చెఱబాపే చినుకు కోసం…

మీ ఊర్లో
నువ్వో కాంతిపుంజం…
నా గేరిలో
నేనో వెలుగు రేఖను…

చుట్టూతా అన్నీ
బూడిద రాల్చిన ఉల్కలే…

నెర్రెలుబారిన
ఈ నేలుంది చూడూ
దగాపడ్డా
దశాబ్దాల దాహార్తి కోసం
మొగులుకే
కళ్లప్పగించి కాపలా కాస్తూ…

వొలస పేగుల
దోసిళ్ళ నెత్తిపట్టి
చెఱబాపే
చినుకు కోసం…

జాగ్నేకి రాతై
జాడలేని బిడ్డలకోసం
ఏళ్లకేళ్ల ఎడతెగని
ఎదురుచూపుల తల్లై …

వాని కోసం…
వాన కోసం…

కొలిమి తేజంతో
కుండపోతై వొస్తాడో…
ఉక్కపోతల చిక్కి
కురువని మేఘమై వాల్తాడో…

పొలమారి
పెదాలు పిడచగట్టి
పాదాలు పగుళ్లిచ్చినా
నేతనునమ్మని పాలమూరు
నిఘా సడలనిదే…

జగడాల వేళాయె గానీ
చెరబట్టుకు పోయిన
జలాల వలపోత
జగమెరిగిన సత్యమే…

తరలిపోతున్న
ఆ మబ్బుల మందకైనా
దడిగట్టలేమా…
వడి చేర్చలేమా…

* * *

ఫక్కున పలగొట్టాలె…

ముప్పై ఏండ్ల కింద
ముట్టుకోనియ్యని
వూర బోరింగు కాడ
కరుణగల్ల సేతులకోసం
కండ్లల్ల వొత్తులేసుకొని
కాసి కాసి కండ్లు కాయగాసే

పొద్దు నడినెత్తి కొచ్చె
వొల్లంత చక్కరొచ్చే
తెగిపడ్డ అరటిమట్టతీరు
పెయ్యంత సినిగె…

గొంతు తడవక
గోడాడుతుండంగ
పరమాత్మ వోలె
దోసిట్ల నీళ్లయి

దూపదీర్చి
సటికె నింపిన
ఆ యవ్వలేదు..

బొరుసూడవోతె
ఎగిరెగిరిపడ్డ
హేండీలేమాయెనో..
ఇనుప డబ్బయ్యి
బోడి బొక్కెక్కిరిచ్చే

గుటక నీటితో
నిలిచిన పానం
పలక బెండుగ వట్టి
ఎదురీదుకుంట
పట్నానికొస్తే
జైలుఖానయ్యి
కొలువు
నన్నొడిసిపట్టే..

లాగిలాగి కూపి
పలక ఇడువాని
ఈత మరువాని
జోరీగ నాదాల
హితబోధ రొదబెట్టె..

దూపతీర్చిన బోరులేదు
సేదిపోసిన సీతవ్వ లేదు

నా పల్లె కుతికె కొరికినదిది
దయ్యమా… రాజ్యమా…

పటేలు పడగోలే
బుస్సంటు బుసగొట్టి
కరడుగట్టిన ఖానూనయ్యె
వాని తోబుట్టు నేనంటు…

తరుముతూ తరుముతూ
నావెంట పడుతూ…
బందీ ఖానయ్యి సకిలించె
బెయిలెందుకంటూ…

ఇప్పుడు జవాబు జెప్పాలె…
ఔను ఇప్పుడు
పల్లెలు మింగిన
ఈ నగరం నడిబొడ్డున
మాయిముంతను
ఫక్కున పలగొట్టాలె…

ఎగుడుదిగుడుల
యమ పాశమైపోయిన
భూమిభూమంతా
బద్దలయ్యేట్లు
గొంతు పేల్చాలె…
నేనేంటో… నేనెటో… !!??

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

One thought on “చెఱబాపే చినుకు కోసం…

  1. రెండు కవిత మంచిగున్నయి..రెండో కయిత తెలంగాణ గోస..తెలంగాణ మట్టి భాష..చాలా బావుంది. ఇక్బాల్ అన్న కవిత్వానికో ప్రత్యేక శిల్పం ఉంది..విమర్శకులు ఈ కవిని పట్టుకోవాలి..

Leave a Reply