చాప కింద నీరులా ఫాసిజం

రచయిత  డి.రమేష్ పట్నాయక్  “ఫాసిజం అంటే ఏమిటి?ఫాసిజాన్ని ఎలా ఎదుర్కోవాలి?”అనే పుస్తకంలో ఫాసిజం గురించి చారిత్రకంగా వివరించారు. ఎంతో అధ్యయనం, నిబద్ధత, మార్పు కోసం ఉద్వేగంతో వెలువరించిన ఈ రచన లో  రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇటలీ జర్మనీలో తలెత్తిన ఫాసిజం, నాజీజాలకు  పోలికలు , తేడాలు , భారత్ లో ఫాసిజం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి వ్యతిరేక పోరులో కనీస తక్షణ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.

చరిత్రలో ఇటాలియన్ ఫాసిజం దేశ ఐక్యత పేరుతో జాతీయ దురహంకారాన్ని పెంచింది.ముస్సోలిని ప్రతిపక్షాలను ,కార్మిక సంఘాలను రద్దు చేసి శ్రామిక వర్గాల, వలస ప్రజలపై దేశీయ, విదేశీయుల యూదులపై తీవ్ర దమనకాండ సాగించాడు. జర్మనీ నాజీజం విషయంలో యూదు వ్యతిరేకతకు, భారత్లో నేడు పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకత ను పోల్చవచ్చు .కార్పొరేట్ గులాం గిరిలో రెండింటికి పోలికలు ఉన్నాయి. హిట్లర్ తెచ్చిన నాజీజం కార్మికులను , యూదులను, పేద, మధ్య తరగతి రైతులు, కూలీలను పాలకవర్గంలోని ఇతర విభాగాలను అణిచివేసింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత లేక హిట్లర్ ప్రాబల్యం పెరిగింది. మిత్ర రాజ్యాలు, ప్రధానంగా సోవియట్ యూనియన్ పోరాటం, త్యాగాల వల్ల ఇటాలియన్ ఫాసిజం,హిట్లర్ నాజీజం అంతమయ్యాయి.

భారత్ విషయానికి వస్తే జాతీయ భావనను పెట్టుబడిదారీ వర్గం మార్కెట్, సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం వాడితే ,కార్మిక వర్గం జాతి ఐక్యతకు అంతర్జాతీయ సహకారానికి వాడుతుంది. జాతికి ప్రాదేశికతతో పాటు భాషా సంస్కృతులు మూలం. పలు ఉద్యమాల వల్ల వచ్చిన ఆధునిక విలువలపై ఆధారపడిన సామాజిక ఒడంబడిక ద్వారా జాతి ఏర్పాటు అయింది. భారత్ బహుళ భాషా జాతుల రాజ్యం. విశాల భారత్ లో భాషా జాతులను గుర్తించకుంటే సమాఖ్య వాదానికి, అధికార వికేంద్రీకరణకు అర్థం ఉండదు. అయితే ఆ భాషా జాతి సైతం అంతర్గతంగా, బయట కూడా ప్రజాస్వామ్యం పాటించాలి.

ఈ నాడు మతపరంగా జాతి గురించి మాట్లాడటం చారిత్రకంగా సరైనది కాదు. జాతితో సంబంధం ఉన్నది ప్రాంతం, భాష మాత్రమే. భారతదేశ ఔన్నత్యం భాషా సంస్కృతి వైవిధ్యంలో, దాని వెనుకబాటుతనం కులాల, లింగపర అసమానతల, వివక్షలో ఉంది. అన్ని మతోన్మాదాలు హానికరమే అయినా మెజారిటీ మతోన్మాదం, మనువాదమే ఫాసిజం.

హిందుత్వ వాదులు మైనారిటీలను శత్రువులుగా చూసి అన్ని రకాల అసమానతలను సమర్థి స్తున్నారు. హిందువులు అల్పసంఖ్యాకులు అయ్యే ప్రమాదంలో ఉన్నారని, బాధితులని, లౌకికవాదం అంటే మైనారిటీల బుజ్జగింపు అని ప్రచారం చేశారు. మీడియాతో సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై అదుపు సాధించారు. ఈ ప్రచారాన్ని నమ్మిన జనం ‘ఇతరుల’పై హింసను, నియంతృత్వాన్ని ఆహ్వానిస్తారు. దీన్ని మతోన్మాద, మనువాద అంటే సంఘపరివార్ నిజ స్వభావం అర్థం అవుతుంది. ఫాసిస్టులు రాజకీయ సమీకరణకు మతాన్ని ఏకశిలా సదృశ్యంగా కుదిస్తున్నారు. రచయిత రొమిల్లా థాపర్, సతీష్ చంద్ర మొదలగు చరిత్రకారులను ఉటంకిస్తూ ఫాసిజం గురించి రాశారు.

భారతదేశంలో ఫాసిజం శ్రామిక వర్గాలను ,నిరుద్యోగులను మహిళల హక్కులను శాస్త్రీయ దృక్పథాన్ని హేతువాదాన్ని అణిచివేసి గతం వైపుకు తీసుకెళ్తుంది. 11వ శతాబ్దిలో తొలిసారి సింధూ నది తూర్పు ప్రాంత జనానికి ఆల్బెరుని వాడిన హిందువు అనే పదాన్ని ఒక మతానికి కుదించారు. సనాతనమంటే సింధు నాగరికత (క్రీస్తుపూర్వం 4000- 5000 సంవత్సరాల కిందట) లేక వేద కాలం నుంచి (క్రీస్తుపూర్వం 1500 -1000) లేక తర్వాత అనే దాని గురించి స్పష్టత లేదు.

ఇస్లాం ప్రభావం వల్ల బ్రాహ్మణాధిపత్యం దెబ్బతిని, భక్తీ ఉద్యమాలు పెరిగి వర్ణ వివక్ష బలహీనమైన హేతువు వల్ల మనువాదులకు మైనారిటీ ముస్లిం వ్యతిరేకత. 90 శాతంగా ఉన్న శూద్రులు, దళితులు, బహుజనులు అసమానతలకు లోనవుతున్నారు. రచయిత దృష్టి ప్రకారం ‘హిందూ సాంస్కృతిక జాతీయవాదం’ అనే ఆమోద సూచక పదం కాకుండా ‘మనువాద సాంస్కృతిక జాతీయవాదం’ అనే పదం వాడాలి.

భారత్ లో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు , విద్యారంగా కాషాయీకరణ కరణ చేసి ,అన్ని రాజ్యాంగ వ్యవస్థలను పాలకపార్టీ అదుపులో పెట్టుకుంది. ఈ బూర్జువా వ్యవస్థలో ప్రజాస్వామ్యం పెట్టుబడిదారుల మధ్య పోటీ , ప్రజల ఒత్తిడి వల్ల వీలైనంత లాంఛన ప్రాయ ప్రజాస్వామ్యం ఉంటుంది .సామ్రాజ్యవాద దేశాల్లో కూడా ఇదే సత్యం. ఫాసిజానికి, నియంతృత్వానికి తేడా ఉంది. మెజారిటీ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే నిరంకుశ పార్టీ ఫాసిస్టు పార్టీ . ఫాసిజం నిరంతరాయం కాదు .అది ఓడినా దాని పదార్థక కారణాలు కొనసాగుతాయి. భాజపా అప్రతిహత విజయం వల్ల ఎన్నికల రద్దు అవ్వచ్చు. ఒకవేళ ఉన్నా ఏకపక్షం అవుతాయి . ఇక్కడ ఫాసిజం మతోన్మాద , మనువాద లక్షణాలు కలిగి ఉంది. నేడు విప్లవ పరిస్థితి లేకున్నా ఇది వచ్చింది. ఇక్కడ ఫాసిజా నికి జర్మనీ , ఇటలీలలో లాగా ‘సూపర్ మాన్’ మీద ఆధారితం కాక సంఘ పరివారం అండ దండగా సాగుతుంది.

భాజపా పాలనలో, కాంగ్రెస్ పాలనలో వలె కాక తీవ్రంగా, అసాధారణ కార్పొరేట్ దోపిడీ – సంక్షేమ ఉపాధి పథకాలపై ఖర్చు తగ్గింపు ,కార్పొరేట్ సంస్థలకు నిధులు, కార్పొరేట్ సంస్థల మధ్య ప్రయోజనాల అసమాన పంపిణీ కొనసాగుతోంది. పాలక వర్గం కార్మిక, గిరిజనుల హక్కులు , పర్యావరణం నాశనం చేస్తూ రైతుల భూములను కార్పొరేట్ పరం చేస్తోంది. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రంగా మారింది. రుణం తీసుకున్న కార్మికుడు రుణదాత దగ్గర బానిసగా అయితే, ఆ రుణదాతకు ప్రభుత్వం మద్దతు ఇచ్చి సంక్షేమ ఉపాధి పథకాలు దెబ్బతిని ,నిర్బంధశ్రమ చట్టబద్ధం అయితే నయా బానిసీకరణం వచ్చినట్టే . అదానీ లాంటి వారి ప్రాబల్యం పెరిగి ఉద్యోగ రహిత ఆర్థిక వృద్ధి సాగుతోంది. సేవారంగం అంటే కేవలం ఐ టీ విద్యా, వైద్య రంగాలు మాత్రమే కాక క్షవరశాలలు , బ్యూటీ క్లినిక్ లు, పిల్లల ,వృద్ధులు రక్షణ కేంద్రాలు, హోటళ్ళు ,టూరిజం మొదలగునవి కూడా దాని లోకి వస్తాయి. తయారీ రంగంలో లాభం శాతం పడిపోయినందున పెట్టుబడి సేవా రంగాలకు తరలి దాని విస్తరణలో శారీరక దోపిడీ పెరిగే అవకాశం ఎక్కువ. దీనిలో బాధపడేది అధో జగత్ ప్రజలు మాత్రమే .

ఫాసిస్టు ఉన్మాదం శిఖరాగ్ర స్థాయికి చేరి సకల రంగాల్ల కార్పొరేటీకరణ కోసం భౌతిక నిర్బంధం అత్యంత తీవ్రం కావచ్చు. లేదా పాలకవర్గం ఫాసిజాన్ని ఏకైక మార్గంగా చూడకుండా సంక్షేమ పథకాల ద్వారా ప్రజా తిరుగుబాటును తప్పించుకోవచ్చు. పెట్టుబడిదారుల్లో ఒక చిన్న వర్గం, ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం మాత్రమే ఫాసిజాన్నీ ,దాని పెరుగుదలను కోరుతోంది.

ఈ నాడు భారత్ లో ఫాసిజం ద్వారా మార్కెట్లో విస్తరణ సాధ్యం కాదు. సంఘటిత, అసంఘటిత కార్మికుల పని గంటలు పెంచడం ద్వారా దోపిడీ పెరుగుతుంది. గొలుసు దుకాణాల్లో లాగా ఒకరితోనే పలు పనులు చేయిస్తారు లేదా కార్మికుల సంఖ్యను తగ్గించి దోపిడీ తీవ్రత పెంచవచ్చు .ఫాసిజాన్ని అర్థం చేసుకోవడానికి పాలక, పీడత వర్గాలలోని అంతర్గత వైరుధ్యాలను కూడా అర్థం చేసుకోవాలి.కేవలం శ్రమ పెట్టుబడి వైరుధ్యం మాత్రమే చూస్తే విప్లవ అవకాశాలు పెరుగుతున్నట్లు భావించి , విప్లవమే ఏకైక మార్గమని అనుకుంటారు. కానీ ఆ పరిస్థితులు లేనందున గందరగోళం ఏర్పడి మిత లేదా అతి అవకాశవాదం వస్తాయి .

కార్పొరేట్ శక్తులు రైతాంగాన్ని ఎరువులు పురుగుమందులు, విత్తనాలపై ఏకస్వామ్య ధరలకు అమ్ముతూ, ఉత్పత్తులు కారుచౌక గా కొనడం ద్వారా దెబ్బ తీస్తూ, వారిని ఆత్మహత్యల పాలు చేస్తున్నాయి.ఫాసిజాన్ని నిరోధించేందుకు సంఘటిత కార్మిక వర్గం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక వాదం వీడాలి. కార్మికులు గ్రామీణ రైతాంగం, కూలీలు , నిరుద్యోగులు సంఘటితం
అవ్వాలి.దళిత , బహుజన, మైనారిటీలను ముఖ్యంగా స్త్రీలు , మధ్యతరగతిని గెలుచుకొని, అవకాశవాద నేతలను ఎండగడుతూ అన్ని సెక్షనల్ ఉద్యమాలను సామాజికీకరించాలి. రాజకీయకరణ చేయాలి. విశాల సాంస్కృతిక ఉద్యమం నడపాలి. ప్రజల మధ్య తేడాలను పాలకవర్గం వాడుకోకుండా చూడాలి.

నేటి పరిస్థితుల్లో సంక్షేమ రాజ్యం కోసం అన్ని వామపక్షాలు ప్రజాస్వామిక , లౌకిక, సమాఖ్య శక్తుల చొరవ అవసరం.ఎన్నికల వల్ల సోషలిజం రాదు గాని, ఫాసిజం వచ్చే అవకాశం ఉంది. వామపక్షాలు ఎన్నికల బహిష్కరణ లేదా కేవలం సిద్ధాంత ప్రచారం లేదా తమ సంస్థని బలోపేతం చేయటం కోసమే కాక ఎన్నికల్లోగెలవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వామ పక్షాల
సొంత బలం పెంచుకుంటూ సిద్ధం కావాలి. సంక్షేమ రాజ్య అనుగుణంగా కనీస తక్షణ కార్యక్రమంలో ప్రకృతి వనరుల పరిమిత ఉపయోగం ;వారానికి 35 నుంచి 48 పని గంటలు ;ప్రభుత్వ సంస్థల రక్షణ ;భూ సేకరణ వల్ల భూమి పోయిన రైతులకు పరిహారం; చిన్న తరహా పరిశ్రమలకు సౌకర్యాలు రక్షణ; గ్రామాల చిన్న పట్నాల అభివృద్ధి ;కనీస అవసరాలు తీరేటట్లు అనాథ మహిళలు, బాలలు వృద్ధులకు ఆశ్రమాలు; ఉన్నత ఆదాయ వర్గంపై ప్రత్యక్ష పన్నులు; చట్టబద్ధ పాలన; శరీర దోపిడీ నిషేధం ; సమాఖ్య విధానం పునరుద్ధరణ; రాజ్య వివిధ అంగాల మధ్య అధికార వికేంద్రీకరణ మొదలగువాటికి నడుం కట్టాలి.

అయితే రచయిత పేర్కొన్నట్లు వ్యవస్థ రోగ నిర్ధారణ బాగానే ఉన్నా సమూల మార్పుకు తగు పరిస్థితి లేదనడం సరి కాదు. దేశంలో అసంతృప్తి అగ్నిపర్వతంలా ఉంది. దేశ భక్తి వల్లించే పార్టీ పాలనలో అవినీతి, పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ లు పెరుగుతున్నాయి. ఫలితమే డిజిటల్ నైపుణ్యం ఉన్న యువ “బొద్దింకలు” మార్పుకు ముందుకు వచ్చారు. అన్ని శ్రామిక వర్గాలలో, పీడిత కులాల్లో పెరుగుతున్న ప్రతిఘటన నిర్మూలనకే ఫాసిజం దూసుకు వస్తోంది. ప్రజాస్వామ్యబద్ధ ప్రతి పక్షాలను కూడా సహించడం లేదు. నవ తరాన్ని అర్థం చేసుకుని స్వీయాత్మక బలాన్ని పెంచుకుని సమూల మార్పుకు కృషి చేయాలి. ఎంత విప్లవ “ పరిస్థితి” ఉన్నా దానికి తగిన పార్టీ, పీడిత వర్గ ఐక్యత లేనిదే దోపిడీ వ్యవస్థ ఎన్నడూ మారదు. వామ పక్షాలకు స్వతంత్రంగా పెరగటానికి గొప్ప చారిత్రక మలుపు, అవకాశం ఇది. దానికి సామాజిక , సాంస్కృతిక,ఆత్మ గౌరవ ఉద్యమాలతో పాపులిస్టు రాజకీయాలు ఓడించి మహోదయానికి విజన్ మరల ఇవ్వాలి.

Leave a Reply