యువ కవుల కోసం

మహమూద్ దర్వీష్
ఫాడీ జౌడా (ఇంగ్లీష్ అనువాదం)
శివలక్ష్మి (తెలుగు)

మా రచనల రూపురేఖలను నమ్మకండి, వాటిని మర్చిపొండి
మీ సొంత అభిప్రాయాలతోనే మీ సొంత మాటలతోనే ప్రారంభించండి.
కవిత్వం రాస్తున్న మొదటి కవి మీరేనన్నట్లుగా
లేదా చివరి కవి మీరేనన్నట్లుగా మొదలుపెట్టండి

మీరు మా రచనలను చదివితే,
అవి మా అహంకారానికి కొనసాగింపుగా కాకుండా,
మా తప్పులను సరిదిద్దేవిగా ఉండాలి
వేదనల సందర్భాలలో రాసిన గ్రంధాలలో ఉన్న మా తప్పులను సరిదిద్దుకునేవిగా ఉండాలి.

నేను ఎవరిని? అని ఎవరినీ అడగవద్దు.
మీ తల్లి ఎవరో నీకు తెలుసు.
ఇక తండ్రి విషయానికొస్తే, నీకు నువ్వే తండ్రిగా, రక్షకుడివిగా ఉండు.

సత్యం తెల్లనిది, స్వచ్ఛమైనదైతే,
దానిపై నల్లని సిరాతో రాయండి.
సత్యం అన్యాయమైన నల్లనిదైతే,
దానిపై కపటపు జిలుగులను అద్దండి.

ఒక ఫాల్కన్ పక్షితో తలపడాలనుకుంటే
ఆ పక్షితో పాటే మీరు ఆకాశంలో ఎగరాలి.
ఒక స్త్రీని ప్రేమిస్తే, ఆమె కాదు,
ఆ ప్రేమ అంతాన్ని కోరుకునేవారు మీరే కావాలి.

జీవితం మనం అనుకున్నంత సజీవంగా ఉండదు,
కానీ మనం దాని గురించి అసలు ఆలోచించం.
ఆ విషయం ఆలోచిస్తే మన భావోద్వేగాలు దెబ్బ తింటాయని భయం.
ఒక గులాబీని సుదీర్ఘంగా పరిశీలిస్తూ ఉండిపోతే,
తుఫానులో కూడా కదలలేరు.

మీరూ నాలాంటివారే, కానీ నా అధోలోకం మాత్రం స్పష్టమైనది.
ఎప్పటికీ అంతం కాని అంతులేని రహస్య దారులు మీకున్నాయి.
అవి కిందికి దిగుతాయి, పైకి లేస్తాయి; మళ్ళీ కిందికి దిగుతాయి, మళ్ళీ పైకి లేస్తాయి.

యవ్వనపు చరమాంకాన్ని మీరు
ప్రతిభ పరిపక్వత లేదా జ్ఞానం అని అనవచ్చు.
నిస్సందేహంగా, అది జ్ఞానమే,
అది ఒక ప్రశాంతమైన, భావగీత – రహితమైన వివేకం.

చేతిలోని వెయ్యి పక్షులయినా
చెట్టుపై వాలిన ఒక్క పక్షికి సమానం కాదు.
విషాద సమయాల్లోని ఒక కవిత అయినా
శ్మశానవాటికలో వికసించిన అందమైన పూలవంటిది.

ఆదర్శప్రాయంగా నిలవడం అంత సులభం కాదు
కాబట్టి మీలా మీరు ఉంటూనే ప్రతిధ్వనుల సరిహద్దుల ఆవల
భిన్నంగానూ ఉండండి.

సంబరాల తీక్ష్ణతకి కూడా ఒక గడువు కాలం ఉంటుంది.
కాబట్టి మీ హృదయానందం కోసం ఆ ఉత్సాహాన్ని నింపుకోండి,
మీ గమ్యపథాన్ని చేరుకునే ముందే దానిని అనుసరించండి.

ప్రియురాలితో/ప్రియునితో, నీవే నేను, నేనే నువ్వు అని చెప్పకండి
దానికి భిన్నంగా ఇలా చెప్పండి: మనమిద్దరం
క్షణభంగురమైన, చంచలమైన ఒక మేఘానికి అతిధులం
మీ సర్వ శక్తులతో దారి మళ్ళండి, ఆ నియమావళి నుండి పక్కకు తప్పుకోండి

ఒకే వాక్యంలో రెండు నక్షత్ర గుర్తుల్ని ఉంచకండి.
అయితే, ఆ ఉప్పొంగే పరవశాన్ని పరిపూర్ణం చేయడానికి,
అత్యవసరమైన దాని పక్కనే అప్రధానమైన దానిని ఉంచండి.
మా సూచనల కచ్చితత్వాన్ని నమ్మవద్దు.

కేవలం ఆ సమూహాల కాన్వాయ్ జాడలను మాత్రమే నమ్మండి.
నీతి అనేది కవి హృదయంలోని గుండు లాంటిది
అదొక ప్రాణాంతకమైన జ్ఞానం.

కోపంలో ఉన్నప్పుడు ఎద్దులా దృఢంగా ఉండండి
ప్రేమలో ఉన్నప్పుడు బాదం పువ్వులా సున్నితంగా ఉండండి
అలాగే, మూసి ఉన్న గదిలో మీకు మీరే ప్రేమ గీతాలు పాడుకునేటప్పుడు
ఏమీ కాదు, ఏమీ కాకుండా ఉండిపో.

ఆ దారి ప్రాచీన కవి కాళ రాత్రిలా సుదీర్ఘమైనది:
మైదానాలు, కొండలు, నదులు, లోయలు.
మీ కలల కొలతను అనుసరిస్తూ నడవండి:
మీ వెంటే ఒక లిల్లీ పువ్వు రావచ్చు, లేదా ఉరికొయ్య రావచ్చు.

మీ పనుల గురించి నాకు ఎలాంటి ఆందోళనా లేదు.
కానీ, పిల్లల సమాధులపై నాట్యం చేసేవారి నుండి,
అలాగే గాయకుల నాభిలో దాగి ఉన్న కెమెరాల నుండి
మీకు కలిగే ముప్పు గురించే నా కలవరమంతా.

ఇతరులకు, అలాగే నాకు కూడా దూరంగా ఉంటే
మీరు నన్ను నిరాశ పరచరు.
నన్ను పోలి ఉండకపోతేనే మరింత అందంగా ఉంటుంది.

ఇకపై, నిర్లక్ష్యానికి గురైన భవిష్యత్తే మీకు ఏకైక సంరక్షకురాలు.

కొవ్వొత్తి కన్నీటిలా నువ్వు దుఃఖంలో కరిగిపోతున్నప్పుడు,
నిన్ను ఎవరు చూస్తారో లేదా నీ అంతర్దృష్టి వెలుగును ఎవరు అనుసరిస్తారో
అని ఆలోచించకండి.
నా ఉనికి ఏమిటి అని మీ గురించి మీరు ఆలోచించండి.

కవిత ఎప్పుడూ అసంపూర్ణమే, సీతాకోకచిలుకలే దాన్ని పరిపూర్ణం చేస్తాయి.

ప్రేమ విషయంలో సలహాలకు తావులేదు. అది అనుభవం.
కవిత్వంలోనూ సలహాలకు తావులేదు. అది ప్రతిభ.
చివరిగా, కానీ అత్యంత ముఖ్యంగా, సలామ్.

(మహమూద్ దర్విష్ (Mahmoud Darwish) (13 మార్చి 1941 – 9 ఆగస్టు 2008) ఒక పాలస్తీనా కవి, రచయిత. నవంబర్ 1988లోఅధికారికంగా స్థాపించిన పాలస్తీనా రాజ్యానికి “పాలస్తీనా స్వాతంత్ర్య ప్రకటన”ను రచించాడు. అంతేకాక, ఇంగ్లీష్, ఫ్రెంచ్, హీబ్రూ భాషలలో అనేక అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకున్న విశిష్టమైన మేధావి. పాలస్తీనా జాతీయ కవిగా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తింపు పొందారు.

తన కవితా రచనలలో, మహమూద్ దర్విష్ తమ “స్వర్గధామం” (ఏడెన్) లాంటి పాలస్తీనాను కోల్పోవడం, ప్రవాస జీవితాల వేదనలను చిత్రించడానికి ‘ఇస్లాంలో రాజకీయ కవి కార్యశీలతకి, కవిత్వమే కార్యాచరణ” గా ఉండాలని సూచిస్తాడు. ఒక తీవ్రమైన, నిష్ణాతుడైన గేయకవి. ఆ కాలంలో తన కళలో శిఖరాగ్రంలో ఉన్న ఒక మహాకవి యువకవులకు ఒకస్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా సలహాలిస్తున్నట్లు ఈ కవితలో కనిపిస్తుంది.

తన భాషపై, విస్తృత కవిత్వ భాషపై ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ఒక కవికి అనుకరణపై ఆసక్తి లేకపోవడం కూడా కనిపిస్తుంది. ‘నన్ను పోలి ఉండకపోతేనే మరింత అందంగా ఉంటుంది. మీరు మా రచనలను చదివితే, అవి మా అహంకారానికి కొనసాగింపుగా కాకుండా, మా తప్పులను సరిదిద్దేవిగా ఉండాలి, వేదనల సందర్భాలలో రాసిన గ్రంధాలలో ఉన్న మా తప్పులను సరిదిద్దుకునేవిగా ఉండాలి అని అంటాడు. యువ కవులకు “నిర్లక్ష్యం చేయబడిన భవిష్యత్తు” మాత్రమే “ఏకైక సంరక్షకురాలు” అనే మౌలికత కోసం ఒక వినయపూర్వకమైన ఆశ నిత్య నూతనంగా ఉండాలని బోధిస్తాడు.

అనువదించిన ఫాడీ జౌడా(Fady Joudah) ఒక పాలస్తీనియన్-అమెరికన్ వైద్యుడు, కవి, అనువాదకుడు. ఆయన టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జన్మించి, లిబియా, సౌదీ అరేబియాలలో పెరిగారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియాలో, హ్యూస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్సెస్‌లో విద్యనభ్యసించారు. 2002 – 2005లో, ఆయన వరుసగా జాంబియా, సూడాన్‌లలో ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ (Doctors Without Borders) సంస్థతో కలిసి పనిచేశారు.)

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply