దోపిడీ కుల, వర్గ వ్యవస్థల్లో నాటకాలు, బూటకాలు ఎన్నికలకే పరిమితం అనుకుంటే పొరపాటే. పాలకులు వ్యవస్థల్లో తమ కుల, వర్గ పెత్తనాన్ని, యథాతథ స్థితిని కొనసాగించడానికి నాటకాలను తమ దిన చర్యలో భాగం చేసుకుంటారు. ఎన్నికల ఫలితాలను బట్టి ప్రదర్శనా స్థలం మారుతుంటుంది. నాటకంలో ప్రధాన వేషధారి పాత్రలు మారుతుంటాయి. కానీ నాటక స్వభావం, దాని అంతిమ లక్ష్యం మారదు. రాజకీయ నాటకం లక్ష్యం మోసం (deception), నిత్య దోపిడీ, పీడన, అణిచివేతల నుండి ప్రజల దృష్టి మళ్లించడం (diversionary tactics). ఇక వీటికి తోడు మతోన్మాదం, దాని చుట్టూ ఉండే భావోద్వేగాలను ఆసరా చేసుకొని, తన వ్యక్తి ఆరాధనను (personality cult) పెంచుకొని దాని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే narcissist వ్యక్తిత్వం. ఇంకేం కావాలి నాటకం రక్తికట్టడానికి!
వ్యక్తి ఆరాధన అభిమానుల కళ్లకు గంతలు కట్టేస్తుంది. తమ నాయకుడు ఏ మచ్చలేని వాడని, ఇంకాస్త పిచ్చి ముదిరి “దేవుడి” లాంటి వాడని ఒక సామాజిక, మానసిక రోగ స్థితొకటి నిర్మాణమవుతుంది. ఇలాంటి వ్యక్తులు అధికారంలో ఉంటే ఇక వారి పిచ్చి చేష్టలకు అడ్డూ అదుపూ ఉండదు. మందస్వామ్యాన్ని ఉసిగొలుపుతూ, ఊగిపోతూ రాజకీయ ప్రదర్శనలో (political spectacle) విజృంభిస్తారు. అది చూసి సగటు మనుషులు “దేశోద్దారకుడు” బయలుదేరాడని భ్రమపడతారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని దూరం నుండి చూసే నాబోటి వాళ్ళు ఒక సంఘటనగా భావించి ఊరుకోవచ్చు. కానీ అది విద్వేషమవుతున్న దేశ సామాజిక, రాజకీయ వాతావరణంలో నాటబడుతున్న ఒక విషపు మొక్క అని అర్థమయినప్పుడు, “తుఫాన్” అని ఫాసిస్టు శక్తులచే కీర్తింపబడి తీరం దాటబోతున్న పెను ప్రమాదాన్ని హెచ్చరించడం కనీస బాధ్యత.
నటుడు ప్రకాశ్ రాజ్ అన్నట్లు, “తిరుపతి లడ్డు వ్యవహారం”లో ఏదైనా తప్పిదం జరిగివుంటే తన చేతిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని, చట్టాలను సరిగ్గా ఉపయోగించి పరిశోధన చేయించవచ్చు. అవసరమైతే నిందితులకు శిక్షలు వేయవచ్చు. కానీ అలా చేస్తే చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే, ఇప్పటికే హిందుత్వ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ తనలోని సనాతనవాదిని బయటకు తెచ్చి ఒక ప్రదర్శన చేశాడు. ఆ సందర్భంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, తెలుగు నేల మీద వీచబోయే కాషాయ విషపు గాలులకు సంకేతంగా అనిపిస్తున్నాయి. అతిగా ఆలోచిస్తున్నామా? అని అనిపించినా, నిస్సందేహంగా పవన్ కల్యాణ్ ఇప్పటి, రేపటి తరాన్ని పూనకాలవైపు నడిపించగలిగే ఆకర్షణ శక్తి వున్న వ్యక్తి. ఇలాంటి వాళ్ళు మతోన్మాధ రాజకీయాలను అధికారానికి మార్గంగా ఎంచుకుంటున్నారంటే అది ఒక పెద్ద ప్రమాద సూచిక.
తన వీరాభిమానుల చేత “భారతీయ చెగువేరా”గా కీర్తింపబడే పవన్ కల్యాణ్ తెర మీద ఎలా నటించినా, “వీధి” నాటకాలలో మాత్రం మంచి నటననే ప్రదర్శిస్తున్నాడు. నిజమే, కొందరికి వచ్చే బిరుదులకు వాళ్ళ అసలు నైజానికి ఎలాంటి సంబంధం ఉండదు. బహుశా “చెగువేరా” అనే కీర్తి కిరీటం పవన్ కల్యాణ్‌కు పెట్టడం మన సమాజ చైతన్య స్థాయిని కూడా చెబుతుంది. ఇప్పుడు ఆ “వీధి నటుడు” చెగువేరా కాష్ట్యూమ్ తొలగించుకుని “వీర” సావర్కర్‌ను తగిలించుకుంటున్నాడు. బహుశా చెగువేరా కలలుగన్న సోషలిస్టు సమాజపు ఓనమాలు కూడా అర్థం కాలేదనుకుంటా. అందుకే నిచ్చెనమెట్ల కుల, వర్గ, లింగ దోపిడీ వ్యవస్థను సుస్థిరం చేసే సనాతనాన్ని ఎత్తుకుంటున్నాడు. ఈ సనాతనంలోనే అంటరానితనం, మహిళల మీద హింస, పీడిత కులాల, వర్గాల దోపిడీని “శాస్త్రబద్దంగా” సమర్థించే, అమలుచేసే విధానం ఉన్నదని ఆయనకు తెల్వదని అనుకుందామా! లేక ఆ హింసే పునాదిగా తన రాజకీయ జీవితాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాడని భావిద్దామా?
పవన్ కల్యాణ్ ఒక వ్యక్తిగా మాట్లాడితే, ‘సరేలే, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయేమో కాబట్టి అంతగా బాధ పడుతున్నాడు’ అని అనుకోవచ్చు. కానీ ఆయన తన ప్రెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఊగిపోయాడు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు. కానీ రాజ్యాంగం ఏం చెబుతుంది? దానిలోని సెక్యులరిజానికి అసలు అర్థమేంటి? అనేవి ఏవీ ఆయనకు పట్టేలా లేవు. సెక్యులరిజాన్ని ఒక విశాల రాజకీయ విలువల చట్రం నుండి కాకుండా “అది ఒక దారి కాదు, రెండు దారుల” సంగతిగా చూసే మిడిమిడి జ్ఞానం ఆయన సంఘ్ శక్తుల నుండి అందిపుచ్చుకున్నాడేమో! అంబేద్కర్ అయితే సెక్యులరిజాన్ని కేవలం రాజ్యం, మతం మధ్య ఉండే ఒక విభజన రేఖగా మాత్రమే చూడలేదు. ఇంకా ముందుకెళ్ళి సెక్యులరిజమంటే హేతుబద్ధ ఆలోచనలకు తావిచ్చే ఒక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణం అని ఆలోచనలు చేశాడు. ఈ దృష్టితోనే బౌద్దం తప్ప మరే మతం కూడా సెక్యులర్ గా ఉండగలిగే అవకాశం లేదని ప్రకటించాడు.
పవన్ కల్యాణ్ కేవలం లడ్డు వ్యవహారం దగ్గర ఆగలేదు. అవసరం లేకపోయినా ముస్లిం, క్రిస్టియన్ మందిరాలతో ఒక పోలిక తెచ్చే పని చేశాడు. “మేము”, “వాళ్లు” అనే గీత గీసే ప్రయత్నం చేశాడు. హిందుత్వంలో హింసకు తావు లేదని, గుజరాత్లో త్రిశూల హింసకు బలైన రెండు వేల మంది ముస్లిముల సాక్షిగా చెప్పాడు. అంతకంటే విడ్డూరంగా, తాను “criminalization of politics” కు వ్యతిరేకమని ప్రకటించాడు. ఆయన ఆవేశంలో తనకు తోచిన పదాలన్నీ పేర్చుకుంటూ పోయాడనిపిస్తుంది. దేశంలో ప్రజావ్యతిరేక రాజకీయార్థిక, సాంస్కృతిక నిర్ణయాలను సూత్రబద్దంగా విమర్శించే, ప్రతిఘటించే అన్ని గొంతుకలను (గాంధేయవాదుల నుండి మావోయిస్టుల వరకు) అణచివేస్తుంటే, పవన్ కల్యాణ్ కళ్లకు ఏదీ కనబడనట్లే నటిస్తున్నాడు.
ఈ నటుడు అంతటితో ఆగక, “మౌనం భావితరాలకు ప్రమాదం” అని కూడా ప్రభోదిస్తున్నాడు. ఒకవైపు మౌనం వీడమంటున్నాడు. మరోవైపు మీరు నాస్తికవాదులైతే, హేతువాదులైతే, లౌకికవాదులైతే నోరు మూసుకోని ఇంట్లోనే ఉండండని ఒక సుతిమెత్తని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇలాంటి హెచ్చరికలు కూడా ప్రజాస్వామిక విలువలను, భావాలను నేరమయం చేయడమే అనే విషయాన్ని ఆయనకు ఎవరు స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి?!
ఇవన్నీ చూస్తుంటే గందరగోళంగా అనిపిస్తుంది. కానీ ఇవేవీ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం కుట్రల వెలుపల జరగడం లేదు. తెలుగు నేల మీద తమ అహేతుకతను, అలౌకికతను, ఆధిపత్య భావనలను, మైల రాజకీయాలను (చట్టాన్ని వదిలిపెట్టి, ప్రక్షాళన దీక్షలు అందుకే!), మెజారిటేరియన్ భ్రమలను గాలి వేగంగా ప్రచారం చేయడానికి సనాతనవాదులకు అందివచ్చిన ఆయుధం పవన్ కల్యాణ్. అందుకే, తనను తప్ప మరెవ్వరినీ ఎప్పటికీ పొగడని మోదీ, ఆయనను “పవన్ కాదు, తుఫాన్” అని పొగడ్తలలో ముంచేశాడు.
అయితే బహుశా పవన్ కల్యాణ్‌కి కూడా అర్థమయ్యింది ఏమంటే, తాను భవిష్యత్తులో స్వతంత్రంగా ఎదిగి ముఖ్యమంత్రి కావాలంటే, చైతన్యపూరితమైన రాజకీయాలు కాకుండా మతోన్మాదాన్ని పెంచిపోషించే చేష్టలే అవసరమని. కానీ ప్రజలను ఎల్లకాలం భ్రమల్లో, మతం మత్తులో ముంచలేమని పవన్ కల్యాణ్‌కు తెలియకపోవచ్చునేమో! కానీ, అదే సత్యమని ప్రజా చరిత్ర చెబుతుంది.
ఇప్పుడు ఏ లడ్డు గురించి అయితే వివాదం జరుగుతుందో, అదే తిరుమలలో అలిపిరి దగ్గర చంద్రబాబు మీద దాడి జరిగినప్పుడు “నక్సలిజమా, ప్రపంచ బ్యాంకు విధానాలా?” అంటూ ఎన్నికలకు పోయి ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తన రాజకీయ ప్రసాదంగా వాడుకోవాలనుకుంటున్న పవన్ కల్యాణ్ లాంటి వాళ్ళకు కూడా ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు తమ చైతన్యాన్ని తప్పక చూపిస్తారని ఆశిద్దాం. అప్పటి వరకు ఈ సరికొత్త సనాతన “తుఫాన్” కాషాయ సముద్ర తీరం దాటకుండా చూడాల్సిన బాధ్యత ప్రగతిశీల, ప్రజాస్వామిక, లౌకిక శక్తులదే!
చాలా బాగా రాశారు.. కాలం తనకు అవసరమైన రచయితలనీ, మేధావులనీ స్వయంగా సృష్టించుకుంటుందని ఎవరో, బహుశా కొ. కు. కావచ్చు, అన్నారు. ఆ మాటలు నిజం అని మీ వంటి యువ మేధావులు నిరూపిస్తున్నారు. అభినందనలు అశోక్…
Excellent write up
సమస్యను పరిష్కరించడం కాక అవసరాలకు వాడుకొనే అధికార రాజకీయాలను అర్థం చేసుకోవలసిన తీరును నిర్దుష్ట సందర్భం నుండి సూచించిన మంచి వ్యాసము