ది రిటర్న్ ఆఫ్ ది జాకాల్

మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ, కాపిటలిస్ట్ సొసైటీ గా మారే క్రమం లో సామాన్యుడి కి పొసే ఉక్కపోత లాగా ఉంది అడవి. సంక్షేమ రాజ్యం లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కళ్ళకు కట్టే వెండి జలతారు తెర లాగా ఉంది అడవి. రాజ్యాధికారం కోసం అస్తిత్వ సమూహాలు చేసే అలజడి లాగా ఉంది అడవి. మొత్తం మీద అడవి ఆధునిక భారత దేశపు ఆనవాళ్లకి అసలు సిసలు నకలు లాగా ఉంది.

అడవికి రాజు మృగరాజు, కానీ ఆ మృగరాజు రాజ్యాన్ని పాలించి, శాసించే మృగరాజుకాదు. అది ఎప్పుడూ తన గుహలోనే కూర్చుని, టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటుంది. లేదంటే రీల్స్ చేస్తూ ఉంటుంది. ఈ రెండూ కాకపోతే ఇతరేతర అడవులను సందర్శిస్తూ ఉంటుంది. అడవి టీవీ ఒక మాయా మర్రి చెట్టు, దాని కొమ్మలు తెర లాగా బంగారు రంగు లో మెరుస్తూ, అడవి జంతువుల జీవితాలను లైవ్ స్ట్రీమ్ చేస్తాయి. .

మృగరాజు దాని ముందు కూర్చుని, పాప్‌కార్న్ లాంటి పురుగులు తినేసి, “హా హా, ఇది మంచి ఎపిసోడ్. ఇట్ ఈజ్ సో గుడ్. ఇట్ ఈజ్ సో బాడ్ “అని వాఖ్యానిస్తూ నవ్వుకుంటుంది. మృగరాజు కి నమ్మిన బంటు తోడేలు. అది సినిమా లో మ్యూట్ చేసిన పాట లాగా ఉంటుంది. దాని నాలుక ఎప్పుడూ వేలాడుతూ, అడవి రోడ్ల మీద స్లిప్ అవుతూవుంటుంది. అది మృగరాజు బాడీగార్డ్.కానీ అది బాడీ గార్డ్ పనులు తప్ప అన్ని పనులూ చేస్తుంది. నిజానికి అడవి మీద అధికారం తోడేలు దే. బ్రిటన్ రాణి లాగా మృగరాజు అలంకారప్రాయం. బ్రిటన్ ప్రధాన మంత్రి లా అధికారం తోడేలుదే.

ఆ అడవిలో జింకలు ఎప్పుడూ డాన్స్ చేస్తూ, పూలు తినేసి, “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అని పాడుతూ ఉంటాయి. కానీ ఒక రోజు, తోడేలు ఒక జింకను చూసింది. ఆ జింక పేరు లలిత. లలిత అందంగా ఉంటుంది. వసంతం వచ్చినప్పుడు పూతపట్టిన అడవి ఎంత అందంగా ఉంటుందో లలిత కూడా అంత అందంగా ఉంటుంది. ఎప్పుడూ తన కొమ్ముల మీద పూలు పెట్టుకుని, అడవి లో ఫ్యాషన్ షోలు చేస్తుంది

తోడేలు ఆమెను చూసి, “వావ్, ఇది నా టార్గెట్” అని మనసులో అనుకుంది. కానీ అది సాధారణ టార్గెట్ కాదు. లలితను చూడగానే తోడేలు లో ఒక అద్భుతమైన రసాయనిక చర్య జరిగి జింక మీద కోరిక కలిగింది. నిజానికి జింక హెర్బీ వోర్. తోడేలు కార్ని వోర్. మేటింగ్ అసాధ్యం. కానీ కోరిక ఆపుకోలేని తోడేలు ఆమె మీద అత్యాచారం చేయాలని నిర్ణయించుకుంది

అడవిలో “బలవంతులు ఏమైనా చేయవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అది అడవి ధర్మం.” తోడేలు ఆమెను ఒక చీకటి మూలలోకి తీసుకెళ్లి,

“హే బేబీ, నువ్వు నా డిన్నర్” అని చెప్పి, ఆమెను బలవంతం చేసింది. లలిత కేకలు వేసింది, కానీ ఆ అరుపులన్నీమాయా మర్రి చెట్టు టీవీలోకి వెళ్లి, మ్యూట్ అయిపోయాయి. మృగరాజు “ఓహ్, ఇది రియాలిటీ షో” అని నవ్వుకుంది.

అతికష్టం మీద తోడేలు నుండి తప్పించుకున్న లలిత ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. అడవి రక్షక వ్యవస్థ దగ్గరకు వెళ్ళింది. ఆ వ్యవస్థ కి ప్రతినిధి ఒక నక్క, పేరు ఫాక్సీ.

అది ఎప్పుడూ తన టైల్‌తో సెల్ఫీలు తీసుకుంటూ, “నేను జస్టిస్” అని పోస్ట్ చేస్తుంది.

లలిత వెళ్లి, “ఫాక్సీ, తోడేలు నన్ను…” అని చెప్పబోతుంటే,

ఫాక్సీ “ష్, ష్, నువ్వు ఓవర్‌రియాక్ట్ చేస్తున్నావ్. తోడేలు మా రాజు బంటు, అది ఏదైనా చేస్తుంది. చేయగలదు” అని చెప్పి, ఫిర్యాదు తీసుకోలేదు.

లలిత బాధపడి, మృగరాజు గుహ ముందు వెళ్లి, ఆత్మహత్యా ప్రయత్నం చేసింది – ఆమె ఒక పెద్ద రాయి తీసుకుని, తన తల మీద కొట్టుకోబోతుంటే, అడవి జంతువులు అన్నీ చుట్టుముట్టాయి.

“ఓహ్ నో, డ్రామా!” అని ఒక కోతి గిలగిలా నవ్వింది.

“ఇది లైవ్ స్ట్రీమ్ చేద్దాం” అని మాయా మర్రి చెట్టుకు సిగ్నల్ ఇచ్చింది మరొక ఏనుగు.

లలితను ప్రేమించిన మరొక జింక వచ్చి లలిత కన్నీళ్లు తుడిచి “ఇలా ఆత్మహత్య చేసుకోవడానికా మనం పుట్టింది? చెంగు చెంగు మనే మన గంతులతో ఈ అడవి దద్దరిల్లాలి. మనం గంతులేస్తున్నప్పుడు,నెమలి నాట్యమాడాలి, ఏనుగులు ఘీంకరించాలి, కోయిల పాటలు పాడాలి, తూనీగలు రెక్కలు విప్పుకుని ఎగరాలి, నదులు గలగలా ప్రవహించాలి, ఆకాశం వంగి నేలతల్లిని ముద్దుపెట్టుకోవాలి. అందుకు కదా మనం పుట్టింది. అవసరం అయితే మృగరాజును అయినా ఎదిరిద్దాం!” అని హితబోధ చేసింది.

మిగతా జంతువులన్నీ అవును, అవును అంటూ మద్దతు పలికాయి. అందరూ పట్టుపడితే, చివరకు ఫాక్సీ కంప్లైంట్ తీసుకుంది. కంప్లైంట్ ఫైల్ చేసుకుని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తయారు చేయకుండా

“ఓకే లలితా! నువ్వు తోడేలుతో రాజీ పడు. అది నీకు ఒక పూల బొకే ఇస్తుంది, నువ్వు అది ఫ్రెండ్ అని చెప్పు” అని బలవంతం చేసింది ఫాక్సీ.

లలిత “నో వే!” అని కేక పెట్టింది.

ఆమె తండ్రి, ఒక ముసలి జింక వచ్చి”నా కూతురిని కాపాడండి” అని గోల గోల చేస్తుంటే, తోడేలు రాత్రి రహస్యంగా వచ్చి, అతన్ని చంపేసింది.

ఎలా వచ్చిందా తోడేలు?

గోవు ముఖం పెట్టుకుంది. సనాతన ధర్మాన్ని వల్లే వేసింది. మంచి మాటలు చెప్పింది. మాయమాటలు చెప్పింది. “ఇదుగో చూడు ఈ బహుమతి నీ కోసమే!” అని ఒక పెద్ద ఆపిల్ పండును జింక చేతిలో పెట్టింది. గడ్డి గాదం, ఆకులు అలములు తినీ తినే చవి చచ్చిపోయిన ఆ ముసలి జింక యాపిల్ పండు చేతిలో పడగానే తమకం తో, బలంగా నొక్కింది. పండు రూపం లో వున్న బాంబు పేలి చనిపోయింది, అడవి మట్టిలో కలిసిపోయింది.

అప్పుడు అడవిలో ఘర్షణలు మొదలయ్యాయి. అడవి జంతువులు రెండు గ్రూపులుగా విడిపోయాయి.

“తోడేలు హీరో” అని ఒక గ్రూప్ ప్లకార్డులు పట్టుకుని డాన్స్ చేసాయి.

“జస్టిస్ ఫర్ లలిత” అని కేకలు వేసింది మరొక గ్రూప్.

“జింక మరణానికి బదులు తీర్చుకుంటాం” అని కొన్ని బేబీ డీర్స్ శపధం చేసాయి

ఈ ప్రహసనం అంతా మృగరాజు టీవీలో చూసి,

“ఈ గొడవలు అన్నీ చాలా బోరింగ్ గా వున్నాయి. కానీ ఏం చేద్దాం? అడవిలో ప్రజాస్వామ్యం వుంది కదా! ఆ ఘర్షణలు ఆపడానికి ప్రత్యేక న్యాయస్థానము ఏర్పాటు చేసి రోజువారీ విచారణ చేయండి” అని ఆర్డర్ ఇచ్చింది.

అడవిలో స్పెషల్ కోర్ట్ వెలసింది. అది ఒక పెద్ద బండరాయి మీద. జడ్జి ఒక గుడ్లగూబ. అది ఎప్పుడూ “హూట్ హూట్” అని చెప్పి, నిద్రపోతుంది.

కోర్టు మొదలైంది.

తోడేలు: “నేను లలితను ప్రేమించాను, కానీ ఆమె నన్ను రిజెక్ట్ చేసింది, సో ఐ డిడ్ ఇట్” లలిత: ” “తోడేలకు, జింకకు ప్రేమ ఏమిటి? తోడేలు ఉచ్ఛం, నీచం మరచి నామీద అత్యాచారం చేసింది. న్యాయం అడిగిన మా నాన్న ను బాంబు పెట్టి పేల్చేసింది “

తోడేలు: “తోడేలు జింకను ప్రేమించకూడదని ఉన్నదా? ఏ రాజ్యాంగం లో వున్నదో చూపెట్టండి. ఆడ సింహానికి,మగ పులికి లైగర్ పుట్టడం లేదా? నేను నిజంగానే లలిత ప్రేమించాను. నా ప్రేమను లలిత అర్ధం చేసుకోవడం లేదు.”

కోర్ట్ లోకి ఒక హైనా దూసుకుని వచ్చి “ఇదొక క్రూరమైన పరిహాసం” అని లలిత మీదకు దూకపోయింది. లలిత ఒక్కసారిగా న్యాయమూర్తి పైనుండి హైనాకు అందనంత దూరం లోకి దూకింది.

ఇదే అవకాశం అనుకున్నదేమో తోడేలు లలిత వంక కన్నుగీటి, “కమాన్, లెట్స్ మేక్ అప్” అని వింక్ చేసింది. లలిత మద్దతుదారులు, తోడేలు అంటే భయమూ, భక్తీ వున్నవాళ్లు అందరూ ఒక్కసారిగా గోలగోల గా పైకి లేచారు. ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని స్థితి. ఘర్షణ మాటల స్థాయినుండి చేతల దాకా పోయింది.

న్యాయమూర్తి గుడ్ల గూబ కి ఏమి చేయాలో అర్ధం కాక “ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్” అన్నది.

ఆ రాత్రి మృగరాజు దగ్గర, తోడేలు, నక్క,గుడ్లగూబ శిఖరాగ్ర సమావేశం లో పాల్గొన్నాయి. బడుగు జంతువుల రక్తం ఏరులై పారింది. వెచ్చటి నెత్తురు తాగుతూ తోడేలు, మృగరాజు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాయి.

“నేను లేకపోతే నువ్వీ అడవిని పాలించలేవు” అని తోడేలు మృగరాజును చూసి హేళనగా నవ్వింది.

హఠాత్తుగా మృగరాజుకు తాను అడవికి రాజు అన్న విషయం గుర్తుకొచ్చింది. గుడ్లగూబను పిలిచి చెవిలో రహస్యంగా గీతోపదేశం చేసింది. ఫలితంగా మరునాడు గుడ్లగూబ

“తోడేలు గిల్టీ! పదేళ్లు కఠిన కారాగార శిక్ష” అని తీర్పు ఇచ్చింది.

తోడేలు ఒక చిన్న గుహ జైలులోకి వెళ్లింది. రాజు గారి భరోసా వున్న తోడేలును కూడా జైలుకి పంపించేసరికి మృగరాజు స్టేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికలలో కూడా మృగరాజే తమ రాజు అని జంతువులన్నీ తీర్మానించాయి.

జైలు లో తోడేలు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ, “ఐ యామ్ ఇన్ జైల్, బట్ ఐ యామ్ సో ఫైన్ ” అని పోస్ట్ చేసింది. పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తే కానీ తోడేలు బయటకు రాదని అడవి జంతువులన్నీ ఆనందపడ్డాయి. మృగరాజు దగ్గర తోడేలు స్థానాన్ని భర్తీ చేయడానికి మిగతా తోడేళ్ళు పోటీ పడ్డాయి. కానీ మృగరాజు ఎవ్వరినీ దగ్గరకు రా నివ్వలేదు. అలాగే నాలుగు నెలలు గడిచాయి.

కానీ కొద్ది రోజులకే మృగరాజు కి బోర్ కొట్టింది. తోడేలు లేక మృగరాజు కి తోచడం లేదు. మృగరాజు బాగోగులు అన్నీ తోడేలే చూసుకునేది. వేట కోసం కూడా మృగరాజు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. వేట ను గుహకే పంపించేది. ఎన్ని మాయమాటలు చెప్పేదో ఏమో.

ఒక రోజు ఒక జింకను ఆహారంగా గుహలోపలికి పంపింది. జింకను చూస్తూనే మాంచి ఆకలి మీద వున్న మృగరాజు జింక మీదకు లంఘించింది. జింక తప్పించుకుని వచ్చి తోడేలు దగ్గర నిలబడి

“అడవిని పాలించబోయే జింక కోసం మృగరాజు ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు నువ్వెళ్లితే నువ్వే రాజువు అవుతావు అని చెప్పావు. మృగరాజేమిటి నన్ను చంపి తినడానికి మీదకు దూకాడు?” అని కోపంగా అరిచింది జింక.

జింక మార్మికంగా నవ్వి “లేదు. లేదు. నిన్నే అడవికి రాజును చేస్తాడు. సింహాసనం మీద కూర్చోవడానికి నీ కొమ్ములు అడ్డు వస్తాయి కనుక కొమ్ములను తీసివేయడానికి నీ మీదకు వచ్చి ఉంటుంది. అయినా మృగరాజు వార్థాగ్స్,గ్రాంట్స్ గజెల్స్,వైల్డ్‌బీస్ట్‌లు,జీబ్రాలు ఎన్నో ఉండగా నిన్నెందుకు చంపుతుంది. నువ్వు సాత్వికం గా ఉంటావు కనుక అడవిని ఏలడానికి నువ్వే సరిఅయిన దానివని మృగరాజు నమ్మకం కూడా ! వెళ్ళు వెళ్ళు లోపలకు వెళ్ళు ” అన్నది తోడేలు.

జింక అమాయకంగా మళ్ళీ లోపలకు వెళితే మృగరాజు ఈసారి జింక నడుము మీదకు దూకింది. ఆ ధాటికి జింక నడుము విరిగి కూలబడింది. సరిగ్గా అప్పుడే గుహ లోపలకు వెళ్లిన తోడేలు, “ప్రభూ! మీకెందుకు శ్రమ. నేను ఆహారాన్ని తయారు చేస్తాను” అని మృగరాజు ని పక్కన కూర్చోబెట్టి జింక ను ఖండ ఖండాలు చేసి జింక రుచికరమైన మెదడును తాను స్వాహా చేసి మిగతాది మృగరాజు ముందు ఉంచింది. మృగరాజు ఆహారాన్ని తింటూ, తింటూ “అవునూ! ఈ జింక మెదడు ఏది? కనపడలేదే ?’ అని అడిగింది.

దానికి తోడేలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ జింకకి మెదడు లేదు ప్రభూ! దీనికే మెదడు ఉంటే అడవికి తనని రాజును చేస్తారని ఎలా నమ్ముతుంది?” అన్నది. మృగరాజు మెదడు లేని జింకను తింటూ పరమానందపడి పోయింది. అదంతా గుర్తుకు వచ్చి కొద్ది రోజుల తర్వాత, మృగరాజు, “తోడేలు ఫ్రీ!” అని ఆర్డర్ ఇచ్చింది

తోడేలు లేనందువల్ల మాయా మర్రి చెట్టు టీవీలో రేటింగ్స్ డౌన్ అయ్యాయి, “వితౌట్ తోడేలు, నో డ్రామా” అని మృగరాజు భావించడం కూడా తోడేలు విడుదలకి ఒక కారణం

తోడేలు బయటకు వచ్చి, లలితను చూసి, “హే, లెట్స్ డు ఇట్ అగైన్” అని చెప్పింది. లలిత భయపడి, అడవి నుంచి పారిపోయింది.

కానీ అడవి చుట్టూ ఒక అదృశ్య గోడ ఉంది, అది మాయా మర్రి చెట్టు సృష్టించింది,

“నో ఎస్కేప్, ఇది ఎండ్‌లెస్ షో” అని. లలిత తిరిగి వచ్చి, తన తండ్రి సమాధిలోని మట్టిని తినేసి

“నేను స్ట్రాంగ్” అని మనసులో అనుకుంది.

ఆ మరునాడు తోడేలు “మై ఫ్రీడమ్ పార్టీ !” అని అడవిలోని జంతువులకు ఒక పార్టీ ఇచ్చింది. అడవి జంతువులు అన్నీ లలితను బలవంతం చేసి పార్టీకి తీసుకుని వచ్చాయి. ఆ పార్టీలో తోడేలు “ఐ డిడ్ ఇట్ ఫర్ లవ్ ” అని పాడుతూ, నాట్యం చేస్తూ, ద్రాక్ష సారా తాగుతూ నానా హంగామా చేసింది. లలిత కూడా తోడేలు పాడటం చూసి “ఐ టూ లవ్ యూ డార్లింగ్” అని పాడింది. ఇద్దరూ పాటలు పాడుతూ నాట్యం చేయడం తో

ఫాక్సీ “యస్, రాజీ ఈజ్ బెస్ట్” అని చప్పట్లు కొట్టింది.

తనకై తాను తోడేలు తో సంగమానికి సిద్దపడింది జింక. తోడేలు జింక నడుమును కొరికినపుడు జింక మాంసం తో పాటు జింక తన నడుము చుట్టూ అలంకరించుకున్న కాల కూట పుష్పాలు కూడా తోడేలు శరీరం లోకి వెళ్లి శరీరమంతా విషపూరితం అయి తోడేలు చనిపోయింది. చివరి క్షణం లో తోడేలు కి జింక ఏం ప్లాన్ చేసిందో అర్ధం అయింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది.

తోడేలు ఏడవలేక నవ్వుతూ “హా హా, ఇది ఫన్” అని చెప్పి చనిపోయింది. కానీ అర్ధాంతరంగా, అసంబద్ధంగా, తోడేలు చనిపోయినా, మాయా మర్రి చెట్టు టీవీలో అది రీప్లే అవుతూనే వుంది.

టి వి చూస్తున్న మృగరాజు “గుడ్ ఎండింగ్” అని చప్పట్లు కొట్టింది.

కానీ అసలు కథ అప్పుడే మొదలు అయింది. మృగరాజు దగ్గర తోడేలు స్థానం లోకి లలిత వచ్చింది. ఆమె రోజూ ఉదయమే మృగరాజు తినే డైట్ లో మార్పులు చేర్పులు చేసి రోజుకు నాలుగు గంజాయి పూలు టిఫిన్ లో ఉండేలా చూసుకుంది. ఫలితంగా మృగరాజు తన సహజ లక్షణాలు కోల్పోయి మందంగా, మన్నుతిన్నట్టు మత్తుగా తయారయి రీల్స్ చేయడానికి కూడా ఓపిక లేక మబ్బుగా పడుకుంటున్నాడు.

లలిత అడవికి రాణి అయింది. ఫాక్సీ ఇప్పుడు లలితకు నమ్మినబంటు. కొన్నాళ్ళకి లలిత ప్రెగ్నెంట్ అయింది.లలిత వయసు వచ్చాక అడవిలో ఎవరితోనూ కలవలేదు. కానీ గర్భం ఎలా వచ్చింది? అనేక సందేహాలు ఆమెను చుట్టుముట్టాయి. కానీ బిడ్డ పుట్టాక పోలికలను బట్టి ఏం జరిగిందో ఊహించవచ్చు అని లలిత ఓపిక పట్టింది ఆమెకు ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ ఒక హైబ్రిడ్ మాన్‌స్టర్, జింక కాళ్లు, తోడేలు దంతాలు, మరియు అత్యాచారం చేసే హాబిట్ పుట్టుకతోనే ఆ బిడ్డకు వచ్చాయి. ఆ బిడ్డ పలికిన తొలి మాట “రేప్”

ఆ బిడ్డ రాజయ్యాడు. అవడం తోనే అడవి జాతీయగీతాన్ని మార్చేసి “డెత్ ఈజ్ కమింగ్” అనే గీతాన్ని జాతీయ గీతంగా పాడాలని ఫర్మానా జారీ చేశాడు

ముసలి మృగరాజు టీవీ చూస్తూ, “నెక్స్ట్ సీజన్ స్టార్ట్” అని అనుకుంటుంది. అడవి జంతువులు అన్నీ ఇప్పుడు భయంతో జీవిస్తున్నాయి, ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా అత్యాచారం చేస్తారు, చంపేస్తారు, కోర్టు శిక్ష వేస్తుంది. మళ్ళీ ఆ శిక్ష రద్దు అవుతుంది.

ఒక కోతి ఒకసారి “ఇది అబ్సర్డ్ డ్రామా నా?” అని అడిగితే, మాయా మర్రి చెట్టు “నో, ఇది రియల్ లైఫ్ ట్రామా” అని జవాబు ఇచ్చింది.

Leave a Reply