మరణించీ జీవించిన యోధుడు

ఉద్యమంలో ఒక్క రోజు పని చేసిన కార్యకర్త అమరత్వాన్ని అయినా.. సుదీర్ఘ కాలం పనిచేసిన నాయకుల అమరత్వాన్ని అయినా అమరుల బంధుమిత్రుల సంఘం సమానంగా కీర్తిస్తుంది. కారణం ఏమంటే, అవి ఒకే లాంటి మరణాలు. ఒకే లక్ష్యం కోసం చేసిన ప్రాణత్యాగాలు కాబట్టి. తల్లిదండ్రులు, అలుబిడ్డలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు అందరు వాళ్ళు లేని వెలితి ఒకేలా జీవితాంతం మోయాల్సిందే కాబట్టి. మాకు ఆ ఎరుకను కల్గించింది రక్త సంబంధీకులను పోగొట్టుకున్న ఈ దు:ఖమే. మమ్మల్ని సంఘంగా కలిపింది సహానుభూతిని పొందిన ఈ దుఃఖమే. విప్లవోద్యంలో పనిచేస్తూ…రాజ్యం చేతిలో హత్యకు గురైన వాళ్లందరూ మాకు ఒకటే. అయితే విగత జీవులుగా మారిన వారి గురించి పదే పదే వింటుంటే, కుటుంబాలను కలుస్తుంటే ప్రభుత్వాలు విప్లవకారుల కుటుంబాలపై ఎంత హింసను ప్రయోగించాయో తెలుస్తూ వచ్చింది. అది ఎంత ఎక్కువ కాలం అయితే అంత చెప్పనలవికాని.. రాజ్యహింస, మానసిక ఒత్తిడి. చివరికి ప్రభుత్వాలు కక్ష సాధింపుగా నడి బజార్లో విప్లవకారుల కుటుంబ సభ్యులను నరికి చంపించాయి. ఎన్నో కుటుంబాలను జైలుపాలు చేయించాయి. పక్కవాళ్ళు పలకరించే పరిస్థితి లేకుండా చేసాయి. హేతువు లేని మరణాలను మా ముందు ఉంచాయి. మాకు మాట్లాడే హక్కు లేకుండా, చనిపోయిన విప్లవకారులు చెప్పినట్టుగానే తన దోపిడీ, దుర్మార్గ స్వభావాన్ని రాజ్యం చాటుకుంది. ప్రజల కోసం నిస్వార్ధంగా ప్రాణాలిచ్చిన వారిని హింసావాదులుగా, అరాచకులుగా దుష్ప్రచారం చేసింది. అది నిజమని మేమూ ఒప్పుకోవాలని మాపై ఒత్తిడి తెచ్చింది. మనమంతా దీనికి తలవంచాలనుకుంది.

అందుకే విప్లవకారుల పోరాట చరిత్ర తెలుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. విప్లవకారుల తల్లిదండ్రుల్లో, సహచరుల్లో చాలా మందికి తమ వాళ్లు ఉద్యమంలో ఏం చేశారో తెలియదు. కొద్దిమంది వాళ్ళ పోరాటాన్ని అంగీకరించిన తల్లిదండ్రులు వున్నారు. అది స్థల కాల సందర్భాలను బట్టి ఉంటుంది. వాళ్లు ఒక మంచి పని చేయడానికి విప్లవంలోకి వెళ్లిపోయి ప్రాణత్యాగం చేశారనే నమ్మకం మాత్రం అందరిలో ఉంది. అందుకే ఉద్యమంలో వాళ్ల పాత్రను తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. తమ వాళ్ల గురించి ఎవరైనా పాట పాడుతుంటే ఆనందిస్తారు. ఎవరైనా చెబుతుంటే గర్వపడతారు. చనిపోయిన వాళ్ల ఆశయాలను తెలుసుకొని, వాళ్ల జ్ఞాపకాలను పదిలపరుచుకోడానికి స్థూపం కట్టి, సంస్మరణ సభ జరపాలని కోరుకుంటారు. వాళ్లకు త్యాగం ఎందుకు అవసరం అయిందీ సమాజానికి చెప్పాలి అనుకుంటారు.

కామ్రేడ్ పాక హనుమంతు మీద వస్తున్న ఈ పుస్తకంలో ఆయన జీవితాన్ని దగ్గరిగా చూసిన మిత్రులు రాసిన వ్యాసాలు ఉన్నాయి. కవితలు, పాటలు ఉన్నాయి. ఆయన బహిరంగ జీవితంలో విద్యార్థిగా ఉన్నప్పుడు కలిసి పని చేసిన వాళ్లు తమ జ్ఞాపకాలు రాశారు. ఆయన రాజకీయాలపట్ల గౌరవంతో, హనుమంతును రాజ్యం దుర్మార్గంగా కాల్చి చంపిందనే బాధతో రాశారు.

కామ్రేడ్ పాక హనుమంతు అమరత్వం ఒక ప్రత్యేక సందర్భంలో జరిగింది. ఆపరేషన్ కగార్ పేరుతో రాజ్యం విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనే పథకంతో విచక్షణారహితంగా పెద్ద ఎత్తున దాడి చేసింది. మావోయిస్టు రహిత భారత్ అనే లక్ష్యం పెట్టుకొని చేసిన ఈ యుద్ధంలో ఎంతోమంది ప్రజలు, విప్లవ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలిచ్చారు. వారితో పాటు హనుమంతు తృణప్రాయంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. విప్లవోద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పని సైన్యంతోనే చేయలేమని రాజ్యం విప్లవ పార్టీలోంచే విద్రోహాన్ని లేవదీసింది. విప్లవోద్యమంతో సాయుధ పోరాట విరమణ చేయించడానికి లోపలి నుంచి రాజ్యం లేవదీసిన విద్రోహాన్ని పాక హనుమంతు అడ్డుకున్నాడు. ప్రజలు నిర్మించుకున్న విప్లవోద్యమాన్ని మధ్యలో వదిలేసి రాజ్యంతో చేతులు కలపాలనే కుట్ర పూరిత విధానాలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. కగార్ నష్టాలను, కష్టాలను ఎదుర్కొని ముందుకే పోవాలని అనుకున్నాడు. విద్రోహం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడి చాలా మంది నాయకులు, కార్యకర్తలు తిరిగి వస్తున్నా కూడా సీనియర్ నాయకుడిగా హనుమంతు దృఢంగా నిలబడ్డాడు. విప్లవోద్యమాన్ని కగార్ నుంచి, విద్రోహం నుంచి కాపాడాలని పోరాడుతూ ప్రాణత్యాగం చేశాడు. లొంగిపోతే తప్ప బతకనివ్వం అని రాజ్యం పదే పదే హెచ్చరించినా ఆయన ఉద్యమాన్ని వదిలిపెట్టలేదు. అధికారికంగా సాయుధ పోరాటాన్ని విరమింపచేయాలనే రాజ్య కుట్రను భగ్నం చేసాడు. పడకల్ స్వామి, రంగబోయిన భాగ్యలాంటి వాళ్లు హనుమంతు బాటలో ఉద్యమాన్ని కాపాడుతూ ప్రాణత్యాగాలు చేశారు. వీళ్లు ద్రోహ కాలానికి ఎదురీదిన విప్లవకారులు, ప్రజాయుద్ధ యోధులు.

విప్లవోద్యమం కోసం త్యాగం చేసిన వేలాది మంది వీరుల అమరత్వానికి కా. పాక హనుమంతు అమరత్వ సందర్భానికి ఒక తేడా ఉన్నది. విప్లవోద్యమాన్ని కాపాడ్డానికి తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లో కూడా ఆయన ప్రయత్నించాడు. పోరాడే ప్రజలను బంధించి, ప్రజాయోధులను చుట్టుముట్టింది ప్రభుత్వం. పాశవిక మరణకాండ జరుతున్నప్పుడు ఒడ్డున పడ్డ చేపలా విలవిలాడిన విప్లవం మీద ఆశ కోల్పోలేదు హనుమంతు.. లక్షలాది మంది ప్రజలు కలిసి నిర్మించిన ఉద్యమాన్ని, వేలాది మంది ప్రాణ త్యాగం చేసిన పార్టీని వదిలేసి తన ప్రాణాలు కాపాడుకుంటే చాలని అనుకోలేదు. యవ్వనంలో విప్లవంలోకి వెళ్లినప్పటి చైతన్యాన్ని చివరి రోజు దాకా నిలుపుకున్నాడు. ఈ గడ్డుకాలంలో హనుమంతు త్యాగం ఈ ప్రత్యేకత చారిత్రక అవసరంగా ముందుకు వచ్చింది. విప్లవోద్యమ చరిత్రలోని విద్రోహపు కుట్రపై కూడా పోరాడిన సాయుధ యోధుడు హనుమంతు. భారతదేశ మావోయిస్టు పార్టీ అమరత్వాలు వృథా పోవంటూ కీర్తిస్తూ, నమ్మిన సిద్ధాంతం, పోరాటం ఇంకా ప్రజల పక్షమే ఉన్నాయని రుజువు చేస్తూ వెళ్లి పోయాడు.

ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు రాసిన వాళ్లు హనుమంతు త్యాగాన్ని సరిగా గుర్తించారు. కగార్, విద్రోహం వల్ల విప్లవోద్యమం ఓడిపోయినా హనుమంతు అమరత్వ స్ఫూర్తితో తిరిగి బలపడుతుందనే ఆశను వ్యక్తపరిచారు. ఇవి వృథా త్యాగాలు కావని తమ జేజేలు పలికారు.

హనుమంతు కుటుంబ సభ్యులకు అదే ఓదార్పు. తమ రక్త సంబంధీకుడి ప్రాణత్యాగం వృథా కాదని అనిపించినప్పుడు దు:ఖం కొంతలో కొంత తీరుతుంది. హనుమంతు కూడా తమలాగే బైటికి వచ్చి ఉంటే ప్రాణాలు దక్కేవని మొసలి కన్నీరు కారుస్తూ రాసేవాళ్ళు ఈ రోజు ప్రజల్లో పొందుతున్న గౌరవాలేంటో, ప్రజల కోసం ప్రాణాలు ధారపోసిన వాళ్ల త్యాగాలు ఎలాంటివో రేపు చరిత్ర తప్పక రికార్డు చేస్తుంది.

ఈ మాటలు అమరుల కుటుంబాల్లో కొందరికైనా నిజమే కదా అనిపిస్తుంది. అయితే ఇది అమరుల కుటుంబాలు కొత్తగా వింటున్న మాట కాదు. తరతరాలుగా అమరత్వాలను అవహేళన చేస్తూ.. రాజ్యం మాట్లాడుతున్నదే. కొత్తగా కొందరు వంత పాడుతున్నారు. అందుకే ఈ పుస్తకం చదివితే తమ రక్త సంబంధీకులు విప్లవంలో ప్రాణాలు ఎందుకు ఇచ్చారనేది తెలుస్తుంది. హనుమంతు రాజ్యాన్ని, విద్రోహాన్ని కూడా ఎదుర్కొని ప్రాణత్యాగం చేశాడని ఈ పుస్తకం వాళ్లకు చెబుతుంది. వర్గపోరాట చరిత్రను రికార్డు చేస్తుంది. ఈ పుస్తకం విప్లవోద్యమ చరిత్రను వక్రీకరించే కుట్రలను పటాపంచలు చేస్తుంది. ఈ కాలపు ప్రజల్లో భాగమైన హనుమంతు చరిత్రను ముందు తరాలకు అందించమే మనమంతా హనుమంతుకు ఇచ్చే నిజమైన నివాళి.

  • 21 జూన్, 2026
    అమరుల బంధుమిత్రుల సంఘం

(ఇటీవ‌ల విప్ల‌వోద్య‌మంలో అమ‌రుడైన కా. పాక హ‌నుమంతు జీవితాచ‌ర‌ణ‌పై ఎబిఎంఎస్ ప్ర‌చురించిన ప్ర‌జా యుద్ధ సంకేతం పుస్త‌కానికి రాసిన ముందుమాట‌)

అమరుల బంధుమిత్రుల సంఘం.

Leave a Reply