వెన్నెల పంచే చంద్రుడు స్వేచ్ఛకు, ప్రేమకు, ఆశకు చిహ్నం. పున్నమి, అమావాస్యల మధ్య కనుమరుగవుతూ, మళ్లీ కనిపిస్తుంటాడు. కనుమరుగు కావడమంటే అంతం కావడం కాదు. అంతం చేయడం ఎవరి తరమూ కాదు. అది ఒక ప్రకృతి సూత్రం. సత్యాన్ని అన్వేషించే, సకల జనుల స్వేచ్ఛా గీతాన్ని పాడే ఉద్యమకారులను, ప్రజల మనుషులను, రాజ్యం కొంతకాలం నిర్బంధించొచ్చేమో కానీ చంద్రుని వెన్నెలలా మెరిసే వారి స్పూర్తిని బంధించలేదు. ఇదే విషయాన్ని సుచిత్ర విజయన్, ఫ్రాన్సెస్కా రెకియా రచించిన ఈ పుస్తకంలో, భారతదేశంలో రాజ్య నిర్బంధం, రాజకీయ ఖైదీల పట్ల అమానవీయత, ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయడం గురించి లోతుగా విశ్లేషిస్తూ, ప్రజా పోరాటాల స్పూర్తిని ఎత్తిపడుతారు.

భీమా కోరేగావ్ అక్రమ అరెస్టులు, CAA (పౌరసత్వ సవరణ చట్టం) సందర్భంగా విద్యార్థి నిరసనకారులను అరెస్టు చేయడం, పోరాడే ప్రజలపై Unlawful Activities Prevention Act (UAPA) వంటి నిర్బంధ చట్టాలను ఆయుధాలుగా ఎలా వాడుతున్నారో ఈ పుస్తకం వివరిస్తుంది. పెట్రేగుతున్న ఫాసిస్టు రాజ్యాన్ని, దాని యంత్రాంగ కుయుక్తులను వ్యతిరేకించే అన్ని శక్తులు ఎలా నిర్బంధానికి గురికావాల్సి వస్తుందో వివరిస్తుంది. ఎంత నిర్బంధం అమలు చేసినా ప్రశ్నించే గొంతులను ఆపలేరని, చల్లటి వెన్నెల పంచే చంద్రుడిని బందీ చేయలేరని ఒక ఆశాభావాన్ని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. ఈ పుస్తకం ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ విధానాలు ఎలా అమలవుతున్నాయో, అవి దళిత, బహుజన, ఆదివాసి, మత మైనారిటీల, మహిళల హక్కులను ఏ విధంగా కాలరాస్తుందనే విషయాన్ని, రాజకీయ ఖైదీల దృష్టి కోణం నుండి విశ్లేషిస్తుంది.
“ఉగ్రవాదాన్ని” అడ్డుకోవడానికంటూ రూపొందించిన UAPA చట్టం భారతదేశంలో అనేక ప్రజాస్వామ్యవాదుల విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ చట్టం ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడానికి సృష్టించబడినా, ప్రస్తుతం దాన్ని రాజకీయ ప్రతిపక్ష స్వరాలను అణచివేయడానికి, నిరంకుశ రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి వినియోగిస్తుండడం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోంది. ఈ చట్టం అనుమానితులను దీర్ఘకాల నిర్బంధంలో ఉంచడానికి, న్యాయ విచారణను వంచించడానికి మార్గంగా మారింది. UAPA చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తులకు ముందుగా నిర్దిష్టమైన కారణాలు లేకుండా వారిని ఉగ్రవాదులుగా పరిగణించడం, వారి పౌర హక్కులను పక్కన పెట్టడం సర్వసాధారణమైంది.
భీమా కోరేగావ్ కేసు ఈ చట్టం ప్రయోజనాల వెనుక ఉన్న రాజకీయ ప్రేరేపణలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ కేసులో ప్రభుత్వ వ్యతిరేక ప్రజా గొంతుకులను, సామాజిక కార్యకర్తలను, హక్కుల పోరాటంలో ఉన్న వ్యక్తులను “తీవ్రవాద” కార్యకలాపాలకు ముడిపెట్టి రాజ్యం పౌర, ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది. ఈ తప్పుడు కేసులు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని దెబ్బ. UAPA వంటి చట్టాలు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వారి అభిప్రాయాలను, భావప్రకటన హక్కును హరించడం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తున్నాయి. ఇది భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులను ఖాతరు చేయకుండా ప్రభుత్వ నియంత్రణలో న్యాయ వ్యవస్థను ఉపయోగించడంలో ఉన్న ప్రమాదాలను బహిర్గతం చేస్తుంది.
సత్యాన్ని పక్కదోవ పట్టించడానికి, ప్రజాస్వామిక గొంతులపై నియంత్రణ పొందడానికి ప్రభుత్వం అసత్యాన్ని తమ అబద్ధాల ఫ్యాక్టరీలో తయారుచేసి అనేక “కుట్ర” కేసుల్లో ఆయుధంగా వాడుకుంటుంది. వాటికి సంబంధించి అనేక ఉదాహరణలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ముఖ్యంగా పేద పిల్లల డాక్టర్ బినాయక్ సేన్ కేసు, ఆదివాసి హక్కుల కోసం పోరాడినందుకే పదేళ్లు అక్రమంగా నిర్బంధించి చివరికి క్లినికల్ హత్య చేయబడిన ప్రొ. సాయిబాబా కేసు, భీమా కోరేగావ్ కేసు వంటివి.
ఈ అన్ని కేసుల్లో ఉద్యమకారుల, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత బుక్ షెల్ఫ్‌లలో నిషేధిత సాహిత్యం ఉందని చూపడం (కేవలం సాహిత్యం కలిగి ఉండడం నేరం కాదని అనేక కోర్టు వ్యాఖ్యానాలు, తీర్పులు ఉన్నాయి), వాళ్ల కంప్యూటర్లను హ్యాక్ చేసి నేరపూరిత డాక్యుమెంట్లను పెట్టి దాని ద్వారా కుట్రకు తెరలేపడం. ఇలా చేయడం చాలా రొటీన్‌గా మారిపోయింది. ఈ పని చెయ్యడానికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వంటి సంస్థలను రాజ్యం ఏర్పరచుకుంది. కానీ న్యాయ వ్యవస్థ మాత్రం ఈ కేసుల్లో ఏదో నేరం ఉందన్నట్లు, సత్యాన్వేషణ చేస్తున్నట్లు నటిస్తూ, రాజ్యానికి తన మద్దతును ప్రకటిస్తుంది. దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాధారాలు మొత్తంగా న్యాయ వ్యవస్థ సాధికారితను, సమర్థతను కూడా ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ అబద్ధాల ఫ్యాక్టరీ చర్యల మూలంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది.
భీమా కోరేగావ్ వంటి సంఘటనల్లో ప్రభుత్వ తీరులో ఉన్న ప్రధాన వ్యూహం ఏమిటంటే, భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే మేధావులను, సామాజిక ఉద్యమకారులను, ప్రభుత్వ విమర్శకులను “జాతీయ భద్రతకు ముప్పుగా” చిత్రించడం. ఏ పని చెయ్యడం కోసం రాజ్యం పకడ్బందీగా తన ఆధీనంలోని మీడియాను ఉపయోగించుకుంది. ఆ మీడియా సంస్థలు ప్రభుత్వ అసత్య ప్రచారాన్ని అమల్లో పెట్టి, ఉద్యమకారులను, ప్రజా మేధావులను జాతి వ్యతిరేకులుగా, సమాజ శత్రువులుగా చిత్రించడం, వారి ప్రజాస్వామిక కార్యాచరణను “తీవ్రవాద” చర్యలుగా చూపించడం ద్వారా ప్రజల్లో భయం కలిగించడంలో కీలకపాత్ర పోషించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాస్తవాన్ని నిరూపించే పాత్రలో ఉండాల్సిన మీడియా, ప్రభుత్వం చేతిలో పావులుగా మారడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారింది.
ఈ పుస్తకం కేవలం ప్రభుత్వ అణచివేత పద్ధతులను మాత్రమే కాదు, వాటినన్నింటినీ ఎదిరిస్తూ పౌర సమాజం ఎలా నిలబడుతుందో కూడా వివరిస్తుంది. నిర్బంధ కాలంలో కొనసాగే నిరసన, ప్రతిఘటన ఉద్యమాలు దేశంలోని వివిధ సెక్షన్ల ప్రజల సామూహిక శక్తిపై నమ్మకాన్ని కలిగిస్తాయి. అంతేకాదు, ఈ ఉద్యమాలు భారతదేశపు విలువైన ప్రజాస్వామ్య పోరాట సంప్రదాయాలను కాపాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. రాజ్యం ఎంతగా అణచివేస్తే దానికి వ్యతిరేకత అంతగా పెరుగుతుంది. ఉద్యమకారులను నిర్బంధిస్తే జైలు గోడలు, ములాకాత్‌లు, కోర్టు విచారణలు, చీకటి గదులు అంతం చేయలేని అక్షరాలు ఈ రోజు కొత్త పోరాట రూపంగా మారాయి. అవి ఆలాపించే స్వేచ్ఛా రాగాలు కేవలం దేశానికే పరిమితం కాలేదు.
ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజం రాజకీయ ఖైదీలకు మద్దతుగా ఉద్యమిస్తోంది. నిర్బంధితులకు లీగల్ సపోర్ట్, మానసిక ప్రోత్సాహం, సంఘీభావాన్నిఅందిస్తుంది. ఇది కేవలం భారతదేశపు పౌర సమాజపు ప్రతిఘటన మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల పరిరక్షణ పోరాటం కూడా. ఈ పోరాటంలో సామాజిక ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక పరిరక్షణ కార్యకర్తలు విభిన్న మార్గాల్లో తమ సహకారం అందిస్తున్నారు. వారు నిరంతరం ప్రభుత్వ అక్రమ చర్యలను ప్రశ్నిస్తూ, ఈ అణచివేత చర్యలపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా వారు వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేస్తూ సంఘీభావాన్ని కూడగడుతున్నారు.
కొంతమంది మేధావులను జైల్లో పెట్టి, వారిని ఒక మోడల్‌గా చూపిస్తూ ప్రజల్లో భయాన్ని కలిగిస్తూ పాలక వర్గాలు, కులాలు తమ దోపిడీని, అణచివేతను కొనసాగించొచ్చు అని కలలు కంటున్నాయి. కానీ రాజకీయ ఖైదీలు తమ ఉత్తరాల ద్వారా, ఇతర రచనల ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న అనేక అణచివేత చర్యలకు స్పందిస్తున్నారు. ఇది ప్రజల పట్ల వారికి ఉన్న అంకిత భావమే కాకుండా, ప్రజా ఉద్యమాలపై వారికున్న విశ్వాసాన్ని, వారి ధైర్యసాహసాలను కూడా తెలుపుతున్నాయి.
సాయిబాబా శారీరకంగా తొంభై శాతం అంగవైకల్యుడై ఉండి కూడా ఆదివాసి హక్కుల కోసం, అణచివేతా నిరాకరణ కోసం తన పోరాటం సాగిస్తూ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శంగా నిలిచాడు. జైలు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆయన తన ఆలోచనలను లేఖల రూపంలో కవితాత్మకంగా వెలువరించి, నిరంకుశ రాజ్య వ్యతిరేక పోరాటాల ప్రతీకగా నిలిచాడు. ఆయనను ప్రత్యక్షంగా హత్య చేయలేని రాజ్యం, తన కోరికను అతని శరీరాన్ని చిద్రంచేసి చనిపోయేలా చేయడంలో నెరవేర్చుకుంది. ఇలాంటి పద్దతినే ఫాదర్ స్టాన్ స్వామీ, పాండు నరోటే వంటి రాజకీయ ఖైదీల విషయంలో చేసింది. రాజ్యం వారిని చంపగలిగింది కానీ వారిలోని ప్రజాస్వామిక హక్కుల పోరాట స్పూర్తిని ఏమి చేయలేక పోయింది. వారు తమ అమరత్వం తర్వాత కూడా ప్రపంచ సమాజానికి హక్కుల సోయిని కల్పిస్తూ, పోరాట మార్గాన్ని చూపిస్తున్నారు.
“చందమామను ఎంతకాలం బందీ చెయ్యగలరు?” భారతదేశంలోని ప్రజాస్వామ్య హక్కుల క్షీణతపై అత్యవసరమైన, అతి ముఖ్యమైన అధ్యయనంగా నిలుస్తోంది. ఈ పుస్తకం దిక్కరించే అన్ని గొంతుకలను నేరమయం చేసే, అణచివేసే, ప్రజల జీవితాలను నియంత్రించే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ సూటిగా వెలుగులోకి తెస్తుంది. భారతదేశంలోని ఆధునిక ప్రజాస్వామిక చట్రంలో రాజ్యాంగ స్పూర్తి, స్వేచ్ఛ, న్యాయబద్ధతకు సంబంధించిన అంశాలను వివరించడమే కాకుండా, ఇవి ఏ విధంగా ధ్వంసమవుతున్నాయో మానవ హక్కుల పట్ల ఆందోళన కలిగించే వాస్తవాలను చెబుతుంది.
ఇది కేవలం రాజకీయ ఖైదీలకు సంబంధించిన పుస్తకం మాత్రమే కాదు, బందీ కాబడుతున్న అన్ని ప్రజా ఆలోచనా స్రవంతులకు సంఘీభావంగా నిలిచే రచనా పోరాటం. అక్షరాలు కొత్త ఊహలను, ఆకాంక్షలను రేకెత్తిస్తాయి కానీ కుట్రలు చేయవని వివరించే ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాము, స్వాగతిస్తున్నాము.
ప్రజల స్వేచ్ఛ కోసం త్యాగపూరిత పోరాటం చేస్తూ అమరులైన ఉద్యమకారులందరికి జోహార్లు!