చరిత్రను తిరగరాస్తున్న మహిళలు ‘అనేక వైపుల’ స్త్రీ పాత్రలు

దేశ రాజకీయాలు ఒక కీలక మలుపు తీసుకున్న 2014 నుండి ‘అనేక వైపుల’ నవల ప్రారంభమవుతుంది. ఎక్కడ బయలుదేరి ఎక్కడికి చేరుకున్నాం అని గతాన్ని తరచి చూసుకుని ఆవేదన చెందిన సందర్భం. ప్రజాస్వామిక విలువలు, మానవీయ ఆకాంక్షలు పరీక్షకు నిలబడిన కాలం. ‘అనేక వైపుల’ ఈ కాలంతో సంభాషణ చేస్తుంది. ఈ సంక్షోభంతో పెనుగులాడుతున్న అనేక మానవ ప్రయత్నాలతో సంభాషణ చేస్తుంది. అనేక సమూహాల, అస్తిత్వాల ఆరాట పోరాటాలను ఒక చారిత్రిక సన్నివేశంలోకి తీసుకొచ్చి చర్చిస్తుంది. సమాజాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో బయలుదేరిన విప్లవోద్యమం, తన ఆచరణాత్మక పరిశీలనల నుండి తనను తాను మలచుకుంటూ ప్రజాపోరాటాలతో ముందుకు సాగుతూ ఈ సంభాషణ చేస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నవలను నడిపించేదంతా ప్రధానంగా స్త్రీ పాత్రలే. విప్లవాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని బయలుదేరి, విప్లవకారులుగా తన తల్లిదండ్రులు రూపొందిన ఊరికి వచ్చి తన కార్యరంగాన్ని ఎంచుకున్న సాధన కేంద్రంగా నవల నడుస్తుంది. తన ముందు తరాల విప్లవ ఆచరణను తెలుసుకుంటూ ఆ క్రమంలో తనను తాను తెలుసుకుంటూ సాధన రాటుదేలుతుంది. ఈ కాలపు విప్లవోద్యమ కంఠస్వరం సాధనలో పలుకుతుంది. సామాజిక పురోగతిని మహిళల సామాజిక స్థితి ద్వారా కొలవవచ్చు అన్నాడు మార్క్స్‌. ఉద్యమ పురోగతిని, అందులోని లోతును కూడా మహిళల భాగస్వామ్యం ద్వారా అంచనా వేయవచ్చు. అలాగే వివిధ పీడిత సమూహాలను తనలో భాగం చేసుకోవడంలో కూడా ఉద్యమ పురోగతి ఉంటుంది. అయితే స్త్రీలు విప్లవంలో భాగం కావడం వెనక అనేక సంఘర్షణలు ఉంటాయి. ఒక సాంస్కృతిక విప్లవమే చేయవలసి ఉంటుంది. పితృస్వామ్యం అంతలా స్త్రీ పురుషుల మనశ్శరీరాలను, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. స్త్రీలు, పురుషులు కూడా కండీషన్‌ అయిపోయి ఉంటారు. ఇల్లు, కుటుంబం అనేవి స్త్రీ పురుషులకు ఒక్కలాగే ఉండవు. కుటుంబం అనే యూనిట్‌ చెక్కుచెదరకుండా, దాని స్వభావం పెద్దగా మార్చనవసరం లేకుండానే పురుషులు విప్లవంలో పాల్గొంటూ ఉండవచ్చు. స్త్రీలకు అది సాధ్యమా? కానప్పుడు ఆ విప్లవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి కుటుంబం అనే పాథమిక ఉత్పాదక యూనిట్‌ వ్యవస్థను స్థిరంగా ఉంచే మనుషులను, సంబంధాలను నిరంతరం తయారుచేస్తుంది. అక్కడ రాజ్యం సూక్ష్మ రూపంలో లేదా కనిపించని రూపంలో మనుషుల్ని నియంత్రిస్తుంటుంది. అది స్త్రీల వీపుల మీద కూర్చొని ఆ పని చేస్తుంది. వాళ్లు దాన్ని తోసేసి బైటికి వస్తే కుటుంబం అల్లకల్లోలం అవుతుంది. అయితే పాత అప్రజాస్వామిక కుటుంబ బంధనాల్ని బద్దలు కొట్టనిదే విప్లవం పరిపూర్తి కాదు. స్త్రీలు విప్లవోద్యమంలోకి రావడం అంటే అటువంటి మార్పుకు దారి పడినట్లు.

ఈ రోజు సగానికి సగం మహిళా భాగస్వామ్యమున్న విప్లవోద్యమం ఎట్లా మనుషుల్ని అత్యద్భుతంగా మలుస్తుందో ఆ మహిళల వ్యక్తిత్వం నుండి తెలుసుకోవచ్చు. నవలలో సాధన మాటల్లో అది ఇట్లా వ్యక్తమవుతుంది. ‘‘స్త్రీలను విప్లవం అందుకుంది. దాంతో మేం పూర్తిగా మారిపోయాం. లేకపోతే ఈ శరీరం వరకే పరిమితం అయ్యేవాళ్ళం. అణచివేయబడ్డ భావోద్వేగాల దగ్గరే ఆగిపోయేవాళ్ళం. దేనికంటే అమ్మాయిలకు తమ శరీరాల గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదు. దాని గురించీ మగవాళ్లే ఆలోచిస్తుంటారు. అర్రులు సాచుతూ ఉంటారు. ఎంత జుగుప్సాకరం. ఎంత అమానవీయం. ఆడవాళ్ళకేమో వాళ్ళ శరీరం మార్మికం. మగలోకానికేమో బహిరంగం. ఆడవాళ్లకు ఇది తెలిసే ఇరుకు జీవితంలోకి కుదించుకుపోతారు. జీవితాన్ని లోలోపల దాచి పెట్టుకుంటారు. ఇది వందల వేల ఏళ్ల కథ. ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కాదా.. విప్లవం వల్ల మేం శరీర రాజకీయాలు దాటాం. ఇప్పుడు విప్లవమంటే ప్రతిచోట స్వేచ్ఛ వెతుక్కోవడం. ప్రతి దాంట్లో చోటు వెతుక్కోవడం. ఎవరో ఇస్తే కాదు. అవసరమైనవన్నీ తీసేసుకోవడం. అవసరమైనంత తీసుకోవడం. ప్రతిదాన్ని అందంగా చూడటం. ప్రతిదాన్ని తిప్పిచూపి నిలబెట్టడం.’’ అసలైన స్వేచ్ఛా మానవులకు ప్రతీకలు విప్లవోద్యమంలోని స్త్రీలే. వీళ్లు రూపొందిన క్రమం ఉద్వేగపూరితంగా, అత్యంత గాఢంగా, అంతే హేతుబద్ధంగా కూడా ఉంటుంది.

సాధన ఊహ తెలియని వయసులో తల్లిదండ్రులకు దూరమవుతుంది. రఘు, సరోజ పూర్తికాలం విప్లవోద్యమంలోకి వెళ్తూ రెండు నెలల వయసులో ఆమెను సుధ, సత్యంలకు అప్పగిస్తారు. పాలు తాగే వయసులో తల్లికి దూరమైతే ఆ బిడ్డ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందని చెప్తారు. తెలీకుండానే ఒక విధమైన అభద్రత ఆ పసి మనసుని చాలా కాలం వెంటాడుతుందట. ప్రకృతి సహజమైన ఈ వేదన తల్లిని ఇంకెంతగానో వెంటాడుతుంది. మహిళా కామ్రేడ్స్‌ ఎంతో సిద్ధపడి ఈ ఎడబాటు భారాన్ని మోయవలసి వస్తుంది. సరోజ ఆ స్థితిని ఎదుర్కుంటూనే ఎంత మందికి తల్లి ప్రేమను పంచిపెట్టిందో ఆ జాడలను వెదుక్కుంటూ వెళుతుంది సాధన. ఆ ప్రేమ ఎంత విశ్వజనీనమో తెలుసుకుంటుంది. ఊహ తెలియని వయసులో కన్న తల్లికి, ఆరేళ్ల పసి ప్రాయంలో పెంచిన తల్లిదండ్రులకు కూడా దూరమై సాధన శ్రీనివాసులు`విజయలక్ష్మి దంపతుల దగ్గరికి వచ్చేసరికి ఆమెది చాలా సంక్లిష్టమైన, అసాధారణమైన మానసిక స్థితి. ఈ స్థితి నుండి ఒక దృఢమైన వ్యక్తిత్వం గల అమ్మాయిగా సాధన ఎదగడం వెనక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఉంది. కన్న బిడ్డ మీద కన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆమెను ఎంత సున్నితంగా, ప్రేమాస్పదంగా తమ కుటుంబంలో భాగం చేసుకుంటారో, బహుషా దాని నుండే విప్లవం అంటే అటువంటి మానవీయ విలువలు అని సాధన అర్థం చేసుకుంటుంది. సాధనను కన్న తల్లిదండ్రులెవరో, వాళ్లు ఎటువంటి ఆచరణలో ఉన్నారో శ్రీనివాసులు సాధనకు చెబుతాడు. సాధన తన తల్లి గురించి మొట్టమొదట తెలుసుకునేది ఆమె మరణించిన సందర్భంలోనే. అప్పుడే ఆమె తండ్రిని కలుస్తుంది. సాధన అప్పుడప్పుడే ప్రపంచాన్ని తెలుసుకునే వయసులో ఇది జరుగుతుంది. ఇది ఆమెకు భూకంపం వంటి కుదుపు. తల్లినీ, విప్లవాన్ని ఒకేసారి తెలుసుకున్న సాధన, వాటిని అర్థం చేసుకునే ప్రయాసలో తాను ప్రపంచానికి పరిచయమవుతుంది.

సాధన జీవితంలాగే విప్లవం కూడా ఇన్ని ప్రత్యేకతలతో, భావోద్వేగాలతో, సజీవ మానవులతో కూడి ఉంటుంది. సాధనకు విప్లవం పట్ల తిరుగులేని స్పష్టత ఉంటుంది. అలాగని అది కేవలం విశ్వాసం కాదు. ఆమెకు ప్రశ్నలూ ఉన్నాయి. అయితే వాటికి సమాధానాలు కూడా ఆచరణ క్రమంలో ఉంటాయని తెలుసు. సాధన కలిసే మనుషులంతా చాలా ప్రత్యేకతలతో ఉన్నవాళ్లు. రాయలసీమ ఉద్యమం అనే కూడలిలో వాళ్లు కలుస్తారు. అనేక వైపుల సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. విప్లవం అనేక వైపుల వెలుగును ప్రసరిస్తుంది. సాధన తన అమ్మమ్మ, తాతయ్యలకు దూరమైన బిడ్డ ప్రేమను అందిస్తుంది. అమరుడి తల్లి సుల్తానాకు కొడుకును కొత్తగా పరిచయం చేసి, మరణించీ జీవించడం అంటే ఏమిటో తెలుసుకునేలా చేస్తుంది. నారాయణ, నాగులు వంటి పాతతరం విప్లవ సానుభూతిపరులకు భరోసా ఇస్తుంది. జాతీయోద్యమ కాలం నాటి ఆదర్శ ప్రజాస్వామికవాది సదాశివం అనుభవాలను తీసుకుంటుంది. బిస్మిల్‌ వంటి యువకులను దారి తప్పనీయకుండా చేయిపట్టి నడిపిస్తుంది. చందన్‌ వంటి మేధావుల బోలుతనాన్ని బట్టబయలు చేస్తుంది. మనుషుల మీద ప్రేమ, విప్లవం మీద నమ్మకం, ఎప్పటికప్పుడు నేర్చుకోవడం, ఆచరించడం ద్వారా ఇదంతా చేస్తుంది.

సాధన తరం విప్లవ కార్యకర్తలు, తమ జీవితం నుండి విప్లవాన్ని మరింత లోతుగా అర్థం చేసుకున్నవాళ్లు ఆదివాసీ మహిళలు. వీళ్లు పరోక్షంగా కథలోకి వస్తారు. విప్లవోద్యమంలో అమరుడైన రసూల్‌ తన తల్లికి ఉత్తరాల రూపంలో రాసుకున్న డైరీలో కొంతమంది అద్భుతమైన మహిళలను పరిచయం చేస్తాడు. కొడుకు మరణంతో కుంగిపోయిన సుల్తానాకు సాధన ఆ డైరీని అందిస్తుంది. అప్పుడే తన కొడుకును ఆమె కొత్తగా తెలుసుకోవడం ప్రారంభిస్తుంది. అతనెంత ఆత్మీయ ప్రపంచంలో ఎంత సంతృప్తిగా జీవించాడో తెలుసుకుంటుంది. రసూల్‌ పరిచయం చేసిన నందె, బుద్రు దీదీ, సింగె, హిడ్మె వంటి వాళ్లు ఈరోజు ఆకాశంలో సగమైన వాళ్లు. అందమైన ప్రపంచాన్ని నిర్మిస్తున్న వాళ్లు. దాని కోసం వాళ్లు చదువుకున్న విద్యావంతులెవరూ ఊహించని తెగువను, సాహసాన్ని, త్యాగాన్ని ప్రదర్శించిన వాళ్లు. నందెది ధ్వంసమైన బాల్యం. బుద్రు దీదీ కుటుంబాన్నంతా ఉద్యమంలో పోగొట్టుకున్నది. వీళ్లు జీవితమంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో విప్లవంలోనే తెలుసుకున్నామంటారు. సింగెది పైకి కనిపించని లోతైన గయం. ఆమె సహచరుడు ఉద్యమాన్ని వదిలేసి వెళ్లిపోతే తాను ఏదారి ఎంచుకోవాలి అనే ప్రశ్న ఎదురవుతుంది. ఉద్యమం, సాహచర్యం రెండూ ఇష్టపూర్వకంగా ఎంచుకున్నవే. దేనినైనా తమ ఇష్టపూర్వకంగా ఎంచుకోవాలంటే స్త్రీలు పెద్ద యుద్ధం చేయాల్సిందే. రెండిరటి మధ్య ఎంపిక చేసుకోవడం మరింత సంఘర్షణాభరితం. ఇక్కడ పితృస్వామ్యం మీద పోరాటం అంటే తన మీద తాను యుద్ధం చేయడం కూడా. సాహచర్యం వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. భావోద్వేగాలతో కూడినది. అలాగని ఉద్యమం కూడా వేరు కాదు. అది తన వ్యక్తిత్వంలో భాగం. ఉద్యమాన్ని ఎంతగా తనలో భాగం చేసుకోకపోతే సమాజం నిర్దేశించిన మూసను బద్దలు కొట్టి సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలదు! మనుషులు ఇష్టపూర్వకంగా ఎంచుకున్న జీవితంలో ఉండే చిక్కు ఇదే. కానీ జీవితం ఎలా లాక్కెళితే అలా కొట్టుకుపోయే వాళ్ల బాధలు వేరే. అందులో ఒకలాంటి సుఖం ఉంటుంది.

‘భర్త విప్లవాన్ని విరమించుకుంటే అతనితోపాటే తుపాకీ వదిలేసే సహధర్మచర్యం కూడా ఉద్యమంతో పాటే ఉంది. ఆడవాళ్లలో కూడా పితృస్వామ్యం ఉంది. అది ఎంత ప్రమాదం’ అంటుంది సింగె. సింగె తన ప్రియమైన సహచరుడి నుండి ఎడబాటును పితృస్వామ్యం మీద పోరాటంగా భావిస్తుంది. ప్రేమ, సాహచర్యం, మాతృత్వం ఎంతో సహజమైన భావోద్వేగాలే. అయితే మానవ సమాజంలో అవి కూడా చాలా దుర్మార్గంగా కండీషనింగ్‌ అయిపోయాయి. కండీషన్‌ కాకుండా ఉండే ప్రయత్నం చేద్దామా, హృదయంలేని బండ మనిషి అనిపించుకోవాలి.

సుధ, సత్యంల సాహచర్యంలో సుధ అటువంటి రాపిడిని ఎదుర్కుంటుంది. ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. ఇద్దరూ విడిపోడానికి వారి మధ్య పేచీ ఏమీ లేదు. కలిపి ఉంచే ఉద్వేగాలు లేవు. ఆసక్తీ లేదు. ఇటువంటి స్థితి కూడా ఒకటి ఉంటుందని రచయిత సుధ, సత్యంల సందర్భంలో చెప్తాడు. అటువంటి రిలేషన్‌లో ఉంటే నొప్పిని బహుషా స్త్రీలే ఎక్కువ పడవలసి వస్తుందని కూడా అంటాడు. నిజానికి మన సమాజంలో భార్యాభర్తలు విడిపోవాలంటే ఎంతో రప్చర్‌ జరగాలి. కలిసి ఉండలేనపుడు గౌరవప్రదంగా విడిపోవచ్చు అన్న ఆలోచనే ఇక్కడ పాపం. ఈ బంధ వ్యవస్థలో మనుషులు నలిగిపోతుంటారు. సత్యం దీనిని అర్థం చేసుకుంటాడు. ఉద్యమం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. అందుకే దీని గురించి ఆలోచించేటప్పుడు మన కాలపు సంబంధాలన్నీ, ముఖ్యంగా భార్యభర్తల సంబంధాలన్నీ ఒక రకమైన ట్రాన్స్‌ఫర్‌మేషన్‌లో ఉన్నాయంటాడతను. మన ఆలోచనలకు తగినట్లు మనం ఇంకా ఎదగాల్సి ఉందని కూడా అంటాడు. ఈ సంబంధాలను రీడిఫైన్‌ చేయాల్సిన అవసరం, ప్రజాస్వామికీకరించాల్సిన అవసరం ఎంత ఉందో ఆచరణలోని విప్లవోద్యమం సరిగ్గా అర్థం చేసుకోగలదు. సుధ, సత్యం విడిపోయినా ఒకరంటే ఒకరికి అపారమైన గౌరవం. సుధ అరెస్టయినప్పుడు సత్యం ఆమె బెయిల్‌కోసం ప్రయత్నాలు చేస్తాడు. విడుదలై వచ్చాక మళ్లీ కలిసుందామనే ప్రతిపాదన చేస్తాడు. మళ్లీ కొత్త రాపిడికి గురవుతుందామె.

సత్యంతో విడిపోయాక రాజకీయంగా సుధ ఎంతో ఎదుగుతుంది. ముఖ్యంగా జైలు అనుభవం అమెలో ఎంతో పరిణతిని తీసుకొస్తుంది. తన కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటుంది. బహుషా కలిసుంటే సుధ ఈ స్థాయిలో ఉండేది కాదని సత్యమే ఒక సందర్భంలో అంటాడు. ఉద్యమం తోడుగా ఆమె సంతరించుకున్న వ్యక్తిత్వం ఆమెకు ప్రధానం. ఇతరులు దాన్నెలా అర్థం చేసుకున్నా (దురుసుతనం అనో రెటమతం అనో కొంతమంది అనుకోవచ్చు అని సుధ అంటుంది) దాని కోసం ఆమె తన జీవితంలో ఒక కఠినమైన ప్రయాణం చేసింది. యాతన అనుభవించింది. ఆ వ్యక్తిత్వమే స్త్రీలతో అద్భుతాలు చేయిస్తుంది. కుటుంబంతో, సహచరులతో ఘర్షణ పడకుండా, సున్నితమైన భావోద్వేగాలు ముక్కలు కాకుండా ఒక మహిళలోని సర్వశక్తులూ విడుదలయ్యే అవకాశం ఉంటుందా? ప్రేమానుబంధాలు ఎందుకు ఆటంకంగా ఉంటున్నాయి? ఇది చాలా లోతైన ప్రశ్న. దీనికి స్త్రీనో, పురుషుడినో నిందించి ప్రయోజనం లేదు. సుధ జీవితం నుండి ఈ ప్రశ్నలు మనకు ఎదురవుతాయి.

సాధారణ కుటుంబాల నుండి ఉదాహరణ తీసుకుందాం. అక్కడా ఘర్షణ ఉంటుంది. నిజానికి మన సమాజంలో వివాహసంబంధాలన్నీ ఆస్తి, కులం, మతంతో ముడిపడి ఉన్నవే. ఇక్కడ మనసులు కలవడం అనే సమస్యే లేదు. ఆ రకంగా ఇది మరింత సంకుచితమైన జైలు వంటి నిర్మాణం. అనేక వైపుల మనుషుల్ని కలిపే ఈ నవలలో రాయలసీమ ఉద్యమ నాయకుడి కూతురు జగతి అటువంటి బంధంలో చిక్కుకుంటుంది. ఎంతో మంది ప్రేమరాహిత్యపు సంబంధాల్లో సర్దుకుపోతున్నారు. జగతి ఘర్షణ పడుతుంది. జగతి, శ్రీకాంత్‌లది తల్లిదండ్రులు నిర్ణయించిన సంబంధమే కానీ వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుని ఒప్పుకుంటారు. ఇద్దరి మధ్య పొసగకపోవడానికి పైకి కనిపించే కారణం అమరావతి భూముల రియలెస్టేట్‌ వ్యవహారం. కర్నూలులో జగతికి సంబంధించిన ప్లాట్‌ అమ్మి, అమరావతిలో స్థలం కొనాలని శ్రీకాంత్‌ ప్రతిపాదన. జగతి దానికి ఇష్టపడదు. అట్లా ఇద్దరి మధ్య పేచీగా అది ముందుకొస్తుంది గానీ అసలు విషయం ఇద్దరి మధ్య ప్రేమ లేకపోవడం. వారి అభిరుచులు వేరు. ఎమోషన్స్‌ వేరు. మొత్తంగా ఇద్దరూ వేరువేరు ప్రపంచాలకు చెందినవారు. తండ్రి ప్లాట్‌ అమ్మి అమరావతి దగ్గర స్థలం కొనడానికి డబ్బులు ఇస్తే ఆ గ్యాప్‌ అతికేది కాదు. వారిద్దరి సంబంధంలో రియలెస్టేట్‌ వ్యవహారం ఒక బ్రేకింగ్‌ పాయింట్‌. తల్లిదండ్రులు దాన్ని ఆస్తి దగ్గర సెటిల్‌ చేయాలని చూస్తే, జగతి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోడానికి ఘర్షణ పడుతుంది. దీనిని అర్థం చేసుకోలేని తల్లి కూతురి జీవితం గురించి బెంగపడి, తన బాధను, వెలితిని తీర్చుకోడానికి ఆమెదైన భక్తిలోకాన్ని ఎంచుకుంటుంది. హిందుత్వ గుంపుకు దగ్గరవుతుంది. ఇక్కడ జగతి తల్లిదండ్రుల మధ్య కూడా అగాధం ఉంది. అయితే చాలా కుటుంబాల్లో లాగే ఆ సంబంధం అలా నడుస్తూ ఉంటుంది. జగతి ఒక స్థిర నిశ్చయానికి వచ్చాక శ్రీకాంత్‌ నుండి వేరవుతుంది. తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో రాయలసీమ ఉద్యమం వైపు చూస్తుంది. మనుషులు తమ ఉద్వేగాలను పంచుకునే సమూహాల కోసం వెదుకుతారు. తల్లి, కూతురు అలా వేరువేరు దారులు పడతారు. ఇదే నవలలో మరొక భిన్నమైన సన్నివేశంలో విప్లవోద్యమానికి దూరమైన రమణ వ్యక్తిగత జీవితంలోని సంక్లిష్టతల నుండి బహుజన రాజకీయాలవైపు పోవడం చూస్తాం. అలా మనుషులు ఏదో ఒక కలెక్టివ్‌లో భాగమవుతారు.

రాయలసీమ ఉద్యమ కూడలి వద్ద సాధన కలిసే అనేక రకాల వ్యక్తుల్లో జెన్నీ చాలా స్పెషల్‌. జెన్నీని చూడగానే అమ్మాయిలంటే ఇలా ఉండాలి కదా అనుకుంటుంది సాధన. అటువంటి వ్యక్తిత్వం గల మనిషి. సూటిగా, నిర్మొహమాటంగా ఉంటుంది. దళిత అస్తిత్వ ఉద్యమం పట్ల ఆమె కన్విక్షన్‌ తిరుగులేనిది. తన అనుభవాల నుండి వచ్చిన జ్ఞానం పట్ల జెన్నీ చాలా స్పష్టతతో ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మహిళగా జెన్నీ అనుభవం గాఢమైనది. జెన్నీ, సాధన వేరువేరు సందర్భాలలో ఒకే మనిషి పట్ల ఆకర్షితులవుతారు. చివరికి చందన్‌ను అంచనా వేయడంలో ఎవరి వర్షన్‌ వారిది. ఎవరి అంచనా వారిది. వారి ఎమోషన్స్‌ సరే, ఆ ఉద్రేకాల నుండి తేరుకున్నాక స్థిరంగా ఉంటారు. వారి వ్యక్తిత్వం ముందు చందన్‌ తేలిపోతాడు. జెన్నీకి కమ్యూనిస్టు రాజకీయాలంటే పడదు. కానీ సాధన పట్ల ఆమెకు గౌరవం. సాధనకూ జెన్నీ పట్ల ఆపేక్ష. ఆమె వ్యక్తిత్వం అంటే ఇష్టం. రాజకీయ భిన్నాభిప్రాయాలు, వాదోపవాదాలు, ఉంటూనే ఇద్దరి మధ్య మానవానుబంధం గొప్పగా ఉంటుంది. మనల్ని మనుషులుగా నిలబెట్టేది అదే.

మానవ జీవితంలోని సంక్లిష్టతలతో విప్లవోద్యమం అనే సామూహిక చైతన్యం హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే దానికి పురోగామి లక్షణం ఉంటుంది కాబట్టి. స్త్రీపురుష సంబంధాల గురించి వేరువేరు సందర్భాలలో ఉద్యమం ఎలా ఆలోచిస్తుందో అనేక ఉదాహరణలు ఈ నవలలో ఉన్నాయి. ‘మనకు సమానత్వం గురించి పూర్తిగా తెలీదు’ అని ఒక సందర్భంలో విప్లవోద్యమ నాయకుడు ప్రధాన్‌ అంటాడు. ‘‘జీవితంలో ఎన్నెన్ని అసమానతలు ఉన్నాయో తెలుసుకునే కొద్దీ సమానత్వానికి అర్థం సమగ్రం అవుతుంది.. నాకైతే భయంగొలిపే అసమానత ఒకటి ఉంది. స్త్రీ పురుషుల మధ్య సర్వ సమానత్వం సాధ్యమేనా అనిపిస్తుంది. వాళ్ల మానసిక, ఆవేశ ప్రపంచాల్లోనే అసమానత ఉంది. అంతగా ఈ లోకం కండీషన్‌ చేసింది. నేను ప్రత్యేకతల గురించి మాట్లాడటం లేదు. అవి ఉండాల్సిందే. కానీ వాటిలో అసమానతలు ఉన్నాయి. వాటిని ఎప్పటికి సెటిల్‌ చేయగలం?’’ ఈ మటలకు సుధ చప్పున కనెక్ట్‌ అవుతుంది. ఆమె దాన్ని మరింత విడమర్చి చెప్తుంది. ‘‘స్త్రీ పురుషుల భావోద్వేగాల్లోని ప్రత్యేకతలు విచిత్రమైనవి. అది స్త్రీత్వానికి, పురుషత్వానికి సంబంధించినవని నేననుకుంటా. అవి ప్రాకృతికమే అయితే పేచీ లేదు. సామాజికం కూడా. ఈ ఉద్వేగాలు వ్యక్తులుగా మనవే అనుకుంటాం. అసలు నాకేమనిపిస్తుందంటే ఉద్వేగాలు మనుషుల వ్యక్తీకరణగానే ఉండిపోవు. వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసి నిర్ణయించేలా మారుతాయి. అంతిమంగా ఈ ఉద్వేగాలను మన సంబంధాలు, వ్యవస్థలు నిర్ణయిస్తాయి కావచ్చు.’’ ‘అనేక వైపుల’ నుండి అసమానతల చర్చ ఇంత లోతుగా ఉంది. విప్లవోద్యమం అనేక ప్రశ్నలకు సమాధానమే కాదు, అనేక కొత్త ప్రశ్నలు మొలకెత్తే సారవంతమైన నేల. విప్లవమే తీసుకొచ్చే సామాజిక పరిణామంలో వీటికి సమాధానాలు దొరకొచ్చు. ఈ చరిత్ర నిర్మాణంలో ఎంత ప్రయాసతో, ఎంత ఉద్విగ్నతతో స్త్రీలు భాగమవుతున్నారో విప్లవంలో అమరులైనప్పుడే లోకానికి తెలిసే మహిళా కామ్రేడ్స్‌ తెలియజేస్తున్నారు.

ఊరే గురించి నవల చివరి భాగంలో ప్రధాన్‌ తలపోతల్లో మనకు తెలుస్తుంది. అప్పటికి ఆమె జీవించి ఉండదు. విప్లవోద్యమ నాయకుడు ప్రధాన్‌ ఉన్నత విద్యావంతుడు, మేధావి. ఆయనకు ఉద్యమ విస్తరణ, పురోగతికి సంబంధించి ఎన్నో ఆలోచనలున్నాయి. అందుకోసం తన జీవితాన్నే ప్రయోగం చేస్తాడు. అటువంటి ప్రధాన్‌ ఒక ఆదివాసీ మహిళను తన జీవిత భాగస్వామి చేసుకున్నాడు. ఆయన ప్రకారం ఆమె పోరాటమే సౌందర్యంగా వెలిగే ఆదివాసీ పిల్ల. అత్యంత సరళమైన ఆదివాసీ వ్యక్తిత్వానికి విమర్శనాత్మకత పట్టుబడితే ఎలా ఉంటుందో ఆమెలో చూడవచ్చు అంటాడు. ఎందరిలాగానో ఆమె గ్రీన్‌హంట్‌ యుద్ధంలో చనిపోయింది. ప్రధాన్‌ చివరి రోజుల్లో ఊరే మనకు పరిచయమవుతుంది. రసూల్‌ చనిపోయాక హిడ్మె పరిచయమవుతుంది. ఇద్దరూ గొప్ప విప్లవ నాయకురాళ్లు.

రసూల్‌ తల్లికి రాసిన ఉత్తరాల్లో తన కోడలిని కూడా పరిచయం చేస్తాడు. ఆమె ఆదివాసీ యోధురాలు హిడ్మె. రసూల్‌ చనిపోయాక అనుకోని విధంగా కోడలిని కలుస్తుంది సుల్తానా. రసూల్‌ని చదువుతూ, తెలుసుకుంటూ సుల్తానా దృఢంగా మారిపోతుంది. ఆమె జీవితంలో ఊహించని మార్పును ఆమె వ్యక్తిత్వం సంతరించుకుంటుంది. కొడుకు జీవించిన తీరు, అతని ఉన్నత భావాలు ఆమె తన జీవితాన్ని తిరిగి చూసుకునేలా చేస్తాయి. జైలు నుండి విడుదలైన కోడలు తిరిగి అజ్ఞాత జీవితంలోకి వెళ్లబోయే ముందు ఆమెను కలుసుకునే సాహసం చేస్తుంది సుల్తానా. హిడ్మెలో కొడుకును చూసుకుంటుంది. ఆమె కూడా ఆత్మీయంగా అల్లుకుపోతుంది. కరిగి నీరవుతుంది. సాదా సీదా ముస్లిం మహిళ సుల్తానా తన మనోప్రపంచంలో ఒక భిన్నమైన ప్రయాణం చేసి ఆ తీరం చేరుకుంటుంది. ఈ రోజు అమరుల తల్లులు వాళ్ల పిల్లల్ని కూడా ఇలాగే కొత్తగా తెలుసుకుని వాళ్ల జెండాను ఎత్తిపడుతున్నారు.

ఇలా ఈ నవలలో మరో గొప్ప విషయం సాధన, సుధ, సుల్తానా వంటి స్త్రీల పరిణామ క్రమం. వాళ్లు తమను తాము తెలుసుకుంటూ, ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. అంతకన్నా అద్భుతం ఆదివాసీ స్త్రీల పరిణతి. వీళ్లంతా విముక్తికి దారులు వేస్తారు. చరిత్రను నిర్మిస్తారు.

సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ సాహిత్యాన్ని, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో విరసంతో పరిచయం ఏర్పడింది. 2005 నుండి విరసం సభ్యురాలిని. ప్రస్తుతం అరుణతార వర్కింగ్ ఎడిటర్ గా ఉన్నాను. నా రచనల్లో సామాజిక రాజకీయ పర్యావరణ సంబంధమైన వ్యాసాలే ఎక్కువ. సాహిత్య వ్యాసాలు, కొన్ని కథలు, చాలా తక్కువగా కవిత్వం రాశాను. కూడంకుళం అణువిద్యుత్ కు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం జరిగుతున్నప్పుడు అక్కడి ప్రజలను జైల్లో కలిశాక రాసిన 'సముద్రంతో సంభాషణ' నా మొదటి పుస్తకం.

Leave a Reply