నన్ను వేలు పట్టుకుని నడిపించిన పుస్తకాలు : పి. వరలక్ష్మి

సాహిత్య ప్రపంచంలోకి ఎలా వచ్చారు? మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన రచయితలు ఎవరు? ఎందుకు?

మనం పుట్టి పెరిగి బతుకీడ్చి చచ్చిపోయేలోగా మనం చూసే ప్రపంచం ఎంత చిన్నది! మన జ్ఞానం ఎంత అల్పం! సాహిత్యలోకంలోకి ప్రవేశించకపోయి ఉంటే ఈ విషయం అర్థం కూడా అయ్యేది కాదు. అకడెమిక్ చదువులు ఎంత డొల్లనో తెలిసేది కాదు. ‘పుస్తకాలు చదవడం కన్నా మంచి అలవాటు మరోటి లేదు’ అనే భావన ఇంట్లో ఉండేది. పిల్లల పుస్తకాలు, చెకుముకి వంటి సైన్స్ పుస్తకాలు పిల్లల కోసం తెప్పించే వాతావరణం ఉండేది. 90 లలో రష్యన్ పుస్తకాలు మా కంటపడ్డాయి. హై స్కూల్ రోజులు. పది రూపాయలకు, ఐదు రూపాయలకు, చివరికి రూపాయి కూడా పుస్తకం దొరికేది. రంగురంగుల బొమ్మలతో చూడముచ్చటగా వెడల్పాటి పుస్తకాలు. విశాలాంధ్ర వ్యాన్ వచ్చేది. అందులో ఆ పుస్తకాలు పెద్ద ఆకర్షణ. రోదసి యాత్ర మీద ఎవరు రాశారో గుర్తులేదు కానీ అద్భుతమైన పుస్తకం. ఇంతటి విశాల విశ్వంలో మనం, మన ప్రపంచం ఎంత చిన్నదో కదా.. తన ప్రపంచాన్ని దాటి విశ్వ రహస్యాలని కనుక్కోవడానికి మనిషి చేసే ప్రయాణం ఎంత అద్భుతం కదా. ఆ పుస్తకం మమ్మల్ని వేలు పట్టుకొని ఒక్కో గ్రహం మీదికి తీసుకెళ్లింది. ఇన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి ఆలోచిస్తే సోవియట్ యూనియన్ ప్రపంచానికి జ్ఞానం ఇవ్వడానికి- అది అణువు నుండి విశ్వం దాకా.. మానవ శరీర నిర్మాణం నుండి సామాజిక సంఘర్షణలదాకా.. ఎంత కృషి చేసిందో కదా అనిపిస్తుంది.

శాస్త్ర సాంకేతిక అంశాలను ఆవిష్కరించిన ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ, మాదే నాగరికత అని విర్రవీగిన సమాజాలు కూడా ఉన్నాయి కానీ, అందరికీ జ్ఞానం ఇవ్వాలని ఎన్నో గొప్ప ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన సోవియట్ యూనియన్ వంటిది లేదు. మేము ఆ పుస్తకాలు చదివేనాటికే సోషలిస్ట్ స్వప్నం చెదిరిపోయి ఉండొచ్చు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై ఉండొచ్చు. కానీ ఆ భావాలు ఎన్ని తరాలుగా ఎంత విశ్వవ్యాప్తంగా ప్రసరిస్తున్నాయో! కోట్ల మెదళ్లను కదిలించిన ఆ భావ సంచలనం నా మనసుకు ఎప్పుడు పట్టిందో తెలియదు. 90 లలో రాజకీయాలు అర్థం చేసుకునే పరిపక్వత మాకు లేదు. మాకు అంటున్నానంటే మాదొక పిల్లల బ్యాచ్ ఉండేది. ఎవరైనా ఇందాక నేను చెప్పిన అట్లాంటి పుస్తకం కొంటే చుట్టూ మూగి బొమ్మలు చూస్తూ చదువుకునేవాళ్ళం. అందులో కనీసం ముగ్గురం ఆ సృజన ప్రవాహంలో కొట్టుకుంటూ ఈ ప్రపంచంలో అంటే విప్లవ సాహిత్య ప్రపంచంలో తేలాము. ఆ రష్యన్ కథల్లోని పాత్రలు గాని, రచయితల పేర్లు గాని గుర్తుండేవి కాదు. కానీ ఆ కథలతో చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యం. డిగ్రీ చదివే నాటికి టాల్స్టాయ్, గోర్కి, పుష్కిన్, దోస్తోయేవ్స్కీ వంటి పాపులర్ రచయితల రచనలు చదవడానికి మాకు ఒక లైబ్రరీ దొరికింది.

కాలేజీ లైబ్రరీలో నా ఆసక్తిని గమనించి మా తెలుగు సారు (మల్లెల నారాయణ) ‘మహాప్రస్థానం’ పుస్తకం ఇచ్చారు. ‘మిత్రజ్యోతి’ సాహితీ సంస్థ పేరుతో లైబ్రరీ నడుపుతున్న మిత్రులు ఆయన ద్వారానే పరిచయమయ్యారు. ఆ బృందంలో మంచి చర్చలు జరిగేవి. ప్రగతిశీల సాహిత్యమంతా అక్కడే చదివాను.
సాహిత్య, రాజకీయ చర్చలు ఆసక్తికరంగా, సరదాగా ఉండేవి. పుస్తకాల కోసం వెళ్ళిన మేము ఆ చర్చల్లో భాగమయ్యాం. ఒక్కోసారి సీరియస్ గా వాదోపవాదాలు జరిగి రెండు గ్రూపులుగా విడిపోయేవారు. మరో అంశం మీదో, మరో పుస్తకం మీదో చర్చిస్తున్నప్పుడు అంతకుముందు వాదులాడుకున్నవాళ్ళు కలిసిపోయేవాళ్ళు. చూడ్డానికి చాలా సరదాగా ఉండేది కానీ, దేన్నైనా ఆబ్జెక్టివ్ గా చూడడం, నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పడం మనసుకు, బుద్ధికి హాయినిచ్చేవి. అభిప్రాయాల మధ్య పేచీయే గానీ వ్యక్తుల మధ్య వైరుధ్యం ఉండేది కాదు. వ్యక్తులు ఎదగడానికి అనువైన వాతావరణం అది. ఆ స్టడీ సర్కిల్ కొంత కాలమే నడిచినా నాకు మంచి ఎడ్యుకేషన్. ఫలానా పుస్తకాలు, ఫలానా రచయితలు అని చెప్పడం కష్టం కానీ చాలా గాఢమైన ప్రభావం వేసిన సాహిత్యాన్ని జీవితంలో భాగం చేసుకోవడం తృప్తి నిచ్చింది. ఆ రోజుల్లో మహాశ్వేతాదేవి రచనలు చదివి ఆమె తెలుగామెనే అని ఫిక్స్ అయిపోయింది ఒక ఫ్రెండ్. కాదని తెలిసి అలా ఎలా సాధ్యం అని అమాయకంగా ఆశ్చర్యపోవడం. దేవదాసు తెలుగువాడు కాదంటే చాలామంది ఒప్పుకోనట్లు. దేవదాసు నవల వంతులు వేసుకుని ఒకరు చదువుతూ ఉంటే ఇంకొకరు వినడం. చివరి ఘట్టం నేను చదువుతుంటే వింటున్నామె ఒకటే ఏడుపు. కలిసి చదువుకోడానికి, కలిసి అనుభూతి చెందడానికి మంచి ఫ్రెండ్స్ దొరకడం కూడా నాకు బాగా కలిసొచ్చింది.

ఒక రోజు బాగా నలిగిపోయి టేపులు అంటించిన పుస్తకం దొరికింది. బాగా నలిగిన పుస్తకం అంటే గొప్ప పుస్తకం అయ్యుండాలి, నా లెక్క ప్రకారం. “సహచరులు”చదువుతూ చదువుతూ మొదటిసారి అనుకున్నా… కవిత్వం ఇలా ఉంటుందా? కవులు ఇలా కూడా ఉంటారా? ఎన్ని సార్లు చదివానో లెక్క లేదు. అలా 2000 సంవత్సరం నుండి విప్లవ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. ‘రూట్స్’, ‘అంటరాని వసంతం’ ఒకే కాలంలో చదివాను. ప్రపంచం కొత్తగా పరిచయమైంది. ఈ మాటే చెప్తే మా మిత్రులు ‘నిప్పుల వాగు’ చేతిలో పెట్టి ఇది కూడా చదివి చెప్పండి అన్నారు. రాయలసీమ సమాజం గురించి చాలా కొత్తగా ఆలోచించేలా చేసింది. విప్లవ సాహిత్యం చాలా మొరటు వ్యక్తీకరణ అని, ఒకే మూసలో నడుస్తుందనే విమర్శ ఉందని సంస్థలోకి వచ్చాకనే విన్నాను. నిజానికి 90 లలో విప్లవ సాహిత్యోద్యమం నుండి చాలా గొప్ప కథలు వచ్చాయి. 80 లు, 90 ల నాటి కథలతో వచ్చిన సంకలనాలు ‘నెల తల్లి విముక్తి కోసం’, ‘కథా కెరటాలు’, వంటివి చదివితే ఎవరూ ఆ మాట అనలేరు. ఇది ఒక పాఠకురాలిగా నా అనుభవం. రచయితల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామందిని మిస్ చేసే ప్రమాదం ఉంది. ఒక్క ఉదహారణ చెప్పాలంటే అల్లం రాజయ్య గారి ‘మనిషి లోపలి విధ్వంసం’ నన్ను అతలాకుతలం చేసింది. ‘అగ్నికణం’లో ‘బయ్యక్క’ పాత్రలోకి రచయిత ఏకంగా పరకాయప్రవేశం చేశాడు. ఒక ‘స్త్రీ’ అనుభవాన్ని, లైంగిక దాడితో సహా అంత మమేకమై చిత్రించడం సాధారణ విషయం కాదు. మనకు తెలిసిన రచయితల పేర్లు కోన్నే. అజ్ఞాత జీవితం నుండి రాసిన ఎంతో మంది గొప్ప రచయితలు ఉన్నారు. తమ జీవితాన్నే ప్రయోగంగా మార్చుకున్న వాళ్ళు, జీవితంలోని లోతు తెలిసినవాళ్ళు. సమాజంలోని సంఘర్షణను దగ్గరగా చూస్తున్న వాళ్ళే కాదు, అందులో భాగమైన వాళ్ళు. ముఖ్యంగా మహిళా రచయితలు.

విరసంలోకి రావడానికి విప్లవ సాహిత్యంలోని ఆకర్షణే కారణం గానీ, ప్రత్యక్షంగా ఏ ఉద్యమంతోనూ అనుబంధం లేదు. కేవలం ఆకర్షణే కాదు, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు కలిగిన conviction ప్రధానం. తిరుపతిలో చదువుతున్నప్పుడు త్రిపురనేని మధుసూదన రావు చెప్పిన మార్క్సిజం పాఠాలు చాలా అవసరమైన అధ్యయనం వైపు మళ్లించాయి. సాహిత్యాన్ని ఆయన చూసే తీరు, విశ్లేషించే తీరు కూడా చాలా సైంటిఫిక్ గా ఉంటుంది. భావోద్వేగాలతో, కేవలం అనుభవ జ్ఞానంతో కాదు, దేనినైనా సైంటిఫిక్ పద్ధతిలో ఎలా చూడాలో ఆయన చెప్పేవాడు. నేను చదివిన విప్లవ సాహిత్యం ఉద్వేగంతో ఉండేది, ఆలోచనాత్మకంగా ఉండేది, సైంటిఫిక్ గా ఉండేది.

2001-02 కాలంలో చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. అమెరికా ట్విన్ టవర్స్ పై దాడి, గుజరాత్ మారణకాండ. అటు ప్రపంచ రాజకీయాల్లో, ఇటు దేశ రాజకీయాల్లో కీలకమైన మలుపు. గుజరాత్ మారణకాండ తీవ్రంగా కలచివేసింది. మానవత్వం ఇంతలా పతనమవుతుందా అనిపించిన కాలం. ఆ రిపోర్ట్స్ చదవడం, ఆ ఉద్విగ్నభరిత చర్చల్లో పాల్గొనడం.. ఎంత ఎమోషనల్ అయ్యామంటే నేను, నా ఫ్రెండ్ నేరుగా ఆరెస్సెస్ ఆఫీసుకు పోయి ఇంత దుర్మార్గాలు ఎట్లా చేస్తారు అని అడిగాం. మన దగ్గర అప్పుడింత ముదరలేదు కదా, వాళ్ళేదో తప్పించుకునేలా మాట్లాడారు. అయితే మొదటిసారిగా మోనోపలీ మార్కెట్ కు, మతానికి లంకె ఎట్లా కుదిరిందో విరసం సభలోనే విన్నాను. చలసాని ప్రసాద్ అప్పుడన్నాడు.. ఇతడు ప్రధానమంత్రి కూడా అవుతాడు అని. ఇవన్నీ చాలా నిరాశాజనకంగా ఉండేవి కదా అనిపించొచ్చు, కానీ మనం మనుషులుగా ఎక్కడ నిలబడతామో తేల్చుకునే సందర్భాలు కూడా ఇటువంటివే. కశ్మీర్ నుండి గుజరాత్ దాకా ఎన్నో నివేదికలు చదివి ‘దేశభక్తి’ని సరిగ్గా అర్థం చేసుకున్న సందర్భం అదే. లేకుంటే ‘రోజా’ సినిమా చూసి రోమాలు నిక్కబొడుచునే దగ్గరే ఉండేవాళ్ళం. 90 లలో తెలుగు సమాజంలో చాలా ప్రయోగాలు జరిగాయి. ఉద్యమాలు సరే, మాకు ఆ ప్రపంచం తెలీదు. ప్రయివేట్ చదువులు, చదువులు ఒత్తిడిగా మారిపోవడం, ఇంజనీరింగ్ /మెడిసిన్ చదవకపోతే జీవితమే పెద్ద ఫెయిల్యూర్ అనుకునే స్థితి అప్పుడప్పుడే మొదలైంది. 2000 నాటికి బాగా ఊపందుకుంది. (పైన చెప్పిన చాలా కీలకమైన రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలోనే ఇదంతా జరిగింది.) అందులో రెండుమూడేళ్ళు ఒత్తిడి పడి, దాన్నుంచి తప్పించుకుని పుస్తకాలలో సేదదీరాను.

(ఇంకా వుంది)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార (సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ), 2. ఏరువాక (సాహిత్య విమర్శ); 3. ములాఖాత్ (విప్లవ రచయితలతో ఇంటర్వ్యూలు), సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు), తొలకరి (అల్లం రాజయ్య కథల వెనుక కథ), మట్టి మనుషులు (వడ్డెరల జీవన గాథలు), ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Reply