భీమయ్యాక్

ఆసిఫాబాద్ జిల్లా అడవుల కొండవాలులో, కాలంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా జీవించే ఒక చిన్న కొలాం పోడ్. ఇరవై రెండిళ్ళున్న ఆ కొలామ్ పోడ్ పేరు ఖైరిగూడ.

అడవి గుండెల్లో నుండి ప్రవహించే వట్టివాగు గలగలలు ఆ శీతాకాలపు ఉదయం గూడెం అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఏడేళ్ల భీమ్ ముఖంపై పడిన లేత సూర్యకిరణాలకు కళ్లు నలుపుకుంటూ లేచాడు. అడవి గడ్డి, కలప, కర్రలతో నిర్మాణం చేసిన చతురస్రాకారపు దోడ (ఇల్లు), ఇంటి ముందు జొన్న చొప్ప పందిరి. మట్టితో అలికిన గోడలకు తెల్లటి ముగ్గులు, ఆవు పేడతో అలికిన అరుగు. ఆ అరుగు పై కూర్చుని వెదురు కర్రలను సన్నటి చీలికలుగా చీలుస్తూ భీమ్ తండ్రి సోము. అతనలా చీల్చుతున్నప్పుడు వెదురు పొట్టు కింద రాలుతున్నది. కానీ భీమ్ చూపు మాత్రం వాకిట్లో తల్లి జంగుబాయి వేసిన రేఖాగణిత ఆదివాసీ ముగ్గు వైపు, ఆవులు, మేకలు, కోళ్లు, ఇంటి దడి చుట్టుముట్టు అల్లుకున్న చిక్కుడు తీగెలు, ఆపై గూడెం దాటి అనంతంగా విస్తరించిన అడవి వైపు సాగిపోయింది.

అప్పుడే వాళ్లమ్మ జంగుబాయి ఇంటి ముందు కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు కాలుస్తున్నది. ఆ కమ్మని వాసన అడవి గాలిలో కలిసి మనసును తాకింది.

భీమ్ లేవడం చూసి, వెదురు బుట్ట అల్లుతున్న తాత ఆత్రం జైతు దెవ్నక్ నవ్వుతూ పిలిచాడు. ముడతలు పడిన చేతులతో తట్ట అల్లుతున్న జైతు డెబ్భై ఏళ్లు దగ్గర పడుతున్నా అడవిలో ఇప్ప పువ్వులు ఏరడానికి పరిగెత్తేంత సత్తువ ఆయన సొంతం.
మనవడి తల నిమురుతూ “ఒరేయ్ భీము… ఇవాళ మన ‘ఆయక్’ గదరా. జల్దీ తయారవ్వు. వాగుకు పోవాలి” అన్నాడు గంభీరమైన, ఆప్యాయమైన గొంతుతో.
తాత మాట వినగానే భీమ్ ఉత్సాహంతో ఎగిరి గంతేశాడు.

తెల్లదోతీ, తెల్లచొక్కా తలకు రుమాలుతో ఉన్న మగవాళ్ళంతా కలిసి సంప్రదాయ వాయిద్యాల హోరులో వాగు వైపు నడక సాగించారు. వాళ్ళతో పాటే భీమ్ కూడా. నాలుగైదు మైళ్ళు నడచి చ్చారు. వట్టివాగు నీళ్లు అద్దంలా మెరుస్తున్నాయి. భీమ్ ఆ నీటిలో చేతులు ముంచి దోసిళ్లతో నీళ్లు తాగుతుంటే, ఇసుక తివాచీపై ఈదుతున్న చిన్న చిన్న చేపలు అతని వేళ్లను ముద్దాడుతున్నాయి. అదంతా వాగు ఆవలి ఒడ్డున ఉన్న దట్టమైన నల్లమద్ది, టేకు, తునికి, తిరుమాన్, మోదుగ, వెదురు, రేగు, విప్ప వంటి అనేక రకాల చెట్లు సంబరంగా చూస్తున్నాయి.

తాత భుజం మీద నెమలి పించాలు, గజ్జెల పట్టీలు, ఇత్తడి ఎద్దు కొమ్ములతో అలంకరించిన పవిత్రమైన రెండడుగుల మద్ది చెక్క దిమ్మె తెల్లవస్త్రంలో చుట్టి ఉంది. అదే వారి దేవుడు. వాగు నీటిలో ఆ కర్రను ముంచి ‘వాగు స్నానం’ చేయిస్తుంటే, గూడెం యువకులు కొట్టే తప్పెట్ల శబ్దం అడవిని పులకరింపజేసింది. ఆ లయకు చిన్నారి భీమ్ ఆనందంతో పరవశించాడు.

వెనుదిరిగిన తాత బృందం దగ్గరకు పరిగెత్తుకొచ్చి చేయందుకుని “తాత.. ఒకటడగనా? భారత కథలో భీమన్న మన అడవికి ఎలా వచ్చాడు?” అమాయకంగా అడిగాడు భీమ్.

తాత భీమయ్యాక్‌ని భుజంపై పెట్టుకుని నడుస్తూ, “మన కొలావర్‌ల అల్లుడురా భీమన్న. మహాభారత కాలంలో పాండవులు ఇక్కడికి వనవాసానికి వచ్చారు, మన అడవి బిడ్డ హిడింబను భీమన్న మనువాడాడు. మంచి బలశాలి. వాళ్లకు పుట్టిన బిడ్డలమే మనమంతా” అని గబగబా నడుస్తూ చెప్పాడు.
“భీమన్న దేవుడెట్ల అయ్యాడు? పూజలు ఎందుకు చేయడం?” మరో ప్రశ్న సంధించాడు భీమ్.
“మనకు వానలు బాగా పడి, చీడపీడలు లేకుండా పంటలు రక్షిస్తాడు. అడవి జంతువుల నుంచి కాపాడతాడు… అని మన పెద్దలు చెప్పారు. అదే మనం ఆచరిస్తున్నాం. ” తాత
“ఓహో… మనని కాపాడేవాడే దేవుడు” ఒక్క క్షణం ఆగి ” ఆ భీమయ్యాక్ పేరే నాకు పెట్టావా తాతా..?”
“అవునురా, నువ్వు కూడా అంతటి బలవంతుడివి కావాలి. మన జాతిని రక్షించాలి మరి!” నవ్వుతూ అన్నాడు తాత.
ఆత్రం జైతు మోస్తున్న ఆ పవిత్ర కర్ర భీమన్న వైపు ఎంతో అభిమానంగా చూసిన భీమ్.అలాగేనని తలూపి “తాతా… మనని కొలావర్లు అని ఎందుకంటారు? గోండులని ఎందుకనరు?” మరో ప్రశ్న వేశాడు.

“కోలా అంటే కర్ర. వెదురు కర్రలతో బొంగుల్ని ఉపయోగించి బుట్టలు, తట్టలు, తడకలు వంటివన్నీ చేస్తాం కదా… అందుకే కోలావర్లు, కొలాములు అంటారు…” ఇంకా ఏదో చెబుతుండగా మడావి లచ్చు తాతతో మాట కలపడంతో సంభాషణ అక్కడికి ఆగిపోయింది. వాళ్ళు పోడ్‌కి చేరేసరికి దాదాపు పన్నెండు అయింది.

గూడేనికి కాస్త దూరంలో అడవి అంచున ఉన్న ఆ చిన్న పాకే వారి దేవాలయం. దాన్ని ‘దేవలాతికాన్’ అంటారు. ఆలయాన్ని శుభ్రం చేసి రెండడుగుల కర్ర భీమయ్యాక్‌కు సంబంధించిన పవిత్ర వస్తువులు, గజా, ఫెర్(గంటల దండ), మార్వర్ (కాలిగజ్జెలు), మట్టి ప్రతిమలు, స్లాత్ కొరడాలు, అయ్యే గుర్రా, బిసే గుండ్‌ను వాగు నుంచి తెచ్చిన జలంతో శుభ్రం చేశారు. ప్రత్యేక ఆభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కోళ్లు, మేకలు తెగాయి. జొన్న రొట్టెలు, జొన్న గట్క, మాంసం, ఇప్ప సారా దేవునికి నైవేద్యంగా సమర్పించారు. పూజ ముగిశాక, పవిత్రమైన గట్క, మాంసాన్ని కలిపి ‘గావ్ బంధన్’ అని గ్రామ నాలుగు సరిహద్దుల్లో చల్లారు.

“తాతా ఇక ఏ రోగాలు, ఏ దుష్ట శక్తులు మన పోడ్ సరిహద్దుల్లోకి రావా?” అదంతా చూస్తున్న భీము సందేహంగా అడిగాడు.
ఒకసారి మనవడి ముఖంలోకి సూటిగా చూసి అవునన్నట్లుగా తలూపాడు తాత. .
“మన భీమాయ్యాక్ మనని రక్షిస్తాడన్నమాట” తాత ముఖంలో ఏం భరోసా దొరికిందో స్వగతంలో అనుకున్నాడు భీమ్. అది చూసి తాత ముసిముసిగా నవ్వుకున్నాడు.

ఆ తర్వాత ఊరంతా కలిసి సామూహిక విందు చేసుకున్నారు. పొద్దు వాలిన తర్వాత పోడ్ అంతా కలిసి ఒకచోట చేరి సాంప్రదాయ డోలు వాయిద్యాలు, తుడుం చప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు.

ముక్కుకు బంగారు ముదా, దర్బా తో పాటు కాళ్లకు చేతులకు వెండి కడియాలతో మెరిసిపోతున్న తల్లి జంగుబాయి, ఆమెతో పాటు ఆ పోడ్ లోని స్త్రీలందరూ దాదాపు అదే విధంగా అలంకరించుకుని లయబద్దంగా వంగుతూ లేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఆడుతూ పాడుతుంటే, తాత, తండ్రి, గూడెం లోని ఇతర పురుషులు సాంగ్యా వేసుకుని (ముఖానికి బూడిద పూసుకుని, నెమలి ఈకలతో చేసిన పెద్ద కిరీటాలను తలపై ధరించి, మెడలో గవ్వలు ఇతర దండలతో అలంకరించుకుని, కొమ్ముబూరలు, తప్పెట్ల వాయిద్యానికి అనుగుణంగా మువ్వల పట్టీ తొడిగిన కాళ్లతో అడుగులు వేస్తూ, చేతిలో కర్రలు పట్టుకుని ) నృత్యం చేస్తుంటే భీమ్ కూడా వాళ్లలో కలిశాడు. అందులో లీనమైపోయాడు. రేల పాటలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిచిన మూడు రోజుల పండుగ లాగే అన్ని రోజులూ ఉంటే ఎంత బాగుంటుందనీ, కుటుంబంతో కలిసి దంతన్పల్లి జాతరకు పోవాలి అనుకున్నాడు చిన్నారి భీమ్.

**
కాలం వట్టివాగు నీళ్లలా వేగంగా సాగిపోతున్నది. భీమ్‌ బాల్యం కరిగి కౌమారంలోకి అడుగుపెడుతున్నాడు. అడవిలో ఉడుముల్లా తిరగడం, తేనెపట్టు రాల్చడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. కానీ అదే కాలంలో గూడెం లో ఒక విధమైన ఆందోళన అలముకుంది. అడవి గుండెల్లో గాయం మొదలైంది.

ఖైరిగూడ సమీపంలోని దుబ్బగూడ, గోలేటి తండా , గొల్లగూడెం గ్రామాలు మాయమై పోయాయి. పెద్ద పెద్ద లారీలు, కొండలను పిండి చేసే జెసిబి యంత్రాలు వచ్చి పడ్డాయి. పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. సింగరేణి కంపెనీ వాళ్లు దానిని గోలేటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ అన్నారు.

కొద్ది రోజుల్లోనే పచ్చని అడవి కాస్త నల్లటి బొగ్గు బూడిద దిబ్బలుగా మారింది.
ఖైరిగూడ గోడలు నల్లబడ్డాయి. జొన్న రొట్టెల మీద నల్లటి పొర పేరుకుపోయింది. మైనింగ్‌తో పాటు బీహార్, జార్ఖండ్‌ల నుండి వందలాది వలస కార్మికులు, లారీ డ్రైవర్లు వచ్చారు. గూడెం అంచున మద్యం దుకాణాలు వెలిశాయి. భీమ్ తండ్రి సోము ఆ మద్యానికి బానిసయ్యాడు. అంతకంటే ఘోరంగా… గూడెంలోకి ఎన్నడూ వినని ‘హెచ్‌ఐవీ/ఎయిడ్స్’ మహమ్మారి ప్రవేశించింది. గతంలో ఎన్నడూ ఎరగని కొత్తరోగం వచ్చిన వారిని దెయ్యం పట్టిందని గ్రామంనుంచి వెలివేస్తున్నారు. భీమ్ స్నేహితుడి అక్క కొత్త వ్యాధితో కుంగిపోతూ, కనీసం వైద్యం లేక కళ్లముందే చనిపోవడం భీమ్‌ను భయభ్రాంతులకు గురిచేసింది.
తినే తిండి, పీల్చే గాలి, పచ్చని అడవి తల్లి… అన్నీ బొగ్గు రాక్షసుడి చేతిలో గాయపడి రక్తం కక్కుతున్నట్టు అనిపించింది భీమ్‌కు.

భీమన్న పండుగకు గుస్సాడీ ఆడుతూ ప్రకృతితో బతికిన గూడెం ఇప్పుడు మారుతున్నది. పక్కనే సింగరేణి కోసం లారీలు అడవిని చీల్చుకుంటూ చొచ్చుకు పోతున్నాయి. గూడెం యువత అటు ఆకర్షితులవుతున్నారు. భూమి ఇస్తే బోలెడంత సొమ్ము, గొప్ప జీవితం వస్తుందని ఇంట్లో ఒకరికి సింగరేణిలో పక్కా ఉద్యోగం అని ఖైరిగూడతో పాటు మిగిలిన చుట్టుపక్కల గూడేల్లోనూ ప్రచారం అయింది.

భీమ్ తండ్రి సోము గోలేటి టౌన్షిప్ నిర్మాణపనుల్లో కూలీగా చేరాడు. అప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న అధికారుల ఇళ్లలో పనిచేయడానికి మనుషులు అవసరమయ్యారు. ఓ ఇంజినీరు సోముని పిలిచి తమ ఇంట్లో పనిచేయడానికి ఎవరినైనా తీసుకురమ్మని చెప్పాడు. సోము , వెంటనే భీమ్‌ని బడి మాన్పించి గోలేటి మైనింగ్ ఇంజినీర్ ఇంట్లో పనికి కుదిర్చాడు.
మైనింగ్ ఇంజినీర్లు ఉండే క్వార్టర్లు ఎంతో అందంగా, రంగు రంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోయేవి. అక్కడ రోడ్లు అద్దంలా ఉండేవి. అక్కడి వాళ్ళ పిల్లలు తెల్లటి చొక్కాలు, బూట్లు వేసుకునే వారి ఇంగ్లీష్ స్కూళ్లు భీమ్‌ను ఆకర్షించాయి. యువకుల చేతుల్లో మెరిసే మోటార్ బైకులు, రాత్రి పూట వారు చూసే టెలివిజన్ బొమ్మలు, పాటలు భీమ్‌కు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేశాయి.
.
భీమ్ తన చిరిగిన చొక్కాను, నల్లటి బొగ్గు బూడిద కొట్టుకున్న చేతులను చూసుకుంటూ, చదువుకున్న వాళ్ళు ఇంజినీరు సారులుగా మారతారేమో. ఈ నల్లటి బూడిద, పనులు, రోగాలు ఉండవేమో! ప్రతిరోజూ వెన్నెల రాత్రి లాగే ఉంటుందేమో! అనుకునేవాడు.
గూడెం కట్టుబాట్లు, తాత జైతు చెప్పే కథలు ఇప్పుడతనికి పాతకాలపు ముచ్చటగా అనిపించసాగాయి. ఆధునిక నాగరికత, గోలేటి పట్టణ కాంతులు అతని కళ్లను కప్పేశాయి. నాగరిక సమాజం చాలా గొప్పగా చిటారు కొమ్మన ఉన్న తేనె పట్టు లాగా కనిపించసాగింది.
ఇంజినీరుగారి భార్య శారదమ్మకి భీమ్ చురుకుదనం నచ్చింది. ఆంత్రోపాలజీ, సోషయాజీ, హిస్టరీలతో డిగ్రీ చదివిన ఆమెకు అక్కడి ఆదివాసీల గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపేది. భీమ్ లాంటి పిల్లలు చదువుమానేసి ఇళ్లలో పనిచేయడం ఆమెకు కష్టంగా ఉండేది. ఓ రోజు “భీమ్… నువ్వు తెలివైనవాడివి. జీవితాంతం ఇళ్లలో పనులు చేస్తూ ఉండిపోకూడదురా… బాగా చదువుకోవాలి. నిన్ను ఆసిఫాబాదు హాస్టల్‌లో చేర్పిస్తాం. చదువుకుంటావా?” అన్నది. భీమ్ది అంత ఆసక్తి చూపలేదు కానీ ఆ మాట తాతతో యధాలాపంగా చెప్పాడు ఆ రాత్రి.

శారదమ్మ, తాత జైతుల ప్రోత్సాహంతో హాస్టల్‌లో అడుగుపట్టాడు భీమ్‌. ఆ నాలుగు గోడలు చూస్తే అతనికి అడవిలో స్వేచ్ఛగా చెంగు చెంగున పరిగెత్తే కుందేలు పిల్లను తీసుకొచ్చి గంపకింద బోర్లించి నట్టుగా అనిపించింది.

పగలు ఎలాగో గడిచినా.. రాత్రి నిద్ర పట్టక కిటికీ గుండా చూస్తుంటే తమ అడవి గాలి, వాగు గలగలలు, అమ్మ చేసే జొన్న గట్క, జొన్న రొట్టెల వాసన, తండ్రి చెప్పే అడవి ముచ్చట్లు, తాత చెప్పే భీమన్న కథలు గుర్తొచ్చి ఏడుపొచ్చేది. స్వేచ్ఛగా బతికిన ఆ అడవి పుత్రుని ప్రాణం ఆ కాంక్రీట్ గదుల్లో హాస్టల్ నియమ నిబంధనలలో ఇమడలేక పోయింది.
వారం తిరక్కుండానే బంధనాలు తెంచుకున్న పక్షిలాగా భీమ్ హాస్టల్ నుండి పారిపోయి ఇంటికి చేరాడు. ఇంటికి రాగానే తల్లి కాళ్ళు పట్టుకుని, “నేను ఆ హాస్టల్‌లో ఉండనమ్మా… నాకు చదువు వద్దు… ఆసిఫాబాద్ వద్దు, తెల్ల చొక్కాలు వద్దు. మన గూడెం దాటి ఎక్కడికి పోను” అని చిన్న పిల్లవాడిలా మారం చేశాడు. కొడుకుపై బెంగతో ఉన్న జంగుబాయి ఏడుస్తున్న కొడుకుని గుండెకు హత్తుకుని విడిచి నేను ఉండలేనని తానూ ఏడ్చి బెంగ తీర్చుకుంది.


భీమ్ గూడెంలోనే ఉండిపోయిన ఆ రోజుల్లోనే భీమ్‌కి పిన్ని వరుస అయ్యే సక్కుబాయి పెళ్లి జరుగుతున్నది. రంగురంగుల కాగితాలతో పెళ్లిపందిరి నుంచి వధూవరులు గూడెం మధ్యలో ఆవు పేడ కుప్ప ముందు కూర్చున్నారు. వారి చేతిలో పచ్చని పేడను, కొన్ని బియ్యం గింజలు పట్టుకుని ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.
పచ్చని ప్రకృతి మధ్య, పవిత్రమైన ఆచారాల నీడలో సంబరంగా ఉన్న వారికి రాబోయే ‘నల్లటి రాకాసి బొగ్గు’ గురించి ఏ మాత్రం ఆలోచన లేదు.
ఆ ఆనంద సమయంలో ఊహించని పిడుగు పడింది. కంపెనీ విస్తరణ కోసం ఖైరిగూడలో భీమ్ కుటుంబంతో పాటు ఆ గూడెం వారి ఆధీనంలోని భూమి, వారు ఉంటున్న ‘దోడ’ను స్వాధీనం చేసుకుంటుందని, రెండు నెలల్లో ఖాళీ చేయాలని ప్రభుత్వం నుండి నోటీసు వచ్చింది.

దాంతో గూడెంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
‘‘ఈ జల్ జంగల్ జమీన్ మాది. మేం వదిలేది లేదని ఆనాడే చెప్పాము. మళ్ళీ ఇప్పుడికాగితం ఏంటి? మేం, అప్పుడు ఇప్పుడూ చెప్పేది ఒక్కటే. వదిలి పోయేదేలేదు.. ’’ ఖరాఖండిగా చెప్పాడు ఆ గూడెం పటేల్ జైతు దేవ్నక్.

సరిగ్గా అప్పుడే గూడెంలోకి సాగర్ రావు ప్రవేశించాడు. అతని వెంట మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పెద్ద దొర కొడుకుగా జైతుకి మరి కొందరికి అతని పరిచయం ఉన్నప్పటికీ అంత పెద్దమనిషి తమ పోడ్ కి రావడం ఆశ్చర్యంగా ఉంది. తెల్లటి సఫారీ సూటు, చేతికి బంగారు ఉంగరాలు, నోట్లో పాన్ పరాగ్ నములుతూ అతను మాట్లాడే హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, తెలుగు మిశ్రమ భాష గూడెం జనాలను నోరెళ్లబెట్టేలా చేసింది.
“అయ్యా ఆత్రం, మడావి వీరులారా! అవునన్నా కాదన్నా దుబ్బుగూడెం, గోలేటి తండా పోయినట్టే మీ గూడెం సింగరేణిలోకి పోతుంది. తప్పదు. అయినా, మీరు ఆందోళన పడకండి. మీకోసం నేనున్నాగా… నేనెవరో మీకు తెలియకపోవచ్చు కానీ మీరంతా మా కుటుంబానికి బాగా తెలుసు. మా నాన్న, మా తాత ఈ చుట్టుపక్కల తెలియని వారుండరు…’’ అని చెప్తుంటే
జైతు అందుకుని ‘‘మీరు, పెద్ద దొర నడిపి కొడుకు .. ’’ అంటుంటే సాగర్ రావు అవునని తలూపి, మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు.

‘‘ఆ ఆఫీసర్లు, కలెక్టర్లు మిమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతారు. నాకు ఐటీడీఏలో పెద్ద సారు బంధువు. ఆ సింగరేణి ఎండీ నా దోస్తే. మీకు అండగా నేనున్నా.
నేను చెప్పినట్టు విని మీ భూమి జాగా కాగితాలు నాకిస్తే, మీకు ఎంతో కొంత సొమ్ము వచ్చేటట్టు చూస్తా… మీకు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తా. నా మాట నమ్మండి. ఒకటి రెండురోజుల్లో మళ్ళీ వస్తాను” అంటూ గూడెం ప్రజల ముందు నమ్మబలికి, వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయాడు.

జనంలో కలకలం మొదలైంది. గోలేటికి రాకపోకలు బాగా పెరిగిన ఖైరిగూడెం యువకులతో పాటు భీమ్ కు కూడా గోలేటి బాగా ఆకర్షించింది. గూడెం వదిలితే తాము కూడా అక్కడే ఉండొచ్చు అని ఆలోచనలో పడ్డారు.
జైతు మొండి వైఖరి వారికేం నచ్చట్లేదు. మేకలు అడవిలోకి తోలుకుపోతూ తాతను ఒప్పించాలి. ఎలా అని ఆలోచిస్తూ భీమ్.

చెప్పినట్లుగానే, మరో రెండు రోజుల్లో సాగర్ రావు మళ్ళీ వచ్చాడు. ఇప్పుడతను జైతు దగ్గరకు రాలేదు. ముందుగా యువతను కలిశాడు. నాలుగైదు తరగతులు మించి చదువులేని వారిని మాటలతో అందలం ఎక్కించాడు.
వాళ్ళ ఇళ్లకు వెళ్లి ఒక్కో కుటుంబం చేతిలో పదివేల రూపాయల విలువైన ఏభై, ఇరవై, పది నోట్ల కట్టలు పెట్టాడు. సంచుల్లో నింపి ఇచ్చిన అన్ని నోట్లకట్టలు ఒక్కసారిగా ఎప్పుడూ చూడని వాళ్లంతా తమకు పట్టిన అదృష్టం చూసి పురివిప్పి నాట్యమాడుతున్న మయూరాల్లా..
నాగరికత కాంతులకు లొంగిపోయిన భీమ్ తండ్రితో, “అవును నాన్న… మనం గోలేటి పోదం. ఆడనే ఉందం. ఆ పెద్ద సారు చెప్పినట్టు చేద్దామే” అని గుసగుసగా అన్నాడు. సోముది కూడా అదే అభిప్రాయం.

ఆ పోడ్ పటేల్‌గా ఆత్రం జైతు దెవ్నక్ “ఒరేయ్… అడవి తల్లిని అమ్మితే పాపం చుట్టుకుంటుందిరా.. చేనును కాపాడుకుంటే కడుపు నింపుతుంది, అడవిని కాపాడుకుంటే ఊపిరి నింపుతుంది.

అడవి మన ఇల్లు . ఇదే మన జీవనం . మన సంస్కృతి. అన్ని ఈ అడవే. ఈ ఆవాసాన్ని కోల్పోతే మన సొంత భూమిలోనే పరాయివారమై పోతామని, మనం గోలేటికో, మరో ప్రాంతానికో మారడం అంటే మన ప్రాణాన్ని, మన ఉనికిని, మన గుర్తింపుని సమాధి చేసుకోవటమే ” అని పెద్దరికంతో హెచ్చరించినా గూడెం వారి ఆశల ముందు ఆ వృద్ధుడి గొంతు మూసుకుపోయింది.
గూడెం పటేల్ జైతు తరానికి ఆ తర్వాతి తరాలకు మధ్య ఘర్షణ మొదలైంది. ఆ సంఘర్షణలో చివరకు తన కొడుకు, మనవడు కూడా తన మాట వినట్లేదని జైతు చాలా ఆవేదనతో ఉన్నాడు.

ఒకరోజు సాగర్ రావు కబురంపి “ఇవిగో… ఆత్రం సోమూ… చిన్నూ, మడావి బాలు…” అంటూ ఇరవై రెండు కుటుంబాల వారికీ తలా ఐదు వేల రూపాయలు ఇచ్చాడు. అవి ముట్టినట్టు ఈ కాగితాలపై సంతకాలు పెట్టాలంటూ నల్లటి ఇంక్ ప్యాడ్ వారి ముందు పెట్టాడు. గొర్రె ఎప్పుడూ కసాయివాడిని నమ్ముతుందన్నట్లు అక్షరం ముక్క రాని వారు బొటనవేలిని దానిపై నొక్కి, స్టాంప్ పేపర్లపై ముద్ర వేశారు. వచ్చిన అందరికీ చాయ్ తాగించి కంపెనీ సొమ్ము ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లోగా మీకు అవసరాలు ఉంటాయని నా సొంత డబ్బు మీకు ఇచ్చానని అతను చెప్పడంతో ఎవరెలాంటివారో గ్రహించలేని అడవి బిడ్డలు అతని ఔదార్యానికి ఉప్పొంగిపోయారు. ఈ సొమ్ము మీకు ఊరికే ఇవ్వట్లేదు. మీ పైసలు వచ్చాక నా పైసలు ఇవ్వండి. మిగతాది పదివేలో, ఇరవైవేలో, యాభైవేలో ఎంతొస్తే అంత మీరు పట్టుకుని పోదురు అని ఆశ పెట్టి మరీ పంపించాడతను.
దాదాపు రెండు నెలలు గడిచాయి. అతని కబురు కోసం ఎదురు చూస్తున్న ఆ అడవిబిడ్డల ఆశ నెరవేరలేదు. సొమ్ము రాలేదు. ఉద్యోగం ఊసే లేదు. కలుద్దామంటే అతనెక్కడ ఉంటాడో తెలియదు.

జైతు దెవ్నక్ తమ వారిని తీసుకుని ఆరు నెలలుగా సింగరేణి ఆఫీస్ చుట్టూ తిరిగాడు. సాగర్ రావు జాడ తెలియలేదు. ఈలోగా ఇల్లు చదును చేయడానికి జేసీబీలు వచ్చాయి. జనం బెంబేలెత్తిపోయారు. తమకు రావాల్సిన బకాయి సొమ్ము, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేవరకు ఖాళీ చేసేది లేదని మొండికేసి కూర్చున్న ఆత్రం జైతు దెవ్నక్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది.

సింగరేణి నుంచి వచ్చిన అధికారి “అయ్యా… మీ భూమిని మీరు ఎప్పుడో మాకు అమ్మేశారు. చట్టప్రకారం ఈ గూడెం మొత్తం కంపెనీది. రేపు తెల్లవారేసరికి మీ ఇళ్ళు కన్పించవు, మర్యాదగా వెళ్లిపోండి. లేదంటే మీ వస్తువులతో సహా ఇల్లు చదునుగా మారిపోతుంది” అన్నాడు.
“ఇస్తానన్న సొమ్ము ఇవ్వలేదు. ఇంటికొక ఉద్యోగం లేదు. ఎక్కడికి పొమ్మంటారు. ఇంచి కదిలేది లేదు” అని ఆడ-మగ, పిల్లా -పెద్ద అంతా ఎదురు తిరిగారు.
“ఇవ్వకపోవడం ఏమిటి. అప్పుడే ఇచ్చేశాం. మీరంతా సాగర్ రావు పేరు మీద ఆ సొమ్ము ఇవ్వమని వేలిముద్ర వేసి ఇచ్చారు. సింగరేణి ఇచ్చిన పరిహారం మొత్తం నాలుగు నెలల క్రితమే అతని ఖాతాలో పడింది. ఇప్పుడు ఈ భూమి మీది కాదు. సింగరేణి సంస్థది.”
హతాశులయ్యారంతా. ముందుగా జైతు తేరుకుని “కట్టు కథలు చెప్పకండి” అని ఆ అధికారి కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు.
“పెద్దయ్యా… నేను చెప్పేది పూర్తిగా నిజం. కావాలంటే మీరు చేసిన సంతకాల పేపర్లు చూడు” అంటూ వాహనం నుంచి ఒక ఫైలు తీసి చూపించాడు. అవన్నీ సాగర్ రావు ఐదు వేలు ఇచ్చినప్పుడు వేయించుకున్న వేలిముద్రలు.

“నిజానికి మీవన్నీ అటవీ భూములు. వాటిని మీరు మూడేళ్ళ క్రితం పట్టా చేయించుకున్నారు. అందుకే మీకు మార్కెట్ విలువ కంటే నాలుగింతలు ఎక్కువ పరిహారం చెల్లించాం. లేకపోతే అదీ వచ్చేది కాదు.
మీ అందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం అందిస్తాం. ఇక ఉద్యోగం అంటారా… మీలో కనీసం పదో తరగతి చదివిన వాళ్లు ఒక్కరైనా లేకపోతిరి. ఏం ఉద్యోగం ఇవ్వాలని” పకపకా నవ్వాడు. “మీరు చేయగలిగే కూలిపనులకు ఎట్లాగూ వస్తున్నారు కదా…”
వారికి ఆ అధికారి చెప్పేది ఏమీ చెవికెక్కడం లేదు. తాము నమ్మిన నాగరిక ప్రపంచం, తాము గౌరవించిన పెద్దరికపు తెల్లటి చొక్కాల వెనుక ఇంతటి క్రూరమైన మోసం ఉందా… అని బిక్కచచ్చి పోయారు.

కొత్తగా వచ్చిన మనిషిని మనవాడని నమ్మారు. ప్రేమించారు. గౌరవించారు. దేవుడిలాగా చూశారు. కానీ అతనేం చేశాడు? తమ జీవనాధారమైన అడవిని, భూమిని, నివాసాన్ని కోల్పోతున్నాం అని ఆత్రం సోము తండ్రి జైతు వైపు చూడలేక కళ్ళు దించుకున్నాడు.
పచ్చటి గోలేటి అడవి పక్షుల కిలకిలలు ఆగిపోయి బూడిదకుప్పలైన దృశ్యం కళ్ళ ముందుకొచ్చి రేపు నరికే చెట్లు, పిండయ్యే కొండలు, మూగబోయే మూలాలు ప్రకృతి ఆక్రందన ఊహించుకుంటుంటే జైతుకి తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తున్నట్లుంది. శరీరం నుంచి ప్రాణం విడిపోయినట్లయింది.

తాత ముత్తాతల కాలం నుంచి తరతరాలుగా అడవిని నమ్ముకుని బతికే మాకు ఈ చెట్టు పుట్ట పిట్ట అన్నీ దేవతలే. కుటుంబసభ్యులే. ఈ మట్టిని విడిచిపెట్టడం అంటే వేర్లు తెగిన చెట్టులాగా ఎండిపోవడమే. సొంత భూమిలోనే పరాయివాళ్ళై దిక్కులేని వారైపోవడంతో తల్లడిల్లిపోతున్నాడు జైతు.

ఉన్నపళాన ఉన్నదంతా వదిలి మరోచోటకు పోవడం అంటే… ఎంత కష్టం. అవమానం, ఆకలి, మోసం, ఆక్రోశం నూనూగు మీసాల భీమ్ గుండెల్లో నిప్పు రాజేసాయి. మా తాత ముత్తాతల రక్తంతో తడిసిన ఈ మట్టిని ఎవడో కాగితం మొక్కలతో సొంతం చేసుకుంటానంటే చూస్తూ కూర్చుంటామా? మా నవ్వులను , మా పాటలను, మా బతుకును మోసంతో లాక్కున్న మీకు బుద్ధిచెబుతా ” అంటూ
తండ్రి తాతల వేట గొడ్డలి, పదునైన కత్తులు తీసుకున్నాడు.

“మనని నిండా ముంచిన తెల్ల చొక్కా సార్‌ను, ఆఫీసర్లను నరికి చంపేస్తా” అని ఉగ్రరూపంతో గూడెం దాటుతున్న భీమ్‌కి… తాత దెవ్నక్ ఎదురొచ్చి నిలబడ్డాడు. ఆ వృద్ధుడి చేతిలో ఏ ఆయుధమూ లేదు, కానీ కళ్లలో అచంచలమైన శక్తి కనిపించింది భీమ్‌కి.

తాత భీమ్ చేతిలోని గొడ్డలిని లాగి కింద పడేశాడు. భీమ్ ఆవేశంతో రగిలిపోతూ, “నన్ను ఆపకు తాత! ఆ సారు మనని చంపేశాడు. మన పోడ్ ని ముంచేశాడు. వాడిని వదిలేది లేదు” ఉగ్రంగా రంకెలు వేశాడు.

తాత భీమ్ భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు.
“ఒరేయ్! భీము… నేను చెప్పేది వినరా నాయిన…కలవరపడకు. నీ గుండెల్లో రగులుతున్న మాన్తా నాకు తెలుసు. కన్నతల్లి లాంటి ఈ నేల, ఈ అడవి, ఈ గాలి అన్యాయంగా పరాయిపాలైందని నీ రక్తం మరిగిపోవడం సహజమే. కానీ నువ్వు గమనించావా?
వాడు నిన్ను కొట్టింది చేత్తో కాదురా, కాగితంతో! వాడి చేతిలో ఉన్న అక్షరంతో. మన కాళ్ళ కింద నేలని, మన తిండిని, మన గాలిని, మన నీటిని మన సర్వస్వాన్ని ఒకే ఒక్క నిమిషంలో దోచుకున్నది ఆ అక్షరంతోనే రా. నువ్వు వాడిని గొడ్డలితో నరికితే జైలుకు పోతావు. వాడు పట్టుకున్న ఆ చట్టం అలాగే ఉంటుంది. వాడు వాడిన ఆ అక్షరాన్ని, ఆ కాగితాన్నే నువ్వు చేతబట్టాలి. చదువుకోరా భీము! ఈ తాత మాట విని చదువుకుపోరా! వీళ్ళ కాయితాలు ఈ అడవిని కొనగలవేమో కానీ మన అడుగుల్లో ఉన్న మట్టి వాసనను ఎవడు చెరిపేయలేడని లోకానికి చెప్పరా” అంటూ మనవడి ఆవేశాన్ని చల్లార్చి ఆలోచన నింపాడు.

రెండు రోజుల్లో ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ స్వాధీనం పనులు మొదలయ్యాయి. ఒక మధ్యాహ్నం చెవుల హోరెత్తించే శబ్దంతో కొండలను పేల్చారు. అది ఆ గూడెం వాసులకి తమ గుండె పగిలే శబ్దంలా ఉంది. ఆ రాక్షస యంత్రాలు ఒక్కో చెట్టును కూలుస్తుంటే, వారి ఊపిరి ఆగిపోతున్నట్లవుతున్నది. . భయంతో పక్షులు ఆకాశంలోకి ఎగిరి పోయాయి. జంతువులు కకావికలమై పరుగెత్తాయి. వందల ఏళ్ల నాటి ‘ఆయక్’ కొండ ముక్కలై పోవడం భీమ్ కళ్ళారా చూశాడు.
ఆ రాత్రి దేవలాతికాన్ పైకప్పు కూలిపోయింది. లోపల ఉన్న పవిత్రమైన భీమన్న కర్ర రెండు ముక్కలైపోయింది. తాత ఆ విరిగిన కర్రను గుండెలకు హత్తుకుని అడవి మధ్యలో విప్ప చెట్టు కింద కూర్చుని పిల్లాడిలా ఏడుస్తుంటే భీమ్ కి తెలియకుండానే కళ్ళమ్మట జలజలా నీరు కారింది. గుండె బరువైంది. ఆ దృశ్యం అతని మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది.
నిరాశ్రయులైన వారందరిలో భవిష్యత్ పై తీవ్రమైన ఆందోళన. అప్పటికప్పుడు ఎటు పోవాలో తెలియక చెట్లనాశ్రయించారు. రెండు మూడు కుటుంబాలు గోలేటి వెళ్లాయి.

జరిగిన విషయం తెల్సుకున్న శారదమ్మ ఆగలేకపోయింది. భీమ్ అంటే ఉన్న ప్రత్యేక అభిమానం తో పాటు, ఈ ఆదివాసీల బతుకు ఏమిటని కూడా కలవరపడిన ఆమె వెంటనే వెతుక్కుంటూ అడవికి వచ్చింది. ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఏరియా దాటి ఆడవిలోనే విప్ప చెట్టు కింద ఉన్న భీమ్ కుటుంబాన్ని, కన్నీళ్లతో ఉన్న జంగుబాయిని , ఇతర ఆదివాసీ కుటుంబాలను చూసి ఆమె హృదయం ద్రవించింది.

గోలేటి కొత్తగా వచ్చిన రోజు పరిచయమైన భీమ్ అంటే పుత్ర వాత్సల్యం. అందుకే, అతని చేతులు పట్టుకుని ఎంతో ఆత్మీయంగా “భీమ్… హాస్టల్ వదిలి పారిపోయి వచ్చావు. ఇప్పుడైనా అర్థమైందా… ఎందుకు చదువుకోవాలో? ఈ సమాజం చదువు లేని వాళ్ళని ఎప్పుడూ ఇలాగే దగా చేస్తూనే ఉంటుంది. నీ తాత చెప్పింది నిజం. చట్టం తెలియకపోతే మీ కాళ్లకింది నేలే కాదు, రేపు మీ ఉనికి కూడా మిగలకపోవచ్చు. నీ కోసం, మీ అమ్మానాన్నల కోసం నువ్వు మళ్ళీ పుస్తకం పట్టాలి. ఈ సారి భయపడి పారిపోవద్దు. లోకం పోకడ తెలుసుకోవడానికి చదువు, పోరాడటానికి చదువు. నిన్ను నువ్వు నిలుపుకోవడానికి చదువు…” అని చెప్పింది.
తన మూలాల నుండి తాత ఇచ్చిన జ్ఞానం, నాగరిక ప్రపంచం నుండి వచ్చిన శారదమ్మ ఆత్మీయత…

ఇద్దరి మాటలు భీమ్ కళ్ళలోని ఆవేశాన్ని కఠిన సంకల్పంగా మార్చాయి. ఆ రోజే భీమ్ అక్షర దీక్ష తీసుకున్నాడు. కానీ, చెప్పాపెట్టకుండా వచ్చేసిన హాస్టల్ కి మళ్ళీ వెళ్లడం అంటే ఎందుకో నచ్చడం లేదు. ఇప్పుడు పొతే హాస్టల్ వాళ్ళు ఒప్పుకుంటారా.. సీటు లేదు పొమ్మంటారేమో! వాళ్ళు సీటు ఇచ్చినా పిల్లలంతా గెలిచేస్తారు. అది తప్పించుకున్నా అసలు పాఠాలన్నీ తాను నేర్వగలడా..? అనేకానేక సందేహాలు, భయాందోళనలతో సతమతమవుతున్న .
మనవడిని గమనించాడు తాత.

విషయం తెల్సుకుని భుజం తట్టి ఎటువంటి సంకోచంలేకుండా తనతో రమ్మని ఆసిఫాబాద్ తీసుకెళ్లాడు తాత. మొదట భీమ్ ని బడిలో చేర్చుకోవడానికి ఒప్పుకోకపోయినా జైతు వారిని ఒప్పించి మనవడిని వదిలి వెళ్ళిపోయాడు. తాత అలా వదిలి వెళుతుంటే భీమ్ వాగులో ఒడ్డున పడ్డ చేపపిల్లలా విలవిలలాడాడు.

మొదట భయం భయంగా, బిడియంగా ఉన్నప్పటికీ, తిరిగి హాస్టల్‌లో చేరిన భీమ్‌కి చదువే లోకంగా మారింది.ఉన్నది ఎస్టీ హాస్టల్ లోనే తనలాంటి ఆదివాసీ బిడ్డలతో అయినా భీమ్ వాళ్ళతో త్వరగా కలవలేకపోయాడు. నామరూపాల్లేకుండా పోయిన తమ పోడ్ తలుచుకుంటే గుండెలో గునపం దిగినంత బాధ. ఇల్లూ వాకిలి లేకుండా తమ వాళ్లు ఎలా ఉన్నారో అని బెంగ ఒకవైపు, పాఠ్యపుస్తకాల సంక్లిష్టత మరో వైపు అతన్ని బాగా ఇబ్బందికి గురి చేసింది.
రాత్రులు నిద్ర పట్టేది కాదు. దిండు తడిచి పోయేది. కానీ తాత మాటలు, తను కోల్పోయిన గూడెం జ్ఞాపకాలు అతనికి నిత్యం దారి చూపాయి.

గోలేటిలో సింగరేణి స్థలంలోనే తాత్కాలిక గుడిసె వేసుకుని ఉంటున్నారు భీమ్ కుటుంబం. భీమ్ తల్లి జంగుబాయి శరీరం నెమ్మదిగా క్షీణిస్తోంది. కాలుష్యం, ఆందోళన, పోషకాహార లోపంతో బాధపడుతున్నది. తండ్రి సోముకి సారా అలవాటు పెరిగిపోయింది. కొడుకు చదువుతున్నాడని, ఒకరోజు తమ బతుకులను మారుస్తాడని ఆయన లోలోపల నమ్మాడు.

భీమ్ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు తాత జైతు ప్రతి సందర్భంలోనూ “చదువు పూర్తయ్యాక మన భూమి హక్కుల కోసం పోరాడు” అని గుర్తుచేసేవాడు. శారదమ్మ అందించిన గ్రంథాలు, చట్టాలకు సంబంధించిన పుస్తకాలు అతని ఆలోచనలకు పదునుపెట్టాయి.
క్రమంగా తన వాళ్ళతో, ఊరితో భీమ్ కి దూరం పెరిగిపోయింది. ఎప్పుడో ఒకసారి గోలేటికి వచ్చి రెండు రోజులు ఉన్నా శారదమ్మ దగ్గరే ఎక్కువ సమయం గడిపేవాడు. తన చదువు కేవలం ఉద్యోగం కోసం కాదనే స్పృహతో అడుగులు వేశాడు.

కాలక్రమేణా కళాశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి చేరి, పర్యావరణ శాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, గిరిజన హక్కులపై లోతైన అవగాహన సాధించాడు
కఠినమైన పరిశోధనలు, గ్రంథాలయాల అధ్యయనం అతని జీవితం అయ్యాయి. సంవత్సరాల తరబడి చేసిన విశ్రాంతి లేని కృషి ఫలితంగా ఒక ప్రముఖ గ్లోబల్ ఎన్‌జీఓలో పరిశోధకుడిగా ఎదిగాడు.
అంతరించిపోతున్న తెగలు, భాషల గురించి ఓ ప్రొఫెసర్‌తో జరిగిన సుదీర్ఘ సంభాషణ అతన్ని తన మూలాల్లోకి వెళ్లి ఆలోచించేలా, అటవీ ప్రజల హక్కుల కోసం గళం ఎత్తేలా ప్రేరేపించింది.

ప్రకృతిని నమ్ముకుని, తాము ఏర్పరచుకున్న కట్టుబాట్లతో స్త్రీని గౌరవించే కొలామీ ఆదివాసీ జీవితాల్లోకి… బొగ్గు బూడిదతో ఏర్పడిన పర్యవరణ కాలుష్యంతో పాటు శరీరక కాలుష్యం, సామాజిక కాలుష్యం ఎలా వచ్చి చేరిందో కళ్లారా చూసిన భీమ్, గోలేటి ప్రాంత కాలుష్యంపై పరిశోధన చేశాడు. భీమ్ రాసిన పరిశోధనా వ్యాసం అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమై, ప్రపంచ వేదిక దృష్టిని ఆకర్షించింది.

ఆ పరిశోధన విశేషాల కారణంగానే భీమ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగబోయే ‘గ్లోబల్ ఇండిజీనస్ ల్యాండ్ సమిట్’ (ప్రపంచ మూలవాసుల భూముల సదస్సు) కు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికయ్యాడు. మొదటిసారి విమానమెక్కి విదేశాలకు వెళ్లడం అంటే అది అతనెన్నడూ ఊహించని పరిణామం. అది చేరువైన వేళ, వెళ్లాలా వద్దా అని అతని మనసులో తీవ్రమైన ఊగిసలాట.

తీవ్ర అనారోగ్యంతో మృత్యువుతో పోరాడుతున్న తల్లిని వదిలి వెళ్లాలంటే అతనికి మనసు రావడం లేదు. చాలా బెంగగా ఉంది. ఆ విషయమే తండ్రి, తాతతో చెప్పడం విన్న జంగుబాయి కొడుకు చేతులు పట్టుకుని “నువ్వు వెళ్ళు భీము… నా శరీరాన్ని రోగం మింగేసింది. కానీ మన గూడెం పిల్లల భవిష్యత్ ఆ బొగ్గు రాక్షసుడు మింగకుండా ఉండాలంటే నువ్వు చదువుకున్న ఆ లోకానికి వెళ్ళాలి” అని కన్నీళ్లతో ఆశీర్వదించి పంపింది.

పాస్‌పోర్ట్, వీసా, విమాన ఖర్చులు అన్నీ భీమ్ పనిచేస్తున్న సంస్థ ఏర్పాటుచేసింది. ఒక అంతర్జాతీయ ప్రయాణికుడిగా పాస్పోర్ట్, వీసా పత్రాలతో మొదటిసారి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టినప్పుడు భీమ్ గుండె వేగంగా కొట్టుకుంది. విమానం గాల్లోకి లేచినప్పుడు కిటికీలోంచి కింద కనిపిస్తున్న నగరపు కాంతులను చూస్తూ అతను గతాన్ని గుర్తుచేసుకున్నాడు. ఒకప్పుడు తను ఈ కాంతులకే ఆకర్షితుడై తన అస్తిత్వాన్ని మరుగుపరుచుకోవడానికి ఆరాటపడ్డాడు. కానీ ఇవాళ అదే నాగరిక ప్రపంచం గూడెం గొంతు వినడానికి అడవి పుత్రుడిని పిలుస్తోంది. విచిత్రంగా!

**

విమానం వెస్ట్రన్ సిడ్నీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. కోట్లు ఖరీదు చేసే అద్దాల మేడలు, ఖరీదైన కార్లు, సూట్లు ధరించిన తెల్లజాతీయుల మధ్య భీమ్ తన ఖాదీ చొక్కా, కాటన్ ప్యాంటుతో నిలబడ్డాడు. అతని వెంట దక్షిణభారత మూలవాసుల జీవన స్థితిగతులపై పరిశోధన చేసిన మేధావి డా. విశాల కూడా ఉంది.
అతనిలో ఏం గమనించిందో కానీ, భుజం తట్టి “భయపడకు భీము… నువ్వు ఇక్కడికి వచ్చింది నీ ఒక్కడి కోసం కాదు. నేలతల్లిని చెరబడుతూ, అడవితల్లిని ముక్కలు ముక్కలుచేస్తూ మానవాళికి శాపంగా మారుతున్న అభివృద్ధి నుంచి కాపాడుకోవడం కోసం… మన ఆలోచనలు పంచుకోవడం కోసం, మనను మనం తెలుసుకోవడం కోసం” అని ధైర్యం చెప్పింది.

సదస్సుకు ఒకరోజు ముందుగానే సిడ్నీ చేరిన భీమ్ మరుసటి రోజు ఆస్ట్రేలియన్ మ్యూజియం‌కి విశాలతో కలిసి వెళ్ళాడు.
మ్యూజియంలో అడుగుపెట్టగానే గూడెం వదిలి వేల మైళ్ళ దూరం వచ్చాననే భావన పోయింది. అక్కడ ప్రదర్శించిన వేట గొడ్డళ్లు, ఈటెలు, అడవి దుంపలను తవ్వే కర్రలు చూసినప్పుడు, అవి తన తాత, తండ్రి రోజువారీ వాడే కొంక, వెదురు కర్ర, తిప్పన్, వక్కుర్ వస్తువులలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అబోరిజినల్స్ వేసిన డాట్ పెయింటింగ్స్‌ను దగ్గరగా చూస్తుంటే, తన గూడెంలో మహిళలు ఇంటిముందు వేసే విభిన్నమైన కొలాం ముగ్గుల రేఖలు గుర్తొచ్చాయి. డోలు, తుడుం వంటి వాయిద్య పరికరాలు చూసి సంస్కృతులు వేరైనా ప్రకృతిని ప్రతిబింబించే గిరిజన హృదయం ఒక్కటేనని గ్రహించాడు.

నల్లటి శరీరాలు, ముఖంపై, శరీరంపై తెల్లటి చారల గీతలు, పక్షుల ఈకలతో జంతు చర్మాలతో చేసిన కిరీటాలను ధరించి… చేతిలో పెద్ద కర్ర పట్టుకుని ఊదుతున్నారు కొందరు. గుండ్రంగా తిరుగుతూ కొరొబోరి నృత్యం చేస్తున్నారు. ఆ లయబద్ధమైన శబ్దం వింటుంటే, వాళ్ళనలా చూస్తుంటే తన గూడెం వాళ్ళ లాగే, తమ నెమలికలతో చేసిన మలటోపీ ధరించిన గుస్సాడీలాగే అనిపించింది ఓ క్షణం. కానీ వాళ్ళు తన వాళ్ళు కాదు… ఆశ్చర్యంగా చూశాడు.

ప్రకృతిని నమ్ముకుని బతికే అత్యంత ప్రాచీనమైన తెగలు… వాళ్ళ టోటెమ్ గురించి చదువుతుంటే ‘మనది సహదేవ్తా వంశం. ఆరు వేల్పుల వంశం. మన పవిత్ర చిహ్నం పులి, నెమలి. పులి కనిపిస్తే క్రూర జంతువుగా చూడకు. కీడు తలపెట్టకు. మన దైవం. మన వంశ రక్షకుడు. అట్లాగే నెమలిని వేటాడకు. సహజంగా వచ్చిన నెమలి ఈకలు మాత్రమే సేకరించు’ బాల్యంలో తాత నోట విన్న మాటలు గుర్తొచ్చాయి. ఇక్కడ వీళ్ళకి కూడా అంతే. పక్షులు, అడవి జంతువులు వాళ్ళ వంశ చిహ్నాలుగా, జాతి చిహ్నాలుగా ఉన్నాయి. అనాదిగా వస్తున్న ఒక అద్భుతమైన సామాజిక ఆచారం, సమాజం మొత్తం వేర్వేరు జంతువులను రక్షించడం ద్వారా అడవిలోని ఏ ఒక్క జీవి అంతరించిపోకుండా సమతుల్యత కాపాడే విధానం. ఎంత అద్భుతంగా ఏర్పరచారు తన పూర్వులు అని ఒకింత గర్వానికి లోనయ్యాడు.
‘మేము భూమిని మాది అనుకోవడం లేదు. మేమే భూమికి చెందిన వారమని అనుకుంటాం. పూర్వీకులు నడయాడిన అడవులు, కొండలు మా దేవుళ్ళు” అని రాసి ఉన్న పోస్టర్ చూస్తూ, మా కొలావర్‌లు కూడా అంతే కదా! మేము భీమన్నని నమ్ముతాం. అడవిని అమ్మలా చూస్తాం అన్నది అతని మనసు.
తెల్లవాళ్లు అబోరిజినల్ పిల్లలను తల్లిదండ్రుల నుండి వేరు చేసిన చారిత్రక విషాదాన్ని తెలిపే ‘స్టోలెన్ జనరేషన్స్’ వీడియో చూస్తుంటే దుఃఖం పెల్లుబికింది. తమ ఉనికిని, సంస్కృతిని బలవంతంగా లాగేసుకున్న ఆ చీకటి రోజులను తలుచుకుంటూ, తాను కూడా ఒకప్పుడు నాగరికత మోజులో తన మూలాలను విస్మరించబోయిన క్షణాలను గుర్తుచేసుకుని సిగ్గుతో తలవంచుకున్నాడు.

ఆస్ట్రేలియా ఆదిమవాసులు పవిత్రంగా భావించే కొండలను, అడవులను మైనింగ్ కంపెనీలు డైనమెట్లు పెట్టి పేల్చివేసిన, నిర్వాసితులను చేసిన వైనం తెల్సుకుని తమ కుటుంబం, గూడెం ఎలా నిర్వాసితులయ్యారో, నష్టపరిహారంగా వచ్చిన సొమ్ము ఎలా పరుల పాలైందో, అందిన కొద్దిపాటి సొమ్ముతో మద్యం, డ్రగ్స్‌కు బానిసలై, జైళ్లపాలవుతూ… చదువు, వైద్యం లేక… జీవన సంఘర్షణ… తమ భీమన్న కొలువైన కొండను సింగరేణి ఎలా మింగేసిందో కళ్ళముందు కదలాడింది.
ప్రాణహిత, పెన్ గంగ ఆవల సుర్జాఘడ్, పోడ్లోలలో ఇనుపఖనిజం కోసం తమ బంధువులు ఎలా నిర్వాసితులు అవుతున్నారో, అక్కడ వారు ఎంత పోరాటం చేసినా చేజారిపోయిన జీవితం, అస్తిత్వం గుర్తొచ్చాయి.
భూమి అంటే ఆస్తి కాదు. అది తల్లి అనే సత్యం అతనికి మరింతగా బోధపడింది.

అక్కడ అతన్ని బాగా ఆకర్షించింది తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి, నిలుపుకోవడానికి చేస్తున్న ఆధునిక ప్రయత్నాలు. అంతరించిపోతున్న తమ భాషలను డిజిటల్ రికార్డర్లు, యాప్‌ల ద్వారా భద్రపరుస్తున్న విధానం చూసాడు. తమ హక్కుల కోసం చట్టబద్ధంగా, రాజకీయంగా వాయిస్ వినిపిస్తున్న తీరు గమనించాడు. కోల్పోయిన జీవితాన్ని అక్షరంతో, చట్టంతో తిరిగి సాధించుకోవడం కోసం పోరాడటం అతనికి కొత్త బలాన్ని, ధైర్యాన్నిచ్చింది.

అదంతా చూసిన తర్వాత మ్యూజియం అంటే గతించిన చరిత్రను దాచే స్థలం కాదు. బతికి ఉన్న మనల్ని మేల్కొలిపే ఆయుధం అనుకున్నాడు. ఒక ఆదివాసీ కొలావర్ యువకుడిగా బాధపడటం ఆపేసి, సిడ్నీ మూలవాసుల మ్యూజియం నుంచి తమ ఆదివాసీ తెగల రక్షణ ప్రణాళికకు మార్గం ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆసిఫాబాద్ అడవి తనను రమ్మని పిలుస్తున్నట్టు అనిపించింది.

ఆ సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాట్లాడుతుంటే ఎన్ని శతాబ్దాల వేదన… అతనికి అబోరిజినల్ వాయించే డిడ్జెరిడూ సంగీతంలా వినిపించింది. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టడం లేదు.

నేషనల్ సెంటర్ ఆఫ్ ఇండిజెనస్ ఎక్సలెన్స్‌లో సదస్సు ప్రారంభమైంది. ఆడిటోరియం వెనుక వరసలో కూర్చున్న భీమ్ చూపు ఒక యువకుడిపై పడింది. అతని చర్మం నల్లగా, జుట్టు గిరజాలుగా ఉంది. అతని ముఖంపై తెల్లటి మట్టితో గీసిన చారలు ఉన్నాయి. అతన్ని చూడగానే తన సోదరుడే అనిపించింది భీమ్‌కి. అతనే ‘జాకరో’ – ఆస్ట్రేలియాలోని పిల్‌బారా ప్రాంతానికి చెందిన అబోరిజినల్ యువకుడు.

సాయంత్రం విరామ సమయంలో డా. విశాల వారిద్దరికీ పరిచయం చేసింది. ఇద్దరికీ ఒకరి భాష మరొకరికి రాదు. కానీ విశాల సహాయంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ రాత్రి సిడ్నీలోని బొండీ బీచ్‌లో కూర్చుని జుకారో తాను తెచ్చుకున్న సాంప్రదాయ గిరిజన వాద్యం ‘డిడ్జెరిడూ’ ఊదుతున్నాడు. ఆ వాయిద్యం వింటున్న భీమ్ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. మాటలు లేకపోయినా వేల మైళ్ళ దూరంలో బతికి ప్రకృతిని కోల్పోయిన ఆ ఇద్దరు అడవి బిడ్డలు ఒకరినొకరు కౌగలించుకుని ఏడ్చారు. మాటలు సాగేకొద్దీ ఇద్దరి జీవితాల్లోని సంఘర్షణ ఒకేలా ఉందని భీమ్ గ్రహించాడు.

జుకరో, భీమ్‌లలాగే వచ్చిన మూలవాసులు కొత్త పరిచయాలు, కొత్త సంస్కృతులు తెలుసుకుంటున్నారు. ప్రాంతాలు, భాషలు, రూపురేఖలు మారుతుండవచ్చు కానీ ప్రపంచంలో ఎక్కడికి పోయినా మూలవాసుల జీవన సంఘర్షణ ఒకే విధంగా ఉందని తెలుసుకుని వారు ఆశ్చర్యపోతున్నారు.

భూగోళం మీద ఎక్కడైనా మూలవాసులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి జీవన విధానం, ప్రకృతితో ఉన్న అనుబంధం ఎంతగా పోలి ఉన్నాయో డా. విశాల వారికి వివరించింది.

ఆ మాట వినగానే భీమ్‌కు తన తాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తాము కేవలం కూడు, గూడు కోసం పోరాడటం లేదు… ఒక అంతరించిపోతున్న పురాతన మానవ నాగరికత యొక్క ‘అస్తిత్వాన్ని’ కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. భీమ్ గుండెల్లోపలి బుగులు భయం పోయి ఒక విశ్వవ్యాప్తమైన స్ఫూర్తి రగిలింది.

జాకరో చేతిని గట్టిగా పట్టుకుని, “మనం ఓడిపోకూడదు జాకరో… మన అస్తిత్వాన్ని చావనివ్వకూడదు” అన్నాడు దృఢంగా. వారితో మరికొంత మంది జతకలిశారు. అవునని ముక్తకంఠంతో గట్టిగా అన్నారు.

ఆ క్షణాల్లో, తాతద్వారా నిన్న, బాబేఝరీ అడవుల్లో జల్ జంగిల్ జమీన్ కోసం రాజ్ గోండ్‌లతో కలిసి కొలావర్లు నిజాం సైన్యానికి వ్యతిరేకంగా విల్లంబులు, గొడ్డళ్లతో సాయుధపోరాటం చేసిన గాథలు, జంగ్లాత్ వారితో చేసిన పోరాటాలు, షావుకార్లకు తరిమికొట్టే సాయుధ నిరసనలు… సహాయ నిరాకరణ పోరాటాలు గుర్తొచ్చాయి. ప్రస్తుతం తమ అడవుల్లో తాము శరణార్థులుగా బతుకుతున్నట్టుగా ఉంది. భూమి హక్కుల కోసం పోరాడుతూ అణచివేతకు గురవుతున్నా, అడవితో తమకున్న ప్రేమానుబంధాన్ని వదులుకోలేదు. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి కొలామీలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారని గుర్తు చేసుకుంటూ “భూమికోసం, అస్తిత్వం కోసం సొంత దేశంలోని చట్టాలు, పాలకుల ఆర్ధిక దోపిడీకి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం.” అని భీమ్ చెప్పాడు.

“ఇక్కడ మా పోరాటం మా ఉనికిని, జాతిని, మా గుర్తింపుని పూర్తిగా తుడిచిపెట్టేయాలని చూసిన విదేశీ వలసదారులకు వ్యతిరేకంగా పోరాడాం. ఇప్పుడు మా హక్కులసాధన కోసం పోరాడుతున్నాం” అన్నాడు జుకారో.
అవునన్నట్టు తలూపారు అక్కడ చేరిన యువకులు.
“మీ దేశాల్లోనే కాదు ప్రపంచమంతా కార్పొరేట్ మైనింగ్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి, ఆధునిక చట్టాలతో, ప్రజా ఉద్యమాలతో ఒకే రకమైన యుద్ధం జరుగుతున్నది” అమెరికా నుంచి వచ్చిన చోక్టో అనే ప్రాచీన తెగకు చెందిన థామస్ లీఫ్లోర్ తన అభిప్రాయం వారితో పంచుకున్నాడు

సదస్సు ముగింపు రోజున భీమ్ వేదికపైకి వచ్చి తన మాతృభాష అయిన ‘కొలామి’లో మాట్లాడటం ప్రారంభించాడు, డా. విశాల దానిని ఇంగ్లీష్‌లోకి అనువదించింది.
“మా గూడెంలో ఒక చట్టం ఉంది… అది ఏ కాగితాల మీద రాసి లేదు. ప్రకృతిని తల్లిగా చూడటమే మా చట్టం.
మా దేశంలో మా స్వయంప్రతిపత్తిని కాపాడుతూ మా హక్కులను పరిరక్షించడానికి ప్రత్యేక చట్టాలున్నాయి. అయినా మా మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోతున్నది. అంతరించిపోతున్న జాతులలో చేరిపోతున్నాయి కొన్నితెగలు.

కారణం ఏమిటంటారు?
మీ కార్పొరేట్ కంపెనీలు మా భూములను లాక్కుని, మా నష్టపరిహారాన్ని మధ్యవర్తుల ద్వారా దొంగిలించి, మా గూడాల్లో ఎయిడ్స్ లాంటి రోగాలు మోసుకొచ్చాయి. అవి మా ఉనికిని, మా గుర్తింపుని, మా అడవిని, కొండలను, మా కాళ్ళకింద భూమిని, అందులో యుగయుగాలుగా ప్రకృతిమాత దాచిపెట్టిన అపారమైన విలువైన ఖనిజ సంపదను మింగేయాలని చూస్తున్నాయి.

నాకిక్కడికొచ్చాక అర్ధమైంది అన్ని దేశాల్లో ఆదిమవాసుల సమస్యలు ఒకటే కాకున్నా వాటి స్వభావం, మూలాలు ఒకటే విధంగా ఉన్నాయని.
మా కాళ్లకింది భూమిని కోల్పోతున్నాం. అటవీ హక్కులను కోల్పోతున్నాం. మా గుర్తింపు, మా ఉనికి , మా జీవనం, మా సంస్కృతి, మా భాష ఆచార వ్యవహారాలు కోల్పోతున్నాం. రక్షిత చట్టాలు కాగితాలపై ఉన్నప్పటికీ ఆచరణలో అమలుకాకపోవడం పెద్ద సమస్య.

కానీ గుర్తుపెట్టుకోండి… మేము కేవలం కూడు, గూడు కోసం పోరాడటం లేదు. భూమి పుట్టినప్పటి నుంచి తల్లి అడవిని కాపాడుతున్న మా ఉనికిని, మా సంస్కృతిని, మా భూమిని నిలుపుకోవడానికి పోరాడుతున్నాం. జల్, జంగిల్, జమీన్ మా ఊపిరి!…”

భీమ్ ప్రసంగం ముగియగానే ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. వేదిక దిగుతుండగా జాకరో పరుగెత్తుకుంటూ వచ్చి భీమ్‌ను గట్టిగా కౌగిలించుకున్నాడు. తన మెడలో ఉన్న సాంప్రదాయ అబోరిజినల్ హారాన్ని తీసి భీమ్ మెడలో వేశాడు.

తిరుగు ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చున్న భీమ్ చూపు కింద కనుమరుగవుతున్న ఆస్ట్రేలియా నగరం వైపు ఉంది. కానీ అతని మనసంతా తమ అడవి తల్లి, కన్న తల్లి చుట్టూ తిరుగుతోంది.

జుకర్ వేసిన రుద్రాక్షలను పోలిన హారాన్ని చేత్తో పట్టుకుని భీమ్ ఆలోచనల్లో మునిగిపోయాడు. ఒకప్పుడు తను ఏ నాగరికతను చూసి ఆకర్షితుడయ్యాడో… ఇవాళ అదే ఆధునిక ప్రపంచం మధ్య నిలబడ్డాక తన గూడెం విలువ తెలిసింది. తాము అనాగరికులం కాదు… ప్రకృతిని ఎలా ప్రేమించాలో తెలిసిన అత్యంత నాగరికులం అని అర్థమైంది.
తాతతో కలిసి వెళ్లిన పచ్చని అడవి పండుగ జ్ఞాపకాలు, తన దేశంలో ఆదివాసీ వీరుల యుద్దాలు, పోరాటాలు, నడుస్తున్న నిరసనలు ఒకవైపు, ఆస్ట్రేలియా స్టోలెన్ జనరేషన్స్, మూలవాసులు తమ భూముల కోసం చేసిన నిరసన దృశ్యాలు, అమెరికన్ రెడ్ ఇండియన్స్ చేసిన యుద్దాలు, పోరాటాలు, మరోవైపు సమాంతరంగా కదలాడుతున్నాయి.

తాతకి ఆధునిక నాగరిక ప్రపంచం తెలవదు. అయినా ఎంత గొప్ప జీవిత సత్యం చెప్పాడు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం… ఈ కార్పొరేట్ శక్తులను కత్తితో గెలవలేం. వారు వాడిన చట్టాన్ని, అక్షరాన్నే ఆయుధంగా మార్చాలి” అని భీమ్ తన బ్యాగులో ఉన్న ‘పెసా’ చట్టం పుస్తకాన్ని తీశాడు.

**
నల్లటి బొగ్గు పొగ మంచులా అడవిని కప్పేస్తోంది. కానీ ఆ నల్లటి పొగను చీల్చుకుంటూ వాగు గలగలలు భీమ్‌కు వినిపించాయి. ఆ నీరు ఇప్పుడు బొగ్గు వ్యర్థాలతో చిక్కటి నల్లటి రక్తంలా పారుతోంది. భీమ్ ఆ నీటిని తాకడానికి చేయి చాచి, వెనక్కి లాక్కున్నాడు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ కళ్ళలో తల్లి జంగుబాయి మరణ వేదన ఉన్నది. కానీ ఆ కళ్లలో ఇప్పుడు ఒకప్పటి అమాయకత్వం లేదు, మోసపోయాననే ఆవేశం లేదు. చదువు ఇచ్చిన వివేకం, ప్రపంచ నలుమూలల నుంచి అందించిన అంతర్జాతీయ అస్తిత్వ చేతన అతని ముఖంలో ఒక అజేయమైన ప్రశాంతతను నింపాయి.

భీమ్ నల్లటి బొగ్గు పొగను దాటుకుంటూ, తన అస్తిత్వ పోరాటానికి మాత్రమే కాదు పురాతన మానవ నాగరికత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, అందుకు పునాది వేయడానికి ఎంతో గంభీరంగా, నిశ్శబ్దంగా తన గూడెం వైపు అడుగులు వేశాడు.

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply