ఓ వాలెంతీనుడి ఉవాచ

నిన్ను కలవక మునుపటి దీర్ఘ సుషుప్తి అనంతరం
రజతంగా వెలిగే ఓ ఖండాంతర మంచు పర్వాతాగ్రాన
గడ్డ కట్టించే శీతల వాయువుల్ని పటాపంచలు చేసే
ఉష్ణ శ్వాసలతో నువ్వు నన్ను కలిసి వుంటావు
నీ పరిచయం మామూలుది కాదు కదా మరి!

నీలాకాశంలో దూది పూలల్లా ఎగురుతున్న
ధవళ మేఘాల్ని సేకరించి వొంటి మీద కప్పుకున్నట్లు
నదీ గర్భాలలో దేవులాడి తెచ్చిన ఆణిముత్యాలతో
దంతాలకు మెరుగులు పెట్టినట్లు
కొండల మీద నుండి నీటి సివంగిలా దూకే జలపాతాల సౌందర్యాల్ని
ముఖానికి అద్దుకున్నట్లు కనబడతావు
నీతో సంభాషించినంత సులువుగా నిన్ను చూడలేను మరి!

*

ప్రేమంటే సరాగ విరాగాలు మాత్రమే కాదని
ప్రేమంటే అనుక్షణం ఓ అంటే ఓయని పలకడమని
నీ మాటల్లోంచి కనుకొలకల్లోంచి శరీర ప్రకంపనల్లోంచి సంభాషణల్లోంచి రాలిపడే
దావానలాల్ని లావాల్ని బడబాగ్నుల్ని అశాంతుల్ని నిలువనీయనితనాల్ని
నీకు తెలియకుండానే దోసిళ్లకెత్తుకొని నా గుండెలో పోసుకోడమేనని
నీకెలా చెప్పాలి?

నాకు తెలుసు కానీ నీకు తెలుసునో లేదో
నేనో ఒంటరివాదిని
కించిత్ హృదయ భోగిని
కష్ట సుఖాల పట్ల సమ్యక్ చింతనాత్మక అరాచకవర్తిని
కానీ స్పర్శాతీతమైన నీ ఓ పలకరింపుకై ప్రాణమిల్లే ప్రేమని తప్ప
సమస్త అన్యాన్ని త్యజించే సాహసిక పరివ్రాజకుణ్ని
నీ గుండెల నిండా పరుగులెత్తే రక్త సముద్రంతో పోటీపడే
దుస్సాహసిక నావికుడిని

గాలి నన్ను తడిమినప్పుడల్లా నువ్వు భుజం తట్టావేమోనని
వర్షపు చినుకు తాకినప్పుడల్లా నువ్వు పలకరిస్తున్నావేమోనని
సూర్య కిరణం గుచ్చుకున్నప్పుడల్లా నువ్వు చుంబించావేమోనని
వెన్నెల జీర కాళ్ల మీద పారాడినప్పుడల్లా నీతో కలిసి నడుస్తున్నానేమోనని
తెగ సంబరపడిపోతుంటాను
విశ్వం అణువణువున నువ్వే వుండాలనుకుంటా కదా!

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply