తెలుగు అనువాదం: వెంకట కిషన్ ప్రసాద్
ఎదురు చూపులు
మేం నాగరికులుగా ఎప్పుడవుతామా అని వాళ్లు
వాళ్లు మనుషులుగా ఎప్పుడవుతారా అని మేం
ఎదురు చూస్తున్నాం.
~ * ~
జాతీయవాదం
నా పొరుగింటి వాడే
నా రక్తం కళ్లజూసేందుకు తెగించినప్పుడు
నాకర్థమైంది..
జాతీయవాదం వచ్చేసిందని.
~ * ~
నేను పురుషుడిగా పుట్టను
నేను పురుషుడిగా పుట్టను
నన్ను పురుషుడిగా సమాజం చేస్తుంది
నాలోని స్త్రీత్వాన్ని బాల్యం నుంచే
కొద్దికొద్దిగా చంపేస్తుంది
ఏ పురుషుడినైనా అది ఇలాగే నగిషీలు చెక్కుతుంది.
~ * ~
ఏదీ చేరని చోటు
కొండల్లో బతికే వాళ్లు
కొండల్లో పారే నీళ్లనే తాగుతారు
సర్కారీ పైపు నీళ్లు అందవు వారికి
మాతృభాషలో చదువు చెప్పే బడీ అక్కడికి రాదు
ఆసుపత్రిలో డాక్టరూ ఉండరు
కరెంటు రాదు
ఇంటర్నెట్ ఉండదు
అక్కడికి ఏదీ చేరదు
సారూ! అసలేదీ అందని చోటికి
మతం పేరుతో, ఆవు పేరుతో
మనిషిని చంపెయ్యడం కోసం
ఇంతేసి విషం ఎలా చేరుతోంది?
~ * ~
శిబిరం
నిజాన్ని మా శిబిరంలోంచి చూడు
ఇటు నుంచి..
ఇలా.. మా దృక్కోణంతో
మా వైపు నుంచి చూడకపోతే
మా ప్రాంతంలోకి చొరబడలేవు
ఎందుకంటే, ఇది మా ప్రాంతం
మరి ఒక మామూలు మనిషి
తాను మనిషినైతే చాలనే తపనతో
నిజాన్ని నిజమని
అబద్ధాన్ని అబద్ధమని అన్నందుకు
ఏ శిబిరానికైనా అతడు
అత్యంత ప్రమాదకరంగా ఎందుకు అనిపిస్తాడు?
~ * ~
దేవుడు, సంత
జనాలు దేవుణ్ని రాజుగా భావించసాగారు
రాజులో దేవుణ్ని వెతకసాగారు
రాజు తనను తాను ఓ రోజు
దేవుడికి ప్రతినిధిగా ప్రకటించుకున్నాడు
దేవుడి కోసం
దివ్యమైన ప్రార్థనాస్థలాన్ని తయారు చేసేందుకు
ప్రజల ఆస్తిపాస్తులన్నీ ఖర్చు చేశాడు
ఆ పేరుతో ఓ సంతను కూడా సింగారించాడు
ఆకలి, అభద్రతల్లో కూరుకుపోయిన నిరుద్యోగ తరాలు
తమ పూర్వీకుల సంపదను, సమృద్ధిని
వెనక్కు ఇచ్చెయ్యాలని వేడుకుంటూ
ఆ దివ్యమైన ప్రార్థనాస్థలాల ద్వారాల దగ్గర
శిరసులు వంచి నిలబడ్డాయి
మనిషి దేవుణ్ని చేరుకునే దారి
ఎప్పుడూ సంతలోంచే ఎందుకు వెళ్తుందో?
~ * ~
ప్రార్థనా సమయం
పేదరికం, ఆకలి, రోగాలు
దేవుణ్ని నమ్మకపోవడం ఫలితమేనని
చిరకాలంగా మాకు చెబుతున్నారు
మేం అడిగాం –
మేలైన పంటలోని సింహభాగం
ఈ గుంపులో
కేవలం పిడికెడు మంది పొట్టలోకే
ఎలా చేరిపోతోంది?
వారన్నారు –
‘వాళ్లు ఈ భూమ్మీద ఎంపికైన వాళ్లు’
ఎంతో మంది అన్నం
కొద్ది మంది కడుపుల్లోనే
ఎన్నో రోజుల పాటు ఇరుక్కుపోవడం?
ఇది దేవుడి ‘మహిమ’.
మరి మిగతా వాళ్లు?
వాళ్ల రోగాలు, ఆకలిచావులు?
విశ్వాసంపై నిలబడలేనందుకు అనుభవిస్తున్న శిక్షలు.
మాపై జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా
ఒక్కటై నిలబడే
సమయం వచ్చినప్పుడు
వేల సంఖ్యలో
మేం అడవుల్లోంచి బయటకొచ్చి
పిల్లాపాపలతో కలిసి
ప్రార్థనా సభ వైపు మళ్లాం
ప్రసంగీకుల ముఖాల వైపు నిర్వేదంగా చూస్తూ
పొద్దంతా కూర్చున్నాం
తరాలు మారాయి కానీ పరిస్థితులు మారలేదు
అప్పుడు మాతో వారన్నారు –
‘మార్పు త్యాగాన్ని కోరుతుంది’
ఇక మేం ముల్లె కట్టుకున్న రూపాయల్తో పాటు
మా నేలనూ, భాషనూ అన్నింటినీ త్యాగం చేశాం
సభ అరుస్తూనే ఉంది
అద్భుతాలు పై నుంచి జరుగుతాయని
మేం మూసుకున్న మా కళ్లను పైకి తిప్పాం
రోగ కారణాలు మాత్రం కిందే ఉండిపోయాయి
చేతులు జోడించి మార్పు కోసం ప్రార్థించాం
అలా మేం నేర్చుకున్నాం
ప్రశ్నించకుండా చేతుల్ని జోడించడమెలాగో..
మేం ఎన్నో ముక్కలుగా విడిపోయాం
సగం మంది రోడ్డు మీదికొచ్చినప్పుడు
మేం ప్రార్థనలు చేస్తూ ఉండిపోయాం
భవిష్యత్ వైపు చూస్తూ ఉండిపోయాం..
అటే ఎక్కడో స్వర్గం ఉందని
వారు మాతో చెప్పారు కాబట్టి
ఒక రోజు మేం ఓడిపోయి
అయ్యింది ఇక చాలనుకొని
దీనిపై మాట్లాడుదామని పోగయ్యాం
మా దురవస్థకు వ్యతిరేకంగా
ఒక్కటై నిలబడదామనుకున్నాం..
సరిగ్గా ఇప్పుడే.. ఇదే సమయంలో
భవిష్యత్తంతా ఇక్కడే
ఈ క్షణంలోనే, ఈ ఘడియలోనే ఉందని
సరిగ్గా అప్పుడే
వేర్వేరు దిశల్లోంచి
ఎన్నో గొంతుల్లో
ఘంటలు మారుమోగాయి –
సందోహం ఇక ముగిసిందని
ఇది ప్రార్థనా సమయం అని
ప్రకటన చేశాయి.
~ * ~
నాగరికతలు చచ్చిపోయే కాలం
ఆక్సిజన్ లోపంతో
ఎన్నో నదులు చచ్చిపోయాయి
కానీ ఇప్పటికీ వాటి శవాలు
చచ్చిపోయిన నీటిలో తేలుతున్న సంగతి
ఎవ్వరూ పట్టించుకోలేదు
ప్రాణంలేని నదుల పైన
మనుషుల శవాలను పడేసినంత మాత్రాన
ఎవ్వరి నేరాలూ నీటిలో కరిగిపోవు
అవన్నీ నీట్లో తేలుతూనే ఉంటాయి..
ఇప్పటికీ నదితో పాటు మనుషుల శవాలు
ప్రాణం లేని నీట్లో తేలుతుతున్నట్టుగా
ఏదో ఒకరోజు
ఆక్సిజన్ లోపంతో
నదులన్నీ చచ్చిపోయినప్పుడు
నాగరికతల శవాలు కూడా
ప్రాణం లేని నదుల్లో
తేలుతూ కనిపిస్తాయి
నదులకు మాత్రమే తెలుసు
తమ తర్వాత
చచ్చిపోయే వంతు నాగరికతలదేనని
~ * ~
చచ్చిపోయిన వాళ్లు
నాజీల చేతుల్లో చనిపోవడానికి ముందు
లైన్లో నిలబడి
తమ చావు కోసం ఎదురు చూసేవారు
ముందే ప్రాణం పోయినట్టు నటించేవాళ్లు
చచ్చిపోయారనుకొని
మృత్యువు తమను దాటేసి
ముందుకు వెళ్లిపోతుందేమోనని
ఆ కాలం ఇప్పుడు మారినట్టుంది
ఎప్పుడో చచ్చిపోయిన వాళ్లు ఇప్పుడు
బతికున్న వాళ్లలా నటిస్తున్నారు –
సరిగ్గా తమ కళ్లెదుటే
కులం మతం రంగు, తమ జాతి కారణంగా
ఒక మనిషి
చంపెయ్యబడుతున్నప్పుడు…
అరుపులు వినే గుంపు
ఒక శవాన్ని దాటుకొని వెళ్లే
మరో శవంలా
ఆఫీసు వైపు చకచకా వెళ్లిపోతుంది
చచ్చిపోయిన గుంపును చీల్చుకుంటూ
హంతకుడు పారిపోతాడు
తర్వాత ఒక రోజు అతడు తిరిగొస్తాడు
రక్తం అంటిన చేతుల్ని కడిగేసుకొని
ఇదే గుంపును ఓట్లెయ్యమని అడుగుతాడు
అతడికి తెలుసు
బతికుండి బలుసాకైనా తినడం కోసం
ఈ గుంపు ప్రతిరోజూ పెనుగులాడుతుందని
తాము బతికుంటే చాలనుకొని
నోరు మెదపదకుండా
లోపలి నుంచి చచ్చిపోయిన వాళ్లకు ఓట్లేసి
తమ నేతలుగా ఎన్నుకుంటుందని
ఒక రోజు అతనిక
ఇదే గుంపును ఏలుతాడు
నడుస్తూ, కదలాడుతూ ఉండే ఈ ప్రాణం లేని వాళ్లకు
ఇవన్నీ ఏ గుర్తుకుంటాయిలే అనుకుంటూ
ముసిముసిగా నవ్వుతాడు.
~ * ~
విప్పపూలను చెట్టు నుంచి ఎందుకు తెంపరు?
అమ్మా, రాలిపడే ఇప్పపూల కోసం
నువ్వు రాత్రంతా ఎందుకు ఎదురు చూస్తావు?
ఎందుకని చెట్టు మీది నుంచే
మొత్తం పూలన్నీ తెంపవు?
అమ్మ అంటుంది –
అవి రాత్రంతా కడుపులో ఉంటాయి
ప్రసవ సమయం పూర్తయ్యాక
వాటంతటవే నేల మీదికి రాలి పడతాయి
వేకువ జామున, అవి నేల మీద పడి మంచులో తడిచినపుడు
వాటిని ఏరుకొని మనం ఇంటికి తీసుకెళ్తాం
రాత్రంతా చెట్టు
ప్రసవవేదన పడుతున్నప్పుడు
దాన్ని గట్టిగా ఊపడం బాగుంటుందా, చెప్పు?
ఏ చెట్టు నుంచైనా మనం
బలవంతంగా ఇప్పపూలు ఎలా తెంపగలం, చెప్పు?
మనం ఎదురు చూస్తామంతే
ఎందుకంటే, మనం వాటిని ప్రేమిస్తాం.
~ * ~
ఆడవాళ్లు పోరాడితే
పురుషులు పోరాటానికి దిగినపుడు
అన్నిటినీ వదిలేసి
వెళ్లిపోతారంతే
సరిహద్దు వైపు వెళ్తారు
రోడ్డు మీదికి దిగుతారు
మరి ఆడవాళ్లు పోరాటానికి దిగేటప్పుడు
ఏం చేస్తారు?
వాళ్లు వదిలేసి వెళ్లిన ప్రతి దాన్నీ
వీళ్లు చక్కబెడుతూ పోరాడుతారు
వాళ్ల పిల్లలను చూసుకుంటూ పోరాడుతారు
వీళ్లు వాళ్లను ప్రేమిస్తారు
అందుకే వాళ్లు ఇంటికి తిరిగి రాకపోతే
రోడ్ల మీద బైఠాయిస్తారు
అప్పుడు అదొక నిరవధిక ధర్నాగా మారుతుంది.
~ * ~
నేను ఆదివాసీని కావడం
చీర లేదు, కొప్పుముడి లేదు
పచ్చబొట్టు లేదు, నగలూ లేవు
ఇవేవీ ధరించవు
మరి నువ్వెలాంటి ఆదివాసీవసలు?
ఈ ప్రశ్న నన్ను తరచూ అడుగుతూ ఉంటారు
వాళ్లకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే –
నేలకు దగ్గరగా ఉండటమే ఆదివాసీ కావడం
ప్రకృతితో కలిసి నడవటమే ఆదివాసీ కావడం
నదిలా ప్రవహించటం
సహజంగా ఉండటమే ఆదివాసీ కావడం
లోపలా, బయటా ప్రతి బంధంతో
పోరాడటమే ఆదివాసీ కావడం
తనను అందంగా చేసే చిహ్నాలన్నింటితో పాటు
మరింత మనిషిగా కావటమే ఆదివాసీ కావడం
మరి ఎవరి మనసులోనైనా
ఏదో నగ, లేదా పచ్చబొట్టు
ఇవి మాత్రమే ఉండిపోతే
అసలు ఆదివాసీ కావడం అంటే ఏంటో
అర్థం చేసుకోలేకపోతే
నేను కోరేది ఇదొక్కటే –
మారిన కాలంలో సరికొత్తగా,
ప్రతీకల వలయంలో ఇరుక్కుపోయిన
ప్రతి భ్రమనూ పటాపంచలు చేయండి
ఈ భూమ్మీద ఎవరైనా సరే ఆదివాసీ కావడం అనేది
ఈ ఆదివాసీతనంతోనే నిలిచి ఉండగలుగుతుంది!
~ * ~