జంగు నడిపిన జనం కథలు

‘ప్రజలే చరిత్ర నిర్మాతలు’. వాళ్ల చెమటా నెత్తురూ కన్నీళ్లతో తడిసిన చరిత్ర కాలగర్భంలో కలిసిపోతున్నది. ఒకనాడు ఉజ్వలంగా వెలుగొందిన ప్రజల సంస్కృతి, చరిత్ర, పోరాటాలు అనామకంగా అంతరిస్తున్నయి. తర్వాత తరాలకు అందకుండా పోతున్నయి. అక్షరాలకు ఎక్కని ఏ చరిత్రదైనా ఇదే పరిస్థితి. అక్షరాలు అందని నాడు మన చరిత్ర మనం రాసుకోలేని పరిస్థితి ఉండె. కానీ, కాలం మారింది. భూమితో మాట్లాడే జనం చేతుల్లో అక్షరం మట్టిపూలై వికసించింది. భూమికోసం తండ్లాడి, కొట్లాడి, తిరగబడ్డ జనం త్యాగాలను చరిత్రగా నమోదు చేస్తున్నది. సంఘర్షణామయ జీవితంలోంచి వచ్చిన ఇట్యాల కిషన్ అక్షరాలను ప్రేమగా ముద్దాడిండు. ఆరో ఏటనే, తన పల్లెకు వచ్చిన అన్నల్ని చూసిండు. అప్పటికి లోకం తెలియకున్నా, లోలోపల ఓ ప్రశ్న ఉదయించింది. అది కాలంతోపాటే పెనుమంటలై విస్తరించింది. పుస్తకాలతో సోపతైనంక తన ఆలోచన విస్తృతమైంది. మౌనంగా ఉన్న పుస్తకాల పుటల్లో అతనికి మార్క్స్, లెనిన్, మావో, ఫూలే, అంబేద్కర్లు ఎదురయిండ్రు. ఈ విముక్తి దారుల వెలుగులో తనను తాను పుటం పెట్టుకున్నడు. తనలాంటి కోట్లాది మందికి బువ్వపెట్టే జనం గురించి ఆలోచించిండు. వాళ్ల బతుకుల్ని అధ్యయనం చేసిండు. ఈ భూమ్మీద నిలబడి తన నేలగురించీ, తన పూర్వీకుల వెతుకులాట, తండ్లాట గురించీ కలవరించిండు. పలవరించిండు. దీంతోనే ఆగిపోలేదు. తను పుట్టి పెరిగిన కనగర్తి ప్రజా పోరాటాల పురాగాయాల్ని అన్వేషించిండు. కనగర్తి చరిత్రను మలుపు తిప్పిన మట్టిమనుషుల్ని కలిసిండు. వాళ్లతో ఎడతెగని సంభాషణ చేసిండు. కనగర్తి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను సాలిరువాలు దున్నిండు. కిషన్ కు కామ్రేడ్ వీవీ అన్నట్టు, “మట్టిచేతులు నిన్ను మేధావిగా మలిస్తే, ఆ చేతులు కట్టిన రక్తగాయాలతో నున్వెవరిపై గేయాలు కట్టావని అడుగు” అనే ఎరుక ఉన్నది. అందుకే చెమట చిత్తడి జీవితం నుంచి, చిందిన నెత్తురులోంచి, ఒలికిన కన్నీళ్లలోంచి వచ్చిన మనుషుల పోరాటాలను కథలల్లి చరిత్రగా అందిస్తున్నడు. తన ఊరి ప్రజల పోరాటాలను తలుచుకోవడం అతనికి ఒట్టి నాస్టాల్జియా కాదు. భవిష్యత్ లో ఆ పోరాట పునాదుల్లోంచి నిర్మాణమయ్యే ‘జైత్రయాత్ర’లపై అచంచల నమ్మకం ఉన్నది. అట్లనే విధ్వంసమయిన వర్తమానం గురించి దిగులూ ఉన్నది. మనుషులు కూలిపోతున్న దృశ్యాలు అతనిలో కల్లోలం రేపుతున్నయి. ఈ పదమూడు కథల్లో కేంద్ర బిందువు భూమే. దీనిచుట్టూ అనేకానేక పొరలు పొరలుగా విస్తరిస్తూ కథలల్లిండు. తెలంగాణ జీవభాషల రాస్తున్న కిషన్ కు అక్షరాలను ఎట్లా మలచాలనే ఒడుపున్నది. ఈ కథలు చదువుతుంటే నాగలి సాళ్లలో పారాడే ఆరుద్రపూవులా అక్షరాల వెంట సాగిపోతం. ఒక్కోచోట, ఒక్కసారిగా నవ్వుల జడివానల తడుస్తం. మరో చోట, పాలకోసం గుక్కపట్టి ఏడ్చే పసిపిల్లల్లా కన్నీళ్లు ఉబికొస్తయి. ఇది అతడు ఎంచుకున్న శైలి. శిల్పం. దృక్పథం. ఇందులోని పది కథలు ‘కొలిమి’ వెబ్ పత్రికలో ప్రచురితమైనయి. మరికొన్ని కథలతో కలిపి ‘ధరణి’గా మన చేతుల్లోకి వస్తున్నది. ప్రజా పోరాటాలను ప్రేమించే ప్రతిఒక్కరూ చదవాల్సిన కథలివి. జంగు నడిపిన జనం కథలివి. రండి… జనం పాటల్లోకి. జనం బాటల్లోకి.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ); సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు). ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Reply