“వివక్షను రూపుమాపి సమాజంలో సామరస్యాన్ని స్థాపించాలి.” – డా. బి. ఆర్. అంబేడ్కర్.
“నిన్నటి వరకు తమ జీవితాలను తాము శాసించకునే హక్కులేని దళితులు ఈ రోజు సమూహ జీవితాన్ని శాసిస్తామని ముందుకొస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. అపూర్వ సందర్భం” అని బాలగోపాల్ తన ‘దళిత’వ్యాస సంపుటిలో అభిప్రాయపడ్డాడు.
మనిషిని మనిషిగా గాక కులదృక్పథంతో చూసే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఏర్పడడంతో భారతీయ సమాజం అంతరాలతో అభ్యంతరాలతో నిండిపోయింది. వైరుధ్యాలతో కులగర్వం పెరిగింది. ఏ రెండు కులాలు ఒకటిగా లేకపోవడం, ఏ కులం ప్రత్యేకత ఆ కులానికి ఉండడం ఒక ముఖ్య కారణమయ్యాయి. ఛాందసవాద ఆచారాలు, కఠిన సంప్రదాయాలు, మూఢత్వంతో నిండిన కట్టుబాట్లు, నియమాలు రూపొందించుకోవడం వలన కులాల మధ్య, మనుషుల మధ్య తారతమ్యాలు సృష్టించబడి అధికమయ్యాయి. కొంచెం తీవ్రత తగ్గినా చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. తత్ఫలితంగా మనుషుల మధ్య స్పష్టమైన విభజన గీయబడింది. ప్రాచీన సాహిత్యంలో అధిక భాగం వర్ణవ్యవస్థను సమర్ధించాయి.
వర్ణవ్యవస్థను రూపుమాపాలని కలలుకన్న సాహిత్యం మనుషులంతా ఒక్కటే అని చాటింది. అందరు ఒక్కటే అనే సిద్ధాంతం ద్వారా పాల్కురికి సోమన్న, అన్నమయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, దున్న ఇద్దాసు మొదలగువారు తమ పద్యాలు, గేయాలు, తత్త్వగీతాల ద్వారా మార్పును ఆకాక్షించారు. సాహిత్యంతో బలమైన ముద్రవేసారు. అయినప్పటికీ కుల ఛాందసవాదం ఊగి ఆగిన ఊయల తీరే ఉంది.
ఫూలే దంపతుల నిస్వార్థ సేవ, అంబేడ్కర్ పోరాటం వల్ల కాంగ్రెస్ పార్టీకూడా హరిజనోద్ధరణకు పిలుపునిచ్చింది. నిరసనల నడుమ దళితుల ఆలయ ప్రవేశాల కోసం కృషిచేసింది. స్వాతంత్ర్య కాలంలో ఆధునిక భావాలు ఆహ్వానించబడ్డప్పటికీ అవి వ్యవస్థలో మార్పు తేలేకపోయాయి. కూటికి పేదనే అయినా కులానికి తక్కువనా? అనే కుల అంహకారం నిండిపోయింది.
కులాలకు మూలం వర్ణవ్యవస్థ. కులనిర్మూలన జరగాలంటే వర్ణనిర్మూలన జరగాలని వర్ణ నిర్మూలన సిద్ధాంతాన్ని గ్రంథ రూపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించారు. కులవ్యవస్థ మనుషుల్ని కలవనివ్వలేదు. ‘కుల వ్యవస్థ శ్రామికుల్ని సైతం విభజించింది’ అని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ పేర్కొన్నారు. కులం మనుషులుని విభజించడానికి మాత్రమే ఉపయోగపడ్డదని అర్థమవుతుంది. ఒక కులం మీద ఒక కులం నిచ్చెన మెట్ల తీరుగా తారతమ్యాలు సృష్టించబడ్డాయి.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన “హూ వర్ శూద్రాస్” (1946) అనే పుస్తకంలో, శూద్రులు అనాదిగా హిందూ సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థలో నాల్గవ వర్ణంగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవకులుగా పరిగణించబడ్డారని పేర్కొన్నారు. వీరు ఆర్యుల తెగలకు చెందినవారని, బ్రాహ్మణులతో జరిగిన సంఘర్షణ కారణంగా హోదా కోల్పోయి, తక్కువ కులంగా మారిన రాజవంశీకులని ఆయన వాదించారు. ఇదే అంశాన్ని బింబిసారుని(క్రీ .పూ.542) కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థలో భాగమైన శూద్రులకన్న హీనంగా మరొక వర్ణం పంచమ వర్ణాన్ని సృష్టించినట్లు రొమిల్లా థాపర్ (తరతరాల భారత చరిత) పేర్కొన్నారు. కాలక్రమేణ కులాల మధ్య అంతరాలు ఆర్థిక, అధ్యాత్మిక, వృత్తిపర, సామాజిక వివక్షకు దారితీసాయి. నీచవృత్తుల చేసే మనుషులను నీచంగా చూడడంతో అంటరానితనం వేళ్లూనుకుపోయింది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ దేశ మూల వాసులు శూద్రులుగా మార్చబడ్డారని అవగతమవుతుంది. శూద్రులు పంచములుగా పిలువబడుతున్నారు. పంచములు అంటే హిందూ సాంప్రదాయక చాతుర్వర్ణ వ్యవస్థ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) పరిధిలోకి రాని, ఆ వ్యవస్థకు బయట ఉన్న అణగారిన వర్గాల వారు (దళితులు/అస్పృశ్యులు) అని అర్థం. వీరు సాంప్రదాయ కుల నిచ్చెనమెట్లలో ఐదవ వర్ణంగా లేదా అంతకంటే తక్కువగా పరిగణించబడేవారు. స్వాతంత్రోద్య కాలంలో హరిజనులు(దేవుని బిడ్డలు)గా సంబోధించబడినవారే ఇప్పుడు దళితులుగా పిలువబడుతున్నారు. స్వాతంథ్ర్యానంతర కాలంలో దళితుల జీవితం తెలుసుకోవాలంటే సాహిత్యం అధ్యయనం చేయాల్సిందే. సాహితీ ప్రక్రియలు చాలా ఉన్నాయి. కథకు మానవ జీవితంలో విశేషమైన పాత్ర కలదు. పండిత పామర జనరంజకంగా ఆదరించబడుతుంది.
దళితపదం వివరణ: దళితులు అనే పదం ఒక సమూహం యొక్క అస్తిత్వంగా కనబడుతుంది.‘దళిత’ అను శబ్ధానికి అర్థం ఖండించబడిన, చీల్చబడిన, వెలివేయబడిన అను అర్థాలున్నాయి. ‘Dalith’ అంటే broken or reduced to pieces generally అనే అర్థాలు ఆంగ్ల నిఘంటువుల్లో అర్థాలున్నాయి. బూర్గుల మంత్రివర్గంలో మంత్రి ‘దళిత’ అనే పదాన్ని తెలుగు సాహిత్యంలో మొట్టమొదట శంకర్ దేవ్ 1954లో ‘హరిజన శంఖారావం’ అను తన పుస్తకంలోని ముందుమాటలో ఉపయోగించాడు. వీరి స్వస్థలం బీదర్ ప్రాంతం. (ఇంగులం -దళిత అస్తిత్వ వ్యాసాలు, శ్రీనివాస్, సంగిశెట్టి). 1972లో మహారాష్ట్రలో దళిత ప్యాంథర్స్ మ్యానిఫేస్టో ప్రకారం
“దళితులంటే… షెడ్యుల్డ్ ట్రైబ్స్, నియో బుద్ధిస్టులు, శ్రామికులు, భూమిలేని పేదలు, రైతులు, మహిళలు, ఆర్థికంగా రాజకీయంగా, మతం పేరిట దోపిడీకి గురయిన వారందరూ దళితులే! ప్రస్తుతం దళిత అనే పదం షెడ్యూల్డ్ కాస్జ్స్‌కి పరిమితమైంది. ‘దళిత’ పదం సామాజికంగా అంటరానివారిగా పరిగణింపబడుతున్న కులాలకు పరిమితమైంది.
తెలుగులో దళిత సాహిత్య భూమిక: 9వ శతాబ్దంలో శాసనభాషగా, 11వ శతాబ్ధం నుంచి అనువాదంతో ప్రారంభమైన తెలుగుకు వెయ్యేళ్ల లిఖిత చరిత్ర ఉంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరులేని రచయిత రాసిన ‘మాలవాండ్ర’ పాటతో(1919) ప్రారంభమైందని చెప్పాలి. మంగిపూడి వేంకట శర్మ ‘నిరుద్ధ భారతం’(1933), కథా ప్రక్రియ శ్రీపాద సుబ్రమణ్య శాష్టి ప్రబుద్దాంధ్ర (1925) పత్రికలో ‘పుల్లంరాజు’, ఇలాంటి తవ్వాయి వస్తే’, కథతో దళిత దృక్కోణం వెలువడింది. అడివి బాపిరాజు ‘నరసన్న పాపాయి’, కరునకూమార ‘పోలయ్య’, చలం ‘హరిజన సమస్య’ గోపిచంద్ ‘చెప్పులు కుట్టేవాడు’ మొదలైన కథలు వెలువడ్డాయి. ఈ కథలను సహానుభూతి సాహిత్యమే తప్ప అనుభూతి సాహిత్యం కాదని విమర్శకులు తేల్చిండ్రు.
తొలి తెలుగు దళితకథ, తొలి తెలంగాణ దళిత కథకుడు భాగ్యరెడ్డి వర్మ 1931లో ‘వెట్టిమాదిగ’ కథ అజ్ఞాతవాసి పేరిట రాసాడు. ఈ మధ్యకాలంలో సంగిశెట్టి శ్రీనివాస్ వివరిస్తున్న కథ ‘నేరేడు పండ్ల కంటు’(గోలకొండ పత్రిక 1926 – 1935, సే. ఆనంద్, యామిజాల, డా. వెంకట రమణ, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హై. 2017) 1930 గోల్కొండ పత్రికలో శ్రీనివాస్ అనే యానాం దళితుడు రాసిన తొలి దళిత కథకుడుగా ప్రకటిస్తున్నాడు. తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మ ‘ఇంకెక్కడి విజయం’(1934), గృహలక్ష్మి పత్రికలో అచ్చయ్యింది. తెలంగాణ తొలిదళిత కథకురాలు జనగామకు చెందిన మామిడి సత్యవతి ‘తెరతొలగింది’,‘హితువు’, ‘సుశీల’, స్వేచ్చ’ మొదలైన కథలు రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో దళిత కథా సంకలనం డా. ఆర్. చంద్రశేఖర్ రెడ్డి మరియు కె. లక్ష్మినరసయ్య సంపాదకత్వంలో ‘దళిత కథలు’(1996) విశాలాంధ్ర ప్రచురించింది.
కంచికచెర్ల కోటేశు హత్య(1968 ఫిబ్రవరి24)తో దళిత స్పృహ రచయితలలో కలిగినా మహారాష్ట్రలో దళిత పాంథర్స్ వల్ల దళిత సాహిత్యం సామాజిక ఉద్యమంగా వికాసం చెంది తెలుగు నేలకు వ్యాపించింది. కారంచేడు సంఘటన(1985 జూలై 17న) దళిత సృజనకారులలో మరింత దళిత దృక్పథాన్ని మేల్కొల్పింది. తెలుగు సృజనకారులు వివిధ ప్రక్రియలను ఆశ్రయించి ప్రజల్ని జాగృతం చేసారు. ప్రధానంగా పాట సుడిగాలిలా చుట్టేసింది. కథా ప్రక్రియ అందరికి చేరింది.
దళితకథ పుట్టుక: మనిషి పుట్టినప్పుడే కథ పుట్టిందంటారు కదా! మరి దళితకథ? జీవితంలోంచి, అణచివేతలోంచి, పీడనలోంచి ఉద్భవించింది. దళితకథలో శిల్పం, శైలీ లేదు. నైపుణ్యంలేదనే వారున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వివక్షలేని జీవితం దళితులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉందనే విషయం గ్రహించాలి. అందమైన అల్లిక గురించి ఆలోచించక అణచబడుతున్న జీవితాల గురించి ఆలోచించినపుడు ఇలాంటి విమర్శరాదు. దళితులకు విశేషమైన జీవితముంది. విషయ విస్తృతి ఉంది. లెక్కకు మించి వివక్షలూ(అకాడమిక్ అన్‌టచ్‌బిలిటీస్) ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారికి కిరాయి ఇల్లు దొరకని వ్యవస్థలోనే ఉన్నామనేదీ ఎవరూ ఆలోచించరు. దళిత కథ దినదిన ప్రవర్థమానమవుతూనే ఉంది.
దళిత దృక్పథంతో తొలికథా సంపుటి బోయజంగయ్య ‘లోకం’(1997) తొలి దళిత కథా సంకలనం ప్రచించారు. కర్నాటక బర్షికి వాసి ఇక్కడ ఉద్యోగంచేస్తూ భార్గవీరావు సంపాదకత్వంలో ‘ఇంకానా ఇకపై సాగవు’ (1994), గుండెడప్పు కనకయ్య సంపాదకత్వంలో వెలువడిన కథా సంకలనం ‘ఎదురుచూపులు’(1998) దళిత ఉద్యమ భావంతో ప్రచురించారు, వారిదే దళిత చైతన్యంతో రాసిన తొలి కథాసంపుటి 1998 ‘మేమిట్లుండం’(1998) వెలువడ్డాయి. గోగు శ్యామల సంపాదకత్వంలో ‘నల్లపొద్దు’(2002) యాభై రెండు మంది దళిత స్త్రీల సాహిత్య సంకలనం, జూపాక సుభద్ర, గోగు శ్యామల సంపాదకత్వంలో ‘నల్లరేగడి సాల్లు’ (2006) (మాదిగ ఉపకులాల మహిళా కథలు) జాజుల గౌరి ‘మన్ను బువ్వ’ (1999). మొదలైన కథా సంపుటాలు వచ్చాయి. డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య సంపాదకులుగా జంబూ సాహితీ సంపాదకత్వంలో దళిత కథా వార్షికలు రూపుదిద్దుకున్నాయి. ‘తొండం బొక్కెన’ -2020(దేశంలోనే తొలి దళిత కథావార్షిక), ‘చిందూనేల’-2021, ‘సాక’-2022, ‘కొమ్ము’-2023, ‘గండదీపం’-2024లో వెలువరించారు.
తెలంగాణ కృషి: తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటయ్యాక కథా సాహిత్యంపై వెలువరించిన సంకలనం ‘మూడు తరాల తెలంగాణ కథ’లో తెలంగాణ తొలి దళిత కథకులు భాగ్యరెడ్డి వర్మ ‘వెట్టి మాదిగ’ కథకు, ప్రొఫెసర్ గుండె డప్పు కనకయ్య, గోగు శ్యామల, తాళ్లపల్లి యాకమ్మ, యువదళిత కథా రచయితలకు చాలామందికి స్థానం దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ. దామోదరరావుల సంపాదకత్వంలో ఆంగ్లంలో ‘తెలంగాణ హార్వెష్ట్ తెలుగు షార్ట్స్ ఫిక్షన’(1912-2011) (తొలితరం కథకులతో పాటు జాజుల గౌరి, జాతాశ్రీ, పసునూరి రవీందర్‌ల కథలున్నాయి. తెలంగాణ తొలి కేంద్ర సాహిత్య యువపురస్కారం డా. పసునూరి రవీందర్ ‘అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ 2015 కథలకు వరించడం, డా. సిద్దెంకి యాదగిరి ‘తప్ష’ కతల సంపుటికి – 2019 సంవత్సరానికి ఉత్తమ గ్రంథ పురస్కారం వరించడం కూడా దళిత కథకు దక్కిన గౌరవముగా భావించాల్సిందే. తెలంగాణ దళిత కథను సుసంపన్నం చేస్తూ కథలు రాస్తూ అస్తిత్వ పతాక ఎగురవేస్తూ దళిత జీవితాలను ఆవిష్కరిస్తున్నారు.
తెలంగాణ కథా సాహిత్య చరిత్ర: తెలంగాణలో పురుడు పోసుకున్న దళితోద్యమం భారతదేశానికే దిక్సూచిగా నిలిచింది. హైద్రాబాద్‌లో 1917లో స్థాపించిన ఆది హిందు ఉద్యమం ప్రోద్భలంతో 1936లో డా॥ బి.ఆర్ అంబేద్కర్ అఖిల భారత షెడ్యుల్డు కులాల సమాఖ్యను స్థాపించారు. ఈ ఉద్యమానికి ఎమ్. వి. భాగ్యరెడ్డివర్మ, బి.ఎన్. వెంకట్‌రావు, అరిగె రామస్వామి త్రిముఖ ద్వారాలుగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమాలఖిల్ల. నిరంతరం చైతన్యం పుణికిపుచ్చుకున్న నేల. ఈ జాగలో కథా సాహిత్యం కూడా పోరుగాథల్ని, ఉద్యమాల్ని చిత్రించింది. దళితకథల్లో అస్తిత్వంతో పాటు దళిత దృక్పథాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబించాయి.
వెట్టిమాదిగ కథతో ప్రారంభమయిన తెలంగాణ అనేక కథలకు జీవంపోసింది. కథ సంపుటాలు, సంకలనాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్ సంపాదకత్వంలో ఎనభై ఆరుగురు దళిత కథకుల కథలతో ‘తెలంగాణ దళిత కథలు’ వెలువరించారు. ఆ పుస్తకానికి రాసిన ముందుమాటలో ప్రభావంతమైన పరిస్థితుల్ని కథల్లో ఇముడు చిన్న కథకుల కాలాన్ని సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ దళిత కథల్ని ఐదు దశలుగా విభజించారు. తొలిదశ భాగ్యరెడ్డి వర్మ కాలం(1931-1956), రెండోదశ బోయ జంగయ్య కాలం (1956-1970), మూడోదశ జాతశ్రీ-కనకయ్యల కాలం (1970-2000) నాలుగో దశ స్త్రీ త్రయకాలం (2000-2014) ఐదో దశ యువకాలం (2014-… ) అని సంగిశెట్టి శ్రీనివాస్ విభజించారు. పై విభజనలో స్పష్టత లేదనిపిస్తుంది. ఎందుకంటే బోయ జంగయ్య కాలం 1956-1970 అనుకుంటే బోజ ‘మూలాలు’ కథ 2005 లో రాశారు. ఈ కథను ఏ కాలంలో తీసుకోవాలి. సరే పరిశోధకుడిగా వారి అభిప్రాయం వారిది. కాలాలు సరే కాని కథకులను కాలకర్తలుగా గాకుండా సమస్యనే ప్రమాణికంగా తీసుకుందాం. దళితకథను వివిధ విభాగాలు చేసుకొని అధ్యయనం చేస్తే
ఆత్మల అలయి బలయి, ఆకలి కీకెల ఒడిసుడి
బాదల బతుకు పదన, కత్తుల్ని నూరిన కన్నీళ్లు
గాలికి గత్తర లేపిన గర్కపోసల తిరుగుబాటు
తెగిన, తెగని కొట్లాటలు
సగందెగి కొట్టుకాడుతున్న ఎతలు
మనుసు పెడితే ఈ అచ్చరాలల్ల ఒడువనీ దినుసులు
ఏమన్న గానీ ఎదతో సిటికెడు జుర్రుకో
దిగులు పోతది
మొగులంతా ఇశ్వాసం మొలకెత్తుతది
భూదేవరంత ఓదార్పు ఓర్పు బడువకుంట ఇస్తేనే ఉంటది
అదే దళిత కథ
తెలంగాణ దళిత కథ
పొడిచిన పొద్దును, నడిచిన కాలాన్ని , గడిచిన బతుకు ఎతలనీ, అధ్యయనం చేస్తే దళితుల బతుకులు, అణిచివేతలు, ఆక్రందనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు తిరుగుబాట్లు, ధిక్కార స్వరాలు, జిద్దులు ఆత్మీయతలు, ఉద్యమాలు ఒకటేమిటి సమస్తము అర్థం అవుతాయి.
(ఇంకా ఉంది…)