(రంగనాయకమ్మ కథ – మురళీ వాళ్ళమ్మ)
స్త్రీకి స్త్రీయే శత్రువు.
ఎంతకాలంగా వింటున్నాం ఆ మాట! నిజమేనా అది? నిజంలాగే అనిపిస్తుంది. కుటుంబంలో పోట్లాటలన్నీ ప్రధానంగా అత్తా కోడళ్ళ మధ్యనో, వదినా మరదళ్ళ నడుమనో జరుగుతాయి. కుటుంబానికి వెలుపల పురుషుడు ఏర్పరచుకునే లైంగిక సంబంధాలలో ఇద్దరు ఆడవాళ్ళు పరస్పరం శత్రువులై హత్యలకో, ఆత్మహత్యలకో పాల్పడతారు. ఈ ఆడవాళ్ళ కొట్లాటల నడుమ ‘నలిగి’ పోతూ సమాజం నుండి పుష్కలమైన సానుభూతిని పొందుతాడు పురుషుడు. తరతరాలుగా పునరావృతమవుతున్న గాథ ఇది. ఇదంతా చూస్తుంటే ఆ సామెత నిజమనే ఎవరైనా నమ్ముతారు.
నిరంతరమైన ఈ ఘర్షణలో స్త్రీల వ్యక్తిత్వాలూ, సంస్కారాలూ ఎంత దిగజారి పోతున్నాయ్! అంతిమంగా పురుషుడు అనుమతించిన పరిథి లోనే తమ అస్తిత్వాలను కుదించుకుని బతకాల్సిన స్త్రీలు, ఒక సమూహంగా ఎంత బలహీన పడుతున్నారు! ఈ వలయం నుంచి, పితృస్వామిక కుటుంబం తనకు కేటాయించిన చట్రం నుంచి బయటపడి ఒక స్త్రీగా, అంతకన్నా ఎక్కువగా ఒక వ్యక్తిగా నిలబడిన స్వతంత్ర్య మహిళ కథ ‘మురళీ వాళ్ళమ్మ’. కొడుకు పక్షాన నిలబడే తల్లిగా కాకుండా న్యాయం వైపు నిలబడే వ్యక్తిత్వాన్ని సంతరించుకుని కోడలికి మద్దతుగా నిలిచిన రుక్మిణిని ఈ కథతో పరిచయం చేశారు రంగనాయకమ్మ.
భర్త నుండి ఏ ఆదరణా లేకపోయినా తనకూ, కొడుకుకూ మరొక దారిలేని ఆర్థిక పరాధీనతతో సంసారంలో సర్దుకుపోతున్న నిస్సహాయ రుక్మిణి. అతడు మరొక స్త్రీతో కూడా సంబంధాన్ని సాగిస్తూ, తనను సర్దుకుపొమ్మని ఆదేశించినప్పుడు మాత్రం ఆ సర్దుబాటు ఆమెకు సాధ్యం కాలేదు. అతడి నుండి దొరికే పోషణకన్నా ఆత్మాభిమానం ముఖ్యమని స్పృహ కలిగింది. పదమూడేళ్ళ కొడుకు, మురళి ఆమెను అర్థం చేసుకుని తోడుగా నిలబడ్డాడు. సంసారం నుంచి బయట పడిన తల్లీకొడుకులు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. తన రెక్కల కష్టంతో కొడుకును పోషించుకుని చదివించింది రుక్మిణి. మురళి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటానికి శ్రద్ధ తీసుకుంది. అతను సున్నితమైన భావాలు, సామాజిక బాధ్యత కలిగిన యువకుడిగా ఎదిగాడు. కులం పట్టింపులు లేకుండా భావాలు కలిసిన రజనిని ప్రేమవివాహం చేసుకున్నాడు. తన లక్ష్యం సాధించిన తృప్తి రుక్మిణికి దక్కింది. ఆ క్రమంలో ఆమె వ్యక్తిత్వం పదును తేలింది. ఆత్మగౌరవాన్ని మించిన విలువ లేదనే నిశ్చయం స్థిరపడింది.
సంతృప్తిగా సాగుతున్న జీవితంలో పదిహేడేళ్ల తర్వాత మరొక కల్లోలం చెలరేగింది. ఒకప్పుడు తను ఉండిన సమస్యలో ఇప్పుడు కోడలు రజని. అప్పుడు తన భర్త పోషించిన మోసపూరితమైన పాత్రలో ఇప్పుడు మురళి. అయితే, మారిన ఈ కాలవ్యవధిలో ఈ సమస్య రూపం మార్చుకున్నది. ఒకప్పుడు తన భర్త బాహాటంగా అతడి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. భార్య పరాధీనతను అలుసుగా తీసుకుని ఆమె జీవితాన్ని నిర్దేశించబోయాడు. తన ఎదుట జీవిత వాస్తవం పచ్చిగా నిలబడింది. తాడోపేడో తేల్చుకుని తీరాల్సిన అవసరం స్పష్టంగా ఎదురొచ్చింది.
ఇప్పుడు కొడుకు కుటుంబంలో పరిస్థితి మరొకరకమైనది. రజని ఆర్థికంగా స్వతంత్రురాలు. బతుకుదెరువు కోసం భర్తపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఐనా, ఆమెకన్నా పెద్ద ఉద్యోగంలో ఉన్న మురళి రకరకాల సౌకర్యాలు, విలాసాల పేరుతో ఆమెను ప్రలోభపెట్టటానికి ప్రయత్నించగలడు. భార్యను నిర్లక్ష్యం చేసి, అవమానపరుస్తూ కూడా ఆమెను సర్దుకుని బతకమని ఆదేశించటానికి భర్తగా తనకు అధికారం ఉన్నదని చెప్పిన మొరటుదనం తన భర్త ప్రయోగించినది. మురళి అలా చెప్పటం లేదు. అతడు అందుకున్న ఆర్థిక హోదా, దానికి అనుబంధంగా వచ్చిన కొత్త నాగరికత, స్వేచ్ఛ అనే అవకాశాలను వాడుకుంటూ భార్యను నోరెత్తలేని స్థితికి నెడుతున్నాడు. అన్ని కాలాల్లోనూ పురుషుడు ఈ అదనపు అవకాశాలను వాడుకుంటూనే ఉన్నాడు. కాకపోతే కొత్తతరం మగవాడు మరింత నైపుణ్యంతో ఈ పని చేస్తున్నాడు.
మురళికి తనపై మోజు పోయిందనీ మరొక స్త్రీతో సన్నిహితమైన సంబంధంలో ఉన్నాడనీ రజనికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అది ఆమెను బాధలోకి, కుంగుబాటులోకి నెడుతోంది. కానీ ఒకప్పుడు రుక్మిణి పరిష్కరించుకున్నట్టుగా రజని ఈ సమస్యను తేల్చుకోలేక పోతోంది. నిలదీసి అడిగితే తననొక అనాగరికురాలిగా, సంకుచిత మనస్కురాలిగా ముద్ర వేస్తారన్న భయం ఆమెను వెన్నాడుతోంది. ఆర్థికంగా స్వతంత్రురాలై కూడా కుటుంబ సంబంధాల్లోని ఈ సమస్యను పరిష్కరించుకోగల ఆత్మవిశ్వాసం ఆమెకు లేకుండాపోయింది.
రుక్మిణికి ఈ సందిగ్ధాలు లేవు. ఆమె చేసిన జీవన పోరాటం ఆమెకు నిక్కచ్చితనాన్ని నేర్పింది. కొడుకు మీద ఆగ్రహంతోబాటు, కోడలి లొంగుబాటుతనంపై అసహనం కలిగింది. తానిప్పుడు చేయాల్సింది ఏదో ఒకరకంగా కొడుకు కాపురాన్ని నిలబెట్టి కుటుంబ గౌరవాన్ని నిలుపుకోవటం కాదు, సాటి స్త్రీగా రజని వైపు నిలబడటం. తాను సంపాదించుకున్న ఆత్మగౌరవమనే విలువను తర్వాతి తరం స్త్రీకి అందించటం. రజనికి తాను నేర్పాల్సింది సర్దుబాటును కాదు సమస్య పరిష్కారాన్ని. రజని ఈ కుటుంబం నుండి బయటకు రావాలన్న నిర్ణయం తీసుకోవాలనుకుంటే తాను ఆమెతో ఉంటానని స్పష్టంగా ప్రకటించింది.
ఈ నిశ్చయానికి వచ్చిన రుక్మిణి అత్తగారి పాత్రను పక్కకు నెట్టింది. రజని కోడలి స్థానం నుంచి వెలుపలికి వచ్చి రుక్మిణితో తన బాధను పంచుకోగలిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కుటుంబ సంబంధాలకు అతీతమైన స్నేహబంధం లోకి ప్రవేశించారు.
ఈ పరిణామం మురళి ఊహించనిది. అతడు తడబడ్డాడు, భయపడ్డాడు, అపరాధభావనతో కన్నీళ్ళ పర్యంతమయ్యాడు. ఆ పశ్చాత్తాపం అతడిని నిజంగానే మార్చి వేస్తుందా? కొత్తగా అందిన అవకాశాలలోని సుఖాన్ని వదులుకునేందుకు సిద్ధపడ గలడా? కాలక్రమంలో తేలాల్సిన విషయాలివి. మురళి, అతడి వంటి పురుషులు ఏం చేస్తారనే దానితో సంబంధం లేకుండా రజని వంటి స్త్రీలు తమ జీవితాలను తమ చేతుల్లోకి తీసుకుని, తమకు తామే బాధ్యత వహించగల వ్యక్తులుగా మారగలుగుతారు. అందుకు మొదటి మెట్టు స్త్రీల నడుమ పరస్పర సహకారం, సహానుభూతి. పితృస్వామ్య కుటుంబ నిర్మాణం తమను ఏ చట్రాలలో కుదించి పరస్పర వైరుధ్యాలలోకి నెడుతున్నదోనన్న ఎరుక.