పెట్టుబడిదారీ వ్యవస్థను మార్క్సిస్ట్ జీవావరణ శాస్త్ర (Marxist Ecology) దృష్టితో ఎలా అర్థం చేసుకోవచ్చో చర్చించే ముందు ఒక చిన్న పిల్లల కథ చెప్పాలని ఉంది.
మిసెస్ పీటర్కిన్ అనే ఒక అమెరికన్ మహిళ పొద్దున్నే కాఫీ కలుపుకుంటూ అందులో చక్కెర బదులు ఉప్పు కలుపుతుంది. కొంచం తాగి రుచి చూసే సరికి కాని ఆమె చేసింది ఏమిటో అర్థం కాలేదు. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న తన భర్తను, ఇద్దరి పిల్లలను పిలుస్తుంది. వాళ్ళు కూడా తలా కొంచం తాగి “నిజమే, ఇందులో చక్కెర బదులు ఉప్పు కలిపింది” అని నిర్ధారణకు వస్తారు. ఇక అప్పుడు ‘కాఫీలోంచి ఉప్పు తీయడం ఎట్లా?’ అనే దాని మీద పెద్ద చర్చ మొదలవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేసి అవి ఏవి పనికిరావని తెలుసుకొని, చివరగా నిపుణుల సలహా తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించుకుంటారు. అందరు కలిసి ఆ పట్టణంలో ఉన్న ఒక రసాయన శాస్త్రవేత్త దగ్గరికి పోయి వాళ్ళ సమస్య మొత్తం చెప్తారు. అంతా విన్న అతను, “ఈ పని నావల్ల కాదు” అని చెప్పేస్తాడు. దానికి అందరు కొంత బాధ పడుతుంటే, ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలని మిస్టర్ పీటర్కిన్ అభ్యర్థిస్తూ “ఎంత ఖర్చైనా ఫర్వాలేదు నేను భరిస్తా” అని ఆశ చూపుతాడు. అప్పటికే కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ శాస్త్రవేత్తకు ‘కాఫీలో ఉప్పు’ సమస్య ఒక మంచి అవకాశంగా కనిపిస్తుంది. వెంటనే ” నా మానవ ప్రయత్నం నేను చేస్త” అని ఒప్పుకుంటాడు. ముందు ఆ కాఫీలో పొటాషియం క్లోరేట్ కలిపి రుచి చూడమంటాడు. మిసెస్ పీటర్కిన్ రుచి చూసి “ఇంకా ఉప్పుగానే ఉంది” అని చెప్తుంది. ఇక వరుసగా సల్ఫ్యూరిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, కార్బోనిక్ ఆసిడ్, అమోనియా ఇలా అన్ని రకాల రసాయనాలు అందులో కలిపి ప్రతిసారి కొంత రుచి చూపిస్తూ ఉప్పు ఎంత వరకు తగ్గిందో అడుగుతూ అన్ని ప్రయోగాలు చేస్తాడు. అప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది. చివరికి “థియరీ ప్రకారం అన్నీ సరిగానే చేశాను, కాని ఫలితం రావడం లేదు. ఇక నేను ఏమీ చేయలేను” అని తేల్చేస్తాడు.
వేరే దారి లేక అతనికి అడిగినంత ఫీజు చెల్లించి ఇంటికి వస్తారు. కాఫీ తాగితేనే కాని రోజు మొదలుకాని మిసెస్ పీటర్కిన్ చాలా అవస్థ పడటం అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. కాని ఏమీ చేయలేని పరిస్థితి. ఎలాగైనా ఒక పరిష్కారం కనుక్కోవాలి అని అందరు ఆలోచిస్తుంటే పీటర్కిన్ కూతురుకు వాళ్ళ వీధి చివరన అనుభవ జ్ఞానం కల్గిన ఒక పెద్దావిడ ఉంటుందని గుర్తొస్తుంది. వెంటనే తన తమ్ముడిని వెంటబెట్టుకొని అక్కడికి పరుగున వెళ్ళి ఆమెకు విషయం మొత్తం చెప్తుంది. అంతా చాలా జాగ్రత్తగ విన్న ఆమె, “మీ అమ్మ ఆ చెడిపోయిన కాఫీని పడేసి, కొత్త కాఫీ చేసుకోవచ్చు కదా!” అని చాలా సాధారణంగా అనేస్తది. అక్క తమ్ముళ్ళ కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో కొంత, ఆనందంతో కొంత మెరిసిపోయి “అరె, ఇంత చిన్న విషయం మాకు ఎందుకు తట్టలేదు” అనుకుంటూ వెంటనే ఇంటికి పరిగెత్తుతరు. ఇంటికి వెళ్ళి ఆ పెద్దావిడ చెప్పిన పరిష్కారం చెప్పి పాత కాఫీ పడేసి, కొత్త కాఫీ చేస్తారు. చివరికి వాళ్ళమ్మ కాఫీ తాగుతుంది. (Lucretia P. Hale: The Peterkin Papers, 1880)
ఈ కథలో సమస్యను (కాఫీలో ఉప్పు కలపడం) ఉద్దేశపూర్వకంగా సృష్టించుకోకపోయినా దానిని పరిష్కరించుకోవడంలో మాత్రం కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నారు. ఈ చిన్న కథ ఆధారంగా పెట్టుబడిదారీ పోకడ వంటి సంక్లిష్టమైన విషయాలు వివరించడం వీలుకాదు కాని, వాతావరణ మార్పులకు (climate change) సంబంధించిన చర్చను అర్థం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కొత్త సమస్యలు సృష్టించడం, కొన్ని సార్లు సమస్య కానిదాన్ని సమస్యగా చేయడం, అది అందరి సమస్యగా మార్చడం, దాని పరిష్కారమంటూ సైన్స్‌ను కూడా బలి చేయడం, అదే క్రమంలో మరిన్ని సమస్యలను సృష్టించుకోవడం. ఈ విధంగా సంక్షోభాలను సృష్టించి వాటిని తిరిగి పెట్టుబడికి మార్గాలుగా మార్చుకోవడం పెట్టుబడిదారీ చరిత్ర నిండా చూస్తాము. ఇప్పుడు పర్యావరణ సంక్షోభం కూడా ఒక సరుకు అయ్యింది. వాతావరణ మార్పుకు అసలు కారణం: లాభం తప్ప మరేది పట్టించుకోని పెట్టుబడిదారీ వ్యవస్థ. మనిషిని (అంటే శ్రమశక్తిని), ప్రకృతిని వీలయినంత వరకు దోపిడీ చేసి మిగులును పోగు చేసుకునే ఉత్పత్తి విధానం ఒకవైపు, అవసరాలకు మించి, కొత్త అవసరాలు సృష్టించుకొని సరుకులను, వనరులను వినియోగించే సమాజ ఏర్పాటు మరోవైపు. ఈ రెండు ధోరణులు ప్రకృతి స్వభావాన్ని (the nature of Nature), దాని పరిమితులను (Nature’s limits) దాటడం మూలంగా జరిగే పరిణామాలను పట్టించుకోవు. ఇటువంటి వ్యవస్థ మూలంగానే పర్యావరణ మార్పు జరుగుతుంది. అందుకే మార్క్సిస్టులు నిజాయితీగా పర్యావరణ మార్పు గురించి మాట్లాడదలిస్తే వ్యవస్థ మార్పు గురించి మాట్లాడాలి అని చెప్తున్నారు. కాని, పెట్టుబడిదారులు, పాలకవర్గ మేధావులు వ్యవస్థ మార్పు అనగానే అసలు సమస్యే లేదంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకేసి వాతావరణ మార్పు అనేది ఒక బూటకం అని కొట్టిపారేస్తున్నాడు.
ఇప్పుడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మనిషి వ్యతిరేక, ప్రకృతి వ్యతిరేక పోకడలను అర్థం చేసుకోవడానికి ట్రంప్ ఒక కొత్త సందర్భం. మొన్నటి వరకు రాజ్యం రక్షణతో ప్రపంచమంతా విస్తరించిన ఒక పెట్టుబడిదారుడే స్వయంగా రాజ్యాధినేత అయితే ఇక సరుకుగా మారకుండా, అణిచివేత, దోపిడీకి గురికాకుండా ఏదీ ఉండే అవకాశం లేదు. ఇదేమీ కొత్తగా మొదలైనదీ కాకపోయినావాటి విస్తృతి, లోతు నానాటికి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి అమెరికన్ సమాజంలో సరుకీకరణ నిత్యజీవితంలో సర్వసాధారణమయ్యింది. మార్కెట్‌తో సంబంధం లేకుండా, దాని పరిధిలోకి రాకుండా బతకడం అసాధ్యమయ్యింది. నయా ఉదారవాద సూత్రాల (principles of neoliberalism) ఆధారంగా సమాజంలోని అన్ని రంగాలు నడుపబడుతున్నాయి.
ప్రముఖ మార్క్సిస్ట్ సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ హార్వీ అన్నట్టు నయా ఉదారవాదం అనేది “సృజనాత్మక విధ్వంసం.” సృజనాత్మకమైనది ఎందుకంటే అది చాలా సహజమైనదిగా, ప్రత్యామ్నాయం లేనిదిగా, దానికి ఎదురీదడం అంటేనే వృథా ప్రయాసగా ఒక భావజాలాన్ని నిర్మించి సమాజ సమ్మతిని కూడగట్టే ప్రక్రియ కనుక. ఇది కేవలం భావజాలం మాత్రమే కాదు, పాలకవర్గ రాజకీయార్థిక పాలసీ కూడా. అందులో ముఖ్యమైనవి: (1) సమాజంలోని అన్ని ఉత్పత్తి రంగాలను, సేవలను, సహజ వనరులను ప్రైవేటీకరించడం, (2) ఫైనాన్స్ కాపిటల్ విస్తృతిని పెంచడం, (3) కొత్త కొత్త సంక్షోభాలను సృష్టించి వాటి ద్వారా వ్యవస్థపై పూర్తి పట్టు సాధించడం, (4) రాజ్యాన్ని చెప్పుచేతుల్లో ఉంచుకోని పబ్లిక్ రంగ వనరులన్నింటినీ ధనిక వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా పునఃపంపిణీ చెయ్యడం. ఈ పద్ధతుల ద్వారా పెట్టుబడి మనుషులపై, ప్రకృతిపై ఆధిపత్యం సంపాదించి పెట్టుబడి పోగుకు ఎలాంటి అడ్డులేకుండా చేసుకోవడం ప్రధాన వ్యూహం.
ఈ విధానాలను మిగతా ప్రపంచమంతా 1980ల నుండే అమలు చేయడానికి అమెరికా తన పెత్తనాన్ని ఉపయోగించినప్పటికీ, 1990 నుండి మాత్రమే వాటిని తన సొంత గడ్డ మీద ఒక విధానంగా తీసుకొచ్చింది. ఈ పాలసీలు మిగతా సమాజాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో అవే అమెరికాలో కూడా జరిగాయి. అన్ని రంగాలను పెట్టుబడి ఆధీనంలోకి తెచ్చుకోవడం, అన్ని అడ్డంకులు తొలగించుకొని మిగులుకు దారులు వేసుకోవడం. ఆ అడ్డంకులు బౌద్ధికమైనవి అయినా, సాంస్కృతికమైనవి అయినా, భౌతికమైనవి/ప్రాకృతికమైనవి అయినా అన్నింటినీ తొలగించాల్సిందే. ఈ తొలగింపు వల్లనే పెట్టుబడి అభివృద్ధికి దారులు వేయాలి. ఈ మొత్తం విధానాన్ని హార్వీ accumulation by dispossession అని సూత్రీకరించాడు. అయితే, ఇదేమీ కొత్తది కాదు. ఇది మార్క్స్ వివరించిన ప్రాథమిక పెట్టుబడి పోగు (primitive accumulation of capital) విధానానికి కొనసాగింపే, కాకపోతే దోపిడీ చేసే పద్ధతులు మారాయి అంతే అంటాడు.
నయా ఉదారవాద విధానాల మూలంగా తమ భద్ర జీవితాల నుండి తొలగించబడిన కార్మికులు గాని, మరి ఏ ఇతర రంగంలోని సమూహాలను గాని సంఘటితపరిచే శక్తులు లేకుండ పోవడంతో, అదే తొలగించబడిన వర్గం (dispossessed class) ఒక బిలియనీయర్ తమ పరిస్థితిని చక్కదిద్దగలడని నమ్మి గద్దె మీద కూర్చోబెట్టింది. ఇది ఒక చారిత్రక విషాదం. ఇది దోపిడీని మరింత చట్టబద్ధం చేయనుంది. ఈ ప్రక్రియలో వాస్తవం బూటకం అవుతుంది, బూటకం వాస్తవం అవుతుంది. అందులో భాగమే “పర్యావరణ మార్పు ఒక బూటకం” అని ట్రంప్ ప్రకటన. ఇది కేవలం ఒక విశ్వాసాన్ని ప్రకటించుకోవడం మాత్రమే కాదు. బిలియన్ డాలర్ల ప్రకృతి వనరుల వ్యాపారాలకు అనుమతులు సంపాదించుకోవడానికి, తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే. అందులో భాగంగానే తన క్యాబినెట్‌ను పర్యావరణ మార్పు జరగడం లేదని వాదించే (outright denialists) వాళ్ళతో నింపేశాడు. మరి వాస్తవం ఏంటి? సైన్స్ ఏమి చెబుతుంది?
సూర్యుని నుండి వచ్చే శక్తిలో 2/3 వంతు భూమిపై ఉన్న సముద్రాలు, అడవులు, మిగతా పచ్చని వనరులు గ్రహిస్తే, మిగిలిన 1/3 వంతు వెనుకకు పంపబడుతుంది. అలా వాతావరణంలోకి వదలబడిన శక్తిలో కొంత భాగాన్ని గాలిలో ఉండే నీటి ఆవిరి, వివిధ రకాల వాయువులు (ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్) గ్రహించి భూమి ఉపరితలం మీద వేడిగా ఉండేటట్టు చేస్తాయి. ఆ విధంగా వెలుబడిన వాయువులనే గ్రీన్‌హౌస్ గ్యాసెస్ (greenhouse gases) అంటారు. అవి ఒక బ్లాంకెట్ లాగా ఏర్పడి భూమిని వెచ్చగా ఉంచుతాయి. కాబట్టి ఈ ప్రకృతి పద్ధతిని “బ్లాంకెట్ ఎఫెక్ట్”గా పిలుస్తారు. ఒకవేళ ఇటువంటి సహజ ప్రక్రియ లేకపోతే భూమి మీద ఇప్పుడు ఉన్నదానికంటే 35 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉండేది. దానితో జీవం మనుగడ ప్రశ్నార్థకం అయ్యేది. కాని సమస్య ఏమిటంటే, పారిశ్రామిక విప్లవం జరిగిన నాటి నుండి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతూ పోతోంది. దీనిమూలంగా వాతావరణంలో ఉష్ణశక్తి ఎక్కువ కావడంతో అంటార్కిటిక్, గ్రీన్‌లాండ్ మంచు పొరలు (ice sheets) కరిగే వేగం పెరిగింది. అది సముద్రమట్టాన్ని పెంచుతుంది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇప్పటికే 30 శాతం పెరిగింది. కేవలం ఇరవయ్యో శతాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా 0.75 సెంటిగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. దాని మూలంగా సముద్రమట్టం 22 సెంటీమీటర్ల ఎత్తు పెరిగింది. 2100 సంవత్సరానికి 1.1 డిగ్రీల నుండి 6.4 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా. అదే జరిగితే, దాదాపు 28 సెంటీమీటర్ల నుండి 79 సెంటీమీటర్ల ఎత్తుకు సముద్రమట్టం పెరిగే అవకాశం ఉంది.
సముద్రంలో పెరిగే నీటిమట్టం మూలంగా ఎన్నో దీవులు మునిగిపోతాయి. సముద్రగర్భంలో ఒత్తిడి ఎక్కువై భూకంపాలు, సునామీలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, సముద్రం ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి అందులో ఆసిడ్ స్థాయి పెరుగుతుంది. దీనిమూలంగా సముద్రంలో జీవరాశి నశించే ప్రమాదం ఉంది. మొత్తంగా అంచనా వేయలేని విపత్తులు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భయాందోళనలు వెల్లడిస్తున్నారు.
సంఘటనలుగా జరిగే విపత్తులు ఒకవైపు అయితే వాతావరణ మార్పు మూలంగా పంటలపై, ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం మరోవైపు. మొత్తంగా, విధ్వంసం వైపు అడుగులు పడుతున్నాయి. పరిస్థితి చేయి జారకముందే అదుపు చేయాలని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ శాస్త్రవేత్తలు మొరపెట్టుకుంటున్నారు. మార్పును అంచనా వేసి ప్రభుత్వాలకు, ప్రజలకు విషయ తీవ్రతను అర్థం చేయించడానికి ఐక్యరాజ్యసమితి Intergovernmental Panel on Climate Change అనే ఒక అంతర్జాతీయ సంస్థను 1988లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ తనంతట తానుగా పరిశోధనలు జరుపదు కాని, ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న పరిశోధనలను క్రోడీకరించి ప్రపంచ సమాజం ముందు పెడుతుంది. ఈ సంస్థ ప్రయత్నాల మూలంగానే కియోటో ప్రొటోకాల్ 1997లో ఏర్పాటయ్యింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రీన్‌హౌస్ గ్యాసెస్ విడుదలను తగ్గించి వాతావరణ ఉష్ణోగ్రతలను అదుపులో పెట్టడం. ఇప్పటికి 192 దేశాలు ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదిస్తే, 35 శాతం గ్రీన్‌హౌస్ గ్యాసెస్ విడుదల చేసే అమెరికా మాత్రం ఒప్పుకోవడానికి మొండికేస్తుంది.
కియోటో ప్రొటోకాల్ ప్రయత్నాల కొనసాగింపుగా 2015లో పారిస్ ఒప్పందం వచ్చింది. దీని ముఖ్య లక్ష్యం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 2 డిగ్రీలకు మించకుండా చూసుకోవడం. దాని ప్రకారం ఇప్పటికి ఒప్పుకున్న 120 దేశాలకు కార్బన్ విడుదల తగ్గింపు టార్గెట్స్ పెట్టింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులుసమకూర్చుకోవాలని నిర్ణయం చేసింది. ఆర్థిక వనరులు లేని పేద దేశాలకు సహాయం చేయడానికి క్లైమేట్ ఫైనాన్స్ (climate finance) ఏర్పాటు చేయాలని తీర్మానం జరిగింది. అమెరికాలో జరుగుతున్న పర్యావరణ ఉద్యమ ప్రభావంతో ఒబామా ప్రభుత్వం ఈ ఒప్పందానికి ఒప్పుకుంది. కాని ఇలాంటి ఒప్పందాల మూలంగా అమెరికా అభివృద్ధి కుంటుపడుతుందని, తాను గెలిస్తే పారిస్ ఒప్పందం నుండి అమెరికా వైదొలగుతుందని ట్రంప్ ముందే ప్రకటించి ఉన్నాడు. భారతదేశం కియోటో నుండి పారిస్ వరకు జరిగిన అన్ని ఒప్పందాలకు సమ్మతి తెలిపింది. కాని ఆచరణలో ఎలాంటి పురోగతి చూపలేదు. అయితే, కేవలం మన దేశమే కాదు ఈ ఒప్పందాలను ఏ దేశం కూడా పూర్తిగా అమలు చేస్తున్న ఆధారాలు మాత్రం లేవు.
పెట్టుబడిదారీ విధానం మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసే దిశగా ప్రయాణిస్తున్న ఈ క్రమాన్ని మార్క్సిస్టులు ఎలా అర్థం చేసుకోవాలి? మార్క్స్ మీద, మార్క్సిస్టుల మీద ఒక అపవాదు ఉంది. వాళ్ళు ఉత్పత్తివాదులు, ఆర్థికవాదులని, పర్యావరణాన్ని పట్టించుకోరని. కాని వాస్తవానికి, మార్క్స్, ఏంగెల్స్ పెట్టుబడిదారీ వ్యవస్థ పర్యావరణానికి చేసే హాని గురించి అప్పుడే చెప్పి ఉన్నారు. వాళ్ళు ఊహించి చెప్పినవి కాదు. అప్పటికే పెట్టుబడిదారీ వ్యవసాయంలో, సరుకుల ఉత్పత్తి విధానంలో వస్తున్న మార్పులను గ్రహించి, విశ్లేషించి చెప్పినవి.
ఏంగెల్స్ తన Dialectics of Nature అనే గ్రంథంలో (చాప్టర్ 9) ప్రకృతిని జయించగలననీ, నియంత్రించగలననీ మనిషి తన మొదటి ప్రయత్నంలో పొంగిపోవచ్చు. కాని రెండోసారి లేక మూడోసారి జరగబోయే పరిణామాలలో ప్రకృతి పగ తీర్చుకుంటుంది. అలా జరిగే ఊహించని పరిస్థితి మూలంగా మొదట పొందిన ప్రయోజనాలు కూడా రద్దయిపోతాయని చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంగెల్స్ “ప్రకృతి పగ తీర్చుకుంటుంది” అనడమంటే గతితార్కికంగా ప్రకృతి పర్యవసానం ఉంటుందని చెప్పడం.
మార్క్స్ ఇంకా స్పష్టంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు సమాజాన్ని ప్రకృతి నుండి వేరు చేసి ఒక పూడ్చలేని అగాధాన్ని సృష్టిస్తాయని చెప్పాడు. 1850-60లలో జర్మన్ రసాయన శాస్త్రవేత్త జస్టస్ వాన్ లైబిగ్ బ్రిటిష్ పారిశ్రామిక వ్యవసాయ పద్ధతులు సారవంతమైన భూములను ఏ విధంగా నాశనం చేశాయో చేసిన విమర్శ మార్క్స్‌కు ప్రకృతి జీవక్రియకు (natural metabolism) సంబంధించిన సాంకేతికమైన విషయాల మీద మంచి పట్టునిచ్చింది. దాని ఆధారంగా మెటబాలిక్ రిఫ్ట్ (metabolic rift) అనే భావనను ఉపయోగించి సమాజానికి ప్రకృతికి మధ్య తెగిపోతున్న జీవ సంబంధం గురించి విశ్లేషించాడు. మనిషిని ప్రకృతిలో భాగంగా చూస్తూనే, ఒక కరడుకట్టిన ప్రకృతివాదిలా కాకుండా ప్రకృతి-మనిషి మధ్య ఉండే గతితార్కిక సంబంధపు దృష్టికోణాన్ని మార్క్స్ ప్రతిపాదించాడు.
శ్రామికులు లేదా ఉత్పత్తిదారులు తమ శ్రమ ద్వారా ప్రకృతికీ సమాజానికీ మధ్య ఒక సంబంధాన్ని నిర్వచించుకుంటారు. ఆ క్రమంలో ప్రకృతిని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటారు. అదే విధంగా ప్రకృతిలో భాగంగా ఇమడటానికి తమను కూడా మార్చుకుంటారు. ఈ విధంగా ఒక సజీవ సంబంధాన్ని నిలబెట్టుకుంటారు.
పెట్టుబడిదారీ వ్యవస్థకు ఇటువంటి సంబంధాలతో పనిలేదు. ప్రకృతిని జయించి, నియంత్రించి పెట్టుబడుల అభివృద్ధికి దానిని ఒక ముడిపదార్థంగా చేసుకోడమే దాని లక్ష్యం. అది ఎప్పుడూ ప్రకృతిని తనకు లభించిన ఒక బహుమతిగానే భావిస్తుంది. దాని దృష్టి అంతా లాభాలపైన, మరింత పెట్టుబడిని పోగేయడం మీదనే తప్ప మనిషికి ప్రకృతికి మధ్య పెరుగుతున్న అగాధం గురించి కాదు. అది ఎప్పుడూ ప్రకృతి విలువను సంపద సృష్టిలో (కొన్ని సందర్భాలలో భూమి అద్దెను నామమాత్రంగా పరిగణలోకి తీసుకున్నప్పటికీ) లెక్కించదు. ఎందుకంటే ప్రకృతిని తనకు మంజూరు చేయబడిన సొంత ఆస్తిగా భావిస్తుంది కాబట్టి.
అయితే జేమ్స్ ఓ కన్నర్ వంటి మార్క్సిస్ట్ మేధావులు మార్క్స్ పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించడానికి శ్రమశక్తి విలువ (the value of labour power) మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు కాని, అన్ని ఉత్పత్తులలో కీలకమైన ప్రకృతి విలువకు (the value of nature) అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విమర్శను లేవనెత్తాడు. దీనికి జవాబుగా జాన్ బెల్లామీ ఫాస్టర్ (మంత్లీ రివ్యూ ఎడిటర్, సోషియాలజిస్ట్), పాల్ బుర్కెట్ వంటి మార్క్సిస్ట్ పర్యావరణవాదులు మార్క్స్ సిద్ధాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి శ్రమశక్తి విలువను ప్రకృతి విలువతో జోడించి మార్క్సిస్ట్ జీవావరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
డబ్బు రూపంలో ఉన్న పెట్టుబడి (M) ఉత్పత్తి ద్వారా సరుకులుగా (C) మార్చబడి, అవి అధిక లాభానికి అమ్ముడుపోయి (M1) మిగులును పోగు చేసుకోడం పెట్టుబడిదారీ విధాన ముఖ్య లక్షణం. ఎక్కువ లాభాలు రాబట్టాలంటే సరుకు తయారీలో ముఖ్య ఉత్పత్తి సాధనాలైన ( శ్రమశక్తిని, ప్రకృతిని) మరింతగా కొల్లగొట్టాలి. దీనికి తోడు సాంకేతికతను ఉపయోగించి ఉత్పత్తిని మరింతగా పెంచుకోవాలి. ఒకవేళ కార్మికులు ఎక్కువ వేతనాలు డిమాండ్ చేస్తే, ఎక్కడ తక్కువ వేతనాలకు కార్మికులు దొరుకుతారో అక్కడికి ఉత్పత్తి రంగాలను తరలించుకోవాలి. లేదా చౌక కార్మికులను తన దగ్గరికి తెప్పించుకోవాలి. లేదా ఉత్పత్తిని పూర్తిగా యాంత్రీకరించి కొద్దిమంది కార్మికులతో పరిశ్రమను నడపాలి.
కార్మికుల సమస్య నుండి ఏదో విధంగా తప్పించుకోవచ్చు, మరి సహజ వనరులను ఎక్కడ నుండి కొత్తగా పుట్టిస్తారు? అవి ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలి. వాటిని విచ్చలవిడిగా వాడుకోవడానికి అనుమతులు ఇచ్చే ఒక దళారీ పాలక వ్యవస్థను ఏర్పరచుకొని, చెప్పుచేతల్లో పెట్టుకోవాలి. అడ్డుకునే ప్రజా శక్తులు ఉంటే నల్ల చట్టాలను ప్రవేశపెట్టి, హింసను కొనసాగించాలి. చౌకగా దొరికే శ్రమశక్తి, చౌకగా దొరికే వనరులు, చెప్పినట్టు ఆడే పాలకవర్గం, దానికి భజన చేసే మేధావి వర్గం, మీడియా. తమ సరుకులను ప్రపంచమంతా అమ్ముకోవడానికి అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలు. ఇంకేం కావాలి ప్రపంచ ఉత్పత్తి, వినియోగ సామ్రాజ్యాలను నిర్మించుకొని రాజకీయార్థిక పెత్తనం చేయడానికి. ఇదే నడుస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ తీరు.
కాని ఏ వనరులు ఎక్కడా అపరిమితం కావు. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచీకరించబడిన ఉత్పత్తి, సరఫరా, వినియోగం మొత్తం ఇంధన వనరుల మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఈ వనరులు పరిమితమైనవి. పీక్ ఆయిల్ సిద్ధాంతకర్తలు (peak oil theorists) ప్రపంచ ఇంధన వినియోగం ఇప్పటికే గరిష్ట పరిమితికి చేరుకుందని లెక్కలు చెప్తున్నారు. ఇంధనం లేకుండా జీవితంలో దేన్నీ ఊహించలేని పరిస్థితికి చేరాము. ఒక్క వ్యవసాయాన్ని ఉదాహరణగా తీసుకున్నా, యంత్రాలు, రసాయనాలు, ఉత్పత్తి, సరఫరా, వాటిని ప్రాసెస్ చేయడానికి, ప్యాకింగ్‌కు, సుదూరాలకు అమ్మకానికి… ఈ విధంగా అన్ని ప్రక్రియలు ఇంధనం మీద ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు, ఈ ప్రక్రియలో వెలువడుతున్న వివిధ రకాల కాలుష్యాలు వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయి.
ఈ మొత్తం క్రమంలో మనిషిని మనిషి నుండి, మనిషిని ప్రకృతి నుండి (జన్యుమార్పిడి పంటలు దీనికి ఒక ఉదాహరణ) పరాయీకరించడం పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్న దుర్మార్గం. సాంకేతిక పరిజ్ఞానం తనను కాపాడుతుందనే అతి విశ్వాసాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకటించుకుంటుంది. కాని, వాస్తవానికి అది తాను నిలబడిన కొమ్మనే అదే నరుక్కుంటుంది.
ప్రకృతి బహుమతిగా దొరికిందని భావించి దాన్ని విపరీతంగా కొల్లగొట్టుకుంటూ పోతే అదే చివరికి బొందల గడ్డగా మారుతుంది. “ప్రకృతి పగతీర్చుకుంటుంది” అంటే ఇదే. దీనర్థం ప్రకృతే పగ తీర్చుకుంటుంది అనుకుంటూ మనం ఇప్పుడు ఏమీ చేయనవసరం లేదు అని తలరాత సిద్ధాంతాన్ని (fatalism) ప్రకటించడం కాదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం, వినియోగ వ్యవస్థ జీవావరణాన్ని పూర్తిగా కొల్లగొట్టకముందే దానిని కాపాడుకోవాలి.
దీనికంతటికీ ఒకే మందు: మనిషిని మానవీకరించి, ప్రకృతి-సమాజం మధ్య జీవబంధాన్ని పునరుద్ధరించే ప్రత్యామ్నాయ ఉత్పత్తి వినియోగ వ్యవస్థ కోసం నిరంతర ప్రయత్నం చేయడం. ఈ వ్యవస్థల నిర్మాణం వర్గపోరాటంలో భాగమయినప్పుడే అవి నిలబడి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించగలుగుతాయి. లేకపోతే పర్యావరణ ఉద్యమాలను కూడా పెట్టుబడి తన వశం చేసుకుంటుంది. ఇప్పటికే ఆ పని మొదలయ్యింది. మొదట చెప్పుకున్న కాఫీ కథలాగా, చెడిపోయిన వ్యవస్థ మూలాలను అలాగే ఉంచి సరిదిద్దడం కన్నా నూతన వ్యవస్థ నిర్మాణంలో భాగం కావడమే సహేతుకమైనది.
ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఇప్పుడు మళ్ళీ తన వ్యాసం ‘సోషలిజం ఎందుకు?’ (Why Socialism? మంత్లీ రివ్యూ మొదటి సంచికలో, మే 1949లో మొదటగా ప్రచురింపబడినది) రాసే అవకాశం ఉంటే మానవ విలువల పరిరక్షణతో పాటు ప్రకృతి రక్షణ కోసం కూడా సోషలిజం అవసరం ఎప్పటికన్నా ఇప్పుడే ఎక్కువని రాసేవాడేమో. అంతిమంగా సారాంశంలో పర్యావరణ రక్షణ పోరాటమంటే పెట్టుబడిదారీ వ్యతిరేక వర్గ పోరాటమే!
(మొదటగా ప్రచురితమైనది: అరుణతార, సంపుటి 44, సంచిక 12, జనవరి 2017)