ప్రపంచవ్యాప్తంగా భగభగ మండిన 2024వ సంవత్సరంలో బెంగాలు ప్రాంతానికి చెందిన ఆంగ్ల కవయిత్రి మౌమితా ఆలం సంక్షోభానికి గురి అయింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మారణహోమాలకు మౌమితా కవి హృదయం తల్లడిల్లిపోయింది. తెల్లవారుఝామున సగం నిద్రా, సగం మెలుకువ సమయాన ఆమె పలవరింతలు కవిత్వం అయ్యాయి. దాన్ని పొద్దున్నే ఉదయమిత్ర శ్రద్ధగా చదివి తన సహజ తెలంగాణ తెలుగు నుడికారంతో అనువదించారు. ఎక్కడ ఉత్తర బెంగాల్ మారుమూల ప్రాంతం? ఎక్కడ తెలంగాణా చిన్న పట్టణం? ఎక్కడ 35 ఏళ్ల యువతి, ఎక్కడ డెబ్బై ఏళ్ల పెద్దమనిషి? వీరిద్దర్నీ కలిపింది భావ స్వారూప్యమే.
ఆ కవితలను ఒక దగ్గర చేర్చి ఇల్లొక అబద్దం పేరుతో మాతృక ప్రచురణలుగా తీసుకొని రావటం మాతృక వంతు అయింది. 2023లో ఆమె మొదటి (తెలుగులో) కవితల సంపుటి రాయకూడని పద్యం కూడా ఉదయమిత్రగారే అనువదిస్తే మాతృక ప్రచురణలుగానే ప్రింటు అయింది.
మౌమితా ఆలం కవిత్వంలోనే ఆలోచిస్తుంది. కవిత్వంతోనే శ్వాసిస్తుంది. ఆమెకు దేశ, ప్రపంచ రాజకీయాల పట్ల అవగాహన వుంది. లోతుగా స్పందించే గుణం వుంది. పదునైన పదజాలం ఆమె పొదిలో దాగుంది. వెరసి ఆమె కవిత్వం అలతి పదాలతో -పొద్దున్నే వాయిలు చీర కట్టుకొని, కళ్లు ఎరుపు చేసి చూసే పక్కించి అమ్మాయిలాగా -అతి సామాన్యమైన రూపంతో, గంభీరమైన భావావేశంతో, ఫోను తెరవగానే మన ముందుకు వస్తుంది.
ఒక మహిళగా, ఒక ముస్లింగా, ఒక టీచరుగా, ఒక సాంస్కృతిక కార్యకర్తగా, ఒక మానవతావాదిగా మౌమితా ఎప్పుడూ అప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుంటుంది. అయితే ఆ ఆలోచనలకు ఒక తీరం ఉంటుంది. ఆ తీరం పీడితుల వైపే ఉంటుంది. అసహాయలైన స్త్రీలు, అనామకులు, ‘చొరబాటుదారులు’, ఫ్రిజ్ లో మాంసం వుంచుకొవటం వలన హత్యకు గురయ్యే వాళ్లు, పిల్లలు, నిర్వాసితులు, ఓటూ పౌరసత్వాల నిరాకరణకు గురయ్యేవాళ్లు, సొంతింట్లోనే సైన్యం చేతిలో ప్రాణాలు పోగొట్టుకొంటున్నవాళ్లు, అన్యాయంగా జైళ్లపాలైన వాళ్లు -రాజ్యం ఇప్పుడు ఎవరి మీద కక్ష కట్టి వుందో వాళ్లంతా ఆమె కవితా వస్తువులు. అలాంటి కవులను చూస్తే రాజ్యానికి కోపం వస్తుంది. అరెస్టు చేసేయాలనిపిస్తుంది. ఎన్ కౌంటర్ చేసి పారేయాలనిపిసుంది. ఇంచుమించు అలాంటి శత్రువైఖరినే మౌమితా ఇప్పుడు ఎదుర్కొంటుంది -సమాజంతో, ప్రభుత్వంతో.
ఆమెలో వుండే స్త్రీ నిత్యం పోరాటంలోనే ఉంటుంది. పితృస్వామ్యంతో, కౌటుంబిక పెత్తనంతో, నువ్వు నాకు పరికరంగా ఉపయోగ పడాల్సిందే అనే కేప్టలిజంతో -ఆమె నిత్య ఘర్షణలో వుంటుంది. స్పష్టతతో వుంటుంది. వాటికి ఎదురుగా నిలబడి ఎద్దేవా చేస్తుంది. కవిత్వంలో గాని, జీవితంలో ఎక్కడా లొంగుబాటు వుండదు. అయితే స్త్రీగా ఆమెపై జరిగే అణచివేత గాయాలను మోస్తూ -ఇతర అణచివేతల రక్తస్రావాలను ప్రేమగా స్పర్శించి వైద్యం చేస్తుంది తన కవిత్వంతో.
మాతృకకు కావాల్సిన కవిత్వం ఇదే అని అనిపించే లాంటి పద్యాలను ఆమె రాశారు. గుండె చప్పుడు శీర్షికన మాతృక ప్రచురించాల్సిన కవిత్వానికి నమూనాను మౌమితా సృష్టించింది. దాన్ని ఉదయమిత్రగారు ఇష్టంగా అనువాదం చేసి ఇచ్చారు. మౌమితాలాంటి వందలాది కవయిత్రులను మాతృక తయారు చేసుకోవాల్సిన బాధ్యత మిగిలేవుంది.
ఇల్లొక అబద్ధం పేరుతో మాతృక ప్రచురణలుగా వస్తున్న ఈ చిరు పుస్తకాన్ని మీరు ఆదరిస్తారని భావిస్తున్నాము.