ఎర్రటి ఎండలు. ఏప్రిల్ నెల రెండో వారం. పట్టపగలు. మా ఆఫీసులో తిక్కతిక్కగా నేను. తల వెంట్రుకలలోకి ఒక చేతిని పోనిచ్చి కళ్ళు మూసుకొని దాదాపు టేబులుపై నా తలని వంచి ఆనించినట్లే నేను. కర్టెన్లు తీయడంతో గదినిండా బయటి నుంచి వచ్చిన వెలుతురు. గది అంతా మనుషులు నడవక పేపర్లు, రకరకాల సామాను వేసి తీసిన మొత్తు మొత్తు వాసన. వెనుక గదిలో చాయ్ పోయడం కోసం జరుగుతున్న ప్రయత్నపు కాంచు గ్లాసుల చప్పుడు.
నేను తలెత్తి చూసే సరికి నా ఎదురుగా కొంచెం దూరంగా గోడకి దగ్గరగా నిల్చోని దొడ్డు నలుపు రంగు గరం కోటు (స్వెట్టర్) వేసుకున్న మనిషి. నా దిక్కే చూస్తుండు. అతని కంటే నాకు ఇంకా దగ్గరగా ఆమె, ఆయన భార్య. కానీ నా దృష్టి మొదట అతని మీదే పడింది. పీరీలెత్తుకున్న దూదేకుల ఇమామ్ లెక్కనే కింద లుంగీ ఉంది. కానీ పైన అంతా దొడ్డు గరం కోటే సిత్రంగా అంత ఎండలో వేడిలో వేసుకోవడమేడం నా ప్రత్యేక దృష్టి అతని మీద పడడానికి కారణం.
నాకు మామూలుగా అయితే ఆ టైములో వాళ్ళని లోపలికి రానిచ్చినందుకు మా అటెండర్ ని తిక్కలేసి పొట్టు పొట్టు తిట్టే పరిస్థితి. కానీ వచ్చినవాళ్లు చూడగానే ఆదివాసీ రైతులు అని తెలిసిపోయి అలాంటి కోపం రాలేదు. సహజంగా ఆదివాసీలు ఏ పనున్నగాని ఆఫీసు లోపలికి, అదీ తహశీల్దార్ దగ్గరికి రారు. ఆఫీసు బయట చెట్ల కిందే వేచి ఉంటారు. పట్వారీ రాక కోసం చూస్తారు. కలుస్తారు. పోతారు. వారి పని ఎన్ని రోజులకు కాకున్నా అదే పరిస్థితి. ఒకవేళ అనుకోకుండా తహశీల్దార్ ఎదురుపడి ‘ఏం పని కోసం వచ్చిండ్రు?” అని అడిగిన కూడా పంతులును (పట్వారి) కలుసుకోడానికి వచ్చినం అని చెప్తారే తప్ప అసలు పని చెప్పరు. అటువంటిది వాళ్ళిద్దరూ లోపలి దాకా వచ్చిండ్రు అంటే ఏదో బాగా ఇబ్బంది పని ఉంటేనే వచ్చిండ్రని అర్థమైంది. ఐనా కాని మనం అడిగే వరకు వాళ్లు ఓపికగా అట్లనే ఉంటారనే నా అనుభవం. వాళ్ళని నేను నాకున్న ఆ టెన్షన్ లో వెంటనే పట్టించుకోలేదు.
ఆ సమయంలో నేను, నా స్టాఫ్ చాలా టెన్షన్ లో ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి అప్పటికింకా రెండు రోజులు కాలేదు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీనులు ( ఈవీఏం ) ఎక్కడైతే ట్రబుల్ ఇచ్చినయో అక్కడ మార్చిన జోనల్ ఆఫీసర్లు రిపోర్ట్ చేసిన మెషిన్ లకు, రిజర్వ్ లిస్ట్ కి లెక్క సరిగ్గా కలుస్తలేదు. ఎలెక్షన్స్ అంటే రాష్ట్రమంతా ఒక్క తీరు. మా దగ్గర ఒక తీరు. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా మా దగ్గర ఈవీఏంలతో ఎన్నికల నిర్వహణ అంతా ఈజీ కాదు. గుండాల అసొంటి కాడికి యాబై ఊర్లు దాటి ట్రాక్టర్ల మీద పోవాలి. మొవాడ్ అసొంటి ఊరికి నడుం లోతు వాగు నీళ్ళు దాటి పోవాలి. కొన్ని ఐతే నడిసేపోవుడు. అటువొంటి చోట మెషిన్ల సర్దుబాటు అంటే… జోనల్ ఆఫీసర్లకి ముందు అలాట్ చేసిన లిస్ట్ ప్రకారం వీలు కాకుంటె ఎట్లా అందుబాటు ఉంటే అట్లా టైమ్ కు మెషిన్ ల సర్దుబాటు చేయడం జరిగింది. అందుకే సమాచారం సరిగ్గా కలుస్తాలేదు. మూడు రోజులు సరిగా నిద్ర లేక లాస్ట్ రోజు సరిగ్గా రిపోర్ట్ చేయని జోనల్ ఆఫీసర్లు ఫోనులు స్విచ్చ్ ఆఫ్ చేసుకున్నారు. అసలే ఎలెక్షన్స్! ఏ కొంచెం సమాచారం తప్పు ఉన్నా నౌకరి పోయే కథ.
కలెక్టర్ సార్ పది నిమిషాలకోసారి ఫోన్ సేత్తండు. “ఏమైంది రిపోర్ట్, లెక్క కలిసిందా?” అని. మా కలెక్టర్ సర్ ఆదిలాబాద్ కలెక్టర్ కి, జెనరల్ అబ్జర్వర్ కి రిపోర్ట్ చేయాలి నిన్న సాయంత్రం వరకే. జనరల్ అబ్జర్వర్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ సీనియర్ ఐఏఎస్. చాలా స్ట్రిక్ట్, చాలా కోపం మనిషి. స్టేట్ లో ఎలెక్షన్ కమిషన్ కి ఏ రిపోర్ట్ ఐనా తానే ఫస్ట్ పంపాలనే ఆలోచన కల వ్యక్తి. కలెక్టర్ సార్ మా ఆర్డీవో ని వదిలిపెట్టిండు.
మా ఆర్డీవో చాలా కష్టపడ్డప్పటికి స్థానిక పరిస్థితులని పై ఆఫీసర్స్ ఎవరు అర్థం చేస్కుంటలేరు అని విరక్తి చెంది చేతులెత్తేసిండు. ఫోన్ స్విచ్చ్ ఆఫ్ చేస్కున్నడు.
“ఏమన్నా కానీ… మా అంటే సస్పెండ్ సేత్తరు. నాతో పాటు నిన్ను కూడా సేత్తరు. సేయనీ… సత్తమా మరి? అరే టైము ఇయ్యకుండా ఒకటే ఒత్తిడి చేస్తే ఎట్లా…? కలెక్టర్ సర్ మబ్బుల (ఎర్లి మార్నింగ్) ఫోన్ చేసి నన్ను తిట్టిన తిట్లు తిరిగి నిన్ను తిడితే నువ్వైతే ఏడుత్తవు తెలుసా?” అని నాతో ముఖమంతా చిన్నబుచ్చుకుని దాదాపు ఏడుపు గొంతుతో అన్నడు మా ఆర్డీవో సర్.
మా ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గములో పది మండలాల, పది మంది తహసీల్దార్స్ ఉండికూడా మా ఆర్డీవో సర్ వారితో సరిగ్గా పని చేయించక, సరిగా కో- ఆర్డినేట్ చేయకపోవడం వల్లే, కేవలం హెడ్ క్వార్టర్ తహశీల్దార్ అయినందుకు నేనే ఉన్న భారమంతా మోయాల్సి వస్తుందని నాకు కూడా మా ఆర్డీవో సార్ మీద కోపం, జాలి ఉన్నాయి. తను కూడా ఒక ఆదివాసీ.
నేను, మా సీనియర్ అసిస్టెంట్ సుమన్, గిర్ధావర్ నితిన్, డివిజన్ కంప్యూటర్ హైండ్ హోల్డింగ్ పర్సన్ రవికాంత్, ఇతర ఆపరేటర్స్ యాషీన్, సాయి మేమే చివరి వరకు మిగిలిన భాధ్యతాయుతమైన ఒక టీం. రాత పూత పెద్దగా రాకున్న ఇరవై ఏండ్లుగా పట్వారీ నౌకరిని తెలివిగా లాగుకొస్తున్న మా వీయార్వో హైమద్ కూడా మాతో పాటు ఉన్నడు మా బాధలో పాలు పంచుకునేందుకు ఆ రోజు. అన్నీ రిపోర్టింగ్ పేపర్స్ మొత్తం చెత్తలకెళ్ళి (అస్తవ్యస్తంగా వేసిపోయిండ్రు రిపోర్ట్స్ అందరూ బాధ్యతలేని వాళ్ళు) వెతికి చూసేవాళ్ళు ఇద్దరైతే, నేను నాతో లాజికల్ మైండ్ కల మా సుమన్ సీనియర్ ఆసిస్టంట్ సిస్టమ్ లో ఎంటర్ చేస్తుంటే డిస్కస్ చేస్తున్నాము. నేను ఏ కొంచెము ఇన్ఫర్మేషన్ ఆశాజనకంగా అనిపించి గట్టిగా ఊపిరి పిలిస్తే చాలు మా కంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న మా వీయార్వో హైమద్ నా కంటే ఎక్కువ ఆనందంగా ఫీల్ అయినట్లుగా “మిల్తే సాబ్! సబ్ కుచ్ అచ్చ హోతా. సబ్ కుచ్ అచ్చ హోతా. బిల్కుల్ ఫికర్ నహి హోతా…” అని గుండెలకాడికి రెండు చేతులు పట్టుకుని మాట్లాడుతుండు. ఆయన చూపంతా నా చూపులపైనే. నేను కంప్యూటర్ దిక్కు చూస్తూ ఏ కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టినా తన ముఖమంతా గాలి తీసిన వాలి బాల్ లెక్క పెట్టుకుంటాండు “సెత్తెరీ…” అనుకుంటా. అటు ఇటు తిరుక్కుంటా సేతులు పిసుక్కుంటూ చాయే, బిస్కట్, సమోస తెప్పిత్తండు. కానీ మేము ఎవరము వాటిని ముట్టే పరిస్థితిలో లేము. మళ్ళీ కలెక్టర్ సర్ ఫోన్. నాకు ఎత్తాలంటే ధైర్యము రావట్లేదు. ఒక చేతి వేళ్ళతో నా తల వెంట్రుకలని పీకుతూ ఇంకో చేత్తో టేబులు మీద గట్టిగా కొట్టిన నేను “షెట్…, నీ యవ్వా…” అందరూ ఒకరి మొఖాలు ఇంకొకరము చూసుకున్నాము.
“ఇంకొక పది నిమిషాలు ఇవ్వండి సార్. నేను సెట్ చేస్తాను” అని సుమన్ అన్నడు. కానీ నాకైతే నమ్మకము లేదు. నిద్రలేని కళ్ళు మంటలు మండుతున్నాయి. ఆకలి దూప లేదు. కళ్ళు మూసుకున్న గట్టిగా.
“ఇంగో సార్ మీరు పరేశాన్ కాకుండ్లి నన్ను పరేషన్ సేయకుండ్లి.” ఆ కొత్త గొంతు ఆమెదే ఆ ఆదివాసీ మహిళదే. కళ్ళు తెరిసి చూసిన ఈ గడబిడేమి లేనట్టు నిమ్మళంగా. మా హైమద్ అందుకున్నడు వెంటనే “నీ అవ్వ. ఈ లచ్చ్మికి (అటెండర్) భయము లేదు, మన్ను లేదు. నీకేమైనా దిమాక్ ఉందా (అటెండర్ దిక్కు చూస్కుంటు) అసలు. గిప్పుడు గీళ్లను లోపలికి రానిత్తవా?” అని తిడుతుండు.
వాళ్ళకి ఈ మాటలు అర్థమైనాయో లేదో తెలియదు. అట్లాగే లెక్క తెలియని ఎలెక్షన్స్ లాగే వీళ్ళ ముఖాలు.
ఆ ఆదివాసీ దిక్కు తిరిగి “ఏం పరేశాన్ అమ్మా! మేమే పెద్ద పరేశాన్ లో ఉంటే. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడిది? రెండొద్దులు కాలే ఎలక్షండ్లు అయి. ఒక నెలాగి రాపో. మా సేత్తమ్ గాని నీ పనేది ఉన్న.” పైన లక్ష్మీని తిట్టిన లొల్లిని కవర్ చేస్తూ అన్నాడు హైమద్.
నా నిస్సహాయతలో, నేనున్న పరిస్థితిలో ఆ మాత్రం బిగ్గర సంభాషణని భరించే స్థితిలో లేను. కాబట్టి కళ్ళతోనే తల ఊపుతూ ఆమెని కొద్దిసేపు ఉండమని చేతి సైగతోనే చెప్పిన. ఈ లోపు సుమన్ రిపోర్ట్ సరిచేసే పనిలో ఉన్నడు. యాషీన్, నితిన్ ఏవో పేపర్స్ చూయిస్తూ కలుస్తున్నాయన్నట్లు చిన్న ఆశని వ్యక్తం చేస్తున్నారు. నేను కళ్ళు మూసుకొని నా తలని కుర్చీకి వాల్చి వెనక్కి వాలిన.
అంతలోనే ప్రకాష్ రావు వచ్చిండు ఆఫీసుకి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సీనియర్ ఆసిస్టంట్ గా పదే౦డ్ల సర్వీసు ఉండంగానే మధ్యలోనే నౌకరీ పోగొట్టుకున్న ప్రకాష్ రావు. తాగకుండా ఉన్న మనిషిగా అతనిని ఎప్పుడు చూడము. సర్వీస్ బుక్ కానీ, పెన్షన్ కానీ లేని మనిషి. కుటుంబం కూడా పట్టింపు లేని, తనని కుటుంబం పట్టించుకోని మనిషి. సమాజం తనకి తనకి సమాజం కూడా అంతే. కానీ తనని చూస్తే గొప్ప మనిషి అనిపిస్తది నాకు. సబ్జెక్ట్ ఉన్న మనిషి. మాకు కానీ ఆర్డీవో ఆఫీసులో కానీ కోర్టు కేసులల్లో కౌంటర్స్ ఆయనతోనే రాపిస్తము. డ్రాఫ్టింగ్ ఆర్ పార్ గా చేస్తాడు. ఎపుడైనా డబ్బులు ఇస్తే తప్ప అడుగడు. ఎక్కువిచ్చినా తీసుకోడు. అవసరమొస్తే మాత్రం వంద రూపాయాల కోసమైన తీవ్రంగా బ్రతిమిలాడి అడుక్కుంటడు ఎవరినైనా. సిగరేట్స్, మందు, మాట్లాడడం ఆయన అలవాట్లు. అప్పట్లో హిందూ మ్యాగజీన్ లో కూడా ఆయన ఆర్టికల్స్ వచ్చేవట.
“ఏమి సార్ పరేశాన్ లో ఉన్నరు? రిపోర్ట్స్ అన్నీ పోలేదా ఇంకా?” అని కిలుక్కున నవ్విండు మా పరేశాన్ ఏదో ముందే ఎరిగి ఉన్నోని తీరుగా. నేను కూడా పాలిపోయిన పెదవులతో పూర్తి గా విప్పకుండానే నవ్విన బలవంతంగా.
“గీడ ఈవీఏం లేంది సర్? కథలు కాకపోతే. అగో నార్నూర్ మండలం దిక్కు ఈవీఏం మిషనులో బుగ్గ వెల్గుతది, ముట్టుకుంటే కరెంట్ షాక్ వచ్చి సత్తరనుకోని అందరూ అడివిలకు ఉర్కిర్రట ఇండ్లల్లో ఉంటే పోలీసులు, పట్వారీలు వచ్చి పట్టుకపోతారని. మద్యాహ్నం వరకు పర్సెంటేజ్ తక్కువుందని అధికారులు తిప్పలు పడి అందరినీ జాడ దొరకబట్టి పట్టుకొచ్చి రాత్రి తొమ్మిది గంటల దాకా గుద్ధిచ్చిర్రట వోట్లు” ప్రకాష్ రావు.
ఇదేదో ముచ్చట కొంచెం నాకు రిలాక్సింగ్ గా ఉందని మా హైమద్ అందుకున్నడు. “ఎహే ఈ గవర్నమెంట్ పాల్సీ కరెక్ట్ కాదు అసలైతే. మా దగ్గరైతే లోపలికి పోయి కొందరు బటన్ ఒత్తమంటే సంతకం పెట్టిన బొటనవేలుకి మిగిలిన ఇంకుతోని బొమ్మలమీద ఒత్తుతార్రు. నీ అక్క కొందరైతే మిషినిని రెండు సేతుల దేవుని ఇగ్రహం లెక్క అట్టిగనే మొక్కీ బయటికి వత్తర్రు. ఎన్నిగోసలు ఈ ఎలక్షన్స్ అంటే” అని బాగా నవ్వుతండు హైమద్ నేను కూడా నవ్వాలని నా దిక్కు చూసుకుంటూ. ఎలక్షన్స్ లో వంట వాళ్లు టైమ్ కి హాండ్ ఇస్తే మొత్తం స్టాఫ్ వీఆర్ఏలని కలుపుకొని రెండు వేల మందికి చక్కటి తిండిని అందించిండు హైమద్.
“నేనదే కదా మొత్తుకునేది అంతా ఉల్టా పల్టా అడ్మినిస్ట్రేషన్ ఇండియాలో అని.., నన్నేమో పిచ్చోని లాగా సూత్తరు. ఉన్నదున్నట్లు మాట్లాడితే ఉద్యోగం పీకేసిండ్రు నాది. ఐనా ఊకుంటమా? తెల్సింది మాట్లాడకుంటే కడుపు ఉబ్బుతది.” ప్రకాష్ రావు నా దిక్కు చూసిండు సహజంగా తన మాటలని ఆమోదిస్తానని.
“ఇగో మీరు పరేశాన్ కాకుర్రి. నన్ను పరేశాన్ సేయకుర్రి. మునుపు ఉండే ఎమ్మార్వో వాడు సెయ్యలే. పెద్ద సార్లు ఎవ్వడు సేత్తలేడు నాకు. ఇగ మాతోని కట్టమే ఉంది మీకు. ఎంసెయ్యాలే మేము ఇగ…,” అతడు ఆ ఆదివాసీ కొంచెము ముందుకు వచ్చి లోపల అనుచుకున్న బాధనంత ఎలా వ్యక్తపరచాలో అర్థము కాక మాట్లాడుతుండు. తిరిగి తిరిగి పని కాని వ్యక్తి రెండే ముక్కలల్లో తన బాధని చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది.
“దునియంత పరేషాన్ పరేషాన్. కావొద్దంటే ఎట్లా దాదా?” ప్రకాష్ రావు గోండీలో.
“గదే గదా…” ఆ ఆదివాసీ.
నా మాటలు వాళ్ళిద్దరు చెప్పుతండ్లు. ఆదివాసీలంతే. వాళ్ళని వాళ్ళు తక్కువనుకోరు.
అంతలో నా ఛాంబర్ వెనుకల రూములో ఉన్న మా నాయబ్ తహశీల్దార్ బక్కయ్య బయటికొచ్చి “ఏయ్.., ఏందిరా మీ లొల్లి అది ఇప్పట్లో అయ్యే పని కాదు. అయ్యే పని ఐతే చెయ్యకపోతుమా? నడువు బయటికి” అని బెదిరించిండు. బక్కయ్య మూడేండ్లుగా మా ఆఫీషులో పనిచేస్తున్న సీనియర్.
నాకెందుకో ఆ పని కాకున్నా సరే వాళ్ళ బాధ విని నేను కొంత మాట్లాడి పంపిస్తే ఇప్పటి సిచ్చుయేషన్ నుండి అయితే బయటపడొచ్చు అనిపించింది. దగ్గరికి రమ్మని పిలిచి వాళ్ల పేపర్లు చూపించమన్నాను మా బక్కయ్యని సైలెంట్ గా ఉండమని సెప్పి. ఆ చినిగిపోయిన, పాతబడ్డ ఆ విజ్ఞాపన పత్రాలపైన ఏడాది నుండి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లు చేసిన ఎండార్సుమెంట్స్ ఉన్నయి. టేకమ్ భీము సన్నాఫ్ చిన్నూ. ఊరు గుట్టచెలిమే. నేను తెలివిగా ఆ సిచ్చుయేషన్ ని హ్యాండిల్ చేయాలని, మా టెన్షన్ వాతావరణము నుండి అందరినీ కొంత రిలాక్స్ చేయాలని నేను కూడా ఆదివాసీల స్టైలులో “ఇగో మీరు పరేశాన్ కాకుర్రి. మమ్ముల్ని పరేశాన్ సేయకూర్రి. అసలు మీ బాధే౦దో ఒక్క నిమిషములో సెప్పుర్రి” అన్నాను.
వెంటనే మా బక్కయ్య అందుకొని సెప్పడము మొదలు పెట్టిండు. “బాధేమి బాధ సార్. ఇగో సార్ వాళ్ళకి రెండు దిక్కుల భూములు ఉన్నయి. ఎడాస్ గోంది శివారులో, దేవదుర్గం శివారులో. ఎడాస్ గోంది శివారు భూములు జాయింట్ సర్వే లో రిజర్వ్ ఫారెస్ట్ అని తేలింది. వాటిని ఫారెస్ట్ డిపార్ట్మెంటోళ్ళకి హాండ్ ఓవర్ చేసినము. కాబట్టి కొత్త పాస్ బుక్కులు ఇవ్వలేదు. దేవదుర్గములోనేమో ఆ సర్వే నంబరులో భూమి ఖాస్రా, ఆరెస్సార్ కి ప్రెజెంట్ పహానికి ఎక్స్టెంట్ (విస్తీర్ణం) పెరిగింది. పెద్ద నంబర్ అది రెండువందల ఎకరాల పైన భూమి ఉంటది ఆ నంబర్ లో. రికార్డ్ సరిగ్గా లేదు. ఇప్పుడున్న పాత పహాని నుండి అందులోకెళ్లి ఎవరిని రికార్డ్ కి తీసేద్దామన్న మొఖా మీద ఎంజాయ్మెంట్ సర్వే జరగాలి. ఏడీ, డీఐ, నలుగురైదుగురు సర్వేయర్లు కలిసి రెండు వారాలు చేసిన గాని అది అయ్యే పని కాదు. మనకి దేవదుర్గముకి పోదామన్నగాని చిర్రకుంట కాడ బండ్లు పెట్టి ఏడు కిలో మీటర్లు నడిచి పోతేనె ఆ ఊరు వస్తాది. ఒక గుట్ట దాటిపోతే ఇంకో గుట్ట మీద ఆ ఊరు. ఆ ఊరు పాడుగాను ఎక్కడానికి సగము దినము, దిగడానికి సగము దినము పడుతది. ఇక్కడ చేసిన ఎమ్మార్వోలల్లా పావులమందమైనా ఆ ఊరికి పోయినోళ్ళు లేరు. పైగా ఆ ఊరి గుట్ట మీద రాక్షసుల గుడి ఉంది. అందుకే ఆ నంబర్ లో ఎవ్వలకు కొత్త పాస్ బుక్కులు రాలే. రైతు బంధు కానీ లోన్ కాని రాలేదు.”
బక్కయ్య చెప్పడము అయిపోంగానే టేకమ్ భీమ్ బార్య చెప్పడము అందుకుంది. “సారూ.., ఇగో సారు ఆ లొల్లి అంతా ఏందో నాకు తెలీదు. గాని పోయిన సలికాలము పూట ఎవ్వడో సేట్ మా గూడెం ఆచ్చి ఈనెకి ఈ గర్మి కోట్ ఇచ్చి పోయిండు వాయిదల పైసలు కట్టుడు మీద. ఇప్పుడొచ్చి ఊకే ఆ పైసలు ఇయ్యమంట౦డు. ఏడువందల రూపాలు దానికి. ఏడ దొర్కాలే మాకు? నువ్వు మాకు మా భూమికి పాస్ బుక్కులు ఇయ్యలే. సర్కార్ లోన్ ఇస్తేనే సేట్ పైసలు సేటుకిచ్చి మేము బతుకుతాము. లేపొతే గూడెముకైతే పోము. ఇగ ఎట్లన్న నువ్వే ఆదుకోవాలే మమ్మల. ఎవ్వడు సేయడు. నువ్వే సేయాలే.”
అందరూ నవ్విండ్లు. ప్రకాష్ రావు ఇంకా గట్టిగా నవ్విండు. నవ్వి “ఇది సారు! అసలు పరేషాని గరంకోట్. వాస్తవ భారతము. వాళ్ళకి నీ భూమి పట్టాలు, పంటలు కాదు. గా అప్పులల్లా, పైసల లొల్లిల వాళ్ళని పడగొట్టకుంటే అయిపాయే. అంతే. ప్రభుత్వం తనకేమి కావాలనుకుందో ఆ మేరకు పని సేయించుకుంది మీతో. భూమి మోఖా మీద గొలుసు పట్టి సర్వే చేయనంత కాలము భూమి సమస్యలు తీరవు. నేను సెప్త కదా! కానీ ఈ సమస్య ఏందో తీర్చుర్రి చూద్దాం…” తనేదో తన ఆలోచన ధోరణేదో గెల్చిన ఫీలింగ్ ప్రకాష్ రావు మొఖములో.
“అరె దాదా! ఆ గరం కోటు ఇడిసి పట్టుకో –నీ సగం పరేషాన్ పోతది. గింతెండల ఉడుకపోయంగా ఏసుకున్నవు.” ప్రకాష్ రావు.
“నేను గదే అంటున్న…” భీమ్ బార్య ముసి ముసి నవ్వుకుంటూ.
” అబ్బో… ఇడిత్తే ఎవడన్న మాయం జేయడూ” తను తెలివైనవైనవాడిననే ఫీలింగ్ తో తలనీ 45 డిగ్రీల లోలకముల తిప్పుతూ భీము.
ప్రకాష్ రావు ఏదో సపోర్ట్ చేసినట్లు అనిపించింది టేకమ్ భీము మరియు ఆయన బార్యకి. ఈ మద్య అందరు రైతులు ఎమ్మార్వో ఆఫీసులల్లా పని కాకుంటే సూయిసైడు ప్రయత్నం చేస్తాండ్లు. వీళ్ళు ఆదివాసులు అలా చేయకపోయినా గాని ఎందుకైనా మంచిది అని నేను వాల్లు తెచ్చిన పేపర్లని కొద్ది సేపు పూర్తిగా చదివి మా ఆపరేటర్ కి చెప్పి వాటినొక్క సెట్ జిరాక్స్ తీయించి వాటి మీద రాసి నా డైరీలో పెట్టుకున్న. మల్లొక్కసారి వాళ్ళ ముందే మా స్టాఫ్ తో చర్చించిన. చివరకు నేను వాళ్ళకి ఒక హామీ ఇచ్చేలా…
“ఇగో భీమ్, మీరైతే నన్ను ఇదివరకు కలిసింది లేదు. ఇప్పుడే మొదటిసారి. నిజమే మునుపు నన్ను కలిసినంక పని కాలేదంటే అది వేరే ముచ్చట. అందుకని వచ్చే వారం కరెక్ట్ గా ఇయ్యాల్టి దినము నేను మీ పట్వారీ గిర్ధావార్ ని తీసుకొని మీ ఊల్లేకే వచ్చి నీ పనేందో చూస్తా. మీ గూడెము పటేల్ తో చెప్పి ఆ గరం కొట్ అమ్మిన సేటుకి ఇంకో నెలరోజులు వాయిదా పెట్టిస్తా గాని మీరు ఈ రోజు ఐతే వెళ్లిపోండి. మాకు కొంచెము ఎలెక్షన్స్ పని ఉంది.” అని చెప్పి వాళ్ళని ఎట్లాగోల ఐతే పంపించిన.
***
నాలుగు రోజుల తర్వాత ఆఫీషు పని సేయబుద్ధి కాలేదు. ఇంకా ఎలెక్షన్స్ ఆలోచనలల్లోనే ఉన్న. బహుశ కౌంటింగ్ వరకు ఇదే పరిస్థితి. పొద్దున్నే నేను మా గిర్ధావార్ నితిన్ ని ఈ రోజు టేకమ్ భీమ్ ఉండే గూడెం, గుట్టచెలిమే కి పోదాము, పట్వారీ సుదర్శన్ ని పహాని 1బీ తీసుకొని రెడీగా ఉండమని చెప్పమన్న. ఎందుకంటే ఆ పట్వారీ తెల్లారి లేస్తేనే ఇంత తీర్థము తీసుకోనిదే బయటికి పోయే రకం కాదు. పేరుకే పట్వారీ. పని అంతా గిర్దవారి నే చేయాలి.
“సార్ పొద్దున్నే రింఘాన్ ఘాట్ డీలర్ సరిగ్గా బియ్యము పోస్తలేడని కాంప్లైంట్ వస్తే సుదర్శన్ ని పోయి రమ్మని చెప్పిన. దాదాపు అటు దిక్కే పోయి ఉంటడు. రికార్డ్ నేను పట్టుకస్తా పదకొండు గంటలకి సుమో తీసుకొని ఇంటికి రావల్నా సార్?” అని అన్నడు నితిన్.
“అరే వాన్ని ఎందుకు పంపించినవు బై. నువ్వే పోతే అయిపోవు. లేని కథ పెట్టుకున్నట్లు అయితది వానితోని.” అంటూనే సరే రమ్మని చెప్పిన.
నిజానికి టేకమ్ భీము ఉండే గుట్టచెలిమే గూడెంకి పోతే ఏమి పని కాదు. అతని భూములున్న శివారుకి పోవాలే. కానీ నాకెందుకో ఒక్కసారి వాళ్ళ గూడెం ఇండ్లు చూసినంకనే భూములున్న శివారుకి పోదామని అనిపించింది. నాకు ఇటువంటివి అంటే ఇంట్రెస్ట్ ఉంటదని మా గిర్దావరికి తెలుసు.
సుమోలో చిర్రకుంట దాటి రింఘాన్ ఘాట్ గూడెం వరకి పోయినంక గుట్ట చెలిమే గురించి ఆ గూడెం పటేల్ అంబరావుతో విచారించినము. అక్కడి వరకు మీ బండి పోదు సార్ అని చెప్పి తన బైకు మా గిర్ధావర్ కి ఇచ్చి తోడుగా ఇంకో రెండు బైకులపై ఇద్దరు పిల్లలను పంపించిండు.
ఒక యువకుని బైకుపై మా వీయార్వో సుదర్శన్ కూసున్నడు. చేతిలో ఏదో చిన్న మూట పట్టుకున్నడు. బహుశ అక్కడేమీ దొరకవని మా కోసం ఏవో స్నాక్స్ లాంటివి అనుకున్న. బైకుపై వెళ్తుంటే పెద్ద రోడ్ దాటినంక సన్నపు తొవ్వ వచ్చింది. మా గిర్దావర్ కి ఆలవాటే ఈ తొవ్వలల్లో జాగ్రత్తగా నడుపుడు. ఆ పిల్లలు కూడా మంచిగానే నడుపుతండ్రు. ఇంకొంచెం ముందుకు పోయినంక ఒక వొర్రె అడ్డం వచ్చింది. చూస్తే కొంచెము బుడుగు లాగానే అనిపించింది. నేను దిగుతానంటే నితిన్ గిర్దావర్ ఒప్పుకోలేదు. మళ్ళీ బూట్లు విప్పి నేను నీళ్ళళ్ళకెళ్లి నడ్సుడవుతాదని. మా నితిన్ “ఏమి కాదు సర్ నేను మెల్లగా తీసుకుపోతా మీరు అట్లనే కూర్చోండి ” అంటే కూర్చున్నా. నడి మద్యలకి పోయినంక దిగే పరిస్థితి వచ్చినా కానీ చాకచక్యంగా మా బండి బయటికెళ్లింది. మా వెనుకాల పట్వారీ సుదర్శన్ ని దిగమని ఆ యువకుడు బండి ఒక్కడే మెల్లగా దాటిస్తడు అంటే మా పట్వారీ ఆ మాట వినక ఏమి కాదు సర్ మీ లెక్కనే మా బండి కూడా వెళ్తది అని అట్లనే కూసున్నడు. నడి మద్యలకి వచ్చినంక వాళ్ళ బైకు కొంచెము పక్కకి పోయి స్లిప్ అయి పడిపోయింది. ఆ బండి నడుపుతున్న యువకుడు అట్లనే కాళ్ళ మీద నిల్చున్నాడు కానీ మా పట్వారీ నీళ్ళల్ల పడ్డాడు అర్రే అనే౦తలోపే. చేతిలో పట్టుకున్న మూట కూడా నీళ్ళల్ల పడ్డది.
“అరే ఆ సంచి కవర్ లో ఏముందో తియు తియు సుదర్శన్.” మా గిర్దావర్ అంటుండు.
సుదర్శన్ ఆ చిన్న బట్ట సంచిని అండ్లనే వదిలిపెట్టి మెల్లిగా లేచి… “ఏమి లేదు సర్ ఇగ అది పనికి రాదు. లేని దొంగతనం ఏంది కానీ ఆ డీలర్ కేశవ్ మీద కాంప్లైంట్ వస్తే మీరు ఎంక్వైరీ కోసం పొమ్మంటే పోతే ఇంత రెండు కిలోల చక్కెర బట్టల కట్టి ఇచ్చిండు డీలర్. ఎటు గాకుండా అట్టిగా నీళ్ళ పాలాయే” అనుకుంటా నీళ్ళళ్ళకెళ్లి లేస్తున్న మా పట్వారీని చూసి నాకు నవ్వాగక నేను నవ్వుడు మొదలు పెట్టినంక అందరూ నవ్వడము మొదలు పెట్టిండ్లు. సుదర్శన్ తో సహా. నితిన్ సుదర్శన్ ని మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటా ఎడ్డిస్తాండు నవ్వుకుంటూనే. సుదర్శన్ లో లోపల నవ్వు బయటికి భయము నటన నీళ్ళల్లా తడిసి కొంకరవట్టిన కుక్క పిల్లోలే.
“చక్కెర పోతే పోనియు గాని పొద్దుగాల స్నానము చేసి తాగిన మందు కూడా నీళ్ళల్ల పడ్డందుకు దిగిపోయింది కదా సుదర్శన్?” నేను.
“ఏ అవ్వ తోడు సర్ మీరస్తున్నరని గిర్దావర్ సర్ చెప్పంగానే నేను ఇవ్వాళ ఏం తీసుకోలే. అసలు బంజేసిన సర్ ఎప్పుడన్నా బుద్ది పుడితే ఇంత తప్ప” సుదర్శన్.
మళ్ళీ యూ టర్న్ లాగా తీసుకొని కొంచెం దగ్గరగా గోండులు ఉండే భీమన్నగూడెం దిక్కు చూస్తూ గుట్టచెలిమే దిక్కు పోతుంటే ఇంకో చిన్న కాలువ అడ్డము వచ్చింది. కానీ ఆ కాలువ వల్ల పక్కలంతా బురదగా ఉంది. అందులో ఒక యువకుడు అన్నడు “సార్ ఆ కనపడే ఇ౦డ్లే గుట్ట చెలిమే గూడెం. మనం ఇక్కడ బండ్లు ఆపి నడిసిపోతే ఒక కిలోమీటర్ నర వస్తది. అదే మంచిది సర్ ఈ బండ్లు ఇందులోకెళ్లి వెల్లవు” అని చెప్పిండు. సరేనని ఆ కాలువ దాటి అందరము నడవడము మొదలువెట్టినము. నడుస్తూ పోయేటపుడు సుదర్శన్ మీదనే గతములోని జోకులు చెప్తుండు నితిన్.
***
మొత్తం మీద ఆ గూడెం చేరినము. అది మొత్తం కోలాము ఆదివాసుల గూడెము. గూడెములోకి ఎంటర్ అయ్యేటపుడుచెట్టు కింద చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. ఆదివాసుల గూడాల్లో ఆంజనేయుడు ఉండడు కదా అంటే అది అరిగెల మల్లిఖార్జున్ యాదవ్ (తర్వాత కొద్ది రోజులకే ఎంపీపీ అయిండు) ఆ మద్య పెట్టించిండు అని ఆ యువకులు చెప్పిండ్రు.
రామ్ రామ్ అని నమస్కారాలు చెప్తూ ఆ గూడెం పటేల్ మమ్మల్ని ఆహ్వానించిండు వాల్ల ఇంటి ముందుకి.
గూడెం అంటే చిన్న తొవ్వ కి అటు ఇటు ఉన్న ఒక ముప్పై కుటుంబాలు, గుడిసెలు, రేకుల మరియు గూనల ఇండ్లు అంతే. ఆ గూడెము అరవై డెబ్బై ఏండ్ల కింద ఏర్పడింది. సహజంగా ఆదివాసులు స్వేచ్ఛాప్రియులు. వారున్న గూడెములో ఏదైనా విషయములో మాట వచ్చి పడకుంటే, ఇబ్బంది అనిపిస్తే ఒకటి రెండు కుటుంబాలు ఐనా సరే అక్కడి నుండి వెళ్ళిపోయి వేరే చోట ఆవాసం ఏర్పరుచుకుంటారు. అదో కొత్త గూడెం అవుతాది. దానికో కొత్త పటేల్ (గూడెం పెద్ద) ఉంటడు. ఆ గుట్టచెలిమే గూడెములో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్ టీచర్ పేరు నా పేరే… పర్ధాన్ ఆదివాసి. కానీ ఎన్నడూ బడికి రాడు. వచ్చిన తాగే ఉంటడు. పిల్లలకి చదువు చెప్పడు. మధ్యాన భోజనం మాత్రం ఒక ఇంట్లో వండుతారు. ఆసిఫాబాద్ లోని పీటీజీ (ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్) ప్రభుత్వ హాస్టల్ లో చదివి మద్యలో పారిపోయి వచ్చిన ఎనిమిదో తరగతి చదివిన బాలుడే ఆ గూడెములో ఎక్కువ చదివిన వ్యక్తి. పదే౦డ్ల కింద నేను ఈ డిపార్ట్మెంట్ సర్వీసులోకి వచ్చిన కొత్తలో తహశీల్దార్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తన మండలములోని ఒక స్కూల్, అంగన్వాడీ సెంటర్, పీహెచ్సీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్… ఇలా రెగ్యులర్ గా విజిట్ చేసి రిపోర్ట్ పంపడము ఉండేది. నేను బెజ్జూర్ మండలంలో చేసినపుడు అట్లనే చేసేది. అటువంటిది ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ రావడము లేదంటే అది నాకు సంబంధం లేని విషయము అయిపోయింది.
గూడెం మద్యలో దేవర రూపములా కొన్ని బొమ్మలు కట్టే విగ్రహాలు చిన్న పందిరి కొయ్యలు ఉన్నయి. మేము పటేల్ ఇంటి ముందు మంచములో కూసున్నము. ఆ ఇండ్లల్లో ఉన్న అందరూ వచ్చిండ్రు. చిన్న పిల్లలు ఇరవై మంది వరకు “బాటూ…” అని ఏదో పాట పాడుకుంటూ ఒక గ్రూప్, వేరే గ్రూప్ వాల్లు ఏదో ఆడుకుంటున్నారు. యువకులు పదిమంది ఉన్నరు. అందరూ మొబైల్స్ నెట్ వాడుతున్నరు. పనికి పోతరు ఎప్పుడైనా. పెద్దలు ఒక పది మంది. ఆడవాళ్ళు కొందరు ముక్కు చెవి పోగులు, తలలో పిన్నులు, ఆభరణాలు లాంటివి పెట్టుకున్నరు. అవి బంగారమువి కావు. మాకు పటేల్ ఇంట్లకెళ్లి డికాషన్ వచ్చింది. విచారించగా తేలింది ఏమిటంటే వారెవ్వరూ టీ కానీ పాలు కానీ తాగరు. ఆ డికాషన్ కూడా మా కోసమే. ఎందుకు తాగరు మీరు అని అడిగితే “ఎందుకంటే… తాగము అంతే. మా పెద్దోల్లు కూడా తాగలే. మేము కూడా తాగము.” అని చెప్పింది ఒకామే. కానీ వాళ్ళకి పశువులు ఆవులు ఉన్నయి. ఆవుల పాలు వాటి పిల్లలకే విడ్సిపెడుతరు.
ఎవ్వరు కూడా పెద్దగా హైరానాపడి పనులు చేసి పంటలు వేయట్లేదు. ఆ గూడెములో పెద్దాయన సోమూ చెప్పిన మాటేమిటంటే ఆయన ఇంట్లో ఇప్పటికీ పేసాల్లు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, ఆముదాలు విత్తనాలు ఉన్నయి. ఎప్పుడైతే పత్తి, వరి, సోయా వ్యాపార పంటలు వచ్చినయో వారి భూములు ఆదివాసియేతరుల చేతికి పోయినాయి. ఎందుకంటే ఆ పంటలు పండించడము వారికి రాదు. కొన్ని సాదా లేదా స్టాంప్ పేపరుల మీద అమ్ముడు పోయినవి. కొన్ని భూముల మీద అతి తక్కువ కౌలు ఇస్తున్నరు కొందరు. ఉన్న భూములల్లో లేదా గుట్ట బోరుకు లేదా కొత్తగా నరుక్కున్న బంజరు భూములల్లో ఇప్పటికీ కొంతమంది జొన్నలు, కందులు కొంత కొంత చిన్నగా పండిస్తారు తిండికి సరిపోయే అన్ని. ఒకవేళ పైసలు అవసరముండి కూలికి పోదామంటే కూడా వారు కౌలుకి ఇచ్చిన వారి భూముల్లోకే పోతారు. కానీ సహజంగా ఆ కౌలుదారులు కూడా వీరికి వారు సాగు చేసే కొత్త పంటల పని రాదని వీళ్ళని పిలువరు. వీరికి అవసరము కూడా లేదు.
వారి ఇండ్లల్లో ఎవ్వరికీ తలుపులు ఉండవు. అసలు తలుపులు పెట్టె నిర్మాణమే వారి ఇండ్లకు ఉండదు. కొందరు మాత్రము చిన్న తడుకలు చేసి భోజనాల అర్ర దిక్కు అడ్డము పెడుతరు.
ఐదు కిలో మీటరుల దూరములో రేషన్ దుఖానము ఉంటది. మూడు నాలుగు కుటుంబాలు ఎడ్ల కచ్చురములో తెచ్చుకుంటారు నెలకోసారి. ఆ గూడెము మద్యలో ఒక చేతి పంప్ బోర్ ఉంది. అది ఖరాబ్ ఐతే వీళ్ళు భీమన్న గూడెము నుండి తెచ్చుకుంటారు నీళ్ళు. భీమన్న గూడెము లో బోర్ ఖరాబ్ ఐతే వాళ్ళు ఇక్కడికి వస్తారు నీళ్ళ కోసము. నిజానికి అంతకు ముందు గుట్ట మీదికెళ్లి వచ్చే ఎడతెగని ధారలతో అనేక ప్రవాహాలుగా వీళ్ళకి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉండేవి. బహుశ దూరంగా ఓపెన్ కాస్ట్ కావడము వల్లనేమో మునుపట్లా ఇపుడు వారికి ఆ నీళ్ళు లేవు. గాలి దుమారం వస్తే మునుపు వట్టి గాలే వచ్చేది. ఇప్పుడు ఆ గూడెములోకి ఓపెన్ కాస్టు దుమ్ము దుబ్బ అంతా వచ్చి నిండుతది.
ఆ గూడెము వాళ్ళతో ఇంటరాక్ట్ అయి చాలా విషయాలు తెల్సుకున్న తర్వాత టేకమ్ భీమ్ గురించి అడిగినము. ఆయన కొడుకుకి మహారాష్ట్ర అమ్మాయితో సంబంధము కుదిరింది. ఈ వచ్చే నెలలో పెండ్లి ఉంటది అని చెప్పిర్రు. కట్న కానుకలు ఉండవు వాళ్ళలో. ఉన్నోళ్లైతే అబ్బాయి వాళ్ళే అమ్మాయికి బంగారం పెట్టి తెచ్చుకోవాలే. ఉన్న కోళ్ళు గోర్లు మేకలు కోసుకొని విందు చేసుకుంటరు. పటేల్ పెండ్లి కార్యక్రమము చేస్తడు.
ప్రస్తుతమైతే భీమ్ ఆయన బార్యతో కలిసి రోజులాగే ఆయన గుట్ట బోరుకి పది గుంటల్లో వేసిన జొన్న తోట కాడికి పోయిండు. ఆయనని పిలుపిస్తామని పటేల్ చెప్పినా కానీ వద్దని మేమే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళినము. వెళ్తూ ఉంటే దారిలో మరో చిన్న నీళ్ళ ప్రవాహములో కొందరు బుడ్డ గోసులతోని చేపలు దొరుకపడుతున్నరు. పొద్దందాకా పట్టిన వాల్ల ఇంటి కూర వరకే ఆ చేపలు. అవే నీళ్ళలో ఇంకొందరు బట్టలు పిండుకొని స్నానము చేస్తండ్లు.” రామ్ రామ్ లు” చెప్పుకుంటూ దాటుతూ పోయినము. నేను మాతో పాటు వచ్చిన ఇద్దరు యువకులతో అసలు వాళ్ళు ఏమి చేస్తారో అని విచారణ చేసిన. వాళ్ళిద్దరూ ఆదివాసీ గోండులే. రిఙ్ఘాన్ ఘాట్ గుట్ట చెలిమే పక్కనే ఉన్నప్పటికి వాళ్ళకి రోడ్ మార్గము సరిగ్గా ఉండి బాహ్య ప్రపంచముతో సంభంధాలు ఉండడము వల్ల డిగ్రీ, బీఎడ్ వరకు చదువుకున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో పెద్దగా లేనప్పటికి అందులో ఒక అబ్బాయి మరాఠీలో గొప్ప డాక్యుమెంటరీలు తీస్తుండు. అతనితో మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల గురించి చర్చించే స్థాయి నాకు లేదని, అతనిలో ఏదో గొప్ప ఫిల్మ్ మేకర్ ఉన్నాడనే భావనతో నేను ఆ చర్చను కొనసాగించలేదు. ఇంకో అబ్బాయి సైకిలుపై దేశవ్యాప్తంగా తిరిగొచ్చిండు. సందేశపరమైన యాత్ర ఏమి కాదు అది. ఊరికే డిగ్రీ అయిపోగానే దేశమంతా తిరిగిరావాలన్పించిందట, చేతిలో రూపాయి లేకుండా తిరిగొచ్చిండు. అతని అనుభవాలు పంచుకోవాలనుకున్నాను కానీ ఇంతలోనే…
కొంత ఎత్తు ప్రదేశము నుండి కిందికి చూడగానే గుట్టకి మేమున్న ఎత్తు ప్రదేశానికి మద్య ఉన్న వాలు భూమిలో చిన్నగా పది గుంటలల్లో వేసిన జొన్న కోతకి వచ్చి ఉంది. భీము బార్య కొడవలితో జొన్న కంకులని కోత్తంది. భీము మంచె మీద కూసోని ఏదో తాడు అల్లుతుండు. బహుశ అవి కోసుడు అయిపోయినంక కట్ట కట్టడానికో మరే దానికో. దూరము నుండే మంచె కాడికి వెళ్తూ మా నితిన్ హే భీమ్ అని పిలువడముతో మమ్మల్ని చూసిన బార్య భర్తలిద్దరూ పరేషాన్ అయిండ్రు. మంచే పక్కనున్న బండ మీద తన తువ్వాల వేసి కూసోమన్నాడు. నిజానికి అది తువ్వాల కాదు. తన భుజముపై ఉన్న పాత ధోతి ముక్క. ఎండు ఆనిక్కాయ (సొరకాయ) బుర్రలో తెచ్చుకున్న నీళ్ళు “తాగుతారా” అని ఇచ్చిండు. ఆయనకేమి చెప్పాలో అర్థము కాక మేమే ఏదో విషయము చెప్పాలని నవ్వు గునుగుడు కలిసిన శబ్ధాలు చేస్తుండు. నేనే మొదలు పెట్టిన. “ఈ భూమి నీదేనా?” అని అన్నాను నేను.
“ఇది పట్టా భూమి కాదు సర్. గవర్నమెంట్ నంబరే. ఎస్జే (శివాయి జమేదార్) గా కల్టీవేషన్ చేస్తారు వీళ్ళు అప్పుడపుడు. కానీ మనము పహానికి రికార్డ్ చేయము. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికీ ఒక్కరే స్వంతములాగా చేయరు. ఈ భీమ్ ఈ సారి ఇక్కడ చేస్తాడు. ఇంకో సంవత్సరము ఆ పక్క ఈ పక్కకో పోయి చేస్తాడు మళ్ళీ” అని మా గిర్ధావర్ నితిన్ చెప్పిండు. “ఏమంటావోయి భీమ్, సార్ అడిగితే చెప్పరాదా?” అని భీము ని గద్ధించిండు నితిన్. “నిజమే” అన్నట్లు నవ్విండు భీమ్.
“మరి ఆ మిగిలిన భూమి కూడా అంతా దున్నుకోవచ్చు కదా భీమ్” అని నేను ప్రశ్నించిన భీమ్ ని.
“ఇక ఇది సాలు ఇగా. ఏమి జేసుకునుడు అదంతా పంటేసి. ఇది మాకు సాలుతది తిండికి. కొన్ని మిగిలిన జొన్నలు అంగడిలో అమ్మి బట్టలు ఏదన్నా సామాను ఉంటే తెచ్చుకుంటము.”
“మరి రోజు ఏమి చేస్తారు మీరు?”
“వానాకాలములో చేపలు పడుతాము. ఇంటికాడ చిక్కుడు, బబ్బెర వేరే కాయల గింజలు పోస్తాము. గొడ్లు మేపుకుంటా అట్టిగానే ఉంటాము. చలికాలములో మాకు ఎంత సాలో అంత భూమిలో జొన్నలు వేసుకొని మంచే కట్టుకొని నేను మా ఆడది రోజు వచ్చి ఇక్కడ్నే ఉండి చూసుకుంటా ఏదైనా పని జేస్తాం. జంగల్ కి పోతం. గిట్లనే ఇగా పూసలు, తాళ్ళు, తడుకలు, మంచాలు, గుడిసె సదురుడు, గుడిసె గోడలకి మట్టి పూసుడు, ఇప్ప పూలు ఏరుకుంటము, కచ్చురము పనులు అన్నీ చేస్కుంటము. ఏమన్న అంసరాలు పడితే అంగడికి వత్తము మా దగ్గర ఉన్నయి పట్టుకొని. ఇంకేం జేసుడు ఇగా ఏమి జేస్తారంటే?”
భీమ్ తిరిగి నన్నే అలా ప్రశ్నించేసరికి, నిజమే ఇంకేమీ ఉంటది అంతా ఇంతే కదా అని అనిపించింది. మరి మన మైదాన జీవితాలు ఎందుకింత సంక్లిష్టమై పోయినయి అనిపించింది నాకు ఆ క్షణములో. ఆ ఆదివాసుల జీవితాల్లో పెద్ద సంఘర్షణలేవి లేవు. ఉంటే గింటే అవి వాళ్ళ జీవితాల్లోకి బయటి సమాజం చొచ్చుకుపోయి చేసే డిస్టబెన్స్ లు తప్ప వేరే కాదు. వారికి వారి జీవితాల మీద ఒక క్లారిటి ఉంది. స్వంతాస్థి అనేది లేని, దాచుకోవడం, దోచుకోవడం లేని జీవితాలు వారివి. ఆదిమ కమ్యూనిస్ట్ సమాజము ఇంకా కొంత ఆనవాళ్ళుగా వీరి సమాజాల్లో ఉంది. సర్వం సంక్లిష్టమైపోయిన, చిక్కుముడుల జీవితాలు మనవి. అసలు వీటికి పరిష్కారాలు లేవా? ఆదివాసులకు దూరంగా ఉండే మిగతా మన సమాజానికి ఏది ఆదర్శ నమూనా?
అలా ఒక పెద్ద చిక్కుతో కూడిన ఆలోచనల్లో పడిపోయిన నేను “సరే భీమ్! మీ ఇంటికైతే పోదాం పద! ఒకసారి నీ దగ్గర ఇంట్లో ఏమేమి భూమి పేపర్లు ఉన్నయో ఒకసారి మొత్తం చూద్దాము” అని చెప్పి అందరం బయల్దేరినం.
దారిలో వస్తుంటే మళ్లీ ఆ చేపలు పడుతున్న వాళ్ళని చూపించి భీమ్ అన్నడు “సారు. మాకు గరంకోటులు ఇచ్చిన సేట్ ఇక్కడికి సుత అచ్చిండు. ఈ చేపలు ఎక్కువ పట్టడానికి మిషిని వలలు, ఏ పురుగులు, చేపలు కుట్టకుండా బుడ్డగోసులు కాక ఆటికంటే వేరే లాగులు తెత్తనన్నడు మల్లోసారి.” మళ్లీ నేను ఆలోచనలో పడిపోయిన. “ఎక్కువ చేపలు పట్టి వీళ్లేం చేసుకుంటరు. అమ్మేటోల్లు కాదు. పాత బట్టలని బుడ్డగోసులుగా కట్టుకునే సంస్కృతిగా గల వీరికి, దానినేదో సిగ్గుగా మార్చి కొత్త రకం ధరించేవి అవసరమా?”
మేమందరము తిరిగి వస్తుంటే అసలు గరంకోట్ కథ మొత్తం అడిగిన. ఆయన, అతని బార్య చెప్పిన దాన్ని బట్టి నేను బయట సేకరించిందాన్ని బట్టి చూస్తే…
***
శ్రీనివాస్ వరంగల్ జిల్లాకి చెందిన ఒక రైతు. వయసు యాబై. 1986 లో పది చదివి ఫేల్ అయి ఊళ్లోనే తండ్రి పంచి ఇచ్చిన మూడెకరాల భూమిలో మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు, పత్తి కాలము మారే కొద్ది రకరకాల పంటలు పండించి 2005 సంవత్సరము వరకు పిల్లలని ఊళ్లోనే పది వరకు చదివించి కాలం గడిపిండు. కానీ ఆ తర్వాత పిల్లల పట్నములో పై చదువులు, కూతురి పెండ్లి, తల్లితండ్రుల అనారోగ్యముతో ఊళ్లోని భూమిని వరంగల్ లోని ఒక వ్యాపారికి అమ్ముకొని హైద్రాబాద్ లో కొత్తగా కట్టే బిల్డింగ్ ల దగ్గర సెడ్డులల్లో కావలి ఉండుకుంటూ, వాటికి నీళ్ళు పట్టుకుంటూ పని చేసుకుంటూ బ్రతికిండ్రు. ఆ తర్వాత కొన్ని రోజులు ఒక పెద్ద ధుఖానము (మాల్) ముందు వాచ్ మెన్ గా చేసిండు. కానీ ఈ పనిలో పైసలు సరిపోకపోయేది,సెలవులు లేకపోవడము వల్ల ఆయనకెందుకో ఆ పనిని వదిలిపెట్టాలన్పించింది. కొంత చదువుకున్న వాడు కావడము వల్ల, పట్టణములో సంపాదించిన జ్ఞానముతో, మార్కెట్ రంగములో అయిన కొత్త పరిచయాలతో, తన మీద తనకు కల్గిన నమ్మకముతో వాయిదాల మీద వివిధ వస్తువులని పూర్తిగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాలల్లో ప్రజలని ఒప్పించి అమ్మి తిరిగి డబ్బులు వసూలు చేయగలననే నమ్మకము వచ్చి గవర్నమెంట్ నౌకరీ చేస్తున్న తన సడ్డకుని(తోడల్లుడు) దగ్గర ఒక లక్ష రూపాయల బాకీ, బార్య పేయి మీది బంగారము బ్యాంకులో కుదవబెట్టి ఒక మిత్రుని ద్వారా చలికాలములో స్వెట్టర్లు అమ్మే నిర్ణయము తీసుకొని ఐదు వందల స్వెట్టర్లు తీసుకున్నాడు. కాని ఊళ్ళల్లో తిరిగే సరికి గాని అతనికి అర్థము కాలేదు స్వెట్టర్లు ప్రజలతో కొనిపించడము ఎంత కష్టమనేది. తన తెలివి సరిపోదు అనిపించింది. కానీ ఎలాగైనా ఎంతో కొంతకి జనాలకి అంటబెట్టి నష్టమైనా సరే ఇందులో నుండి బయటపడాలని అనుకున్నాడు. బార్యభర్తలు ఎన్నో రాత్రులు ఇద్దరు కలిసి ఏడిసిండ్రు. రంధి పడ్డరు. చివరకు ఒక రోజు తమ కిరాయి ఇంటి పక్కన ఉండే రైలులో, ఊళ్ళల్లో చిన్న చిన్న వస్తువులైన దువ్వెనలు, అద్దాలూ, పిన్నీసులు అమ్ముకునే రాజన్నలొల్లతో తన బార్య తెలుసుకున్న సమాచారము ప్రకారం రైలు ఎక్కి పోయి కాగజ్ నగర్ లో దిగి ఆ చుట్టూ ఉన్న ఊళ్ళల్లో వస్తువులు కొనిపించడము కొంత సులభము. ఆ విషయమే భర్తతో చెప్పి అతనిని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ వైపు రైలులో వెళ్ళి అమ్మేలా చేసింది.
***
సలికాలము. మబ్బుల పూట. సంక్రాంతి పండుగ రోజులు బయటనైతే. పటేల్ ఇంటి ముందు పందిరి జాగలో వేసిన నెగడు ఇంకా ఎర్రగా కనిపిస్తాంది. బల్ల మీద, మంచములో చిన్న పిల్లలు ఇంకా పడుకొని లేవలేదు చలికి. గుట్ట చెలిమే గూడెము నడి మద్య ఉన్న దేవరకి కొంత దూరంగా బండల మీద మరియు తొవ్వ నేల మీదనే కూసుని కొందరు మొగోళ్ళు కాళ్ళు చేతులు గోక్కుంటూ ముచ్చట పెడుతుండ్రు. ఎడ్ల బండి కుజులని తాళ్ళతో గట్టిగా ఇగ్గి కడుతుండూ టేకము భీమ్. బోరింగ్ దగ్గర నీళ్ళు పట్టుకుంటున్న వాళ్ళు కొందరు. వీళ్ళకి కొంత దూరంగా గూడెములో జొర్రంగా సెల్ ఫోనులో ఏవో వీడియోలు చూస్తున్న ఇద్దరు ముగ్గురు యువకులు.
అంత పొద్దుగాల ఎట్లా వచ్చిండో ఏమో గాని, శ్రీనివాస్ వీపుకి పెద్ద బ్యాగ్, రెండు జబ్బాల మీద రెండు స్వెట్టర్లతో గూడెము లోపలికి వస్తుండు. అతను గూడెము మద్యలోకి రాంగానే అందరినీ ఉద్దేశించి గోండు భాషలో పలకరించిండు. తమ భాషలో మాట్లాడేసరికి పనులల్లో ఉన్నోళ్లతో సహ అందరి దృష్టి అటు పడింది. సహజంగా అసిఫాబాద్ లో దుఖనపు సావుకార్లకి, సర్పంచ్, ఎంపీపీ లాంటి చోట మోట ఆదివాసేతర లీడరులకి, పట్వారీ, కార్యదర్శులకి మాత్రమే తమ భాష తెలుస్తది. ఇతరులకి తమ భాష తెలియడము అనేది, వారితో సంపర్కము అనేది రాబోయే దోపిడీకి సూచన. ఎదుటి వారి స్థాయి ఎంత పెద్దగా ఉంటే తాము అంత పెద్ద మొత్తములో దోపిడి చేయబడబోతున్నామనే సందేశము.
శ్రీనివాస్ వాళ్లందరని చాలా హుషారు చేస్తూ స్వెట్టరు కొనమని పురమాయిస్తుండు. పైసలు మూడు నెలల దాటిన తర్వాతనే, స్వెట్టర్ మంచిగా అనిపిస్తేనే ఇవ్వమని అందరిని కొనకున్న మంచిదే కానీ వేసుకొని చూడమని బ్యాగులోని స్వెట్టరులన్నీ విప్పి ఇస్తుండు. బక్కగా పందిరి గుంజ లెక్క ఉండే భీముకి స్వయంగా శ్రీనివాస్ వేసి అందరినీ ఎట్లా ఉందని అభిప్రాయము అడిగేసరికి అందరూ నవ్వుకుంటూ మంచిగున్నదన్నారు. అందులో ఒక అబ్బాయి “వీరొ లెక్క ఉన్నావు భీము” అని ఉత్సాహపరిచిండు. పసుపుకొమ్ములసొంటి నాలుగు పండ్లు బయటపెట్టి భీమ్ సిగ్గు పడుతుంటే… అదే సందు అని చూసి శ్రీనివాస్ “ఉంచుకో. జబ్బర్ దస్తుగా ఉన్నది కోటు. నీకు దొరికినప్పుడే పైసలు ఇస్తువుపో ” అని స్వెట్టరు గుండీలు గట్టిగా పెట్టి పేయి మీద సమానంగా ఒత్తి, భీముని అది వేసుకోంగనే కొత్త మనిషి లెక్క కనపడుతున్నట్లు చూసిండు. మొత్తానికి భీమ్ ఆ గరం కోటు ని తీసుకోవలసి వచ్చింది.
***
శేట్ (శ్రీనివాస్) అంటగట్టిన సమయములో ఏమి అన్పించలేదు కానీ ఆ తర్వాత ఆ రోజు సాయంత్రము గరం కోటు వేసుకోవాలంటే సిగ్గు అన్పించింది భీముకి. ఇంటి ముంగటి పడుసు పోరాగాళ్ళు పొద్దుగూకంగానే వచ్చి మరీ ఆయన పెయి మీద ఉన్న అంగీ విడిపించి స్వెట్టర్ తొడిగించిండ్రు. వాళ్ళ ముందు వేసుకొని నవ్వినట్లు చేసిండు గని పెయ్యంతా ములముల పెట్టింది భీముకి. అట్లా రెండు మూడు రోజులు మంది బాధకి వేసుకొని నిద్రపోయేటప్పుడు విప్పేసేటోడు భీమ్ ఆ ములములని భరించలేక. ఒక రోజు విప్పేసుడు మరచిపోయిండో లేదా ములముల అలవాటు అయిందో కానీ స్వెట్టర్ విప్పకనే అట్లనే పడుకున్నడు రాత్రి భీము. నడిజాము రాతిరి తన చెవులల్లో, తన శరీరము చుట్టూ ఏవో శబ్దాలు వినపడుతున్నాయి భీముకి. బహుశా అవి తమ చిన్నప్పుడు విప్ప చెట్టు మీద ఉండి మంటలు లేపి విప్ప పూలు మాయము చేసిన కాముని భూతాలు చేసినటువంటి మెత్తటి చప్పుడే అనుకుంటుండు. ఆ కాముని భూతము మళ్ళీ ఇన్నాళ్ళకి తన ఇంటికి వచ్చిందేమోనని భయముతో ఇంకా దగ్గరికి ఒత్తుకొని పడుకుంట౦డు. ఆ సప్పుడు ఇంకా పెరుగుతుంది. సట్టన లేసి కూసున్నడు భీమ్ “గయ్య్…” మని ఒగరుస్తూ. పక్కనే పండుకున్న భీమ్ బార్య భయముతో “బే…” అనుకుంటూ లేసింది.
లేచి చూసే సరికి ఆ భూతం ఉరికిందో ఏమోగనీ బయటకు వచ్చి చూసినా గానీ ఆ ఆనవాల్లైతే కనిపించలేదు భార్యభర్తలకి. మల్లీ వెల్లి పడుకున్నరు. భార్య ఏవో దైర్యపు మాటలు చెపుతూ నిద్రపోయింది. తనకు తాను దైర్యం చెప్పుకోని దగ్గరగా శరీరం తీసుకోని బోర్లా పడుకున్న భీమ్ కి మెల్లి మెల్లిగా అవే కాముని భూతం శబ్ధం చేస్తున్నట్లు వినపడడంతో లేచి కూర్చున్నడు. భార్య నిద్రపోతుంది. ఆమెని ఎందుకు లేపడం అని నిద్రపోకుండనే కూచున్నడు భీమ్ చేతి కర్ర దగ్గర పట్టుకోని. ఒకవేళ ఆ కాముని భూతం వస్తే దాని కాళ్ళ మీద కొట్టి చంపాలని నిర్ణయించుకున్నడు. చాలా సేపు చూసి చూసి అది ఇక వెల్లిపోయిందని పడుకున్నడు. మనసులో ఉన్న ఆందోళన అంత పోయింది. కల్లు మూసుకుని ప్రశాంతంగా పడుకుందామని ప్రయత్నం చేస్తుంటే… భూతం మళ్లీ తన పైనే వచ్చి కూసోని సప్పుడు చేస్తున్నట్లు అనిపించి, అది ఇక ఈ రోజు తనని విడిసి పెట్టి పోయేలా లేదని రాత్రంతా నిద్రపోకుండానే కూర్చున్నడు.
అట్లా ఆ కాముని భూతం బాధ నుండి బయటపడాలంటే ఏం చేయాలనో పటేల్ ఇతర పెద్దలతోని భీమ్ చర్చలు చేసిండు. మనిషికో రకం ఆలోచన చెప్పిండ్రు. ప్రతి రోజు రాత్రి అంతే ప్రశాంతంగా నిద్రపోదామనుకుంటే కాముని భూతం వస్తుంది. భీమ్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిండు. చివరకు గూడెం పటేల్ ఉండి అది అట్టిగా బెదిరించే భూతమే కానీ మనలనేం చేయదు అని చెప్పడంతో దాని బెదిరింపులు వింటూనే నిద్రపోవడం అలవాటు చేసుకున్నడు. కొద్దిరోజులకి ఆ భూతం బెదిరించడం మానేసింది.
ఆదివాసుల గుడిసెలు, ఇండ్లల్లో పెద్దగా ఏం సామానులు ఉండవు. తలుపులు ఉండవు. ఓ రోజు స్వెట్టర్ ని ఇంట్లో ఉన్న ఆ ఒక్క గడాంచె (చిన్న మంచం) లో బదులు కింద పెట్టి పనికి పోయిండు భీమ్. మాపటి జాము వచ్చే సరికి స్వెట్టర్ కి అంత సెదలు పట్టింది. పొరక పుల్లలతోని సెదలంతా దులిపి రాలగొట్టిండు. గుడిసె సూరుకు ఒక పంజ పొరకని కిందకి గుంజి సాగదీసి దానికి వేలాడదీసుడు మొదలుపెట్టిండు. కానీ తన ఇంట్లో ఆ గరంకోటునే అతి విలువ కల వస్తువు. కాబట్టి ఎన్నడు లేనిది ఎవరైనా మహారాష్ట్ర నుండి ఇటుగా గొర్లని మేపుకుంటూ వెల్లేవారు కానీ, ఎపుడైన ఇటు దిక్కు దాక మేపుకుంటూ వచ్చే పక్కూరి బర్ల బోయిడి గానీ తన గరంకోటుని ఎత్తుకోనిపోతారేమోననే అనుమానంతో భీమ్ గరం కోటుని తను ఎక్కడికి వెల్లినా అది వేసుకోని పోవడమో, ముడేసి జబ్బకు తగిలించుకోవడమో చేసుడు మొదలువెట్టిండు. కానీ తను ఎటుపోయినా గానీ, ఏ పని చేసినా గానీ ఆ గరంకోటు తనకి చాలా ఇబ్బందిగా మారింది.
అటిటూ అనేవరకు ఎండాకాలం దాటుడానికి వచ్చింది.స్వెట్టరు వేసుకొని జొన్నలు పోసిన చేను కాడ రాత్రి పూట పండుకుంటే భీమ్ ని చూసిన గుడ్డేలుగు ఇంకో గుడ్డేలుగు ఏమో అనుకుని మంచె మీదికి ఎక్కడానికి పైతూరింది. దాంతో భీమ్ రాత్రి మంచె కావలి బంద్ చేసిండు. జొన్న కంకులన్ని కోతుల పిట్టల పాలైనయి. పంట తిండి మందం కూడా చేతికి రాలేదు. శ్రీనివాస్ సేట్ వాయిద పైసల వసూలు కోసం రావడం మొదలు పెట్టిండు. భీమ్ భూమి మీద సర్కార్ లోను కోసం బయటి బాట పట్టిండు. ప్రభుత్వం చేపట్టిన భూ శుద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా శివాయి జమేధార్ భూమిలో కాస్తు నకలు బంద్ అయింది. ఒక భూమి రిజర్వ్ ఫారెస్ట్ లో పోయింది. ఇంకో భూమి టెక్నికల్ ప్రాబ్లమ్ తో కొత్త పాసుబుక్కులు రాలేదు. భీమ్ దరఖాస్తుల మీద దరఖాస్తులు రాయించి పెడుతూనే ఉన్నడు అధికారులకి. ప్రజా ప్రతినిధులకి. మరోవైపు శ్రీనివాస్ కి అప్పులు కట్టి నాలుగు పైసలు బ్రతకడానికి సంపాదించుకోవాలంటే వాయిదాకింద గరంకోటుల డబ్బులు వసూలు చేసుకోవాలి. నాలుగు నెలలు పోయి ఏడాదికి వస్తుంది కాలం. భీమ్ ఇరవై నాలుగు గంటలు ఇక గరంకోటునే వేసుకోని తిరుగుతుండు. ఈసారి అటు పంట రాక, లోను డబ్బులు రాక కొత్త బట్టలు కొనుక్కోలేదు. అన్నేమో గానీ గరంకోటు బాకీ డబ్బులు కట్టాలి. భీమ్ పొద్దున లేచి ఆసిఫాబాద్ కి వచ్చి అందరిని కలుస్తుండు. అన్ని ప్రయత్నాలు చేస్తుండు. కాని తొవ్య దొరకడం లేదు. ఎండాకాలం కూడా స్వెట్టర్ వేసుకోని తిరుగుతున్న అతన్ని అందరు బయట పిచ్చోని వలే చూస్తున్నారు. ఆ రోజు కలెక్టర్ పీవో ఐటీడిఏ సార్ అక్కడికి వస్తాడనే సమాచారంతో జనుకాపురం జైలు దగ్గర పగలు మూడింటి దాకా చూసి బోరింగ్ నీల్లు తాగబోతుంటే కుక్కలు కరువడానికి ఎంబడి పడి కిలోమీటర్ దూరం ఉరికిత్తే ఉరికి ఉరికి పొట్రాయి తాకి కింద పడ్డడు. కండ్లకు చిమ్మ చీకట్లు అచ్చినట్లయింది పానానికి. గరంకోటు ప్రాణగండమై కూసుంది భీమ్ కి.
***
మేమందరము నడుసుకుంటూ గూడెము కి తిరిగొచ్చి భీమ్ ఇంటికెల్లి భీమ్ దగ్గర ఏమేం పేపర్లున్నయో చూసినము. మా గిర్ధావర్ నితిన్ అన్ని రాసుకున్నడు. కామ్ స్కానర్ లో ఆ పేపర్ లన్నీ స్కాన్ చేసుకున్నం. నీకు న్యాయం చేస్తామని భీమ్ కి హామి ఇచ్చినం. మేం స్వయంగా ఇంటిని వెతుక్కుంటూ రావడంతో భీమ్ సీసం గోలీల్లాంటి కళ్ళల్లో ఎక్కడ లేని ఆనందం కనిపిస్తుంది. మాకు ఏదో ఇవ్వాలనే తాపత్రయము భీము మనసులో. పటేల్ దగ్గరికి పోయి మాట్లాడిండు. పటేల్ మా పట్వారీ తో భోజనాలు తయారు చేయిస్తానని అడిగిండు. నేనే సున్నితంగా వద్దని చెప్పిన. నిజానికి పని అయినరోజు, ఏదైనా కార్యక్రమము మీద వచ్చిన రోజు పటేల్ ఇంట్లో తిననిదే పోనియ్యరు ఆదివాసులు. అందరూ భీము గుడిసె ముందు వచ్చి కూర్చున్నారు.
“ఏదైనా పని ఉంటే ఆఫీసుకి వచ్చి నన్ను కలువుండి. పంతులు (పట్వారీ) వచ్చేదాకా ఆగాలని ఏమి లేదు” అని చెప్పిన.
***
ఆఫీసులో నేను మా నాయబ్ తహశీల్దార్, గిర్ధావర్, పట్వారీతో చర్చించిన. మా నిర్ణయము మేరకు దేవదుర్గంలో ఎంజాయ్ మెంట్ సర్వే చేస్తే తప్ప ఆ గ్రామ సమస్య క్లియర్ కాదని కలెక్టర్ గారికి రాసినం. అది చాలా పెద్ద పని కాబట్టి అది రూపుదాల్చలేదు.
ఆరు నెలలు గడిచినయి.
భీమ్ మరియు ఇతరులవి ఏవైతే రిజర్వ్ ఫారెస్ట్ కింద వచ్చినట్లు తేలినయో దానిలో లైమ్ స్టోన్ నిలువలు బాగున్నవనీ ఏదో ఒక కంపెనీ ప్రభుత్వానికి మైనింగ్ పర్మిషన్ కోసం పెట్టుకున్నది. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ మైనింగ్ కింద పోయే భూమికి బదులు “కాంపన్శేటరీ ఎఫారెస్టేషన్” కింద ప్రభుత్వ భూమిని కోరింది. భీమ్ మరియు ఇతర ఆదివాసీలు చేస్తున్న పోడు వ్యవసాయ, శివాయి జమేధార్ ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కి అందచేయడం జరిగింది. నేను భీమ్ ని పూర్తిగా మరిచిపోయిన. భీమ్ కూడా మా ఆఫీసుకి రావడం లేదు.
***
ఆ రోజు నేను ఆఫీస్ నుండి లంచ్ కి ఇంటికి వెళ్తుంటే ఆదివాసీ భవన్ లో ఏదో ఆదివాసీల సమావేశం జరుగుతుంది. బయట బుక్స్ పెట్టి అమ్ముతుంటే నేను కొందామని దిగిన. లోపల సభలోని సందేశం ఆసక్తిగా ఉండడంతో లోపలకి వెళ్లి చివరి లైన్ లో కూర్చున్న. దాదాపు ఒక రెండు వేల మంది ఉన్నరు ఆ సమావేశంలో. చాలా క్రమశిక్షణతో సాగుతుంది ఆ సమావేశము. మనము బయట చూసే సమావేశాల కంటే ఏదో కొత్త పొందిక, పద్దతి కనిపిస్తుంది ఆ సమావేశములో.
వెడ్మ బొజ్జు – ఈ మధ్య కాలంలో పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలో లంబాడా – ఆదివాసీల మద్య జరిగిన గొడవలు, విబేధాలల్లో ఒక బలమైన ఆదివాసీ నాయకునిగా అవతరించిన విద్యార్థి నాయకుడు, యువకుడు చాలా ఆవేశంగా అర్ధవంతంగా మాట్లాడుతుండు గోండి భాషలో.
“నా గోండు జాతి అక్కలారా, అన్నలారా! కొమరంభీం వారసులారా! అందరికీ రామ్ రామ్!
మీకు అందరికీ తెలిసిన విషయమే ఇంక కొన్ని రోజుల్లో డిసెంబర్ తొమ్మిదిన, మన జాతి ఆత్మగౌరవ పోరాటాన్ని దేశ ప్రజలందరు గుర్తించేలా దేశ రాజధాని డిల్లీలో “తుడుం దెబ్బ” కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ఆ కార్యక్రమము హాజీరు కావడము కోసము చేతిలో రూపాయి బిల్ల కూడా దాచుకోని మన జాతి ఏకంగా ఒక రైలునే అదిలాబాద్ నుండి డిల్లీ కి బుక్ చేసుకున్నాము. ఇంతే కాకుండా మిగతా ఆదివాసీ యువత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరికి తోచిన విధంగా వారు వివిధ మార్గాల్లో పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరు. మనమందరము కూడా కొమరం భీమ్ పుట్టిన ఈ గడ్డ నుండి బయల్దేరాలి. ఐతే ఈ సందర్భంగా నేను మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనల్ని తప్పుతోవ పట్టించాలనుకునే వారికి, మనల్ని తప్పుగా ప్రశ్నించే వారికి కూడా మీ దగ్గర సమాధానము ఉండాలనే ఉద్దేశ్యముతో నేనీ విషయాలు చెప్తున్నాను. కొందరు ఇంకా ఈ రోజుల్లో కొందరిని ఎస్టీ రిజర్వేషన్ నుండి తొలగించాలనే మన ప్రధానమైన డిమాండ్ ని తప్పుపడుతున్నారు. మన ఉద్యమాన్ని బలహీనము చేయుటకు, మనల్ని తప్పుతోవ పట్టించేందుకు, మనల్ని భయపెట్టి సంఘటితం కాకుండా చూసేందుకు రకరకాల ప్రయత్నాలు మన మీద జరుగుతున్నయి. ఐతే మన ఉద్యమం ఏదో ఒక కులానికో, మతానికో,వర్గానికో, ప్రభుత్వానికో వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి దోచుకోలేని వ్యవస్థ కోసము పునాది స్థాయిలో జరుగుతున్న ఉద్యమము. ఒక కులాన్ని ఎస్టీ రిజర్వేషన్ నుండి తొలగించమంటే వారిని దోపిడీకి గురయ్యేలా చేయమని కాదు. వారు ఇంకొకరిని దోపిడి చేసేలా, ఇంకొకరి జీవన అవకాశాలని వారు లాగుకునే అవకాశము లేకుండా న్యాయబద్ధంగా బ్రతకడము కోసము చేసేలా, ఒక వ్యవస్థలో సౌభ్రతృత్వము దెబ్బతినకుండా చూసేలా కనీస మానవీయ విలువల శిక్షణ కోసము జరుగుతున్న ఉద్యమం ఇది. ఎనబై ఏండ్ల కింద కొమరం భీమ్ ఇచ్చిన “జల్, జంగల్,జమీన్” అనే స్ఫూర్తితోనే మనము మాట్లాడుతున్నాం. ఇక్కడ మనము వేస్తున్న ప్రశ్న దేశములో ఏ స్థాయిలోనైనా వేయవలసినదే. ఆ ప్రశ్న ఏ దశకైనా తీసుకెళ్లవలసిందే. ఐతే ఈ ఉద్యమములో మనకి రకరకాల మైదాన భావజాలాలని అంటకట్టాలని చూస్తుంటారు. కొందరు మన “తుడుం దెబ్బ” సంస్థకి విప్లవోద్యమముతో సంబంధాలు ఉన్నాయంటే, మరి కొందరు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు మతోన్మాద పార్టీ నుండి ఎన్నికైండు అని, మన నాయకులు కొందరు కమ్యూనిస్ట్, బహుజన సిద్ధాంతాల పార్టీలల్లో, సిద్ధాంతాలతో పని చేస్తున్నారని రకరకాల ముద్రలు వేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నరు. కానీ అవి అన్నీ వారు వారు ఏర్పర్చుకున్న, వేసుకున్న ముద్రలు. వారు గిరి గీసుకున్న పరిధులు. కానీ మనము అలా కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి, ఒక వర్గాన్ని ఇంకో వర్గము దోచుకునే వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే క్రమం మాత్రమే మనకు ముఖ్యము. ఆ సత్యం మాత్రమే మనకి అవసరము. వ్యక్తిగత ఆస్తిని కోరని, గుర్తింపుని కోరని, దోపిడిని సహించని మన భావజాలము ఇపుడు దేశమంతా పాకాలి. దానికై మనం కూడా మునుపటిలాగా గిరి గీసుకొని ఈ అడవి ప్రాంతానికే పరిమితం కాకుండా దేశమంతా తిరగాలి. ఇంకా మనం “గోండువాలోంకో దిమాక్ ఘుట్నా మే రహతా” అనే ముచ్చటని మరచిపోవాలి. ఇవ్వాల మనం చేసే పోరాటం, చూపే తొవ్వనే రేపు దేశానికి ఆదర్శం కాబోతుంది. కాబట్టి ఓ గోండు వీరులారా, గోండు వీరమణులారా! మనకు అడవి, మనము ఉండే గూడెము అనేది బేస్ పాయింట్ లాంటిది. కానీ అక్కడే ఆగిపోకూడదు. గూడెం నుండి గుట్టల నుండి, గల్లీల నుండి డిల్లీ వరకు మనం తిరగాలి. పోరాటము చేయాలి. దేశానికి సరైన తొవ్వ చూపాలి. దానికోసము మనము ఈ నెల తొమ్మిదిన డిల్లీలో జరిగే “ఆదివాసీ అస్తిత్వ పోరాట సభ “తుడుం దెబ్బ”కి అందరము కదలాలి…”
“పోలేమా మనమందరము డిల్లీకి?
తొంబై ఏండ్ల కిందనే మన నాయకుడు కొమురం భీమ్ ఇంతకు మించిన దూరము అస్సాము దాకా ఒక్కడే పోయి వచ్చిండు. ఇన్ని రోజులకు మనము పోలేమా డిల్లీకి?” అని అందరినీ ఉద్దేశించి బొజ్జు ప్రశ్నించిండు.
“పోవుడే పోవుడే. పోదాము పోదాము ” అందరూ గట్టిగా సమాధానమిచ్చిండ్రు.
“జై సేవ! జై కొమరం భీమ్!” అని ముగించిండు బొజ్జు.
కార్యక్రమ కో ఆర్డినేటర్ మైకు తీసుకొని “డిల్లీలో జరగబోయే మన మీటింగ్ కి మన వాళ్ళు కొందరు కార్యకర్తలుగా గత నెల రోజులు నుండి పని చేస్తున్నారు. ఇపుడు వారిని వేదిక మీదికి పిలిచి మీకు పరిచయము చేస్తాను” అని ఒక్కొక్కరినీ వేదిక మీదికి పిలిచి పరిచయము చేస్తూ వారు పని చేసిన ఏరియా పేరు కూడా చెప్తుండు. ఆ పిలవబడిన నలుగురు యువతీ యువకులలో నాతో గుట్ట చెలిమే కి వచ్చిన దేశమంతా సైకిలుపై తిరిగొచ్చిన యువకుడు కూడా ఉన్నాడు. చేతిలో నోటు బుక్, జబ్బకి బ్యాగ్, జీన్స్ టీ షెర్ట్ లో చూడడానికి భలే ఉన్నడు అతడు.
ఆ తర్వాత ఇంకో పేరు అనౌన్సుమెంట్ జరిగుతుంది. చిర్రకుంట, రిఙ్ఘాన్ ఘాట్, మోవాడ్ ఊల్ల దిక్కు పనిచేసిన కార్యకర్త భీమ్ అనే పేరు వినగానే నేను ఆతృతగా చూసిన ఆ హాల్ అంతా. కొంపదీసి ఇతడు నాకు తెలిసిన టేకమ్ భీమునేనా అని. హాల్ కి కుడి వైపు కట్టిన పర్దా చాటు నుండి అప్పటి వరకు ఏదో పనిలో బిజీగా ఉన్నట్లున్న ఒక దేహం బయటకు వచ్చింది. మొదట్లో పోల్చుకోలేకపోయిన కానీ అతడే, అవును అతడే టేకమ్ భీమ్. లుంగీ బదులు పాంట్ వేసిండు. కానీ దానితో పాటు వేసిన అంగీ కూడా పాతదే. జేబులో పెన్ను ఉంది. చేతిలో నోటు బుక్కూ ఉంది. కాని అతడి కుడి జబ్బాకి వేసుకున్న ఆ బ్యాగే నా చూపులని అక్కడే నిల్చిపోయేలా చేసింది. ఆ బ్యాగ్ మరేమిటో కాదు.
రెండు చేతులని దగ్గరికి ముడేసి తల వైపు ధారముతో కుట్టి మెడ నుండి నడుము వరకు గల జిప్పునీ గుంజి పెట్టి దాని నిండా ఆయన వస్తువులో, తినడానికి జొన్న రోట్టో కారం ముద్ధో మరేమో లోపల పెట్టిన బ్యాగ్. ఆ బ్యాగ్ మరేదో కాదు – గరమ్ కోట్.
జీవితం సాహిత్యంలోకి తర్జుమా అయితే ఎలా ఉంటుందో మీ కథ తెలియజేసింది..అభినందనలు మిత్రమా..కాల గమనంలో ఉధ్బవించిన ఉద్యమాల మూలం కూడా ఎక్కడుందో మళ్లీ ఒక సారి మీ కథ నిరూపించింది..అభినందనలు మిత్రమా..
స్టోరీ చదూతుంటే మీ వెంట గూడెం అంత తిరిగొచ్చినట్టైంది సర్.. కళ్ళకు కట్టినట్టుంది ! శుభాకాంక్షలు.
ఆదివాసీ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎప్పుడో ఫేస్బుక్ లో ఒకసారి కేశవ రెడ్డి గారి కథ రివ్యూ దగ్గర ఒక కామెంట్ చేసా. ఎక్జాట్లీ అదే పాయింట్ మీరూ రాసారు. నిజమే…మనం జోక్యం చేసుకోకుంటే, డిస్ట్రబ్ చేయకుంటే భీం లాంటి జీవితాలు ప్రశాంతం గానే ఉంటాయి. ఒక్క గరం కోట్ ఎంత డిస్ట్రబ్ చేసింది!! పాపం. అప్పుడప్పుడు నవ్వు కూడా తెప్పించింది.
కథ లో శైలి అద్భుతం.
కథ బాగుంది.
Very nice young man,hats off.Keep on writing on tribal villages.