అమరుడు పాక హనుమంతు (గణేశ్ ఉయికె) జీవితం, సాహిత్యం చదివితే నక్సల్బరి పోరాట ప్రాతినిధ్య ప్రత్యామ్నాయ రాజకీయ ఉజ్వలమైన రాజకీయ సామాజిక సాహిత్య చరిత్ర చదివినట్లుగా ఉన్నది. ఆయన 2025 డిసెంబర్ 25న అమరత్వం చెందే నాటికి 64 సంవత్సరాల వయసు. నక్సల్బరీకి కూడా ఇంచుమించు అదే వయసు. ఆయన గురించి చెప్పవలసిన ఒక మహత్తర విషయమేమంటే ఆయన పాక పుల్లయ్య మనుమడు. బానిసల తిరుగుబాటు అనదగిన, నీ బాంచెన్ దొర నీ కాళ్లు మొక్తా అని బేలగా దేబరించినట్లు, తమను తాము న్యూనతగా చూసుకున్నట్లు కనిపించే వెట్టి చాకిరీ వాళ్ళ కళ్ళు ఎంత కడుపులోని మంటలను ఎగజిమ్మగలవో ఆ కథలన్నీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పుల్లయ్య నోట ఆయన వెంట చేన్లు, చెలకల దగ్గరికి పోతూ హనుమంతు విన్నాడు. బాల్యంలో విన్న ఆ కథలు, తాత చేసిన హెచ్చరిక ఈనగాచి నక్కల పాలు చేసినట్లు దొరల పాలు చేస్తున్నాం. మన శ్రమ నిజమే కానీ ఈ భూమి, ఈ భూమి మీద పంట, ఈ భూగర్భంలో నిక్షిప్తమైన పంట ఎప్పటికైనా భూమిని నమ్ముకున్న వారిదే. అందుకని ఎంత దీర్ఘకాలమైనా సరే మంద మీదికి తోడేళ్ళు రాకుండా కాపాడుకోవడమే రివిజనిజానికి, విద్రోహానికి విరుగుడు అని నేర్చుకున్నాడు. తండ్రి చంద్రయ్య అదే కమÖ్యనిస్టు చాలును చదువులోకి మళ్ళించాడు. అయితే అది సరిగ్గా 1965లో చారుమజుందారు తెరాయి దస్తావేజులు ప్రారంభించిన కాలం. రివిజనిజం నుంచి చీలిక నయా రివిజనిజమే కానీ శత్రువు భయపడే వర్గ పోరాటాన్ని మళ్ళీ అందుకోవడం కాలేకపోయింది. నిన్న విడిచిన పోరాటం మళ్ళీ అందుకోవాలని పుల్లయ్య తన ఆకాంక్షలను హనుమంతుకు చెప్తున్న కాలంలో ఎనిమిది దస్తావేజుల రచన ప్రారంభమైంది. ఆ దస్తావేజులు కేవలం కాగితాల మీద రాసినవి కాదు. కృషికార్ సంఘర్ష్ సమితి నక్సల్బరీ నేలమీద నాగేటి కర్రులతో రాసినవి. పలుగూ, పారతో రాసినవి. ఆ రుతువులో, ఆ కుటుంబంలో కళ్ళు తెరిచిన హనుమంతు బుద్ధి, జ్ఞానం తెలిసిన నాటికి దేశ చరిత్రలోనే అరుదయిన రాడికల్ విద్యార్థి సంఘ ఆవిర్భావానికి దారి తీసింది. నల్లగొండ నాగార్జున కాలేజీలో చేరేనాటికి ఇంకా నవయవ్వనంలోనే ఉన్న కాలానికే ఆ మట్టిలో పుట్టిన వజ్రం – బొగ్గు నిప్పైన తీరుగా, ఇనుము ఉక్కయిన తీరుగా సంఘర్షణాయుత జీవితంలో ప్రవేశించింది.
1972లో సూరపనేని జనార్దన్, మురళీమోహన్, ఆనందరావుల విద్యార్థితరం రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎబివిపి విద్యార్థులతో సంఘర్షణతోనే మొదలయింది. 1980 నాటికే పూర్తి కాలపు విప్లవ వృత్తి ఎన్నుకోవాల్సిన ఘర్షణాయుత జీవితంలోని తమ జ్ఞానానికి తోడయిన చైతన్యంతో ప్రవేశించారు.
1980 అక్టోబర్‌లో సికింద్రాబాదు కంటోన్మెంటు లాల్‌బజార్‌లో జరిగిన విరసం దశాబ్ది ఉత్సవాలకు వచ్చి నల్గొండ జిల్లా అంకుశాపురంలో పుట్టి తన ముందటి తరమైన చెరబండరాజును పరిచయం చేసుకొని తాను ఈ సభలో పని చేయడానికి వచ్చానని హనుమంతు చెప్పాడట. నలగొండలో ఎమెర్జెన్సీకి పూర్వమే విప్లవ భావజాలాన్ని ప్రవేశపెట్టి మిర్యాలగూడ, సూర్యాపేటల దాకా విస్తరించిన విప్లవోద్యమానికి ఒక విప్లవోపాధ్యాయుడుగా ఇప్పటికీ చెప్పుకునే శేషుసారు అప్పటికే విరసం కార్యవర్గ సభ్యుడు. సంఘ్ పరివార్ మొట్టమొదటి దాడి ఆయన విరసం కార్యవర్గ సభ్యుడుగా పని చేస్తున్నపుడే జరిగింది. ఈ నేపథ్యం తెలిసిన చెరబండరాజు ఆ రెండు రోజులూ వాలంటీర్స్‌కు నాయకత్వం వహించమని చెప్పాడట. రెండురోజులూ సభలు ఎంతో క్రమశిక్షణతో నిర్విఘ్నంగా జరగడానికి ఈ నవ యువకుని వంటి ఎంతమంది శ్రమ, కృషి ఉందో. నాకు గణేశ్ ఉయికెగా, అంతకన్నా ముందు లహర్‌గా, ఇంకా మల్కన్‌గిరిలో నాయకునిగానే ఉన్న కాలంలో సన్నిహిత పరోక్ష పరిచయమైన హనుమంతును 1980 అక్టోబర్‌లోనే నేను చూసానన్నమాట. అంతకు ముందే ఏదైనా సభలో చూసానో, విన్నానో లేదో గానీ ఆ రెండు రోజులు మేమిద్దరమÖ ఒకే విప్లవ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమంలో భాగమై నాకు అతడు ప్రత్యక్షంగా తెలియకుండా 45 ఏళ్ళు గడిచిపోయాయంటే నేనెంత కోల్పోయినట్లు. ఇంక ఆయన దండకారణ్యంలో క్రమంగా పశ్చిమ బస్తర్‌లో విప్లవోద్యమ నాయకుడుగానే కాకుండా మీడియాకు, బయటి నుంచి విప్లవోద్యమాన్ని, జనతన రాజ్యాన్ని దగ్గరుండి రోజుల తరబడి ఒక ఫీల్డ్ స్టడీగా ప్రత్యక్షంగా పరిచయం చేసిన కథనాలు వింటుంటే ఇంగ్లిషు కవి పి.బి. షెల్లీ స్కైలార్క్ (భరత పక్షి) గురించి వినడమే కానీ ఆకాశంలో అదృశ్యమైన పక్షి గురించి రాసినట్లుగా ఇపుడనిపిస్తున్నది. బహుశా ఆయనను ఇంకా దగ్గరగా తుమ్మల శేషయ్యలో చూశాను. హనుమంతు చేసిన ఆరఎస్‌యు నిర్మాణం నుంచే వచ్చి నలగొండ సాయం కళాశాలలో చదువుతూ ఉదయం పత్రికలమ్ముకుంటూ ఆయన నిర్మాణం చేసిన ఆరఎస్‌యు, ఆయనపై ఎబివిపి ఆరఎసఎస్ గూండాల దాడి, హత్యలతో శేషు, హనుమంతు, శేషయ్యలు గ్రామాలకు తరలివచ్చిన విద్యార్థులు రైతాంగ పోరాట శక్తులతో విద్యార్థి ఉద్యమాన్ని రాడికల్‌గా ఎట్లా సంలీనం చేసారో అది ఒక విప్లవాచరణలో భాగమైంది. శేషయ్య చిందించిన రక్తంలో వికసించిన వజ్రం వలె హనుమంతు వృత్తి విప్లవకారుడుగా మారి ఆదిలాబాదు, జగదల్పూర్, టాటానగర్ మొదలుకొని ఆదివాసీ జిల్లాలలోని ముఖ్య పట్టణాలలో విద్యార్థులను, యువజనులను విప్లవోద్యమంతో అనుసంధానిస్తూ నిర్మాణాలు చేసాడు. 1986 నాటికి దండకారణ్యానికి చేరుకొని అటు నుంచి మావోయిస్టు పార్టీ ఏ రాష్ట్రంలో విప్లవోద్యమ నిర్మాణం చేస్తే ఆ రాష్ట్రానికి పోతూ మధ్య భారతంలోని ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్ అన్ని రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణాన్ని, విప్లవోద్యమాన్ని విస్తరిస్తూ పశ్చిమ బస్తర్ కార్యదర్శిగా ఎదిగే నాటికి దక్షిణ బస్తర్ కార్యదర్శిగా ఉండి, బస్తర్ కార్యదర్శిగా ఉండిన రామన్న (శ్రీనివాస్)లాగే జనతన రాజ్యనిర్మాణంలో, నిర్వహణలో అపూర్వమైన పాత్రను నిర్వహించాడు. అయితే ఈ 45 సంవత్సరాల హనుమంతు విప్లవ ప్రస్థానాన్ని పుల్లెంల నుంచి కంధమాల్ దాకా మనం పట్టుకోవడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ప్రయాణం సింహం వంటి లాంఘవం కాదు. ఏనుగు వంటి నడక. అది ఆయన దీర్ఘకాలిక నూతన ప్రజాస్వామిక విప్లవంలో ప్రతి పరిమాణాత్మక దశ ఒక గెంతుగా మారిన గుణాత్మక దశలో ఉన్నాడు. విప్లవాన్ని వృత్తి విప్లవకారుడుగా స్వీకరించాడు కనుక ధృఢ సంకల్పంతో ముందుకే సాగాడు.
ఈ పుస్తకంలోని రచనలన్నింటినీ కలిపి ఆయన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయవచ్చునా అంటే ఆయన చాలా సుతిమెత్తని మనసు కలవాడు, చాలా సుకుమారమైన దేహ నిర్మాణం కలవాడు అన్నా, నిరంతర అధ్యయనం, జ్ఞానతృష్ణకు పుస్తకాల పురుగు.. ఎంత గహనాటవిలో ఉన్నా, ఎంత సైనిక వ్యూహంలో మగ్నమై ఉన్నా హిందూ పత్రిక చదవాల్సిందే అన్నా..ఇవేవీ ఆయన పూర్తి రూపాన్ని మనకు ఆవిష్కరించవు. ఆయన కొరియర్‌గా ఉన్నాడు. ఎక్కడైనా సిఒగా ఉన్నాడా, అడవిలో ఉన్నాడా, నగరంలో ఉన్నాడా.. రెండు వైపులా కాదు పలువైపులా ఆయన పలు రూపాల్లో కనిపిస్తున్నాడు అన్నా, ఆయన రచనల్లో చూస్తే – ప్రజాయుద్ధం ప్రకటించిన పీపుల్స్‌వార్ నుంచి, సల్వాజుడుం, గ్రీన్‌హంట్, సమాధాన్, ప్రహార్‌ల నుంచి ప్రజలపై యుద్ధం నుంచి కగార్ యుద్ధం నుంచి, ద్రోహ్‌కాల్ వరకు ఆయన దృఢంగా నిలిచి పోరాడే ప్రజాయోధుడుగానే, ప్రజా యుద్ధ సేనానిగా కనిపిస్తాడు. ఆయన ప్రతి ఒక్క అడుగు ఒక అంగగానే కనిపిస్తుంటే ఆ రూపం ఆ సమయంలో ఒక బృహద్రూపంగా మారుతుంది. మొత్తం తూర్పు, మధ్యభారతాల్లో విముక్తి ప్రాంతాలుగా అభివృద్ధి చేయతలపెట్టిన ప్రతి పోరాట క్షేత్రంలో ఆయన ఉన్నాడు. ఇంకా ప్రత్యామ్నాయ, రాజకీయ అభివృద్ధి నమÖనాగా విప్లవ గ్రామ కమిటీలను జనతన సర్కారుగా తీర్చిదిద్దిన నాయకత్వంలోనే కాదు, మీడియా మొదలు, శ్రేణులకు, పరిశోధన కోసం వచ్చే విప్లవాభిమానులకు వివరించే గణేశఉయికెగా ఆయనయే అభివక్త. ఆయన కవితల్లో, రచనల్లో ఆలోచనలు ప్రతి చోట ఎక్కడా ఆయన ఒక మేధావిగా కనిపించడు. ఆర్గానిక్ ఇంటలెక్చువల్‌గా కనిపిస్తాడు. యుద్ధంతో పాటు సైనిక స్థాయి నుంచి సేనాని స్థాయికి ఎదిగినవాడుగా కనిపిస్తాడు. ప్రజాసైన్యం లేకుండా ప్రజలకు మిగిలేదేమీ లేదని మÖడు విప్లవ మంత్రదండాలలో – మిలటరైజేషన్ ఎక్కువ అయిపోయింది – అనే ఫిర్యాదులు, సన్నాయి నొక్కులు లేని ప్రజాసైన్య విజయాల నాయకుడనిపిస్తుంది. ఈ అనేక యుద్ధముల ఆరితేరిన వీరుడిగా కనిపిస్తాడు. మానవుడు భావుకుడు, సిద్ధాంతకర్త, ఐక్య సంఘటనా నిర్మాత – మాస్ లైన్ నుంచి పీడకలలో కూడ దారి తప్పని మనిషి ప్రజాయుద్ధ భేరీ వలె కనిపిస్తాడు. అందుకే ఆయనను నేను ఆయన రచనల నుంచి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తాను. ఒకరిద్దరు ముఖ్యంగా ఆయన అంతిమ యాత్రలో, లేదా ఆయన కగార్ ఆక్రమణ యుధ్ధంలో 2025 డిసెంబర్ 25న అమరుడయ్యాడని విన్నప్పటి నుంచి ప్రజా స్పందనను, ప్రజల నాడిని పట్టి చూసినవాళ్ళు, ఆయన ఊరు కదలికలను చూసినవాళ్ళు, ఈ జిల్లాలో కొన్నాళ్లుగా విప్లవోద్యమ ప్రభావమే లేదు, మరి ఎక్కడిదో ఈ కదలిక అని ఆశ్చర్యపోయిన వాళ్ళు, మనసుల్లోని ఆశాభావం చూసినవాళ్లు, ఆయనను ప్రజలవైపు నుంచి చూసే ప్రయత్నం చేశారు. ఆ ప్రజల విప్లవ ఆకాంక్షలపై, చేవపై, చైతన్యంపై సుదృఢ విశ్వాసంతో ఎప్పటికన్నా ఇప్పుడు విప్లవ పరిస్థితులు పరిపక్వంగా ఉన్నాయని భావించిన మావోయిస్టు పార్టీ అగ్రగామి నాయకత్వం వైపు నుంచి చూసిన వాళ్ళు ఆయన అంతిమ యాత్ర దగ్గర నిలబడి పుల్లెంల వైపు చూసారు. పుల్లెంల దొర గడీని ధ్వంసం చేసి విప్లవంలో దూకినపుడు గానీ, నాగార్జున కాలేజీలో హిందుత్వ సంఘీ దుష్టులపై, ఆకతాయి రౌడీలపై చర్యలు తీసుకొని అజ్ఞాత జీవితానికి వెళ్లినప్పుడు గాని ఆయనలో ఉన్న వర్గపోరాట నిశితత్వ పరిణతమైందే తప్ప – ఇనుము ఎంత కాలితే అంత ఉక్కు సంకల్పంగా మారిన ఆయన అప్రతిహత ప్రస్థానాన్ని స్పష్టంగా చూడగలిగారు.
2017లో బస్తర్ బెజ్జిలో జరిగిన పిఎల్‌జిఎ దాడిని ‘దేశద్రోహులకు పాఠం’ అనే పేరుతో ఒక కవిత రాసాడు. అందులో ఆ దాడిని ఆయన ఉరుము అన్నాడు. పిడుగు అనలేదు. ఎందుకంటే ఆ పిడుగురాలి అక్కడంతా కాలిపోలేదు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు నెత్తురు మరిగిన మోడీ పోలీసు మÖకలపైనా బస్తర్, పిఎల్‌జిఎ
ఉరుముకు 12 ఆయుధాలు ప్రజల చేతికందాయి’ అని రాస్తాడు. ఈ ఉరుమును నక్సల్బరీ వసంత మేఘ గర్జన రాజ్యాధికార పిలుపు నుంచి విడదీసి చూస్తే ఇది కేవలం మిలిటరీయిజం మీద రొమాంటిక్ పారవశ్యం అనిపిస్తుంది. కార్పెట్ సెక్యూరిటీ క్యాంపులు వేసి ఆపరేషన్ గ్రీన్ హంట్‌తో అడవులు, పల్లెలు, గుట్టలన్నీ జల్లెడ పడుతూ ఆదివాసుల, పేదల ప్రాణాలు ఎత్తుకపోతూ, హక్కుల గొంతులు బంధిస్తానన్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు దళారీ స్వభావాన్ని పోల్చుకుంటే ప్రజా యుద్ధ పంథాయే మార్గమని అర్థమవుతుంది.
ప్రతిచర్యే పీడిత ప్రజలకు ప్రేరణ
ప్రతిచర్యే పాలక వర్గాలకు వణుకు
ప్రతి చర్యే దేశ ద్రోహులకు పతనం
ప్రతిచర్య –
దేశ పీడిత, తాడిత, కార్మికవర్గ విముక్తికి దారిప్రజాయుద్ధ పంథాయే మార్గం –
ఒక పిఎల్‌జిఎ ప్రతి చర్యను ఉరుముతో పోల్చి, నక్సల్బరీ వసంత మేఘ గర్జనని స్మరింపజేసి దేశ పీడిత తాడిత కార్మిక వర్గ విముక్తికి దారి ప్రజాయుద్ధ పంథాయే మార్గం అని ప్రకటించడం ప్రజలను సాయుధం చేస్తున్న నేటి కవి అన్న ఈ కాలపు కవి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూంది. ఇప్పుడు మామÖలుగా దేశద్రోహులు అనే మాట పాలకవర్గాలు మావోయిస్టులకు వాడుతున్నాయి. కానీ తాను ఉన్న స్థల, కాలాల నుంచి అడవి నుంచి అడవిలో ప్రజలు లేరని బయటికి వచ్చిన వారిలా కాకుండా అక్కడ ఆదివాసీ పేద ప్రజల మధ్యన ఉండి “ఈ అడవి ఈ భూమి మా తాత ముత్తాతల సొమ్ము. కొండ దేవతలు వెలిసిన నేల. ఈ కొండలు, ఈ వాగులు మా వారసత్వ సంపద-ప్రాణాలు సైతం ధారరపోస్తాం కానీ, అడవులను, ఈ భూమిని, ఈ సెలయేర్లనివ్వం. మీ కార్పొరేట్ అభివృద్ధి నమూనాను ప్రజా యుద్ధ పంథాలో పాతర పెడతాం”
ఉయికె గణేశ్ ఈ కవితను బెజ్జి, బస్తర్ పిఎల్‌జిఎ విజయవంతమైన దాడి సందర్భంగా రాసాడు. మనం కంధమాల్‌గా పిలుచుకునే ఖందేల్ మాలి మÖలవాసులు ఒక రోజు క్రితమే, అంటే జూన్ 6వ తేదీన ఒక నిరసన సభలో ప్రభుత్వానికిస్తున్న విజ్ఞప్తిలో ప్రతిధ్వనించడాన్ని ఇవాళ వినండి. వాళ్లీ సందర్భంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన చదవండి. నియాంగిరి మొదలు కంధమాల్ దాకా ఇవాళ ఒడిశా మొత్తం ఆదివాసీల జల్ జంగల్ జమీన్, ఇజ్జత్‌ల మీద తమ అధికారాన్ని ప్రకటిస్తూ చేస్తున్న ప్రదర్శనలల్లో, వాళ్ళ పద ఘట్టనలలో గణేశ్ ఉయికె విప్లవ ప్రస్థానం ఆఖరి ఘట్టంలోని ఆయన పాదముద్రలు కనిపిస్తాయి. ఆయన ఒక్కడివే కాదు చిరకాలంగా అక్కడ విప్లవోద్యమ నిర్మాణం చేసి కగార్ ఆక్రమణ యుద్ధంలో అమరులైన మోడెం బాలకృష్ణ, మచిలీపట్నం మోహన్ రావు, పడ్కల్ స్వామి మొదలు మోడెం బాలకృష్ణ తర్వాత ఆయన ప్రస్థానాన్ని కొనసాగించి అమరుడైన గణేష్ నాయకత్వ ప్రభావం అక్కడ కనిపిస్తుంది. ఇక్కడే 2017 నాటికి ఉయికె గణేశ్ పాలకవర్గంలో ఉన్న దేశద్రోహుల గురించి రాసిన సందర్భానికి ఆయన అమరత్వ కాలానికి పార్టీలోనే ద్రోహ ఆలోచన చేసిన ప్రతిఘాతుక విప్లవకారులకు ఉన్న హస్తిమశకాంతర వ్యత్యాసాన్ని చర్చించాలి. అమరుడు కామ్రేడ్ బసవరాజ్ ప్రధాన కార్యదర్శిగా ఆక్రమణయుద్ధం మార్చి 31 గడువుకు ఎలా స్పందించారు, ద్రోహ చింతనాపరులు ఎట్లా ఆలోచించారు పరిశీలించాలి. ఆయన ప్రభుత్వంతో చర్చలకు ప్రతిపాదన చేసాడు. అందుకు ఉభయలు కాల్పుల విరమణ చేయాలని ప్రతిపాదించాడు. విప్లవ ఔదార్యంతో ఆయన నాయకత్వంలో చేసి చూపాడు. రాజ్యం సూరజ్‌కుండ్ వ్యూహం తప్ప మరో మార్గం లేదన్నప్పుడు పార్టీని ప్రతిఘటనా యుద్ధానికి సిద్ధం చేసి శత్రు వ్యూహంలో చిక్కుకొని తనని కాపాడడానికి అప్పటికే 25 మంది అమరులైతే నా కోసం మీరు ప్రాణాలొడ్డనక్కరలేదని రక్షణ వలయాన్ని దాటి పోరాడి అమరుడయ్యాడు. కానీ బస్తర్ మీద కేంద్రీకరించిన గడువుతో కూడిన మారణ ఆక్రమణ యుద్ధం నుంచి రిట్రీట్ అయి విస్తరించి ఒడిశా నుంచి ఇంకా సుమారుగా జార్ఖండ్, జంగల్ మహల్ దాకా లేదా కొత్త అటవీ ప్రాంతాల్లోకి విస్తరించాలనుకున్న వ్యూహంలో భాగంగా ఒడిశాకు వెళ్ళిన నాయకత్వంలో బసవరాజు అమరత్వం తర్వాత తేలిందేమంటే ఆయన
ఉండగానే ఒరిస్సాకు వెళ్లి తిరిగి వచ్చిన మల్లోజుల వేణుగోపాల్ ఒక్కడే మారిన పరిస్థితుల్లో ఆయుధాలు వదలాల్సిందేనని పట్టుపట్టాడు. ఆయన మాటల్లోనే – ‘నీ విమర్శ అంతటితో అంగీకారం ఉంది. కానీ సాయుధ పోరాటపంథా వీడాలన్న నీ ప్రతిపాదనతో అంగీకారం లేదని పడ్కల్ స్వామి ఒడిశాలో ఉండిపోయాడు. అంతే కాదు, మళ్ళీ మల్లోజుల వేణుగోపాల్ మాటల్లోనే చెప్పాలంటే తన వెంట ఫడ్నవీస్ ముందు లొంగిపోవడానికి తీసుకుపోతున్న ఆరుగురిని, తమ సివిల్ డ్రెస్సులు తెచ్చుకోవడానికి పోయిన వాళ్లను ఆపి, వాళ్లతో కలిసి తనను చంపాలని ప్రయత్నించాడని ఆరోపించాడు.
ఈ ఆరోపణల్లోని నిజానిజాల గురించి చర్చించడానికి ఈ విషయం రాయలేదు. విస్తరణలో భాగంగా ఒడిశాకు వచ్చిన విప్లవశ్రేణులు రాష్ట్ర, కేంద్ర స్థాయి వరకు కగార్ ఆక్రమణ యుద్ధంలో నిలిచి పోరాడడానికి సిద్ధపడ్డారనడానికి శిఖరాయమానమైన ఉదాహరణ పాక హనుమంతు. ఇక్కడ ఆజీవాంతం విప్లవంలో నిలిచిన వాళ్ళ త్యాగం మాత్రమే హిమాలయాలంత ఉన్నతమైందని రుజువవుతున్నది.ఏది అమరత్వం అని ప్రశ్నించుకొని ఫిలిప్పైన్స్ మావోయిస్టు పార్టీ చైర్మన్, కవి జోస్ మారియా సిజాన్ ఒక నిర్వచనం చెప్పాడు. జీవితమంతా ప్రజలకు సేవ చేసి, ప్రజల కొరకు పోరాడి, ప్రజల మధ్యన సహజ మరణం చెందినా అది అమరత్వమేనన్నాడు. మనకు ఆనంద్, ఆర్కే, హరిభూషణ్‌లు అటువంటి ఉదాహరణలు. స్వయంగా పాక హనుమంతు ఉయికె గణేశ్‌గా పశ్చిమ బస్తర్ కార్యదర్శిగా, రామన్న (శ్రీనివాస్ బెక్కల్లు) దక్షిణ బస్తర్ కార్యదర్శిగా, డికె కార్యదర్శిగా కూడా తీవ్ర అస్వస్థతతో అమరుడైనపుడు ఒకటి కాదు రెండు కవితలు రాసాడు. ఒకటి దీర్ఘ కవిత –
మా కొత్త మాడల్
ఓరుగల్లులో పుట్టి గోదావరి నది దాటి బస్తర్‌లో అడుగిడి
ఎర్రని అడవిపూల వనంలో
మంచు బిందువులలో మెరిసే సూర్యునివైనావు
ఇప్పపూల వనంలో ఇప్పపూలవైనావు-ఆ దీర్ఘ కవితనంతా
ఉల్లేఖించడం లేదుగానీ 2020 జనవరిలో రాసిన కవితలో ఆయన స్వరం, ఆయన దూరదృష్టి చూడండి.
‘సమాధాన’ శత్రువు చేసిన సరెండర్లు, ద్రోహాలు
కసనూర్, తిమ్మెం, చాకిలేక నష్టాల్లోంచి
యుద్ధాన్ని మునుముందుకు నడిపావు –
ఈ మునుముందుకు నడిచిన యుద్ధాల్లో-నడిపించిన రామన్నను తలచుకున్నట్లే శత్రువు వ్యూహంలో భాగంగా జరిగిన సరెండర్లు, ద్రోహాలు కూడ ప్రస్తావించాడు.
ఈ ఆరు పేజీల దీర్ఘ కవిత ఇంకో ఐదు సంవత్సరాలు గడిచి ద్రోహకాలం మÖడు నెలలు గడిచేవరకు డిసెంబర్ 25న కగార్ ఆక్రమణ యుద్ధంలో పాక హనుమంతు అమరత్వం మన ‘కొత్త మాడల్’ అనేది మరింత ఉన్నతమైన త్యాగంగా కనిపిస్తుంది.
పార్టీ కేంద్రకమిటీ అభివక్త, అమరుడు శ్యాం తర్వాత ఆంధ్ర, ఉత్తర తెలంగాణ, ఎఒబి, దండకారణ్య పార్టీల కేంద్రకమిటీ బాధ్యుడు, 2004లో ఎపి ప్రభుత్వంతో పార్టీ చర్చల పర్యవేక్షకుడు, నిర్దేశకుడు మావోయిస్టు పార్టీ అభివక్త ఆజాద్ జులై 2న ఎన్‌కౌంటర్ లో అమరుడైనప్పుడు లహర్ ఆయన మీద కూడ ‘కోటి నక్షత్రాల వెలుగు’ అని ఒక దీర్ఘ కవిత రాశాడు. కోటి నక్షత్రాల వెలుగులో రెండు ప్రతీకలు ఉన్నాయి. ఆయనను సూర్యుడో, చంద్రుడో అనలేదు. కోటి నక్షత్రాలు చీకటిలో ఇచ్చే వెలుగుతో పోల్చాడు. అంధకారంలో వెలుగు అవసరం ఒక్కడు తీర్చగలది కాదు. అట్లాగే ప్రజల జీవితాల్లోని చీకటిని ఒకరు తొలగించలేరు. అసలు ఏ ఒక్కరూ ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని’ కూడ ఆశించరాదు. ప్రజలు తమను చుట్టిన చీకట్లను తొలగించుకోవాలి. కోటి నక్షత్రాలు ఇక్కడ ప్రజలే. ఆ ప్రజల నుంచి, ఆ ప్రజల జీవితాలు, పోరాటాల నుంచి స్ఫూర్తిని పొందిన చైతన్యాన్ని రాజకుమార్-తాను అమరుడైన నాటికి – ముప్ఫై ఏళ్ల కాలగమనంలో పోరాటక్రమంలో, ప్రజా యుధ్ధంలో తిరిగి ఒక వెలుగుగా ఆ ప్రజలకు అందిస్తున్నాడు. పాక హనుమంతు చెరుకూరి రాజకుమార్ ఆరఎస్‌యు అధ్యక్షుడుగా ఉన్న రోజుల్లో తాను నలగొండలో ఆరఎస్‌యులో చేరాడు. ఆయన నాయకత్వంలో ఆరఎస్‌యు వరంగల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎబివిపి హిందూత్వ శక్తులతో కాంగ్రెస్ పాలకవర్గ ఫ్యూడల్ పెత్తందారీతనంతో పోరాడితే తాను నలగొండలో తన సహచర ఆరఎస్‌యు కామ్రేడ్స్‌తో కలిసి అదే పని చేసాడు. ఇద్దరూ – రాజకుమార్ విశాఖపట్నంలో ఎంటెక్ చేస్తూ బస్సుల జాతీయకరణ పోరాటం విజయవంతమైనాక రాజ్యహింస, నిర్బంధాలు అధిగమించడానికి అజ్ఞాత జీవితాన్ని ఎంచుకుంటే, ఎబివిపితో ఘర్షణల్లో బయట ఉండలేక అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నాడు పాక హనుమంతు. పది సంవత్సరాలు గడిచేవరకు మావోయిస్టు పార్టీని, ప్రజాయుద్ధాన్ని మÖడేళ్లలో అంటే 2013 వరకు నిర్మూలిస్తానని శత్రువు ప్రతిజ్ఞలు, ప్రగల్బాలు మొదలుపెట్టాడు. ఇద్దరికీ గ్రామాలకు తిరిగి భూ సంబంధాల అధ్యయనం చేసి వర్గపోరాట నిర్మాణం చేయడంలో ప్రజల నుంచి, పోరాట పటిమ నుంచి, భూపోరాటాల నుంచి జ్ఞానాన్ని పొందారు. ఉదయ్‌గా రాజకుమార్ కర్ణాటకలో పార్టీ నిర్మాణానికి పోయాడు. పాక హనుమంతు అదిలాబాదు, అటునుంచి మరో ప్రాంతంలో పార్టీ నిర్మాణానికి పోయాడు.
ఆజాద్ అమరత్వం నాటికే 2000 డిసెంబర్ 2న ముగ్గురు కేంద్ర కమిటీ అమరుల స్మృతిలో పిఎల్‌జిఎ ఏర్పడింది.
నింగి నుంచి నిప్పులు చిమ్ముతున్న దళారీ గగనతల రాజ్యవ్యూహం శత్రువు మొదలుపెట్టాడు కానీ పిఎల్‌జిఎ ఆజాదీ అమరత్వం అందించిన (ఆజాద్ మావోయిజం ప్రజా యుద్ధ బోధన – వంటి సైద్ధాంతిక రాజకీయాస్త్రాలు అందించిన వాటితో పాటు స్వయంగా ఆయన సంసిద్ధత, త్యాగం శ్రేణులకు ప్రేరణ అయింది) గగనతల దాడి వ్యూహాన్ని బూడిద చేసే మనోధైర్యాన్ని ఇచ్చింది. గగనతల ద్రోణుల వల్ల గానీ, ఆకాశ బాంబుల వల్ల గానీ కగార్ యుద్ధం నిర్విచక్ష సైనిక దాడుల్లో ఆదివాసులను తునికాకు ఏరడానికి పోయినవాళ్లను, వ్యవసాయపు పనుల్లో ఉన్నవాళ్లను బీజాపూర్‌లో 25 మందిని ఒకేసారి కాల్చి చంపడం వంటి ఘటనల్లో తప్ప ప్రాణనష్టం దాఖలాలు లేవు. పేలని బాంబు ముట్టుకుంటే చనిపోయిన ఒక ఆదివాసి మహిళ ఉదాహరణ తప్ప 2024 జనవరిలో మంగ్లీ అనే ఆరు నెలల పసిపాపకు గుండు తగిలి మారణించడమే, కగార్ యుద్ధంలో మొదటి ఎన్‌కౌంటర్.
ఆజాద్ నిర్మాణం చేసిన కర్నాటకలో సాకేత్ రాజన్ అమరత్వం తర్వాత (2004) అక్కడి పార్టీనే నేపాల్ పంథాను బలపరుస్తూ చీలిపోయింది. పదేళ్ల కాలంలోనే అదే నేపాల్ పార్టీ – అప్పటికి నలభై జిల్లాలలో విప్లవోద్యమం నిర్మాణం చేసి రూప్రా కేంద్రంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు అమలు చేస్తున్న పార్టీ, ఖాట్మండులో మొదటి దఫా చర్చలు జరిగాక రెండవ దఫా చర్చలు రూప్రాలో జరగాల్సి ఉండగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సాంస్క ృతిక యోధుడు కృష్ణసేన్‌ని ఎన్‌కౌంటర్ పేరుతో చంపేసినాక చర్చలు విఫలమైనవి. కానీ నాటకీయంగా రాజరికపాలన అంతం కావడమే సత్వర యుద్ధ విజయంగా ప్రకటించి ప్రచండ పార్టీ సాయుధ పోరాట విరమణ చేసి, పిఎల్‌జిఎను రద్దుచేసి, వారిని ప్రభుత్వ సైన్యంలో చేర్చి పార్లమెంటరీ రాజకీయాల రొచ్చులోకి దిగింది. ఆజాద్ అమరత్వం నాటికే ‘హిమాలయ పర్వతాల వడిలో విప్లవాగ్నుల’ నేపాల్ మావోయిస్టులు చల్లారి దళారీ బూర్జువా వర్గం సామ్రాజ్యవాదుల పార్లమెంటు పందుల దొడ్డిలో ప్రవేశించారని, ప్రజాయుద్ధ పంథా విడిచారని లహరి రాస్తాడు. ‘ఆయుధాల తేమ అగ్గిలో కడిగారు’ అని రాస్తాడు లహర్. నేపాల్ కన్నా 60 ఏళ్ల ముందే రాచరికం రద్దు కావడమే నూతన ప్రజాస్వామిక విప్లవం కాదని 1948 సెప్టెంబర్ 17ననే అనుభవానికి వచ్చిన కమÖ్యనిస్టు పార్టీ గుణపాఠం లహర్‌కున్నది. ఆయన నాయకత్వానికున్నది.
ఆయన రచనలకన్నిటి కన్నా చాలా విలువైనది ప్రతి బుద్ధిజీవి ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రజా జీవితంలో ఆచరించవలసినది.. ఆయన తండ్రి చనిపోయాడని వార్త విని 15 నవంబర్ 2022న తల్లికి రాసిన ఉత్తరం. 2022లో తండ్రి చనిపోయాడు. హనుమంతు రెండు నెలలు పోయాక గానీ ఆ విషాదాన్ని తల్లితో పంచుకోవడానికి
ఉత్తరం రాయలేకపోయాడు. ఆ తల్లికి ఉత్తరం అందింది లేనిది తెలియదు. ఆ తర్వాత కాలంలో ఆమె కూడా మరణించింది. హనుమంతు అమరత్వం తర్వాత ఆ ఉత్తరం బయటపడి అవని ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చి ఇప్పుడిందులో రచనల్లో భాగమయింది. ప్రతి బిడ్డకు తల్లితండ్రులు విలువలు, ఆదర్శాలు నేర్పుతారు. ముఖ్యంగా శ్రామిక జీవనంలో తమ తల్లిదండ్రుల శ్రమయే ఆదర్శంగా పిల్లలు ఎదుగుతారు. వాళ్లు కడుపు కట్టుకొని పిల్లలను చదివిస్తారు. హనుమంతు జీవితంలో తల్లితండ్రుల రుణం తీర్చుకోవాలనే ఆకాంక్ష ప్రగాఢంగా కనిపిస్తుంది. అయితే అది ఆయనకు విద్య, జ్ఞానం కన్నా చైతన్యం వలన దాని సార్వజనీన రూపంలో మనసులోకి ఇంకింది. ‘మీరు కడుపు కట్టుకొని మమ్మల్ని సాదిన తీరు నాకు ఎప్పుడూ గుర్తు వస్తూంటుంది. తల్లిదండ్రులందరూ ఎవరైనా, ఎక్కడైనా ఇట్లాగే ఉంటారని నాకు ఆ తర్వాత చాలా సార్లు అనుభవానికి వచ్చింది. అంత కష్టంలో కూడ మీకు భవిష్యత్తుపై గొప్ప ఆశ ఉండేది. బహుశా మన సొంత జీవితంలో మీరు చూసిన ఆశే నాకు మానవాళి మీద, ఈ దేశ చరిత్ర మీద ఆశావాదంగా మారింది కావచ్చు’ అని తల్లికి చాలా మృదువుగా అసంకల్పితంగానే కావచ్చు కానీ జీవితానుభవం నుంచి చెప్పిన మాటలే ‘ఈ దేశ చరిత్ర మీద ఆశావాదంగా మారిందనవచ్చు’ అని ‘అందుకే నీవూ, నాన్న ఆ రోజుల్లో చెప్పిన మాటలు నేను ఎన్నటికీ మరువలేను’ అన్నాడు.
తల్లులకు అట్లా హామీపడి, దేశంలోని తల్లులందరి ఆశల మీద చన్నీళ్ళు చల్లి ద్రోహం చేసిన వాళ్లను మనం చూస్తున్నాం. కానీ 2022 నవంబర్‌లో ఈ ప్రతిజ్ఞ తీసుకున్న హనుమంతు తన జ్ఞానం, తన చైతన్యం, సంసిద్ధత, త్యాగం అనే మరో రెండు మానవ విలువలతో నిలుపుకోవడమే కాదు, ద్రోహ కాలంలో వాటిని మరింత సుదృఢపరచుకున్నాడని, తల్లిదండ్రులు, రామన్న, ఆజాద్‌ల ఆదర్శంతోనే కాదు, తన పార్టీలో ద్రోహచింతన నుంచి కూడ నేర్చుకుని ఏటికి ఎదురీదడం వ్యవస్థలోనే కాదు, విప్లవ శిబిరంలో కూడ కఠిన పరీక్ష అయినపుడు అగ్ని గుండంలో దూకాడు.
చరిత్రలో, కాలంలో కాలిపోతున్న ఓడ మీద నిలబడి చివరిదాకా తన కాపలా కర్తవ్యాన్ని నిర్వహించిన కాసబియాంకను ప్రజలు ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటారు. అట్లా ఎందరో ఆదివాసులు విప్లవ నేతలు ఇచ్చిన పిలుపుకు ఇప్పటికీ ఖాండవ దహనంలో దగ్ధమైపోయారో. ఒక పొలిట్ బ్యూరో నాయకుని ఆదివాసి సహచరి అట్లా నిరీక్షణలో అనామకంగా అమరురాలయిన ఉదంతం చదివితే కడుపు చెరువయింది.
ఆ మాట భాగ్య అన్నది. చేసి చూపింది. అవును నాకు దారి ఉంది. నేను పోగలను. రణక్షేత్రం నుండి. కానీ ఇక్కడి ఆదివాసి ప్రజలతో కలిసి రణక్షేత్రంగా మలచిన ఈ గడ్డ మీదే చావో, రేవో తేల్చుకోవాల్సిన ఆదివాసులేమవుతారు. వాళ్లనిట్లా వదిలేసి నా దారి నేను చూసుకోవడం నైతిక నేరమే కాదు, రాజకీయ ద్రోహం అని ఆమెకు అనిపించింది. భాగ్య అమరురాలయింది. రూపీ ఇపుడు దండకారణ్యంలో కార్పొరేట్ల దురాక్రమణను ప్రతిఘటిస్తున్న వేలాదిమంది ఆదివాసుల చైతన్యంలో భాగంగా సజీవంగా ఉంది. పాక హనుమంతు అటువంటి లహర్. దండకారణ్యంలో ఆదివాసుల మధ్యన అది లహర్. బయట ప్రజా జీవితంలో లహరి. నదీతరాల నుంచి జాలరి పాడే పాటల్లో లాహిరి. అది నిరంతర ప్రవాహం. ఆ చైతన్యం రక్తం లొంగిపోయి నీరయ్యేది కాదు. ఎండిన చేపలవలె కొట్టుకపోతున్న ద్రోహులను కాదని, కేంద్ర అధినాయకత్వాన్ని, హెడ్ క్వార్టర్స్‌ని బంబార్డ్ చేసిన శ్రామిక వర్గ మహత్తర సాంస్క ృతిక విప్లవ వారసుడాయన. నక్సల్బరీకి మరణమే లేనట్లు లహర్‌కు, గణేశ్ ఉయికెకు మరణమే లేదు.
ఎప్పుడు రాసాడో తేదీ లేదు కానీ ‘మైదానమా..మౌనం వీడు’ అని లహర్ ఒక కవిత రాసాడు. ‘ఖతం సంబరాలకు తేదీలు ఖరారు చేసి ముప్పై, నలభై దినానికొందల భూమిపుత్రుల నేలకూల్చుతున్నది ఉన్మాద రాజ్యం – దీన్ని ఇలాగే వదిలేయడం భవిష్యత్తు తరాలకు బదులిచ్చుకోలేని చారిత్రక తప్పిదం.. మైదానమా, మోనం వీడు. రాయో, రప్పో,.. పిడుగో.. ఈటెనో… అంతర్యుద్ధం అవశ్యమంటూ ఒళ్ళిరిసి చూడు. గుప్పంటు లేస్తే చుట్టూ మేముంటాం నీకెప్పుడూ తోడు’
ఈ ద్రోహ కాలంలో ఆ విప్లవ దార్శకుని సందేశాన్నందుకుందాం.
- 08 జూన్ 2026
(ఇటీవల అమరుడైన విప్లవోద్యమ నాయకుడు, విప్లవ రచయిత కా. పాక హనుమంతు రచనల సంపుటి మైదానమా.. మౌనం వీడుకి రాసిన ముందుమాట)