జుబ్లీహిల్స్ లో ‘స్టార్’ కేఫ్. పగలూ రాత్రి తెరిచి ఉండే రేస్టారెంట్. ఇంట్లో ఉండాలనిపించక లాప్ టాప్ తీసుకుని డిన్నర్ పేరుతో వచ్చి అక్కడే పని చేసుకుంటోంది హారిక.
చుట్టూ ఎవరికి వారు వారి ప్రపంచాలలో మునిగి తేలుతూ. అలాగే ఎవరికి కావల్సిన ప్రైవసీ వారికక్కడ. ఒంటరిగా ఉన్నా, ఒంటరితనం అనిపించని వాతావరణం. ఈ మధ్య హైదరాబాద్ నగరంలో ఇలాంటి రెస్టారెంట్లు చాలానే వెలిసాయి. రాత్రి పన్నెండు తర్వాత, పగలు మూడింటి దాకా రష్ తక్కువగానే ఉంటుంది. గంటకో బ్లాక్ కాఫి లేదా మూడ్ వచ్చినప్పుడు మొహిటో, మార్గరిటా, జిన్ అండ్ టానిక్, వాటితో పాటు ఫిష్ ఫింగర్స్, జింజర్ చికన్ ఇలా ఏదో ఒకటి ఆర్డర్ చేసి పని చేసుకుంటూ ఉంటుంది హారిక. అంతకు ముందు వారానికి ఒక సారి ఇలా వచ్చేది, ఇప్పుడు రెండు మూడు సార్లు రావడం మామూలయింది.
జతిన్ తో బ్రేక్ అప్ తర్వాత ఇంట్లో ఉండాలనిపించట్లేదు హారికకు. రెండేళ్ల ప్రేమ వారిది. తల్లి తండ్రులు చూసిన సాంప్రదాయపు అమ్మాయితో పెళ్లి అంటూ బ్రేక్ అప్ చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రెండేళ్ళలో అతన్ని ఓ పొజిషన్ లో చూడాలని చాలా తపన పడింది హారిక. ఒకే చోట పని చేస్తుండడంతో, తన వర్క్ పక్కన పెట్టి అతని ప్రాజెక్ట్ కోసం పని చేసింది. రిలేషన్ షిప్ లోకి వచ్చిన నెలకే హారిక ఫ్లాట్ లోకి మారాడు జతిన్. రెండేళ్ళు ఎలా గడిచిపోయాయో తెలీదు. హారిక రాత్రి పగలు కూర్చుని సరిచేసిన అతని ప్రాజెక్ట్ సక్సెస్ అయి ప్రమోషన్ కూడా అందుకున్నాడు జతిన్. దానితో కోల్ కత్తాకు ట్రాన్స్ఫర్ అయింది. తనూ అక్కడికే షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకుంది హారిక. కాని ఇంతలో తల్లి తండ్రులు పెళ్ళి నిశ్చయించేసారని, వారి మాట కాదనలేననే షాకింగ్ న్యూస్ చెప్పి హారిక జీవితం నుంచి నిష్క్రమించాడు జతిన్.
రెండు నెలలు పైగా హారిక మంచానికి అతుక్కుపోయింది. విషయం కనుక్కుని హారిక తల్లి ఆమె దగ్గరకు వచ్చింది. తల్లికి ముఖం చూపించలేకపోయింది హారిక. తప్పు చేసిన ఫీలింగ్ ఆమెలో. ఆఫీసులో సునంద, రాఘవ్ లు వివరిస్తే తప్ప తాను ఓ ట్రాప్ లో ఇరుక్కుపోయానన్నది ఆమెకు అర్ధం కాలేదు. డైనమిక్ అని పేరు పడిన తాను ఎలా ఇంతలా మోసపోయానన్నది లోలోన ఆమెను తినేస్తోంది. చిన్నప్పటి నుండి అష్టకష్టాలు పడి పెంచిన తల్లిని కూడా దూరం పెట్టానన్నగిల్ట్ మరో వైపు. కాని ఎప్పటికప్పుడు తన సంగతి కనుక్కుంటూనే ఉన్న ఆమ్మ తనను వెతుక్కుంటూ రావడం, కంటికి రెప్పలా తనను మూడు నెలల పాటు దగ్గరుండి కాపాడుకోవడం ధైర్యం నూరిపోయడం, తల్లి విలువను తెలియజేసాయి.
నెలరోజుల క్రితమే సెలవు పూర్తయిందని అమ్మ చెన్నై వెళ్లిపోయింది. తనతో రమ్మని ఎంతో చెప్పింది. కాని హారిక వెళ్ళలేకపోయింది. అయితే ఎప్పటిలా మొండిగా కాక, తన వర్క్ ను నిర్లక్ష్యం చేసి జతిన్ ప్రమోషన్ కోసం పని చేస్తూ ఆఫీసులో వెనకబడిపొయానని, ఇక్కడే ఉండి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నానని తల్లికి వివరించింది. ఏదో నెపంతో హారిక పనిలో పడాలన్న ఆలోచనతో ఉన్నఆమె కూతురికి వెయ్యి జాగ్రత్తలు చెప్పి మరీ ఊరికెళ్లింది. ఇప్పటికీ ప్రతి రోజు రెండు మూడు సార్లు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇంతకు ముందులా తల్లి ఫోన్ విసుగు తెప్పించట్లేదు హారికకు. ప్రతి రోజు ఈ ఫోన్ ల కోసం ఎదురు చూస్తోంది.
కాని హారికకు రాత్రిల్లు ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది. నిద్రపోకుండా గంటలు గంటలు జతిన్ ప్రాజెక్ట్ కు పని చేసిపెడుతూ, తన పని నిర్లక్ష్యం చేయడం, జతిన్ తో గడిపిన జీవితం గుర్తుకు వస్తూ ఆమెను చికాకు పెడుతుంటే, పని పై శ్రద్ద పెట్టలేకపోయేది. అప్పుడే సునంద ఈ రెస్టారెంట్ గురించి చెప్పింది. దీని ఓనర్ సుప్రీం, రాఘవ స్నేహితుడు అవడంతో ఆమెను ఇక్కడ ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఎందుకో ఇక్కడే రిలాక్స్డ్ గా అనిపిస్తుంది హారికకు. పనిపై కూడా శ్రద్ద పెట్టగలుగుతోంది.
రెండు గంటలుగా బ్రేక్ లేకుండా పని చేస్తూ ఉండటం వల్ల కాస్త వెన్ను నొప్పిగా అనిపించింది. కాసేపు లేచి నడవాలనిపించింది. అటు పక్క ఎత్తుగా పెరిగిన క్రోటన్ల దగ్గర స్మోకింగ్ జోన్ ఉంది. స్మోకింగ్ అలవాటు లేకపోయినా ఈ టైం లో అక్కడెవరూ ఉండరనిపించి అటు పక్కకు వెళ్ళింది హారిక. వెన్ను క్రిందకు, పైకి వంచి చేతులు సాగదీసుకుంది. చెట్ల మధ్య నుండి ఒకతను ఫోన్ మాట్లాడడం ముగించి విసురుగా ఆమె వైపుకు వచ్చాడు. అక్కడ హారిక ఉండడం చూడకపోవడంతో ఆమెను గుద్దుకున్నాడు. హారిక క్రింద పడబోతూ పక్కన చెట్టును పట్టుకుని సర్ధుకుంది.
అతను వెంటనే “అరెరె సారీ మేడం మై మిస్టేక్. ఐ కుడ్ నాట్ సీ యూ” అంటూ హారికకు చేయి అందించాడు.
అతని చేయి విదిలించి కొట్టింది హారిక. కోపంగా అతన్ని చూస్తూనే వడివడిగా నడుచుకుంటూ తన టేబిల్ దగ్గరకు వెళ్ళిపోయింది. లాప్ టాప్ మూసి అక్కడినుండి వెళ్ళిపోదాం అనుకుంది. కాని అటు పక్కన టీం మెంబర్ నుండి రెండు మెసేజ్ లు బ్లింక్ అవుతున్నాయి. ఇక తప్పక వాటికి జవాబిస్తూ పనిలో కంటిన్యూ అయిపోయింది.
బాయ్ పక్కకు వచ్చి నిలబడ్డాడు. “నాచోస్ విత్ సల్సా” తన ఆర్డర్ చెప్పింది హారిక.
“ఇట్శ్ ఫ్రం మై సైడ్ ఫర్ ది యంగ్ లేడీ” పక్క టేబుల్ నుండి వినిపించింది.
తల తిప్పి చూసింది హారిక. ఇందాక ఆమెను ఢీ కొట్టిన యువకుడు. ఆమె వైపే చూస్తున్నాడు.
“థాంక్స్ బట్ సారి” గట్టిగా చెప్పి మళ్ళీ సిస్టం వైపు తల తిప్పింది హారిక
అతను ఆమె దగ్గరకు వచ్చాడు
“చూడండి మిస్”. ఆమె పక్కన కుర్చీ లాక్కుని కూర్చూంటూ అన్నాడు
“మిమ్మల్ని ఇక్కడ ఇదే టేబిల్ పై వర్క్ చేసుకుంటూ చాలా సార్లు గమనించాను. పక్కనెవ్వరినీ గమనించకుండా మీ పని మీరు చేసుకుంటూ కనిపించేవారు. ఐ అడ్మైర్ యువర్ డెడికేషన్. అండ్ ట్రస్ట్ మీ ఐ యాం సారి అబౌట్ థట్” అన్నాడు ఇందాకటి చెట్ల వైపు చూపిస్తూ.
“ఇట్శ్ ఓకే” అంది హారిక.
కాసేపు ఇద్దరి మధ్య మౌనం…
బాయ్ ఆర్ఢర్ చేసినవి తీసుకొచ్చి పెట్టాడు. తన టేబిల్ పై నున్న చిల్లీ గార్లిక్ ఫ్రాన్స్, ఆనియన్ రింగ్స్ హారిక కూర్చున్న టేబిల్ వద్దకు తెచ్చుకున్నాడు అతను.
హారిక తల ఎత్తి అతనివైపు చూసింది. అతని చేతిలో బకార్డి…
‘మిస్టర్’ అంది కోపంగా
అతను అర చేతులు పైకెత్తుతూ “ఐ నో యు వాంట్ ప్రైవసి. బట్ మామ్ ప్లీజ్ ఐ నీడ్ హ్యూమెన్ ప్రెజెంస్. ప్లీజ్ మీ పనికి అడ్డు రాను. ఈ కుర్చీలో కూర్చుంటాను. ట్రస్ట్ మీ ఐ యాం గోయింగ్ థ్రూ ఏ బాడ్ ఫేజ్. ప్లీజ్” అన్నాడు.
వింతగా అనిపించింది హారికకు. దూరంగా కౌంటర్ దగ్గర సుప్రీం తన వైపు చూడడం గమనించింది. హారిక ఇక్కడ ఉన్నంతసేపూ ఆమెను మధ్యలో గమనించుకుంటూ ఉంటాడు సుప్రీం. అతన్ని దగ్గరకు పిలుద్దాం అనిపించి పరిక్షగా తన ఎదురు కుర్చీలో కూర్చున్న ఆ యువకుడిని చూసింది. అతని కళ్లలో నీళ్లు కనిపించాయి. ముఖం నిండా దుఖం. ఎందుకో అతన్ని అక్కడి నుండి పంపించేయాలనిపించలేదు. సుప్రీం వైపు చూసి పర్లేదన్నట్లు తల ఊపింది.
ఒక గంట పాటు అక్కడే పని చేసుకుంటూ గడిపింది హారిక. మధ్య మధ్య అతని వైపు చూస్తే ఏదో ఆలోచిస్తూ ఎక్కడో చూపులు నిలిపి కనిపించేవాడు. హారికను అతను డిస్టర్బ్ చేయలేదు. ఆమె కూడా అతన్ని పలకరించలేదు. అతని కళ్ళలోని తడిని గమనిస్తూ ఉండిపోయింది.
అప్పటికి పని పూర్తయిందనిపించి సిస్టం షట్ డౌన్ చేసింది హారిక. అతని ఎదురుగా ఉన్న ప్లేట్లు సగం ఖాళి అయ్యాయి. టైము మూడున్నర. బైటికి నడుస్తూ అతన్ని చూసింది. తల వెనక్కు వాల్చి కళ్లు మూసుకుని ఉన్నాడు. మౌనంగా ఇంటి ముఖం పట్టింది హారిక.
——
మూడు రోజుల తర్వాత రెస్టారెంట్ లో అదే టేబిల్ మీద హారిక పనిలో మునిగి ఉంది. పక్కన ఎవరో వచ్చి నిల్చుని హాయ్ అని పలకరిస్తే చూసింది. అతనే ఆమె పక్కన నిలబడి.
‘హాయ్’ అని బదులిచ్చింది హారిక
“ఐ ఆం ధీరజ్. అండ్ థాంక్స్ ఫర్ దట్ డే. ఇట్ మెంట్ ఎ లాట్” అన్నాడతను
“ఐ ఆం హారిక”
అతను ఏదో మాట్లాడబోయాడు. ఇంతలో సెల్ మోగింది. అతని మొఖంలోని నవ్వు మాయమయ్యింది. ఫోన్ డిస్ప్లే చూస్తూ పక్కకు వెళ్ళాడు. అతను రెస్టారెంట్ పేరు చెప్పడం హారికకు వినిపించింది.
ఒక అరగంట తర్వాత వాష్ రూంకు వెళదాం అని లేచింది హారిక. ఆమె కూర్చునే టేబిల్ కు కాస్త వెనగ్గా ఉంటాయి లేడీస్ వాష్ రూమ్స్. హారిక వాష్ రూం నుండి బైటకు వచ్చి పక్కనే ఉన్న వాష్ బేసిన్ పైన అద్ధంతో చూసుకుంటూ జుట్టు సర్ధుకుంటోంది. పక్కన ఓ మధ్య వయసున్న స్త్రీ లిప్ స్టిక్ సరి చేసుకుంటూ హారికను చూసి నవ్వింది. ఈ లోగా ఆమె ఫోన్ మ్రోగింది.
ఆమె చాలా సైలెంట్ గా ఫొన్ వింటోంది. ఓ రెండు నిముషాల తర్వాత. “లుక్ ఐ పే మగ్నానిమస్లీ. అండ్ ఐ వాంట్ వాట్ ఐ పే ఫర్. ఐ డిసైడ్ వాట్ ఐ వాంట్ టు బయ్. ఆస్క్ ఫర్ మోర్. ఇట్ విల్ బీ పేడ్ బట్ ఆన్ మై టర్మ్శ్” అంటూ ఫోన్ పెట్టేసింది.
ఆమె కట్టుకున్న షిఫాన్ చీర్, హేర్ స్టైల్, చేతిలో లూయిస్ వ్యుట్టన్ బాగ్, ఆమె నుండి వస్తున్న గూచి పరిమళం, ఆమె స్థాయిని తెలుపుతున్నాయి. డబ్బు ఇచ్చే డిగ్నిఫైడ్ లుక్ తో ఉన్న ఆమెను అడ్మైరింగ్ గా చూస్తూ బైటకు వచ్చింది హారిక.
కాసేపయ్యాక ఇక ఆ రోజుకి పని పూర్తయిందనిపించి ఇంటికి బైలుదేరింది. వాలెట్ పార్కింగ్ లో తన కారు కోసం ఆగి ఉన్న హారిక ముందుకు ఒక బెన్జ్ వచ్చి ఆగింది. అందులోనుంచి ధీరజ్ దిగాడు. డ్రైవింగ్ సీట్లో హారిక రెండు గంటల క్రితం వాష్ రూం లో చూసిన స్త్రీ ఉంది. ఇద్దరినీ మార్చి మార్చి చూసింది హారిక. హారికను చూసిన ధీరజ్ ఆమెను ఇంతకు ముందెప్పుడూ చూడనట్లు రెస్టారెంట్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
——
రెండు రోజుల తర్వాత అదే హోటల్ లో ఒంటరిగా కూర్చున్న ధీరజ్ ను చూసి పలకరింపుగా నవ్వింది హారిక. అతను ఇబ్బందిగా నవ్వాడు. ఇద్దరూ వారి వారి టేబిల్ల వద్ద కూర్చుని కావలసినవి ఆర్డర్ చేసుకున్నారు. హారిక సెల్ మ్రోగింది. డిస్ల్పే చూసిన హారిక కళ్ళల్లో ఆనందం
“ఎస్ మమ్మీ” అంది ఉత్సాహంగా
అవతలి నుండి హారిక తల్లి కంగ్రాట్శ్ చెబుతోంది
‘థాంక్స్ మమ్మీ. ఐ డిడ్ ఇట్. ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది. నా టీం నాకు దొరికింది. ఐ యాం బాక్ ఇన్ మై పొజిషెన్’ చెప్పింది ఉత్సాహంగా.
అవతల హారిక తల్లి ఏదో చెప్పుకుపోతుంది. ఫోన్ వింటున్న ఆమెనే చూస్తున్నాడు ధీరజ్.
ఇంతలో హారిక ముఖంలో కోపం, విసుగు త్వరత్వరగా కమ్మేసాయి.
“మమ్మీ నాట్ నవ్, ఈ రోజు నేనెంతో ఆనందంగా ఉన్నాను. డోంట్ స్పాయిల్ ఇట్. నేను పెళ్లి చేసుకోను. ఎప్పటికీ చేసుకోను. నీకు ముందే చెప్పాను. ఈ మగాళ్ళంతా బ్రూట్స్, ఆడపిల్ల కనిపిస్తే ట్రాప్ చేసి అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోయే బాస్టర్డ్శ్. నేను ఏ మగాడికి లొంగి ఉండను. అ యాం డన్ విత్ దట్. ఈ టాపిక్ మళ్ళీ నా దగ్గర తీసుకురాకు” అంది. ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి. మనిషి కోపంతో ఊగిపోతోంది.
అవతల హారిక తల్లి ఆమెకు ఏదో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది.
“మమ్మీ కన్విన్స్ చేయాలని చూడకు. నాకు రిలేషన్ షిప్స్ మీదే నమ్మకం పోయింది. నిన్నూ డాడీని చూసాను. నువ్వు డాడితో పడింది సరిపోలేదా? డైవర్స్ తర్వాతే కదా మనం నిశ్చింతగా ఉండగలిగాం. మెన్ ఆర్ పిగ్స్. నేను మళ్ళీ ఆ ట్రాప్ లోకి పడను. నువ్వు పదే పదే ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు” అంటూ ఫోన్ పెట్టేసింది. తర్వాత కూడా చాలా సేపటిదాకా ఆమె మామూలు మనిషి కాలేకపోయింది.
పక్క టేబిల్ నుండి ధీరజ్ ఆమెనే చూస్తున్నాడు.
దాహంగా అనిపించింది హారికకు. వాటర్ బాటిల్ కోసం బాయ్ ని పిలిచింది. తన టేబుల్ మీదున్న బాటిల్ అందించాడు ధీరజ్.
థాంక్స్ చెప్పి అది అందుకుని గటగటా నీళ్ళు తాగింది.
బాయ్ వచ్చాక, ఒక మార్గరిటా, ప్రాణ్ టెంపురా ఆర్డర్ చేసింది. తనకు కావలసినవి చెప్పాడు ధీరజ్.
‘మే ఐ’ అంటూ ఆమె టేబిల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
అంగీకారంగా తల ఊపింది హారిక.
“సారి మీ కాన్వర్జేషన్ విన్నాను” అన్నాడు.
“సారి నేనే గట్టిగా మాట్లాడాను. నా మూడ్ అంతా పాడు చేసింది మమ్మీ” అంది హారిక
“సంథింగ్ బిగ్ టుడే” నవ్వుతూ అడిగాడు ధీరజ్.
“ఎస్. నా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది. చాలా రోజులుగా వర్క్ ను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. జాబ్ పోయె స్థితికి వచ్చింది. ఇప్పుడు ఐ కేం బాక్ టూ మై ఓల్డ్ స్టేటస్” అంది హారిక
“మీరు వర్క్ నెగ్లెక్ట్ చేస్తారా. ఈ రెండు నెలలుగా మిమ్మల్ని చూస్తున్నాను. యూ సీమ్డ్ లైక్ ఏ వర్కాహాలిక్” అన్నాడు ధీరజ్ నవ్వుతూ.
“ఎస్. ఐ వాజ్. బట్ ఒక బాడ్ రిలేషన్ షిప్ తో చాలా పోగొట్టుకున్నాను” అంది హారిక
కొంచెం సేపు మౌనంగా ఉన్నారిద్దరు.
“అర్ధం అయింది. బట్ మీ ధైర్యానికి, పట్టుదలకు హాట్సాఫ్. మళ్ళీ పుంజుకుని నిలబడ్డారు. ఐ అప్రీషియేట్ ఇట్” అన్నాడు.
“థాంక్స్, మీరేం చేస్తుంటారు” అడిగింది హారిక
అతను చేతిలోని కేప్టెన్ మార్గన్ తాగుతూ ఆమె ప్రశ్నను దాటవేసాడు.
“బట్ మీ లోని ఈ కోపం హెల్తీ కాదు. దీన్ని కూడా మీరు ఓవర్కం చేయగలిగినప్పుడే సక్సెస్ అయినట్లు” అన్నాడు.
“మీరు మా మమ్మీలా మాట్లాడుతున్నారు. ఐ హేట్ మెన్. వాళ్ల స్వార్ధానికి ప్రేమ అని పెళ్లి అని మమ్మల్ని కంట్రోల్ లోకి తీసుకుని మా జీవితాలనే చిన్నాభిన్నం చేయడం తప్ప ఈ రిలేషన్ షిప్స్ లో దొరికేదేంటి. నేను కెరియర్ లో చాలా ఎదగాలి. ఎదుగుతాను. యు నో మా మమ్మీ ఫామిలీ కోసం ఎంతో సాక్రిఫైస్ చేసింది. డాడి మరో ఆమెతో రిలేషన్ షిప్ లోకి వెళ్ళారు. అమ్మ చాలా సఫర్ అయింది. రోజూ ఇంట్లో గొడవలు. చివరకు డైవర్స్ తీసుకుని అప్పుడు జాబ్ వెతుక్కుని నన్ను పెంచింది. మగాళ్లను నమ్ముకున్న ఆడదానికి మోసం తప్ప ఏం దొరుకుతుంది. అందుకే మగాళ్ల స్వార్ధానికి లొంగకుండా ఎటువంటీ రిలేషణ్ షిప్ లోకి వెళ్ళకుడదని నిశ్చయించుకున్నాను ”
అంటూ ఒక్క క్షణం ఆగి అతన్ని పరీక్షగా చూసింది.
నవ్వుతూ ఆమెనే చూస్తున్నాడు ధీరజ్. కాని ఆ నవ్వులో ఉన్నది సానుభూతా వెక్కిరింతా ఆమెకు అర్ధం కాలేదు.
ఇంతలో అతని సెల్ మోగింది. దాన్ని చూస్తూ అలాగే కూర్చున్నాడు. సెల్ మ్రోగి ఆగిపోయింది. మళ్లీ వెంటనే మ్రోగింది. సెల్ తీసుకుని పక్కకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు ధీరజ్.
“హారిక…స్వార్ధానికి, అవకాశవాదానికి లింగ భేధం ఉండదు. మగవాళ్ల చేతుల్లో బలయిపోయిన స్త్రీల జీవితాలు ఉన్నట్లే ఆడవాళ్ల చేతుల్లో బలయిపోయిన మగవాళ్ల జీవితాలు ఉన్నాయి. ఆడవాళ్లు తమ కథలు చెప్పుకోగలరు కాని మగవారికి ఆ అవకాశమూ తక్కువే”
“భార్యల వల్ల ఇబ్బందులు పడే భర్తలు ఉండవచ్చు. కాని అన్ని రకాలుగా ఎక్స్పాయిట్ అవడం స్త్రీల జీవితాలలోనే జరుగుతుంది” అంది హారిక.
“అన్ని రకాలుగా అంటే”
“ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ” అంది హారిక..
“హారికా, మీకు తెలియని ప్రపంచం చాలా ఉంది. అదే రకమయిన ఎక్స్ ప్లాయిటేషన్ కు గురవుతున్న మగవాళ్ళూ ఉన్నారు” అన్నాడు ధీరజ్.
నవ్వు వచ్చింది హారికకు ‘ఎక్కడా’ అంది ఎగతాళిగా..
ఆమెనే చూస్తున్నాడు ధీరజ్.
అంతలో దగ్గరగా చిన్న దగ్గు వినిపించింది. ధీరజ్ తో అంతకు ముందు కారులో చూసిన ఆ హై క్లాస్ లేడి ఇవాళ తళ తళగా మెరిసే సీ గ్రీన్ చీరలో మత్స్య కన్యలా ఎదురుగా నిల్చుని ఉంది. ఆమెను చూసి లేచి నిల్చున్నాడు ధీరజ్.
“మీట్ మై బాస్, మిసెస్ మిశ్రా, అంటూ షీ ఈజ్ హారిక. ఏ టేక్కీ.. టుడే షీ రిసీవ్డ్ ఏ ప్రమోషన్. హాడ్ బీన్ వర్కింగ్ ఆల్ ది నైట్స్ హియర్” అన్నాడు ధీరజ్.
ఆమె అసహనంగా ధీరజ్ వైపు చూస్తూ, హారికను చూసి పలకరింపుగా నవ్వింది.
“షల్ వి గో” అంది ధీరజ్ తో
“ష్యూర్ విల్ ఫాలో యూ మామ్” అన్నాడు.
ఆమె మేకప్ సరి చేసుకోవడానికి కాబోలు వాష్ రూం వైపుకు వెళ్లింది.
ధీరజ్ హారిక వైపుకు తిరిగి, ‘కేన్ ఐ హావ్ యువర్ మేల్ ఐడి ప్లీజ్, డోన్ట్ ఆస్క్ మీ వై జస్ట్ గివ్ ఇట్” అన్నాడు. హారిక నోటితో చెప్పిన ఐ.డిని ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు.
ఒక పది నిముషాల తర్వాత ఆమె అక్కడికి వచ్చింది. అప్పటికే ధీరజ్ బైటకు వెళ్ళిపోయాడు. ఆమె అతను అక్కడ లేకపోవడం, హారిక సీరియస్ గా లాప్ టాప్ ముందు కూర్చోవడం చూస్తూ బైటికి వెళ్లిపోయింది.
——
ఆ తర్వాత నెల రోజుల దాకా హారిక స్టార్ రెస్టారెంట్ కు వెళుతూనే ఉంది. ఉద్యోగంలో వచ్చిన మంచి పరిణామం ఆమెలో ధైర్యాన్ని నింపింది. దాంతో రెస్టారెంట్ కు రాకపోకలు క్రమంగా తగ్గిపోయాయి. ఇంటి దగ్గరే పని చేసుకోవడం మొదలెట్టింది.
రెండు నెలలు గడిచాయి. అనుకోకుండా హారిక ఓ సారి సునంద, రాఘవ్ లతో కలిసి ‘స్టార్’ కు వెళ్లాల్సి వచ్చింది. రాఘవ్ ను చూసి సుప్రీం వీళ్లను పలకరించడానికి వచ్చాడు. హారికను చూసి పలకరింపుగా నవ్వుతూ “సో రావడం తగ్గించేసారు. హోప్ ఆల్ ఈస్ వెల్” అన్నాడు
నవ్వుతూ తల ఊపింది హారిక.
రాఘవ ఇచ్చిన ఆర్డర్ చూద్దామని కిచెన్ లోకి వెళ్లబోతూ సుప్రీం ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కు తిరిగాడు.
“హారిక మీతో పాటు ఇక్కడకు రెగ్యులర్ గా వచ్చే ఆ యంగ్ మాన్ రెండు సార్లు మీ గురించి ఎంక్వయిరీ చేసారు. మీ ఫోన్ నంబర్ అడుగుతే ఇద్దామనుకున్నా. కాని అడగలేదు. మీరు ఎలా ఉన్నారని మాత్రం అడిగారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు తనూ డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. హాండ్సం చాప్. మీరు బీజీ అయ్యారని, ఈ మధ్య రావట్లేదని చెప్పాను” అన్నాడు.
ఎవరు అన్న కుతూహాలం సునంద, రాఘవ్ లలో
“హారిక గారిలాగే అతనూ కొన్నాళ్లు రెగ్యులర్ గా వచ్చి కూర్చునేవాడు. అప్పుడప్పుడు అతని బాస్ వచ్చి పికప్ చేసుకునేది. ప్రొఫెషణ్ తెలీదు కాని హీ వాజ్ క్వయిట్ డీసెంట్. హారిక లాగే ఆ పక్క టేబిల్ పై కూర్చునేవాడు. బాయ్స్ కి టీప్స్ కూడా బాగానే ముట్టచెప్పేవాడు. లోనర్. ఒక్క హారికతోనే మాట్లాడడం చూసాను” అన్నాడు.
సునంద ఆసక్తిగా హారిక వైపు చూసింది.
“అతనూ రెగ్యులర్ గా వచ్చేవాడు కదా, రోజూ ఎదురు పడేవాళ్లం. నంథింగ్ ఫర్ధర్” అంది హారిక.
——–
ఇంటికి వచ్చాక హారికకు సుప్రీం మాటలే గుర్తుకు వస్తున్నాయ్. ధీరజ్ తన గురించి ఎంక్వయిరీ ఎందుకు చేసాడబ్బా… ఏం ఉంది తనతో మాట్లాడడానికి, అనుకుంటుండగా తన మేల్ ఐడి అతను అడగడం, తాను ఇవ్వడం గుర్తుకు వచ్చింది. గబ గబా మెయిల్ ఓపెన్ చేసి చెక్ చేసింది హారిక. ఏ కొత్త మెయిల్ అందులో లేదు. రోజూ మెయిల్ చూడడం ఆమె పనిలో భాగం. అందువల్ల మిస్ అయే చాన్స్ లేదు. ఆ రోజు అతనికి తన అఫీషియల్ మేయిల్ ఐడి ఇచ్చినట్లు గుర్తు. అయినా చిన్నప్పటి స్నేహితుల కోసం, బంధువుల కోసం వాడే తన మరో ఐడి ఓపెన్ చేసి చూసింది. అందులోనూ ఏం లేదు. సరేలే ఏదో క్యాజువల్ గా ఎంక్వయిరీ చేసి ఉంటాడు అనుకుంటూ లాప్ టాప్ మూసేయబోతూ, చప్పున స్పామ్ ఫోల్డర్ చూడాలనిపించింది హారికకు. చాలా సార్లు కొత్త అడ్రస్సుతో వచ్చే మెయిల్స్ స్పామ్ లోకి వెళ్లిపోతూ ఉంటాయి.
స్పామ్ చెక్ చేస్తుంటే “హాయ్ దిస్ ఈజ్ ధీరజ్’ అనే సబ్జెక్ట్ తో ఒక మెయిల్ కనిపించింది. కుతూహాలంగా ఓపెన్ చేసింది హారిక.
“హారికా..
నేను మిమ్మల్ని కలిసే సందర్భం ఇక రాకపోవచ్చు. మీతో కొన్ని సంగతులు చెప్పాలనుకుంటున్నాను. చాలా రోజులుగా అందరితో అబద్దాలు చెప్పీ చెప్పీ, మాట్లాడి విసుగు పుడుతోంది. ఎవరికయినా నిజాలు మాత్రమే చెప్పాలనిపిస్తోంది.
నా సోదంతా చెప్పి మిమ్మల్ని బోర్ చేయను. రెండు నెలలు మీ దీక్షను ముచ్చటగా చూస్తూ గడిపాను. మీరు చెప్పిన సంగతులతో మీ కథ తెలుసుకున్నాను, కొంత గ్రహించాను. మీలో నా చెల్లెలు కనిపించింది అంటే అతి చేస్తున్నానని అనుకోవచ్చు. కాని అది నిజం. తనూ మీ లాగే శ్రద్దగా చదివేది. నేను, తను చిన్నతనంలో రెండు స్టూళ్ల పై పుస్తకాలు పెట్టుకుని పక్క పక్కన కూర్చుని అలాగే చదువుకునేవాళ్లం. మీ పక్కటేబిల్ పై కూర్చుని మర్చిపోయిన ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటూ నేను చాలా సమయం గడిపాను. ఈ మధ్య నేను ప్రశాంతంగా ఉన్నది ఆ రెస్టారెంట్ లో మీ సమక్షంలోనే.
“చదువు అయిపోయాక ఉద్యోగం మీద ఆశతో హైదరాబాద్ వచ్చాను. చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేసాను. కాని ఏవీ నా కుటుంబ అవసరాలకు సరిపోయే జీతాలు కావు. స్పోర్ట్శ్ లో నేను సాధించిన విజయాలు నాకు తిండి పెట్టకపోయినా, నలుగురి కళ్ళల్లో పడే శరీరాన్ని ఇచ్చాయి. ఈవెంట్శ్ లో బౌన్సర్ గా ఉద్యోగం వచ్చింది. అక్కడ నన్ను చూసిన ఓ గొప్పింటి ఇల్లాలు మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ఇప్పించింది. అక్కడ నాకు వాళ్లు ఇస్తానన్న జీతం నన్ను ఆకర్షించింది. కాని ఆ మసాజ్ పార్లర్ కు వచ్చే స్త్రీల అవసరాలు తీర్చడం నా ఉద్యోగంలో భాగం అని నాకు అక్కడ చేరే దాకా తెలీదు. మొదట్లో అంతా ఫన్ గా ఉండేది. నేను ఎంజాయ్ చేసానా ఏమో గుర్తు లేదు. కాని రానురాను నేను కొందరి చేతుల్లో బొమ్మగా మారిపోయాను. నిజం జస్ట్ బొమ్మను. ఫోన్ చేసినప్పుడు వెళ్ళడం, వాళ్ల అవసరాలు తీర్చడం తర్వాత మళ్లీ వచ్చే ఫోన్ కోసం ఎదురు చూడడం.”
“మసాజ్ పార్లర్ నుండి హోం సర్విస్ కి ప్రమోట్ అయ్యాను. ఆ డబ్బే మా నాన్న గుండే ఆపరేషన్ కు, ఊర్లో అప్పులు తీర్చడానికి పనికి వచ్చింది. నన్ను ఇంటికి పిలిపించుకునే స్త్రీలందరూ గొప్పింటి ఇల్లాలులే. చాలా వరకు నా తల్లి వయసు వాళ్లు. వాళ్లలో వాళ్లు నన్ను తమ పర్సనల్ వస్తువుగా చేసుకోవడానికి పోటీ పడ్డారు. అందులో ఒక ఇల్లాలు పది రెట్లు డబ్బు చూపి నన్ను గెలుచుకుంది. అప్పటి నుండి ఆమెను సంతోష పెట్టడం నా ఉద్యోగం అయిపోయింది.”
“నేను ఇదే పనిలో ఎందుకు ఉండిపోయాను? ఎందుకు బయటపడలేదు అనే ప్రశ్న దయచేసి అడగొద్దు. ఇది ఊబి. నన్ను బైటపడలేనంతగా లోపలికి లాగేసింది. నన్ను సొంతం చేసుకున్న స్త్రీని నేను ఆమె భర్త ఎదురుగా దీదీ అని పిలవాలి. భర్త లేని సమయంలో ఆమె రమ్మన్న చోటుకు వెళ్లి ఆమె శరీర దాహం తీర్చాలి. కొన్ని నెలలుగా నేను నా ముఖం అద్దంలో చూసుకోవడం మానేసాను. ఇంట్లో చెల్లెలు గుర్తురాకుండా జాగ్రత్తపడ్డాను.”
“కాని చెల్లికి పెళ్లి కుదిరింది. లక్షలలో సంపాదించే అన్నగా కట్నం కూడా అంత గొప్పగా ఇవ్వాలి కాబట్టి నా బాధ్యతా పెరిగింది.”
“నాలుగు నెలల క్రితమే ఒకప్పుడు నేను ప్రేమించిన మరదలు నాకు ఉత్తరం రాసింది. పాత ప్రేమను గుర్తు చేస్తూ మనం కలిసి జీవితం పంచుకుందాం అన్నది దాని సారాంశం. కొన్నాళ్ల ప్రేమ తర్వాత ఆమె తల్లితండ్రుల తిరస్కారమే నన్ను హైదరాబాద్ రప్పించి, డబ్బు సంపాదించాలనే కసిని నాలో నింపి నా ఆలోచనను హరించింది. ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఊర్లో మా నాన్న ప్రదర్శించే దర్జా వాళ్లను ఆకర్షించింది. చెల్లి పెళ్ళి తర్వాత మా వివాహం చేయాలని అందరూ నిశ్చయించారు.”
“ఇక్కడ నా బాస్ నాకు పెట్టిన షరతు నేను ఆమె అనుమతి ఇచ్చేదాకా వివాహం చేసుకోకూడదని. అది ఒప్పుకునే చెల్లి పెళ్లి జరిపించాను. కాని నా పట్ల నాలో పెరిగే అసహ్యం నన్ను తినేస్తుంది. నా చుట్టూ కనిపించే పతివ్రతల స్వార్ధం, వారి భర్తలను అందమైన అబద్దాలతో వాళ్ళు మరపించే విధానం నాతో వాళ్లు ప్రవర్తించే తీరు నాకు స్త్రీ అంటేనే కంపరం పుట్టిస్తున్నాయి. నేను నా మరదలితో మాములుగా జీవించలేను. నాలో ఏదో చచ్చిపోయింది. ముప్పై మూడేళ్ల వయసులో మరో ఉద్యోగంలోకి మారి ఇంత సంపాదించలేను. హఠాత్తుగా ఉద్యోగం మారి కుటుంబ ప్రశ్నలను ఎదుర్కోలేను. నా శరీరం, నా జీవితం ఏవీ నాకు నచ్చట్లేదు. నాకు ఇవన్నీ వదిలేసి మొదటి నుండి మళ్ళీ జీవించాలని ఉంది. మళ్ళీ పుట్టలని ఉంది.”
“మళ్ళీ పుట్టడానికి చావాలి కదా. మీరు అనుకోవచ్చు మగవారికి సెక్స్ ఒక ఆట. ఎందరితోనయినా అదే రకంగా అడతాం అని. కాని అది తప్పు హారిక. నాకు తెలిసినంత వరకు అందరినీ అడించేది డబ్బే. ఎవరి చేతుల్లో ఆర్ధిక అధికారం ఉంటుందో వారి ఆధిపత్యం క్రిందకు మరోకరు చేరినప్పుడు స్వార్ధం ఆడే ఆటే ఈ దోపిడి. ఇందులో ఆడ మగ భేధాలుండవు.”
“రేప్ జరిగిన స్త్రీ ఏదో ఓ కారణంతో తనకు జరిగిన అన్యాయం ఇది అని బైటపెడుతుంది. కాని మా లాంటి వారికి మగవారం అయినందుకు మేం అనుభవించే దోపిడిని చెప్పుకునే అవకాశమూ ఉండదు. ఇంత మంది ఆడవాళ్ళు నన్ను కొనుక్కున్నారని నేను చెప్పడం చాలా మందికి మగాళ్లకి నచ్చదు. ఇంతమందిని నేను అనుభవించానని చెప్పుకోమంటారు. ఇదే వృత్తిలో ఉన్న నా తోటివారు నాకు అదే సలహా ఇస్తున్నారు. కాని నేను అలా అనుకోలేకపోతున్నాను. అందుకే నా కథకు ముగింపు పలుకుతున్నాను.”
“మీకు తెలియకుండా మీ సాంగత్యంలో నేను అనుభవించిన ప్రశాంతత మీ పట్ల నాకో బాధ్యతను అంటగట్టింది. మగవాళ్లపై మీకున్న కోపాన్ని చెరిపేయాలనే ప్రయత్నంలోనే మీకు నా కథ చెప్తున్నాను. మీ నాన్న, మీరు ప్రేమించిన వ్యక్తి కూడా ఈ వ్యవస్థలో పావులే. మీరు ఆర్ధికంగా బలపడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మంచి వ్యక్తి దొరికితే మీ అమ్మగారు కోరినట్లు వివాహం చేసుకోండి, తర్వాత నేను చూసిన పతివ్రతలలా మాత్రం మారకండి. డబ్బు సంపాదించండి కాని ఆధిపత్య భావం మీలో చేరకుండా మీ అమ్మతనాన్ని కాపాడుకోండి. నన్ను కొనుక్కున్న స్త్రీలకు స్టేటస్, ఆర్ధిక స్వేచ్చ వారి భర్తల నుండి కావాలి. మళ్ళీ శరీరాల ఆకలి నాలాంటి వారితో తీరాలి. చాలా మంది భర్తలు కూడా ఇదే విధంగా భార్యలతో ప్రవర్తిస్తారు కదా. దీని వెనక కేవలం లింగ భేధం మాత్రమే ఉందంటారా? ఆలోచించండి.”
“వివాహం అవసరమో లేదో నాకు తెలీయదు. కాని ఏ బంధంలోనయినా నిజాయితీ అవసరం. నిజాయితీగా ఉండలేకపోతే ఆ బంధంలోకి వెళ్లకుండా ఉంటే మంచిది.”
“హారికా స్త్రీలను నాశనం చేసే మగవాళ్ళే కాదు మగవారిని నాశనం చేసే స్త్రీలూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులలో వాళ్ల సంఖ్యా పెరుగుతోంది.”
అన్నట్లు నా పేరు ధీరజ్ కాదు. నా అబద్దాల జీవితంలో ఇది మరో అబద్దం.”
హారిక చాలా రోజులు స్టార్ రెస్టారెంట్ వైపు వెళ్లలేకపోయింది. తల్లి ఫోన్ చేస్తూనే ఉంది. తనకు కొంత సమయం ఇమ్మని తప్పకుండా వివాహం చేసుకుంటానని తల్లికి మాట ఇచ్చింది హారిక. ఒక రోజు ఆఫీస్ వాళ్ళతో లంచ్ కు అక్కడకే వెళ్లాల్సి వచ్చింది. లంచ్ సమయంలో చాలా హడావిడిగా ఉంది హోటల్. సుప్రీమ్ ను కలవాలని అతని కేబిన్ లోకి వెళ్ళింది హారిక. ధీరజ్ గురించి ఏమన్నా తెలుస్తుందేమో అనే ఆశ ఆమెలో. ఆమెను చూడగానే నవ్వుతూ వచ్చి పలకరించాడు సుప్రీం. స్టాప్ తోనూ కలిసి మాట్లాడి, లంచ్ ఎలా ఉందంటూ అందరినీ పలకరించీ డెసర్ట్ తన తరుపున గిప్ట్ అని చెప్పడంతో అందరూ సంతోషించారు. సుప్రీం వెళ్ళిపోతూ “అన్నట్లు హారికా… రిమెంబర్ దట్ యంగ్ మాన్ హూ యూజ్డ్ టు కం హియర్… పూర్ మాన్ కొన్ని రోజుల క్రితం ఆక్సిడెంట్ లో చనిపోయాడు. ఇక్కడే రోడ్ నెంబర్ సెవెన్ లో. బాగా డ్రింక్ చేసి కారు నడుపుతూ చెట్టుకు బలంగా కొట్టడంతో కారు నజ్జు నజ్జు అయిపోయింది. సీట్ బెల్ట్ కూడా లేదంట. దాంతో స్పాట్ డెడ్. అతని కార్లో మన రెస్టారెంట్ వాలెట్ పార్కింగ్ స్టిక్కర్ ఉండడంతో బాడి ఐడెంటిఫై చేయమని పోలీసులు వస్తే చూసి గుర్తు పట్టాను. వాళ్ల ఎంప్లాయర్ వచ్చి తీసుకెళ్ళారు. హీ వాజ్ థేర్ పర్సనల్ అసిస్టేంట్ అట. కైండ్ పీపుల్ వాళ్ళే అన్ని భాద్యతలు తీసుకున్నారు” హారిక గొంతుకేదో అడ్డుపడింది. అది ఆక్సిడెంట్ కాదు అని అరిచి చెప్పాలనుకుంది. కాని ఏం చెబుతుంది?