్కులను కాలరాస్తే రాజ్యాంగాన్ని ఎవరు కాపాడాలి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే అంగం బాధ్యతాయుతంగా ప్రభావవంతంగా పని చేస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రసార సాధనాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ప్రజల నుండి విమర్శలను మోడీ ప్రభుత్వం నిలువరించాలనుకుంటుంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రచనలు చేసిన, ప్రసంగాలు చేసిన, దేశద్రోహం 124 ఎ సెక్షన్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఆక్ట్(ఫెమా) వంటి తీవ్రమైన చట్టాలను అక్రమంగా బనాయిస్తోంది. కక్షపూరితంగా వేధింపులకు పాల్పడి భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తుంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పౌరుల ప్రాథమిక హక్కు, విమర్శించే హక్కు ప్రజాస్వామ్యానికి జీవం. విచక్షణ రహితంగా వివేక శూన్యతతో అక్రమంగా కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధం.

మోడీ ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలు:

నరేంద్ర మోడీ పాలనలో ప్రభుత్వాన్ని పొగడడమే దేశభక్తి. తెగిడితే జైలుకే. మోడీ వ్యాక్సిన్ మైత్రిని విమర్శిస్తూ పోస్టర్లో వేసినందుకు ఢిల్లీ పోలీసులు 25 మందిపై కేసు పెట్టారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తునప్పటికీ ముందుచూపు లేకుండా వ్యక్తిగత ప్రతిష్ట కోసం 85 దేశాలకు ఏడు కోట్ల డోసులు బహుమతిగా పంపారు. ఇక్కడివారికి వ్యాక్సిన్ అందక నానా తంటాలు పడుతున్న దీన స్థితిని పోస్టర్లలో వ్యక్తీకరించడం నేరమయింది. ఢిల్లీ రైతు ఉద్యమానికి ట్విట్టర్ లో సంఘీభావం ప్రకటించిన ఇరవై ఒక్క ఏళ్ల దిశా రవి అనే పర్యావరణ కార్యకర్తపై కేసు పెట్టారు. ఆన్లైన్ మీడియా పోర్టల్ “న్యూస్ క్లిక్” సంపాదకులు, యజమాని ప్రబీర్ పురకాయస్థ, గీత హరిహరన్ సంస్థ కార్యాలయం నివాసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈ డి) తో దాడులు చేయించారు. అలాగే రచయితలు, కమెడియన్లు, కార్టూనిస్టులు, సోషల్ క్రియాశీల కార్యకర్తలపై మోడీ సర్కార్ అక్రమ కేసులు పెడుతోంది. అదే సమయంలో ప్రభుత్వ అనుకూల, కార్పొరేట్ అనుకూల విధానాలను ఎత్తి పట్టేవారు ఎంత నీచానికి వొడిగట్టినా వారిని అందలం ఎక్కిస్తుంది. ఉదాహరణకు అవినీతికి పాల్పడిన ఆర్నబ్ గోస్వామి వంటివారి కొమ్ము కాస్తోంది.

కవులు, రచయితలు, హక్కుల సంఘాల నేతలపైనే గాక జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. కేసులు బనాయిస్తున్నారు.
ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో ఆకలితో అల్లాడే వారి గురించి రిపోర్టు చేసినందుకు scroll.in ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియ శర్మ మీద కేసు పెట్టారు. కరోనా విజృంభణ కాలంలో వాస్తవాలు పత్రికల్లో రాస్తున్నందుకుగాను దేశంలో దాదాపు 55 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. కొందరిపై కేసులు కూడా పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్తో పాటు నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు మృణాల్ పాండే, ఇండియా టుడే టీవీ కి చెందిన రాజ్ దీప్ సర్దేశాయ్, క్వామీ ఆవాజ్ పత్రిక సంపాదకుడు జాఫర్ ఆఘా, కారవాన్ పత్రిక కు చెందిన ముగ్గురు పాత్రికేయులపై క్రిమినల్ కుట్రలతో పాటు దేశద్రోహం వరకు తీవ్ర నేరారోపణలు చేయడంతో మన ప్రజాస్వామ్యం ఎంత తీవ్రమైన ప్రమాదంలో ఉందో తెలియజేస్తుంది. ప్రజా ఉద్యమకారుల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, వారిని దీర్ఘకాలం తప్పుడు కేసులతో జైల్లో పెట్టడం, భయభ్రాంతుల్ని చేయడం వంటి అప్రజాస్వామిక నియంతృత్వ చర్యలు ఢిల్లీలో షహీన్ బాగ్ ఉద్యమం మొదలైనప్పటి నుండి ఈ తరహా చర్యలు ఎక్కువ అయ్యాయి. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగులు అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసులు పలువురు మీద కేసులు పెట్టారు. ఈ కేసులో చాలా పోస్టింగులు తీవ్రవాదాన్నో, మతోన్మాదాన్నో, సాయుధ పోరునో, ప్రభుత్వాలను కూల్చే కుట్రనో ప్రేరేపించేవి కావు. మోడీ పాలనలో మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ధోరణి పెరిగాక మెజారిటీ మతస్తుల మనోభావాలకు ఇబ్బంది కలిగిస్తున్నారని లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల భావవ్యక్తీకరణను పాలకులు అణిచి వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో రెండు సంవత్సరాలు ప్రజా సంఘాల నాయకులను వేధించడం పెరిగింది. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం 17 సంఘాలను నిషేధించింది. అందులో రచయితల సంఘం, పౌర హక్కుల సంఘంను చేర్చడంతో ప్రభుత్వ విధానం పరాకాష్టకు చేరి నట్టు ధ్రువ పడుతుంది. భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన 17 మంది సామాజిక మేధావులు, ప్రముఖ రచయితలు, హక్కుల సంఘాల నాయకులు, వీరిని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు కావొస్తున్న కేసు విచారించలేదు. బెయిల్ ఇవ్వలేదు. అసలా కేసే కుట్ర పూరితం అనే ఆధారాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇలా భిన్నాభిప్రాయాలున్న వారిని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అనాలోచిత ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు చేస్తున్నారని, రచనలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఉపా చట్టం కింద వేలాది మంది నిర్బంధాన్ని అన్యాయంగా చవిచూడాల్సి వస్తోంది. అందువల్ల భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించుకోవడం ద్వారానే మోడీ ప్రభుత్వ హిందూత్వ ఫాసిస్టు విధానాలను, చర్యలను ప్రతిఘటించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం.

చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్ట్ అయిన వారికి ఆరు మాసాల వరకు బెయిల్ రాదు. దేశద్రోహం ఆరోపణ చాలా తీవ్రమైనది కాబట్టి ఎఫ్ఐఆర్ ను వెంటనే కొట్టివేయడం సాధ్యం కాదు. అందువల్ల ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపై విద్రోహ ఆరోపణ చేయడంతోపాటు చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (ఊపా) ప్రయోగించడం మోడీ – షాల పాలనలో ప్రధాన అస్త్రం అయింది. దేశద్రోహ ఆరోపణలు గురైన వారిని విచారణకు ముందు దీర్ఘకాలంపాటు కారాగారంలో ఉంచవచ్చు. ఇది విమర్శకుల గొంతు నొక్కడానికి తోడ్పడుతుంది. బీమా కోరేగావ్ (ఎల్గార్ పరిషత్) కేసులో ప్రజా మేధావులను, పేద హక్కుల ఉద్యమకారులను అర్బన్ నక్సల్స్ ముద్రవేసి రెండేళ్లకు పైగా జైలులో బెయిల్ ఇవ్వకుండా ఉంచడం చూస్తూనే ఉన్నాం. ఇక జనవరి 26 నాటి ఎర్రకోట జెండా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితుల విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. రాజ్యాంగాన్ని లెక్కచేయని, పౌర హక్కులను గౌరవించని ధోరణి ఉన్న ప్రభుత్వ పాలనలో మన ప్రజాస్వామ్య భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడనుంది. మోడీ ప్రభుత్వం నీరో చక్రవర్తి వలే వ్యవహరిస్తుంది. హక్కులనేవి సమాజానికి సంబంధించినవి. వాటి మనుగడ కోసం ప్రజలను చైతన్యవంతులను చేయడమే ప్రజాతంత్ర శక్తుల కర్తవ్యం. అలాగే ప్రజాతంత్ర శక్తులు కదలాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply