జి. ఎన్. సాయిబాబా: 21వ శతాబ్దపు భారతదేశ గొప్ప అమర పుత్రుడు

తెలుగు: పద్మ కొండిపర్తి

వ్యవస్థీకృత హత్యా దినం (అక్టోబర్ 12) – మహా అమరుడి చివరి వీడ్కోలు కళ్ళారా చూసినట్లుగా…

(21వ శతాబ్దపు భారతదేశ చరిత్రను భవిష్యత్తు చరిత్ర మూల్యాంకనం చేసినప్పుడు, డా. జి.ఎన్. సాయిబాబా భారతీయ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆదివాసులు, దళితులు, శ్రామికులు, రైతుల పక్షాన నిలబడి జీవితాంతం పోరాడిన మహా అమరులలో ఒకరిగా నిలుస్తారు. చివరకు, భారతీయ రాజ్య వ్యవస్థ ఆయనను మృత్యువు అంచులోకి నెట్టివేసింది.

భూమిలేని శ్రామిక, దళిత కుటుంబంలో జన్మించిన ఈ గొప్ప విప్లవకారుడు, శారీరకంగా వికలాంగుడైనప్పటికీ, భారతీయ రాజ్య వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా నిలిచారు. ఒక చారిత్రక సవాలు.)

హైదరాబాద్: సాధారణంగా మరణం అనేది విడిపోయే దుఃఖాన్ని మిగిల్చిపోతుంది, ఎవరూ లేని లోటును, ఆ వ్యక్తి ఆత్మీయుడైతే, తనలో ఒక భాగాన్ని శాశ్వతంగా కోల్పోయిన భావనను కలిగిస్తుంది. కానీ కొన్ని మరణాలు ఈ అన్నింటితో పాటు, ప్రజలలోని ఉదాత్తమైన మానవ భావాలన్నింటినీ ఒకేసారి, ఒకే సమయంలో మేల్కొలుపుతాయి. జి.ఎన్. సాయిబాబా మరణం అలాంటిదే. ఆయనకు అంతిమ వీడ్కోలు పలకడానికి హైదరాబాద్ చేరుకున్న వారి కళ్ళలో ఒకవైపు కన్నీళ్లు, చెమర్చిన కళ్ళు, ముఖాలపై అంతులేని బాధ పొరలు-పొరలుగా ఉన్నా, అదే సమయంలో వారి ముఖాలపై కోపం, ఆగ్రహం, ప్రపంచాన్ని అందరి కోసం మరింత అందంగా మార్చాలనే స్వప్నం, మానవత్వపు శత్రువులకు బుద్ధి చెప్పాలనే సంకల్పం, శ్రమజీవులు, పేదలు, ఆదివాసులు, దళితులు, ఇతర అణగారిన వర్గాల పోరాటాలలో పాలుపంచుకోవాలనే స్ఫూర్తి కూడా స్పష్టంగా కనిపించింది.

సాయిబాబాకు అంతిమ వీడ్కోలు పలకడానికి వచ్చిన ప్రజలు ఆయనకు పూలదండలు వేసి, ఎర్రటి బట్ట కప్పేటప్పుడు, తమను తాము ఆయన స్వప్నాలు-సంకల్పాలు, ధైర్యం, ప్రజల పట్ల ఆయన నిబద్ధత, దోపిడీ-పీడన, అన్ని రకాల అన్యాయాలను రూపుమాపాలనే ఆయన స్వప్నంతో జత చేసుకుంటున్నట్లుగా కనిపించింది. అక్కడ కన్నీళ్లతో పాటు జోహార్, ఇన్‌క్విలాబ్, లాల్ సలాం నినాదాలు కూడా మార్మోగాయి. ఒకదాని తర్వాత ఒకటి విప్లవ గీతాల పరంపర ముందుకు సాగుతుంటే, ప్రజలు సాయిబాబాతో “మీరు మా మధ్య లేకపోయినా, మీ వారసత్వం సజీవంగా ఉంది. మేము మీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాము. దాని కోసం ప్రతి అవసరమైన త్యాగానికీ సిద్ధపడతాము” అని చెబుతున్నట్లుగా అనిపించింది.

“మీరు ఎవరి జీవితాల నుండి దుఃఖాలను, అవమానాలను, అన్యాయాన్ని, దోపిడీ-పీడనను దూరం చేయడానికి జీవించారో, మరణించారో, మేము వారిని వారి పాటికి వదిలిపెట్టము, వారిని ఒంటరిగా విడిచిపెట్టము, వారితో భుజం భుజం కలిపి, వారి చేతుల్లో చేయి వేసి పోరాటాన్ని కొనసాగిస్తాము. ఈ కార్వాన్ ఆగదు, ముందుకు సాగుతూనే ఉంటుంది. తెలంగాణ-శ్రీకాకుళం, దండకారణ్య విప్లవ పోరాటాల వారసత్వం ఆగిపోదు, నిలిచిపోదు, ముందుకు సాగుతుంది, కొత్త గమ్యాలను చేరుకుంటుంది. ప్రతి అణచివేత రూపానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డాము, నిలబడుతున్నాం, ఇకముందు కూడా నిలబడతాం. ఐక్యంగా పోరాడుతాం. అత్యంత శక్తివంతమైన నిజాం కూడా మమ్మల్ని వంచలేడు, మా సంకల్పం-ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయలేడు, మమ్మల్ని కొనలేడు, మా ఐక్యతను అంతం చేయలేడు, అది నేటి ఫాసిస్ట్ హిందూ-కార్పోరేట్ కూటమి నిజామే అయినప్పటికీ.” ప్రజలు సాయిబాబా పట్ల వ్యక్తం చేస్తున్న శ్రద్ధాంజలులలో కూడా ఈ విషయాలే వ్యక్తమవుతున్నాయి.

సాయిబాబా అంతిమ వీడ్కోలు సభకు, ఆయన జైలు జీవిత సహచరులు, ఆయన పోరాటాలలో పాలుపంచుకున్న సహచరులు, దేశం నలుమూలల నుండి కార్మికులు, ఆదివాసులు, దళితులు, మతపరమైన మైనారిటీల ప్రయోజనాల కోసం పోరాడుతున్న ప్రజలు హాజరయ్యారు. ఆయన భార్య, కుమార్తె, సోదరుడు, ఇతర బంధువులు కూడా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలంగాణ విప్లవ వారసత్వాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్న దాదాపు అన్ని సంస్థల ప్రతినిధులు కూడా వచ్చారు. సాయిబాబా విప్లవ-ప్రగతిశీల సంస్థల మధ్య ఉన్న అన్ని గోడలను పగలగొట్టిన వ్యక్తిగా అనిపించింది. వామపక్ష సంస్థల అన్ని ధారలు-వర్గాలకు చెందిన ప్రజలు, ఒకే ఉద్వేగంతో అంతిమ వీడ్కోలు పలికారు.

ఒకరి తర్వాత ఒకరుగా, వేర్వేరు వామపక్ష వర్గాలకు చెందిన, కార్మికులు-రైతులు, దళితులు, ఆదివాసుల సంస్థలకు చెందిన ప్రజలు సమూహాలుగా వచ్చి, జోహార్-లాల్ సలాం నినాదాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. విప్లవ గీతాలను ఆలపించారు. పూలమాలలు, చాదర్‌లు సమర్పించారు. బిగించిన పిడికిళ్లు, వారి ముఖాలు విప్లవ సంకల్పాన్ని, భావాలను వ్యక్తం చేశాయి. తమ సొంత మనిషి నుంచి అంతిమ వీడ్కోలు తీసుకుంటున్నట్లుగా అందరి ముఖాల్లో కనిపించింది.

వామపక్ష, దళిత, ఆదివాసీ సంస్థలతో పాటు, ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల నాయకులు కూడా, కారణాలు  ఏనైనా సాయిబాబా అంతిమ వీడ్కోలులో పాల్గొని, ఆయనకు తమ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నాయకుడు కేసీఆర్ (మాజీ ముఖ్యమంత్రి) కూడా ఆయనకు అంతిమ వీడ్కోలు పలకడానికి వచ్చారు, అయితే ఆయన చర్యలను గుర్తు చేసుకున్న సాయిబాబా అభిమానులు ఆయనను గేటులోకి కూడా అనుమతించలేదు, వెనక్కి తిరిగి వెళ్లాలని బలవంతం చేశారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా వచ్చారు.

బహుశా తెలంగాణ, దక్షిణ భారతదేశంలో సాయిబాబా వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే, దక్షిణాదిలోని అన్ని పార్టీలు ఆయనకు తమ సానుకూల నివాళులర్పించక తప్పలేదు. ఇందులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఉన్నారు.

ఈ వీడ్కోలు సభలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్యార్థులు-యువతరం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారందరూ ఒకే స్వరంతో ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని సంకల్పం వ్యక్తం చేస్తున్నారు. సాయిబాబా వ్యక్తిత్వం, పోరాటం, ఆలోచనలు వారి ప్రపంచాన్ని ఎలా మార్చాయి, అణగారిన ప్రజల పట్ల వారి ఆందోళనలను ఎలా పెంచాయి, వారికి విప్లవకర మార్పు, విప్లవకర పోరాటం అర్థాన్ని ఎలా నేర్పించాయి అనే విషయాలను వారు గుర్తు చేసుకున్నారు. దాని కోసం త్యాగం చేసే స్ఫూర్తిని నింపారు, త్యాగం అంటే ఏమిటో నేర్పారు, వారిని ఎలా నిర్భయులను చేశారు, అత్యంత శక్తివంతమైన నిజాంతో కూడా తలపడే ధైర్యాన్ని ఎలా ఇచ్చారు. కొందరి జీవిత దిశనే మార్చివేశారు. వారందరూ ఏకగ్రీవంగా ఆయన అసంపూర్తిగా ఉన్న పనులను ముందుకు తీసుకుపోవాలని, ఆయన స్వప్నాలను నెరవేర్చాలని మాట్లాడారు.

మహిళల హాజరు కూడా ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించింది. వేలాది మంది ఈ గుంపులో కనీసం మూడింట ఒక వంతు మంది మహిళలు ఉన్నారు. వారు కేవలం నిశ్శబ్ద ప్రేక్షకులే కాదు, అక్కడ జరుగుతున్న పోరాటాలలో పాలుపంచుకుంటున్న వారు. వారికి సాయిబాబా ఒక స్ఫూర్తిదాయకమైన సహచరుడు. ఆయన ఆదివాసులు, దళితులు, కార్మికుల పోరాటాలకు సహచరుడే కాక, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మహిళలలు జరిపే ప్రత్యేక పోరాటానికి కూడా తోడుగా నిలిచారు. అన్యాయ వ్యతిరేక, దోపిడీ-పీడన వ్యతిరేక అన్ని పోరాటాల ఐక్యతను సమర్థించిన, ఈ ఐక్యత కోసం రేయింబవళ్లు కృషి చేసిన ఒక సహచరుడు ఆయన. అక్కడికి వచ్చిన యువతులు తమ తమ స్థాయిలో ఏదో ఒక పోరాటంలో పాల్గొంటున్నవారు; వారిలో కొందరు విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బ్రాహ్మణవాద-వర్ణ-కులవాద, స్త్రీ-వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఆలోచనలు, కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఏర్పడిన సంయుక్త వేదికలో సభ్యులు. వారికి తమ స్వాతంత్ర్యంతో పాటు ఇతరుల స్వాతంత్ర్యం కూడా అంతే ముఖ్యం. వారు తమ స్వేచ్ఛతో పాటు అందరి స్వేచ్ఛ కోసం జరిగే పోరాటంలో పాలుపంచుకుంటున్నారు.

అక్కడ కనిపించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ రాజ్యవ్యవస్థ-పోలీసు యంత్రాంగం, న్యాయవ్యవస్థ ఏదైనా సంస్థ లేదా వ్యక్తిపైన మావోయిస్టు-నక్సలైట్ ముద్ర వేస్తే, ప్రజలు వారిని ‘అంటరానివారుగా’ (అస్ప్రుశ్యులుగా) చేయరు; ఇది హిందీ ప్రాంతంలో తరచుగా కనిపిస్తుంది. అక్కడ వామపక్ష సంస్థలు, ఆదివాసీ సంస్థలు, దళిత సంస్థలు, మహిళా సంస్థల దృష్టిలో, రాజ్యం మావోయిస్టు-నక్సలైట్ ముద్ర వేసిన సంస్థలు, వ్యక్తులు ‘అంటరానివారు’ కాదు. భారతీయ రాజ్యం, పోలీసు-యంత్రాంగం, న్యాయవ్యవస్థ సాయిబాబాపై వేసిన ముద్ర అలాంటిదే. అక్కడి విప్లవ-ప్రగతిశీల, దళిత-ఆదివాసీ-మహిళా సంస్థలు ఇటువంటి సంస్థలు, వ్యక్తులను తమ ఉద్యమంలో అవసరమైన, ముఖ్యమైన భాగంగా పరిగణిస్తాయి. ఇతర అన్యాయ వ్యతిరేక, దోపిడీ-పీడన వ్యతిరేక సంస్థలను ఎంతగా తమవిగా భావిస్తారో, వీరిని కూడా అంతే తమ సొంతవారుగా భావిస్తారు.

మీరు మావోయిస్టు-నక్సలైటు సంస్థలు, వ్యక్తులతో నిలబడితే, దాని సెగ మీకు కూడా తగలవచ్చు, మీరు రాజ్యానికి లక్ష్యం అవచ్చేమోననే రాజ్యం పట్ల ఉన్న భయం వారిలో కనిపించలేదు. అయితే, ఈ విషయం ఏకపక్షం కాదు. మావోయిస్టు-నక్సలైట్ ముద్ర లేని లేదా వారి పద్ధతులు-మార్గాలతో ఏకీభవించని ఇతర సంస్థలు-వ్యక్తుల కంటే తాము గొప్పవారమని అక్కడి అలాంటి సంస్థలు, వ్యక్తులు కూడా భావించరు. అక్కడ మావోయిస్టు-నక్సలైట్ ధారకు చెందినవారు అని పిలవబడే వారు కూడా ఇతర వామపక్ష సంస్థలను రివిజనిస్టులని అంటూ రేయింబవళ్లు దూషించరు లేదా అంబేడ్కర్ వాదులని అంటూ సంస్కరణవాదులని, లేదా బూర్జువా అని అంటూ తమ నుండి దూరం చేసుకోరు. ఈ విషయం సాయిబాబా అంతిమ వీడ్కోలులో కూడా కనిపించింది. తమతమ సంస్థాగత-సైద్ధాంతిక గుర్తింపులతో నిలబడి కూడా, ప్రజలు ఆయనను తమ సొంత మనిషిగా, పూర్తిగా తమవాడిగా భావించి అంతిమ వీడ్కోలు పలికారు.

బహుశా దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, అక్కడ భూమిపై పోరాటం జరుగుతోంది, క్షేత్రస్థాయి పోరాటాలలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు, అందరికీ అందరి అవసరం ఉంది, అందరూ పోరాటాలలో సహచరులే. భావజాలంలో, విశ్లేషణలో, పంథా విషయంలో, దిశ విషయంలో, వ్యూహం, ఎత్తుగడల విషయంలో విభేదాలు ఉన్నాయి, చర్చలు-వాదనలు ఉన్నాయి, తీవ్రమైన సైద్ధాంతిక పోరాటం ఉంది, కానీ క్షేత్రస్థాయి పోరాటాలలో ఒక ఉమ్మడి లక్ష్యం ఉంది, ఇది లోతైన స్థాయిలో అందరినీ కలుపుతోంది. అందరూ ఒకరికొకరు అవసరం, ఒకే స్వప్నం అందరినీ కలుపుతుంది. శత్రువుల దాడి నుండి రక్షించుకోవడానికి అందరికీ ఒకరి సహకారం మరొకరికి అవసరం. బహుశా, సాయిబాబా వారిని కలిపే ఒక వారధిగా కూడా ఉండి ఉండవచ్చు. ఏదేమైనా, వారందరూ సాయిబాబాను తమ సొంత మనిషిగా భావించి అంతిమ వీడ్కోలు పలికారు.

సాయిబాబాకు అంతిమ వీడ్కోలు పలకడానికి వచ్చిన ప్రజలు కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఉన్నప్పటికీ, అక్కడ భారతదేశం మొత్తం కనిపించింది. అన్ని సామాజిక-వర్గ-జెండర్, భాషా, ప్రాంతీయ సమూహాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ప్రతి వయస్సు, ప్రతి రూపం-రంగు, ప్రతి యాస-మాండలికం, వస్త్రధారణ గల ప్రజలు ఉన్నారు. అందరికీ ప్రాతినిధ్యం వహించిన, అందరి కోసం పోరాడిన ఒక వ్యక్తికి వారు అంతిమ వీడ్కోలు పలకడానికి వచ్చినట్లుగా అనిపించింది.

సాయిబాబా వ్యక్తిగత పోరాటం, ఆయన విజయాలు కూడా లోలోపల ప్రజలకు లోతైన స్థాయిలో ప్రేరణనిస్తున్నాయి. ఒక భూమిలేని, దళిత కుటుంబంలో, సుదూర గ్రామంలో జన్మించిన 90 శాతం శారీరక వైకల్యం ఉన్న వ్యక్తి, తాను కోరుకున్నదంతా వ్యక్తిగతంగా సాధిస్తాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి కూలీ చేసి బిడ్డను చదివిస్తుంది. ఆ బిడ్డ పాకుకుంటూ బడికి వెళ్తాడు, విశ్వవిద్యాలయ విద్య పూర్తి చేస్తాడు, పీహెచ్‌డీ చేస్తాడు, దేశంలోని పేరుగాంచిన విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడు (ప్రొఫెసర్) అవుతాడు. ప్రపంచంలోని జ్ఞానం-విజ్ఞానాన్ని తనలో ఇముడ్చుకుంటాడు.

వ్యక్తిగత విజయాలను తన వ్యక్తిగత ఉన్నతికి, సుఖానికి, పదవి పొందడానికి సాధనంగా ఉపయోగించుకోలేదు. తాను సాధించినదంతా ప్రపంచాన్ని అందంగా మార్చడానికి అంకితం చేస్తాడు. ఏ వ్యక్తిని అయితే రాజ్యవ్యవస్థ భయపెట్టలేకపోయిందో, ఎవరి ధైర్యాన్ని అణచివేయలేకపోయిందో, ఎవరి ఉత్తమ మెదడు పని చేయకుండా ఆపడానికి పది సంవత్సరాలు జైలులో ఉంచింది. ఆయనకు ఉరిశిక్ష వేయలేకపోయింది, కానీ చంపడానికి అన్ని మార్గాలూ ఉపయోగించి, చివరికి చంపేసింది. అయినా ఆయన చావలేదు, లక్షలాది మంది కళ్ళలో సజీవంగా నిలిచాడు, వారి హృదయాలలో స్పందించడం మొదలుపెట్టాడు, వారి స్వప్నాలలో జీవించడం ప్రారంభించాడు. మరణించిన కొద్ది గంటలకే ఆయన కళ్ళు మరొకరికి జీవం ఇవ్వడానికి ఇచ్చేసారు. మరణానంతరం ఆయన కళ్ళు మరొక వ్యక్తికి లేదా ఇద్దరు వ్యక్తులకు కళ్లుగా మారినప్పటికీ, సాయిబాబా ఆలోచనల కళ్ళు, ఆయన గుండె చప్పుళ్లు లక్షలాది మంది ప్రజల కళ్ళుగా మారాయి, వారి హృదయాల స్పందనగా మారాయి.

సాయి బాబా జీవితం ఎంత గొప్పదో, ఆయన చివరి వీడ్కోలు కూడా అంతే అద్భుతంగా జరిగింది. జి.ఎన్.సాయి బాబాకు తుది వందనం. మీరు 21వ శతాబ్దపు భారతదేశానికి ఒక చిహ్నం అవుతారు.

Leave a Reply