పారే నది

సియాంగ్ నదీ జలదరింపే నీకు
జోలపాటగా
తరతరాల ఊపిరులందిస్తూనే ఉంటుంది.

అభివృద్ధి దాహంతో నీకు నువ్వే అర్థంకాని వెర్రివాడివైనా
ఆ అడవి తల్లి నిశి వేళల్లో నీ కాపు కాస్తుంది.
పదివేల మెగావాట్ల విధ్వంసాన్ని మోసుకొచ్చిన కుంపటివైనా
తన ఒడిలో నిన్ను నిలబెడుతుంది.

కానీ… కవ్వించి,
తెగించి,
ఎబో, ఓతుల్, తాజోంగ్‌ల తెగువగా మారి..
కొన్నిసార్లు నీ అహంకారం లోపలే ప్రాణమై ఎదిరిస్తానంటుంది.

అందుకే…
రాజ్యాధికారానికి చట్టాల రంగు పూసి,
నిర్బంధపు మంచుకమ్మిన దినాల్లో..
సైనిక బూట్ల అడుగులకు అడవి బరువైపోదు అని అనుకుంటావ్.

బాష్పవాయువుల ఉధృతానికి
ప్రజాస్వామ్యపు నేల తత్తరపడిపోదు అని తీర్మానిస్తావ్.

ఏ అణచివేత పుట్టుకైనా కొత్తదేమీ కాదు.
కానీ నీ లోపల దాక్కున్న భయం..
బదులుగా చీకటి గదిలో జైలు కిటికీ మూసుకోగానే, అకాలమరణమై..
ఆదివాసి హక్కును ఉక్కిరిబిక్కిరి చేస్తూ హత్తుకుంటుంది.

తేరుకుని కుదురుకునేలోపు..
బూటకపు చర్చల ఆహ్వానాలిచ్చి పురిగొల్పుతుంది,
సంకెళ్ల ఓర్వలేని బరువులిచ్చి ప్రాణాల తూకాన్ని
చూడమంటుంది.

కానీ.. ఆ సియాంగ్ ఏరు నిన్ను కళ్ళు మూయమంటుంది.
తన అస్తిత్వపు కాంతులన్నీ పరుస్తుంది.

అడవి తల్లుల కన్నీటి తివాచీపై..
నీ కృత్రిమ శాసనాల కాలాల్ని దాటేస్తుంది.

తుపాకి గుళ్ళన్నీ మట్టి గుళికలై,
కారాగారపు గోడలన్నీ మాయలై..
గిరిజనుల స్వేచ్ఛా ఉనికి మొత్తాన్ని,
నీ అధికారపు వేకువ వాకిట వాల్చి అడుగుతుంది…

‘‘ఇప్పుడు చెప్పు..
నువ్వు కేవలం ప్రాణాలను తోడేసే పాలకుడివా?
నదితో పాటే కలకాలం ప్రవహించే సనాతన జీవానివా?’’

**

కవి, కథా రచయిత, విమర్శకుడు.

Leave a Reply