ఒకప్పుడు
పసిపిల్లల్లా నవ్వే నక్షత్రాలతో
నిర్మలమైన ఆకాశం
ఇప్పుడు
కన్న పిల్లల్ని పోగొట్టుకున్న
కన్నతల్లుల మనసుల్లా దిగులు వర్ణ ఆకాశం
నిరంతరం బాంబులతో కుప్పకూలుతున్న భవనాలు
నింగికి నాలుకలు సాచే భయం కొలిపే ఎర్రెర్రని మంటలు
కారు చీకటి మబ్బుల నల్లనల్లని ఆకాశం
రాత్రి నా పక్కనే పడుకున్న తమ్ముడు
తెల్లారి బ్రతికికుంటాడో లేదో తెలియదు
సైరన్ కూతలు తప్ప
అమ్మ జోల పాటలు
నాన్న ముద్దు మురిపాలు
ఎక్కడ విరిగిన కాళ్లు చేతులతో
అక్కున చేర్చుకునే వారెవరూ లేని అనాథలం
కాలే కడుపుకు రొట్టె ముక్క
దాహార్తికి నీటి చుక్క కరువు
ఎటు చూసినా ఎడారి… ఎడారి
ఎప్పుడు ఏ శత్రు విమానం దాడి చేస్తుందో
ఏ తుపాకీ తూటా పేలుతుందో
క్షణక్షణం భయం భయం
అయ్యా దేశాధిపతులారా…
సామ్రాజ్య విస్తరణ కోసమో
సంగ్రామ విజయం కోసమో
సంపదల సంచయానికో
ఆధిపత్యం కోసమో
మీలో మీరు కొట్టుకు చావండి
మధ్యలో పిల్లల్ని ఎందుకు చంపుతారు ?
ఈ విశాల విశ్వంలో
గుండెల మీద చెయ్యి వేసుకొని
నిశ్చింతగా నిద్రించడానికి
చింతాకంతైనా చోటే లేదా మాకు?