“మీ పిల్లలు మీ ద్వారా వచ్చారేతప్ప మీ కొరకు కాదని తెలుసుకోండి” అన్నాడు ఖలీల్ జిబ్రాన్.
తెలుగు రచయిత చలం అభిప్రాయం కూడా ఇదే. పిల్లల పెంపకంలో ప్రజాస్వామిక విలువల గురించి ఆలోచించే వాళ్ళందరూ ఇష్టంగా గుర్తుచేసుకునే మాటలివి. ఎంతో ఆకర్షణీయంగా కనబడే ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టేటప్పుడు ప్రతి తరమూ ఇబ్బంది పడుతూనే ఉండటం ఒక వాస్తవం.
తల్లిదండ్రులకు పిల్లలపై సహజమైన హక్కులుంటాయనీ, పిల్లలు కుటుంబానికి చెందిన ఆస్తులనీ భావించిన తరానికి ఈ ఇబ్బంది సహజం. వాళ్ళు సాధారణంగా సంప్రదాయ కుటుంబాలకు, గ్రామీణ నేపథ్యాలకు చెందినవారు. ఆనాటి వ్యవసాయాన్నో, కులవృత్తులనో ఆధారం చేసుకుని ఉమ్మడి కుటుంబవ్యవస్థ అలా సాగిపోతూనే ఉంటుందని వాళ్ళు భావించారు.
కుటుంబం నిర్దేశించిన చట్రాలలో తల్లిదండ్రులు, పిల్లలు అలా ఇమిడిపోతూ జీవితాలు సరళరేఖల్లా సాగుతూ ఉండాలని ఆశించారు.
వలసపాలన ద్వారా సమాజంలోకి ప్రవేశించిన ఆధునికత ఈ జీవితాలను ఒక కుదుపుకు లోనుచేసింది. కొత్త చదువులు, ఉద్యోగాలు, నగరాలకు వలసలు, ఉమ్మడి కుటుంబాలను డిస్టర్బ్ చేశాయి. ఐతే, జీవనోపాధి మార్గాల్లో తప్ప మౌలికమైన కుటుంబ సంబంధాలతో, విలువలతో పెద్దగా వైరుధ్యం లేని ఒక పాయకు చెందిన తమ సంతానంతో తల్లిదండ్రులకు సంఘర్షణ లేదు. సీసా కొత్తదేగానీ,దానిలోని వైన్ పాతదే!
అందివచ్చిన కొత్త అవకాశాలను సొంత జీవితాల ఎదుగుదలకు వాడుకోవాలనిగాక, సమాజంలో ప్రజాస్వామిక విలువల వికాసానికి సాధనాలుగా ఉపయోగించాలని ప్రయత్నించింది కొత్త తరంలోని ఒక సమూహం. అది అనేక పరిమితులతో కూడిన సంస్కరణ కావచ్చు, వ్యవస్థలను సమూలంగా మార్చాలనే ఆకాంక్షా కావచ్చు. వీళ్ళకు కుటుంబాల నుండి వివిధ స్థాయిల్లో ప్రతిఘటన ఎదురైంది.
కుటుంబ సంబంధాలలోని విలువలను, విశ్వాసాలను మార్చటానికి ఏమేరకు ప్రయత్నం జరిగితే, అదే స్థాయిలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ ప్రాసెస్ లో కుటుంబాలనుండి విడిపోయిన వాళ్ళున్నారు, సొంత ఇళ్ళలో అవుట్ సైడర్స్ గా మిగిలిపోయిన వాళ్ళూ ఉన్నారు. వర్గాన్ని, కులాన్ని, జెండర్ నుబట్టి ఈ సంఘర్షణ తీవ్రతలో స్థాయీభేదాలున్నాయి. ఉదాహరణ కు- పాత విలువలను మార్చే ప్రయత్నం చేసిన పురుషులను కొన్ని షరతులు అంగీకరించిన కుటుంబవ్యవస్థ,స్త్రీలను క్షమించదు. అసలు ఈ మార్పులను కోరిన ఉద్యమకారులకే అంతర్గత రాజకీయాలు సృష్టించగల స్థాయీభేదాల అవగాహన లేదు. ఫలితంగా మెయిన్ స్ట్రీమ్ సమాజంలోనూ, ఉద్యమ నిర్మాణాల్లోనూ కూడా వైఫల్యాలే దక్కిన కొన్ని అస్తిత్వాలున్నాయి.
ఇన్ని సంఘర్షణల నడుమన కూడా ఆ ప్రజాస్వామిక ఉద్యమాలకు ఎక్స్పోజ్ అయిన వ్యక్తులు పాతతరాలతో ఒక మానవసంబంధాన్ని నిలుపుకోగలిగారు.ఆ క్రెడిట్ వాళ్ళకు ఆనాటికి అందివచ్చిన భావజాలానిది.అది మౌలికంగా బలహీనుల పక్షాన నిలబడేది, మానవ సంబంధాలను సెన్సిటైజ్ చేయాలనే ధ్యేయం కలిగినది. అందుకే,తమ పిల్లల మార్గాలతో విభేదించినప్పటికీ, వారి విలువలను ప్రేమించిన పాతతరాల మనుషులు మనకు కనబడతారు. జిబ్రాన్ చెప్పినంత అన్ పొసెసివ్ గా ఉండలేక పోయినా, పిల్లల మార్పును సహించగలిగిన ఆ తరం తల్లిదండ్రులున్నారు .
ఇవాల్టి పరిస్థితి పూర్తిగా భిన్నమైనది.ఇది గెలుపును మాత్రమే గౌరవించే సమాజం.మానవసంబంధాల సారం అవసరాలను తీర్చుకోవటమేనని బోధించే ప్రపంచం. సుఖాన్వేషణ మార్గంలో అడ్డొచ్చిన ప్రతి సంబంధాన్నీ తెంచుకురమ్మనే భవిష్యత్ చిత్రం. ఇక్కడ ప్రతి మనిషీ మరొకరికి భారంగా తోచటం అనివార్యం. ఈ ఫిలాసఫీని నేర్చుకోగలిగిన కుటుంబాల్లో, సమూహాల్లో వయోభేదాలకు అతీతంగా సామరస్యం ఏర్పడుతుంది. పరస్పర సహకారం ఉంటుంది.
కానీ, సామూహిక ప్రయోజనాల బాటను ఎన్నుకుని, తమ ముందు తరాలతో ఘర్షణపడిన నిన్నటితరంలోని కొందరు మనుషులది చిత్రమైన పరిస్థితి. ఒద్దనుకున్న పాతజీవితాల్లోకి తిరిగి వెళ్ళలేని, కొత్తతరంతో కలిసి పరిగెత్తనూలేని ఒంటరితనం వీళ్ళది. ఈ వైరుధ్యం కుటుంబ సంబంధాల్లో మరింత స్పష్టంగా కనబడుతోంది. తరాల నడుమ సహజంగా ఉండే అంతరాలు ఇక్కడ అగాధాలుగా మారాయి. తల్లిదండ్రులూ-పిల్లలూ వేర్వేరు ద్వీపాలలో జీవిస్తున్నారు. పరస్పరం అపరిచితమైన భాషలలో వివాదానికి తలపడుతున్నారు.
తమాషా ఏమిటంటే, ఈ తల్లిదండ్రులు తాత్వికంగానూ, రాజకీయంగానూ యథాతథవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళు, మార్పును కోరుకున్న వాళ్ళూ కావటం. ఇప్పటి తమ ఇబ్బందిని ఎలా అర్థంచేసుకోవాలో తమకు తాముగా ఎలా చెప్పుకోవాలో తెలీని స్థితి వీరిలో చాలామందికి ఎదురవుతోంది.
చాలాకాలం కిందట తాము వదుల్చుకున్న సంప్రదాయాలను, జీవన విధానాన్ని సరికొత్త పేర్లతో తమ పిల్లలు అనుసరిస్తోంటే వీళ్ళు నివ్వెరపోతున్నారు. ఆర్థికంగానో, ఎమోషనల్ గానో ఆధారపడక తప్పని సందర్భాల్లో పిల్లలను అనుసరించకా తప్పటం లేదు. ఈ మార్పును ఎత్తిచూపించి తమను దెప్పిపొడిచే బయటి సమాజానికి జవాబివ్వలేక వీళ్ళు సిగ్గుపడుతున్నారు. జిబ్రాన్ ను అరువు తెచ్చుకుని తమ పెంపకంలోని ప్రజాస్వామికతను సమర్థించుకోవాలనే బలహీనమైన ప్రయత్నం మరికొందరిది.
ఎలా చూడాలి ఈ పరిస్థితిని? ఎలా దాటాలి ఈ సందిగ్థాన్ని? రెడీమేడ్ పరిష్కారాలు లేకపోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత ఏర్పడితే వ్యక్తిగత స్థాయిలోనైనా సంఘర్షణ తప్పుతుంది.పిల్లల పెంపకం, వాళ్ళ వ్యక్తిత్వాల నిర్మాణంలో తమ ప్రమేయంకన్నా సామాజిక ప్రభావం బలమైనదన్న వాస్తవాన్ని అంగీకరించటం అవసరం. అలాగని తమ వ్యక్తిత్వాలను వదులుకోవాల్సినంత నిస్సహాయతలోకి జారిపోవాల్సిన అవసరమూ లేదు. పిల్లలపై తమ అభిప్రాయాలను రుద్దటం సరైనది కాదు .కానీ తమ ఇష్టాయిష్టాలు, విశ్వాసాలను సహేతుకంగా చెబుతూ పెంచటం అసాధ్యం కాదు. ఏ విషయాల్లో తమ ప్రాధాన్యాలను వదులుకోవటం కుదరదో స్పష్టం చేయగలిగితే
కొన్ని వత్తిడులకు లొంగాల్సిన అవసరాన్ని తప్పించుకోవచ్చు.
ఇదంతా అందరికీ వెంటనే సాధ్యపడేంత చిన్న విషయం కాదు.సామూహికంగా ప్రయత్నం చెయ్యాల్సిన సమస్య కూడాను.
ఐనాసరే, వ్యక్తిగత స్థాయి ప్రయత్నాలను వాయిదా వెయ్యాల్సిన అవసరం మాత్రం ఏముంది?