పల్లవి : సిలుకల గుట్టా సిలుకల గుట్టా
సెప్పవే జాడా – విప్లవ సింహము జాడా
వాలిన పొద్దు చీకటి నీడ
వెల్గులైన కాడ రామనర్సయ్య జాడా
ఎమర్జెన్సి నెత్తుటి క్రీడ
కగారంటూ సాగిన కాడ
పువ్వులన్ని రాల్చినగానీ
వసంతాన్ని ఆపలేరని
- తిర్మలగిరి ఎర్రజెండను
ఎత్తిందా ములుగు – కదనంలో నీ అడుగు
ఓట్లతొ రాజ్యం రానేరాదని
పదవే గడ్డిపోస – ప్రజాయుద్ధమే నీ ధ్యాస
వ్యూహరచనల్లోన రామనర్సయ్యా
నీకు బందుకిచ్చిందా గోదారిలోయా
మోడువారిన ఆ పోడుభూముల్లో
జనరాజ్యం ఆశలు మొలకెత్తంగా || సిలుకల గుట్టా || - పగిడేరుకు ఘన్ పూర్ కు
పొత్తే కుదిరిందా – తూర్పు కనుమలనంటిందా
గ్రామాలకు పట్నాలకు
సోపితి కల్సిందా – ఉస్మానియ కదిలిందా
బత్తులన్న రాలె తొలిసందె పొద్దై
మంథని పెద్దన్న మహా సంగ్రామమై
జార్జిరెడ్డి ఒరిగె ధ్రువతారయ్యీ
నీలం జంపాల గోదారి గోగులై || సిలుకల గుట్టా || - విప్లవ పార్టీ కార్యదర్శిగా
వీరుడివే కాదు నువు అక్షర యోధుడివి
హైద్రాబాదులొ అచ్చుయంత్రము
నడిపిన జ్ఞానివి – రాజకీయ సేనానివి
నీతొటి శ్రీపాద శ్రీహరి త్యాగం
జానకిరాంరెడ్డి ఏపూరు సైన్యం
కుమార్ నారాయణ నీ పోరు దళమూ
నలుగురి చిరునామ పాకాల వనమూ || సిలుకల గుట్టా || - నాటి తెలంగాణ సాయుధ పోరులో
సైరనే ఊదావా – ఓరుగల్లుకు చేరావా
ఎర్రని జెండా నూరేళ్ళ గుర్తుగా
వసంతమేఘమాలా – నక్సల్బరియే నీ జ్వాలా
కానూరి కలములో బుర్రకథ నీవై
రామారావు గళము వీరుల గాథవై
అన్న అమరుడన్న పాటకే ప్రాణమై
ఎన్నేళ్ళయినా బతికే ఉంటావు
రామనర్సయ్యా రామనర్సయ్యా
జోహార్లు నీకయ్యా – విప్లవ జోహార్లు నీకయ్యా
గోదారిలోయ విప్లవ పాయలో
మాయని గుర్తువయ్యా – పోరు ప్రవాహమయ్యా
పోరు ప్రవాహమయ్యా
- 28. 10. 2026
(కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య 50వ వర్ధంతి సందర్భంగా….)
**