అదిగో… జునైద్ రాంచీ బయలుదేరాడు

నువ్వు ఎవరివో, ఎక్కడివాడివో ఎందుకు అవుతావు చెప్పు?
నువ్వు దహించుకుపోతున్న దేహాలకి మతం చూడకుండా
మెత్తటి వెన్నలాంటి దూది పరుపులు పరిచిన మానవత్వానివి
నువ్వు రియాజుద్దీన్ వి
ఎంత మంచి వాడివి నువ్వు?

**
మహా కుంభ మేళాలో
మనిషి ప్రాణం ముందు మతం ఎంతని
రాంశంకర్ ఆగిపోతున్న గుండెని
మళ్ళీ కొట్టుకునేలా చేశావు చూడూ ఫర్హాన్ ఆలం

నీలాంటి వందలమంది, ఫర్హాన్ ఆలం, ఫాతిమాల దుకాణాలు మస్జిద్ద్ లు మూసేసి తరిమేసినా, ప్రయాగరాజ్ కుంభమేళా మునిగిపోతున్నప్పుడు వేలమంది రామ శంకర్లకు, జానకమ్మలకి మస్జిద్లలోనే నిలువ నీడ ఇచ్చి,
రొట్టె తినిపించి బతికించుకున్న ఫరిస్తాలు, రాముళ్ళు, సీతమ్మలు కారా మీరు?
నువ్వు ఎక్కడి వాడివో
ఎందుకు అవుతావు చెప్పు?
ఫర్హాన్ ఆలం, ఫాతిమా
మీరు ఎంత మంచివాళ్ళు?

**
ప్రియమైన ఖాన్ సాహెబ్ సలాములు నీకు
ఇరవై లక్షల బదులుగా రెండు వందలకే
వేల మంది నిరుపేదలని చదివిస్తున్న గురువువి
నువ్వు మా ఖాన్ సాహెబ్ వి
నువ్వు భారతీయడివి
ఖాన్ సాబ్, ఓ ఖాన్ సాబ్ ఎంత మంచివాడివి నువ్వు?

**
ఇక నువ్వు జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమాల్లో అన్నం కంచం పట్టుకుని పిల్లల కడుపులు నింపిన మా జునైద్ సయ్యద్ వి
మక్కా దర్శనానికి వచ్చినట్లు వచ్చారు కదా అమ్మలంతా నిన్ను దర్శించుకోవడానికి?
జునైద్, ఓ జునైద్ నువ్వెంత మంచివాడివి?

**
పిల్లలను వాళ్ళంతా లాఠీలతో తరుముతూ మందిరాలలో తల దాచుకోనివ్వనప్పుడు,
మస్జిద్ తలుపులు తెరిచి ఆశ్రయమూ, నీళ్ళు ఇచ్చి
భయం పోగొట్టిన రఫూఫ్, అంజద్, మాలెన్ ఖాలా, నూర్ ఆపా ఎంత మంచివాళ్ళు మీరు?

**
కాసింత మాంసం తీసుకెళుతున్నందుకు వాళ్ళు నీ అబ్బా జాన్ ని, తమ్ముడిని ముక్కలుగా నరికిన తరువాత కూడా,
దేశ సరిహద్దుల్లో ‘సారే జహా సే అచ్ఛా హిందుస్థాన్ హమారా’ అని
ఆల్ ఇండియా రేడియోలో పాడుతూ నీ భారతదేశ సరిహద్దుల దగ్గర కాపలా కాస్తున్న
భారత సైనికుడా, సర్తాజ్! ఓహ్! మా మహమ్మద్ సర్తాజ్!
ఎంత మంచి వాడివి నువ్వు?

**
ఇక నువ్వు మొహమ్మద్ ఇర్ఫాన్?
రైతుల, దళితుల, కార్మికుల ఆందోళనల్లో, జంతర్ మంతర్ లో అన్నిటా నువ్వే కదా?
వీధుల్లో హరేక్ మాల్ అమ్ముకుంటూ….
భారత రాజ్యాంగాన్ని ధారాళంగా
అల్లాహో అక్బర్ లాగా, వేద మంత్రంలా చదువుతూ లోకంలోని హరేక్ మాల్ మాత్రమే కాదు
హరేక్ ఆద్మీ, నిలువ నీడే లేని హరేక్ మజ్దూర్ విలువైన వాడని గొంతు చించుకుని చెబుతున్న చిరు వ్యాపారివి
బడి చదువందకపోయినా
రాజ్యాంగ స్ఫూర్తిని, లౌకికత్వపు సంస్కారాన్ని అందుకున్న
ఢిల్లీ మురికివాడలోని కోహినూర్ వజ్రానివి
ఇర్ఫాన్, ఓ ముహమ్మద్ ఇర్ఫాన్
నువ్వెంత మంచివాడివి?

**
ఖాన్ సాబ్, మహమ్మద్ ఇర్ఫాన్, జునైద్, ఫర్హాన్ ఆలం, రియజుద్ధీన్, ఫాతిమా, మాలెన్ ఆపా, నూర్, ఖౌసర్ ఖాలా
మీరంతా ఇండియా గేట్ కి పూసి వేలాడే పువ్వులు కారా?
ఈ భారత జహాన్ మీది కాదా?
మీకు మా శతకోటి శుక్రియాలు… ఆదాబ్ లు…

**
అదిగో చూడండి
అప్పుడే జంతర్ మంతర్ దగ్గర పొయ్యి ఆర్పేసి,
బిరియానీ బగోనా(గిన్నె)
మోసుకుంటూ
సయ్యద్ జునైద్ రాంచీ బయలుదేరాడు.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 1. ఆమె అడవిని జయించింది, 2. పాదముద్రలు, 3. లక్ష్మి (నవలిక), 4. బచ్ఛేదాని (కథలు), 5. ప‌హెచాన్‌ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 6. పాలమూరు వలస బతుకు చిత్రాలు (కథా సంకలనం), 7. హస్బెండ్ స్టిచ్ (స్త్రీల విషాద లైంగిక గాథలు), 8. అరణ్య స్వప్నం (కవిత్వం), 9. ఇల్లొక రాజకీయం (రాజకీయ కవిత్వం).

Leave a Reply