మిడ్కో అంటే గోండు భాషలో మిణుగురు పురుగు అట. అంటే చీకట్లో మెరిసే ఒక ప్రాణి. ఒక నక్షత్రం. ఒక ప్రాణి తాను చీకటిలో మెరిసి వెలుగుచూపే ఒక ప్రకృతి నిర్మాణం విచిత్రమైనది. అద్భుతమైనది. గాలిలో అడవిలో ముఖ్యంగా చీకట్లో చూసినపుడు కాని దీని విశిష్టత అర్ధంకాదు. అట్లే ఒక ఆరిద్ర పురుగుంది. మృగశిర కార్తె రాగానే పొలాల్లో బిలబిల వచ్చే కుంకుమపువ్వు వంటి ఒక పురుగు. నిజానికి మిణుగురునూ ఆరిద్రనూ పువ్వులు అనాలి అనిపిస్తుంది కాని పురుగులు అనాలి అని అనిపించదు. ఈ అనిపించకపోవడం కూడ ఒక పురుష దృష్టి కావచ్చు. ఎందుకంటే పురుగు కూడ మనిషివలె ఒక ప్రాణి అయినపుడు మనిషి సమానంగా గౌరవించని మరొక ప్రాణిని పురుగువలె చూడటం. బహుశా ఒక ఆధిపత్య భావజాలానికి సూచన. దానికి తోడు మిడ్కో గోండు భాష అని చెప్పడంలోనే అది అడవిలోని మిణుగురు అని, అక్కడ ఆదివాసులకు కాల క్రమంలో జీవన పోరాటంలో నిప్పురాజేయడం నేర్చుకున్న జకుముకి తమతో పాటే భూమ్మీదకు వచ్చిన మిణుగురు తప్ప వెలుగునీడల్లో వేడి వెలుగు ఇచ్చే సాధనాలు ఇంకేమీ లేవు.
అయితే ఈ మిడ్కో మైదాన ప్రాంతంనుంచి మధ్యతరగతి విద్యాగంధం నుంచి చైతన్య పూర్వకంగా తన కులాన్ని, వర్గాన్ని కోల్పోతూ అడవిమీద పరుచుకున్న అణచివేత పీడనలనే చీకట్లను తొలిగించడానికి తన దేహాన్ని ఒక రాజకీయ ఆయుధంగా చేసి ఏమైనా చేయగలనా అని లక్ష్యంతో కథా రచయిత్రి పెట్టుకున్న పేరని ఈ సంకలనం చదివితే మనకు అర్ధం అవుతుంది.
ఇటువంటి ఉపోద్ఘాతం లేకుండానే ‘మెట్లమీద’ కథ ద్వారా తెలుగు పాఠకులకు తెలుసు. ఒక దశాబ్దన్నరగా తెలుగు కథపట్ల పెరిగిన ఓ ఉద్యమాసక్తి నేపథ్యంలో ‘మెట్లమీద’ కథ కథాభిమానుల్లో చాలా చర్చను రేకెత్తించింది. విప్లవోద్యమంలోని నిలకడ, ఊగిసలాట వంటి మానసిక స్థితుల చిత్రణ నేపథ్యంలో విప్లవోద్యమంలో కూడ చాల చర్చకు గురైంది. ఆ వివరాల్లోకి మళ్లీ వెళదాం.
ఈ సంకలనంలో 1994 నుంచి 2006 వరకు అంటే 12సంవత్సరాల కాలంలో రాసిన 18 కథలున్నాయి. పద్దెనిమిది పర్వాల భారతం పన్నెండు సంవత్సరాల అరణ్యవాసమే కానక్కర్లేదు. కాని శాంతి పర్వంలోకి ప్రయాణం మాత్రం ఆది సభాయుద్ధ పర్వాలనుంచి అరణ్య అజ్ఞాత జీవితాలు గడవకుండా ముగియదు. కథ మాత్రం ఏమిటి, ఒక సంక్లిష్ట మానవ అంతరఅరణ్యాలు బాహిరమైదానాలు గడిచి మనకు అజ్ఞాతమైన విషయం కథద్వారా వ్యక్తమైనట్టు అనిపించడమే.
సగటున సంవత్సరానికి ఒకటిన్నర మించని కథ రాసిన ఈ రచయిత్రిని స్లో రైటర్ అని అనవచ్చును. లేదా తన క్రమ పరిణతిలో గడిచివచ్చిన దశలో ఒక్కొక్క దశను ఆకళింపు చేసుకుని అందులో తాను ఇమిడి, ఒక విశ్వాసాన్ని పొంది మనకు విడమరిచి చెప్పడానికి తీసుకున్న సమయం అని చెప్పవచ్చు. ఏమైనా ఈ నిదానము, ఈ పరిశీలన అద్భుతమైన సంవిధానంగల కథలు రావడానికి అవసరమేనని చదివిన పాఠకులు అనుభూతి చెంది తీరుతారు.
మొత్తంగా చూసినపుడు ఈ కథలన్నింటా పరుచుకున్నది ఒక చైతన్యం గల స్త్రీ దృక్పథం. ఒక మహిళ వ్యక్తిగా వ్యక్తిత్వంగల తన స్థానంలో నిలబడి తన చుట్టు వున్న వ్యక్తులను, పరిసరాలను, పరిస్థితులను చూసి అర్ధంచేసుకుని వ్యాఖ్యానించి మార్చే ప్రయత్నం చేసి, మార్పు అనివార్యం అనుకున్నపుడు ఆ మార్పులో పాల్గొని అందులో విజయం సాధించిన సందర్భాలే మొత్తం. ఆ విజయాలు మిడ్కో పాత్రల జీవిత వైశాల్యాలను బట్టి ఎదుర్కొన్న సవాళ్లను బట్టి వైయ్యక్తిక అశ్వాసం, తృప్తి, వికాసం, నిర్ణయంతో మొదలై గుణాత్మకమైన విజయాలుగాను సాముహిక విజయాలుగాను మిగలవచ్చు. అట్లే మధ్యతరగతి స్త్రీ అన్నపుడు పుట్టుకవల్లనే తప్ప క్రమంగా ఆమె జెండర్ పక్షపాతంతోనూ వర్గపక్షపాతంతోనూ మార్క్సిస్ట్ ఫెమినిస్టుగా మారిన క్రమం కూడ ఈ కథల్లో కనిపిస్తుంది.
ఈ కథలన్ని స్త్రీ పాత్ర కేంద్రమైనవే. భావాలు ఆలోచనలు సమస్యలు సంఘటనలు నిర్ణయాలు అన్ని ఆమె గురించి, ఆమె చుట్టు, ఆమె వలన, ఆమె కోసం సాధ్యమయ్యి బహుశా కొన్ని చోట్ల సాధ్యంకాక జరిగినవే. ఆశ్చర్యంగా ‘మెట్లమీద’ కథ ఒక్కటే పురుష పాత్ర కేంద్రంగా నాయకునిలోని భావఘర్షణను చిత్రించిన కథ.
ఈ కథలకు స్థూలంగా మూడు దశలున్నాయి అని చెప్పవచ్చు. మొదటిది స్త్రీ వాద దృష్టి స్త్రీ కి కూడ ఒక మనసు వుంది దానిని ఆలోచించనివ్వండి, అనుభూతి చెందనివ్వండి’ అని గురజాడ, చలం కాలాలనుంచి ఇప్పటిదాకా విస్తరిస్తూ పోతూవున్న దృష్టి, వ్యక్తీకరణలో వచ్చిన సౌకర్యం వల్ల సౌలభ్యం వల్ల ఇది సమాజంలో విద్యావంతులైన మధ్యతరగతికి అబ్బింది. తెలంగాణ నుంచి వచ్చినప్పటికీ రైతాంగ పోరాట అనంతర తరం కావడంవల్ల పోరాట ప్రాంతకుటుంబ నేపథ్యం వల్ల ఒక విద్యావంతురాలైన మధ్యతరగతి చైతన్య మహిళ మనకీ కథలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. వస్తువు మారిన చోటకూడ వేరువేరు పేర్లతో మిడ్కోయే మనకు వీటిలో కథానాయిక అనిపిస్తుంది. ఆమె తన నోట మనకీ కథలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల శిల్ప దృష్ట్యా కూడ ఈ కథలకు ప్రామాణికత వస్తుంది. స్వానుభవం కాని పెక్కుచోట్ల కూడ ఇది రచయితకు తెలియని విషయం కాదనేంత విశ్వసనీయతను పొందుతుంది.
రెండవ దశ విప్లవోద్యమానికి సన్నిహితమయ్యే క్రమంలో లేదా విప్లవోద్యమం పరిచయం పెరిగిన క్రమంలో శ్రామిక వర్గంతో మమేకమయ్యే, తన ప్రాంతాన్నీ కులాన్నీ వర్గాన్నీ రద్దుచేసుకొని ఘర్షణ పడుతూ పోరాడే అణగారిన వర్గాల స్త్రీలతో మమేకమయ్యే దశ.
మూడవ దశ పట్టణ జీవితంనుంచి ప్రారంభమై క్రమంగా పల్లెజీవితంలోకి పల్లెవాసుల జీవితంలోకి ఊరునుంచి వాడ జీవితంలోకి ప్రవేశించి అక్కడినుంచి ఇంకా ఆదివాసి జీవితంలోకి ప్రవేశించి వాళ్లతో మమేకమయ్యే స్థితి. బహుశా ఆమె మొదటిసారి తనకు మిడ్కో అనే పేరు ఎంచుకున్నప్పటినుంచి ‘తుపాకులు గుంజుకోండ్రి బిడ్డా’ అనే కథ రాసేనాటికి ఆమె ఈ లక్ష్యానికి చేరువైంది.
ఇంకొక ప్రత్యేకత ఈ కథల్లో కథ చెప్తున్నది ఒక యువతి అని మనకు అర్ధం అవుతున్నా చాలా కథల్లో ఆమె అమ్మ మనసును ఆవిష్కరించాడానికి ప్రయత్నం చేసింది. విడ్డూరపు మనిషి, అమ్మకోసం, పురిటినొప్పులే నయం, అమ్మమనసు, బొందజూడనైతి, ఈ శ్లోకం ఎందరిది, జోలపాట, ఇద్దరు తల్లులు, చివరకు మగ ప్రపంచం కూడ అమ్మమనసును ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే. ‘బొందజూడనైతి’ కథను అంకితం చేస్తూ మా తాతయ్య బొంద చూడలేకపోయిన మా అమ్మమ్మకి…, ‘ఈ శోకం ఎందరిది’ అనే కథను అంకితం చేస్తూ నేను ‘మెట్లమీద’ కథ రాసినపుడు కృష్ణక్క చెప్పిందని నాకు ముద్దుపెట్టి నా ముద్దును మరో కథకు రిజర్వు చేసుకుంటున్నానని చెప్పి ఆ బాకీ తీర్చకుండానే కళ్లుమూసిన విజయక్కకు ప్రేమతో అని అంకితమిస్తుంది. అయితే ఈ సందర్భాలెక్కడా అమ్మ భావన మనకు అనూచానంగా వస్తున్న ఒక పవిత్ర మాతృత్వ సంకెల కాదు. అమ్మ కావడంవల్ల ఒక మహిళ వ్యక్తిత్వం సమాజంలో ఎదుర్కొనే ఒక పరిపూర్ణ సంక్లిష్ట సవాలు దృష్టితో ఈ కథలున్నాయి. ఇందులోని పాత్రలకైనా ఈ రచయిత్రికైనా చివరకు మల్లమ్మ మనువరాలుకైనా ఇందులో అమ్మలు, అమ్మమ్మలు వ్యక్తిత్వంగల స్నేహితులుగా కనిపిస్తారు.
వ్యక్తిత్వం ప్రస్తావన వచ్చింది కనుక ఇందులో ప్రతి కథ మహిళ వ్యక్తిత్వ ఆవిష్కరణయే. విడ్డూరపు మనిషి మొదలుకొని అనిత, ఆమె వ్యక్తిత్వం కథల వరకు ఆమె వివిధ సందర్భాలనుంచి వివిధకోణాల నుంచి వివిధ జీవిత దశలనుంచి ఈ వ్యక్తిత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నంచేసింది.
చలం, రంగనాయకమ్మల తరువాత రెండున్నర దశాబ్దాలుగా స్త్రీవాద సాహిత్యం బలమైన గొంతుతో స్త్రీ శరీరమే ఒక రాజకీయం అనే దృక్పథంతో స్పృశించని కోణంలేదు కనుక అటువంటి స్త్రీవాద కథా సాహిత్యంలో మిడ్కో ఒక ప్రముఖమైన స్థానాన్ని ఈ కథల ద్వారా తప్పకుండా పొందుతుందని విశ్వసిస్తూ ఆమెవంటి ఇద్దరు ముగ్గురే రాసిన, రాయగలిగిన కథలగురించి మాత్రం ప్రత్యేకించి ప్రస్తావిస్తాను. అటువంటి కథలు ఆమె ఇందులో 98నుంచి రాస్తున్నట్టుగా కనిపిస్తుంది. ‘ఆమె వ్యక్తిత్వం’ చదివితే ఈ కథ విప్లవోద్యమంలో క్రియాశీలమైన పాత్ర నిర్వహించి విరసంలోనూ విప్లవ మహిళా ఉద్యమ నిర్మాణంలోనూ ఓ కీలక పాత్ర వహించి అమరురాలైన కామ్రేడ్ పద్మ పేరున కనిపిస్తుంది.
పద్మగా పద్మక్కగా విప్లవాభిమానులకూ అందరికీ తెలిసిన పద్మ కర్నూలు జిల్లాలో వరంగల్, కరీంనగర్ రాడికల్ విద్యార్థి నిర్మాణంనుంచి వెళ్లి విప్లవోద్యమం నిర్మాణం చేసిన లింగమూర్తి (శంకర్) సహచర్యంలో విరసంలోకి వచ్చి తానే రాయలసీమలో మహిళా ఉద్యమ నిర్మాణానికి దారివేసిన పద్మ ఇచ్చిన చైతన్యంతో ఈ కథలోని వసంత వ్యక్తిత్వం క్రమంగా వికసించి ఒక దృఢ నిర్ణయం తీసుకొవడానికి దోహదం చేస్తుంది.
‘ఇద్దరు తల్లులు’ చాల ఆర్ద్రమైన కథ. గొప్ప కథ. రమ ఆ ఊళ్లోకి వచ్చి టీచర్ పనిచేస్తున్నది. ఆమెకు అక్కడ ఎవరితో చెప్పుకోలేని ఎంతో విలువైన ప్రేమ సాహచర్యం ఉన్నది. ఆ సహచరుడు అజ్ఞాతంలో వున్నాడు. ఆ ఊరివాడలో అడివమ్మకు ఒక కొడుకున్నాడు. ఆయన అడవిలో వున్నాడు. ఈ ఇద్దరికి ఆ ఇద్దరికి ఏమయ్యేది, ఏం అయ్యింది తెలియదు. తెలిస్తే పత్రికల్లో వచ్చే ఏదైనా దుర్వార్త వల్లే తెలియాలి. అడివమ్మకు పత్రిక రాదు, చదువరాదు. చదువువచ్చి పత్రికవచ్చే రమతో పరిచయం అయ్యింది. విప్పిన కొద్దీ పొరలుపొరలుగా విచ్చుకునే ఈ కథలో అడివమ్మ కొడుకు యాదగిరిలో రమ తన వేణును చూసుకున్నదా అడివమ్మలో తన కన్నతల్లిని చూసుకున్నదా ఏమయితేనేమి కథ ముగిసేవరకు యాదగిరి ఎన్ కౌంటర్ అయ్యిండని తనకు మాత్రమే తెలిసిన రమ అడివమ్మ గుడిసెలో ఈ అమ్మకు నేను బిడ్డనయితా అని దృఢ నిర్ణయం తీసుకుంది. బహుశా తరువాతి ఆఖరు చరణంలో ఆమె అడివమ్మ తల్లికూడ అయ్యిందేమో. ఈ కథంతా మన హృదయాన్ని పట్టుకునే ఆర్తి సాంద్రతవల్ల వస్తువు ఎంత భిన్నమైందైనా కాళీపట్నం రామారావుగారి ‘ఆర్తి’ కథను తలపిస్తుంది.
‘ప్రవాహం’, ‘మెట్లమీద’ రెండు విప్లవోద్యమంలోకి వెళ్లి ఎంతోమందిని విప్లవోద్యమంలోకి పురిగొల్పి తాము నిల్వలేకపోయిన పురుష పాత్రల గురించి ఒక్కసారి విప్లవంలోకి వచ్చిన తరువాత దృఢనిర్ణయంతో కొనసాగే స్త్రీల దృష్టితో రాసిన కథలు. ప్రవాహం కథలో వరలక్ష్మికి విప్లవంలో అట్లా నిలబడటానికి నేపథ్యం అయిన ఒక జీవితంవుంది. మేనబావను ప్రేమించింది. కాని ఒక త్రాష్ట్రునితో పెళ్ళయింది. బావ దినదినము ఉద్యమాల్లో ఎదుగుతూ తనను ఆ సంకెళ్లనుంచి విడిపించాడు. ఆ క్రమంలోనే తాను స్వీకరించాడు. అతడు పెరుగుతున్న నిర్బంధంలో అజ్ఞాతంలోకి వెళ్లక తప్పనప్పుడు కొద్ది కాలానికి తానుకూడ వెళ్లింది. కాని ఈ క్రమం అంతా ఇది తన బావచేసిన సహాయంగా కాక విప్లవోద్యమం చేసిన సహాయంగా ఆమెకు అనుభవం ద్వారా తెలిసివచ్చింది. అందుకే ఏవో కొన్ని కారణాలవల్ల బావ ఉద్యమంలో నిలబడక వెళ్ళిపోతానన్నప్పుడు ఆమెకూడ అతని వెంట రానన్నది. కారణం ఆమెకు అప్పటికే ఆయనకోసమే విప్లవంలోకి రాలేదని అర్థమైపోయింది. విప్లవంకోసమే వచ్చానని స్పష్టమైపోయింది. తానొక నీటి చుక్కగానే ప్రవాహంలోకి రావచ్చుగాని ఇప్పుడు తాను ప్రవాహం. తానే ప్రవాహమని కాదు, తాను ప్రవాహంలో వుంది. ఒడ్డున పడిన చేప కాదల్చుకోలేదు. ఈ కథలో నాయకుడు తన సహచరిపై ఇంకా ఒక హక్కు కొల్పోని సహచరుడిగా సెంటిమెంట్ను కూడ వాడుకో ప్రయత్నించాడు. కాని బయటకు పోవల్సివచ్చిన స్థితికి సంబంధించిన ఘర్షణ లేదు.
‘మెట్లమీద’ కథ ఆ గ్రామంలో చిరకాలం ఎన్నో ప్రజాఉద్యమాల్లో పనిచేసి ఎందరినో విప్లవోద్యమంలోకి తీసుకెళ్లి ఆ ప్రాంతాన్నే ప్రభావితం చేసిన ఒక విప్లవ నాయకుడు మళ్లీ మామూలు జీవితంలోకి వచ్చి ఘర్షణకు లోనైన కథ. అతడు మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. విప్లవ చైతన్యంతో తన సమవయస్కుడైన తమ జీతగాని కొడుకును కూడ విప్లవంలోకి తీసుకపోయినవాడు. విప్లవంలో ఒక క్రమంలో పెరిగిన భార్యబిడ్డల అనుబంధంతో బయటకు వచ్చాడు. తన చెల్లెలి వివాహ సమస్యను విప్లవోద్యమమే పరిష్కరించింది. విడాకులిప్పించింది. తాను తిరిగి వచ్చేవరకు ఆ చెల్లె తల్లీ పొరుగూరులో వుండే తన అక్క కూతురు అందరూ విప్లవోద్యమంలో భాగం అయ్యారని, తిరిగివచ్చిన తనకు తన ఇంట్లో ఒక అసంబద్ధత ఏర్పడిందని, తన చెల్లెలు విప్లవోద్యమ నాయకుని సహచర్యంతో అజ్ఞాతంలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నదని అందుకు తల్లి కూడ ప్రోత్సహిస్తుందని తెలుసుకునే క్రమంలో తాను మెట్లు ఎక్కివచ్చినట్టా, దిగివచ్చినట్టా అని శేష ప్రశ్న దగ్గర నిలబడ్డాడు. ఐసనైస్టీన్ బ్యాటిల్షిప్ పోటమ్కిన్ అనే సినిమాలో మెట్లమీంచి ఒక చెంబు దొర్లే దృశ్యం వుంటుంది. ఆ ప్రతీక గురించి ఎంత సాహిత్యం వచ్చిందో. మనకు కూడ ఆకాశంబున నుండి గంగ పాతాళందాక ప్రవహించే పోలికల ప్రస్తావన వుంటుంది. అయితే మిడ్కో అటువంటి చివరి తీర్పు చెప్పదు కాని మనకు సానుభూతిని, పాత్రకే తనమీద తనకు ఒక అసంతృప్తిని మిగులుస్తుంది. అయితే తల్లి కూతుళ్ల పరిణామంలో పరిణతిలో నిర్ణయంలో ఒక భావ ఘర్షణకైనా అవకాశంలేని నల్లేరుమీది బండినడక మీద కొంత చర్చ జరిగింది. ఇందులోని రవీందర్ పాత్ర వంటి గట్టయ్య పాత్ర నాయకుడుగా అల్లం రాజయ్య ‘వసంత గీతం’ అనే నవలే రాసాడు. అందులో గట్టయ్య మళ్ళీ విప్లవంలోకి అనివార్యంగా వెళ్లే స్థితి ఒకటొస్తుంది. ఏ తల్లి, వదినలు అసహాయులనుకొని ఆయన బయటకువచ్చాడో వాళ్లప్పటికే విప్లవోద్యమంతో సంబంధంలో వున్నారని తెలిసి ఆశ్చర్యపోతాడు.
సమాజ సంబంధాల, ఉత్పత్తి సంబంధాల ఘర్షణల అవగాహన లేకుండా సమర్థులైన వ్యక్తులుగా మనం సహాయం చేసి మన దృష్టిలో అసహాయులనుకుంటున్న వాళ్లను ఉద్దరించాలనే ప్రయత్నాన్ని గత దాదాపు ముఫ్ఫై సంవత్సరాల విప్లవోద్యమం గమనిస్తునేవుంది. ఇవాళ అది తెలంగాణ, పలనాడు వంటి ప్రాంతాల్లో ఒక గ్రామీణ వాస్తవికత అయ్యింది. అందులో ఎన్ని గెలుపు ఓటములైనా ఉండవచ్చు. ఆవేశపు పరుగులు, నిర్బంధపు నిశ్శబ్దాలు, చిత్రహింసల లొంగుబాట్లు కొండొకచో ప్రలోభాలు విద్రోహాలు వుండవచ్చు. ఏమైనా గత మూడు దశబ్దాలుగా విప్లవోద్యమం తెలుగు ప్రజల జీవన ప్రధాన స్రవంతి అయ్యింది. ఈ ప్రవాహం ఎండిపోయిన సందర్భాలువున్నాయి. ఇసుక కూడ తోడేసిన సందర్భాలు వున్నాయి. కాని ఉత్తర దక్షిణాలలో ప్రవహించినపుడు, ఎండిపోయినపుడు, వరదలైనపుడు చెత్తాచెదారం కొట్టుకవచ్చినపుడు తేటనీరై నోటికి అందివచ్చినపుడు వీటికి ఆ శాశ్వతమైన పేర్లు మిగిలే వున్నాయి. ప్రాణహిత కావచ్చు మంజీర కావచ్చు మానేరు కావచ్చు వంశధార నాగావళులు కావచ్చు పెన్నేరు పాపాఘ్నులు కావచ్చు అన్నిటినీ కలుపుకున్న కృష్ణా గోదావరులు కావచ్చు. ఇవి అన్ని రుతువుల్లోను ఆ
పేర్లతోనే పిలవబడతాయి. అవి కలిసేచోట ఎన్నటికీ ఇంకిపోని లోతుతెలియని గంభీర అగాధ సముద్రాలే. అప్పటిదాకానే మనం మెట్లమీద. దిగినా సరే ఎక్కినా సరే. ఒక నేల నిజం. ఒక నీరు నిజం. ఒక నింగి నిజం. వీటిపై పరుచుకునే వెలుగు చీకట్లు కూడ నిజమే. ‘ఏ రాత్రీ ఉషస్సుతో ముగియనిది లేదు’.
‘బొందజూడనైతి’, ‘జోలపాట’ మూడున్నర దశాబ్దాలుగా సాగుతున్న ఎన్కౌంటర్ల పరంపరలు, అమరుల మృతదేహల స్వాధీనం దగ్గరనుంచి అమరుల బంధుమిత్రుల సంఘీభావం దాక ఎదిగివచ్చిన ఒక ఉద్యమానికి సంబంధించిన కథలు, తన కొడుకు ఎక్కడో అడవిలో ఎన్ కౌంటర్ అయితే అక్కడకు వెళ్ళడం కష్టమై తీరా వెళ్లేవరకు అతని మృతదేహాన్ని పోలీసులే కాల్చి వేసి ఎక్కడ కాల్చి వేసారో కూడ చెప్పనపుడు బూడిద తెచ్చుకోలేకపోవడమే కాదు, కొడుకు శాశ్వత నిద్ర పోతున్న స్థలాన్నైనా చూడలేని బాధ, ఆ స్థలాన్ని చూసి బతికున్ననాటి తన కొడుకు జ్ఞాపకాల స్పర్శననుభవించాలని బాధ. ఎందరి తల్లులదో ఎందరి తండ్రులదో. తన తాతయ్య బొందచూడలేక పొయ్యానని అమ్మమ్మ తలపోతనీ తమ ఆప్తుల చివరి చూపు చూసుకోలేని ఎందరో ప్రజానీకపు పోరాటంలో ఆమెకు అర్ధం అయ్యింది.
లాటిన్ అమెరికాలో శ్రీలంకలో నేపాల్లో తల్లులుగా సహచరులుగా సంఘాలుగా ఏర్పడి తమవాళ్ల మృతదేహాలకోసం చేసిన పోరాటాలు, హైదరాబాద్ నగరం పీపుల్స్ వార్ కార్యదర్శి రామేశ్వర్ అతని సహచరులు మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లో ఎన్ కౌంటర్ అయినపుడు ప్రారంభమైన మృతదేహాల స్వాధీనాల ఉద్యమం ఇప్పుడు అమరుల బంధుమిత్రుల సంఘం మృతదేహాల స్వాధీనం కొరకు, గౌరవప్రదమైన అంత్యక్రియలకొరకు మాత్రమే కాదు వాళ్ల ఆశయాలను శాశ్వత జ్ఞాపకాలుగా నిలిపి కొనసాగించాలనే ప్రయత్నం ఈ రెండు కథలకీ ఊపిరిపోసింది. బొందజూడనైతి కథలో అమ్మమ్మ గాని, జోలపాటలో అవ్వగాని ఒక ప్రత్యేక ప్రాంతపు గ్రామానికి చెందిన ప్రత్యేక పాత్రలుగా కనిపించవచ్చుగాని, ఇవాళ తెలంగాణ రాయలసీను పలనాడు ఉత్తరాంధ్రలో విప్లవోద్యమంలో తమవారిని ఎన్ కౌంటర్లో కోల్పోయిన ఎవరి అనుభవాలైనా కావచ్చు. 1985 నుంచి 2005 వరకు ఒక ఇరవైఏళ్లలో వచ్చిన ఒక పరిణామానికి ఈ రెండు కథలు రెండు ప్రాతినిధ్య స్వభావం కలవి. ఎన్ కౌంటర్ చేసిన మృతదేహాలను ఇవ్వకపోవడం, పోలీసులు తామే తగలబెట్టడం, కడచూపు లేకపోవడం, వాళ్ల జ్ఞాపకాలుగా స్థూపాలు నిలుపుకుంటే కుల్చేసి దీపాలు పెట్టుకుంటే ఆర్పేయడం 1985నాటి స్థితి. 2004 శాంతి చర్చల సందర్భంలో ఒక సంవత్సరం పాటు మళ్ళీ ఆరిద్ర పురుగుల్లాగ గ్రామాల్లో మృతవీరుల స్థూపాలు వెలిసినాయి. మొగిలిచర్ల స్థూపంతో మొదలై హైదరాబాద్ నగరం దాకా తమ అమరుల శాశ్వత జ్ఞాపక చిహ్నాలు వెలిసినవి. ఇది ఈ వాక్యం రాసినంత సులభంగా జరిగిన పని కాదు. ఇందుకు అమరుల బంధుమిత్రులు, అమరులను ప్రేమించిన ప్రజలు జీవన్మరణ పోరాటాలు చేయవలసి వచ్చింది. ఒక పురిటి నొప్పుల అనుభవం, చంపేసిన స్థలానికి చేరుకునే ప్రయత్నం దగ్గరనుంచి అంటే మిడ్కో ‘బొందనైన జూడకపోతి’ అనే తీరని కోరికను తీర్చుకునే ప్రయత్నం దగ్గరనుంచి ఆ కోల్పోయిన బిడ్డను మళ్లీ పొంది జోలపాట పాడిన అనుభూతి చెందినంత వరకు ఇది ఒక రక్తసిక్తమైన పోరాటబాట. నిజానికి ఈ రెండు కథలు కలిపితే అమరత్వానికి నిర్వచనం. ఠాగూర్ చెప్పిన జననం-మృత్యువు లేదా మృత్యువు -జననం శిశువుకు తల్లి మార్చే స్థన్యము అని గ్రహించే గతితార్కిక జీవన సత్యాన్ని ఈ రెండు కథలు ఆవిష్కరిస్తున్నాయి.
ఈ శోకం ఎందరిది, ఒక ప్రత్యేకమైన మమకారం సమాజ చైతన్యంగా మారే క్రమం. ఒక తల్లి ఒక ఎన్ కౌంటర్ వార్త వింటుంది. ఆ ఎన్ కౌంటర్ అయ్యింది తన కొడుకే అనుకుంటుంది. అట్లాగే చెప్తారు. తన బిడ్డ శిశువు చిత్ర నిద్రలో కన్న కలల దగ్గరినుంచి అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయేదాక ఎన్నెన్నో తలపోతలతో దుఃఖంతో అక్కడకు వెళుతుంది. ఒక విధంగా కళ్లముందర కనిపిస్తున్న ముగిసిన ఒక జీవితానికి సంబంధించిన దుఃఖం అంతా ఈ క్రమంలో అనుభవిస్తుంది. తీరా వెళితే ఎన్కౌంటర్ అయ్యింది తన కొడుకు కాదు. అయితే మాత్రం ఏమి ఒక తల్లి కొడుకే కదా. ఏ పాడు కలలో ఏ తల్లి పేగు కదిలిందో, ఆ ఒక్క తల్లే కాదు అక్కడకు వచ్చిన ప్రజలందరు తమ కొడుకే అని తెలియకరాని తల్లులయ్యారు ఆ సన్నివేశంలో. ఒకరిని ఎన్కౌంటర్ చేశామని మిఠాయిలు పంచుకున్న పోలీసులకు ఆ సామూహిక శోకం పెనుధిక్కారం అయ్యింది. మిడ్కోకు ఈ కథ రాయడానికి 2003 మార్చి 30న ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో పోలీసులు చుట్టుముట్టి కాల్చి చంపిన అమరురాలైన దమయంతి ప్రేరణ కావచ్చుకాని అమరుల బంధుమిత్రులలో మాత్రమేకాదు విప్లవోద్యమంలో తమవాళ్లున్న ప్రతిఒక్కరికి ఇది తమ కథే. పీడిత పోరాట ప్రజలందరికీ ఇది తమ కథే.
తుపాకులు గుంజుకోండ్రి బిడ్డా ఎంతో సూటి అయిన గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చే కథ. ఈ కథ చదువుతూ వుంటే శాంతి చర్చల కాలంలో ఒక రాత్రంతా కోరాపుట్ దాడి గురించి కళ్లకు కట్టినట్టు వివరించిన వడుపూర్ చంద్రమౌళి చెప్తున్న విషయాలు వింటున్నట్లే వుంది. ఈ కథకు కోరాపుట్ దాడిలో పాల్గొన్న వీర గెరిల్లాలు ప్రేరణగా నిలిచారని మిడ్కో చెప్పింది. ఒరిస్సాలోని కోరాపుట్ పట్టణంలో ఆయుధాగారంపై, పోలీస్టేషన్పై దాడిచేసి విప్లవకారుల నాయకత్వంలో వందలాది మంది ప్రజలు వందలాది ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గొంగళ్ళలో దుప్పట్లలో ఆయుధాలు మూటగట్టుకొని పోయారు. ఒక్కొక్కరు రెండు మూడు మాత్రమే కాదు తాము మోయగలిగినన్ని ఆయుధాలు మోసుకపోయారు. ఆకలిగొన్నవారు అన్నం దొరికితే మూటకట్టుకున్నంత ఆబతో ఆయుధాలను తమ అక్కున చేర్చుకున్నారు. ఎందుకిట్లా చేశారు. ఆయుధం తమకేమిస్తుంది? ఆయుధం తమకేమిస్తుందో తమవెంట నలబై ఏళ్లుగా సాయుధులైన విప్లవకారులతో వారు గ్రహించారు. కాని అంతకన్న ఆస్తి, అధికారం, ఆయుధం వున్నందువల్ల శత్రువు తమనెంత అణచివేసి అవమానం పాలుచేసి అమానవీయమైన చిత్రహింసలకు గురిచేస్తున్నాడో కొన్ని తరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ కథలో తుపాకులు గుంజుకోండ్రి బిడ్డా అని ఆ పట్టణంలో గుమిగూడిన ఎందరికో తన ఈ చిత్రహింసల అనుభవాలు చెప్పింది. అధికారానికి, రాజ్యానికి, అణచివేతకు, పీడనకు తనకు సంకేతంగా కనిపించిన యూనిఫారాల్లో వున్న పోలీసులను చూసి వాళ్లను ఇయ్యర మయ్యర కొట్టింది. తాను అసహాయంగా వున్నప్పుడు వాళ్ల దాష్టీకాన్ని తలచుకొని వాళ్లు అసహాయంగా దొరికిన అరుదైన సందర్భాన్ని చేజారి పోనివ్వలేదు. చైనా విప్లవకాలపు బుగతగాడి మాంసం కథలో వలె తన చేతికి చిక్కిన ఈ రాజ్యాన్ని ఇంక ధ్వంసం చేయకుండ వదలవద్దని నిర్ణయించుకుంది. ఇందుకు ప్రజలు సాయుధం కావడమే స్పష్టమైన మార్గం అని ఆమెకు స్పష్టంగా అర్ధంఅయ్యింది.
ఐలమ్మల కడుపుతీపి కసిగా మారటానికి కారణమయిన ఈ వ్యవస్థ రద్దుకావాలంటే ఐలమ్మల చేతుల్లోకి ఆయుధాలు రావాలి. ఆ దృశ్యం చూసిన పద్మ కళ్లలో నుంచి స్వచ్ఛమైన కన్నీళ్లు రాలినట్లుగానే మనకీ కథలు మన స్వార్థాన్నీ భయాన్నీ తుడిచేసే స్వచ్ఛమైన అనుభూతులుగా నిలుస్తాయి.
ఇంత చెప్పిన తరువాత ఈ కథల్లోని సంవిధాన శిల్పం గురించి చెప్పనక్కర్లేదనుకుంటా. ఒక సంఘటననుంచి ఒక ప్రాచీన జ్ఞాపకంలోకి, ఒక తరం అనుభవంలోకి కథను తీసుకపోవడం, రెండు పాత్రలలో ఒక పాత్ర ఆలోచనలకు, చర్యలకు స్వభావ రీత్యా వాళ్ల వాళ్ల ఉనికి చైతన్యాల రీత్యా మరొక పాత్ర ఆలోచనలను చర్యలను చిత్రించడం, ఫ్లాష్ బ్యాక్ నిర్వహణ, కథా కథనం భావఘర్షణ ఇవన్నీ ఒక చెయితిరిగిన కథా రచయిత సంవిధానంలో తప్ప సాధ్యమయ్యేవి కావు. అయితే ఇటువంటి కథలు రాయగలవాళ్లు ఇవాళ తెలుగు సాహిత్యంలో ఎందరో రచయితలు ఉన్నారు కాని విప్లవ కథ అంటే ఒక మూస, ఒక పడికట్టు పద్ధతి, పరిభాష అనే అపోహలు తొలిగి అది జీవితం అది ఉన్నతీకరింపబడిన జీవితం అది నిజానికి ఇవాల్టి కథ మాత్రమే కాదు అగాధమైన గాథ, అది తవ్వినకొద్దీ మట్టి నుంచి పరిమళాలు విరజిమ్మే సారం అని ఈ కథలు చదివితే మనకు అవగతం అవుతుంది. అటువంటి అడవిలోని అందాలు చూపే గాలికి ఈ మిడ్కో తన మిణుగురులతో మనకు వెలుగునిస్తున్నది. మనం చిమ్మ చీకటి అనుకున్నదాంట్లో ఒక పాలపుంత వుంది. సూర్యచంద్రులు లేని అమావాస్యలోనూ చుక్కల వెలుగు ఉంటుంది. చూడగలగాలి. అంతే.
హైదరాబాద్
15/12/2007