ప్రొఫెసర్ జి. హరగోపాల్ నాయకత్వంలో తెలంగాణలో రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక (United Forum for the Release of Political Prisoners) ఏర్పడింది. ఆగస్టు 29, 2026న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో ఈ ఐక్య వేదిక తలపెట్టిన కార్యక్రమం సందర్భంగా, కొద్ది మంది రాజకీయ ఖైదీలు తమ జైలు అనుభవాలను పంచుకున్నారు. రాజకీయ స్వేచ్ఛపై తమ అభిప్రాయాలను చెప్పారు. ఖైదీల హక్కుల గురించి మాట్లాడారు.
జైళ్లలో కొంతమంది రాజకీయ ఖైదీలు తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అయితే తాము రాజకీయంగా ఓడిపోయామని మాత్రం వారు భావించడం లేదు. లొంగిపోవడాన్ని అంగీకరించకుండా పోరాటాన్ని కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. తమకు ఎలాంటి “రాజకీయ అనారోగ్యం” లేదని కూడా అంటున్నారు.
బయట ప్రపంచానికి దూరంగా జైలులో ఉండి, ఎన్నో ఆంక్షలు ఎదుర్కొంటున్నా కూడా రాజకీయ విశ్వాసాలకు కట్టుబడి ఉండటం అంటే ఏమిటి అని కొద్ది మందికి సందేహం కలుగవచ్చు? దానికి ముందు ఆ జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలు ఎవరు అనేది తెలుసుకోవాలి. అందులో సరెండర్ మావోయిస్టులు కూడా ఉన్నారు.
లొంగిపోయిన తర్వాత కూడా జైలు: రాజ్యానికి యుద్ధ నీతి ఉందా?
2025 మేలో తెలంగాణలో లొంగిపోయిన వారి విషయంలో ఈ ప్రశ్నను అడగాల్సిన అవసరం ఉంది.
ఎవరైనా “యుద్ధ నీతి ఉంటుంది కదా? ఒకసారి ఎవరైనా లొంగిపోతే, వారిని మళ్లీ జైలులో పెట్టరు కదా?” అని అనుకోవడం పొరపాటు. లొంగిపోయిన వీళ్ల జీవితాలే దానికి సమాధానంగా నిలుస్తాయి.
మావోయిస్టులు లొంగిపోతే వారి మీద కేసులు పెట్టకుండా ఇంటికి పంపిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. కొంతమంది మావోయిస్టులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు 2025 లో తెలంగాణలో లొంగిపోయారు. అయితే, వారిని ఇంటికి పంపకుండా అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అందులో మైనర్లు కూడా ఉన్నారు. వారు ప్రస్తుతం కాచిగూడ హోమ్‌లో ఉన్నారు.
ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. రాజ్యం నిజంగా యుద్ధ నీతి ని పాటిస్తుందని మనం భావించవచ్చా? లొంగిపోయి కూడా తమ జీవితాలను జైలులోనే గడుపుతున్న ఈ 20 మంది అనుభవాలు చూస్తే అలా భావించకూడదు అని మనకి అనిపిస్తుంది. మహా అయితే, “యుద్ధ నీతి” అనేది అవసరమైనప్పుడు రాజ్యం ఉపయోగించుకునే ఒక సౌకర్యవంతమైన పదంగా మాత్రమే మిగిలిపోతోంది. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద సిద్ధాంతాలు అవసరం లేదు.
లొంగిపోయిన వ్యక్తిని కేవలం మానవతా దృక్పథంతో విడుదల చేయాలనే డిమాండ్‌కు పరిమితం కాకుండా, అతన్ని అసలు ఎందుకు నిర్బంధించారో కూడా ప్రశ్నించాలి.
గత రాజకీయ విశ్వాసాలను కారణంగా చూపించి నిర్బంధించడం వ్యక్తిగత స్వేచ్ఛపై మాత్రమే దాడి చేసినట్టు కాదు; రాజకీయ విశ్వాసాలను కలిగి ఉండే, వాటిని వ్యక్తపరిచే హక్కుపై కూడా దాడి చేస్తున్నట్టే.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నిర్బంధించిన సందర్భాలు మాత్రమే కాదు; ఒక వ్యక్తి రాజకీయ భావాలను కలిగి ఉన్నాడని లేదా ఒక రాజకీయ ఉద్యమంతో సంబంధం ఉందని భావించి, అతన్ని నిరవధికంగా జైలులో ఉంచిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏదైనా నిర్దిష్ట ఘటనకు సంబంధం లేకుండా, కేవలం ఒకరి రాజకీయ వైఖరి ఆధారంగా ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనే కనీస నియమాన్ని కూడా పాటించని చోట యుద్ధ నీతి ఎలా ఉంటుంది? ఇది రాజకీయ ఖైదీలు లేవనెత్తుతున్న ప్రశ్న.
ప్రతి ఒక్కరికీ తన రాజకీయ జీవితాన్ని స్వేచ్ఛగా కొనసాగించే అవకాశం ఉండాలి అని అంటున్నారు.
కేవలం విడుదల కాదు—రాజకీయ స్వేచ్ఛ కోసం కూడా డిమాండ్
మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయిన నేపథ్యంలో, దాని కార్యకర్తలు ఇంకా ఎందుకు జైళ్లలో కొనసాగాలి? అనే వాదనతో కొద్ది మంది హక్కుల ఉద్యమానికి చెందిన వారు, సామాజిక కార్యకర్తలు, ఇతరులు ఈ ప్రశ్నను లేవనెత్తుతూ రాజకీయ ఖైదీల విడుదలను డిమాండ్ చేస్తున్నారు.
ఆ కొద్ది మందికి ఒక విషయం స్పష్టం చేయాల్సి ఉందని రాజకీయ ఖైదీలు అంటున్నారు. మావోయిస్టు ఉద్యమం చాలా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొంది. కానీ, దాని అర్థం మావోయిస్టు ఉద్యమం పూర్తిగా ముగిసిపోయిందని కాదు.
అందువల్ల, రాజకీయ ఖైదీల కోసం లేవనెత్తుతున్న డిమాండ్‌ను మరింత విస్తృతంగా చూడాల్సిన అవసరం ఉంది. “రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి” అని డిమాండ్ చేయడంతో పాటు, అసలు ఒక వ్యక్తి రాజకీయ ఖైదీగా ఎందుకు మారుతున్నాడు అనే ప్రశ్నను కూడా ముందుకు తీసుకురావాలి. ఒక వ్యక్తిని జైలు నుంచి విడుదల చేయాలని కోరడం, అతను ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందనే ప్రశ్నను పక్కన పెట్టి చూడకూడదు.
ఒక వ్యక్తి తన రాజకీయ విశ్వాసాలకు కట్టుబడి ఉండటం, తనకంటూ ఒక రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉండటం నేరం కాదు. అది రాజకీయ స్వేచ్ఛలో అంతర్భాగంగా గుర్తించాలి. ఆ స్వేచ్ఛను అణిచివేసే UAPA వంటి చట్టాలను కూడా ప్రశ్నించి, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేయాలి.
రాజ్యం ఒక రాజకీయ సంస్థను లేదా రాజకీయ ఉద్యమాన్ని నిషేధించవచ్చు. కానీ ఆ ఉద్యమంపై ప్రజలకు ఉండే రాజకీయ అభిప్రాయాన్ని కూడా నిషేధించగలదా? దాన్ని కూడా ప్రశ్నించాలి.
అది మావోయిస్టు సిద్ధాంతంపై రాజకీయ విశ్వాసం కావచ్చు, CAA-NRCపై ఒక నిర్దిష్ట రాజకీయ వైఖరి కావచ్చు, కాశ్మీర్‌పై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకత కావచ్చు, లేదా మరేదైనా రాజకీయ లక్ష్యంలో భాగంగా నమోదైన కేసులు కావచ్చు. రాజకీయ కారణాలతో నిర్బంధించబడిన వారందరి విషయాన్ని పరిశీలించి, వారిని విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయాలి.
జైలు రాజకీయ జీవితానికి ముగింపు కాదు
ఒక వ్యక్తి జైలుకెళ్లడంతో అతని రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనా? రాజకీయ ఖైదీల అనుభవాలు చూస్తే జైలు అంటే రాజకీయ జీవితం ముగిసిపోయినట్టు కాదని స్పష్టం అవుతుంది.
ఈ జైళ్లలోని నాయకత్వం ఒక రాజకీయ తప్పిదాన్ని చేయలేదని కొంతమంది రాజకీయ ఖైదీలు చెబుతున్నారు. విప్లవానికి తమ వంతు కృషి చేయడానికి జైలు బయట ఉండటమే ఏకైక మార్గమని వారు భావించలేదు.
విప్లవ రాజకీయాల్లో ఒక విప్లవకారుడు తనను తాను ఉద్యమానికి అనివార్యమైన వ్యక్తిగా భావించడు. ఉద్యమ విలువల కంటే, దానికి భిన్నంగా తాను తీసుకున్న ఎత్తుగడలు ఎక్కువ ప్రయోజనమని ఏ నాయకత్వం అనుకోకూడదు అని కొద్ది మంది రాజకీయ ఖైదీలు అన్నారు.
జైలులో ఉన్న నాయకత్వం దృష్టిలో జైలు శిక్ష అనేది రాజకీయ జీవితానికి ముగింపు కాదు; అది రాజకీయ ప్రయాణంలో ఒక భాగమే. ఒక వ్యక్తిని శారీరకంగా నిర్బంధించవచ్చు. కానీ అతని రాజకీయ ఆలోచనలు, విశ్వాసాలు, పోరాట స్ఫూర్తి జైలు గేట్ల వద్దే ముగిసిపోతాయని అనుకోవడం పొరపాటు. లేదా ఒంటరి సెల్ లలో ముగిసిపోతుంది అనుకోవడం పొరపాటు. వ్యక్తి నిర్బంధించబడినా, అతను విశ్వసించిన రాజకీయ ఆలోచనలను, ప్రజా ఉద్యమాన్ని నిర్బంధించడం సాధ్యం కాదు.
ఇది కేవలం సిద్ధాంతపరమైన వాదన కాదు. చరిత్రలో భగత్‌సింగ్ ఇందుకు ఒక ముఖ్యమైన ఉదాహరణ.
23 ఏళ్ల వయసులో అమరుడైన భగత్‌సింగ్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)కు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరలేదు. అలా రాజ్యం చట్టబద్ధమైన గుర్తింపు ఇస్తే అదే పేరుతో వ్యవస్థలో చట్టబద్ధ రాజకీయ పార్టీగా పనిచేస్తాం అనలేదు.
బయట ఉద్యమంలో తమ సంఖ్య తక్కువగా ఉందని, జైల్లో ఒంటరి సెల్‌లలో ఉండటం వల్ల ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడం కష్టమని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అలా ఉండటం వల్ల ఉద్యమం ఆగిపోతుందని కూడా భావించలేదు. జైలులో ఉన్నప్పటికీ ఖైదీల హక్కుల కోసం పోరాడుతూ, తన రాజకీయ ఆలోచనలను అభివృద్ధి చేసి, వాటిని మరింత స్పష్టంగా వ్యక్తీకరించాడు.
భగత్‌సింగ్ జైలులో ఉన్నప్పుడు, 1931 ఫిబ్రవరి 2న రచించిన “టు యంగ్ పొలిటికల్ వర్కర్స్” (To Young Political Workers) అనే లెటర్ లో యువ రాజకీయ కార్యకర్తల కోసం తన రాజకీయ ఆలోచనలను మరింత స్పష్టంగా వివరించాడు.
మార్క్సిజాన్ని ఒక సైద్ధాంతిక ప్రాతిపదికగా స్వీకరించడం, ప్రజల్లోకి వెళ్లడం, కార్మికులను, రైతులను సంఘటితం చేయడం, కమ్యూనిస్టు పార్టీని నిర్మించడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఆయన వివరించాడు.
భగత్‌సింగ్ ఇలా పేర్కొన్నాడు:
“మా నిర్వచనం ప్రకారం, అసెంబ్లీ బాంబు కేసులో మా ప్రకటనలో పేర్కొన్నట్లుగా, విప్లవం అంటే ప్రస్తుత సామాజిక వ్యవస్థను పూర్తిగా కూలదోసి, దాని స్థానంలో సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పడం.”
జైలులో ఉండి, తాను ఎదుర్కొంటున్న కేసులను సైతం ఉపయోగించుకుని విప్లవం అంటే ఏమిటో వ్యక్త పరిచారు. జైలు శిక్ష అతని రాజకీయ విశ్వాసాలను వదులుకునేలా చేయలేదు. ప్రస్తుత సందర్భంలో ఈ ఉదాహరణ ప్రాముఖ్యత కేవలం చారిత్రకమైనది కాదు. నేటి రాజకీయ ఖైదీలను అర్థం చేసుకోవడానికి కూడా భగత్‌సింగ్ జీవితాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంది.
కాబట్టి రాజకీయ ఖైదీలు ఇప్పటికీ ఏ విశ్వాసాలతో ఉన్నారు, జైలు లోపల నుంచి ఏ విషయాల కోసం పోరాడుతున్నారు అనేది కూడా చూడాలి.
వారు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. తమ రాజకీయ విశ్వాసాలు, సూత్రాలకు కట్టుబడి ఉన్నవాళ్లు ఒకవైపు, వాటిని వదులుకున్నవాళ్లు మరోవైపు ఉన్నారని వారు అంటున్నారు. తమ రాజకీయ విశ్వాసాలను వదులుకున్నవాళ్లు ద్రోహులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా, విచ్ఛిన్నకారులుగా మారారని వారు భావిస్తున్నారు. అలాగే, “రాజకీయ అనారోగ్యంతో” ఉన్నవాళ్లు కూడా ఉన్నారని, అందువల్ల వారు కూడా తమకు ప్రాతినిధ్యం వహించలేరని చెబుతున్నారు.
“మాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండి, మేము అదే పార్టీ పేరుతో చట్టబద్ధంగా పనిచేస్తాం” అని చెప్పే హక్కు వారికి లేదని వారు అంటున్నారు.
ఈ రాజకీయ ఖైదీలను అర్థం చేసుకోవాలంటే, వారిని జైలుకు తీసుకెళ్లిన రాజకీయ విశ్వాసాలు ఏమిటి, జైలు నుంచి వారు ఏ డిమాండ్లు చేస్తున్నారు, ఎవరి హక్కుల కోసం వారు పోరాడుతున్నారు అనే అంశాలను కూడా పరిశీలించాలి.
ఈ ప్రశ్నలకు సమాధానాలు రాజకీయ ఖైదీలు తమ రాజకీయల గురించి చెప్పే మాటల్లోనే కాకుండా, తెలంగాణ జైళ్లలో వారు చేపట్టిన నిర్దిష్ట పోరాటాల్లో కూడా కనిపిస్తాయి.
ఖైదీల హక్కుల కోసం పోరాటం
గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ జైళ్లలో జరిగిన రెండు నిరాహార దీక్షలు దీనికి ముఖ్యమైన ఉదాహరణలు.
2024 ఆగస్టు 27న కామ్రేడ్ అమితాబ్ బాగ్చీ నాయకత్వంలో జరిగిన నిరాహార దీక్షలో అనేక డిమాండ్లు ముందుకు వచ్చాయి:
• ఖైదీలకు పెన్నులు, కాగితాలు, నోట్‌బుక్స్ అందించాలి.
• ఖైదీలు రాసే పిటిషన్లకు నంబర్ కేటాయించి, దాని కాపీని ఖైదీకి ఇవ్వాలి.
• కోర్టులకు సమర్పించే పిటిషన్లకు రసీదు ఇవ్వాలి.
• ఖైదీలు తమ న్యాయవాదుల ద్వారా పిటిషన్లు సమర్పించుకునేందుకు అనుమతించాలి.
• ప్రతి కొత్త ఖైదీకి జైలు మాన్యువల్ కాపీని ఇవ్వాలి.
• DLSA పర్యవేక్షణను బలోపేతం చేయాలి.
• జైళ్లలోని CCTV వ్యవస్థలను జవాబుదారీతనానికి కూడా ఉపయోగించాలి.
• ప్రతి జైలు బ్లాక్‌లో టోల్‌ఫ్రీ ఫిర్యాదు టెలిఫోన్ ఏర్పాటు చేయాలి.
• జైలు అధికారులు వినకుండా ఖైదీలు తమ న్యాయవాదులతో గోప్యంగా మాట్లాడేందుకు ప్రత్యేక లీగల్ ఇంటర్వ్యూ గదులను ఏర్పాటు చేయాలి.
తర్వాత, 2025లో కామ్రేడ్ సంజయ్ దీపక్ రావు చేపట్టిన తొమ్మిది రోజుల నిరాహార దీక్షలో మరో ముఖ్యమైన డిమాండ్ ముందుకు వచ్చింది. ఒంటరి నిర్బంధంలో ఉన్న ఖైదీలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారి సెల్‌లలోనే బంధించకూడదని, తెలంగాణ జైలు నిబంధనల్లోని రూల్ 738 ప్రకారం పగటిపూట తమ బ్లాక్‌లో స్వేచ్ఛగా కదలడానికి వారికి అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఈ పోరాటాలు జైలులో రాజకీయ జీవితం అనేది కేవలం ఒక సైద్ధాంతిక లేదా భావజాల అంశం మాత్రమే కాదని చూపించాయి. ఖైదీల రోజువారీ హక్కులు, గౌరవం, చట్టపరమైన రక్షణల కోసం పోరాడటం ద్వారా తమ రాజకీయ నిబద్ధతను ఆచరణలో వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, ఈ డిమాండ్లు రాజకీయ ఖైదీల వ్యక్తిగత సౌకర్యాలకు మాత్రమే పరిమితం కాలేదు. పెన్, కాగితం, పిటిషన్‌కు నంబర్ ఇంకా కాపీ, కోర్టుకు సమర్పించిన పిటిషన్‌కు రసీదు, న్యాయవాదితో గోప్యంగా మాట్లాడే అవకాశం, ఏకాంత నిర్బంధంలో పగటిపూట బ్లాక్‌లో కదిలే హక్కు—ఇవేవీ రాజకీయ ఖైదీలకు మాత్రమే ప్రత్యేకమైన హక్కులు కావు. అవి జైలులో ఉన్న ప్రతి ఖైదీకి సంబంధించిన హక్కులు.
అందువల్ల రాజకీయ నిర్బంధం ఒక వ్యక్తి రాజకీయ జీవితాన్ని వేరు చేయలేనట్టే, జైలు శిక్ష కూడా ప్రతి ఖైదీకి ఉండాల్సిన హక్కులను చెరిపి వేయకూడదు.
రాజకీయ ఖైదీల విడుదల కోసం జరిగే పోరాటం కేవలం వారి విడుదలకే పరిమితం కాకుండా, రాజకీయ స్వేచ్ఛ కోసం, అందరు ఖైదీల హక్కుల కోసం జరిగే పోరాటంగా కొనసాగాలని ఆ రాజకీయ ఖైదీలు ఈ సందర్భంగా ఐక్య వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్‌కు, పౌర సమాజానికి విజ్ఞప్తి చేశారు