కళ తప్పుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు

2013 లో జరిగిన 18 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. 2013 నవంబర్ 14 నుంచి 20 వరకూ హైదరాబాద్ లో బాలల చిత్రోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 7 రోజులు జరిగిన ఈ బాలోత్సవం, 13 థియేటర్లలో, 48 దేశాలనుంచి వచ్చిన 200 చిత్రాలతో, బాలలు-వారి తలి-దండ్రులు, ప్రేక్షకులు కలిసి మొత్తం 1,50,000 మంది చూడడానికి ప్లాన్ చేశారు. రోజుకి మూడు సినిమాల చొప్పున ఎడతెరిపి లేకుండా ఉదయం తొమ్మిది గంటలకీ, పదకొండున్నరకీ, మధ్యాహ్నం మూడు గంటలకీ ఐమాక్స్ థియేటర్ లో వేసిన సినిమాలను బాలలతో పాటు సినీప్రియులమైన మేమందరం ఆనందంగా తిలకించాం. అప్పుడది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక తెలంగాణా కోసం ప్రజలు ఉధృతంగా ఉద్యమిస్తున్నకాలం. ఉద్యమాన్ని సన్నిహితంగా గమనిస్తూ, ఎవరిశక్తి మేరకు వాళ్ళు పాల్గొంటూనే ఉద్యమ స్ఫూర్తిని తలపించే అత్యద్భుతమైన బాలల సినిమాలను చూశాం.

బ్రెజిల్ నుంచి వచ్చిన “Thina” అనే చిత్రంలో అడవుల్లో పుట్టి పెరిగిన ఆరేళ్ళ ఆదివాసీ బాలిక తైనా సాహస కృత్యాలు ప్రేక్షకులకు దిగ్భ్రాంతి కలిగిస్తాయి.

ఇధియోపియా నుంచి వచ్చిన “Horizon Beautiful” లో ఒక దక్షిణాఫ్రికా వీధిబాలుడు తనని తాను నిరూపించుకోవడా దానికి చూపే ఆత్మ స్థైర్యం ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది!

నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ”Nano, the Zig Zag kid” లో నానో అనే పదమూడు సంవత్సరాల బాలుడు తన తల్లి జాడ కనుక్కునే క్రమంలో చేసే సాహస ప్రయాణం చూస్తున్న ప్రేక్షకులు నోటిమాట రాక కళ్ళు తెర కప్పగిస్తారు!

ఇజ్రాయేల్ వలసవాదం మీద వచ్చిన “ Igor and the Crane’s Journey” అనే సినిమా!

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు బాలికలు-మహిళల పట్ల ఎంత కౄరంగా, భయానకంగా, నీచంగా వ్యవహరిస్తున్నారో కళ్ళకి కట్టిన చిత్రం “Osama”.

జంతువులతో మాట్లాడడం, వాటి భాషను పట్టుకోవడం, వాటిని మచ్చిక చేసుకుని గుర్రం మీద ఒళ్ళు గగుర్పొడిచే విధంగా సాహస వంతమైన విన్యాసాలు చేసిన పధ్నాలుగేళ్ళ “మిక” అనే బాలిక, ఒక బాలుడు చేయగలిగిన పనిని అంతే సమర్ధవంతంగా బాలికలు కూడా చేయగలరని నిరూపించిన జర్మన్ సినిమా “Ostwind”.

గొర్రెల కాపరి అయిన “హమీద్” అనే బాలుడు తప్పిపోయిన గొర్రెను వెతికే క్రమంలో పడే అష్ట కష్తాలను దృశ్యీకరించిన నార్వే సినిమా “ To Guard a Mountain”

ప్రపంచవ్యాప్తంగా విచ్చిన్నమవుతున్న వివాహవ్యవస్థను చూపిన రెండు సినిమాలు
తండ్రి లేకుండా తల్లి నిర్లక్ష్యానికి గురైన పిల్లవాడు దారి తప్పిన విధానాన్ని దృశ్యీకరించిన లాట్వియా నుంచి వచ్చిన“Mother, I Love You”.

తల్లి లేని సంసారంలో తండ్రి భీకరమైన కోపతాపాలకు గురవుతూ, ఓదార్పు కోసం రహస్యంగా “జోజో” అనే పక్షిని పెంచుకున్న బాలుడి అవస్థను చిత్రీకరించిన డచ్ సినిమా “ Kauwboy.”

అన్ని రకాల ఆధిపత్య ధోరణుల్నీ ఎదురొడ్డి పోరాడమని ప్రోత్సహించే తత్వానికి దోహదం చేసే సినిమాలివి. సినిమాలన్నీ కూడా రకరకల అణచివేతలకూ, పీడనలకూ గురవుతున్న దక్షిణ అమెరికా దేశాలనుంచి వచ్చినవే! ఈ నేల మీద ఎక్కడ అహంకారం, దౌర్జన్యాలు రాజ్యమేలతాయో అక్కడ ప్రతిపక్షంలో ఉండమని ప్రేరేపించే మంచి సినిమాలు చూశాను. ఓపెన్ ఫోరం లో బాలలూ-సినీ విజ్ఞానుల మధ్య జరిగిన చర్చల్ని ఆడియన్స్ లో కూర్చుని గమనించాను. కొన్ని విశేషాలు పంచుకోవాలనిపించింది.

1969 లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే తీసిన “గూపి గైనే బాఘా బైనే” (ఎడ్వెంచర్స్ ఆఫ్ గూపి & బాఘా) సినిమా ఆధారంగా- శిల్పా రణడేస్ మలచిన యానిమేటెడ్ మూవీ “గూపీ గవయ్యా బాఘా బాజయ్యా” చిత్రాన్ని లలిత కళా తోరణంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు.

సౌత్ అమెరికా, ఆస్ట్రియా, గ్రీన్ లాండ్, లెబనాన్, స్కాట్ లాండ్, మలేషియా, ఇథియోపియా తదితర దేశాల్లోని అరుదైన చిత్రాలు బాలల్ని అలరించాయి. ఒక సౌత్ అమెరికా నుంచే ఏకంగా 26 చిత్రాలొచ్చాయి. బెర్లిన్, టొరంటో, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బహుమతులు గెల్చుకున్న 20 చిత్రాలను ప్రదర్శించారు!

ప్రతిరోజూ ఐమాక్స్ థియేటర్ ఓపెన్ ఫోరంలో బాలల హక్కులు, బాలల చలన చిత్రాలు-ప్రభుత్వ పాత్ర, లింగ వివక్ష మొదలైన అంశాలపై చర్చించారు. చిత్ర నిర్మాణం, స్క్రిప్ట్ రచన, యానిమేషన్, థియేటర్ రంగాలు మొదలైన విషయాలపై వర్క్ షాపులు జవహర్ బాలభవన్ లో నిర్వహించారు.

***

1995 నుంచి ఇప్పటికి పదిహేడు సార్లు మనదేశంలో బాలల చిత్రోత్సవాలు జరిగాయి. అందులో పది సార్లు హైదరాబాద్ నగరమే వేదికైంది. ఇకనుంచి హైదరాబాద్ ను శాశ్వత వేదిక చేయ్యడానికి కృషి చేస్తామన్నారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

బాలల చలన చిత్రాలు ప్రదర్శించడానికి దేశంలో అనువైన థియేటర్లు లేవనీ, వారికి కావలసిన పుస్తకాలు లేవనీ, టి.వి.లోను వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు లేవనీ సుప్రసిద్ధ కవి, దర్శకుడు గుల్జార్ విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నిటి పట్ల శ్రద్ధ తీసుకుని తగు చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత మంత్రులను తాను ఎప్పుడు కలిసినా కోరు తున్నానన ఓపెన్ ఫోరంలో జరిగిన చర్చల్లో గుల్జార్ అన్నారు.

డెన్మార్క్ దర్శకురాలు దిబాక్, బ్రెజిల్ దర్శకురాలు వర్జీనియా లింబర్గర్, ఫిలిప్పైన్స్ సామాజిక కార్యకర్త రుమినా, విబేక్ నోయర్ గార్డ్ మువాస్యా, జీరోముల్లా మొదలైన విదేశీ మహిళా దర్శకులు, నటీమణులు పాల్గొన్న సదస్సులో సినీ ప్రపంచంలో మహిళల పట్ల ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న “లింగవివక్ష” గురించి చర్చించారు!

“సినిమా అనేది సమాజానికి హృదయం లాంటిది”- అని డెన్మార్క్ దర్శకురాలు దిబాక్ అన్నారు.

“వివక్ష శతాబ్దాల క్రితమే అక్కడా, ఇక్కడా అని కాక ప్రపంచమంతటా, ప్రతి చోటా ఉన్న సమస్య. కళ సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ సమాజంలో మహిళలు విభిన్నమైన రీతిలో హీరోలు. బాలలు కలలు కని వాటిని నిజం చేసుకోవడానికి తపన పడాలి. బాలికలు – స్త్రీల హక్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లల సినిమాల ద్వారా నైతిక విలువల్ని సమాజంలో నాటగలిగితే అది పిల్లల భవిష్యత్తునే గాక సమాజ భవిష్యత్తుని కూడా మెరుగుపరుస్తుంది. ప్రభుత్వాలు వంతెనలు, రోడ్లు, షాపింగ్ మాల్స్ మీద అంత ఖర్చు చెయ్యగలిగినప్పుడు పిల్లల సినిమాలకు ఎందుకు ఖర్చు పెట్టగూడదు? అని ఫిలిప్పైన్స్ సామాజిక కార్యకర్త రుమినా అన్నారు.

“మహిళలు చిత్ర ప్రపంచపు ప్రధాన స్రవంతిలో ఉండనే ఉండరు. ఎప్పుడైనా ప్రతిభావంతులై రాణించినా వారిని చాలా తెలివిగా పక్కన పెట్టేస్తారు”- అని పిల్లల చిత్రాల సెలక్షన్ కమిటీ మెంబర్ జీరోముల్లా అన్నారు. ఆడశిశువు తల్లి కడుపులో ఉండగానే వివక్ష మొదలవుతుందని భారత్ లో ప్రతి 1000 మంది బాలురికి 940 మంది బాలికలున్న విషయాన్ని చెప్తూ, భ్రూణ హత్యలు, ఆడ శిశు హత్యలు, వరకట్న హత్యలు, అత్యాచారాలు – ఇవన్నీ స్త్రీ – పురుష సమానత్వం సంగతి అలా ఉంచి, స్త్రీల పట్ల ఏమాత్రం సహానుభూతి, గౌరవంలేని పరిస్థితిని రుజువు చేస్తున్నాయి అని అన్నారామె.

అమెజాన్ ఆదివాసీ సంస్కృతిని స్ఫూర్తిగా తీసుకుని “తైనా” అనే ఆదివాసీ బాలికను యుద్ధ వీరురాలిగా చూపుతూ అద్భుత చిత్రాన్ని రూపొందించిన బ్రెజిల్ దర్శకురాలు వర్జీనియా లింబర్గర్ “ప్రకృతికీ, పర్యావరణానికీ – స్త్రీలకూ సంబంధం ఉంది” అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా విజయాలు సాధించగలరు – అని అన్నారు.

“ఒక బాలుడు చేయగలిగిన పనిని బాలిక కూడా అంతే సమర్ధవంతంగా చెయ్యగలదనీ” తన చిత్రాల్లో బాలికలను తెలివిగా ఏదైనా సాధించగలిగిన ధీరులుగా, స్ఫూర్తినిచ్చే వ్యక్తులుగా చూపడం తన లక్ష్యమని గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డు గెలుచుకున్న చిత్ర దర్శకురాలు “విబేక్ నోయర్ గార్డ్ మువాస్యా” అన్నారు. సినిమాల్లో ప్రధానపాత్ర పోషించ డానికి పధ్నాలు గేళ్ళ వయసు లోపు బాలికలు దొరకరన్నారు.

ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్లు, బాలికలు- స్త్రీల పట్ల ఎంత కౄరంగా, భయానకంగా వ్యవహరిస్తున్నారో కళ్ళకి కట్టినట్లు తన సినిమా ‘ఒసామా’ లో చిత్రించిన “సిద్దిక్ బార్మాక్”, “ ఆఫ్గనిస్థాన్ పిల్లలకూ మహిళలకూ చాలా ప్రమాదకరమైన ప్రదేశమని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అన్న” దన్న సంగతి చెప్తూ, లోకంలో జరుగుతున్న అన్ని నేరాలకూ, ఘోరాలకూ స్త్రీలే మూలకారణమని వారు భావిస్తారని చెప్పారు. పిల్లలు, మహిళలకు సంబంధించిన సినిమాలు ఆఫ్గనిస్థాన్ లో తీయడం చాలా కష్టమని చెప్పారు. వాటిల్లో చూపించేవి పచ్చి నిజాలైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందు కున్నప్పటికీ ఆఫ్గనిస్థాన్ పార్లమెంట్ తమతో క్షమాపణలు చెప్పిస్తుందన్నారు!

బాలురు చేయగలిగిన పనిని అంతే ధీటుగా, అంతే చాకచక్యంతో సమర్ధవంతంగా బాలికలు కూడా చేయగలరని సినిమాల ద్వారా నిరూపించి చూపడం, సినీ పరిశ్రమ లోనే కాక పిల్లల సిని పరిశ్రమలో కూడా లింగ వివక్ష లేకుండా చూడడమే తక్షణావసరమని సభికులందరూ అభిప్రాయపడ్డారు.

***

ఇరవై ఏళ్ళ నుంచి హైదరాబాద్ నగరంలో రెండేళ్ళకొకసారి పది సినిమా ఉత్సవాలు జరిగినప్పటికీ తెలుగులో “భద్రం కొడుకో” తర్వాత చెప్పుకోదగ్గ బాలల చిత్రాలు రాలేదు. బంగారు ఏనుగు లాంటి అవార్డులు సాధించిన భారతీయ బాలల సినిమాలు కూడా దాదాపు లేవనే చెప్పాలి. ”వందేళ్ళ భారతీయ సినిమా” సందర్భంగా ఇది చాలా విచారించదగ్గ విషయమే!

థియేటర్ కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ “ఆంధ్రప్రదేశ్ లో బాలల చిత్రాలను ప్రోత్సహిస్తామని గత నాలుగైదు సంవత్సరాల నుంచి వేదికల మీద పదే పదే చెప్పడమే కాని నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పిన స్వల్ప సబ్సిడిని కూడా ఇవ్వడం లేద“ని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే గత నాలుగైదు సంవత్సరాలుగా ఒక్క పిల్లల సినిమా కూడా రాలేదన్నారు. మనదేశంలో పిల్లల చిత్ర నిర్మాతలు ఎన్ని జతల చెప్పులు అరిగిపోయినా ఇరవై లక్షల సహాయం అందక పోవడం అటుంచి థియేటర్లలో విడుదల చెయ్యడానికి ఒక్క పంపిణీ దారుడైనా ముందుకి రావడం లేదని ప్రముఖ చిత్ర దర్శకుడు శివ నాగేశ్వరరావు వాపోయారు!

ఈసారి తెలుగులో ‘మద్దాళి వెంకటేశ్వరరావు’ తీసిన “చదువుకోవాలి”, ‘అయోధ్యకుమార్ క్రిష్ణశెట్టి’ తీసిన “మిణుకుమన్న మిణుగురులు” అనే తెలుగు సినిమాలొచ్చాయి. ఎంతో కాలం నుంచి నగరంలో చిత్రోత్సవాలు జరుగుతున్నప్పటికీ ఇంతవరకూ పోటీకి ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం తమదేనని “మిణుకుమన్న మిణుగురులు” చిత్రనిర్మాత, దర్శకుడు – అయోధ్యకుమార్ క్రిష్ణశెట్టి చెప్పారు. తన ఆర్ధిక పరిస్థితి అసలు బాగుండలేదనీ, అనేక కష్ట నష్టాలకోర్చి బాలలకోసం శ్రమించినప్పటికీ ప్రభుత్వ చేయూత ఏమాత్రం లేదన్నారు. అంధ విద్యార్ధుల సమస్యలపై నిశితంగా పరిశోధన చేసి, తొమ్మిది నెలలు పడిన శ్రమకు “మంచి సినిమా” అన్న ప్రేక్షకుల స్పందన, ప్రశంసలు దక్కాయన్నారు.

***

బాలల చిత్రాలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేదనీ, ఆర్ధిక సహాయం కానీ, పంపిణీ దారులు గానీ దొరకడం లేదనీ దర్శకులు నిరాశా నిస్పృహలతో మాట్లాడుతున్న సందర్భంలోనే, ఆశ్చర్యకరంగా బాలల చిత్రాలకు భారీగా ఆర్ధిక సహాయం చేస్తున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి డి.కె. అరుణ చెప్పారు!

కఫల్ అనే చిత్రంలో నటించిన బాలలు అజయ్, అంత్రాగ్, హరిణ్, అంజలి తమ తల్లి-దండ్రులకు దూరంగా ఉన్న గ్రామంలో హరిద్వార్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో నివసిస్తున్నారు. ఈ బాలలకు థియేటర్ అంటే ఏమిటో కూడా తెలియదట. ఇక్కడ చాలా సినిమాలు చూశామని ఆనందంగా చెప్పారు. పల్లెల్లో పెరిగే పిల్లలకే ప్రాపంచిక జ్ఞానం ఎక్కువ. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, అవాంతరాలను ఎదుర్కొని వాళ్ళే బాగా తట్టుకోగలుగుతారు. థియేటర్ ఏమిటో తెలియకుండానే, చూడకుండానే ఇంత గొప్పగా నటించారంటే, చూసి అవగాహన చేసుకుంటే ఇంకెన్ని అద్భుతాలు సాధిస్తారో కదా? అని ఆ బాలల సినిమా చూసిన పెద్దల హేమా హేమీలందరూ అమితంగా ఆశ్చర్య చకితులయ్యారు!

అందుకని “బాలల సినిమాలన్నీ దేశంలోని పిల్లలందరికీ, ముఖ్యంగా పల్లెలకు చేరాల”న్నారు బాలీవుడ్ నటి, థియేటర్ ఆర్టిస్ట్ సంజనా కపూర్.

ఇంత చక్కని బాలల చలన చిత్రోత్సవం కేవలం 7 రోజులు హైదరాబాద్-సికిందరాబాద్ లోని 13 థియేటర్ లలో మాత్రమే నిర్వహిస్తే సరిపోదని అప్పుటి సి.ఇ.ఓ శ్రవణ్ కుమార్ బాగానే గ్రహించారు.

చిల్డ్రెన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలు కవితా ఆనంద్ మానసిక వైకల్యం లాంటి పిల్లల సమస్యలపై ప్రత్యేక సినిమాలు తియ్యాలంటూ, అలాంటి ప్రత్యేకమైన బాలల పట్ల CIFFI (చిల్డ్రెన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా) ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు.

పసివాళ్ళను సంపాదన కోసం కన్నవాళ్ళే టి.వి.షోలకు ప్రోత్సహించడం బాధాకరమని అంటూ “సినిమా నిర్మాణాన్ని సిలబస్ లో చేర్చి నిరంతర శిక్షణ ఇవ్వాల” ని కాంపిటిషన్ లిటిల్ డైరెక్టర్స్ జ్యూరీ మెంబర్ వేద కుమార్ అన్నారు.

“బాల కళాకారులుగా తమ పిల్లల్ని చూసుకోవాలనుకుని ఉవ్విళ్ళూరే తలిదండ్రులు వేలం వెర్రిగా పిల్లల్ని టి.వి.రియాల్టీ షోలకు పంపుతున్నారు. పాటలోని అర్ధమేమిటో తెలిసే వయసే లేని పిల్లలు చేసే డాన్సులు జుగుప్సాకరంగా ఉంటు న్నాయి. ఇది చాలా విచారించదగ్గ విషయ” మని అంతర్జాతీయ బాలల లైవ్ యాక్షన్ పోటీ విభాగం జ్యూరీ అధ్యక్షులు హానీ ఇరానీ అన్నారు.

“జానీస్ నోర్డ్స్” అనే యువ దర్శకుడు చిత్రీకరించిన ”మదర్ ఐ లవ్ యూ” అనే అతని మొట్టమొదటి సినిమానే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి ఎంపికైంది. ఆయన “సినిమా అవార్డ్స్ కోసం తీసేది కాకుండా మంచి సమాజ నిర్మాణానికి దారి తీసే విధంగా ఉండాలి” అన్న విలువైన మాటలు చెప్పారు.

***

బాలలు సమాజ మనుగడకు అత్యంత ఆవశ్యకమైనవారు. “పిల్లలకంటే ప్రపంచంలో విలువైంది మరేదీ లేదు” అని అంటారు పెద్దలు. కానీ ప్రభుత్వానికి ఉండే “క్లాస్” స్వభావం వల్ల అది బాలలందర్నీ చేరడం లేదు. నవంబర్ 13 న “విక్టోరియా మెమోరియల్ హోం” లో కూడా చిత్ర ప్రదర్శన ఉంటుందని మీడియాలో వచ్చింది. చాలా సంతోషమనిపించింది ఎందుకంటే అది అనాధ బాలల ఆశ్రమం. విక్టోరియా మహారాణి వచ్చినప్పుడు ఆమె కోసం నిర్మించింది కాబట్టి చాలా విశాలంగా ఉండి పేద బాలలందరూ చూసే అవకాశముంటుందనుకున్నాం. 14 న థియేటర్ లన్నింటితో పాటు సినిమా కోసం చూస్తే విక్టోరియా మెమోరియల్ హోం అన్న పేరే లేదు!

ఒకపక్క బ్రహ్మాండంగా నగరంలో బాలల సంబరాలు జరుగుతుంటే పాతబస్తీ లోని సుధా టాకీస్ సమీపంలో సినిమాల గురించి బాలలకు తెలియనే తెలియదు. “బాలల దినోత్సవం” రోజున రకరకాల పనుల్లో చట్టవిరుద్ధంగా చాకిరీలో మగ్గిపోతున్న బాలకార్మికుల్ని మీడియా చూపించింది!

డెలిగేట్ పాస్ కోసం అప్లై చేసినవాళ్ళని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సినిమా కష్టాలు పెట్టారు. సీరియల్ నంబర్ రెండు, మూడు అప్లికేషన్ లకు కూడా డెలిగేట్ పాస్ లు రాలేదు. మంచి సినిమా కోసం ఎన్ని అడ్డంకు లెదురైనా అధిగమించి సాధించారు సినీ ప్రేమికులు!

చిన్న చిన్న చీకటి కోణాలను కాసేపు వదిలేస్తే అసలైన వెలుగులు- సినిమాలు మాత్రం ఒకదాన్ని మించి ఒకటి వర్ణనాతీతంగా ఉన్నాయి. రోజుకి మూడు సినిమాలు చొప్పున మేము చూసిన ప్రతి సినిమా ఒక అద్భుతమే! ఈ ఘనత మా మిత్రబృందానికి చెందుతుంది. ముఖ్యంగా పైడి తెరేష్ బాబు గారు బోలెడంత హోం వర్క్ చేసి ఎప్పుడెప్పుడే సినిమా ఎందుకు, ఎక్కడ చూడాలో చెప్పేవారు. ఇంకా బాపూ గారి అసిస్టెంట్ డైరెక్టర్ తన దగ్గరున్న సి. డి.లను మినహాయించి సమయం వృధా కాకుండా వేరే సినిమాలు చూసేలా జాగ్రత్తలు చెప్పేవారు. ఇంకా మా మిత్రుల్లో పిల్లల కథా రచయితలు భూపాల్, బమ్మిడి జగదీశ్వర రావు, సినీ రంగానికి చెందిన రాజు గారు, రఘు గారు, జగన్- సుధ అందరూ సినిమా సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నవారే! అందువల్ల మేమందరం చూసిన చిత్రాలన్నీ దేనికదే ఇతివృత్తాలు గొప్పగా ఉండి చాలా బాగున్నాయి.

ఉపన్యాసాల్లో తప్ప బయట ప్రపంచంలో ఎక్కడా కనపడని ఉన్నతమైన మానవసంబంధాలు, ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ప్రేమ, ప్రపంచవ్యాప్తంగా విచ్చిన్నమవుతున్న వివాహ సంబంధాల నేపధ్యంలో నాన్న లేని ఇంట్లో అమ్మను, అమ్మ లేని ఇంట్లో నాన్నను అపురూపంగా చూసుకునే పిల్లలు, పెంపుడు జంతువుల్ని ప్రేమగా సాకే పిల్లలు, ఉపాధ్యాయులు-విద్యార్ధుల మధ్య సదవగాహన, మంచి పనులకోసం సాహసాలు చేసే బాలలు, నాన్నమ్మ ఒడిలో కథ చెప్పించుకుని సేద దీరే పిల్లలు, తాతయ్యను వృద్ధాప్యంలో రక్షించే పిల్లలు, స్నేహితుల కష్టాలకు స్పందించి అవి తీర్చడానికి తపన పడే బాలలు, జంతువుల భాషను పట్టుకోగలిగిన ప్రత్యేకమైన పిల్లలు – మంచితనం, సహానుభూతి -ఇలాంటి సుగుణాలన్నీ సినిమాలోని పిల్లల్లో చూసి మనసులు ఆనందంతో తృప్తితో నిండిపోయాయి!

ఇద్దరు మనుషులు కలవడమే గగనమైన ఈ రోజుల్లో చిత్ర ప్రపంచానికి సంబంధించిన సినీ సృష్టికర్తలు- సినీ ప్రియులు ఒకచోట చేరి బాలలకు సినిమా విజ్ఞానాన్నందివ్వడం, అందరూ కలిసి గొప్ప సినిమాలను ఆస్వాదించడం నిజంగా అపురూపం!!

2013 చిత్రోత్సవంలో అసాధారణ రీతిలో బాలికలు ప్రతిభ కనపర్చిన సినిమాలు రావడం ఎంతో ప్రశంసనీయం! మానవత్వ విలువలు ప్రాతిపదికగా ఆ యా దేశాల్లో ఎన్నో కష్ట నష్టాల కోర్చి చిత్ర నిర్మాణం గావించే దర్శక, నిర్మాతలు-ఆ కధాంశాలను అర్ధం చేసుకుని సమర్ధవంతంగా నటిస్తున్న బాలలు, వీరు ముందు ముందు మెరుగైన సమాజాన్ని నిర్మిస్తారనే ధీమా కలిగించారు! ప్రేక్షకుల హృదయాల్లో ఆశాజ్యోతులు వెలిగించారు!!

2015 సంవత్సరంలో 19 వ, 2017 సంవత్సరంలో 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం వచ్చాక హైదరాబాద్ లోనే జరిగాయి. కొత్త కాబట్టి అనేక అవకతవకల్తో నడిచాయి. అసలు విషయం సినిమాలూ బాలల్ని సంతోషపెట్టి, ఆలోచనలు పెంచేంత హృద్యమైనవి రాలేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వల్ల ఎక్కువగా భారత్ నుంచి చాలా సినిమా లొచ్చినప్పటికీ, బాలలకు ఏ రకమైన చైతన్యాన్నివ్వలేని “Aatma, the soul” లాంటి చిత్రాలే ఎక్కువగా వచ్చాయి.

అదంతా సరే అనుకుంటే ఈసారి అసలుకే ఎసరు పెట్టారు! ఈసారి నవంబర్ 14 నుంచి 20 వరకూ ప్రభుత్వ తిరస్కారం వల్ల హైదరాబాద్ నగరానికి బాలల గజ్జూ రాలేదు! భాగ్యనగరం కళ తప్పి అభాగ్య నగరంగా వెల వెల బోయింది! దీనికి తోడు ఆర్ టి సి కార్మికుల ఆకలి కేకలతో మరింత బోసిపోయింది!

ఇలాంటి నిరాశా నిస్పృహలు కలిగించే పరిస్థితుల్లో భవిష్యత్తు పట్ల గొప్ప ఆశలతో కలలు కని అవి సాధించుకున్న ఒక వీధి బాలుడి చిత్రం గురించి తెలుసుకుందాం!

సుందరమైన లోకం:

ఇథియోపియా దేశం నుంచి స్విస్ భాషలో,ఆంగ్ల ఉపశీర్షికలతో వచ్చిన అత్యధుతమైన చిత్రం “Horizon Beautiful”. “స్టీఫన్ ఏగర్” (Stefan Jäger) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2012 లో స్విట్జర్లాండ్‌తో పాటు ఇథియోపియాలో చిత్రీకరించారు. దీని నిడివి 91 నిమిషాలు. పది సంవత్సరాల పైబడిన బాలల కుద్దేశింపబడిన చిత్రమిది.

ఇతివృత్తం: ఇథియోపియా దేశంలోని ఆడ్మస్సూ అనే ఒక బాలుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆట ఫుట్ బాల్. ఆ ఆటను ఆడి, “యూరప్ మొత్తంలో అతి గొప్ప సాకర్ క్రీడాకారుడు ఆడ్మస్సూ” అని ఘనకీర్తి తెచ్చుకోవాలనీ, సంగీతంలో నైపుణ్యం సాధించాలనీ అతనికి రెండు గొప్ప ఆశయాలుంటాయి. చూస్తున్నవారికి అవి బొత్తిగా పగటి కలలనిపిస్తాయి. ఎందుకంటే అతనొక వీధి బాలుడు. బాగా దుమ్ము కొట్టుకుపోయి చిరిగి పీలికలైన బట్టలతో, ఒక్కపూటైనా అసలు తినడానికే తిండే లేని పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తాడు. అతనున్న భౌతిక పరిస్థితులకీ, అతని తాహతుకీ ఆ కోరికలు అసాధ్యమైనప్పటికీ ఆశ్చర్యకరంగా అతని కలలు అనుభవంలోకి రావడమే ఈ సినిమా కథాంశం!

ఇథియోపియా రాజధాని “ఆడిస్ అబాబ”. అదొక విశాలమైన నగరం . అయితే అంత భారీ నగరమంతా కూడా కోకొల్లలుగా ఉన్న వీధి బాలలతో నిండిపోయి ఉంటుంది. ఆ వీధి పిల్లల్లో ఒక బాలుడు మన హీరో పన్నెండేళ్ళ ఆడ్మస్సూ. అతనికి ఫుట్ బాల్ ఆట అంటే ప్రాణం. “మెస్సి” అనే ఫుట్ బాలర్ అతనికి ఆదర్శం. సంగీతం రెండో అభిమాన కళ. ఈ రెండింటి గురించీ తానొక వీధిబాలుడిననీ, తనకెవరూ లేరనీ, ఎటువైపు నుంచి కూడా రవ్వంత ఆసరా లేదనే స్పృహ కూడా లేకుండా ఊహల్లో తేలిపోతుంటాడు. మెస్సిలాగా యూరప్ లోనే గొప్ప ఫుట్ బాల్ క్రీడాకారుడు కావాలనే దృఢ సంకల్పంతో అవకాశాలకోసం ఎదురుచూస్తూ జీవిస్తుంటాడు.

ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండే ఆడ్మస్సూ ఒక పెద్ద ముఖ్యమైన ఫుట్ బాల్ బాస్ ‘ఆడిస్ అబాబ’ నగరాని కొస్తున్నట్లు కనుక్కుని అతని స్నేహితులకి చెప్తాడు. అతనే సాకర్-పరిశ్రమ ద్రష్ట ఫ్రాంజ్. ఫ్రాంజ్ అనే అతను ఫుట్ బాల్ ఆటకు సంబంధించిన అన్ని విషయాల్లో నిర్ణయాధికారం గల కీలకమైన వ్యక్తి. అతనకి ఫుట్ బాల్ ఆటను దేశ, విదేశాల్లో ప్రమోట్ చేయడానికి అమోఘమైన అనేక ప్రణాళికలున్నాయి. ఆ కారణం గానే సాకర్ ప్రమోట్ చెయ్యడం కోసం ఆడిస్ అబాబ నగరాని కొస్తాడు. కానీ ఎంతసేపూ ఎత్తుకి పై ఎత్తు వేసే వ్యాపార వ్యూహాలు తప్ప మానవత్వం, దయ, కరుణ లాంటి అంశాలకు అతని హృదయంలో చోటుండదు.

ఫుట్ బాల్ షూట్ ప్రారంభమవడానికి చేసిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉంటాయి. చిరిగిన బట్టలతో నున్న ఆడ్మస్సూని చూచి ప్రధానద్వారం దగ్గర అడ్డగించి లోపలికి పోనివ్వరు. బయటి నుంచే బాల్ తో తన ప్రతిభను చూపిస్తూ, ఒక ఫుట్ బాల్ ఆటగాడిగా, ఫ్రాంజ్ దృష్టిని ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఫ్రాంజ్ అసలు పట్టించుకోడు. అతను ధనవంతుల పిల్లల ఫొటో షూట్ తో బిజీగా ఉంటాడు. దాంతో ఆడ్మస్సూ డీలా పడిపోతాడు!

అతని స్నేహితులు ఆడ్మస్సూ తెలివి తక్కువ తనాన్ని రకరకాలుగా ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తుంటారు!

మళ్ళీ రెండవ అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు మన ఆశావాది ఆడ్మస్సూ. వీధి పిల్లల్లోని ఒక దొంగల ముఠా ఎవరైనా ఒక గొప్ప ధనవంతుడిని కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్లు వేస్తుంటారు. వాళ్ళకు ఫ్రాంజ్ ని కిడ్నాప్ చెయ్యమని ఆడ్మస్సూ సలహా ఇస్తాడు. ఆ రకంగా ఫ్రాంజ్ ని కాపాడి, అతన్ని నిర్బంధించి ఎలాగోలా తన కలను సాకారం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు ఆడ్మస్సూ. కానీ వాళ్ళు చాలా ఎక్కువ మొత్తం డబ్బడుగుతారు. అది ఆడ్మస్సూకి సాధ్యం కాదు గనుక ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తాడు.

ఇంతలో మరొక ఫోటో షూట్ ఉందనే ఒక శుభవార్త వింటాడు ఆడ్మస్సూ! అదీగాక ఈసారి ఫోటో షూట్ వీధి పిల్లలతోననే సంగతి తెలిసి మహదానందపడిపోతాడు!! దాని ప్రారంభ ప్రకటన కోసం, ఫ్రాంజ్ ని నేరుగా కలవడం కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటాడు. అంతలోనే ఆశ్చర్యం! ఏం జరిగింది? “హేమర్ గేంగ్ బాయ్స్” అనే ఒక రౌడీ మూక ఆకస్మికంగా వారి సొంత ప్రణాళిక ప్రకారం ఫ్రాంజ్ ని కిడ్నాప్ చేసేస్తారు!!

ఆడ్మస్సూ-ఫ్రాంజ్ ఎక్కడ ఎలా మధ్యలో కలుస్తారు? ‘ఆడిస్ అబాబ’ నగరంలో మాయమైన ఫ్రాంజ్ ఇథియోపియన్ నిర్జనారణ్యంలో ఆడ్మస్సూని ఎలా కలుస్తాడు? అక్కడ ఏ విషయంలోనూ పొంతన లేని ఈ వింత జంట ఏమేమి సంఘటనలు ఎదుర్కొంటారు? ఇద్దరి మధ్య ఎంత గొప్ప సీన్లున్నాయి? ఒక మాయ లాంతరు దానంతటదే వచ్చి వెలుగు చూపించినట్లు సాకర్ అనుకూల భవిష్యత్తు ఆడ్మస్సూ ముందుకి ఎలా వస్తుంది? చివరకు ఆడ్మస్సూ కలలు కంటున్న సాకర్ స్వర్గం తలుపులు ఎలా తెరుచుకుంటాయి? వాళ్ళిద్దరి నటనా, ముఖ్యంగా ఎగుడు దిగుడుగా ఉన్న కొండలూ, గుట్టల మధ్యలో అడవి జంతువులతో ఆడ్మస్సూ చేసిన సాహసాలూ, నదురూ,బెదురూ లేకుండా ఒక విదేశీ పెద్దమనిషిని తన కనుకూలంగా మలచుకున్న ఆడ్మస్సూ అద్భుత నటనను చూడాలనుకున్న వారందరూ తెర మీద వీక్షించాల్సిందే!

ఆడ్మస్సూగా నటించిన బాలనటుడు ”హెనోక్ టెడేల” (Henok Tadele) నటన అద్భుతంగా ఉండి ఆనందం, ఆశ్చర్యం, సంభ్రమం కలిగిస్తాయి. మనం అప్పుడప్పుడూ మన చుట్టుపక్కల వీధిబాలల్ని చూసే అతి వాస్తవిక వాతావరణంలో సహజాతి సహజంగా అసలు నటనే కాదన్నట్లు అక్కడొక మన చిన్నారి అనాధ బాలుడు గెలుపు కోసం ఆరాట పడుతున్నట్లే అనుభూతి కలిగింది. మామూలుగా అయితే ఆ వయసు పిల్లలు ఏ రకమైన అండాలేని పరిస్థితుల్లో బోలెడంత అభద్రతాభావంతో ఉంటారు. కానీ మన ఆడ్మస్సూ లోకాలన్నీ జయించగలను అన్నంత ధీమాగా ఏ పరిస్థితుల కైనా సడలని ఆత్మ విశ్వాసంతో ఉంటాడు!

ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్తగా ఫ్రాంజ్ ఎంత శక్తివంతమైనవాడప్పటికీ మృగరాజుల్లాంటి కౄరజంతువులను అడవిలో చూసి ముచ్చెమటలతో దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటాడు. ఆయన దగ్గరున్న డబ్బంతా బలవంతంగా లాక్కుని, చివరికి చంపాలని ప్రయత్నించిన భయంకర మూకనుంచి తప్పించి ఆ క్షణంలో ఎవరో పంపినట్లే సిద్ధంగా ఉండి కాపాడతాడు ఆడ్మస్సూ!

ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారి ‘హెనోక్ టెడేల’ నిజ జీవితంలోనూ వీధి బాలుడే! సినిమా నిర్మిస్తున్న క్రమంలో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది! రోడ్లమీద తినడం,ఎక్కడ బడితే అక్కడ పడి నిద్రపోవడమే తప్ప అంతకుముందు అతనికి ఇల్లనేది తెలియదు! ఈ సినిమా షూటింగ్ తర్వాత అతనికొక షెల్టర్ హోం దొరకడమే కాకుండా, అక్కడినుంచి స్కూలుకెళ్ళి చదువుకునే అవకాశం దొరికింది. ఆ స్కూలు ఇథియోపియా లోని ‘సేలం’ అనే గ్రామంలో 25 సంవత్సరాలనుంచి అనాధ పిల్లలకోసం అంకిత భావంతో, కర్తవ్య నిష్ఠతో పనిచేస్తున్న ఒక గొప్ప సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందులో ఉండి చదివే బాలలకు వసతి సౌకర్యాలతో పాటు ఏదో ఒక వృత్తిలో జీవనాధారం కోసం నైపుణ్యం సాధించే వరకూ శిక్షణనిస్తారు. ఆ రకంగా మన హెనోక్ కు సేలం స్కూల్లో సంగీతశిక్షణ పొందడానికవకాశం కలిగింది. ఈ సినిమాలో ఆఖరి పాట పాడి, ఒక గాయకుడు కావాలన్న తన కలను నిజం చేసుకునే దిశగా తొలి అడుగులు వేస్తాడు హెనోక్!

స్విస్ రచయిత స్టీఫన్ ఏగర్ అవార్డులు గెల్చుకున్న అనేక సినిమా టీవీ ఫీచర్ ఫిల్ములకూ, డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్ తో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. అబ్రహం హైలే అనే అతను స్విస్ ఎంబసీ, జర్మనీలోని గోథె ఇనిస్టిట్యూట్ వారి సహకారంతో, ఆడిస్ అబాబలో స్థాపించిన ‘బ్లూ నైలు ఫిల్మ్ అండ్ టెలివిజన్’ అకాడమీ ఇథియోపియా లోనే గాక ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అంతర్జాతీయంగా పలు ప్రశంసలు పొందింది. ఈ చిత్ర దర్శకుడు స్టీఫన్ ఏగర్ అందులో సినిమా పాఠాలు బోధిస్తారు. ఇంత మంచి రచనతో సినిమా తియ్యడమే కాదు, హెనోక్ కి అత్యంత ఇష్టమైన వ్యాపకంతో ఒక జీవనాధారాన్నేర్పరిచి ”అతనికి ముందు ముందు మంచి జీవితం ఉంది” అని అనడం అనాధ బాలల పట్ల స్టీఫన్ కున్న ఆర్ధ్రతను తెలియజేస్తుంది.

మొత్తం సినిమా ఇథియోపియా లోని వీధిబాలలుండే స్థానిక ప్రాంతాల్లో చిత్రీకరించారు. నటులు కాని ఆ బస్తీలో సంచరించే మామూలు మనుషుల్ని, బాలల్ని తీసుకుని నటనలో తర్ఫీదునిచ్చి మంచి నటులుగా మలిచారు. ఎంచుకున్న కథకి దన్నుగా ఉండేలా సహజ శబ్దాలనూ, నిజ వాతావరణాన్నీ యధాతధంగా దృశ్యీకరించారు.

ప్రతి సినిమా లోనూ కొన్ని మలుపులుంటాయి. కానీ సినిమా మొదట్లో ఈ చిన్న పిల్లవాడికి ఇంతంత పెద్ద కోరికలేమిటి? అవెలా తీరతాయి? అని అనిపిస్తుంది ప్రేక్షకులకి. సత్యజిత్ రే “పథేర్ పాంచాలి”లో అందరికీ చిన్న చిన్న కోరికలుంటాయి. అయినా ఏ ఒక్కటీ తీరదు. కానీ ఆడ్మస్సూ కి ఆకాశాన్నందుకోవాలన్న పెద్ద పెద్ద ఆశయాలు. వాటిని ఏ ఆసరా లేకుండానే ఉత్తిగా కలలు కంటూనే సాధించుకుంటాడు. ”కలలు కనండి. ఆ కలలను సాకారం చేయడానికి ప్రపంచంలోని శక్తులన్నీ ఏకమై మీ కలల్ని నిజం చేస్తాయి “అన్న అబ్దుల్ కలాం గారి మాటలిక్కడ రుజువయ్యాయి.

ఫ్రాంజ్ సమాజంలో మంచి స్థితిపరుడు. అతని సాంఘిక హోదా అతనికి సమాజంలో కొండంత గౌరవాన్నిస్తుంది. కానీ ఒంటరిగా నిర్మానుష్యమైన అడవిలో చిక్కుకున్నప్పుడు అతని ధనం, ఉద్యోగం, పదవులేవీ అతనికెందుకూ పనికి రాకుండా పోయాయి. కానీ ఆడ్మస్సూకి సంఘంలో ఏ హోదాలేదు. అనాధబాలుడు. ఒంటరిగా అడవిలో తన శక్తి యుక్తు లన్నీ ఉపయోగించి ఫ్రాంజ్ ని రక్షించాడు. మనుషులు నిరాధారంగా రోడ్డు మీదున్నప్పుడు ఎవరి శక్తి, అంతర్నిహిత ప్రతిభా పాటవాలు ఏమిటి? అని ఆలోచించమంటారు డైరెక్టర్ స్టీఫన్ ఏగర్. ఫ్రాంజ్-ఆడ్మస్సూల మధ్య నున్న మానవ సంబంధం రెండు భిన్న సంస్కృతులు, విభిన్న వయస్సులు, ఇద్దరి వేరు వేరు వ్యక్తిగత కలలు- వీటన్నిటినీ అద్భుతంగా ఆవిష్కరించి, వాటి మధ్య సహజంగా ఉండే ఘర్షణనూ, ప్రాథమిక మానవ నైజాల్నీ నిజాయితీగా చిత్రించి ఆశ్చర్యకరంగా, దిగ్భ్రాంతి గొలిపే విధంగా ప్రేక్షకుల కళ్ళకు బొమ్మ గట్టిన తీరు ఎంతైనా ప్రశంసనీయం!

ఫ్రాంజ్-ఆడ్మస్సూలు ఇద్దరూ పుట్టుకతోనే సహజ పథక రచయిత లనిపిస్తారు. వారి వారి స్థాయిని బట్టి ఇద్దరూ తమవైన ప్రణాళికలేస్తుంటారు. కానీ వారిద్దరూ తమను తాము వాస్తవంగా అర్ధం చేసుకోవడానికి ఈ కిడ్నాప్ ఎంతో సహకరించింది.

అసమానమైనకథతో అద్భుతంగా, తీర్చిదిద్దిన అపురూప చిత్రమిది. చిన్న చిన్న అల్పమైన విషయాలకే నీరుగారి పోతున్న నేటి పెద్దలూ, యువకులూ, బాలలూ అన్నివయసులవారూ చూడవలసిన చిత్రమిది. ముఖ్యంగా టీనేజర్లకు గొప్ప ఆత్మస్థైర్యాన్నిస్తుంది!

పాల్గొన్న చలన చిత్రోత్సవాలు – సాధించిన అవార్డులు:

2012 లో తీసిన ఈ సినిమా అదే సంవత్సరంలో ఎన్నో దేశాల్ని చుట్టి వచ్చి 75 ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొని, పది అవార్డులు గెల్చుకుంది.

2013 లో సాధించిన అవార్డులు-
జర్మనీలోని హాంబర్గ్‌లో 11 వ పిల్లల, యువత చిత్రోత్సవం ‘మిచెల్’
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో 36 వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘లుకాస్’,
స్విట్జర్లాండ్‌ చలన చిత్రోత్సవంలో,
ఇటలీలో 43rd గిఫోనీ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ అండ్ యూత్ ఫెస్టివల్

2013 తర్వాత ఆ ప్రయాణం ఇప్పటివరకూ సాగుతూనే ఉంది. ప్రతిచోటా ప్రశంసల వెల్లువలూ, అవార్డుల పంటలూ పండుతూనే ఉన్నాయి!

***

ఇక మన ప్రస్తుత విషయానికొస్తే ఇప్పటికైనా సరే, రంగు రంగుల సీతాకోక చిలుకల్లాగా దేశ, విదేశీ బాలలు నగరానికి అద్వితీయమైన అందాలనూ, తేజోమయమైన గొప్ప శోభను తెచ్చే “21 వ బాలల అంతర్జాతీయ చిత్రోత్సవా” న్ని తెలంగాణా ప్రభుత్వం కళా హృదయంతో అర్ధం చేసుకుని తెస్తుందని ఆశిద్దాం!

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

One thought on “కళ తప్పుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు

Leave a Reply