జాలరి పదాలు

చేపలు కోసం వల అల్లినట్టు
సాగరం కోసం
రోజొక కొత్త పాట అల్లుతాడు
జాలరి

*
జాలరి కి కెరటాలు
మంచి దోస్తులు
తీర సముద్రాల మధ్య
వారధులవి!

*

సాగరం లోతెంతో
తెలియాలంటే
జాలరి తో మాటలు కలపాలి
వాళ్ళ పాటలు వినాలి

*

తనలో ఉప్పు ఎందుకు కలిసిందో
సముద్రం తో కాదు
జాలరి
చెమటను అడగాలి

*

జాగ్రత్తగా వింటే
సముద్ర ఘోషలో
జాలర్ల భార్యాపిల్లల
గుండె లయ వినిపిస్తుంది

*

తుపానుల జాడ కోసం
సాగర ఉపరితలంమ్మీద కంటే
ముందు జాలరి
లోగిలిలో వెతకాలి

*

జాలరి బతుకు వెతలు
మనకంటే బాగా
సముద్రానికి తెలుసు
జాలరి- సముద్రం తోబుట్టువులు

*

జాలరి బతుకు నావ
ఊగిసలాట సాగరానికి అర్థమైతే
ఎంత బాగుండు
ఆటుపోట్ల ను కడుపులోనే దాచుకునేది కదా!

*

వాళ్ళ ఆశ సాగరం
కలత ఆటుపోటు
నిదుర సుడి లోతు
మెలకువ బరువైన నిట్టూర్పు
జాలరి జీవితం సగం నావ
సగం తీరం…

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

2 thoughts on “జాలరి పదాలు

Leave a Reply